మా రమేశ్గాడు చెప్పినప్పుడు దీన్నో సమస్యగా ఒప్పుకోలేకపోయాను. సూదిమొనంత సున్నితమైన విషయం ఇది. అసలేం జరిగిందంటే–
ఓనర్కు కిరాయి ఇవ్వాలని వీడు ఏటీఎంకు పోయాడు. వీడు వెళ్ళేసరికి ఒకతను మిషన్లో డ్రా చేసుకుంటున్నాడు. ఇంకొక ముసలాయన డోర్ దగ్గర నిలబడివున్నాడు. వీడు ఆ ముసలాయన వెనక చేరే సమయానికి ఇంకొకతను భార్యతో సహా అటుపక్క నుంచి వచ్చాడు. అతడు రెండు అడుగులు వేగంగా ముందు వేయగలగడంతో వీడికంటే ముందయ్యాడు. నిజానికి ఇతడితో మనకు పెద్ద పనేమీ లేదు. కానీ ఒక విషయం అర్థం చేసుకోవడానికి పనికొస్తాడు. ఈ భార్యాభర్తలు ఎక్కడికో వెళ్ళే తొందరలో ఉన్నారు. టైమవుతోందని ఆమె ఒకటే గొణుగుతోంది. మిషన్ దగ్గర ఉన్నతను డబ్బులు చేతిలోకి తీసుకోగానే, ఇంక ఎటూ నేను హడావుడిలో ఉన్నాననే ఒక తెలియని అధికారంతో ముందటి ముసలాయన్ని కాదని ఇతడు ముందుకు పోబోయాడు. ఆ ముసలాయన ఏమీ తొణక్కుండా, ‘హలో! నేను ఇక్కడొకణ్ని లైన్లో ఉన్నాను’ అన్నాడు. చేసేదేమీలేక అతడు చేతులు జోడించి సారీ చెబుతూ, భార్య ముఖం వైపు చూసుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేశాడు. ఆ సారీలో కొంత వ్యంగ్యం కూడా లేకపోలేదు.
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. రమేశ్గాడు లైన్లో నిలుచున్నాడా. వెనక్కి చూస్తే వీడి వెనక ఓ నలుగురైదుగురు అయ్యారు. ఎప్పుడు వచ్చిందో ఒకావిడ చంటిపిల్లాడిని ఎత్తుకొని వీడి తక్షణపు వెనకే నిలబడివుంది. ఆమె తల్లికి ఎక్కువ, అమ్మమ్మకు తక్కువ వయసు ఉన్నావిడ. సరే నిలబడింది. ముసలాయన డబ్బులు తీసేసుకున్నాడు. వెంటనే ఈ అర్జెంటు మనిషి గబగబా మిషన్ దగ్గరికి వెళ్ళి, అంతే గబగబా తీసేసుకున్నాడు. తరువాతి వంతు వీడిదే. ఇక వీడు కదలబోయేంతలో–-ఈ అమ్మమ్మ వెనకాల ఇంకో పెద్దమనిషి నిలుచున్నాడు. ఈయన ‘నువ్వెళ్ళమ్మా ముందు’ అని ఆమెకు చెబుతున్నాడు. వీడు ఒక క్షణం అయోమయంలో పడ్డాడు. ఆ పెద్దమనిషి ఇచ్చిన ధైర్యం వల్లో ఏమో, ఆమె వీడిని దాటేసి ముందుకు వెళ్ళిపోయింది. ఇక వీడు ఇప్పుడా పెద్దావిడను ‘నన్ను దాటేసి ఎందుకు పోయా’వని అనలేని ఇబ్బందిలో పడ్డాడు. పెద్దావిడాయే, చంకలో పిల్లాడాయే.
