తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం

కందం ఛందస్సు

ఈ రెండు రకాల సుమతి శతకపు పద్యాల నిర్మాణం వివరంగా చర్చించడానికి ముందు కంద పద్యపు ఛందస్సుని గురించి చెప్పడం అవసరం.ఈ వ్యాసం చదివే తెలుగు వాళ్ళకి చాలా మందికి తెలిసే వుంటుంది కానీ స్పష్టత కోసం కంద పద్యపు ఛందస్సు స్థూలంగా చెప్తాను. కందంలో చతుర్మాత్రా గణాలే వుంటాయి. నాలుగు పాదాలుంటాయి. రెండో అక్షరం ప్రాస. మొదటి పాదంలోనూ మూడో పాదంలోనూ మూడేసి గణాలుంటాయి. రెండో పాదంలోనూ నాలుగవ పాదంలోనూ అయిదేసి గణాలుంటాయి. రెండవ పాదంలోనూ, నాలుగవ పాదంలోనూ నాలుగవ గణం మొదటి అక్షరంతో యతి చెల్లుతుంది. ప్రస్తుతానికి ఇంతకన్నా వివరాలు అక్కర్లేదు. ఉదాహరణకి ఈ కింది పద్యం చూడండి.

అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్
పొల్లిన దంచిన బియ్యము
తెల్లని కాకులును లేవు తెలియుర సుమతీ

వావిళ్ళ సుమతి శతకంలో మౌఖిక లక్షణాలు

పై పద్యం ఏ పాదానికి ఆ పాదం విడిపోతుంది. అంటే మొదటి పాదం లోని వాక్యం ఆ పాదం చివరితో అయిపోకుండా రెండవ పాదంలోకి ప్రవహించి నడిచే పరిస్థితి ఉండదు. అంతేకాక యతి స్థానం దగ్గర కొత్త మాట మొదలవుతుంది. పద మధ్యస్థంగా యతి పడటం, ప్రాస స్థానం దగ్గర కొత్త మాట ఆరంభం కావడం ఇలాంటి క్లిష్టమైన నిర్మాణాలు వావిళ్ళ సుమతి శతకంలో దొరకవు. అంతే కాకుండా వావిళ్ళ సుమతి శతకంలో యతి కోసం, ప్రాస కోసం వేసుకున్న పూరక పదాలు బోలెడు కనిపిస్తాయి. ఉదాహరణకి ఇందులో ఉన్న 108 పద్యాల్లో 71 పద్యాల్లో పూరక పదాలున్నాయి. అందులో 52 యతి కోసం వచ్చినవి, 19 ప్రాస కోసం వాడినవి.

ఫూరక పదాలు ఎలా వుంటాయో చెప్పడానికి ఒక జాబితా యిస్తున్నాను: ఇలలో, భువిలో, మహిలో, మెదిని, వసుధను, ఎరుగుము, తెలియుర, నయమిది, మరి, నిక్కము, తథ్యము, సిద్ధము, సహజము, గదరా, …ఇత్యాది.

మామూలుగా ఈ కాలపు పండితులు ఈ పూరక పదాల్ని వ్యర్థపదాలంటారు. కానీ మౌఖిక ప్రచారంలో వున్న పద్యానికి ఇవి చాలా విలువైనవి. ఒకటి ఇవి ఎలా వుంటాయో ముందో ఊహించడం చాలా తేలిక. అంచేత పద్యం జ్ఞాపకం పెట్టుకోవడానికి చాలా ఉపకరిస్తాయి. పద్యం తాలూకు అర్థపు బరువును పెంచకుండా నిర్మాణ సౌష్టవాన్ని, శబ్దసుభగత్వాన్ని ఈ పదాలు నిలబెడతాయి.

వావిళ్ళ సుమతి శతకంలో చాలా పద్యాలు నిర్మాణంలో కూడా ఒక రకమైన పునరుక్త వాక్యాలను అనుసరిస్తాయి. అందుచేత వాటిని జ్ఞాపకం పెట్టుకోవడం తేలికవుతుంది. ఉదాహరణకి:

నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లి దండ్రి నాథుల తోడన్
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ

ఈ పద్యంలో చివరి ముక్క నయమిది అనే పూరక పదంతో ప్రారంభం కావడం గమనించండి. అంటే కవికి ‘నా’తో మొదలయ్యే సార్థకమైన మాట వెతకవలసిన అవసరం తప్పిందన్న మాట.

