తెలుగు సినిమాలు చూడడమనే ఒక ప్రక్రియను, ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఎక్కడ పుట్టి ఎక్కడ చదువుకున్నా సరే, తెలుగు వాళ్ళు అందరికీ ఉండే ఒక కామన్ ఎజెండాగా చెప్పుకోవచ్చు. అట్లా మన జీవితాల్లో ఒక భాగమై పోయిన తెలుగు సినిమా గురించి మనం ఎంత తక్కువగా అధ్యయనం చేస్తామో అంతే తక్కువ అర్ధం చేసుకుంటామని కూడా చెప్పవచ్చు.
వయసుతో నిమిత్తం లేకుండా, మన పెద్దవాళ్ళు వాళ్ళ కాలేజీ రోజుల్లో సావిత్రి, ఎస్వీ రంగా రావులగురించీ, కొద్దిగా చిన్నవాళ్ళైతే కృష్ణ, రామారావు, జమునలు, ఇంకొంచెం లేటుగా పుట్టినవాళ్ళైతే నాగార్జున, శ్రీదేవిల ముచ్చట్లు మరీ నిన్న మొన్నటి అర్భకులైతే శ్రీకాంత్ , జూనియర్ ఎన్ టీ ఆర్ మాత్రమే కాక తెలుగును ఇంగ్లీషులో రాసుకుని మాట్లాడే హీరోయినుల వార్తలు చక చకా చెప్పెయ్యడం మనం చూస్తూనే వుంటాం.
ఇంతగా మన జీవితాల్లో అల్లుకుపోయినా సరే తెలుగు సినిమా గురించి ఏదైనా చెప్పడం వచ్చేసరికి, మనకు ఆ ఇండస్ట్రీ ప్రసాదించిన “అతి”, అంటే ఎక్సెసెస్ మాత్రమే గుర్తుకు వస్తాయి. బ్రహ్మానందం బాబూ మోహన్ జోకులు, మూడు కోణాల ప్రేమలు, బోరెత్తించే ఫైట్లు, రెండర్ధాల పాటలు, వాక్యాలు ఆ హీరోయిన్ నడుము అంత అందంగా చూపించకపోతే ఖచ్చితంగా సగం హాలు ఖాళీ అయితీరుతుంది మరి ఇవే మనకు మిగిలిపోయిన, తెలుగు సినిమా ఇన్నేళ్ళుగా ప్రసాదించిన “అతి” అని ఎవరైనా రాస్తే కొందరికి అతిశయోక్తిగా అనిపించకపోవచ్చు.
ఇవన్నీ మన తెలుగు సాహితీ ప్రియులను ఆహ్లాద పరిచే క్రమంలో ఒక సున్నితపు త్రాసులో వేసి తూచడం కొందరికిష్టమే కావచ్చు, కానీ ఈ వ్యాసం ముఖ్యోద్దేశం అది మాత్రం కాదు. ఇక్కడ చెప్పదలచుకున్నది కొద్దిగా భిన్నమైన విషయం.
తెలుగు సినిమా ఒక టెక్నికలర్ మాయా ప్రపంచమే, ఎవరూ కాదనరు. రోజంతా రిక్షా తొక్కిన వాడికి, సావిత్రి ఒక పాటందుకుంటే, జగ్గయ్య ఒక డైలాగు చెప్తే మళ్ళీ మళ్ళీ తలుచుకుని రోజంతా ఆనందిచేవాళ్ళేమో. మన ఈ ఇండస్ట్రీకి మాటినీలన్నీ కృష్ణార్జున యుద్ధం చూడాలనో, శోభన్‌బాబు ఇద్దరి పెళ్ళాలతో ఎట్లా వేగుతాడో ( మధ్య మధ్య ఆ చెరిగిపోని క్రాపును సవరించుకోవడం మరవకుండా) తెలుసుకోవాలనో తహతహలాడే మన తెలుగింటి ఆడపడుచులతో మింపడం అలవాటే. అప్పుడు సినిమా ఒక రంగుల కల మాత్రమే కాదు, ఒక మధ్యాహ్నపు సోప్ వ్యసనం కూడా అయ్యుండాలి.
