తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం

బ్రౌన్ సుమతి శతకంలో కనిపించే ఒక పద్యం వావిళ్ళ సుమతి శతకంలో చేరేటప్పటికి ఎలా మారిందో ఈ కింది పద్యాల వల్ల చూడొచ్చు.

దానంబివ్వని కుడువని
వాని ధనము రాజచోరవహ్నుల జేరున్
గానల నీగలు గూర్చిన
తేనియ తెరవరుల జేరు తీరున సుమతీ

ఈ పద్యంలో రాజచోరవహ్నులు కొంత క్లిష్టమైన సమాసం. పైగా అందులో వ సమాస మధ్యస్థంగా వున్న యతి స్థానం. ఆ యతి స్థానం దగ్గర చరణం విరగడానికి సమాసం ఒప్పుకోదు. పైగా పద్యమంతా ఒకే వాక్యం. ఇలా ఏక వాక్యంగా వున్న పద్యాలు వావిళ్ళ సుమతి శతకంలో మనకి కనిపించవు. ఈ పద్యం వావిళ్ళ సుమతి శతకంలో చేరేటప్పటికి వాగ్వ్యవహార బలం వల్ల ఎలాంటి మార్పులు పొందిందో చూడండి.

తాను భుజింపని యర్థము
మానవపతి జేరు గొంత మరి భూగతమౌ
గానల నీగలు గూర్చిన
తేనియ యొరు జేరునట్లు తిరముగ సుమతీ

ఈ మార్పుల వల్ల రాజచోరవహ్నులు అన్న సమాసం ఎగిరిపోయింది. మానవపతి జేరు కొంత మరి భూగతమౌ పాదంలో మరి అనే పూరక పదంవల్ల యతి స్థానం గుర్తు పెట్టుకోవడానికి వీలయ్యింది. బ్రౌన్ సుమతి శతకంలో తేనియ తెరవరుల జేరు అనే పద్య భాగాన్ని తేనియ యొరు జేరునట్లు అని వావిళ్ళ సుమతి శతకంలో పాఠం సరళీకృతం చేస్తుంది. అయితే ఈ రెండు పద్యాలు ఒకటి ఇంకొకటిగా మారడానికి ఏర్పడిన మట్లన్నీ సుష్టుగా నిరూపించడానికి తగినంత సమాచారం మనకు దొరకదు. ఈ మార్పులు మరింత స్పష్టంగా చూడడానికి బ్రౌన్ సుమతి శతకం నుంచి, వావిళ్ళ సుమతి శతకం నుంచి మరో రెండు పద్యాలు ఉదహరిస్తాను.

బ్రౌన్ సుమతి శతకం:

మంత్రి గల వాని రాజ్యము
తంత్రంబుల జెడక శాశ్వతంబై నిలుచున్
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపు కీలూడినట్లు జరుగును సుమతీ

వావిళ్ళ సుమతి శతకం:

మంత్రి గల వాని రాజ్యము
తంత్రము చెడకుండ నిలుచు తరచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపు కీలూడినట్లు జరుగదు సుమతీ

బ్రౌన్ నుంచి వావిళ్ళకి ఈ పద్యం మారడంలో మూడు మార్పులు జరిగాయి. మొదటిది శైలీ గతమయినది. శాశ్వతంబై అన్న బ్రౌన్ పద్యంలోని మాట రెండవ పాదంలోని రెండు భాగాలనీ ఆక్రమించుకుని యతి స్థానంలో త అనే అక్షరాన్ని పదమధ్యస్థంగా వాడుతుంది. వాగ్వ్యవహారంలో ఈ పద్యం చదివితే ‘శాశ్వ’ దగ్గర ఆపి ‘తంబై నిలుచున్’ అనేది వేరే చదవాలి. ఈ సమస్యని వావిళ్ళ సుమతి శతకం చక్కగా రెండు ముక్కలు చేసి తరచుగ ధరలో అనే పూరక పదంతో నింపుతుంది. ఇలా పూరక పదాలతో పద్యం నింపితే అది చేపలబుట్ట అల్లినట్లు ఉందని లిఖిత సంప్రదాయపు కవులు వేళాకోళం చేస్తారు. మొల్ల గురించి తరచు చెప్పే చాటుకథ గుర్తున్న వాళ్ళకి ఈ సంగతి మళ్ళీ చెప్పక్కర్లేదు. పోతే ఈ పాదంలో రెండవ మార్పు వాక్య నిర్మాణ గతమైనది. ‘తంత్రంబుల చెడక’ అనే బ్రౌన్ సుమతి శతకంలో మాట తంత్రము చెడకుండ’ అని వావిళ్ళ సుమతి శతకంలో మారుతుంది. ‘అక’ అనే వ్యతిరేక క్త్వార్థక రూపం పాత తెలుగులో ఉంది. ఈనాటి తెలుగులో అది ‘అకుండ’ గా మారిపోయింది. ‘అక’ రూపం అనివార్య ఫలితార్థం వచ్చినప్పుడు మాత్రమే వాడతాం. ఉదాహరణకి:

