కాల్వీనో కథల నుంచి – 6అ

గూగోళ జ్ఞానం

రా శ్రీకాంత్, రా. ఆ తలుపేసి వచ్చి ఇలా కూర్చో. ‘మీ రాజీనామా ఆమోదించడమైనదని తెలియజేస్తున్నాము’ అనేశారయ్యా మన కంపెనీ బాసులందరూ. నువ్వు వెంటనే డైరక్టర్‌వి కావడం తథ్యం. ఇదిగో, ఇకనుంచీ ఈ కుర్చీ నీది. మరీ అంత ఆశ్చర్యం నటించకోయ్! మన ఆఫీసులో పుకార్లు నీ చెవిలో పడలేదని నన్ను నమ్మమంటావ్! మెరికలాంటి కుర్రాడివి. నీ పనితనం నీతోపాటుగా చేరిన కుర్రాళ్ళలో ఎవరికుంది చెప్పు? అందుకేగా వాళ్ళింకా డివిజన్ హెడ్‌లు కూడా కాలేదు. నువ్వు చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ అయ్యే ఏడాది దాటింది. ఇంత చిన్న వయసులోనే సీవోవో కావడమంటే మాటలా? ఇదిగో, ఇదేదో నా సొంతానికి నిన్ను పిలిచి ఇలా పొగుడుతున్నానని అనుకునేవు. అదేమీ కాదు. పొద్దున్నే సీఈవో నుంచి ఫోన్ కాల్. నిన్ను పిలిచి వివరంగా అంతా చెప్పమని. నీకింకా మన కంపెనీ గురించి ఒకట్రెండు సంగతులు తెలీవు. అందుకనే కొంచెం వివరంగా మాట్లాడదామని నిన్ను పిలిచాను.

అసలూ, జ్ఞానం అంటే ఏమిటి శ్రీకాంత్? జ్ఞాపకాలే కదా. అనుభవాలు మనకిచ్చిన జ్ఞాపకాలన్నిటినీ కలిసికట్టుగా మనం ఒకరికొకరం సమాచారంగా అందించుకుంటున్నాం. అలా పోగైన సమాచారాన్నే జ్ఞానం అంటున్నాం. మన కంపెనీ కొన్నేళ్ళుగా ఈ విశ్వంలోనే అతి పెద్ద జ్ఞాపకాల డేటా ఆర్కైవ్ తయారు చేస్తున్నదని, మనకే కాదు, అందరికీ తెలుసు. జ్ఞానసర్వస్వం అను, జ్ఞాపకసర్వస్వం అను, ఈ ఆర్కైవులో ప్రపంచంలోని ప్రతి మనిషి, ప్రతి జంతువు, ప్రతి వస్తువు గురించి తెలిసిన ప్రతి విషయాన్ని మనం కూరుస్తున్నాం. తొందరలోనే ఈ జ్ఞానసర్వస్వంలో లేని జ్ఞాపకాలు ఇక్కెక్కడా ఉండవు. ఇప్పుడు బ్రతికేవాళ్ళ వివరాలే కాదు, కాలం మొదలైనప్పటినుండీ జరిగిన ప్రతి సంఘటన వివరాలూ అందులో ఉన్నాయి. అంటే ఫలానా సంవత్సరం, ఫలానా రోజు, ఫలానా నిమిషంలో ఎక్కడెక్కడ, ఎవరెవరి జీవితాల్లో ఏమేం జరిగిందో దొంతరలు పేర్చి చూసినట్టుగా ఒకే సమయంలో మన ఆర్కైవుల్లో చూడవచ్చన్నమాట. చాలా పని ఇప్పటికే అయిపోయింది. ప్రపంచంలో ఉన్న పబ్లిక్ లైబ్రరీలు, ప్రైవేట్ లైబ్రరీల సమాచారమంతా డిజిటైజ్ చేసి ఆర్కైవ్ లోకి ఎక్కించాం. ప్రపంచంలో ఇప్పటిదాకా ప్రతీ దేశం నుంచీ వచ్చిన దిన పత్రికలు, వార్తా పత్రికలు, గజెటీర్లు, సువనీర్లు, డైజెస్టులు, వీటన్నిటి నుంచీ సమాచారం మన ఆర్కైవుకి చేరిపోయింది.

