(Witches Sabbath – Stanley Hayter)
బిడియపడుతూ అరమోడ్పు కనుల వెనక దాక్కొనే దోబూచలాట మనుషుల ప్రేమ–అది సంజెలోకి మాయమవుతుంటుంది. చీకటినీడల వెనుక తారట్లాడుతుంటుంది, గుసగుసగా మాట్లాడుతుంటుంది, పరదాల మాటున పొంచి ఉండి, దీపాలు ఆర్పేయడానికే ఉత్సాహపడుతూ ఉంటుంది.
సూర్యుడంటే నాకేం అసూయ లేదు. అతను కిటికీ సందుల్లోంచి తొంగి చూస్తానంటే కూడా నాకేం అభ్యంతరంలేదు–నేను కూడా అక్కడున్నంతవరకూ!
ప్రేమ వ్యవహారాలకి అర్ధరాత్రులకంటే మిట్టమధ్యాహ్నాలు సరిపోతాయని నా అభిప్రాయం. కవులూ ప్రేమికులూ చందమామనే ప్రేమికుల చక్రవర్తిగా పట్టం కట్టడానికి ప్రయాసపడ్డారు కానీ, చీకటితెరల మాటున మసకబారిన ఆ రాత్రి సూర్యుడంటే నాకు రోత. ‘సరే’ అని అంగీకరించిన ఒక ప్రేమ, దాని పర్యవసానాలు–గురించిన ఈ కథ మొదలైంది పట్టపగలు, వెలుగు కోసం బార్లా తెరిచిన ఒక కిటికీ ముందు. ఈ కథ ముగింపు రాత్రికి, పగటికి మధ్య ఉన్నంత తేడాతో ఆమెను ఆశ్చర్యపరచివుంటే ఆ తప్పు నాది కాదు. ఆమెది. ఎవరి ‘సరే’కోసమయితే నేను తపించిపోతూ ఎదురుచూశానో ఆమెదే.
ఆమె నా ప్రేమని అంగీకరించడానికి ముందు జరిగిన సంఘటనలు కొన్ని ఇక్కడ చెప్పాలి. ఒక్క సంగతి బల్లగుద్ది చెప్పవచ్చు. ప్రేమలో, కళ్ళు…ఎలా చెప్పాలి, కళ్ళు మిగతావాటికంటే ముందుంటాయి. ఎందుకంటే, అవి చురుకైనవి, పనిమెళకువ తెలిసినవి. చూడగలవు, చదవగలవూ కూడా. ప్రేమికుల శరీరాలు వాటితో పోలిస్తే మోటుగా నేర్పు లేకుండా ఉంటాయి. తమను రెండవది చూడకుండా బట్టల వెనక దాచుకుంటాయి. చివరికి పెదాల మీంచి వచ్చే మాటలు కూడా తచ్చాడుతూ ఉంటూండగానే, కళ్ళు మాత్రం అప్పటికే ప్రేమకి దాసోహమవుతుంటాయి.
నాకు ఇంకా ఆ రోజు కళ్ళకి కట్టినట్టే ఉంది. మెరిసిపోతున్న ఎండలో నీలిరంగు ఆకాశంలోకి తెరుచుకున్న కిటికీ దగ్గర నిల్చునున్న మేము, ఏదో ఒప్పందానికొచ్చినట్టు ఒకేసారి ఒకర్నొకరం చూసుకున్నాం. చూపులు కలిసాయి. అదిగో అప్పుడు చూశానతన్ని. ఆమె కనుపాపల్లోంచి నాకేసి చూస్తున్న నా చిన్ని ప్రతిరూపాన్ని. నేనింకా ఆమె గౌన్ అంచు కూడా తాకనే లేదు, కాని వాడప్పుడే అక్కడ… ఆ కళ్ళల్లోకి చొరబడ్డాడు. అతన్ని చూసి చిరునవ్వు నవ్వాను. అతను కూడా మర్యాదగా తలూపాడు, ఈలోగా ఆమె కళ్ళు తిప్పుకుంది. మళ్ళీ వాడు నేను, ఆమె ఆ ‘సరే’ చెప్పేదాకా ఒకరికొకరు కనపడలేదు.
గుసగుసగా, చప్పుడు లేకుండా ఆమె ఒప్పుకుంటూ చెప్పిన ‘సరే’ విన్నప్పుడు నేనింక తటపటాయించలేదు. ఆమె చేతుల్ని నా చేతుల్లోకి తీసుకుని, దగ్గరకి లాక్కున్నాను. అప్పుడు మళ్ళీ చూశానతన్ని, ఆమె గుండ్రటి కనుపాపల్లోంచి తొంగి చూస్తూ, నా వైపుకి, నాకు దగ్గరగా తన మొహాన్ని తేవడానికి ఉరకలేస్తున్నాడు. ఒక్క రెప్పపాటు అతన్ని దాచేసింది, కానీ మళ్ళీ కనిపించి వెంటనే మాయమైపోయాడు. వాడి మొహంలో ఆనందం, తృప్తి నేను గమనించగలిగాను. అదిగో, అప్పడినుండీ, ఆమె పెదవులను నా పెదవులతో కలపబోతున్న ప్రతీసారి ఆ రెప్పల వెనక వాడికోసం చూసేవాడిని. ప్రతిసారీ వాడు అక్కడే, ఆ కంటిపాప కచేరీలో కుదురుగా కూర్చునుండేవాడు. వాడి మొహం ఎంత చిన్నగా ఉన్నా కూడా అందులోని హావభావాలు నాకు తెలిసిపోయేవి. ఒక్కోసారి కేరింతలు కొడుతూ, ఒక్కోసారి అలిసిపోయినట్టుగా, ఒక్కోసారి ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయి…
ఒకరోజు ఆమె కన్నుల్లో దొంగలా దాక్కున్న ఆ కనుపాపడి గురించి చెప్పాను. నా ఊహలూ చెప్పాను. ఆశ్చర్యంగా, ఆమెకి నచ్చలేదు.
“ఇదేం పిచ్చి!” కనుపాపలు దూరంగా జరిగాయి. తన మొహాన్ని నా చేతుల్లోకి తీసుకుని, బలవంతంగా ఆ మరుగుజ్జువాడికోసం ఆ కళ్ళలో గాలించాను. తను పకపకా నవ్వేసి, కనురెప్పలు దించేసింది.
“ఊహూ, ఊహూ.” ఆమె నవ్వులో నవ్వుకానిదేదో గోచరమైంది.
ఒక్కోసారి అసంగతమైన ఒక చిన్న విషయానికి అలవాటుపడిపోతాం. దాని గురించే ఆలోచిస్తూ, విశ్లేషిస్తూ దానికో అర్థాన్ని అస్తిత్వాన్ని కల్పిస్తాం. మనకు తెలిసేలోపే ముఖ్యమైనవాటిని, నిజాలని తిరస్కరిస్తూ, తోసిరాజంటూ అది చెయ్యెత్తి, ధైర్యంగా తన హక్కులని అడగడం మొదలెడుతుంది. నేను కనుపాపడికి అలవాటుపడిపోయాను. పిచ్చాపాటీ మాట్లాడుతున్నప్పుడు ఆమెతో పాటుగా, వాడుకూడా శ్రద్ధగా వినడం నాకు సంతోషంగా ఉండేది. మా ఇద్దరిమధ్యా ఆ అలవాటు ఒక ఆటగా మారింది. తను అతన్ని దాచెయ్యడానికి ప్రయత్నించడం, నేను వాడిని వెతుకుతూ ఉండటం (ప్రేమికులు ఏమేం చెయ్యగలరో ఎవరికెరుక!), ఇదీ ఆ ఆట, నవ్వుల్లోను, ముద్దుల మధ్య సాగుతూ ఉండేది. ఒకరోజు–ఇప్పటికీ ఆరోజుని తల్చుకుంటే గుండె మెలిపెట్టినట్టుగా ఉంటుంది–నా పెదాలతో ఆమె పెదాలని అందుకోవాలని ముందుకు వంగాను, అలవాటుగా ఆమె కళ్ళలో వాడికోసం చూశాను. ఆ కనురెప్పల కిందగా కనిపించి చేయి ఊపాడు. వాడి కళ్ళల్లో ప్రయత్నపూర్వకంగా దాచుకుంటున్న విషాదం. చప్పున వెనుతిరిగి ఆమె కంటిపాప లోలోపలికి పరుగెత్తిపోయాడు.
“వచ్చి నన్ను ముద్దు పెట్టుకో.” ఆమె కనురెప్పలు వాడిని దాచేశాయి.
“ఆగు!” నన్ను నేను మరిచిపోయి, ఆమె భుజాలు నొక్కుతూ అరిచాను. భయంతో విచ్చుకున్న ఆమె కనుపాపల లోతుల్లో వెన్ను చూపి వెళిపోతున్న నా కంటిపాపడిని ఆఖరిసారి చూశాను. ఏమైంది ఏమైందని ఆమె ఆత్రుతగా అడుగుతున్న ప్రశ్నలకి నేను ముక్తసరిగా ఏదో సమాధానం కల్పించి చెప్పాను. ఆపైన చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుండిపోయాను. నాకు తెలుసు; ఆట అయిపోయింది.
2.
కొన్నిరోజులు ఆమెకి గానీ, ఇంకెవరికీగానీ, నా మొహం చూపించలేదు. ఇంతలో, క్రీమ్ కలర్ కవర్లో ఒక ఉత్తరం బోలెడన్ని ప్రశ్నలతో నన్ను వెదుక్కుంటూ వచ్చింది. ‘అనుకోకుండా, ఎటైనా వెళ్ళాల్సి వచ్చిందా? ఆరోగ్యం బానే ఉందా’? ‘బాలేనిది నా ఆరోగ్యమేనేమో’ అనిపించింది నాక్కూడా. ఏటవాలుగా, కొక్కిరిబిక్కిరి దస్తూరిని మరొకసారి చూడగానే ఇక ఆగలేక ఉన్నపళంగా ఆమెని చూడడానికి బయలుదేరాను. ఆమె ఇంటిదాకా వచ్చికూడా ఆ వీధిలోనే ఒక బెంచీ మీద కూర్చుండిపోయాను, సాయంత్రంకోసం ఎదురుచూస్తూ. ఖచ్చితంగా ఇది నా పిరికితనం, సందేహం లేదు. నాకు చూడనిది, మరి ఇంక ఎప్పటికీ కనిపించదేమోనని నా భయం. ఆమె కన్నుల్లో నా కళ్ళతో మరొకసారి వెతకవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. నాకూ అలానే అనిపించింది. అసలు ఇదంతా నా భ్రమే కావొచ్చు. కనుపాప కట్టిన భ్రమ కావచ్చు. కాని, ఇది భ్రమ కాదు అని ఋజువు చేసుకోవాలనే ఆలోచన కూడా వాడి అస్తిత్వాన్ని, నా మతితప్పిన స్థితిని రెండు ప్రత్యేకమైన అస్తిత్వాలుగా నిర్ధారిస్తుంది. నమ్మినదాన్ని ఋజువు చేసుకోడానికి ఆ రెంటికీ వేర్వేరు అస్తిత్వాలు ప్రకటిస్తుంది. వాడు నిజమే అయి, నాది భ్రమే అయితే, దాన్ని తార్కికంగానే తేల్చేయాలి కాని ప్రయోగం ద్వారా కాదు. కల్పనను ఋజువు చేయడానికి చేసే ప్రయోగం ఆ కల్పనను నిజం చేస్తుంది. నా భయాన్ని నానుంచి నేను సులభంగానే దాచిపెట్టుకున్నాను. నేను బెంచీ మీద ఎందుకు కూర్చున్నాను: ‘సాయంత్రం బయట ఆహ్లాదంగా బావుంది; చాలా దూరం నడిచి అలసిపోయాను; ఆ చిట్టి కంటిపాపడు ఒక కథకి మంచి వస్తువనిపించింది కాబట్టి; ఇక్కడ హాయిగా కూర్చొని కనీసం ప్లాట్ అయినా రాసుకోవచ్చు.’ ఇలా.
ఆవరించుకుంటున్న చీకటి నన్ను చివరికి ఆమె ఇంట్లోకి నెట్టింది. ‘ఎవరూ?’ ఇంటి లోపలనుంచి వినిపించిన ఆమె గొంతు, కొద్దిగా ఆమెది కానట్టుగా, కొద్దిగా ఇంకెవరికోసమో అన్నట్టుగా.
“నువ్వా, మొత్తం మీద ఇన్నాళ్ళకి!”
ఆమె గదిలోకి వెళ్ళాం. సంజెవెలుగులో ఆమె తెల్లటి చెయ్యి లైట్ స్విచ్ అందుకోబోయింది.
“వద్దు. లైట్ వెయ్యకు.” అంటూ ఆమెని దగ్గరకి లాక్కున్నాను. మా శరీరాలు కలిసివున్నంతసేపు కళ్ళు మూసుకునే ఉన్నాయి. చీకటి కప్పిన ప్రేమ. ఆ సాయంత్రం మేము లైట్ వెయ్యలేదు. మళ్ళీ ఎప్పుడు కలుద్దామో నిర్ణయించుకొన్నాక, కోర్ట్ స్టే ఇచ్చినవాడిలా నేను తిరిగి వచ్చేశాను.
ఇక్కడ నుంచీ జరిగిన తతంగం వివరాలు చెప్పడం అనవసరం – ముందుకు పోతున్నకొద్దీ, నిరాసక్తంగా తయారవుతుంది. పెళ్ళి అయిన మగవాడెవడైనా ఈ అధ్యాయాన్ని సునాయాసంగా చెప్పగలడు: మధ్నాహ్నం నుంచి అర్ధరాత్రికి మారిన మా కలయికలు నిస్సారంగా, కొత్తదనం లేకుండా, విరసంగా అయిపోయాయి. మా ప్రేమ కూడా జీవం కోల్పోయి ఒక అలవాటుగా తయారైంది. మంచం డబుల్ బెడ్ అయింది, పక్కన మేజోళ్ళు, మూలన బాత్రూమ్‌తో సహా. తిరిగి ఈ ప్రేమలో వేడిని ఊదడానికి నేను చెయ్యని ప్రయత్నం లేదు. పొరపాటున ఆమె కనుపాపల్లోకి చూస్తానేమో, వాటిని ఖాళీగా నేను లేకుండా చూడాల్సివస్తుందేమోనన్న భయం, నన్ను తెల్లవారకముందే లేపి తయారుచేయించేది. మొదట్లో తెల్లారకుండానే నేను వెళ్ళిపోవడం ఆమెకు కొత్తగా అనిపించింది. కొంతకాలానికి అది కూడా అలవాటైపోయింది.
ఓ పెళ్ళి అయిన మగవాడుగారూ, మీకు కృతజ్ఞతలు. తతిమ్మా కథ నేనే చెప్తాను!
తెల్లవారుజాము చలిలో ఇంటివైపు నడుస్తూ, అప్రయత్నంగానే కంటిపాపడి గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. క్రమక్రమంగా, వాడి ఆలోచన నన్ను భయపెట్టడం మానేసింది. ఒకప్పుడు వాడి అస్తిత్వం నన్ను భయపెట్టేది, వాడి తాలూకు ఊహే నాలో అనుమానాన్ని, తొట్రుపాటుని కలగచేసేది. కాని ఇప్పుడు వాడు కేవలం ఒక కల్పన, ఒక భ్రమ అనేది నన్ను విచారంలోకి నెడుతుంటుంది.
