‘నాకిష్టం లేదు’ అంటావు నువ్వు.
‘ఔను! నాకూ ఇష్టం లేదు’ అంటాను నేను.
నువ్వింకో మాట అనేలోగానే-
నేనిలా ప్రకటిస్తాను.
‘నీ ఇష్టమే నా ఇష్టం’
అంటే-
నీ అయిష్టమే నా అయిష్టం అని ధ్వనించేలా.
ఇష్టాయిష్టాలన్నీ ఏకమయ్యాక
ఇక విభేదాలుంటాయనుకుంటామా?
కొట్టుకుచావడానికి
నీకూ నాకూ కోటి కారణాలుంటాయి.
దిక్కుమాలిన లోకం
వేలెత్తి చూపిస్తే
లోకం కళ్ళనే మనం వేళ్ళతో పొడిచేస్తాం.