కొందరు సెల్‌ఫోన్‌లు పోగొట్టుకుంటారు, తర్వాత వెతికి పట్టుకుంటారు. కొందరు పెన్ను పోగొట్టుకుంటారు, వెతుక్కుంటారు. కొందరు తాళంచెవి. కొందరు ఇంకేవో. నేను ఒకసారి నా కారుని పోగొట్టుకున్నాను.
ఆ రోజు టొరాంటోలో మంచు ఎక్కువగా కురుస్తుందనీ, వాతావరణం తల్లకిందలవుతుందనీ ఎఫ్.ఎమ్. రేడియోలో అనౌన్స్‌మెంట్ వస్తూనే ఉంది. నేను తొందరగా హాస్పిటల్‌కి చేరుకున్నాను. నా అపాయింట్‌మెంట్ టైమ్‌కల్లా రిసెప్షన్‌లో ఉండాలి. అందుకు ఇంకా ఐదు నిముషాలు టైమ్ మాత్రమే ఉంది. ఆ హాస్పిటల్‌లో పార్కింగ్‌కి ఐదు ఫ్లోర్లున్నాయి. కానీ ఎక్కడా ఖాళీల్లేవు. పార్కింగు కోసం వెతుకుతూ కార్లు చక్కర్లు కొడుతున్నాయి. నేను కూడా కొన్ని రౌండ్‌లు తిరిగి ఒక ఖాళీ చూసి నా కార్ పార్క్ చేసి డాక్టర్ దగ్గరకు పరుగుతీశాను. ఆ తొందర్లో కారు ఎక్కడ పార్క్ చేశానో, ఆ పార్కింగ్ స్లాట్ నెంబర్ ఏంటో చూసుకోలేదు.
అది మధ్యాహ్నం రెండు గంటల సమయం. నేను డాక్టర్‌ని కలిసి తిరిగి వచ్చేసరికి కారెక్కడ పార్క్ చేశానన్నది గుర్తు రావడంలేదు. ఏ ఫ్లోరన్నది, ఏ వింగ్, ఏ స్లాట్ అన్నది కూడా గుర్తు లేదు. నా చేతిలో ఉన్న రిమోట్ తాళంతో నొక్కి ఎక్కడైనా హెడ్‌లైట్స్ వెలుగుతాయా అని నెమ్మదిగా ఒక్కో వరసా చూసుకుంటూ వచ్చాను. ఇప్పుడిలా రాస్తున్నాను గాని, నిజానికి అప్పుడు కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఒక క్రమమంటూ లేకుండా వెతుకుతూ తిరిగాను. కారు కనిపించలేదు.
అలా రిమోట్ తాళం చెవిని సెకండుకొకసారి నొక్కుకుంటూ తిరుగుతున్నప్పుడే చూశాను ఆ ఇంగ్లీషు జంటని. భార్యని వీల్‌చెయిర్‌లో కూర్చోబెట్టి తోసుకుని వెళ్తున్నాడు. అతనికి సుమారు 45 ఏళ్ళుంటాయి, ఆమెకు ఒక రెండు మూడేళ్ళు తక్కువుండచ్చు. ఆమెను ఉత్సాహపరిచేందుకు గట్టిగట్టిగా ఏవో చెప్పుకుంటూ నడుస్తున్నాడు. ఆమె ఒకప్పుడు మంచి అందగత్తె అయుండొచ్చు. ఇప్పుడు మాత్రం చిక్కిపోయి 70 పౌండ్‌ల బరువుతో వీల్‌చెయిర్‌లో సగం కూడా నింపలేకపోతోంది ఆమె దేహం. ఆమె తల ఒక పక్కకి వాలిపోయివుంది. జుత్తు చాలామటుకు రాలిపోయింది. భర్త చెప్పినదాన్ని విని నవ్వే ప్రయత్నం చేస్తూ ఉంది. నన్ను దాటుకుని హాస్పిటల్ ఎంట్రన్స్ వైపుకి వీల్‌చెయిర్ నడుపుతూ వెళ్ళిన ఆ మనిషి నేను తాళం చెవి నొక్కుతూ కార్ వెతకడాన్ని గమనించి,
“కార్ తప్పిపోయిందా?” అనడిగాడు.
“కార్ అక్కడే ఉంది. నేనే తప్పిపోయాను,” అన్నాను.
ఓ నవ్వు నవ్వి, “వెతకండి దొరుకుతుంది. మీరు కుక్కనో, పిల్లినో పోగొట్టుకోలేదు. అవైతే తప్పిపోయినచోటే ఉండవు. కాళ్ళున్న జీవులు కదా, వెతికిపట్టుకోవడం కష్టం. మీ కార్ కదలకుండా మీరు పార్క్ చేసిన చోటే ఉంటుంది. కనిపెట్టేయగలరు,” అని చెప్పి వీల్‌చెయిర్ తోసుకుంటూ వెళ్ళిపోయాడు.