‘అసలు ఎంతమంది ఉండుంటారు ఇటువంటి కంటిపాపళ్ళు? ఎంతమందిని మనం ఇతరుల కళ్ళలోకి జల్లి పోస్తుంటాం?’ అని అప్పుడప్పుడూ, నిర్మానుష్యమైన వీధుల్లో నడుస్తూ, ఆలోచిస్తూ ఉండేవాడిని. ఎందరి కళ్ళల్లోనో బతుకుతున్న నా ప్రతిబింబాలందర్నీ ఒకచోట పోగుచేస్తే ఈ మరుగుజ్జు ‘నేను’లతో ఒక చిన్న దేశం నిండిపోతుందేమో… నిజమే, నేను చూసినప్పుడే వాళ్ళ ఉనికి, కానీ నా ఉనికి కూడా ఒక అమ్మాయి నన్ను చూసినప్పుడే కదా? కానీ, ఆ చూసిన అమ్మాయి కళ్ళు మూసేసుకుంటే, అప్పుడో… ఓహ్, చెత్త ఆలోచన! అవును, చెత్తే అనుకో. కానీ, నేను ఇంకొకరి కంటిపాపడు కాకుండా నాకంటూ ఒక ఉనికి ఉన్నట్టయితే, నా ప్రియురాలి కంటిలో ఉన్న ఆ చిన్ని ప్రతిబింబానికీ ఒక ప్రత్యేకమయిన ఉనికి ఉన్నట్టే కదా.
నిద్రమత్తులో ఇలాంటి ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చేవికావు. చుట్టలు చుట్టలుగా చిక్కుపడిపోయిన వాటిని మళ్ళీ సావకాశంగా విప్పుతూ ఉండేవాడిని. ‘అసలు వాడు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఎక్కడికి వెళ్ళుంటాడు? సరే, ఆమె కనుపాపల్లో వాడిప్పుడు లేడు. అయితే ఏం? నాకు ఆమె కళ్ళలో తళుక్కుమని మెరిసి మాయమైపోయే ఈ మరుగుజ్జు అవసరం ఏముంది? వాడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నా వ్యవహారాల్లో దూరి, నా జీవితాన్ని, ప్రేమని ఒక అభాసగా మార్చేసి, మా ఇద్దరిని విడగొట్టడానికి ఆ పాపిష్టి పాపడికెంత ధైర్యం!’
ఈ ఆలోచన గట్టిగా పట్టుకున్నాక, ఒక్కోసారి మళ్ళీ ఆమె దగ్గరకి వెళ్ళాలనిపించేది, ఆమె కన్నుల వెనుక దాగిన రహస్యాన్ని విప్పాలనిపించేది: ఆ కనుపాపలో అసలు వాడు ఉన్నాడా, లేడా?
కానీ, ఎప్పుడూ సాయంత్రం పడకముందు నేను వెళ్ళలేదు. ఒకవేళ ఆమె గదిలో ఇంకా లైట్ వెలుగుతుంటే, ఆమె కౌగిలింతలకు తల తిప్పుకునేవాడిని. చీకటి మా కళ్ళకు గంతలు కట్టేదాకా, ఎలానోలా అంతగా కదలిక లేకుండా ఉండేవాడిని. ఆపైన ధైర్యంగా ఆమె ముఖంలో ముఖం పెట్టి ఆ చీకటిలో తరచి తరచి అడిగేవాడిని. ‘యూ లవ్ మి? డూ యు లవ్ మి?’ మెల్లిగా ఆ రాత్రి మా అలవాటుగా మారిపోయేది.
3.
ఒకరోజు రాత్రి నిద్రమత్తులో ఉండగా, ఏదో నా కనురెప్పని కొద్దిగా పట్టిలాగినట్టు అనిపించింది. ఉలిక్కిపడి లేచాను, చిన్న కీటకం లాంటిదేదో నా ఎడమకంటిని రాచుకుంటూ, బుగ్గమీదనుంచి నా చెవుల్లోకి పాకి కీచుగొంతుతో అరిచింది: “వాట్ ది హెక్! ఇదేదో ఖాళీ అపార్ట్‌మెంట్ లాగా ఉంది. ఇక్కడెవరూ లేరు.”
“ఏంటీ?” ఇంకా అది కలో నిజమో తెలీని మత్తులో గొణిగాను.
“ఏంటి అని కాదు, ఎవరని అడుగు. అది మొదటి విషయం. రెండోది నీ చెవిని కాస్త తలగడకి దగ్గరగా వంచు, నేను దిగాలి. ఇంకొంచెం దగ్గరగా, ఇంకా… గుడ్.”
తలగడ అంచు మీద, ఇంకా తెల్లారని బూడిదరంగు వెలుగులో మసకగా కనిపిస్తూ, కూర్చొనున్నాడు, వాడే నా కంటిపాపడు. కష్టమైన ప్రయాణం చేసి చేసి అలసిపోయిన బాటసారిలా, చేతులు తలగడ అంచుకి ఆనించి, వగరుస్తున్నాడు. వాడి మొహంలో తీవ్రమైన విచారం కనిపిస్తోంది, వాడి చేతుల్లో బూడిద రంగు టాకాలు వేసిన నల్లటి పుస్తకం.
వాడికేసి ఆశ్చర్యంతో చూస్తూ, “అయితే నువ్వు భ్రమవి కాదన్నమాట!” తెలీకుండానే పెద్దగా అరిచాను.
“అదేం పిచ్చి ప్రశ్న! అరవకు. ఆమె లేస్తుంది. నీ చెవిని ఇలా దగ్గరకి పెట్టు. నీకు చెప్పాల్సింది ఒకటి ఉంది.”
అలిసిపోయిన తన కాళ్ళు జాపుకుని, విశ్రాంతిగా కూచుని, గుసగుసగా నా చెవిలో చెప్పడం మొదలెట్టాడు:
ఆమె కంటిపాపలోకి నేను ఎలా చేరిందీ నీకు తెలుసు, దాని గురించి నేను చెప్పక్కర్లేదు. ఆ కథంతా మనిద్దరికీ బాగా తెలుసు. నా కొత్త ఇల్లు నాకు నచ్చింది. అద్దాల ప్రతిబింబాలతో, ఒక చిన్న ఏడురంగుల ఫ్రేము ఉన్న కిటికీ వెచ్చగా ఒద్దిగ్గా ఉండేది. ఉబ్బిన అద్దాలు ఎప్పటికప్పుడు కంటినీరుతో శుభ్రంగా తుడవబడుతూ ఉండేవి. రాత్రి అయ్యేసరికి, వాటంతట అవే కర్టెన్లు మూసేసి చీకటిపడేది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, అన్ని సౌకర్యాలూ వున్న అపార్ట్‌మెంట్. కానీ ఇంటి వెనకవైపు, పొడుగాటి వసారా ఉంది, చీకటిగా ఉండేది. అదెక్కడికి పోతుందో ఎవడికి తెలుసు. ఎప్పుడూ ఆ కిటికీ దగ్గరే కూచుని నీకోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. నా వెనక ఏం ఉందో నేనూ ఎప్పుడూ పట్టించుకోలేదు. ఒకరోజు, ఎదురుచూసినట్టుగా మన మీటింగ్ జరగలేదు. మరీ లోపలికి పోకుండా ఆ వసారా మొగదల లోనే పచార్లు చేశాను. మరీ లోపలికి పోతే నిన్ను కలవలేనేమో అని భయం. ఈలోగా, కంటిపాప బైట వెలుతురు పల్చబడింది. ఇక నువ్వు రావు అనుకున్నాను. ఏమీ తోచలేదు. సరే కాలక్షేపం అవుతుంది కదా అని ఆ వసారాలోకి నడిచాను. కంటిపాప బయట వెలుతురు తగ్గిపోతోందని చెప్పాను కదా, ఇంతలో నన్ను కటికచీకటి కమ్మేసింది. చేతులతో గాలిని తడుముకుంటూ నడుస్తూ లోపలికి పోయాను. వెనక్కి తిరిగి వచ్చేద్దామనుకుంటుండగా, సన్నటి గొంతు ఒకటి దుప్పట్లోంచి మాట్లాడుతున్నట్టుగా ఆ వసారా లోలోపలినుంచి వినిపించింది. అదేమిటో అని చెవులు రిక్కించి విన్నాను. చాలామంది కలిసి, శ్రుతి తప్పుతూ, ఒక రాగాన్ని ఆలాపిస్తున్నారు. నా చెవులకి అందులో రెండు పదాలు కూడా స్పష్టంగా వినిపించాయనుకుంటా: ‘ఉరిశిక్ష’, ‘మరణం’. మిగిలిన పాట వినిపించలేదు. ఇది నాలో కుతూహలం రేపింది. కానీ, కనుపాప పూర్తిగా మూసుకొనిపోతే తిరిగివచ్చే దారి కనపడదన్న భయంతో తిరిగి వచ్చేశాను.
కానీ ఈ వ్యవహారం అక్కడతో అయిపోలేదు. మరుసటిరోజు, కిటికీ దగ్గర నేను కూర్చున్నచోటునుంచే మళ్ళీ రణగొణగా ఆ పాట వినిపించింది. పాట స్పష్టంగా వినిపించలేదు కాని బృందంలో అన్నీ మగగొంతుకలే అని అర్థమయింది. ఈ విషాద పరిస్థితి నన్ను ఆగనీయలేదు. వసారా ఆ చివరిదాకా వెళ్ళి అదేదో చూడాల్సిందే! అనుకున్నాను. కానీ, అటువైపు వెళ్తే ఎవరున్నారో, ఎలాంటివారో, మళ్ళీ తిరిగి ఈ కిటికీ దగ్గరకు రాగలనో లేదో అని తటపటాయించాను. రెండు మూడు రోజులపాటు మళ్ళీ ఆ పాట వినపడలేదు. నేనే లేనిపోనిదేదో ఊహించుకున్నానేమో అనుకున్నాను. ఒక రోజు మధ్నాహ్నం, తనూ నేనూ మాకు అలవాటైన కిటికీల దగ్గర కూర్చుని నీకోసం ఎదురుచూస్తున్నాం. అప్పుడు మళ్ళీ ఆ పాట వినిపించింది మరింత బలంగా, మరింత పెద్దగొంతుకలతో. అపశ్రుతిలో వినిపిస్తున్న ఆ పాటలోని పదాలు మూలుగుతున్నట్టుగా సాగుతూ గింగిరాలు తిరుగుతూ నా చెవుల్లో మ్రోగడం మొదలెట్టాయి. వాటి అర్థం ఎలాటిదంటే, ఇక నాకు ఆ పాటగాళ్ళని కలవక తప్పలేదు. నీకు చెప్పకుండా వెళ్ళడం మాత్రం నాకు ఇష్టంలేదు. నీకు గుర్తుందిగా, నీకు వీడ్కోలు చెప్పే వెళ్ళాను ఆ రోజు. నువ్వు ఆశ్చర్యపోయినట్టుగా కనిపించావు, నేను ఆ కంటిపాప లోలోపలికి వెళ్ళిపోయాను. అక్కడంతా చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. ఆమె కళ్ళలోంచి వస్తున్న వెలుతురు క్రమక్రమంగా తగ్గిపోతూ, పోను పోనూ దారంతా చిమ్మచీకటిగా ఉంది. నా అడుగులు ఆ చీకట్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ వసారా చీకటి గోడలు తడుముకుంటూ నేను ముందుకి పోయాను. ఆఖరికి చావుపచ్చ వెలుగు కనిపించింది. నిరాశతో వినాశంతో ఈనెలు విరబోసుకున్న ఈతచెట్టులా ఉంది ఆ వెలుతురు. హఠాత్తుగా, నాకు ఎక్కడలేని అలసట, నిరుత్సాహమూ ఆవరించుకున్నాయి. ‘ఏం వెతుక్కుంటూ వచ్చానిక్కడికి, ఈ చీకటి సమాధుల్లో ఏముంది?’ అనుకుంటూ, ‘ఈ చావుపచ్చని వెలుగుకోసం సూర్యకాంతిని వదులుకోవడం ఎందుకు?’ అని వెనక్కు తిరిగేవాడినే కాని, అంతలో, ఆ పాట మళ్ళీ మొదలైంది. ఇప్పుడు ఆ మాయదారి స్తోత్రంలో, నాకు ప్రతిఒక్కరి గొంతూ స్పష్టంగా వినపడుతోంది:
మగ-మగ-మగాడా, చిట్టోడా, పొట్టోడా, మరుగుజ్జు మరుగుజ్జు మగాడా
బతుకు మీద తీపుంటే, అడగాలోయ్ పాపల్నీ,
నువు దూకకముందే పాపల్నీ కంటిపాపల్నీ
బేసి బేసి. ఒకటీ-మూడూ-ఐదూ-ఏడూ…
కంటిపాపల్లో
కంబాలు, కంబాలు,
ఉరికంబాలున్నాయోయ్.
నీకు నువ్వే తగిలించుకో
ఉరితాడు బిగించుకు పో, చచ్చిపో.
నిట్టూర్చి నిప్పై రగిలిపో, రగిలిపో
బూడిదవై రాలిపో, ఆరిపో
సరి సరి రెండు-నాలు-గారె-నిమిది.
మరుగుజ్జు మగాడా. మరుగుజ్జు మగాడా
కంగకు, కంగకు, కంగారెందుకు
జాగ్రత్త, జాగ్రత్త – జారేవు జాగ్రత్త
తెగిపోయిన బంధం
హృదయానికి రంధ్రం
కత్తివాదరపైనే
నీ కాలం ఇకపై అరగాలి
బేసి బేసి ఒకటీ-మూడూ-ఐదూ-ఏడూ…
మరుగుజ్జు మగాడా, మరుగుజ్జు, మరుగుజ్జూ ఉజ్జుజ్జుజ్జ్ …
ఇలా వచ్చేవు అలా వెళ్ళేవు
తడిలో నీడవై
ఇసకలో జాడవై
విను విను రెండు-నాలు-గారె-నిమిది
అసంబద్ధమైన ఆ పాట చేపను పట్టుకున్న గాలంలా నన్ను తనలోకి లాక్కుంటూ తీసుకెళ్ళింది. ఇంతలో ఒక గుండ్రటి బిలద్వారం లాంటిది కనిపించింది. అందులోంచే వస్తోంది ఆ చావుపచ్చటి వెలుతురు. చేతులతో అంచులు పట్టుకుని, లోపలికి తలపెట్టి చూశాను. కింద శూన్యంలోంచి పది పన్నెండు గొంతులు ఊళలు వేస్తున్నాయి. మిరుమిట్లు కొలిపే పచ్చటి వెలుతురులో నా కళ్ళు బైర్లు కమ్మాయి. కళ్ళు చిట్లించుకుని, కొద్దిగా ముందుకు వంగాను, పాకుడుపట్టిన ఆ బిలద్వారం కుంగిపోయి నేను కాళ్ళు చేతులు కొట్టుకుంటూ బిలంలోకి పడిపోయాను. మరీ లోతుగా ఏం లేదు. లేచి కూర్చొని చుట్టుపక్కల చూశాను. ఆ వెలుతురికి కొద్దికొద్దిగా కళ్ళు అలవాటు పడుతున్నాయి. నేను ఒక సీసా లాంటి దాంట్లో ఉన్నాను; సీసా కిందభాగం ఉబ్బెత్తుగా ఉంది. దాని మీద ఉన్నాను నేను; సీసా గోడలు రక్తనాళాల లాగా ఉబుకుతూ తగ్గుతూ ఉన్నాయి. నా కిందనుంచి ఒక ముద్దలాంటి దానిలోంచి ఆ పచ్చటి కాంతి వస్తోంది. నా చుట్టూరా ఒక పదిమంది మనుషులు, నీడలో సగం కనిపించకుండా అరికాళ్ళు ఆ వెలుగు మీద నిలబడి మొహాలు గోడలవైపు పెట్టి పాడుతున్నారు. వాళ్ళు పాడుతున్న పాట చివరి చరణంలోకి వచ్చినట్టున్నారు.
మరుగుజ్జు మగాడా, మరుగుజ్జు, మరుగుజ్జూ ఉజ్జుజ్జుజ్జూ
ఇలా వచ్చేవు అలా వెళ్ళేవు
అడుసులో అడుగువై
తడిలో నీడవై
ఇసకలో జాడవై
ఏదీ మరొకసారి
పట్టుకో పాతపల్లవినీ
విను విను రెండు-నాలు-గారె-నిమిది
‘నేనెక్కడున్నానూ?’ నా ప్రశ్న ఆ ఊళలాంటి పాటలో ముణిగిపోయింది. బయటకి దారి వెతుక్కుందామని, నిలుచోబోతూ పట్టు తప్పి ఆ సీసా అంచుల్లోంచి ఇంకా కిందకి పడిపోయాను, అక్కడి వాళ్ళందరి నవ్వుల మధ్య జారుతూ, సరిగ్గా ఇద్దరి మధ్యలో కూలబడ్డాను.
