[వెల్చేరు నారాయణ రావు, డేవిడ్ షూల్మన్ వ్రాసిన గాడ్ ఆఫ్ ది హిల్: టెంపుల్ పోయమ్స్ ఆఫ్ తిరుపతి పుస్తకపు మలిపలుకు అనువాదం – సం.]
1. తిరుమల కొండలు
తిరుపతి పట్టణపు సారవంతమైన లోయలో నుండి చూస్తే ప్రస్ఫుటంగా కనబడే దృశ్యం మైళ్ళ కొలది విస్తరించుకొని ఉన్న తూర్పు కనుమల పర్వతశ్రేణి. ఉదయసంధ్య వేళలో, ఆ పర్వతశ్రేణి బూడిద రంగుతో కూడిన అరుణిమతో వెలుగుతుంది; మధ్యాహ్నవేళకు, అది ఊదారంగు లోకి మారుతుంది; రాత్రి వేళ, కొండశిఖరం పైన కళ్ళు మిరుమిట్లు గొలిపే దేవాలయ కాంతిదీపాలే కాక, పాములా మెలికలు తిరుగుతూ కొండ పైకి సాగే సోపానమార్గంపై మిణుకుమిణుకుమనే దీపాల కాంతులు కూడా మనను పలకరిస్తాయి. ఆ విధంగా తిరుపతి పట్టణంలో ఎక్కడ ఉన్నా మనను ఆ కొండలరాయని ఉనికి శాసిస్తున్నట్టుగా తిరుమల కొండల రూపంలో ప్రత్యక్ష్యమౌతుంది.
ఈ రాయడు ఇక్కడ ఎంతో కాలం నుండే ఉన్నట్టు మనకు తెలుసు. క్రీస్తుశకపు తొలి శతాబ్దానికి చెందినట్టుగా చెప్పుకునే సంగ వాఙ్మయంలోనే వేంకట పర్వతం తమిళ ప్రాంతాలకు ఉత్తర సరిహద్దుగా వర్ణించడం కనిపిస్తుంది. ఆ కాలానికే ఈ కొండలపై ఏదో ఒక రూపంలో ఇక్కడ ఒక దేవతామూర్తి వెలసినట్టుగా మనం ఊహించవచ్చు – బహుశా పురాణాల్లో వర్ణించినట్టుగా ఇక్కడి తొలిరూపం వరాహమూర్తి రూపం కావచ్చు. అయితే, తొలి సహస్రాబ్ధి కాలంలో వెలుబడిన ‘చిలప్పదికారం’ కాలానికే వేంకటం పై ఉన్న దైవం విష్ణురూపాన్ని సంతరించుకున్నదని తెలుస్తుంది.
వీంగు నీర్ అరువి వేంగడం ఎన్నుం
ఓంగు ఉయర్ మలైయత్తు ఉచ్చి మీమిసై
విరి కదిర్ ఞాయిఱుం తింగళుం విళంగి
ఇరు మరుంగు ఓంగియ ఇడైనిలైత్ తానత్తుమిన్నుకోడి ఉడుత్తు విళంగు విల్ పూండు
నల్ నిఱ మేగం నిండ్రదు పోలపగై అణంగు ఆళియుం పాల్ వెణ్ సంగముం
తగై పెఱు తామరైక్ కైయిన్ ఏంది
నలం కిళర్ ఆరం మార్బిల్ పూండు
పొలం పూ ఆడైయిన్ పొలిందు తోండ్రియ
సెఙ్ కణ్ నెడియోన్ నిండ్ర వణ్ణముం (చిలప్పదికారం 11:41-51)
(తెలుగు సేత)
దూకే నీటి జలపాతం
విచ్చే సూర్య చంద్ర కిరణరాశి
ఇరుప్రక్కల ఒగి వెలుగగ
మధ్యన తానే నిలిచె
వేంకటం అను ఉత్తుంగ పర్వత శృంగమ్ము!
