నేనొక చిత్రమైన చిక్కుముడి: 2. ఆలోచనను ఆలోచిస్తున్న ఆలోచన

అవునంటావా? కాదంటావా?

ప్రయాణం మొదలైతే పెట్టేను కానీ ఒక పక్క బెరుగ్గానే ఉంది. బిక్కు బిక్కుమంటూ అడుగులు వేస్తున్నాను. అంతలో హఠాత్తుగా నా ఎడమ చెవి వైపు, ‘హలో’ అని వినిపించింది. బయటనుండి ఎవరైనా నా ఎడమ చెవిలో ఊదారో, లేకపోతే నా లోపలినుంచి ఎడమ చెవి ద్వారా ఆ మాట బయటకి వచ్చిందో నాకు తెలియలేదు. ఏదైతేనేం హఠాత్తుగా మాటలు వినపడేసరికి ఉలిక్కిపడ్డాను. ఇటూ అటూ ఎవరూ లేరు. అసలే భయంతో ఉన్నానేమో, యీ వింతకి మరింత భయం వేసింది.

“ఎందుకలా ఉలికిపడతావ్!” మళ్ళీ అదే గొంతు.

“ఎవరు నువ్వు?” కొద్దిగా ధైర్యం చేసి నా గొంతు పెగిల్చాను.

“నువ్వే నేను.” జవాబు వచ్చింది. ఆ గొంతు నెమ్మదిగానే ఉన్నా, అంటున్న ఆ మాటలకి భయం రెట్టింపయింది. ఇదేదో దెయ్యమో పిశాచమో లాగుంది. ప్రయాణం మొదలుపెడుతూ ఏ వినాయకుడినో తలుచుకోకుండా బేతాళుడిని తలచుకున్నాను. కొంపదీసి ఆ బేతాళుడు కాదు కదా!

“కొంపతియ్యకుండానే నేను బేతాళుడిని కాను లేవోయ్. నువ్వేమైనా విక్రమాదిత్యుడివా ఏంటి, బేతాళుడు నీతో మాట్లాడ్డానికి.”

నేను మనసులో అనుకున్నవి కూడా యితడికి తెలిసిపోతున్నాయి! నా భయం చూసి యితగాడికి నవ్వులాటగా ఉన్నట్టుంది.

“నువ్వెవరో నిజం చెప్పు. నువ్వు నేనేమిటి!” యీసారి కొంచెం గట్టిగానే అడిగాను.

“నీతో నువ్వు, నీలోకి నువ్వు ప్రయాణం మొదలుపెడితే మరి నీకు తోడెవరు వస్తారు, నువ్వు కాక!”

కొద్ది కొద్దిగా ఆ మాటలు అర్థమవుతున్నాయి. గొంతు కూడా పోల్చుకోగలిగాను. అవును, అది నా గొంతుకే. కాకపోతే ఒకవైపుగానే వినిపిస్తూ కాస్త వింతగా ఉంది. భయం తగ్గింది. అడుగులు నింపాదిగా ముందుకు పడ్డాయి.

“బేతాళుడిని కాకపోయినా నేనుకూడా నీకు అలసట తెలియకుండా కథలూ కబుర్లూ చెపుతానులే!” ఈసారి ఆ మాటలకు భయం పూర్తిగాపోయి హుషారొచ్చింది.

“ఇక ఆలస్యం దేనికి మొదలుపెట్టు మరి!”

ఎడమ నేను కథ చెప్పడం మొదలుపెట్టింది: అనగనగా ఒక రాజ్యంలో ఒక తత్త్వవేత్త ఉండేవాడు. ఊరికే తన మానాన తాను ఉండకుండా ప్రజలందరికీ తన తత్త్వాలను బోధించడం మొదలుపెట్టాడు. ఆ బోధలకు చిర్రెత్తుకొచ్చిన రాజు అతనికి మరణశిక్ష విధించాడు. అయితే ఆ తత్త్వవేత్త చాలా మేధావి అనీ, అతనికి మరణశిక్ష తగదనీ కొందరు సన్నిహితులు రాజుకు హితవు చెప్పారు. అప్పుడా రాజుకు ఒక చిలిపి ఆలోచన వచ్చింది. తత్త్వవేత్త మేధని పరీక్షించాలనుకుంటాడు. శిక్ష వేసే రోజున తత్త్వవేత్తని సభకి రప్పించి అతనితో, ‘నీకిప్పుడు ఉరిశిక్ష కానీ, శిరచ్ఛేదం కానీ విధించబడుతుంది. ఆ రెండిటిలో ఏమిటన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ నీకే యిస్తున్నాను. నువ్విప్పుడు ఒక వాక్యం చెప్పాలి. అది నిజం అయితే నీకు ఉరి, అబద్ధమైతే శిరచ్ఛేదం,’ అన్నాడు రాజు. తత్త్వవేత్త తడుముకోకుండా, ‘మీరు నాకిప్పుడు శిరచ్ఛేదం విధిస్తారు,’ అన్నాడు. అప్పుడు రాజు అతడికి ఏ శిక్ష విధించాడు?