‘ఎక్కువమందైపోతున్నారు’ అని నా ఎడమవైపు మనిషి విసుగ్గా గొణిగాడు. నాకు కుడివైపునున్న మనిషి మాత్రం స్నేహంగా చూశాడు. పిడచకట్టుకుని ముందుకు పొడుచుకొచ్చిన నుదురు, సాలోచనగా కళ్ళు, వంకీ గడ్డం, బట్టతలను కప్పుతూ వెనకకు సాపుగా దువ్విన జుట్టు–ప్రొఫెసర్‌లకు ఉండాల్సిన మొఖం అది.
“మీరెవరు? నేనెక్కడ ఉన్నాను?”
“మేమా? మేము నీ పూర్వీకులం. అర్థం కాలేదా ఇంకా? ఆడవారి కంటిపాపలన్నీ అద్దెయిళ్ళ లాంటివే. ముందు రానిస్తారు, ఆ తర్వాత నిర్దాక్షిణ్యంగా బయటకి నెట్టేస్తారు. ఆ అందరూ ఇదిగో ఇక్కడ తేల్తారు. ఉదాహరణకి నేను ఆరోవాడిని, నీకు ఎడం పక్కన ఉన్నవాడు రెండో నెంబరు. నువ్వు నెంబర్ పన్నెండు. ఇది వరుస బట్టి కాదు అనుబంధం బట్టి. అర్థం అవుతోందా, లేదా వివరంగా చెప్పమంటావా? ఇంతకీ తలకు దెబ్బలేం తగల్లేదు కదా?”
“గోడలు గుద్దుకునా?”
“కాదు, అర్థం కాకపోవడాన్ని గుద్దుకుని.”
ఒక్క నిముషం మౌనంగా ఉన్నాం ఇద్దరమూ.
“సర్లే కానీ, నువ్వు ఇలా వదిలించుకోబడడాన్ని నమోదు చేసుకోడం మాత్రం మరిచిపోకు. ఓహ్, ఈ అమ్మాయిల కంటిపాపలు…” గడ్డం దువ్వుకుంటూ కొనసాగించాడు “అందమైన రెప్పల నీడలనుండి ఆహ్వానిస్తూ ఉంటాయి. ఎంత అందమైన ద్వారమో, హరివిల్లు రంగుల కిటికీతో! కానీ లోపల మాత్రం అంతా భయంకరమైన చీకటి. ఒకప్పుడు నేను కూడా…”
మధ్యలో అడ్డుకున్నాను. “మిమ్మల్నెవరు నమోదు చేశారు?”
“క్వాగ్గా.”
“అలాంటి పేరెప్పుడూ వినలేదే.”
“నీకు టెలీగొని గురించి తెలుసా?”
“ఊహూ..”
“అయితే నీకు లార్డ్ మోర్టన్ ఆడగుర్రం గురించి అస్సలేం తెలియదన్నమాట.”
“దానికి, దీనికి ఏమిటి సంబంధం?”
“ఏమిటి సంబంధమా? చెప్తాను విను. 16వ శతాబ్దపు జార్జ్ డగ్లస్, ఎర్ల్ ఆఫ్ మోర్టన్ అనే రాజుకు ఒక ఆడగుర్రం ఉండేది. క్వాగ్గా అంటే జీబ్రాలా ఉండే గుర్రం. కానీ చారలు ఒళ్ళంతా ఉండవు. ఆ ఆడగుర్రానికి క్వాగ్గా వల్ల అలా మొహం మీద చారలున్న ఒక గుర్రం పుట్టింది. ఎవడితో మొదటిపిల్లను కన్నదో వాడి లక్షణాలే మిగతా ఎవరితో కన్న పిల్లలకైనా వస్తూ ఉంటే టెలీగొనీ అంటారు. ఆ తర్వాతి నుంచీ ఎన్ని మగగుర్రాలు వచ్చినా, అవి ఎలాంటివయినా, ఆ ఆడగుర్రానికి చారలున్న పిల్లలే పుట్టేవి, ఆ గుర్రం క్వాగ్గానింకా మరిచిపోనట్టుగా. అది చూసి మోర్టన్ ప్రతిపాదించాడు: ఆడది తన మొదటి ప్రేమని ఎప్పటికీ మరిచిపోలేదు, మొదటి ప్రియుడితో ఉన్న అనుబంధం, పిదప వచ్చిన ప్రియులందరిలోనూ బతికివుంటూ, ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఆమెలో కొనసాగుతూనే ఉంటుంది. ఇదిగో మనం కూర్చున్నామే ఈ కంటిపాప అడుగున, దీని మొదటి ప్రియుడు క్వాగ్గా. స్కాట్లండ్ జంతుశాస్త్రజ్ఞుడు ఎవార్ట్ ఈ టెలిగొనీ అసత్యమని నిరూపించాడు.
“ఈ కంటింటి మొదటి పాపడు క్వాగ్గా. మిస్టర్ ఎవార్ట్, లార్డ్ మోర్టన్ సిద్ధాంతాన్ని తప్పని ఎప్పుడో ఋజువు చేశాడని అతనికి నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ క్వాగ్గా నిరంకుశుడు. ఎవరిమాటా వినడు. అతని ప్రకారం, అతను మట్టి, మనమందరం నీటిగొట్టాలం, మనందరం చేసేదల్లా తిరిగిరానిదాన్ని, మళ్ళీ పుట్టించాలనే…”
“ఈ టెలీగొనీ అనేది నిజంగానే తప్పని ఋజువు కాబడిందా?”
“ఆహ్హా, నాకు తెలుసు నువ్వా ప్రశ్న అడుగుతావని”, ప్రొఫెసర్ నవ్వాడు. “ఇంతకు ముందు కూడా ఇది గమనించాను. ప్రియులు ఎక్కువవుతున్నకొద్దీ, కుతూహలం ఎక్కువవుతుంటుంది. అందరికీ ఒకే ప్రశ్న? నాపట్ల ప్రేమలో చారలున్నాయా? లేదా? దాని గురించి తర్వాత మాట్లాడదాంలే. విను, మొదటివాడు నిన్ను పిలుస్తున్నాడు.”
“వదిలించుకోబడ్డ నెంబరు పన్నెండూ, ఇటురా.”
నేను లేచి నిల్చున్నాను, గోడకి చేతులు ఆనించి మెల్లగా ఆ గొంతు వినిపించిన వైపు వెళ్ళాను. దారిలో ఎవరెవరి కాళ్ళో అడ్డంపడుతున్నాయి. నేను లోపలికి పోతున్నకొద్దీ, అక్కడున్న పాపళ్ళను గమనించాను. కొందరికి ఆకారం పూర్తిగా లేదు, వాళ్ళు అక్కడి పచ్చటి కాంతిలో కలిసిపోయి, వెలిసిపోయినట్టుగా ఉన్నారు. వాళ్ళు కంటికి సరిగా ఆనకపోవడంతో, నేను వాళ్ళని తన్నుకుంటూనే లోపలికి పోవాల్సివచ్చింది. ఉన్నట్టుండి, రెండు బలమైన అదృశ్యహస్తాలు నా మోకాళ్ళు పట్టుకున్నాయి.
“ఈ ప్రశ్నలకి జవాబులు రాయి.”
నన్ను పట్టుకున్న చేతులెవరివో చూద్దామని వంగాను, కాని అవి కనిపించలేదు. ఒకటో నెంబరు ఎంతగా వెలిసిపోయాడంటే, అక్కడి గాలిలో కలిసిపోయాడు. అతని అదృశ్య హస్తం నన్ను వదిలి, ఒక పుస్తకాన్ని తెరిచింది. ఇదిగో ఆ పుస్తకమే ఇది. దగ్గర దగ్గరగా, ఇరుగ్గా పేజీలన్నీ నిండిపోయిన్నాయి. ఎవరో తిప్పుతున్నట్టుగా పేజీలొక్కొక్కటే లేచి పడుతున్నాయి. చివరికి ఒక ఖాళీపేజీ కనిపించింది. దాని మీద నా నెంబరు ఉంది.
ప్రశ్నలు డజన్లకొద్దీ ఉన్నాయి ఆ పేజి మీద: ఎప్పుడు ఈ కంటిపాపలోకి మొదటిసారి దూరావు? ఎందుకు? ఇలా.
ఎన్నాళ్ళు ఉంటావు? ఈ ప్రశ్నకి కింద కొన్ని సమాధానాలు సూచనగా ఉన్నాయి: అ) ఎప్పటికీ ఆ) మరణించేవరకూ ఇ) ఇంతకన్నా మంచి ఇల్లు దొరికేవరకూ. ఒకే సమాధానం ఎన్నుకోమని సూచన చివరిలో ఉంది. దరఖాస్తు చివరికొచ్చేసరికీ, ఆమె నాకు పెట్టిన ముద్దుపేర్లు ఏమిటి, అసూయ గురించి నీ స్పందన ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. తొందరగానే నేను నా సమాధానాలు రాసేశాను. ఆ అదృశ్య హస్తం పుస్తకం మూసేసింది. ఇంకా ఉన్న ఖాళీపేజీలు కళ్ళముందు మెరిశాయి.
“సరే. ఇక కానీయి” అన్నాడు క్వాగ్గా పుస్తకం మూసేస్తూ, “మరో కీ.శే. భగ్నప్రేమికుడు. ఈ పుస్తకం మెల్లగా నిండిపోతోంది. ఇంక నువ్వెళ్ళొచ్చు.”
నేను, ఆరూ రెండుల మధ్య నా చోటికి తిరిగి వచ్చాను. ఆరోనెంబరు తెల్లటి గెడ్డం నన్ను పలకరించడానికి రెపరెపలాడింది కానీ, నా ముభావాన్ని చూసి మాట్లాడలేదు. ఆ పుస్తకంలో ఇంకా ఉన్న ఖాళీపేజీల గురించి చాలా సేపు ఆలోచిస్తూ కూర్చున్నాను అక్కడే. ఇంతలో, ఖంగుమని మోగిన క్వాగ్గా కంఠం నన్ను స్పృహలోకి తెచ్చింది.
“పదకొండూ, ఇక్కడకు రా!”
“పదకొండూ రావాలి! పదకొండూ రావాలి!” అందరి గొంతులూ కలిశాయి.
“ఏమవుతోంది?” అనడిగాను నేను రెండును.
“పాత కథే. వరస నెంబరు ప్రకారం మొదలవుతుంది. వచ్చేసారి, నీతోనే మొదలవుతుందిలే.”
ఇంక అడగవలసిన అవసరం లేకపోయింది. అప్పటికే పదకొండో నెంబరు, మధ్యలోకి వస్తున్నాడు. అతని భారీ ఆకారం నాకు బాగా తెలిసినదే. నాముందువాడు అలా మధ్యలోకి వచ్చి, ఆ పసుపు వెలుగునిస్తున్న ముద్ద మీదకు ఎక్కి మంటపం మీదకి ఎక్కి అందరివైపు ప్రశాంతంగా చూశాడు. అతను ముక్కుకు తగిలించుకున్న కళ్ళజోడు నుంచి వేలాడుతున్న తాడును పెదాలతో కొరకసాగాడు ఏదో ఆలోచిస్తున్నట్టుగా. అతని చెక్కిళ్ళు వణికాయి.
“అవునవును, ఒకానొకప్పుడు, ఇప్పుడు చెప్పుకోవాలంటే నవ్వొస్తుంది కాని, మీ అందరిలాగనే, నాకూ ఒకే ధ్యేయం ఉండేది. ఏదో విధంగా, ఈమె కంటిపాపలోకి దూకడం. అందరం ఇక్కడ అలానే చేరాం కదా? ఇంకా ఏముంది చెప్పడానికి?”
కళ్ళజోడు తాడును తన వేలికి చుట్టుకుంటూ, అద్దాలని తీసి చేత్తో పట్టుకొని, అందర్నీ చూస్తూ, అసహ్యంతో కదిలిపోతూ మొదలెట్టాడు:
ఉచ్చు అది. మగాళ్ళని బంధించే ఉచ్చు. కానీ, అది కాదు విషయం. మా మొదటి కలయికే అన్నీ స్థిరపర్చింది. ఆరోజు, నాకు గుర్తుంది, తను నల్లటి గౌను వేసుకుంది, మెడవరకూ గుండీలన్నీ పెట్టుకొనుంది. తన ముఖం కూడానూ గుండీలు పెట్టినట్టు ముడుచుకునే ఉంది, బిగిసిన పెదాలు, అరమూసిన కళ్ళు. ఆవిడ వ్యాకులతకు కారణం? ఈ పెద్దమనిషి పది. ఈయన కథ ఈమధ్యే కదా విన్నది. ఎవరూ ఇంకా మర్చిపోలేదు. అప్పటికింకా ఈయన పరిచయ భాగ్యం నాకు కలగలేదు. కానీ, ఆ అరమోడ్పు రెప్పల చాటున దాగివున్న కనుపాపల పరిస్థితి గొప్పగా లేదని నాకు అర్థం అయ్యింది. నేను ఎలాగో దొంగతనంగా ఆ కళ్ళలోకి తొంగి చూశాను. ఎంతో ఒంటరితనం కనిపించింది. నాకు సరిపోయిన కంటిపాప కోసం వెతుకుతున్న నేను వెంటనే ఆ ఖాళీ కంటిపాపను ఆక్రమించుకుందామని నిర్ణయించుకున్నాను.
కానీ, ఎలా? ఆడాళ్ళ హృదయంలో స్థానం సంపాదించండంలో ఎవడి దారి వాడిదే. చిన్న చిన్న పనులు, వీలయినంతవరకూ పెద్ద ఖర్చులేనివి చేసిపెట్టడం నాకు తెలిసిన పద్ధతి: ‘నువ్వు ఫలానా రచయిత రాసిన ఫలానా పుస్తకం చదివావా?’ లేదు, కానీ చదవాలని ఉంది…’ మర్నాడు ఉదయానికి ఆ పుస్తకం సరికొత్త కాపీ పంపించడం. ఏ కళ్ళలోకైతే మనం చొరబడదామనుకుంటున్నామో, ఆ కళ్ళు మొదటి పేజీ తిప్పగానే నీ పేరు పైన ఒక అందమైన కొటేషన్ చూస్తాయి. పారేసుకున్న పక్క పిన్ను, లేదా లాంతరు శుభ్రం చేసే దబ్బనం–ఇలాంటివి ఎన్ననీ? అన్నిటినీ జాగ్రత్తగా గమనించి గుర్తుంచుకోవాలి. మళ్ళీ కలిసినప్పుడు, అలాంటిదే పక్క పిన్ను, ఆ దబ్బనం, ఆపెరాకు టికెట్, ఆస్పిరిన్ కాప్సూల్స్, ఇంకా ఇలాంటివి ఎన్నెన్ననీ. ఇదంతా ఎందుకంటే, ఇంకో మనిషిలోకి మనం అంచెలంచెలుగానే చొరబడగలం. మన చిట్టి చిట్టి అవతారాలు, అతి సూక్ష్మంగా, కంటికి ఆననంత సూక్ష్మంగా చొరబడాలి. ఇలా తగినంతమంది జొరబడినాకగాని ఆమె ఆలోచనలను మనం లోబరుచుకోలేం. ఈ సైన్యంలో ఎప్పుడూ ఒకడుంటాడు, అందరిలానే అణుపరిమాణంలోనే ఉంటాడు కాని, వాడి వల్లనే, వాడి వెంటనే మన ప్రేమకి అర్థం కూడా ఆమె కళ్ళలోకి చొరబడుతుంది. వాడు పోయాడా, అంతే. అణువులన్నీ పొడిగా రాలిపోతాయి, శాశ్వతంగా. అయినా, ఇదంతా మీకూ తెలుసు.
