ఎవ్వరైనా విడిపోవడానికి
పెద్దగా కారణాలేమీ అక్కర్లేదు
మర్రివిత్తనమంత అపార్థం
మస్తిష్కపు పొరల్లో మొలకెత్తితే చాలు
అది ఊడలు దిగి పాతుకుపోయి
మనిషికి మనిషికి మధ్య
ఎడతెగని దూరం పెరగటానికి-
ఒకరితో ఒకరు కలవక పోవటానికి
యుద్ధాలే జరగనక్కర్లేదు
మాటల మాయలేడి
సమూహంలో సంచరిస్తే చాలు
మదికి మదికి మధ్య నిర్మించుకున్న
అనురాగ వారధి
అమాంతం కూలిపోవడానికి-
మాటకు మాట అనుకోవలసిన అవసరం
అసలే లేదు
మంథర లాంటి మనిషి
మన మధ్య తిరుగాడితే చాలు
మనసుకు మనసుకు మధ్య
ఆరని చిచ్చు రేగి
బాంధవ్యాలు బూడిదపాలవడానికి-
ఒకరితో ఒకరు
గొడవ పడవలసిన అవసరం
అంతకన్నా లేదు
గోడమీద పిల్లిలాంటివారు
పంచన చేరితే చాలు
అంతరాలెరుగని ఆత్మీయుల మధ్య
తీరని అగాధం ఏర్పడడానికి-
విడిపోయినవారు కలవడానికి
పెద్దగా సందర్భాలేమీ అక్కర్లేదు
పాతజ్ఞాపకాల పరిమళ సుగంధాలు
ఆప్యాయంగా చల్లుకుంటే చాలు
అపార్థాల గోడలు కూలిపోయి
బలహీన పడిన బాంధవ్యాలు
పూర్వపు వైభవాన్ని సంతరించుకోడానికి.