బేతాళుడిలాగానే కథ చివర ప్రశ్న కూడా వేసిందే! ఇంకా నయం, తల వేయిచెక్కలవ్వడం వంటి ప్రమాదకరమైన నియమాలేం పెట్టలేదు! కొద్దిగా ఆలోచించగానే విషయం అర్థమయింది.

నేను: రాజు ఏ శిక్షా విధించలేడు.

ఎడమ నేను: ఎందుకు?

నేను: తత్త్వవేత్తకి ఉరిశిక్ష వెయ్యాలంటే, ఆ తత్త్వవేత్త చెప్పిన వాక్యం నిజం కావాలి. అంటే అతనికి శిరచ్చేదం విధించాలి. పోనీ శిరచ్ఛేదం విధించాలంటే, అతను చెప్పిన వాక్యం అబద్ధం కావాలి. అలాంటప్పుడు శిరచ్ఛేదం విధించే అవకాశం లేదు! అంచేత ఇప్పుడు అతనికి శిక్ష విధించాలంటే రాజు తన మాటను తప్పాలి! కాబట్టి ఏ శిక్షా విధించలేడు.

ఎడమ నేను: శభాష్! నా, అదే… మన పరువు నిలబెట్టావ్!

నేను: ఇది కచ్చితంగా తత్త్వవేత్తలు తమ గురించి తాము సృష్టించుకున్న వట్టి కట్టుకథే అయ్యుండాలి. ఏ దేశంలో ఏ రాజూ యిలా తాను విధించిన శిక్షని రద్దు చేసిన దాఖలాలు చరిత్రలో ఎక్కడా కనిపించవు మరి!

ఎడమ నేను: అవును. తత్త్వవేత్త చెప్పిన వాక్యంలో ఉన్న మెలిక ఈ కథలోని అసలు విషయం.[1] నువ్వు ఇంతకుముందు ప్రస్తావింవావే, ‘ఈ వాక్యం అబద్ధం’ అనే వాక్యం. దాని కోవకు చెందిన తిరకాసే (Paradox)యిది కూడాను.[2] అయితే, ఆ మెలికను తనకు వేయబోయే శిక్ష గురించి చెప్పే వాక్యంతోనే తయారుచేయడం ఇందులోని విశేషం. రాజు వేయాల్సిన శిక్ష వాక్యం తాలూకు తప్పొప్పులపై ఆధారపడుతుంది. ఆ వాక్యం తప్పా ఒప్పా అన్నది తిరిగి వేసే శిక్ష మీద ఆధారపడుతుంది! ఈ మెలికలో కూడా ఒక రకమైన ఆత్మసూచన (Self-Reference) దాగి ఉంది.

నేను: ఓహో, భలేగా ఉంది. ఈ ఆత్మసూచన నిజంగా పెద్ద తిరకాసు వ్యవహారంలాగే ఉన్నదే!

ఎడమ నేను: ఇలాంటి తిరకాసులన్నింటికీ కలిపి ఇంగ్లీషులో ఒక పేరుంది తెలుసా?

నేను: ఏవిఁటి

ఎడమ నేను: దానిని Liar’s Paradox అంటారు.

నేను: ఓహో. అయితే తెలుగులో దీనిని ‘తప్పొప్పుల తిరకాసు’ అందాం!

ఎడమ నేను: బావుంది, అలాగే అందాం! మనకి దొరుకుతున్న చరిత్ర బట్టి, ఆత్మసూచన ద్వారా ఏర్పడే తిరకాసులన్నింటిలోనూ పాతది యీ తప్పొప్పుల తిరకాసే. ఈ పేరడాక్సు అనేక కాలాలలో, అనేక రూపాలలో కనిపిస్తుంది.[3] అన్నింటిలోకి మొట్టమొదట కనిపించే రూపం ఏమిటో తెలుసా?

నేను: ఏమో నాకేం తెలుస్తుంది, నువ్వే చెప్పు.