ఈ విధంగా, నేను నా పద్ధతిని అమలులో పెట్టాను. మన ప్రేయసి ఎటువైపు చూసినా, ఆమె కళ్ళు వాటిని తప్పించుకోడానికి వీల్లేకుండా, మూల మూలనా–పుస్తకాల్లో, ఫొటోప్రేముల్లో, పూలకుండీల్లో–ఎక్కడ చూసినా, నా చిట్టి సైన్యమే కనిపించేది. ఏ మూల నుంచైనా ఏ వంక నుంచైనా అవి నా పేరునే గుసగుసగా జపిస్తుండేవి. ఏదో ఒకరోజు, అందులో ఒకడు ఆమె కనుపాపలోకి చొరబడతాడని ఆశగా ఎదురుచూసేవాడిని. అయినా, ఇదేమీ అంత తొందరగా అయిపోయే వ్యవహారం కాదు. ఆమె బరువైన కనురెప్పలు ఒకపట్టాన లొంగలేదు.
ఒకసారి, ఇలాంటి లెక్కలేనన్ని సేవల తర్వాత, నవ్వుతూ అన్నది: “నువ్వు నన్ను ఆశిస్తున్నట్టున్నావు, అది జరగని పని. నీ సమయం వృథా చేసుకుంటున్నావు తెలుస్తోందా?”
“నాకదంతా అనవసరం.” బలహీనంగా అన్నాను నేను. ఒకసారి నా ట్రైను క్రిమియాకు వెళుతూ సగం దూరంలో ఆగిపోయింది, కిటికిలోంచి చూస్తే పచ్చటి పొలాల మధ్యలో ఒక చిన్న స్టేషన్ కనిపించింది. దాని పేరు ఒక చెక్క పలక మీద రాసివుంది. ఆ స్టేషన్ పేరు ‘సహనం.'”
ఆమె కళ్ళు కొద్దిగా విప్పారాయి. “అయితే ఇప్పుడు సగం దూరంలో ఉన్నానంటావ్? బాగుంది!”
దానికి సమాధానం ఏం చెప్పానో గుర్తులేదు. కానీ, ‘సహనం’ స్టేషను దగ్గర ట్రైను ఆగవలసినదానికంటే చాలా ఎక్కువ సేపే ఆగిపోయిందని మాత్రం గుర్తుంది. అప్పుడు, నేను నా పూర్వీకులయిన మీ సాయం అర్థించదలచుకున్నాను. మీరెవరో అప్పటికింకా నాకు తెలీదు, కానీ ఆమె కనుపాపల్లో ఇంతకుముందు ఇంకెవరో ఎందరో ఉండి ఇక్కడ మగ్గిపోతున్నారని మాత్రం నా మనస్సుకి కచ్చితంగా తెలుసు. ఆ కళ్ళలో ఎందరో కళ్ళు పెట్టి వారి ప్రతిబింబాలు చూసుకున్నారు… టూకీగా, గిన్నెలోని పులుసును అడుగునుంచి పైకి కలయబెట్టినట్టు, ఆమె గతాన్ని అడుగునుంచి రేకడం మొదలెట్టాను. నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి, ఇంతకుముందు ఇంకెవర్నో ప్రేమించి దానినుంచి బైటపడి, ఇంకా నిన్ను ప్రేమించడం మొదలెట్టకపోతే ఆ ‘ఇంకెవర్నో’ని రెచ్చగొట్టి, రెచ్చగొట్టి ఆమె తనను ప్రేమించడానికి అన్ని తోవలూ, మార్గాలు నీకు చూపించేలా.
ఆమె గతాన్ని ఎలా రేకెత్తాను అంటే–‘ఆడవాళ్ళు నాలాంటి వాడిని ప్రేమించరు. ఆ సంగతి నాకు తెలుసు. నువ్వు ఇంతకు ముందు ప్రేమించిన వాడో, వాళ్ళో నాలా మాత్రం ఖచ్చితంగా ఉండరు. కదా? అవునా కాదా? చెప్పవా, సర్లే…’ మొద్దు శ్రద్దతో యాంత్రికంగా ఒక పని చేసుకుపోయే పనివాడిలా, నేను ఇలా తవ్వుకుంటూ పోయాను. ఒకే ప్రశ్నని రకరకాలుగా తిప్పుతూ అడిగేవాడిని. మొదట్లో, వాటికి సమాధానం ఏం వచ్చేది కాదు, ఆపైన ఒకటి రెండు పదాలు మాత్రం. కానీ, ఆమె మనస్సు అడుగుపొరల్లోంచి ఏదో మరుగుతూ ఉడుకుతూ పైకి వచ్చి బుడగలల్లే బద్దలవుతూ ఉండేదని మాత్రం నాకు తెలుసు. మరింత ఉత్సాహంతో ఆమె గతాన్ని కెలికాను. ప్రేమ తాలూకు జ్ఞాపకాలని రేకెత్తించకుండా ప్రేమను రేకెత్తించలేమని నాకు తెలుసు. ఒకప్పటి ప్రేమ తాలుకూ జ్ఞాపకాలు, అంతరంగం లోపలి పొరల్లోంచి బయటకు వచ్చి, మళ్ళీ అవి చీకట్లోకి నెట్టెయ్యబడతాయి, కానీ వాటి తాలుకు అనుభూతి మాత్రం మనస్సులోనే నిలిచిపోతుంది. ఆమె కళ్ళు వాటంతట అవే తరుచుగా విప్పార్చుకుని నాకేసి ఆత్రంగా చూసేవి, నా ప్రశ్నలకి ఆర్ద్రంగా కదిలేవి. నేను ఎన్నోసార్లు పిస్టల్ మోత కోసం ఎదురుచూస్తున్న పరుగుపందెపు ఆటగాడిలా కళ్ళలోకి గెంతడానికి సిద్ధంగా ఉండేవాణ్ణి. కానీ నేను ఎవరికి ప్రతిబింబమో, ఆ అసలు మనిషి–అతని కళ్ళలోనేగా నేనప్పటికింకా ఉన్నది– తన జడ్డితనంతో ఎన్నో అవకాశాలు పోగొట్టాడు. ఎలాగైతేనేం, ఆ రోజు రానే వచ్చింది. అతను (మేము) వెళ్ళేసరికి ఆమె తన కిటికీదగ్గర కూర్చుని ఉంది; భుజాలమీద కప్పుకున్న శాలువా లోంచి ఆమె భుజాలు వణకడం తెలుస్తోంది.
“ఏమైంది? ఒంట్లో బాలేదా?”
“ఏం లేదులే, కాస్త జ్వరంగా ఉన్నట్టుంది, పట్టించుకోకు.”
కానీ, చిన్న చిన్న సేవలు చేసే మనిషికి పట్టించుకోకుండా ఉండే అవకాశం లేదు. నేను వెళ్ళిపోయాను. ఒక పావుగంట తర్వాత రమ్మని కబురు వచ్చింది.
పావుగంట తర్వాత, నేను దీక్షగా చేతి వాచిలో నిమిషాల ముల్లుకేసి చూస్తూండగా, సిల్క్ చేతి రెపరెపలు, థర్మామీటర్ తొడుగు తీసి మూసిన చప్పుడు వినిపించాయి.
“ఎంతుంది?”
“98.6”
ఇక్కడ, రాతిమొద్దు కూడా అవకతవకగా తప్పుచెయ్యలేదు. మేమిద్దరం ఆమెకి దగ్గరగా జరిగాం.
“నీకు తెలీదు, నన్ను చూడనీ.”
“అబ్బా, వదిలెద్దూ.”
“అలాకాదు. ముందు థర్మామీటర్ బాగా విదిలించాలి, అదీ అలా, ఆ తర్వాత…”
“ఏయ్!”
ఇప్పుడు వాళ్ళిద్దరి కళ్ళూ కలుసుకున్నాయి దగ్గరగా. ఆమె కనుపాపలు మంచుపొరలాంటి తడితో మెరుస్తున్నాయి (ఇది కచ్చితమైన ఋజువు). తయారుగానే ఉన్న నేను కొత్తింట్లోకి ఒక్క ఉదుటున గెంతాను. కాని, కళ్ళ మధ్య దూరం సరిగ్గా అంచనా వెయ్యకపోవడంతో అంచున వేలాడి, కాస్సేపు తుఫానులో చెట్టుకొమ్మలా, ఆమె కనురెప్పల వెంట్రుకను పట్టుకుని ఊగిసలాడి, నిలదొక్కుకున్నాను. ఏం చెయ్యాలో తెలుసు కాబట్టి, కొన్ని క్షణాల తర్వాత ఆమె కంటిపాపలోకి జారుకున్నాను తత్తరపాటుతో, ఊపిరి తీసుకుంటూ. నా వెనకాలే, మొదటి ముద్దు మెత్తని చప్పుడు వినిపించింది. దానివెనుకే థర్మామీటర్ నేలమీద పడి టింగుమంది. ఆమె కనురెప్పలు మూసుకున్నాయి. కాని, నా పని అయిపోయింది. నేను నా చోటుకి చేరుకున్నాను. కంటిపాపడి ఉద్యోగం ఎంత ప్రమాదకరమో ఆలోచించుకుంటూ కూర్చున్నాను. అది నిజమే అని తర్వాత తెలిసింది. నా అంచనాలను మించిన చీకటి, వ్యాకులత నన్ను కబళించబోతున్నాయి.
పదకొండు తన కథ చెప్పి, మౌనంగా, దిగులుగా కూర్చున్నాడు. పూర్వీకులందరూ తిరిగి వాళ్ళ ఊళపాట ఎత్తుకున్నారు. ముందు మెల్లగా మొదలైన పాట, కాస్సేపటికి బిగ్గరగా మారింది:
మగ-మగ-మగాడా, చిట్టోడా, పొట్టోడా, మా మంచి మరుగుజ్జు మగాడా
బతుకుతీపుంటే, దూకేముందు పాపల్నీ, కంటిపాపల్నీ అడగాలోయ్”
ఒకటీ-మూడూ-ఐదూ-ఏడూ…
“మరీ జంతువు!” అన్నాను ఆరుతో.
“బేసి కదా. వాళ్ళలానే ఉంటారు.”
నాకు అర్థం కాలేదు.”
“నువ్వు గమనించలేదా? ఇటుపక్క నేను ఆరు, నువ్వు పన్నెండు, నీకు అటుపక్క రెండు, నాలుగు. మనందరివీ సరిసంఖ్యలు. ఆ బేసి సంఖ్యగాళ్ళందరూ, కావాలని ఎంచుకున్నట్టుగా మొరటుగా బండగా ఉంటారు. మనలా నాగరీకంగా, నాజూకుగా ఉండరు.
“అదెలా?”
“ఎలా అంటావా? బహుశా మనిషి మనస్సుకి ఏదో ఆటుపోటుల్లాంటి లయ ఉంటుంది, లేదా కోరికలు మారిపోతుంటాయి. ఇదొకరకం డయలెక్టిక్ ఆఫ్ లవ్, అంటే గతితార్కిక ప్రేమతత్వం. సిద్ధాంత-ప్రతిసిద్ధాంతాలు మొరటు-నాజూకు మగవాళ్ళు. వాళ్ళ మధ్య పెండ్యులమ్‌లా ఊగిసలాడుతూ ఆమె మనసు. అందుకే ఆ మొరటు బేసివాళ్ళు. మనలాంటి నాజూకు సరిమనుషులు.” కన్నుగీటి, నవ్వుతూ అన్నాడతను.
నాకు నవ్వబుద్ధి కాలేదు. ఆరు కూడా నవ్వడం ఆపేశాడు. “అసలు సంగతి ఏంటంటే…” నాకు దగ్గరగా జరిగి, అతను చెప్పడం మొదలెట్టాడు, “మనం అంత తొందరపాటుగా నిర్ణయానికి రాకూడదు. ఉపన్యాసకుడి ధోరణికి శ్రోతలే కర్తలు. త్వరలోనే ఈ సంగతి నువ్వూ ఒప్పుకుంటావు. అదలా ఉంచు, పదకొండు నేర్పరి. అతని నిశితమైన పరికింపును నువ్వు కాదనలేవు. బలమైన అనుభూతులని మనం మామూలు మాటల్లో చెప్తాం. మనకు దగ్గరవారిని ముద్దుపేర్లతో, పొట్టిపేర్లతో పిలుస్తాం. మనకి చాలా ముఖ్యులైన వాళ్ళని మనం అలానే దగ్గరకి తీసుకుంటాం. స్లావిక్ భాషలో మిల్ అంటే డియర్ అని, మల్ అంటే చిన్న అని. దానితో గందరగోళం ఉండేది. ఏం, ప్రియుడిని చిట్టీ అని పిలిస్తే దాని అర్థం ఏమయ్యుండాలి? అంతే కాదు. పదకొండు మాదిరిగానే నేను కూడా స్త్రీలు నిజంగా ప్రేమించేది, వాళ్ళ కంటిపాపళ్ళమైన మనల్నే గానీ, ఎవరివల్ల మనం ఇలా కంటిపాపల్లోంచి పాపల్లోకి దూకుతున్నామో ఆ ఎనుబోతులను కాదు అనే నమ్ముతాను. పదకొండు అన్న ‘చిన్నచిన్న పనులు చేసిపెట్టడం’ అన్నది వెకిలిగా తీసుకోకపోతే, ఇక్కడ కూడా పదకొండు చెప్పింది నిజమే. ఎవరైనా నిన్ను ప్రేమించాలంటే వారికి ‘సంబంధించిన వస్తువు’లపై నీ ముద్ర, నీ అధికారం ఉండాలి. ఒకరకంగా ప్రేమ అనేది ఇంకేమో కాదు, ఒకే వస్తువుతో ఇద్దరి అనుబంధం అని…
“ఇదా మీరు చెప్…”
“విసుక్కోకుండా చెప్పేది విను.” నా చిరాకు చూసి, మళ్ళీ అన్నాడు, “ఆగు, కాస్త ఓపిక పట్టు. రెండు నిమిషాలు ఓర్చుకున్నావంటే, ఆ తర్వాత నీకే ఆసక్తి పుడుతుంది. ఒకే వస్తువును (వ్యక్తి, ఇమేజ్) పదే పదే చూస్తుంటే కలిగే అదే అదే స్పందన (ఎమోషన్) వల్ల ఆ వస్తువు ‘తనం’ ఒక ఊహగానో, ఆకృతిగానో నీ మనసులో ముద్ర వేస్తుంది. దాన్ని పరిభాషలో రెసెప్ట్ అంటారు. ప్రేమ అంటే ఏమిటి? ప్రియుడు అనే ఊహ, ఆకృతి (ఐడియా అండ్ ఇమేజ్) కలగలిసినది కాదు; ప్రియుడు అనే భావనతో జతపడిన ఆకృతి (కాన్సెప్ట్ అండ్ ఇమేజ్) కాదు; ప్రియుడు అనే ఒక వస్తువు (వ్యక్తి, ఇమేజ్) వల్ల కలిగే ఒక స్పందన. అయితే, వస్తువుతోనే జతపడి స్పందన కాదు, స్పందనతో జతపడి వస్తువు కూడా ఉంటుందని, ఈ అనుబంధం ఒకవైపునుంచి కాక రెండువైపుల నుంచీ ఉంటుందని సైకాలజిస్టులు గమనించలేకపోయారు, కాని, ఈ విషయం ప్రేమించేవారు గుర్తు పెట్టుకోవాలి. ఎప్పటిదాకా? ప్రేమ రెండువైపులనుండీ రాజుకునేదాకా. ఎప్పటిదాకా? అంటే… ఏం, అర్థం కాటల్లేదా? కాస్త ఆలోచించు. ఉదాహరణలైతే బోలెడు చెప్పగలను కాని నీ ఆలోచన నేను చెయ్యలేను కదా.
మొదటి కేసు: పుష్కిన్ రాసినట్టు ‘ఎవరో ఒకరి కోసం ఎదురుచూసే మనసు’ ఎ సోల్ వెయిటింగ్ ఫర్ సమ్‌వన్. మనసులో ప్రేమ తాలూకు ఉద్రేకం అయితే ఉంది కాని ప్రేమికుడి రూపం లేదు. అంటే స్పందనతో జతపడ్డ వస్తువు (వ్యక్తి) లేదు. దేనికీ గురిచూడకుండా గాల్లోకి పేల్చే తుపాకి ఇది. ఎప్పుడో ఒకరోజు ఆ ‘ఒకరు’ పోయి, ‘ఎవరో’ మాత్రమే మిగులుతుంది. అప్పుడు ఆ ‘ఒకరి’ జాగాను ఆక్రమించుకోవడం చాలా తేలిక.