ఆయా ప్రయత్నాల్లో, ఎన్నో వత్తిడులను తట్టుకుని, తెలుగువాళ్ళ మధ్యలో పెద్దగా వేళ్ళూనలేకపోయినా పొరుగింటి అరవ్వాళ్ళ మధ్య మార్కెటును నిలబెట్టుకుని, ఇండస్ట్రీ చాలా వరకూ గొప్ప ఏక్టర్లనూ, పాటలు రాసే వాళ్ళనూ, పాడే వాళ్ళనూ, డైరక్టర్లనూ ఇవ్వగలిగింది. తెలుగు సినిమా తీయాలంటే ఆర్టిస్టులకిచ్చేది తక్కువగా వుండి మిగతా ఖర్చులే ఎక్కువగా వుండే రోజుల్లో ఎంత లో బడ్జెటు పెట్టి తీసినా ఆ సినిమా ఒకవేళ మామూలుగా ఆడినా కూడా నిర్మాత నెత్తిన గుడ్డ వేసుకు పొయ్యే రోజులన్న మాట. మద్రాసుకు సినిమా తియ్యడానికి వెళ్ళి చిరిగిన బనియను వేసుకుని అడుక్కుతింటున్న నిర్మాతల మీద వచ్చిన కార్టూనులు ఎన్నో. అట్లాంటి భయాలెన్నో వున్నందుకే పాతవాళ్ళు ఎంతో టాలెంటు వుంటేకానీ, ఏదో ఒక కొత్త ఇతివృత్తమైతేకానీ, మరేదో కొత్తను ప్రేక్షకులకు అందివ్వగలిగితే గానీ తప్ప తెరమీదెక్కించే ధైర్యం చేసేవారు కాదు(అనుకుంటాను). డబ్బు విలువ తెలియకో అతిగా డబ్బు సంపాదించాలనే పట్టుదల లేకనో కావచ్చు, మరి అప్పటి నిర్మాతలు ఒకే మూసలో పోసిన అరడజను సినిమాలు ఆర్నెళ్ళ వ్యవధిలో తీయకపోవడం. మరి ఇవ్వాళ్రేపు (గత పదేళ్ళుగా) ఒచ్చే సినిమాలు ఎందుకిలా తయారవుతున్నాయి. తెలుగు సినిమాకు బెంగాలీ సినిమాకు ఎందుకంత తేడా. తెలుగు సినిమా హిందీ వాళ్ళ పోకడలను అనుకరిస్తూ వెళ్ళడం మూలంగా రాసి ఎక్కువైనా వాసి తగ్గే అవకాశం వుందా. ఇట్లాంటి ప్రశ్నలు చాలామంది అడిగి ఛావరు ఎందుకని?
పందొమ్మిదివందల డెబ్భైవ దశకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనుకుంటాను. డెబ్భై ఒకటిలో బీనా దేవి రాసిన ఒక కథను ప్రస్తావిస్తానిక్కడ ఎ మాటర్ ఆఫ్ నో ఇంపార్టెన్స్ ఆ కథలో ఒక రిక్షా తొక్కే అతను తను చూసిన సినిమాను తలచుకుంటూ అందులో ఒక హీరోయిన్ కట్టుకున్న ఒక చీరలాంటిదే తన భార్యకు కొనాలనుకుంటాడు. అంతగా ఉండేది సినిమాల ప్రభావం. మరైతే ఇప్పట్లో వినిపిస్తున్న “సినిమా క్షీణించిందీ” అనే భావన కూడా అప్పుడే మొదలయ్యిందా? తెలుగు జాతిని ఒక వూపు వూపగలిగిన సినిమాలు ఆ తరువాత చాలానే వచ్చాయి. అటువంటప్పుడు, మన థియరీని ఇంకొంచెం విస్తరించి చూసుకోవలసి వుంది. అంటే, కొత్తగా వచ్చే సినిమాల గురించిన భావన, అభిప్రాయాలు పాత తరాలకు ఎప్పుడూ తక్కువ గానే కనిపించడమనే ఒక పారడాక్స్ లోకి తొంగిచూస్తామన్నమాట.
ఇంకో వైపునించి అంటే ఇంకో కోణంలోనుంచి పరిశీలిద్దాం ఈ సమస్యను.
తెలుగు సినిమాలు ఒక్కో సంవత్సరం వందకు పైచిలుకే వచ్చిన రోజులున్నై. అంటే వారానికి కొత్తవి రెండైనా విడుదల అవుతాయన్నమాట. డబ్బింగు సినిమాలు కూడా కలుపుకుంటే వారానికి మార్కెట్లోకొచ్చేవి ఇంకో ఒకటీ అరా ఎక్కువే. అలవోకగా ఒకటీ రెండు కోట్లు ఖర్చు పెట్టి గ్యాంబుల్ చేసే పెద్ద మనుషులు ముఖ్యంగా ఇండస్ట్రీలో అందెవేసినవాళ్ళు అరడజనుమంది వున్నారివాళ. ఇట్లా ఒక రకంగా మెచ్యూర్ అయిన పరిశ్రమ ఇది.