అన్నిటికంటే ముఖ్యంగా ప్రతీ దేశం ప్రతీ ప్రాంతపు ప్రతీ మనిషి నుండీ సమాచారం సేకరిస్తున్నాం. ప్రపంచంలో ప్రతీ అనుభవం జ్ఞాపకంగా మారుతున్నది మారుతున్నట్టుగా మన శాటిలైట్ డేటా సెంటర్స్‌లో నమోదు అవుతోంది. ఆపైన ఆ సమాచారమంతా ఒక్క మన లేబరేటరీకే వస్తుంది. మనం ఇక్కడ ఒక రిడక్షన్ ప్రాసెస్ ద్వారా ఆ సమాచారాన్ని వడపోస్తున్నాం. పాలను చిలికి అందులోంచి గడ్డగా వెన్నను తీసినట్టు, సేకరించిన సమాచారాన్ని తేటగా చేసి కుదిస్తున్నాం. అలా ముఖ్యమైన వివరాన్ని సమాచారం నుంచి చిక్కబట్టి క్వాంటమ్ మెమొరీ స్ట్రింగ్స్ మీద శాశ్వతంగా భద్రపరుస్తున్నాం. దీజ్ స్ట్రింగ్స్ ఆర్ పర్మనెంట్. దీజ్ విల్ బి అవర్ అల్టిమేట్ రియాలిటీ. ఈ రిడక్షన్ ప్రాసెస్ ఎక్కడ ఆపాలి అనే విషయం మీద మనకింకా సరైన పట్టు దొరకటం లేదనుకో. కానీ, మన లక్ష్యం ప్రపంచంలోని ఈ జ్ఞానాన్ని అంతటినీ వీలైనంత తక్కువ స్థలంలో భద్రపరచాలని కదా. ఉదాహరణకు, మన మెదడు సైజులో ఎంత చిన్నది చెప్పు? కానీ అందులోనే ఎన్ని కోట్ల వేరు వేరు జ్ఞాపకాలు, వేటికవే ప్రత్యేకంగా, లేవు? మన జ్ఞానసర్వస్వం నమూనా కూడా అదే.

వర్క్ అయిపోగానే ఇంటికి పోనియ్యకుండా పిలిచి మరీ నాకు తెలిసిన విషయాలే స్కూలు పిల్లవాడికి పాఠం చెప్పినట్టు ఎందుకిలా చెప్తున్నాడీ చాదస్తపు పెద్దమనిషి, అనుకుంటున్నావా? నిజమే, నీకు విసుగ్గానే అనిపించవచ్చు. నువ్విక్కడ చేరి ఐదేళ్ళు కూడా కాలేదు. మన లేబరేటరీ గురించి నాకెంత తెలుసో ఇంచుమించుగా నీకూ అంత తెలుసు. ఇంటర్వ్యూలో నువ్విచ్చిన సెమినార్ పేరేమిటీ, ఆ! ‘పల్లీ గింజలో ప్రపంచ సాహిత్యం’ కదూ. నీ సెమినార్ అయీ అవకముందే ఛైర్మన్ నీకు జాబ్ ఆఫర్ ఇచ్చాడు కదూ? నూటికో కోటికో ఒక్కరుంటారయ్యా నీలాంటి వాళ్ళు. మరి నీలాంటి మేధావికి నేను చెప్పేది చాదస్తపు ఉపన్యాసంలాగే అనిపిస్తుంది. కాదనను. కానీ కొంచెం ఓపిక పట్టు, శ్రీకాంత్. దయచేసి ఈ పూట నేను చెప్పదలచుకున్నదంతా చెప్పనివ్వు.

మనకు తెలిసిన ప్రపంచంలో ఇదొక్కటే ఇలాంటి లేబొరేటరీ అని నీకు తెలుసు. ఈ లేబరేటరీని ఊహించిందీ, నిజం చేసిందీ, అక్కణ్ణుంచి ఫౌండింగ్ డైరెక్టర్‌గా దీని బాధ్యతలన్నీ ఇప్పటిదాకా ఒంటిచేత్తో మోసిందీ నేనేనని నీకు తెలుసు. నాకు తెలిసిన జీవితం ఈ లేబరేటరీనే. ఇదే నా సర్వస్వం. కానీ నాకిక ఓపిక లేదు శ్రీకాంత్. నేనిక ఈ బరువు మోయలేను. వదిలివెళ్ళడం ఎంత బాధగా ఉన్నా తప్పదు. విచిత్రమైన పరిస్థితుల్లో నా భార్య మాయమైపోయిన దగ్గరినుండీ నేను నేనుగా లేను. తను లేని ఒంటరితనం నన్ను కృంగదీస్తోంది. ఏమాత్రం ఒంట్లో శక్తి ఉన్నా ఈ ఉద్యోగం వదిలిపెట్టేవాణ్ణి కాదు. ఇక నేను మామూలు మనిషిని ఎప్పటికీ కాలేను. ఈ మనాది నుంచి తప్పించుకోలేకనే, నేను ఛైర్మన్‌కి, ట్రస్టీలకీ నన్ను తప్పించమని ఉత్తరం రాశాను. వాళ్ళూ అర్థం చేసుకున్నారనుకుంటాను, నన్ను అట్టే ఇబ్బంది పెట్టకుండానే ఒప్పుకొని, నా చోట్లో నిన్ను కూర్చోపెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల ఇప్పటిదాకా తెలియని కొన్ని రహస్యాలు నీకిప్పుడు చెప్పాల్సిన బాధ్యత నామీద పడింది.