రెండో కేసు: ‘ఎవరో’ ఉన్నారు కానీ వారిపట్ల ప్రేమ తాలూకు ఉద్రేకం లేదు. అంటే వస్తువు (వ్యక్తి) ఉంది కాని దానితో జతపడి స్పందన లేదు. అది పుట్టించడానికి అవసరమయ్యే ధాతువులు, పరిస్థితులు అన్నీ కావాలి. అది అంత సులభం కాదు. చాలా సమయం పడుతుంది, ఒక్కోసారి ఎప్పటికీ పుట్టకపోవచ్చు కూడా. చిన్న వయస్సులో ప్రేమలు మొదటి కేసు తరహావీ, వయస్సు వచ్చాక మొదలయ్యే ప్రేమలు రెండో తరహావీనూ.
కానీ, ఈ వస్తువు+స్పందన=ఉద్రేకం అన్న సూత్రం ప్రేమికులకి చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఈ ఉద్రేకం అనుక్షణమూ ఉంటే, ప్రేమించబడినవారు కనిపించిన ప్రతిసారీ–ఈ సూత్రం ప్రకారం– రెండవవారిలో ప్రేమను రగిలించాలి. అదే విధంగా కామోద్దీపన కలిగిన ప్రతిసారి ఒకే వస్తువు (ఒకే ప్రియుడి/ప్రియురాలి రూపం) మదిలో మెదలాలి. కాని ఇది వాస్తవంలో ఇలా జరగదు. వాస్తవంలో ప్రేమ, సాధారణంగా ఒకవేపు నుంచే ఉంటుంది. తీగలోని ఎలక్ట్రిక్ కరెంట్‌లా అది ఒకే వైపు ప్రయాణిస్తుంది. ఇలాంటి వన్-వే ట్రాఫిక్ ఒకవైపు ప్రేమలే మొదటి తరహా ప్రేమలో. కరెంట్ వస్తువు నుండి స్పందనకు ప్రయాణిస్తుంది తప్ప ఇటునుండి అటు కాదు. ఇందులో స్పందన కలిగించే ఉద్రేకం ముఖ్యం కాబట్టి ఇమేజ్, అంటే వస్తువు రూపం మారిపోతూండవచ్చు. ఇలాంటి ప్రియురాలిలో ఉద్రేకం ఎప్పుడూ చాలా ఉంటుంది విధేయత ఉండదు. ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది కాని ప్రియులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. ఈ వన్-వే రెసెప్ట్: ఒకే విధమయిన స్పందన-ఎన్నో వస్తువులు.
ఎందుకా? ఓ మై గాడ్! బుర్రలోకి ఏదీ పోతున్నట్టు లేదు. సరే, కరెంట్ కాకపోతే గుండెనుండి జరిగే రక్తప్రసరణ తీసుకో. గుండె లోంచి కవాటం గుండా రక్తం బైటకు ప్రవహిస్తుంది కానీ తిరిగి లోపలికి రాలేదు, రక్తం తిరిగి లోపలికి రాకుండా గుండె కవాటం ఒకే వైపుకు తెరుచుకుంటుంది కాబట్టి. మొదటి తరహా ప్రేమ కూడా అంతే. రక్తానికి కవాటం తెరచుకొని బైటకు ప్రవహించడానికి ఉద్దీపన కావాలి. అది వస్తువును చూడడం వల్ల వస్తుంది కాని వస్తువు ‘తనం’వల్ల రాదు. అందువల్ల వస్తువు రూపం ఎదురుగా ఉన్నంత సేపే ఉద్రేకం పొంగిపొరలుతుంది. అందువల్ల ఈ తరహా ప్రేమ, ప్రియతముల సమక్షంలో ఉన్నంతవరకే ఉంటుంది. వారు లేనప్పుడు ఆ స్పందనకు వస్తువు ఏదో, దాన్ని ఎలా చేరుకోవాలో తెలియదు.
ఆ ఆవలింత విసుగా? అలసటా? సరే. ఏదేమైనా, రెండో తరహా ప్రేమలో, అవిధేయత ఉండదు కానీ, ప్రేమోద్రేకమూ పెద్దగా ఉండదు. స్పందన కలుగుతున్న సమయంలో వస్తువు (వ్యక్తి, ఇమేజ్) సమక్షంలోకి వచ్చినప్పుడు ఉద్రేకం పుడుతుంది. కానీ అలాకాక వస్తువే మొదట సమక్షంలోకి వస్తే అది స్పందన కలిగించదు. అది ప్రేమానుభూతిని తనతో పాటు తీసుకురాదు. ఆ వస్తువుతో జతపడిన వేరే ఏ భావావేశమయినా తనతో తీసుకురావచ్చు. ఇలాంటి వన్-వే ప్రేమ రోజువారీ జీవితాలకి బాగా నప్పుతుంది. ఇది సంసారపక్షం ప్రేమ, ఇందులో ఉద్రేకం తక్కువ. ఈ వన్-వే రెసెప్ట్: ఒకే వస్తువు-ఎన్నో విధాలయిన స్పందనలు.
ఈ రెండూ కాక మూడో తరహా- రెండువైపులనుండి పారే ప్రేమ; వస్తుస్పందనల విడదీయరాని బంధం; ఎ ట్రూ టూ-వే రెసెప్ట్; ఒకే వస్తువు-ఒకే స్పందన. వెల్, నా ఉద్దేశంలో అదే నిజమైన ప్రేమ. నువ్వేమైనా అను పదకొండుకి ప్రేమ గురించిన ఈ సత్యం తెలుసు, కానీ దాన్ని ఎలా పొందాలో తెలియదు. అదే, నా విషయంలో…”
“ఇప్పుడెందుకు అదంతా తోడుకోవడం?” అన్నాను చిరాగ్గా.
ఆరు కొద్దినిమిషాల పాటు తెగిపోయిన ఆలోచనలన్నిటినీ మళ్ళీ వెతుక్కుంటూ ముడివేసుకుంటున్నవాడికి మల్లే మౌనంగా ఉండిపోయాడు.
“ఎందుకంటే, పదకొండు ఎక్కడివరకూ వచ్చి ఆగిపోయాడో, అదే మౌలికమైన, ప్రధానమైన ప్రశ్న, ముఖ్యంగా మనలాంటివాళ్ళకి–ఇదిగో ఇలా ఈ కనుపాపల చీకటి గొయ్యిలో బందీలైపోయినవాళ్ళకి… ఎందుకింకా మనల్ని మనం మోసం చేసుకోవడం? మనందరం వర్ణించలేని నిర్వర్ణులమైతున్నాం. కాలం మనను పెన్సిల్ గీతలా చెరిపివేస్తోంది; చెరువులోని అలలలా మనం మాయమైపోతున్నాం. నేను క్రమక్రమంగా క్షీణించిపోయి ఈ చీకటిలో కలిసిపోతున్నాను. నా ఆలోచనలలోని స్తరాలని నేను విడదీసుకోలేకపోతున్నాను. త్వరలోనే రూపు, రేఖ లేకుండా అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయి శూన్యమైపోతాను. కానీ, అసలు బాధేమిటంటే నాతో పాటు ఎన్నో సైంటిఫిక్ సిద్ధాంతాలు, ప్రయోగాలు, పరిశీలనలు ఇవన్నీ కూడా ఈ చీకటిలో కలిసిపోతాయి. ఇక్కడనుండి బయటపడగలిగితే ఆ ఫ్రాయిడ్లకు, ఆడ్లర్లకు, మాయర్లకు విస్మృతి అంటే, ఇలా పూర్తిగా మరిచిపోబడిన స్థితి, అంటే ఏంటో నేర్పించేవాణ్ణి. మాట పొరపాట్లు, రాత పొరపాట్ల వంటి వాటినుంచి ఏవేవో సిద్ధాంతాలల్లే ఆ గర్విష్ఠులకు విస్మృతి అనే ఈ చీకటి గుహ, అస్తిత్వం అనేది లేని ఈ స్థితి లోంచి వచ్చిన మనిషి ముందు నోరు పెగులుతుందా? పెగిలితే వినాలనే కుతూహలం ఉంది కానీ అవకాశం లేదు. శవపేటికలో మనిషి లేచి రాగలడేమో గానీ, ఇక్కడనుండి బయటపడే మార్గం లేదు.
నీకు తెలుసా, నాకు యుక్తవయసు వచ్చినప్పటినుండి అస్తిత్వనాశనం, అజ్ఞాత, విస్మృత స్థితుల గురించిన అన్వేషణలోనే పూర్తిగా ముణిగిపోయాను. మొదటిసారి, ఏదో కవిత్వం చదువుతుంటే హఠాత్తుగా ఎదురయింది:
పక్షులగుంపూ ఎగిరిపోయింది
పెంధూళి మేఘమూ ఒరిగిపోయింది
పొద్దుకూడా కుంకింది
నన్ను విస్మృతుడిని చేయాలంటే
ఇప్పుడే, ఈ క్షణమే నీకు సరైన సమయం
ఈ నాలుగు వాక్యాల గురించి ఆలోచిస్తూ, ఈ ఆలోచనలో దిగబడిపోయిన నేను ఇక ఎప్పుడూ బైటకి రాలేనని గుర్తించలేదు. రెసెప్ట్‌స్ అనేవి వ్యక్తావ్యక్త చేతనల మధ్య నిరంతరం పయనిస్తుంటాయని నా ప్రతిపాదన. అయితే కొన్నిసార్లు అవ్యక్తచేతన (అన్‌కాన్షస్) లోలోపలికి వెళ్ళిన రెసెప్ట్‌స్ కొన్ని తిరిగి వ్యక్తం కాలేవు. కాన్షస్‌నెస్ లోకి రాలేవు. ఒక రిసెప్ట్ ఎలా నశిస్తుంది? అనే ప్రశ్న నన్ను వెంటాడటం మొదలెట్టింది. నిప్పు కణికలా నివురుగప్పుతూ క్రమక్రమంగానా, గాలిలో దీపం ఆరిపోయినట్టు ఉఫ్ఫుమని ఒక్కసారా? ఉన్నట్టుండా, తీసుకొని తీసుకొనా? మొదట్లో నేనూ కవితో ఏకీభవించాను: మరచిపోబడడం ఎప్పుడో మొదలవుతుంది, కానీ చివరికి తృటిలో అంతా అయిపోతుంది. జర్మన్ మానసిక శాస్త్రజ్ఞుడు ఎబ్బింగ్‌హౌస్ కనిపెట్టిన నెమోనిక్ సీరీస్ ఆధారంగా ఒక్కో రిసెప్ట్ ఎప్పుడు అంతమవుతుందో లెక్కలు కూడా కట్టాను. కానీ, నా చూపు మరిచిపోయిన అనుభూతుల వైపు మళ్ళింది. ఇది ఆసక్తికరమైన ప్రశ్న. ఒక మగవాడు ఆడది n సార్లు కలుస్తారు. కలిసిన ప్రతిసారీ వారిలో ఆ ప్రేమోద్రేకం, ఒక నెర్వస్ ఎక్సైట్‌మెంట్, ఉంటుంది. కానీ n+1సారి కలిసినప్పుడు ఆ ప్రేమోద్రేకం కనపడదు. అతడు శాయశక్తులా నటిస్తాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత తన మనస్సునంతా చిందరవందర చేసి గాలిస్తాడు. నిష్ప్రయోజనం. పోయిన వస్తువును (వ్యక్తి, ఇమేజ్) తిరిగి వెతుక్కోవచ్చు, కానీ పోయిన స్పందనని (ఎమోషన్) తిరిగి సృష్టించలేం, అది అసంభవం. ఊసరవెల్లి తోకని నీ చేతిలో వదిలేసి పారిపోయింది. వస్తువుకూ స్పందనకూ ఉన్న బంధం తెగిపోయింది.
ఈ చల్లారిపోయిన ఉద్రేకం, ప్రేమను అభావంగా చేస్తుంది. కొన్ని పోలికలు చూడు. వేడి చేసిన గంధకాన్ని చల్లబరిస్తే ఏమవుతుంది? దాని రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. భాస్వరం స్ఫటికాలను వేడిచేసి, క్రమంగా దశలవారిగా చల్లార్చినప్పుడు, ఊదారంగు నుంచి ఎరుపుకు ఎరుపు నుంచి నలుపుకు మారుతుంది. కేవలం రంగు మాత్రమే కాదు, ఒక స్థితిలో అది దాని స్ఫటికాకృతిని కూడా పోగొట్టుకుంటుంది, తన నిర్దిష్టమైన రూపాన్ని పూర్తిగా పోగొట్టుకొని నిరాకారమైన పొడిగా మిగిలిపోతుంది. ఈ చల్లారే దశలలో ఏ దశలో స్ఫటికం తన ఆకృతిని పోగొట్టుకుంటున్నదో తెలుసుకోగలితే, ధగధగలాడే వజ్రం ఏ క్షణంలో, నల్లటి బొగ్గుముక్కగా మారి మనచేతికి మసిగా అంటుతుందో తెలుసుకోగలిగిన మనం, ఏ క్షణంలో ఒకరిపట్ల ‘నా ప్రేమ’ అన్నది మారిపోతుందో తెలుసుకోలేకపోతున్నాం?
ఇది అంత సులభం కాదు. రసాయన శాస్త్రపు పరిధుల్లోంచే మన చర్చ కొనసాగిద్దాం. స్ఫటికం రూపాంతరం చెంది పొడిగా మారటానికి ముందు అధిస్థిరత్వపు స్థితిలో, మెటాస్టేబుల్ స్టేట్ అంటాం, ఉంటుంది. అంటే, రూపుకి-విరూపానికి మధ్య సాగే డోలాయమానమైన స్థితి. ఈ ప్రతీక సరిపోతుంది మనకి. మనుషుల మధ్య ప్రేమలు చాలావరకూ ఈ అధిస్థిరత్వపు స్థితిలో ఉంటాయి. మంచుగడ్డకు-మరిగేనీటికి మధ్యలో ఎక్కడో. తమాషా ఏమిటంటే ఈ రెండు చివరల కన్నా మధ్యలో ఉండే ఈ డోలాయమాన స్థితి బలమైనది. ఒకపట్టాన వీగిపోనిది. వేడిగా ఉన్న పదార్థం ఏదైనా, దానంతట దాన్ని మనం ఒదిలిపెడితే, సహజంగా, నిరంతరాయంగా చల్లబడుతూ వస్తుంది. స్పందన కూడా అలాంటిదే. దాన్ని భగభగమండే మంటగానే ఉంచాలంటే దానిలోకి ఎప్పుడూ కొత్త ఇంధనం వేస్తూ ఉండాలి.
ఇక్కడిదాకా వచ్చేసరికి ఈ పోలికలు నా ఆలోచనకు అడ్డంపడ్డాయి. ఏ పరిస్థితుల్లో సహజంగా చల్లబడడం అనే ప్రక్రియ, స్ఫటికాన్ని పొడిగా, వజ్రాన్ని బొగ్గుగా, రూపాన్ని నిరూపంగా, ప్రేమను అభావంగా చేస్తున్నదో సైన్స్ నాకు చెప్తోంది. అయితే చల్లబడడం అనేది వేగవంతంగా జరిగినప్పుడు, స్ఫటికాల రూపం మారిపోతుంది కాని, అవి తిరిగి వేరే రకమైన స్ఫటికాలుగా రూపాంతరం చెందేంత సమయం ఉండదు. నిరూపమైన పొడి అణువులు స్ఫటికాలుగా మళ్ళీ మారుతూ, చల్లదనం వల్ల ఆగిపోతాయి; అటు స్ఫటికమూ, ఇటు పొడీ కాని సాదృశ ఆకృతులుగా మిగిలిపోతాయి. ఫలితం: స్పష్టమైన ఆకృతి అంటూ ఏమీ లేని ఒక గడ్డకట్టిన రూపం. స్ఫటికం రెండు వస్తువుల మధ్య ఉన్న బలమైన ఆకర్షణ, నిరూపం రెండు మనసులు ఒకరినొకరు ద్వేషించుకొనే భావన. డోలాయమానమైన స్థితి.