ఆ పెద్దమనిషి తాను ఉన్న స్థానాన్ని ఆమె కోసం వదిలి, నువ్వు ముందు పోమ్మా అంటే అది వేరే. అది అతడి ఛాయిస్. కానీ అతడు ఎట్లాగూ ఆమె వెనకాలే ఉన్నాడు. ఆమె ముందు తీసుకున్నా, రమేశ్గాడు ముందు తీసుకున్నా ఆయన స్థానంలో ఏ మార్పూ రాదు. కానీ చిన్నపిల్లాడు ఆమె చంకలో ఉన్నాడన్న ఒక నెపంతో అతడు ఒక నైతిక అధికారాన్ని తన చేతిలోకి తీసుకుని, వీడి స్థానాన్ని లాగి మరీ ఆమెకు ఇచ్చాడు. పైగా, ఆ గట్టిగా అనడంలో వీడిని నిరాకరించలేని స్థితిలోకి బలవంతంగా నెట్టేశాడు. ఇంకా ఇందులో నొప్పి ఏమిటంటే, ఆ ఒక్క క్షణమే కావొచ్చు, ఆమె ముందు మర్యాద లేనివాడిగా ఇది వాడిని నిలబెట్టినట్టు అయింది. పైగా తన స్థానంలో తాను డబ్బులు తీసుకునే అవకాశాన్ని కోల్పోతూ. మరి ఈ పెద్దావిడన్నా వీడిని కాదని ముందుకు పోతున్నప్పుడు మర్యాద కోసమైనా వీడి కళ్ళవైపు చూడాలా? ఆమె ముందుకు పోవడానికి న్యాయంగానైతే అనుమతి ఇవ్వాల్సింది వీడు కాదా? ఆ ఇద్దరూ కలిసి ఆ క్షణంలో వీడితో ఆడింది మోరల్ అథారిటీ గేమ్. ముందు ఈమె అందులో భాగం కాదు. కానీ ఆ పెద్దమనిషి ఒక పైచేయి తీసుకోవడంతోనే ఆమె అందులో భాగమైపోయింది.
ఆ పెద్దావిడ తనకంటే ముందు డబ్బులు తీసుకోవడం పట్ల రమేశ్గాడికి నిజానికి ఏ అభ్యంతరమూ లేదు, తనను ఆ క్షణంలో తెలియని ఇబ్బందికి గురి చేసిందని తప్పితే. కానీ ఆ పెద్దమనిషి పట్ల మాత్రం వీడికి కోపం వచ్చింది. కానీ కొట్లాడితేనేమో చీదరగా ఉంటుంది. వదిలేద్దామంటేనేమో అహం దెబ్బ తింది. ఒకవేళ నిజంగానే కొట్లాడినా కూడా అక్కడున్నవారి మద్దతు వీడికి దొరుకుతుందని నమ్మలేము. ఎందుకంటే నైతికంగా వీడు అక్కడ బలహీనుడు. ఒక చంటిపిల్లాడితో వచ్చిన పెద్దావిడను ముందుకు పోనివ్వకుండా అడ్డుకున్నాడనేదే పైకి తేలినట్టుగా కనబడుతుంది. అసలు అది విషయమే కాదనీ, ఒక పెద్దావిడ పట్ల కన్సర్న్ ఉన్న మనిషినని చూపుకోవడంలో భాగంగా ఇంకొక మనిషిని ఇది తక్కువ చేయడమనీ ఎవరూ అనుకోరు. పోనీ ఆ పెద్దమనిషి ఇదంతా ఆలోచించలేదు, ఒక తక్షణ స్పందనగా ఆయనకు తోచింది అన్నాడన్న సంశయ లబ్ధి ఇద్దాం. అయినప్పటికీ ఇది-–నేనొక మంచి చేస్తున్నప్పుడు నువ్వేమిటోయ్ మధ్యలో బోడి తరహా వైఖరి. ఇదే, ఇదే తనను ముల్లులా గుచ్చిందన్నాడు రమేశ్. ఈ సుప్రీమసీ గనక తలకెక్కితే ఇంక ఎదుటి మనిషిని జడ్జ్ చేయడం చిటికె వేసినంత సులభం. అందుకే ఆ పెద్దమనిషిని ఏం చేయాల్సి వుండిందని వాడు నన్ను అడిగాడు.
మీరైతే ఏం చెబుతారు?