ఇలా మానవుల జ్ఞాపకాలని, మన ప్రపంచపు జ్ఞాన సమాచారాన్ని మనం ఎందుకిలా భద్రంగా కూడబెడుతున్నామో నిజంగా నీకు తెలుసా? అసలు కారణం ఇప్పుడు చెప్తాను విను. యుగాంతం. అవును శ్రీకాంత్, యుగాంతం. త్వరలోనే మానవాళి పూర్తిగా తుడిచిపెట్టుకుని పోతుందని మన కంపెనీ అంచనా. మన చరిత్ర, విజ్ఞానం, మన ఉనికి, సర్వస్వం తుడిచిపెట్టుకొని పోకుండా మన తర్వాత వచ్చే ప్రాణికోటికి అందజేయాలి. ఆ వచ్చేవారెవరో, ఎలా ఉంటారో మనకేమీ తెలియదు. అయినప్పటికీ అందజేయాలి, తప్పదు.

బైదివే, ఒక పెగ్ తీసుకుంటావా? ఈ మధ్య ఒక చిన్న బాటిల్ ఉంటోందిలే నా సొరుగులో ఎమర్జన్సీ కోసం. ఇక ఎంతోకాలం మన భారాన్ని భూమి మోయలేదని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తూనే ఉన్నారు, అయినా మనం మారడం లేదు. అందువల్ల భూమి మీద జీవరాశి ఎంతో కాలం ఉండదు. సూర్యుడి జీవితం సగం గడిచిపోయిందని మనకు తెలుసు. మహా అయితే ఇంకో నాలుగైదు కోట్ల సంవత్సరాలలో మొత్తం నాశనమైపోతుంది. అది కూడా, అకస్మాత్తుగా ఏ అనర్థమూ జరక్కుండా ఉంటే. కానీ మనమీద మనకు ఆ నమ్మకం ఉందా? మనం ప్రశాంతంగా కలిసి మెలిసి జీవించే ప్రాణాలం కాదు. అందువల్ల ఏ క్షణంలో మనల్ని మనమే నాశనం చేసుకుంటామో మనకే తెలియదు, ఇప్పటికే ఎంత చేసుకున్నామో కూడా. మనకున్న ఈ అవలక్షణం గురించి ఏడ్చి ప్రయోజనం లేదు. మనం ఎంత ఏడ్చినా పోగొట్టుకున్నది తిరిగి వస్తుందా? నేనెంత ఏడ్చినా నా జానకి మళ్ళీ తిరిగి వస్తుందా? ఏమనుకోకు, జానకిని మర్చిపోలేక పోతున్నాను. తనను గుర్తుకు తెచ్చి నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. …

ఈ బ్రహ్మాండంలో అనేకమైన గ్రహాలున్నాయి. వాటి మీద కూడా జీవరాశి ఉండే ఉండుండచ్చు. వాళ్ళ జీవనం మనలాగే ఉండుండచ్చు, లేకపోవచ్చు. అందుకని, మనం ఆగిన చోటునుంచి మన ఉనికిని వాళ్ళు కొనసాగించగలరా? మానవాళి అస్తిత్వం మన పిల్లల ద్వారా కొనసాగుతుందా? అలా కాకుండా ఆ గ్రహాంతర వాసుల ముందు తరాల వల్లనా? ఈ ఆలోచనలన్నీ అనవసరం. మరి ఏది అవసరమూ అంటే, మనం ఇప్పటిదాకా సంపాదించుకున్న జ్ఞానం వాళ్ళకి అందజేయడం. అందుకు గాను ఈ ప్రపంచపు జ్ఞాపక సర్వస్వాన్ని క్రోడీకరిస్తున్న ఏకైక కంపెనీకి, మైడియర్ శ్రీకాంత్, నువ్విప్పుడు డైరక్టర్‌వి కాబోతున్నావ్.