ఈ పరిస్థితులలో, ఎంతోకాలం ప్రేమ నిలిచి ఉండాలంటే ఒకటే మార్గం: ఒకరినొకరు నిరవధికంగా వంచించుకుంటుండాలి, తప్పదు. ఏమిటా చూపు? అది అదే మరి! ఒక వ్యక్తి వస్తువును (తన ప్రేయసి) తన గుండెల్లో తాపడం చేసుకొని ఎప్పటికీ విధేయంగా ఉన్నా ఆ వస్తువు అనుబంధ స్పందన ఎంతోకాలం ఉండదు. వస్తువు (వ్యక్తి, ఇమేజ్) మారిపోతూ ఉంటుంది. ఈరోజు నీ ఇమేజ్‌ను ప్రేమించాలి అంటే నిన్నటి నీ ఇమేజ్‌ను మోసంచేయాలి. తప్పదు. నేనే గనక రచయిత అయ్యింటే, ఇది కథగా రాసేవాణ్ణి: నా హీరో ఒక అమ్మాయిని కలుస్తాడు. అమ్మాయి భలే చురుకైనది, పదహారేళ్ళ ప్రాయపుది. సరే, ప్రేమలో పడతారు. పెళ్ళవుతుంది, పిల్లలు పుడతారు. కాలచక్రం గిర్రున తిరుగుతుంది. వాళ్ళ అనుబంధం సడలిపోకుండా ఉంది ఇప్పటికీ. ఇప్పుడు అతనికి ఉబ్బసం; ఆమెకు కీళ్ళవాతం, ముడుతలు పడిపోయిన చర్మం. కానీ ఒకరితో ఒకరు ప్రేమగానే ఉంటారు. ఒకరోజు, వీధి తలుపు తెరుచుకుని ఆమె వస్తుంది. ఆమే కాని ఆమె కాదు. నిన్నటిదో, పోయినేటిదో కాదు. జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటానని నా హీరో మాటిచ్చిన ఆ పదహారేళ్ళ అమ్మాయి. నా హీరో బహుశా, ఆశ్చర్యపోతాడు, నిశ్చేష్టుడవుతాడు. ఆ వచ్చిన అమ్మాయి, ఈ మధ్యవయస్సు జీవితం వైపు భయంతో చూస్తుంది. అప్పటికి తనకి పుట్టని పిల్లలని చూస్తుంది. నా హీరో, ఆ రెండో తలుపు వైపు చూస్తాడు, ఇప్పుడు ఆమె ఈ గదిలోకి వస్తే ఏం అవుతుందోనని. ‘నిన్న నాకు నువ్వు మాటిచ్చావ్’ అంటుంది ఆ అమ్మాయి. ‘నిన్న? అది ఇరవై యేళ్ళనాటి మాట కదా’ అనుకుంటాడు ఉబ్బస రోగి తలగీక్కుంటూ. ఇంతలో అడుగుల చప్పుడు. ఇప్పటి ఆమె, ఎదురుగా ఉన్న అప్పటి ఈమె.
‘నువ్వెళ్ళిపో, తనకు నువ్వు ఇక్కడ కనిపిస్తే…’
‘ఎవరికి?’
‘నీకే, తొందరగా వెళ్ళిపో…’
కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆ రెండవగది తలుపు తెరుచుకుంది, మన హీరో, వెల్… నిద్రలోంచి లేస్తాడు.”
“అయ్యా ఆరూ, ఇదేమైనా న్యాయంగా ఉందా? సైకాలజీ నుండి కెమిస్ట్రీకీ, కెమిస్ట్రీ నుండి ఫిక్షనుకీ దూకించావు. ఇక ఇక్కడ నుండి మళ్ళీ నీ స్ఫటికాలకు, భాస్వరానికి, గంధకానికి తీసికెళతావా!”
“వెళతాగా. ముందు ఇది విను. నువ్వు ‘అ’ను ప్రేమించావు, కానీ మర్నాటికి ఆ ‘అ’, ‘అ1’ ఆ మర్నాటికి ‘అ2’గా ఇలా ప్రతీక్షణం ఒక కొత్త స్ఫటికంగా మారుతున్న వ్యక్తిని ప్రేమిస్తూ ఉండాలంటే, నువ్వు కూడా ఆ వ్యక్తి తాలూకూ రూపాన్ని మార్చుకుంటూ ఉండాలి, నీ స్పందనను (ఎమోషన్) ఈ సరికొత్త ఇమేజ్ వైపుకి మళ్ళించుకుంటూ ఉండాలి. ‘అ2’ కోసం ‘అ1’ని, ‘అ1’ కోసం ‘అ’ని వంచిస్తూ ఉండాలి. ఇమేజ్ మారుతున్నంత వేగంగా ఈ వంచనలు జరుగుతున్నంతసేపు ప్రేమ శాశ్వతంగా, నిత్యనూతనంగా ఉంటుంది. వంద అడుగులు నడిచిన మనిషికి, ప్రతి అడుగుకీ తన శరీరం పడిపోబోయిందని, అలా పడకుండా సరైన సమయానికి అతని కండరాలు ఆపి నిలబెట్టాయని తెలియకుండానే నడిచినట్టు – వారాలు, ఏళ్ళతరబడి ప్రేమలో ఉన్నవారు వారి కలయికల సంఖ్య వారి వంచనల సంఖ్యకు సమానం అని తెలుసుకోలేరు.”
పేరుమోసిన వక్త తన ఉపన్యాసం తర్వాత గర్వంగా చప్పట్లకోసం ఎదురుచూస్తున్న సంతృప్తి ఆరు మొహంలో. కానీ, ఇంత బరువైన ఉపన్యాసంతో నా బుర్ర నిద్రపోయింది. అతను ఒక నిమిషం పాటు మౌనంగా ఉండి, మళ్ళీ తన ధోరణి మొదలెట్టాడు: కలయికల వేగం ఎక్కువైతే, వంచనల వేగం ఎక్కువైతే… ఇక నా వల్లకాలేదు, కళ్ళు బరువెక్కిపోయి, మంచి నిద్రలోకి జారుకున్నాను. నిద్రలో కూడా కెమికల్ సూత్రాలు, ఆల్జీబ్రా ఈక్వేషన్లు కందిరీగల్లా రొదపెట్టాయి. ఎంతసేపు పడుకున్నానో తెలియదు. నన్ను ఎవరెవరో తట్టిలేపుతున్నట్టు అనిపించింది.
“పన్నెండూ, ఇక్కడకు రా!”
“కొత్త అబ్బాయి కథ విందాం”
“పన్నెండూ రావాలి! రావాలి!”
ఇక తప్పలేదు. నాకు ఇరుపక్కలనుండీ వాళ్ళంతా నెడుతూ ఉంటే, మధ్యలో పచ్చగా వెలుగుతున్న ముద్ద మీదకి ఎక్కాను. పది జతల కళ్ళు, చీకట్లోంచి నావైపే సారించి ఉన్నాయి- ఇద్దరి మధ్య రహస్యాన్ని వినడానికి ఆత్రుతగా, సిద్ధంగా. నా కథ నేను చెప్పాను, నీకు తెలిసినదేగా. నేను పూర్తిచేశాక, వాళ్ళందరూ ఆ ఊళపాట ఎత్తుకున్నారు మళ్ళీ. ఈ సారి నాకు కణతలు కంపించాయి. తలనాదుగా అనిపించింది. నేను కూడా, ఇటూ అటూ ఊగూతూ వాళ్ళతో పాటు పాడటం మెదలెట్టాను:
కంటిపాపల్లో
కంబాలు, కంబాలు,
ఉరికంబాలున్నాయోయ్.
నీకు నువ్వే తగిలించుకో
ఉరితాడు బిగించుకు పో, చచ్చిపో.
నిట్టూర్చి నిప్పై రగిలిపో, రగిలిపో
బూడిదవై రాలిపో, ఆరిపో
సరి సరి రెండు-నాలు-గారె-నిమిది.
పాట అయ్యాక, నన్ను వదిలేశారు. చీకటి నీడల్లోకి వచ్చి కూలబడ్డాను. నేను కంపరంతో వణికిపోతున్నాను, పళ్ళు టకటకమని కొట్టుకుంటున్నాయి. నాపైన నాకు ఎప్పుడూ లేనంత అసహ్యం వేసింది. నావైపు సానుభూతిగా చూస్తూ ఆరు, “మర్చిపో, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. నీ కథ నువ్వు చెప్పావు. అంతటితో సరి. నువ్వు మాత్రం ముక్కలైపోయినట్టున్నావు. ” అన్నాడు నా భుజం నొక్కి.
“ఆరూ, ఒక్క సంగతి నాకు చెప్పు. నేను, మిగిలిన వాళ్ళు ఇక్కడకి రావడంలో అర్థం ఉంది. కానీ, నీకు ప్రేమ అవసరం ఏముంది? ఈ కంటిపాప నూతిలోకి నువ్వెలా వచ్చిపడ్డావు? నీకున్నది ఒక పుస్తకప్రియుడి హృదయం. నీకు కావాల్సిందల్లా పుస్తకాలు, బుక్-మార్కులు. వాటితోనే బతక్కుండా హాయిగా, ఇక్కడ, నీ అవసరం లేని చోట…”
యూనివర్సిటీ ప్రొఫెసర్ మొహంలో ఒక్కసారిగా చెప్పలేనంత దిగులు.
“ఎవరికైనా అవ్వచ్చు కదా? జామెట్రీనీ, ఆస్ట్రానమీని కనిపెట్టిన థేల్స్ అంతటివాడే పైకి చూస్తూ నడుస్తూ బావిలో పడిపోయాడట. నేనూ అలానే. నేను కావాలని ఏం చెయ్యలేదు. కానీ, ఎవరైనా వాళ్ళ కనుపాపలలోకి నిన్ను కావాలని పడేస్తే ఏం చెయ్యగలం? అప్పట్లో నేను వుమెన్స్ కాలేజీలో సైకాలజీ ప్రొఫెసర్‌గా పని చేసేవాడిని. సెమినార్లు, ట్యుటోరియల్స్, పేపర్స్, ఇదే నా జీవితం. సహజంగానే నా స్టూడెంట్లు నా దగ్గరకి–ఒక్కోసారి ఇంటికి కూడా–రిఫరెన్స్‌ల కోసం, అనుమానాలు తీర్చుకోవడం కోసం వచ్చేవారు. తను కూడా ఒకటి రెండు సార్లు వచ్చింది. ఈమె అంత చురుకైన విద్యార్థేం కాదు. అప్పుడు నేను స్టూడెంట్లకు అతి కష్టమైన స్టిమ్యులస్ లాగరిథమ్స్‌లో వెబర్-ఫెక్నర్ సూత్రం బోధిస్తున్నాను. ఒక అనుభూతి తీవ్రత, దాని ప్రేరేపకపు తీవ్రతకు అనులోమనిష్పత్తిలో… తను వినటం లేదని గమనించాను. ‘నేనేం చెప్పానో ఒకసారి చెప్పు’ అన్నాను. తను తల దించుకొని దేనినో చూస్తూ నవ్వుతోంది. కోపం ఆపుకోలేక, పుస్తకం టేబుల్ మీద విసిరేసి గట్టిగా అరిచాను: ‘అసలెందుకు నువ్వొచ్చింది?’
తను తలెత్తి చూసింది. కన్నీళ్ళు. అలాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తారో, చేయాలో నాకు తెలియదు. ఆమె దగ్గరకి వెళ్ళి మంచుపొర లాంటి తడి నిండిన ఆ కళ్ళల్లోకి చూడడమనే తప్పు చేశాను…”
భారంగా నిట్టూర్చి మౌనంగా ఉండిపోయాడు ఆరు.
మళ్ళీ పచ్చటి బురదలాంటి గోడలు చుట్టూ మూసుకుపోయాయి. ఉబ్బెత్తుగా ఉన్న ఆ పచ్చటి గోడలు చూస్తూ, ఇక నా బతుకింతేనా, ఈ ఊబిలాంటి గుహలో మగ్గిపోవాల్సిందేనా, వర్తమానం ఇక నాకెప్పుడూ ఒక కలేనా అని తెగని ఆలోచనలతో సతమవుతున్నాను.
కథ చెప్పడానికి ఇప్పుడు ఒకటి వంతు వచ్చినట్టుంది. పచ్చటి ముద్ద మీద నల్లగా ఒకటి. అతని పక్కనే ఇదిగో ఈ నల్లపుస్తకం. (క్వాగ్గా ఎప్పుడూ ఆ పుస్తకంతోటే ఉంటాడు).
“ఒకే ఒక్క విశిష్ట లక్షణం ఆధారంగా” అంటూ మొదలెట్టాడు ఒకటి. “మనం స్త్రీలను నాలుగురకాలుగా విభజించవచ్చు. మొదటి రకం స్త్రీలు, ప్రియులకి తమ దుస్తులు విప్పి, తిరిగి తొడగడానికి అనుమతిస్తారు; ప్రేమికులని బానిసలగా చేసి, ఒక పట్టాన రాని గుండీలు, నాడాల ముళ్ళు తీయడం లాంటి ఊడిగం చేయించుకోవడంలో ఆరితేరిన కళావతులు, సాటిలేని జాణలు వీళ్ళు. మూసిన కంటితోనే, ప్రేమికులకు వెళ్ళమని ద్వారం చూపిస్తారు. రెండో రకం స్త్రీలు, వివస్త్రను చేయడం వరకే ప్రేమికుడికి అప్పజెప్పి, వాళ్ళ దుస్తులు తిరిగి వాళ్ళే తొడుక్కుంటారు. ఆ పెద్దమనిషి కిటికీలోంచి చూడటమో, సిగరెట్టు కాల్చుకోవడమో చేస్తాడు. మూడోరకం స్త్రీలు, అందరికంటే ప్రమాదకరమైన వాళ్ళు. ప్రేమికుడిని వాళ్ళ గుండీలు, నాడాల వైపుకు నడిపిస్తారు, ఆపైన వారి ప్రతీ సింగారింపులోనూ భాగం చేస్తారు. రెండర్థాల మాటలతో, కవ్వింపు చేష్టలతో రెచ్చగొట్టే ప్రమాదవతులు వీళ్ళు. ఒక్కమాటలో చెప్పాలంటే శృంగారానికి ఆహ్వానపత్రికలు. ఇక ఆఖరుగా నాలుగో రకం, వాళ్ళ దుస్తులు విడవడం, తిరిగి తొడుక్కోడం వాళ్ళే చేస్తారు. వేశ్యలు, కొత్తమోజు తీరిపోయిన భార్యలు, ఇంకా ఎవరెవరో ఎవరికి తెలుసు? ప్రియమైన వారసులారా, ఇప్పుడు చెప్పండి, మన కంటి యజమాని ఇందులో ఏ వర్గానికి చెందినది?”
వెంటనే అన్ని గొంతులూ ఒక్కసారిగా అరవడం: “మొదటి రకం.”, “కాదు, కాదు, రెండు.” “తప్పు, మూడు.”
అన్ని గొంతులనీ అణుస్తూ, బిగ్గరగా అరిచారెవారో “అన్నిటికన్నా ఆఖరిది.”
నల్లటి ఒకటి సడిలేకుండా నవ్వింది.