ఎడమ నేను: “క్రీటనులందరూ వట్టి అబద్ధాలకోరులు, ఎప్పుడూ అబద్ధమే చెప్తారు” అని ఒక క్రీటన్ అంటే ఆ వాక్యం నిజమా అబద్ధమా?[4]

ఆ వాక్యం గురించి ఆలోచిస్తూ ఉండగానే ఎడమ నేను మళ్ళీ అందుకుంది.

ఎడమ నేను: ఇలాటివే మరికొన్ని అవతారాలు చూడు:

ఒక మనిషి తాను అబద్ధం చెపుతున్నానని అన్నాడు, అది నిజమా అబద్ధమా?[5]

‘ఈ వాక్యం నిజం కాదు.’ అనే వాక్యం నిజమా అబద్ధమా?[6]

‘ఈ వాక్యం వట్టి అబద్ధం’ అనే వాక్యం నిజమా అబద్ధమా?[7]

నేను: ఆగాగు. అలా నువ్వు గుక్కతిప్పుకోకుండా చెప్పుకుపోతుంటే ఎలా. నన్ను కాస్త ఆలోచించుకోనీ. ‘ఈ వాక్యం నిజం కాదు.’ అనే వాక్యం నిజమా అబద్ధమా? నిజం అనుకుందాం. అప్పుడు దాని ప్రకారం నిజం కాదన్నమాట! పోనీ నిజం కాదు, అనుకుందాం. ‘నిజం కాదు’ అన్నది నిజం కాకపోతే, అది నిజమే అవ్వాలి! అవును ఈ వాక్యాలన్నీ ఒకలాగే ఉన్నాయి కదా. మరి యిన్ని రకాలెందుకు?

ఎడమ నేను: అవును, ఈ వాక్యాలన్నీ సుమారు ఒకలాంటివే. చాలా చిన్న చిన్న తేడాలు మాత్రం ఉన్నాయి. వాటి గురించి నువ్వు తాపీగా ఆలోచించుకో. ఈ తప్పొప్పుల తిరకాసు వెనకనున్న అసలు మెలిక అర్థం అయ్యింది కదా?

నేను: ఓ అర్థమయింది. అసలు మెలిక వాక్యం తప్పొప్పుల నిర్ణయంలో ఉంటుంది. వాక్యం అబద్ధం అని మొదలుపెడితే అది నిజం అవుతుంది, నిజం అని మొదలుపెడితే అది అబద్ధం అవుతుంది. ఈ తిరకాసుకు కారణం ఆ వాక్యం తన గురించి తాను చెప్పుకోడమే కదా!

ఎడమ నేను: అవును. దీనికి దగ్గర చుట్టమే ఇంకొక పేరడాక్సు ఉంది.

“ఈ ప్రశ్నకు సరైన సమాధానం ‘కాదు’ అనా?” అని నేను అడిగితే, నీ సమాధానం ఏమిటి? అవునంటావా? కాదంటావా?

నేను ఆలోచనలో పడ్డాను. ‘ఈ ప్రశ్న’ అనేది ఆ వాక్యంలో ఉన్న ప్రశ్ననే సూచిస్తోంది. దానికి సమాధానం ‘అవును’ అంటే ఆ వాక్యం ప్రకారం ‘కాదు’ అవ్వాలి. ‘కాదు’ అంటే ఆ ప్రశ్నకు సమాధానం కాదే కాబట్టి, ఆ వాక్యానికి సమాధానం ‘అవును’ అవ్వాలి. అవునంటే కాదనిలే, కాదంటె అవుననిలే – ఏ.ఎమ్. రాజా గొంతు వినిపించింది!

నేను చెప్పకపోయినా నాకు సమాధానం తెలిసిపోయిందని ఎడమ నేనుకు ఎలాగో తెలిసిపోతుంది కదా! అంచేత కబుర్లు కొనసాగించింది.

ఎడమ నేను: సరిగ్గానే ఆలోచించావు. ఇందులో కూడా ఉన్నది అదే తిరకాసు. వాక్యం తప్పా-ఒప్పా అన్న ప్రశ్న బదులు, సమాధానం అవునా-కాదా అన్నదిక్కడ ప్రశ్న. సరే, తమ గురించి తాము చెప్పుకోలిగే శక్తి వాక్యాలకే కాదు, పదాలకు కూడా ఉంది తెలుసా!

నేను: పదాలు కూడా తమ గురించి తాము చెప్పుకోగలవా? అదెలా!