అదీ గాక, కేబుల్ టీ వీ కొత్త రుచులను ప్రసాదిస్తున్న ఈ రోజుల్లో, ఒక్క సినిమాలే కాలక్షేపం కాకుండా అన్ని రకాల తెలుగు సీరియల్సూ, రకరకాల పాటల ఛానెల్సూ, ఇరవైనాలుగ్గంటల న్యూస్ రీల్లు నడుస్తున్న కాలంలో, మధ్యతరగతి మహిళాలోకానికి ఏవో గొప్ప సినిమాలు చూడాలి అనుకునేంత అత్యాశ గానీ అంతగా పట్టించుకునే అవకాశం కానీ తక్కువే అని చెప్పుకోవాలి. ఈ మధ్య మాటినీలన్ని తెలుగు సీరియల్సునుబట్టి సమయ మార్పిడి చేసుకోవలసిన అవసరమున్నది, ప్రతి ఇంట్లోనూ ఒక రెండు వీడియో రికార్డర్లు వచ్చే వరకైనా.
మరి సినిమా (చాలామంది దృష్టిలో) కిందికి జారడానికి కారణం ఈ చైతన్యంతో కూడిన పబ్లికంతా పొలోమని సీరియల్సుమీద పడ్డమేనా? చెప్పడం కష్టం. తెలుగు సీరియల్సు మాత్రం గొప్ప కాంపిటీషనులో పడి వాటికవే కొత్త ఎత్తులకు వెళ్ళే రోజులు ముందున్నాయని మనం చెప్పుకోవచ్చు మళ్ళీ ఏదో ఒక కొత్త మీడియం వచ్చి, వాటిని కూడా మన అభ్యుదయ ప్రేక్షకులు పక్కకు పెట్టే కాలమొస్తే తప్ప.
తరచి చూస్తే పైన చెప్పిన వివరణలో రెండు విషయాలున్నవి. ఒకటి తగ్గిన ప్రేక్షకులు, రెండు, పెరిగిన ఛాయిస్ ఈ రెంటినీ, (పెరిగిన వ్యయం, ఆర్టిస్టుల టాలెంటు అప్పుడూ ఇప్పుడూ ఒకటే అని మనమనుకున్నా సరే), మినిమం గ్యారంటీ అన్న ధ్యాసతో కలిపి చూసుకుంటే, మనకవగతమయ్యేది తెలుగు సినిమా మార్కెట్ షేర్ పడిపోయిందని. అదే సమయంలో, ఖర్చులు పెరగడం వల్ల ఒక్కో సినిమా రూపాయి లాభం పొందడానికి మనకిప్పుడు ఎక్కువ ప్రేక్షకులు కావాలి. అంచేత రిస్కును గమనిస్తే అసలు పోయి మొత్తానికి మోసం వచ్చి ప్రొడ్యూసరు నెత్తిన గుడ్డ పడే అవకాశం ఇరవై ఏళ్ళక్రితం పరిస్థితితో పోలిస్తే ఇప్పుడే ఎక్కువ అని చెప్పుకోవాలి.
అందుకే మనకు ఈ రోజు సినిమా త్వరగా తక్కువ ఖర్చుతో అందివ్వాలంటే అనవసరపు ప్రగల్భాలకు పోకుండా, ఇప్పటికే “సక్సెస్ ” అయిన ఫార్ములాను ఎంచుకుని వీలైతే కథనూ, డైలాగులనూ, సెట్టింగులనూ మాత్రమే కాపీ కొట్టడమో, లేక ఇంకా ముందుకు వెళ్ళి ఏకంగా డబ్బింగు చేసెయ్యడమో డబ్బు సంపాదించుకునే మార్గాలని అనుకుంటే తప్పెలా అవుతుంది.
ఇక చివరిగా కనిపించే మరో పరిణామం తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు సినిమా నుండి మాత్రమే వచ్చే ఆదాయంతో బ్రతకలేదు. అందుకే పెద్ద పెద్ద స్టూడియోలు ఇంకొంచెం ముందుకు పోయి, కంగ్లామరేట్స్ అయి, లేక ఒక రకమైన మొనాపలీని సృష్ఠించి, బ్రతకాల్సిన అవసరం వచ్చింది.