“తెలుసు, నాకు తెలుసు. ఈ విషయంలో అభిప్రాయబేధాలు సహజం. ఈ పుస్తకానికి చాలా మందిని గురించి చాలానే తెలుసు. ఇంకా చాలా ఖాళీ పేజీలు ఉన్నాయనుకోండి, ఇంకా మనవారు అందరూ ఇక్కడ లేరు కూడానూ. కానీ, ఇవ్వాళో రేపో ఆ ఖాళీ పేజీలన్నీ నిండిపోతాయి, ఏదో ఒకనాటికి మన యజమాని కళ్ళు పొడిబారతాయి, మాయ చేసి ముగ్గులోకి లాగే నైపుణ్యాన్ని కోల్పోతాయి. అదిగో అప్పుడు, ఆఖరి పేజీ కూడా నిండిపోయాక, ‘కంప్లీట్ అండ్ సిస్టమాటిక్ హిస్టరీ ఆఫ్ వన్ ఎన్‌చాన్ట్రెస్’ అనే గ్రంథాన్ని, ఇండెక్స్‌తో సహా నేను పూర్తి చేస్తాను. నేను చెప్పిన వర్గాలు ఒక నమూనా మాత్రమే, ఆరు భాషలో చెప్పాలంటే, జస్ట్ ఫర్ మెథడలాజికల్ పర్పసెస్. ఒక రకం నుంచి ఇంకో రకానికి మధ్య వెడల్పాటి ద్వారాలున్నాయి. మన ప్రేయసి అన్ని రకాలలోనుండీ నడవడం పెద్ద ఆశ్చర్యమేం కాదు.
“మీకందరికీ తెలుసు కదా, నేను మెదటివాడిని. ఎప్పుడంటే… ఎప్పుడైతేనేంలే, గడిచిపోయిందనేదే ముఖ్యం. ఒక సాహిత్య సమావేశంలో పరిచయం అయ్యింది. ‘ఆమె దూరం నుంచి వచ్చింది, ఈ వాతావరణం కొత్త. కాస్త కనికరంతో మెలగండి.’ నాగరికంగా లేని ఆమె దుస్తులు తన సుకుమారాన్ని దాచాయి. ఆమెతో కళ్ళు కలపబోయాను. కాని, ప్రతిసారీ ఆమె రెప్పలు రెపరెపలాడి, పక్కకు తిరిగిపోయాయి.
“తర్వాత టీ తాగడానికి ఒకచోట చేరాం. ఒక వక్త ఏదో ప్రసంగం ఇచ్చాడు, రాసుకున్న పేజీలన్నీ కలగాపులగం చేసుకోవడంతో, అదొక తలనొప్పిగా మారింది. ఆ సమావేశపు పెద్ద, ఈ పల్లెనుంచి వచ్చిన అమ్మాయిని ఇంటిదాకా దింపమని అడిగాడు. ‘తను ఒంటరిగా వచ్చింది, ఇప్పటికే చాలా లేటైపోయింది, దారి తప్పితే కష్టం’ అంటూ. ఆమె కాలర్, గుండీ ఊడిపోయి వదులుగా ఉందని నాకిప్పటికీ గుర్తు.
“బయటకి వచ్చాం. హోరున కుండపోతగా వాన. గుర్రపు బగ్గీకోసం కేకేశాను. రాళ్ళలా కొడుతున్న వర్షంలోంచి నడుచుకుంటూ, బగ్గీలో ఎక్కాం. ఆమె ఏదో గొణిగింది కానీ, ఇటుకరాళ్ళ దారిమీది బండి చక్రాల శబ్దంలో వినిపించలేదు. మలుపు మలుపులోనూ కుదుపులు, అదను చూసుకుని ఆమె మోచేతి దగ్గర పట్టుకున్నాను. ఆమె చేయి గుంజుకోబోయింది కాని కుదరలేదు. బగ్గీ కుదుపులకి, ఇద్దరం ఒకళ్ళొనొకళ్ళం తగులుకుంటున్నాం. ఇక్కడే ఎక్కడో చీకట్లో ఆమె పెదాలున్నాయి. ఎక్కడో వెతికిచూద్దామనిపించింది. నేను ఆమె వైపు ఒంగాను. ఊహించని విధంగా ఆమె ఒక్క ఉదుటులో, బగ్గీ పరదా తీసి తెరిచి బయటకి గెంతేసింది. నవలల్లో ఇలాంటి సాహసం చదివినట్టు గుర్తు. కానీ, వాటిల్లో ఇది మగవాళ్ళు చేసే సాహసం. అందులో కుండపోత వర్షం సంగతి ఉన్నట్టు లేదు. నాకు కాసేపు ఏం చేయాలో తోచలేదు. ఆమె ఖాళీచేసిన ఒంటరి జాగాలో కొన్ని క్షణాలు; బగ్గీ నడిపే అతన్ని ఆపమని చెప్పడానికి మరికొన్ని క్షణాలు; బగ్గీలోంచి నేను ఉరకడం చూసి అతను నేను డబ్బు ఎగ్గొడతానేమో అని అరవడం, అతనికి డబ్బు ఇచ్చేసరికి, మరికొన్ని క్షణాలు; వృథా అయ్యాయి. తడిగా ఉన్న వీధి గుండా వెనక్కి వడివడిగా ఆమె కోసం వెతుకుతూ నడుస్తున్నాను, వీధిదీపాలు లేని ఆ చీకటిలో ఆమె ఆకారాన్ని గుర్తుపట్టడానికి ప్రయత్నం చేస్తూ. ఒక కూడలి దగ్గర ఆమే అనుకున్నాను. కాదు, ఎవరో వేశ్య, నోట్లో సిగరెట్‌తో: ‘వస్తావా?’ సైగచేసింది. వినిపించుకోకుండా వెళ్ళాను, మరోవీధి, మరో గందరగోళం. చివరికి ఒక వీధిలో కనిపించింది. వణుకుతూ, వానలో తడిసిపోయి. ఎటుపోవాలో తెలియక అక్కడ నిల్చుని ఉంది. మా సంభాషణ మీరు ఎన్నోసార్లు ఇప్పటికే విన్నారు. నా అపరాధ బావనలో నిజాయితీ లేకపోలేదు. ఆమె తడి వేళ్ళు ముద్దు పెట్టుకుని, క్షమించమని వేడుకున్నాను. క్షమించనంటే ఆ వర్షపు బురదలో మోకాళ్ళ మీద పడి మరీ అర్థించాల్సి ఉంటుదని భయపెట్టాను. ఏమైతేనేం, ఇంకో బగ్గీ కట్టించుకుని ఇద్దరం అందులో ఎక్కాం. రాతి రోడ్డు ఎంత కుదిపినా ఆమె పక్కకి నేను జరగలేదు, నా భుజాలు ఆమెని అంటకుండా, బిగించుకుని ఓ మూల కూచున్నాను. చలితో మా శరీరాలు గడ్డకట్టుకుపోయాయి, పళ్ళు కటకటలాడుతున్నాయి. ఆమెకి వీడ్కోలు చెప్తూ మళ్ళీ గడ్డకట్టుకుపొయిన ఆమె చేతులు ముద్దుపెట్టుకున్నాను. హఠాత్తుగా ఆమె కిలాకిలా నవ్వింది.
రెండ్రోజుల తర్వాత ఆమెను కలిశాను బోలెడు మందులతో, భరోసాలతో. అప్పటికే పాపం తను దగ్గు జలుబుతో వణికిపోతున్నది కాబట్టి మందులు చక్కగా అవసరానికొచ్చాయి. అప్పటికింకా నీ పంథా నేను అనుసరించలేదు, పదకొండూ… దానికింకా సమయం రాలేదు. ఏ కొంచెం మర్యాద తప్పినా, అతి చేసినా బెడిసికొట్టే దశ అది. అప్పటికింకా, నేనిలా వెలిసిపోయిన బూడిదరంగు బుడిపెని కాదు. ఆమె ఇంట్లో కిర్రుమంటున్న సోఫాలో కూర్చొని, తెల్లవారేదాకా కబుర్లు చెప్పుకొనేవాళ్ళం. ఆమెకి ఈ సిటీ గురించి తెలీదు, ప్రపంచం గురించి తెలీదు, నా గురించీ తెలీదు. మా కబుర్లు, ఎటుపడితే అటుపోతుండేవి. మొదట ఓపిగ్గా కిరోసిన్ పొయ్యి ఎలా వాడాలో చెప్పాను. ఆ తర్వాత, ఒకసారి ఏదో మాటల్లో వచ్చి, కాంట్ క్రిటీక్ గురించి పొడూగ్గా చెప్పాను. సోఫాలో ఓ మూల ముడుచుకొని కూర్చొని ఆ నల్లటి కళ్ళని నావైపు నుంచి తిప్పకుండా ఏం చెప్పినా శ్రద్ధగా విన్నది.
ఆమెకి చివరకు ఆమె గురించి కూడా తెలియదు. ఒకరోజు తెల్లవారేదాకా నడిచిన మా కబుర్లలో ఆమె గురించి ఆమెకి చెప్పాను, ఇదిగో ఈ నల్లటి పుస్తకానికి వేసిన టాకాలు విప్పే ప్రయత్నం అది. ఆ సాయంత్రం ఆమె భవిష్యత్తులో ఎదుర్కోబోయే అనుభవాలు సంఘటనలు, ఉద్వేగాలు, నిరాశలు, కలయికలు, విడిపోవడాలు, ఇంకా చాలా వాటి గురించి. ఇదంతా ఆమె భవిష్యత్తు తలుపు తట్టే ప్రయత్నం. ఒక్కోసారి పొడిగా నవ్వింది, ఇంకోసారి నన్ను సరిదిద్దింది, మరోచోట మౌనంగా వింటూ ఉండిపోయింది. నా సిగరెట్టు ఆరిపోయినట్టుండడంతో, వెలిగించుకోడానికి అగ్గిపుల్ల గీశాను. ఆ పచ్చటి వెలుగులో, ఆమె మొఖం వేరుగా కనిపించింది, మరింత ముగ్ధంగా, ప్రౌఢిమతో భావిరూపంలా వెలిగింది. నేను చప్పున అగ్గిపుల్ల ఆర్పివేసి, చెప్పుకుంటూ పోయాను: మొదటి ప్రేమ, మొదటి వైఫల్యం, బాధాకరమైన వీడ్కోళ్ళూ, అటుతర్వాత వచ్చే ప్రేమలూ – ఇవన్నీ. అక్కడితో ఆగలేదు, ఇంకా కొనసాగించాను. అనుభూతి అంతా అలిసిపోయి, కరిగిపోయి, వెలిసిపోయే సుదూర భవిష్యత్తు గురించీ, మనిషిగా ఖర్చయిపోయి, వెలిసిపోవడం ఎంత భయంకరమో, ఉద్వేగం కంటే కుతూహలమే మిగలడం ఎంత దౌర్భాగ్యమో, అక్కడ… మళ్ళీ అగ్గిపుల్ల వెలిగించి, ఆమె మొహంలోకి చూసి, అలానే ఉండిపోయాను నా వేళ్ళు కాలేదాకా. అవును, వారసులారా! అప్పుడే గనక నా ప్రయోగాన్ని నేను విజయవంతంగా ముగించగలిగి ఉంటే, ఒక డజను అగ్గిపుల్లలు వెలిగించి ఉండేవాణ్ణి. మీరు మోసిన ఆ పన్నెండుగురి మొఖాలనూ చూడగలిగేవాణ్ణి ఆమె మొఖంలో. కానీ, ఆమె అగ్గిపుల్ల లాక్కుని, ఆర్పేసింది. మా వేళ్ళు పెనవేసుకున్నాయి, ఆ వానరాత్రిలో లాగా వణికిపోతూ. ఇంక చెప్పేందుకేముంది?”
నల్లటి ఒకటి, మండపం మీదనుంచి మెల్లగా దిగింది.
“విన్నావుగా, క్వాగ్గా గురించి నీ అభిప్రాయం?” అనడిగాడు ఆరు.
మర్యాదకోసం కూడా నేను ఏమీ అనలేదు.
“ఓహ్, అసూయగా ఉన్నట్టుంది? ఒకప్పుడు క్వాగ్గా డాంబికాలంటే నాక్కూడా చిరాగ్గానే ఉండేది. కానీ, గతాన్ని మనం గెలవలేం. చక్రవర్తికన్నా దర్పం ఎక్కువ దానిది, మొక్కి దాంతో సంధి చేసుకోవాల్సిందే. అదీగాక, అసూయ అంటే ఏంటో తెలుసా?”
అతని లెక్చరు నేను పట్టించుకోకుండా వెనుదిరిగి పడుకున్నాను. మర్యాదలేని మనుషుల గురించి ఆరు ఏదో గొణిగాడు.
ముందు నిద్ర నటించినా, కాస్సేపటికి నిజంగానే మంచి నిద్ర పట్టింది. ఎంతసేపో తెలీదు కానీ, అంతలో ఒక అద్భుతమైన వెలుగు నా కళ్ళలోకి చొచ్చుకొని పాకింది. కళ్ళు తెరుచుకుని చూద్దును కదా, చూట్టూ పరచుకున్న నీలపు కాంతి. మోచెయ్యి ఆనించి, పైకి లేచి అది ఎక్కడ నుండి వస్తోందో అని చుట్టూ చూశాను, ఆశ్చర్యంగా ఆ వెలుతురు నాలోంచే వస్తోంది. దాని వెలుగు నాలోంచి వస్తూ, కొన్ని అడుగుల దూరం వరకూ పరుచుకుంది. నా శరీరం తేలిగ్గా, దూదిపింజలా అయిపోయింది ఏదో కలలోలా. మిగిలినవాళ్ళంతా గాఢ నిద్రలో ఉన్నారు. నేను, పచ్చటి వెలుతురు ముద్ద మీదకి పాకాను. నా లోంచి వస్తున్న కాంతి పుంజాలు, ఆ మంటపం వెలుతురూ ఒకదాన్నొకటి పెనవేసుకొని చిత్రమైన ఇంధ్రదనస్సు పరుచుకుంది. మరోసారి పైకి లేవగానే, ఆ గుహ గోడలు పట్టుకుని నేను పైకి తేలుకుంటూ వచ్చాను. గుహ పైభాగంలో కప్పు దగ్గర చీలిక తెరుచుకుంది. తేలిగ్గా, మెత్తగా ఉన్న నా శరీరాన్ని కుదించి అందులోంచి నేను పైకి రాగలిగాను. నా ముందు, అదే వసారా. నన్ను ఈ చీకటి గుహలోకి తెచ్చిన వసారా. నాలోంచి వస్తున్న వెలుగు వల్ల కొంచెం చూడగలిగాను. కంటిపాప ద్వారాన్ని సమీపిస్తూ… నాలో ఏదో ఆశ కుదుళ్ళలోంచి కదిలింది. గోడల దగ్గర ఏవో ఆకారాలు తచ్చాడుతున్నాయి, కానీ అవేవీ నాకు పట్టలేదు.
గుండె గొంతులో కొట్టుకుంటుంటే కంటిపాపలో కిటీకీ దగ్గరకి వచ్చాను. హమ్మయ్య, ఎలాగైతేనేం, తిరిగి నేను స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాను. నేను గుడ్డిగా అటువైపు తుపాకీ గుండులా పరిగెత్తాను. కానీ, కనురెప్ప మూసేసి ఉంది. పిడికిలితో గుద్దాను, కాని దానిలో కదలిక లేదు. ఆమె మంచి నిద్రలో ఉన్నట్టుంది. కోపంతో, ఆ రెప్పలని కాళ్ళతో, చేతులతో గుద్దాను, తన్నాను. అవి కాస్త కదిలాయి, కాని తెరుచుకోలేదు. నాలోంచి వస్తున్న వెలుగు తగ్గిపోవడం ప్రారంభించింది, నా శరీరం కూడా బరువెక్కిపోసాగింది. భయంతో, మళ్ళీ ఏ చీకటిలో చిక్కడిపోతానో అని సొరంగంలోకి మళ్ళాను. నానుంచీ వస్తున్న కిరణాలు నాలోకి కుంచించుకు పోతున్నాయి. వగరుస్తూ, మళ్ళీ గుహ ముఖద్వారం దగ్గరకి వచ్చాను. చీలిక తెరుచుకుంది, దాంట్లోంచి మళ్ళీ గుహ లోపలకి పడ్డాను, పడ్డానో విసిరెయ్యబడ్డానో.