ఎడమ నేను: చెపుతానుండు, కంగారు పడకు. అలాంటి పదాల ద్వారా కూడా తిరకాసులను సృష్టించవచ్చును. తర్కశాస్త్రంలో చాలా ప్రసిద్ధమైన ఒక ఉదాహరణ చెప్తాను విను.[8] ఇది కాస్త ఎక్కువగా బుర్రపెట్టి ఆలోచించాల్సిన విషయం. కాబట్టి కొంచెం శ్రద్ధగా వినాలి మరి.

నేను బుద్ధిగా తలూపాను.

ఎడమ నేను: నీకు విశేషణాలు, అదే adjectives, అంటే ఏమిటో తెలుసు కదా?

నేను: ఓ ఎందుకు తెలీదు! ఒక వస్తువులో ఉన్న విశేషాన్ని చెప్పే పదం విశేషణం. భాషలో చాలా విశేషణ పదాలుంటాయి కదా. పెద్ద, చిన్న, పొడుగు, పొట్టి, వేడి, చల్లన, చక్కని. అలాగే రంగులను సూచించే పదాలను కూడా విశేషణాలుగా వాడొచ్చు – తెలుపు లేదా తెల్లని, నలుపు లేదా నల్లని, ఎరుపు లేదా ఎర్రని, యిలా. భాషని సూచించే పదాలు కూడా విశేషణాలుగా ఉపయోగపడతాయి. మచ్చుకు – ఇంగ్లీషు సినిమా, తెలుగు పత్రిక, హిందీ పాట మొదలైన మాటలలో భాషని సూచించే పదాలు విశేషణాలు. అలాగే సంఖ్యా వాచకాలూను. ఒక చెట్టు, రెండు పుస్తకాలు, బహుళ జాతులు – వీటిలోని ఒక, రెండు, బహుళ, యివి విశేషణాలు.

నా భాషా జ్ఞానాన్ని గడగడా ఏకరువుపెట్టాను.

ఎడమ నేను: సరిగ్గా చెప్పావు. అంతే కాదు. విశేషణం అంటే ఎప్పుడూ ఒక పదమే ఉండాలని లేదు. ఒకటి కన్నా ఎక్కువ పదాల కూర్పు కూడా విశేషణాలయ్యే సందర్భాలుంటాయి. ఉదాహరణకు – ‘మూడక్షరాల పదం’ అన్న కూర్పులో ‘మూడక్షరాల’ అనేది ‘పదా’నికి విశేషణం. అలాగే ‘బహుళ పద వాక్యం’ అన్నప్పుడు ‘బహుళ పద’ అనేది ‘వాక్యా’నికి విశేషణం. అర్థమయిందా?

నేను: అర్థమయింది.

ఎడమ నేను: పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టుగా, విశేషణాలలో విశేషమైన విశేషణాలు కొన్ని ఉన్నాయి!

ఊపిరిపీల్చుకోడానికా అన్నట్టు ఒక్క క్షణం ఆగింది. నాలో ఉత్సుకత పెరిగింది.

ఎడమ నేను: ఈ విశేషణ పదాలను జాగ్రత్తగా చూడు – చిన్న, ఒక, ఏక, తెలుగు, ఐదక్షరాల. వీటిలో ఉన్న ప్రత్యేకత గుర్తించగలవా?

కొద్దిగా ఆలోచించాను. ‘ఐదక్షరాల’ది ఏమిటి అవ్వగలదు? ఆఁ తట్టింది.

నేను: ఇవన్నీ ఒక పదానికి విశేషణంగా వాడవచ్చు. ‘చిన్న పదం’, ‘ఒక పదం’, ‘తెలుగు పదం’, ‘ఐదక్షరాల పదం’, యిలా.

ఎడమ నేను: సరిగ్గానే చెప్పావు. అంత కన్నా మరో గొప్ప ప్రత్యేకత కూడా ఉంది. మరోసారి ఆలోచించు తెలుస్తుందేమో.

ఇంకేం విశేషం ఉంది చెప్మా? కొద్దిగా ఆలోచించాను. ఊఁహూఁ తెలియడం లేదు.

ఎడమ నేను: ‘చిన్న’ అనే పదం చిన్న పదమా పెద్ద పదమా?

నేను: చిన్న పదం.

ఎడమ నేను: అలాగే ‘ఐదక్షరాల’ అనే పదంలో ఎన్ని అక్షరాలున్నాయి?

నేను: ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు!

ఎడమ నేను: ఇప్పుడర్థమయిందా వీటిలోని ప్రత్యేకత?