తెలుగు సినిమా ఫీల్డు హైదరాబాదుకు రాకమునుపు తమిళ ఇండస్ట్రీతో కలుపుకుని కొంతవరకూ క్రాస్ సబ్సిడీని అనుభవించేది, వాళ్ళ పాటల రైటర్లూ, వీళ్ళకు డబ్బింగు చెప్పేవాళ్ళు, అందరికీ దుస్తులు తయారు చేసేవాళ్ళు ఇట్లా అంతా కలుపుకుని కొంతవరకూ ఎక్కువ మార్కెట్లో బ్రతికేసేవాళ్ళు, ఇప్పుడది కుదరదు. అట్లాంటి గవర్నమెంటివ్వని సబ్సిడీని పూడ్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వవలసి వచ్చింది. ఒక వేళ ఈ రాయితీలను ఉపయోగించుకోలేకపోతే (అంటే ప్రభుత్వంలో అంతగా కనెక్షనులు లేకపోతే) చప్పున మూలకు కూర్చోవటం తప్ప చెయ్యగలిగింది లేదు.
ఈ కారణాలవల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ గత ఇరవై సంవత్సరాల్లో కొందరు కింగు మేకర్ల చేతుల్లోకెళ్ళిపోయింది. ప్రభుత్వాల్లో కింగు మేకర్లు సినిమాల్లో కింగులయ్యే అవకాశమొచ్చింది. రాజకీయాలకు సినిమాలకూ వున్న సంబంధాలు ఎక్కువయ్యాయి.
తెలుగు ఇండస్ట్రీతో పోల్చుకుంటే, బాలీవుడ్ తన మార్కెటును పెంచుకుంటూ పోయింది హిందీ సినిమా హాలీవుడ్తో పోటీపడగలదు, ప్రేక్షకుల సంఖ్యతో పోల్చుకుంటే. ఒక్క ఇండియాలోనే కాక పాకిస్తాను, అరబ్ దేశాలు మాత్రమే కాక మిగతా భాషలు మాతృభాషలుగా చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది హింది సినిమాను ఆదరిస్తారు. ఆ భాషలో ఒక్క డైలాగు కూడా స్వంతంగా చెప్పలేకపోయినా సరే సినిమా చూడ్డానికి అది అడ్డురాదు. ఇట్లా స్వంత మార్కెటును పెంచుకున్న ఈ హిందీ సినిమా ఈ రోజున ఎంతమంది పెట్టుబడిదారులకైనా సరే చోటుంది రమ్మని అక్కున చేర్చుకొనగలదు. అతి తక్కువ బడ్జెట్టుతో మంచి సినిమాలు టాలెంటు గలవాళ్ళతో పోటీపడి తీయగలదు. అందుకే, కొత్త రైటర్లు, కొత్త కథలు, కొత్త ప్రయోగాలతో హిందీ సినిమా సాహసించి చెయ్యగలదు.
అందుకే, తెలుగులో ప్రచారమైన సాహసం చేయరా డింభకా అనే డైలాగును హిందీ నిజం చేసి చూపించగలదు. తెలుగు మాత్రమే కాదు, తమిళ, కన్నడ, మళయాళీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ భాషల్లోనూ ఇక ఏవో కొన్ని ఆర్టు ఫిలింస్ తప్ప గొప్ప బడ్జెటుతో కూడిన సినిమాలు రావు, హిందీలోనుండి రీమేక్‌లుగా తప్ప.
ఈ వ్యాసం హిందీని పొగడ్డానికి మొదలు పెట్టింది కాదు కనక, ఇక ఈ చరిత్రంతా చెప్పుకున్నాక మిగిలిందేమిటి అని అడిగే చదువరులెవరన్నా వుంటే, ఇదిగో ఇక్కడ చివరలో చెప్పుదామని ఆగాను, అంతే.