ఎడారిలో తుఫానుకు ఎగురుతున్న ఇసకలా నా ఆలోచనలు. నేను ఎందుకు వెనక్కి వచ్చాను? ఏ శక్తి నన్ను ఇలా మళ్ళీ ఈ గుహలోకి విసిరేసింది? స్వేచ్ఛనుండి బానిసత్వంలోకి. లేదా ఇదంతా ఒక పీడకలేమో? కానీ ఎందుకు, ఎలా?
ఆరుని భుజంపట్టి ఊపుతూ లేపాను. కళ్ళు నులుముకుంటూ ఉలిక్కిపడి లేచి, పాపం నా ప్రశ్నల పరంపరనంతా విన్నాడు.
“ఒక్క క్షణం. నీదంతా కల అని నువ్వంటావ్?” నా నుంచీ ఇంకా వస్తున్న నీలిరంగు వెలుతుర్ని చూస్తూ అన్నాడు – “హ్మ్, ఒక కల నడుస్తూ ఉండొచ్చు, కానీ ఆ కల, ఆశ్చర్యపోకు, నువ్వే. అవును. మిగిలిన అందరికీ కూడా ఈ అనుభవం అయ్యింది. ఆమె కలలు ఒక్కోసారి మనల్ని మేల్కొలిపి, మనల్ని తిరిగేలా బలవంతం చేస్తాయి. నిద్రలో నడిచేవాళ్ళలా మనం పోతుంటాం ఎందుకో, ఎక్కడికో తెలియకుండా. ఇప్పుడు నీ గురించే కలగంటోంది. అందుకే నీలో ఇంకా ఆ కాంతి. ఇప్పుడు పోయింది. అంటే కల అయిపోయిందన్నమాట.”
“ఆరూ”, గుసగుసగా అన్నాను, “ఎన్నాళ్ళిలా, నా వల్ల కాదు. ఇక్కడ నుండి తప్పించుకుని పారిపోదాం.”
అతను అడ్డంగా తలూపాడు. “అసంభవం.”
“కానీ, ఎందుకు? ఇప్పుడే కదా నేను ద్వారం దాకా పోగలిగాను. ఆ రెప్పలే అడ్డుపడకపోయింటే?”
“అసంభవం.” మళ్ళీ అన్నాడు, “ఒకవేళ నువ్వు బయటపడినా, అక్కడ పక్కమీద నీ మనిషే ఉంటాడని నమ్మకం ఏమిటి? వాళ్ళు ఇప్పటికే విడిపోయి ఉంటే, అప్పుడేం చేస్తావు? ప్రపంచంలో స్థలం చాలా పెద్దది. దారి తప్పిపోయి, ఎవరి కాళ్ళకిందో పడి చచ్చిపోతావు. రెండోది, నీముందు కూడా సాహసవంతులు ఈ ప్రయత్నం చేశారు, కానీ…”
“మరి?”
“వెనక్కి వచ్చేశారు.”
“అవునా?”
“ఊ, ఆ చీలిక ఆమె కలలు కంటున్న వారి కోసం, లేదా కొత్తవాళ్ళ కోసం మాత్రమే తెరుచుకుంటుంది. ఆ కలలు మనల్ని కట్టి ఉంచుతాయి. మూసుకున్న రెప్పలతో మనల్ని వాస్తవం నుంచి తెగ్గొడతాయి. మన అవసరం తీరిపోగానే మళ్ళీ ఈ కూపంలో పడేస్తాయి. దీనికి ఒక్కటే మార్గం: కొత్తవాడు వచ్చే దాకా వేచి ఉండి, ఆ చీలిక తెరుచుకోగానే ఇందులోంచి బయటపడటం. కానీ, ఒక రహస్యం దానికి అడ్డుపడుతుంది…”
“ఏంటది?”
“నువ్వు బయటకి పోతున్నప్పుడు, నీ కొత్త వారసుడు, నీ స్థానంలోకి రాబోతున్నవాడు నీకు ఎదురవుతాడు. ఆ రాబోయేవాడిని చూడాలనే కోరిక, అది క్షణమాత్రమైనా సరే, చాలా బలమయింది. కానీ ఆ ఒక్క క్షణం చాలా ముఖ్యమైంది. దాన్ని పోగొట్టుకుంటే, అంతా పోయినట్టే. నువ్వూ ఆ రాబోతున్నవాడు ఇద్దరూ కలిసి కింద పడతారు. ఇంతవరకూ జరిగిన ప్రయత్నాలలో జరిగిందదే. చూశావా? ఇదో తప్పించుకోలేని మానసిక రుగ్మత.”
అతను అసంభవం అని మాటిమాటికీ రెట్టిస్తున్నకొద్దీ, నాలో ఎలాగైనా తప్పించుకు తీరాలన్న పట్టుదల పెరిగింది. ఎన్నో గంటలపాటు ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాను. ఇంతలో, మండపం ఎక్కడానికి రెండు వంతు వచ్చింది. మొదటిసారి, అతని వెలిసిపోయి, కుంచించుకుపోయిన రూపాన్ని పరికించి చూశాను. ఇబ్బందిగా దగ్గుతూ, మొదలెట్టాడు, మాటలకోసం తొట్రుపడుతూ.
“ఎలా జరిగిందంటే… ఒకరోజు నాకో ఉత్తరం వచ్చింది, పొడుగాటి కవర్లో, బొక్కిసపూల వాసనతో. కవరు చించి ఉత్తరం తీశాను, కొక్కిరిబిక్కిరి దస్తూరితో ఉంది. చదవటం మొదలెట్టాను.”
“ఓహ్… ఎంటది?”
“నిశ్శబ్దం!” అని అందర్నీ అజ్ఞాపించాడు క్వాగ్గా, “నీ కథ ఇప్పటికి ఆపు. పైనుంచి… వినిపిస్తోందా?”
అందరి గొంతులూ మూతబడ్డాయి. నిశ్శబ్దం. మొదట్లో నాకేం వినిపించలేదు. క్రమక్రమంగా, పైనుంచి, గుహకి చాలా దూరంలో, ఎవరివో అడుగుల చప్పుడు. జాగ్రత్తగా, ఆచి తూచి అడుగేస్తున్నట్టు వినిపిస్తున్నాయి. అవి ఆగాయి, మళ్ళీ కదిలాయి, ఆగాయి…
“విన్నావా?” అన్నాడు ఆరు. “అతను వచ్చాడు. అప్పుడే తిరుగుతున్నాడు.”
“ఎవరు?”
“పదమూడు.”
మళ్ళీ మేమంతా పాడటం మెదలెట్టాం, ఆ ఊళపాట. మరవబడ్డవాళ్ళ స్తుతి. మొదట మెత్తగా, అతను భయపడకుండా, ఆ తర్వాత మెల్లమెల్లగా గొంతు పెంచుతూ బిగ్గరగా, గుహ మాంసపు కండరాల గోడలు అదిరేలా పాడుతున్నాం. క్వాగ్గా సంజ్ఞలతో కాసేపు ఆగడం, ఆగి, మళ్ళీ మొదలెట్టడం.
దగ్గరగా వచ్చిన అడుగుల చప్పుడు, గిరుక్కున వెనక్కి తిరిగి వెళిపోయినట్టున్నాయి.
“బిగ్గరగా, ఇంకా బిగ్గరగా!”, క్వాగ్గా అరిచాడు, “అతన్ని లాగాలి, ఇందులోకి లాగాలి. మనవాడు తప్పించుకోకూడదు, తప్పించుకోలేడు.”
మా కీచు గొంతుకలు మరోసారి తారస్థాయిని అందుకున్నాయి గుహ బురద గోడలు అదిరేలా. కానీ, పదమూడో వాడు, గుహ పైన గిరికీలు కొడుతూ, ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు, గుహ ద్వారం దాకా వచ్చి వెనక్కి పోతున్నాడు. అందరం ఓపికున్నంతవరకూ పాడి అలిసిపోయాం. క్వాగ్గా విశ్రాంతికి అనుమతించాడు. అందరూ మళ్ళీ నిద్రలోకి జారుకున్నారు. నేను మాత్రం ఊరుకోలేదు. నా చెవులు గోడలకానించి ఆ చీకటిలో శబ్దం కోసం చెవులురిక్కించి వింటున్నాను. కాస్సేపటి వరకూ చడీ చప్పుడూ లేదు. కానీ, అంతలో మళ్ళీ, గుహ పైనుంచి అడుగుల చప్పుడు వినిపించింది. అతి మెల్లగా గుహ పైనున్న చీలిక తెరుచుకోసాగింది. గోడలను పట్టుకుని నేను పైకి ప్రాకడానికి ప్రయత్నించాను కానీ, అవి పట్టు దొరకక, కిందకి జారిపోయాను. కింద ఏదో గట్టి వస్తువుమీద పడ్డాను. అది క్వాగ్గా నల్ల పుస్తకం. దాని, టాకాలు విప్పి, వాటిని కొక్కేలుగా చేసుకుని, గోడమీదకి ఎగబ్రాకాను. నా చెయ్యికి ఎడం అవుతున్న బిలద్వారం దొరికింది.
ఎవరిదో తల అక్కడ ఊగిసలాడుతోంది. కళ్ళు గట్టిగా మూసుకుని, ఒక్క ఊపుతో చీలికలోంచి బయటపడి, గుడ్డిగా పరిగెత్తాను. రెండుసార్లు నడిచిన మార్గమే కాబట్టి, సొరంగం నాకు అలవాటే, చీకటిలో కూడా అది నాకు తెలుసు. తేలిగ్గానే నాకు కంటిలోంచి వస్తున్న వెలుగు కనిపించింది. సగం మూసుకున్న ఆ కళ్ళలోంచి కిందకి దిగి, తలగడ మీదకి గెంతి, వస్తున్న ఆయాసాన్ని తట్టుకుంటు ఇలా వచ్చి పడ్డాను. ‘అతను ఇంకెవరో అయితే నా గతేం కాను’, అని కంగారుపడుతూ, ఆశకి-భయానికి మధ్య ఊగిసలాడుతూ, ఎలాగైతేనేం, వేకువజాము వెలుగులో నిన్ను చూశాను–నేను ఎవరి ప్రతిబింబమో ఆ వ్యక్తి పర్వతాకారాన్ని చుశాను. నిన్ను చూశాక, ప్రభువా, ఇంక నిన్ను ఎప్పుడూ వదిలి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను, ఇంకెప్పుడూ ఇంకెవరి కళ్ళలోకి దూకే సాహసం చెయ్యను. అయినా, అది చేసేది నేను కాదు, నువ్వు….”
ఆమె కనుపాపలోని నా కంటిపాపడు అంతకుమించి ఇంకేం చెప్పలేదు. ఆ నల్లటి పుస్తకాన్ని చంకలో పెట్టుకుని, లేచి నిల్చున్నాడు. గులాబీరంగు వేకువ చారలు కిటికీ అద్దాలపై తచ్చాడుతున్నాయి. ఎక్కడో బండి చక్రాలు తిరుగుతున్న చప్పుడు. ఆమె కనురెప్పలు కదిలాయి. కంటిపాపడు ఆ కళ్ళవైపు జాగ్రత్తగా చూసి, నా వైపుకి తిరిగాడు, నా అనుమతికోసం అన్నట్టుగా. ‘సరే నీ ఇష్టం ప్రకారమే కానీ’ నవ్వుతూ, నా మొహాన్ని అతనికి వీలయినంత దగ్గరగా చేర్చాను. అతను, నా కంటిలోకి ఎక్కి, లోపలికి పోయాడు, కానీ, బహుశా అతని చంకలో పుస్తకం అంచు నా కంటి గుడ్డుని బలంగా గీరిందేమో, భరించలేని నొప్పి నా బుర్రంతా పాకింది. అంతా చీకటి, కన్ను పొడుచుకున్నా కనిపించని చిమ్మచీకటి. ఎంతోసేపు ఉండదేమో అనుకున్నాను. ఊహూ! గులాబీరంగు వేకువ నల్లగానే ఉంది. కాలం తన గిట్టల మీద వంగి వెనక్కితిరిగినట్టు, చీకటి రాత్రి నామీదకి ఉరికింది. మంచం మీదనుంచి జారుకుని, గబగబా బట్టలేసుకుని, చప్పుడు చెయ్యకుండా బయటపడ్డాను. సావిడి దగ్గర ఒక మలుపు, తర్వాత తలుపు, మరో మలుపు, మరో తలుపు, గోడల్ని తడుముకుంటూ ఒక్కో మెట్టూ దిగాను. వీధిలోకి వచ్చాను. సూటిగా నడుస్తూ, ఎటుపోతున్నానో తెలియకుండా, ఎందుకో, ఏమిటో పట్టించుకోకుండా నడిచాను. క్రమక్రమంగా, గాలి పలచబడి, భవంతులు లీలగా కన్పిస్తున్నాయి. వెనక్కి తిరిగి చూస్తే ఎర్రటి రెండో వేకువ నన్ను అందుకుంటోంది.
ఉన్నట్టుండి, పైనుంచి కంచు గంటలు గణగణమన్నాయి. తలెత్తి చూశాను. ఒక పాతకాలపు చర్చి గోడల పైన ఒక త్రిభుజంలో చిత్రించిన పెద్ద కన్ను మంచుతెరలు చీల్చుకుని నా వైపే సూటిగా చూస్తోంది. నా వెన్నులోంచి వణుకు భుజాల్లోకి పాకింది. ‘ఇటుకల మీద వేసిన బొమ్మ, అంతే’, మంచుతెరలనుంచి నన్ను నేను విడగొట్టుకుంటూ, పదే పదే అదే అనుకున్నాను, ‘ఇటుకల మీద వేసిన బొమ్మ, అంతే’.
వెలుతురు చీలుస్తున్న మంచులోంచి నావైపు వస్తూ కనిపించింది ఒక బెంచి. ఇక్కడే, నేను చాలా సేపు కూర్చున్నాను, ఈ మధ్యనే. చీకటి నన్ను ఆవరించడానికి ఎదురుచూస్తూ. ఇప్పుడా బెంచి పలకల మీద మంచుబిందువులు పరుచుకుని ఉన్నాయి.
బెంచి చివర తడిని తుడిచి కూర్చున్నాను, జ్ఞాపకాలు నెమరేసుకుంటూ. ఇక్కడే కదా నేను అప్పటికింకా స్పష్టతలేని ఒక నవలిక గురించి ఆలోచించింది? ఇప్పుడు నా దగ్గర ఆ కథాంశానికి సరిపడా సరుకు ఉంది. ఒక కొత్తరోజు ప్రవేశిస్తున్న ఆ సమయంలో, నేను చెప్పదలచింది ఎలా చెప్పాలా అని ఆలోచించాను. ఏదీ చెప్పినట్టు ఉండకుండా అంతా చెప్పాలి. ముందుగా నిజాన్ని కత్తిరించేయాలి, అది ఎవరికి కావాలీ? ఆ తర్వాత బాధని నా కథ కాన్వాస్ అంచుల దాకా పులమాలి. ఆ పైన, కాస్త రోజువారీ సంఘటనలు కాస్త కాస్త, అక్కడక్కడా అద్దాలి, కాస్త మొరటుదనంతో. అదిలేకుండా ఎలా? చివరగా, కొన్ని తాత్విక వాక్యాలు…
ప్రియమైన పాఠకుడా! ఈ వాక్యాలు నీ కంటిపాపకి అంటకుండా నువ్వు వెనుదిరిగి వెళిపోతున్నావు. వద్దు, వద్దు. నన్ను అప్పుడే ఈ బెంచి మీద వంటరిగా వదిలెయ్యకు. నా చెయ్యి పట్టుకో. చాలాకాలం ఒంటరితనాన్ని అనుభవించినవాణ్ణి. ఇంకాస్త గట్టిగా పట్టుకో, మరికాస్త బలంగా… ఇప్పడివరకూ ఎవరికీ చెప్పని రహస్యం నీతో చెప్తాను: పసిపిల్లలకి చీకటి చూపించి ఎందుకు భయపెట్టడం? ప్రత్యేకించి అదే చీకటితో వాళ్ళను బుజ్జగించి నిద్రపుచ్చి కలల్లోకి నడిపించగలిగినప్పుడు!
(1927)