భయపడకు, ఇంతపనీ నేనొక్కణ్ణే చూడాలా అని. నీ పని పెద్దగా ఏమీ మారదు. ఇప్పుడు చేస్తున్న డేటా పనే ఇక ముందు కూడా. మన జ్ఞానాన్ని గ్రహాంతర వాసులకి ఎలా అందించాలో ఇంటర్‌స్టెల్లార్ కమ్యూనికేషన్స్ బ్రాంచ్ వాళ్ళు చూస్తున్నారు. ఆప్టికల్ వేవ్ మీడియా, సౌండ్ వేవ్ మీడియా – ఈ రెంటి మీదా ప్రయోగాలు చేస్తున్నారు. ఏ మీడియం వాడతారో ఇంకా తెలీదు. అసలు ట్రాన్స్‌మిట్ చెయ్యకుండా డేటా స్ట్రింగ్స్ ఒక క్యాప్సూల్‌లో పెట్టి భూమి లోపల ఎక్కడన్నా దాచిపెడతారేమో కూడా. ఎప్పటికో ఒకనాటికి గ్రహాంతర పురావస్తు శాఖ వాళ్ళెవరో మన గ్రహం మీద తవ్వి మన నిక్షేపాన్ని కనుక్కుంటారని ఊహిస్తున్నారేమో. అంతకు తెగించిన అసాధ్యులే మనవాళ్ళు. ఈ డేటా అంతటినీ డీకోడ్ చెయ్యడానికి కావలసిన లాంగ్వేజ్ టూల్స్, సెమాంటిక్స్, గ్రామర్ అంతా కూడా ఎబయాటిక్ లింగ్విస్టిక్స్ బ్రాంచ్ చూస్తోంది. వాళ్ళ పని పూర్తయింతర్వాత అవి స్ట్రింగ్స్ మీదకి చేర్చడం మాత్రమే మన పని. అందుకని ఇప్పటికి వాళ్ళ తలనొప్పులేవో వాళ్ళని పడనిద్దాం, మనకెలానూ సరిపోయినంత పని ఉండనే ఉంది. ఇంతకీ నేను చెప్పదలచుకుందేంటంటే, ఒక డైరక్టర్‌గా నీకుండబోయే బాధ్యతలు తప్ప కొత్తగా నీ భుజాలమీద ఇంకే బరువు పెట్టబోటం లేదని. అందుకని, నువ్విక ముందు చేయబోయే పని గురించి మాట్లాడడానికే ముఖ్యంగా నిన్నీరోజు నేనాపింది.

మన మానవజాతి తుడిచిపెట్టుకొని పోయేటప్పటికి ఎలా ఉంటుంది, ఊహించగలవా, శ్రీకాంత్? మన జ్ఞానం పెరగకుండా మట్టుగా నిలిచిపోయి ఉంటుంది. అనంతమైన కాలప్రవాహంలో ఈ విశ్వం మనకు ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చింది సమాచారం సేకరించడానికీ, పంచుకోడానికీ. మనకేదో లాటరీ తగిలినట్టుగా, అంటే నీకు అభ్యంతరం ఉండదనుకుంటాను. అంతకంటే ముఖ్యంగా సమాచారాన్ని పుట్టించే అవకాశాన్ని మనకిచ్చింది. చెప్పేవాడు, వినేవాడు, లేకపోతే చెప్పటానికి, వినటానికి ఒక విషయం అనేదే ఉండదు. అంటే సమాచారమనేదే ఉండదు. అవునా? ఈ భూమి మీద ప్రాణికోటి, ప్రత్యేకించి మన మానవ జాతి అట్లాంటిది. మన అనుభవాలను గుర్తుంచుకోవడం కోసం భాషలను పుట్టించుకొని, వ్రాయటం నేర్చుకొని సమాచారాన్ని పెంచుకోవడం పంచుకోవడమే మన లక్ష్యంగా, సమాచారమే మన ఉనికికి ప్రమాణంగా చేసుకున్నాం. సమాచార జీవితం యదార్థం గానూ, యదార్థ జీవితం సమాచారంగా మారడానికి పనికొచ్చే జ్ఞాపకంగా మాత్రమే మనం బ్రతుకుతున్నాం. నశించబోయే జాతి కొత్తగా నేర్చుకొని, పంచుకునే జ్ఞానం అంటూ కూడా ఎక్కువగా ఏమీ ఉండదు. ఒకసారి పూర్తిగా నాశనమైన తరవాత కొత్తగా పుట్టే సమాచారం అసలు ఉండదు. అంటే తొందర్లోనే ఏదో ఒకరోజు మన జ్ఞానం ఇక పెరగడం ఆగిపోయి, నశించిపోయిన భాషల పదకోశం లాగా పరిమితం అయిపోతుంది. అభివృద్ధి చెందుతున్నంత సేపే కదా మన జ్ఞానం కూడా పెరుగుతూ ఉండేది. అందుకనే, ఈ సమాచారమంతా వృధా కాకుండా మన కంపెనీ భద్రపరుస్తోంది, అది వేరేవారికెవరికో అందించగలమా లేదా అన్నది పూర్తిగా వేరే సంగతి.