తటిల్లత మెరుపులు
హరివిల్లు తళుకులు
నడుమ క్రొక్కారు మేఘమ్ము వోలె
ఆ వేంకటపు కొండ
ఆ శృంగమ్ముపై
అరిభంజన చక్రమ్ము, శ్వేత శంఖమ్ము
కరకమలమ్మున చేబూని
సువర్ణపుష్పాలంకార భూషితుడైన
రోహితాక్షుని దివ్య సుందర విగ్రహమ్ము
ఈనాటికీ ఈ దైవం నల్లని రాతివిగ్రహంతో, శంఖ చక్రాలు ధరించిన చతుర్భుజాలతో, తోమాలసేవతో నిండిన పుష్పాలంకరణతో సువర్ణ కిరీటధారియై మనకు కనిపిస్తాడు. దాదాపు ప్రతి యేటా రెండు కోట్ల భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారని అంచనా. ఫలితంగా, తిరుపతి దేవాలయం భారతదేశం లోకెల్లా అత్యంత సుసంపన్న దేవస్థానంగా, ఈ దేవస్థాన సంస్థ (తితిదే) వాటికన్ తరువాత అత్యధిక ఆర్థిక వనరులు కలిగిన సంస్థగా రూపొందింది. ఈ దేవాలయ ఆర్థిక సంపన్నత 15వ శతాబ్దం వరకే అతి ఘనమైనదిగా మనకు శాసనాలు, ఇతర ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే, ఒక చిన్న దేవాలయం నుండి అత్యంత సుసంపన్న దేవస్థానంగా ఈ దేవళం పెరగడాన్ని వివరించే సంక్లిష్ట చరిత్రపై మనకింకా స్పష్టమైన అవగాహన లేదు. కానీ, ఒక్క విషయం మాత్రం మనం చెప్పుకోవచ్చు: ఈ దేవాలయానికి, ఇక్కడి స్థానిక తెలుగు, తమిళ రాజుల ప్రాభవానికి ప్రాచీన కాలం నుండి అవినాభావ సంబంధం ఉంది. ఈ దేవాలయాన్ని ఉత్తరాన తొండైమాన్ చక్రవర్తులకు, దక్షిణాన చోళ రాజులకు ప్రధాన పుణ్యక్షేత్రంగా చెప్పుకునే సంప్రదాయం ఉంది. అయితే, శ్రీవైష్ణవ సిద్ధాంతకర్త అయిన రామానుజాచార్యులు ఈ దేవాలయపు సంస్థాగత నిర్మాణంలోనూ, మతతాత్త్విక ధృక్పథంలోను ఎనలేని మార్పులకు దోహదకర్త అయ్యాడని మనకు లభ్యమవుతున్న ఆధారాలను బట్టి ఊహించవచ్చు.
ఈ దేవాలయపు మత తాత్త్వికత మొదట్లో పురుష ప్రాబల్యం గల వైఖానస సాంప్రదాయానికి చెందినదిగా ఉండేది. ఆ తరువాత పాంచరాత్ర ఆగమ విధానాల ప్రభావంతో స్త్రీ రూపమైన అమ్మవారికి కూడా ప్రాముఖ్యత ఏర్పడింది. నేడు అమ్మవారు వేంకటేశ్వరుని ముద్దుల సతిగా తిరుపతిలో పద్మావతి గాను, అలమేలుమంగ (తమిళం: అలర్ మేల్ మంగ) గానూ మనకు దర్శనమిస్తుంది. అయితే, ఆమెకు కొండ పైన తిరుమలలో స్థానం లేదు. ఆమె దేవాలయం కొండ దిగువ మంగాపురంలో ఉంది. ప్రతిరోజు రాత్రి వేంకటేశ్వరుడు తిరుమలనుండి మంగాపురం వరకూ ఉన్న పధ్నాలుగు కిలోమీటర్లు నడిచి వస్తాడని, ఆపై తెల్లవారే లోగా తిరిగి పైకి వెళ్తాడని భక్తుల కథనం. అందుకే ప్రతిరోజు ప్రభాతసేవలో స్వామివారికి రాత్రి నడకతో అరిగిన పాదరక్షలను తొలగించి కొత్త పాదుకలను సమర్పిస్తారు.
తాళ్ళపాక కుటుంబం నివాస స్థానం కూడా మంగాపురమే. పదిహేనవ శతాబ్దం ప్రథమార్థం నుండీ అన్నమయ్యతో ప్రారంభమైన తాళ్ళపాక కుటుంబసభ్యుల ప్రభావం ఈ దేవాలయ చారిత్రక పరిణామంలో మరో మలుపు.
2. కోవెలలో వాగ్గేయకారుడు
నేడు మనం చూస్తున్న తిరుపతి ప్రాభవం దాదాపు ఆనాటికే అన్నమయ్య కీర్తనల్లో కనిపిస్తుంది. అన్నమయ్య పదాల్లో తిరుమల రాయడు ఆత్మీయుడైన దైవంగా, భక్త సులభుడుగా, శరణాగత వత్సలుడుగాను, అప్పటి దేవాలయం ఎంతో ప్రాచుర్యాన్ని పొందిన సుసంపన్నమైన ధార్మిక సంస్థలా మనకు గోచరిస్తాయి. ముప్ఫైరెండు వేల పద సంకీర్తనల రచనతో అన్నమయ్య పాటల ద్వారా భగవదర్చన చేసే కొత్త భక్తి సంప్రదాయాన్ని తిరుమలలో ప్రవేశపెట్టాడు. మనకు ఇప్పుడు లభ్యమౌతున్న కృతుల ద్వారా తెలుగు సాహిత్యంలో అందరికీ అందుబాటులో ఉండే ప్రజా సాహిత్య సృష్టికి దాదాపు ఆద్యుడని చెప్పుకోవచ్చు.