– వానలు లేక పంటలు పోయాయి.
– తిండి లేక ప్రజలు బాధ పడుతున్నారు.
– నిద్ర చాలక కళ్ళు బరువెక్కాయి

ఈ వాక్యాల్లో మొదటి భాగం కారణం, రెండవ భాగం ఫలితం. ఈ రెండిటికీ మధ్య ఒక అనివార్యత ఉంది. వానలు లేకపోవడానికి, పంటలు పోవడానికి మధ్య నివారించడానికి వీలులేని తనం ఉంది. అప్పుడే అక అనే రూపం తెలుగులో వాడతాం. మిగతా సందర్భాల్లో అకుండ రూపం వాడతాం. ఉదాహరణకి:

– అతను నాతో చెప్పకుండా వెళ్ళిపోయాడు.
– ఈ వ్యాసం చదవకుండా మాట్లాడకండి.
– ఈ పందిరి పడిపోకుండా నిలుస్తుందా!

ఈ వాక్యాల్లో ‘అకుండా’ తో అంతమయే వ్యతిరేక క్త్వార్థక రూపానికి తరవాత వచ్చే వాక్య భాగానికి మధ్య సంబంధం కేవలం ఆనంతర్యార్థకమైనదే. అంటే మొదటి పని ముందు జరిగేది రెండవ పని తరవాత జరిగేది అని చెప్పడం మాత్రమే. ఈ రెండిటి మధ్య అనివార్యత ఏమీ లేదు. ఈ రకమైన మార్పు వల్ల మనకు ఒక సంగతి బోధ పడుతుంది. వాగ్వ్యవహారంలో వున్న పద్యం వాక్యనిర్మాణాన్ని కూడా ఆధునికం చేస్తుంది.

ఇక పోతే మూడవ మార్పు చివరి పాదంలో కనబడుతుంది. ‘జరుగును’ అన్న బ్రౌన్ పాఠంలో పదం కంటే వావిళ్ళ సుమతి శతకంలోని ‘జరుగదు’ అనే వ్యతిరేకార్థ పదం వాగ్వ్యవహారానికి అనుకూలంగా వుంటుంది.

లిఖిత కంద పద్యానికి వాగ్వ్యవహారంలో వున్న కంద పద్యానికి ఇంకొక రకమైన మార్పు కూడా కనిపిస్తుంది.ఈ మార్పు వల్ల పద్యం అర్థమే మారిపోతుంది. బ్రౌన్ సుమతి శతకంలో ఈ పద్యం చూడండి.

కారణము లేక నవ్వును
ప్రేరణమును లేని ప్రేమ ప్రియరతికేళుల్
పూరణము లేని బూరెలు
వీరణమును లేని పెండ్లి వృథరా సుమతీ

ఈ పద్యంలో ప్రేరణము అంటే provocation అని. అంటే ఏ రకం గాను కలయికకు సిద్ధంగా లేని స్త్రీతో సంభోగం అనే అర్థం. ఇది ఆ పద్యంలో చెప్పిన మూడు విషయాలతో కలిపి ఇది కూడా వృథా అని అర్థం. ఇది వ్యవహారంలో మనసుకెక్కడం కష్టం. ఇది వావిళ్ళ సుమతి శతకంలో రెండవ పాదం ఎలా మారిందో చూదండి.

పేరణమును లేని లేమ పృథ్వీస్థలిలో

పేరణము అంటే రవిక. ఆడవాళ్ళు రవికలు తొడుక్కోవడం దాదాపుగా పదిహేడవ శతాబ్దంలోనే వచ్చినట్లుంది. కుట్టిన వస్త్రాలు తొడుక్కోవడం ఇస్లాం ప్రభావం వల్ల మనకు వచ్చిన ఆచారం. మొన్నటి వరకు దర్జీలు ముస్లిములే వుండేవారు. ఈ ఆధునిక ఆచారం మొదట్లో పై తరగతుల్లోనే ప్రవేశించింది. ఇప్పటికీ కింది తరగతుల వారు, పాతకాలపు పై తరగతుల పెద్దవాళ్ళు రవికలు తొడుక్కోక పోవడం ఈ మధ్య కాలం వరకు తరచు కనిపించేది. ఈ సందర్భంలో రవిక లేని స్త్రీ కోరుకోదగినది కాదు అనే ఊహ ఈ పద్యంలో ప్రవేశించింది.