అందుకని, ఒక డైరక్టర్‌గా నీ ముఖ్యమైన బాధ్యత ఏ వివరమూ ఒదిలేయబడకుండా చూసుకోవడం. ఏ వివరమైతే మనం ఒదిలేస్తామో అది లేనట్టే, అసలు ఎప్పుడూ జరగనట్టే. అట్లా అని, ఏ వివరమైనా గందరగోళానికి, అయోమయానికి దారి తీసేదిగా ఉంటే, ఆ వివరం ఎప్పుడూ జరగనట్టుగానే ఒదిలివేయడం కూడా నీకున్న ముఖ్యమైన బాధ్యతే అని మర్చిపోవద్దు. ఏ వివరమూ ఒదిలిపెట్టకపోవడం, అయోమయానికి దారితీసే ఏ వివరమైనా ఒదిలివేయడం, ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఇదీ నీ బాధ్యత. మనం జ్ఞానసర్వస్వాన్ని వీలైనంత క్లుప్తంగా పొసగడానికి ప్రయత్నిస్తున్నామని మర్చిపోవద్దు. ఏ వివరమైనా చేరిస్తే ఆ క్లుప్తత పోతుంది అనుకున్నప్పుడు ఆ వివరం తుడిచివేయడమే మంచిది. ఓటి కుండలు పేర్చి అనవసరంగా కావడి బరువు పెంచడం లాంటిదే ఈ వివరాలు చేర్చడం కూడా.

మనం పేరుస్తున్న జ్ఞానసర్వస్వం ఎలా ఉండాలంటే, అది టూకీగా అందించే వివరం నుంచి, అది చెప్పని వివరాలన్నీ ఊహించి తెలుసుకోగలగాలి. ఏమీ మాట్లాడకుండా ఎంతో మాట్లాడినట్టు, వివరించి చెప్పకుండా ఎంతో వివరించినట్టు – ఇది నీకు అనుభవంలోకి వచ్చే ఉంటుంది. కొన్ని సార్లు మనం ఒకటి రెండు మాటల్లోనే అరగంట మాట్లాడినదానికంటే ఎక్కువ అర్థం పొసుగుతాం. ఇది ఇందాక చెప్పినట్టు మన మెదడు లాగా. ఒక మాటనుంచో, ఒక ఊహనుంచో ఎన్నో రకాలైన ఆలోచనలను, జ్ఞాపకాలను మెదడు తవ్వితీసుకొస్తుంది. మన జ్ఞానసర్వస్వం ఆర్కైవ్ కూడా ఈ నమూనా ఆధారంగానే. ఈ నమూనాలో గొప్పతనం ఏంటంటే కేవలం మనం అందించింది మాత్రమే సమాచారం కాదు, మనం అందించనిది కూడా సమాచారమే. కేవలం అప్పుడు మాత్రమే ఆర్కైవులో సమాచారాన్ని చదివేవాళ్ళందరూ ఇప్పటిదాకా జరిగినదానిలో ఏది ముఖ్యం, ఏది కాదు, నిజానికి ఏది జరిగింది, ఏది జరగలేదు అని ఒక అంచనాకు రాగలరు. ఎందుకంటే మన జ్ఞానసర్వస్వం నుంచి మాత్రమే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఏది జరిగిందో, జరుగుతున్నదో, జరగబోతుందో తెలిసేది. అందులో లేనిది అసలు లేదు. ఏకం సత్ అంటారు చూడూ, ఆ సత్యమే మన గూగోళం. సృష్టికి ప్రతిసృష్టి లాగా భూగోళపు యదార్థ ప్రపంచానికి ప్రతిగా మనం నిర్మిస్తున్న సమాచార ప్రపంచం గూగోళం.