అయితే, తెలుగు సాహిత్య ప్రపంచానికి సంబంధించినంతవరకూ అన్నమయ్య ఒక అజ్ఞాత ద్వీపం లాంటివాడు. తెలుగు సాహిత్య సంప్రదాయంలో అన్నమయ్య ప్రస్తావనే ఎక్కడా కనిపించదు. అంతేకాక ఎంతో గొప్ప సంగీత నిధిని వదిలివెళ్ళిన అన్నమయ్య గురించి పూర్వ సంగీతశాస్త్రవేత్తలు, సంగీతకారులు కూడా ఎక్కడ ప్రస్తావించ లేదు. మధ్యయుగపు తెలుగు వైయాకరణులు, కావ్యాలంకారికులు కూడా అన్నమయ్య సాహిత్యాన్ని ఎక్కడా ఉదహరించలేదు. సంప్రదాయ సాహిత్యవేత్తలు చేసిన సాహిత్య శాఖల విభజనలో ఏ శాఖలోనూ పూర్తిగా ఇమడని సాహిత్యం అన్నమయ్యది. అయినా, పదసంకీర్తనా సాహిత్యంతో తెలుగులో కొత్త సాహిత్యమార్గాన్ని ప్రవేశపెట్టి, ఆపై తెలుగు, తమిళ దేశాల్లో కర్ణాటక సంగీత వాగ్గేయకారులకు మార్గదర్శకుడయ్యాడు ఆయన.
ఇంకా అన్నమయ్య గురించి మరింత మాట్లాడే ముందు, అన్నమయ్య విలక్షణమైన బాణిలో తన సొంత గొంతుక వినిపించే ఈ పదాన్ని పరిశీలిద్దాం:
ఏడ సుజ్ఞానము యేడ తెలివి నాకు
బూడిదలో హోమమై పోయ కాలముఇదె మేలయ్యెడి నాకదె మేలయ్యెడి నని
కదిసిన యాసచే గడవలేక
యెదురు చూచి చూచి యెలయించి యెలయించి
పొదచాటు మృగమై పోయ కాలముఏడ సుజ్ఞానము యేడ తెలివి నాకు
ఇంతట దీరెడి దుఃఖ మంతట దీరెడినని
వింత వింత వగల్చే వేగి వేగి
చింతయు వేదనల చిక్కువడుచు నగ్ని
పొంతనున్న వెన్నయై పోయకాలముఏడ సుజ్ఞానము యేడ తెలివి నాకు
యిక్కడ సుఖము నాకక్కడ సుఖంబని
యెక్కడికైనా నూర కేగి యేగి
గక్కన శ్రీ తిరువేంకటపతి గానక
పుక్కి పురాణమయి పోయకాలము
ఈ గీతాన్ని ‘పదం’ అని అంటారు. దేవుని స్తుతి గీతాలు కాబట్టి వీటికి సంకీర్తనలు అని మరో పేరు. పదంలో సాధారణంగా ఒక పల్లవి, మూడు లేక నాలుగు చరణాలు ఉంటాయి. ప్రతి చరణం తరువాత పల్లవిని తిరిగి పాడుతారు. పల్లవిలో ఒక భావాన్ని ప్రతిపాదించి, చరణాల్లో దాన్ని విస్తరించడం పరిపాటి. చరణంలో చివరి పదాలు అర్థపరంగా, వాక్య నిర్మాణపరంగా పల్లవి లోని పదాలను కలిసి చేరేటట్టుగా రాయడం కద్దు. చివరి చరణంలో వేంకటాద్రి వేల్పుడైన వేంకటేశుని తలంపు దాదాపు తప్పనిసరిగా కనిపిస్తుంది. మళ్ళీ, మళ్ళీ పాడే పల్లవితో శ్రోతల మనస్సులో సుళ్ళు తిరిగే మరచుట్టు వంటి భావాల నిర్మాణం చేసి, ఆపై శిఖరాయమానంగా భగవంతుని ప్రస్తావనతో ముగించడం ద్వారా వారికి అసాధారణమైన ఆధ్యాత్మిక అనుభవం కల్పించడం ఈ పద నిర్మాణంలోని ప్రత్యేకత.