నేను: ఓహ్! అర్థమయింది. ‘ఒక’ అనే పదం తీసుకుంటే అది ఒక పదమే! ‘తెలుగు’ అనేది తెలుగు పదమే. ‘ఐదక్షరాల’ అనేది అక్షరాలా ఐదక్షరాల పదమే!

ఎడమ నేను: అంటే ఇవి తమ గురించి తాము చెప్పుకుంటున్నాయి, తమని తామే సూచించుకుంటున్నాయన్న మాట.

నేను: అవునవును! పదాలు తమ గురించి తామే చెప్పుకోవడం అంటే ఇదేనన్నమాట!

ఎడమ నేను: అవును. ఇది కూడా ఒకరకమైన ఆత్మసూచనే. తమలోని విశేషాన్ని తామే సూచించే యిలాంటి విశేషణాలను స్వవిశేష విశేషణాలు అందాం. ‘స్వవిశేష’ అంటే తనలోని విశేషాన్ని తనే సూచించే విశేషణం.

నేను: స్వవిశేష విశేషణం! బావుంది!

ఎడమ నేను: తమని తాము సూచించుకొనే విశేషణాలు ఉన్నప్పుడు, తమని తాము సూచించుకోని విశేషణాలు కూడా ఉంటాయి కదా? అలాంటి వాటిని కొన్ని చెప్పు చూద్దాం.

దీనికి పెద్దగా ఆలోచించనక్కరలేకపోయింది.

నేను: పెద్ద, అనేక, ఆంగ్ల, ఏకాక్షర. ఇవి కూడా ఒక పదానికి, లేదా పదాల కూర్పుకి విశేషణంగా వాడదగిన పదాలే. ‘పెద్ద పదం’, ‘అనేక పదాలు’, ‘ఆంగ్ల పదం’, ‘ఏకాక్షర పదం’, యిలా. అయితే ఆ విశేషణ పదాలకు అవి సూచించే లక్షణం లేదు. ‘పెద్ద’ అనే పదం పెద్దది కాదు కదా. ‘ఆంగ్ల’ అనేది ఆంగ్ల పదం కాదు తెలుగు పదం. ‘ఏకాక్షర’ అనేది నాలుగక్షరాల పదం.

ఎడమ నేను: బావుంది, దారిలో పడ్డావు! ఇలాంటి విశేషణాలను పరవిశేష విశేషణాలు అందాం. ‘పరవిశేష’ అంటే, తమలో ఉన్న విశేషం కాకుండా వేరే పదాలలోని విశేషాన్ని సూచించే లక్షణం అన్న మాట. ఏ విశేషణమైనా ‘స్వవిశేషం’ అయినా కావాలి, లేదా ‘పరవిశేషం’ అయినా కావాలి. అంతేకదా?

నేను: అంతే అంతే!

ఎడమ నేను: సరే, యీ స్వవిశేష, పరవిశేష విశేషణాల గురించి నీకు పూర్తిగా అర్థమయినదో లేదో చూద్దాం. అజంత, హలంత, నిర్యోష్ఠ్య – ఈ పదాలలో ఏవి స్వవిశేష విశేషణాలో, ఏవి పరవిశేష విశేషణాలో చెప్పు.

నేను: అజంత అంటే అచ్చుతో అంతమయ్యే పదాలు, హలంత అంటే హల్లుతో అంతమయ్యే పదాలే కదా. మరి నిర్యోష్ఠ్య అంటే?

ఎడమ నేను: పెదవుల కదలికతో పలికే వర్ణాలను ఓష్ఠ్యాలు అంటారు. ప, ఫ, బ, భ, మ అనే హల్లులు ఓష్ఠ్యాలు. అలాగే అచ్చుల్లో ఉ, ఊ, ఒ, ఓ – పలికేటప్పుడు పెదవులు గుండ్రంగా చుట్టాలి. అంచేత అవికూడా ఓష్ఠ్యాలే. ఓష్ఠ్యాలు లేని పదాలను నిర్యోష్ఠ్యాలు అంటారు.

అర్థమయింది. ఒక రెండు నిమిషాలు ఆలోచిస్తే ఎడమ నేను అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం దొరికిపోయింది. మీరు కూడా ఆలోచించండి.

ఎడమ నేను: సరే, ఈ మెట్టుకూడా ఎక్కేసావు. ఇప్పుడొకసారి గట్టిగా ఊపిరి పీల్చుకో. అసలైన చిక్కుముడి ఇప్పుడు రాబోతోంది!

నేను ఊపిరి పీల్చుకొని సిద్ధమయ్యాను.