ఇస్మాయిల్‌ గారు

నా
ప్రయాణం మొదలైనదగ్గర్నుంచి
ఆయన
తారస పడుతూనే ఉన్నారు

కనిపిస్తే
కబుర్లు
కవిత్వంతో
ఆయన  చుట్టూ మూగిపోయేవాళ్ళం

తెలియని అభిమానులెందరో

* * *

ఆయన

దుమ్మూ ధూళీ దులిపి
కడిగి ఆరేసిన అక్షరం

వెదికే కళ్ళకి
దారి చూపించే వెలుగు దృశ్యం

రణగొణ ధ్వనుల్ని కాదని
నిశ్శబ్దంగా చెప్పే సరికొత్త శబ్దం

* *

ఆయన
ఇప్పుడే ఇక్కడే
ఉన్నట్టే ఉన్నారు
అంతలోనే మనిషి కనిపించడం లేదు

వలసపాకని వదిలి
కనిపించని మరో చోటుకి
వలసపోయినట్టున్నారు

వెళ్తాం అంటే
ఉండండి అప్పుడేనా అనేవారు

తనకి వర్తించదేమో అది మరి