ఇట్లా మార్కెట్ ఎకానమీలో మినిమమ్ గ్యారంటీ తప్ప మరేవీ వినిపించనప్పుడు, మంచి డైరెక్టర్లు, ఎక్కువ రిస్కు తీసుకోగలిగే ప్రొడ్యూసర్లు హిందీ ఫీల్డుకు మరింత గ్రీనర్ పాశ్చర్ ను వెతుక్కుంటూ వలస వెళ్ళడం ఇకనుండీ మామూలవుతుంది. ఒకరు ట్యాలెంటును చూపించుకోవడమనే పాశ్చరుకోసమైతే, ఇంకొకరు డబ్బు, పేరు, ప్రఖ్యాతులకోసం అందుకే ఇకపై తెలుగు సినిమా నుండి గొప్పదీ ఒరిజినల్‌దీ అయిన సినిమా కోసం ఎదురుచూడవలసిన పని లేదు. ఎప్పుడైనా తళుక్కున మెరిసే కొత్త సినిమాలను భద్రంగా దాచుకోవలసిందే.
అందుకే తెలుగు సినిమా ఇకపై పెద్దగా సమాజపు విలువల మీద ప్రభావం చూపించదు. అట్లా చూపించాలనే భావనే సెకండరీ అవుతుంది. సినిమా మాధ్యమం ఇక పై పై మెరుగులకు తారల తళుకులకు ఇచ్చే పాటి విలువ మిగతా వాటికి వేటికీ ఇవ్వదు. ఉచ్చారణ కలిగిన ఆర్టిస్టులను ఉద్భవించదు. ఎప్పుడో ఒకసారి మటుకు రైటర్లు మాత్రమే, వాళ్ళను హిందీ ఫీల్డులోకి ఎలాగూ చోటులేదు కనుక పాటల్లోనో, డైలాగుల్లోనో వాళ్ళ చమత్కారాలన్నీ రాసేసుకుని అద్దంలో తమను తామే చూసుకుని మురిసిపోతుండ వలసిందే.
మరి అలాంటప్పుడు ప్రేక్షకుల పాత్రేమిటి అని అడిగితే ఒక చివరి మాట చెప్పుకుని తీరాలి. ప్రేక్షకులకు వచ్చిన నష్టమేమీ లేదు. వాన పాటల్లో హీరోయిను, తమకిష్టమైన హీరో కలిసి వేసే స్టెప్పులు, లేక సెంటిమెంటల్ డైలాగులు, ఒక రకంగా భాషను వెటకారాలతో నింపేసి ఓవరాక్షనుతో రూపాయికి రెండు రూపాయలైనా దట్టించి వేసే సైడు క్యారెక్టర్ల జోకులూ లేకపోతే తెలుగు సినిమా చూసిన ఫీలింగే వుండదు. అసలు సిసలు తెలుగు ప్రేక్షకులు అట్లాంటి కండీషనుకలవాటు పడ్డాక కొత్త పేరుతో హాలీవుడ్ ప్రయోగాలు పట్టుకొచ్చి ఎవరైనా పాటలూ గట్రా లేకుండా సినిమాలు తీస్తే వాళ్ళకసలు తెలుగు సినిమా చూసిన ఫీలింగే రాదు. అందుకే తెలుగు సినిమాలు ఎక్కువగా రావాలంటే ఇప్పుడున్న సంప్రదాయాలే ఇకముందుకూడా ఆచరించక తప్పదు. ప్రేక్షకులు ఇవ్వాళ పొద్దున్నే లేచి మేం క్వాలిటీ లేకపోతే చూడం అంటే మరి ఇప్పుడున్నంత ఎంటేర్టైన్మెంటు వుండదు. ఇంత చాయిస్ కూడా వుండదు. మరి సాధారణ తెలుగు సినిమా ప్రేక్షకులను వాళ్ళకు కొత్త అంశాలను స్పృశించే ప్రయోగాలు కావాలా లేక ఇదివరకొచ్చినటువంటివే కొత్త హీరోయినులను పెట్టి చూపించాలా అనడిగితే మనకొచ్చే సమాధానమేమిటో ఇంతవరకూ ఈ వ్యాసం చదవగలిగిన మీకందరికీ తెలిసే వుండాలి. విశ్వనాధ్ రసధునో, రాఘవేంద్రరావు పాటలో, కోడి రామకృష్ణ కథో వుండి పరుచూరి వారి డైలాగులు, వేటూరి, సిరివెన్నలల పాటలతో పాటు బాబూ మోహను, బ్రహ్మానందాలను కూడ చూపించారో ఇక పెట్టిన రూపాయికి ఇంకో పావలా కలిపుకుని వచ్చేసినట్టే. తెలుగు ప్రేక్షకుడెప్పుడూ ఆర్ధిక మంత్రికి ఏమాత్రం తక్కువకాని లెవెల్లోనే ఆలోచిస్తాడు మరి.