లిఖిత సంప్రదాయంలో కంద పద్యం

వావిళ్ళ సుమతి శతకంలో పద్యాలకి పోటీగా లిఖిత సంప్రదాయంలో కంద పద్యం ఎలా వుంటుందో చూపిస్తాను. ఇందులో పూరక పదాలుండవు. యతి ప్రాసలుండే మాటలు వేరేగా విడిపోయి కనిపించవు. శబ్దప్రౌఢత, క్లిష్ట నిర్మాణం ఇందులో పద్యానికి అందం తెచ్చే గుణాలు. లిఖిత సాహిత్యంలో కవి మాటని జాగ్రత్తగా చెక్కుతాడు. పద్యం అంతా బిగువుగా మాటలు దట్టించి పెడతాడు. మౌఖిక కవికి ఛందస్సు, ఛందస్సులో ఇమిడే వాక్యనిర్మాణం ఒకదానిలో ఒకటి కలిసిపోతాయి. కవిలో ఊహ, ఛందస్సు, భాష ఒకే నిర్మాణ వ్యవస్థలో ఒదిగి ఉంటాయి. లిఖిత సంప్రదాయంలో కవికి ఛందస్సు పద్యాన్ని నియమిస్తుంది కానీ అతని వాక్యనిర్మాణాన్ని నియమించదు. అంచేత అతని వాక్యనిర్మాణం ఛందస్సుకి అతీతంగా ప్రవహిస్తుంది. ఉదాహరణకి తిక్కన కందపద్యాన్ని చూపిస్తాను.

త్రిభువనసుకదృఢపంజర
విభావమహితునకు త్రివిష్టపనిర్మో
కభుజంగపతికి సకలజగద
భిన్నరూపునకు భావనాతీతునకున్
[తిక్కన, శ్రీమదాంధ్రమహాభారతము, 4.1.33]

వావిళ్ళ సుమతి శతకంలో కానీ, బ్రౌన్ సుమతి శతకంలో కానీ ఇంత క్లిష్టమైన లిఖిత స్వభావం ఉన్న పద్యాలు లేవు. ఉదాహరణ కోసం మాత్రమే తిక్కన పద్యం చూపించాను. తిక్కన పద్యం కన్నా తక్కువ క్లిష్టత ఉండి అయినా లిఖిత సంప్రదాయానికే చెందిన పద్యాలు బ్రౌన్ సుమతి శతకంలో చాలా వున్నాయి.ఉదాహరణకి:

త్రాసును వేశ్యయునొక సమ
మౌ సందేహింపవలవదవనీస్థలిలో
వీసంబధికంబెచ్చట
నో సరిగాకందు మొగ్గుచుండును సుమతీ

ఈ పద్యపు వాక్యనిర్మాణం ఛందః పంజరాన్ని పైకి కనిపించకుండా చేస్తుంది. ఉదాహరణకి ఛందస్సు విడిపోయే వాక్యభాగాలు ఒకచోట, అర్థం విడిపోయే వాక్యాలు మరొక చోట రాస్తే —

ఇవి ఛందో విభాగాలు:

1. త్రాసును వేశ్యయునొక సమ
2. మౌ సందేహింపవలవ
3. దవనీస్థలిలో
4. వీసంబధికంబెచ్చట
5. నో సరిగాకందు మొగ్గు
6. చుండును సుమతీ

ఇవి ఆర్థిక విభాగాలు:

1. త్రాసును వేశ్యయునొక సమమౌ
2. సందేహింపవలవద్
3. అవనీస్థలిలో
4. వీసంబధికంబెచ్చటనో
5. సరిగాక
6. అందు మొగ్గు చుండును
7. సుమతీ

ఛందస్సు ప్రకారం ఆరు ముక్కలైన పద్యం అర్థం ప్రకారం ఏడు ముక్కలయ్యింది. అంతే కాదు. ఆ ముక్కలు ఈ ముక్కలు ఒకలాంటివి కావు. కావాలంటే చూడండి. వాక్ సంప్రదాయంలో సుమతి శతకం పద్యం చదివే పద్ధతి ప్రకారం ఛందస్సులో ఆరు ముక్కలు దేనికి దానికి విడిపోవాలి. త్రాసును వేశ్యయునొక సమ… అక్కడితో ఆగిపోవాలి. తరవాత ముక్క మౌ సందేహింప వలవ.’ ఇక్కడ ‘సమమౌ’ అని కలిపి చదవకపోతే అర్థ స్ఫూర్తి ఉండదు. ‘సమ’ దగ్గర ఆపితే అర్థం చెడిపోతుంది. అలాగే సందేహింపవలవ’ దగ్గర ఆపితే ‘దవనీస్థలిలో’ ఎబ్బెట్టుగా వినిపిస్తుంది. సంధి చేసి సందేహింపవలవదవనీస్థలిలో అని చదివితే వాక్ సంప్రదాయంలో కంద పద్యం చదివే తీరు దెబ్బ తింటుంది. నాలుగవ ముక్క, ఐదవ ముక్క చదవడంలో కూడా ఇలాంటి ఇబ్బందే వుంది. ‘వీసంబధికంబెచ్చటనో’ అన్న దగ్గర ఆపాలి. ఎచ్చట అన్న దగ్గర ఆపితే అర్థం దెబ్బ తింటుంది. అంటే ఈ పద్యం వాక్ సంప్రదాయంలో కంద పద్యం చదివే తీరులో చదవడం వీలు లేదన్న మాట. ఈ పద్యం వాగ్వ్యవహారంలో మనకు కనిపించదు. అందుకనే ఇది వావిళ్ళ సుమతి శతకంలో చేరలేదు.