నేను నా వెతుకులాట కొనసాగించాను. ఒక గంటసేపు పైనా కిందా అన్ని ఫ్లోర్‌లలోనూ వెతికినా కార్ దొరకలేదు. ఆశ్చర్యంగా ఉంది. ఒక పిల్లర్‌కి పక్కన కుడివైపు పార్క్ చేసినది మాత్రం గుర్తుంది. ఇప్పుడు కుడివైపు పిల్లర్లున్న స్లాట్‌లు మాత్రం వెతుకుతూ, రిమోట్ బటన్ నొక్కుకుంటూ వచ్చాను. ఎక్కడా హెడ్‌లైట్‌లు వెలగలేదు. అంత పెద్ద పార్కింగ్ లాట్‌లో ఐదు ఫ్లోర్లలో అటూ ఇటూ తిరిగి నా కాళ్ళు అలసిపోయాయి. పార్కింగ్ లాట్ ఉద్యోగి దగ్గరకెళ్ళి నా పరిస్థితిని వివరించాను. అతను అది రోజూ జరిగే ఒక సాధారణ విషయంలా తేలిగ్గా తీసుకుంటూ నాకేసి చూసి, “క్షమించండి. ఇప్పుడు విజిటర్స్‌ను వదిలి రాలేను. ఇంకో గంటలో నా డ్యూటీ అయిపోతుంది. అప్పుడు వచ్చి మీకు సాయపడగలను,” అన్నాడు.
మళ్ళీ నా అన్వేషణ కొనసాగించాను. మరోగంట సమయం వెతికుంటాను. బయట ఒక అడుగు ఎత్తున మంచు కురిసి ఉంది. ఇంతలో, ఇందాక నేను చూసిన వీల్‌చెయిర్ అతను తిరిగొచ్చాడు. ఇప్పుడు వీల్‌చెయిరూ లేదు, భార్యా లేదు. నన్ను చూసి నవ్వి,
“ఇంకా వెతుకుతున్నారా?” అనడిగాడు.
“కారు ఎక్కడికీ వెళ్ళలేదు. ఇక్కడే ఎక్కడో ఉంది,” అన్నాను.
అతని భార్యకి డాక్టర్‌లు పరీక్షలు చేస్తున్నారు. ఇంటికెళ్ళి ఏవో కొన్ని సామాన్లు తీసుకురావాలి- అని చెప్పి తన కారు వైపుకు వెళ్ళిన అతను మళ్ళీ వెనక్కొచ్చాడు.
“ఏం కారు?” అడిగాడు. చెప్పాను. “ఏం రంగు?” చెప్పాను. “ప్లేట్ నెంబర్?” అదీ చెప్పాను.
కారు తాళాలు తీసుకున్నాడు. అతను రిమోట్ తాళం నొక్కుతూ ఒక వైపునుండి వస్తే నేను మరో వైపునుండి చూస్తూ అతని వైపుకి నడిచాను. ఇలా పదినిముషాలు వెతగ్గా ఒక పిల్లర్ పక్కన కార్ హెడ్‌లైట్ మిణుకు మిణుకుమంటూ కనిపించింది.
“అదే! అదే!” అని అరిచాను.
అతను తాళం చెవి నా చేతికిచ్చాడు. ధన్యవాదాలు చెప్పాను. అతని పేరడిగాను.
“నా పేరు తెలుసుకుని ఏం చేస్తారు?” అనడిగాడు.
“మీకు ప్రతి ఉపకారం ఏమీ చెయ్యలేనేమోగానీ, కనీసం మీ పేరైనా గుర్తుపెట్టుకుంటాను,” అన్నాను.
“నోమ్” అన్నాడు.
“మీ భార్య త్వరగా కోలుకుని ఇంటికి వస్తారు.”
“ఇక రాదు.” అన్నాడు. అతని ముఖకవళికలు మారిపోయాయి. ఎందుకు చెప్పానా అన్నట్టు అయిపోయిందతని ముఖం.
నాకు వీపు చూపి తన కారు వైపుకి నడుస్తూ వెనక్కి తిరక్కుండానే చేయెత్తి ఊపుతూ వీడ్కోలు చెప్పాడు.
[మూలం: ‘వెళిచ్చం’ 16 నవంబర్ 2010 ‘సొల్వనం’ అన్న ఆన్‌లైన్ పత్రికలో వెలువడిన కథ]
రచయిత గురించి: శ్రీలంక, యాళ్పాణంలో జనవరి 19, 1937న జన్మించిన అప్పాదురై ముత్తులింగం విజ్ఞానశాస్త్ర పట్టభద్రుడు. శ్రీలంకలో చార్టర్డ్ అకౌంటంట్ గానూ, ఇంగ్లండ్‌లో మేనేజ్‌మెంట్ అకౌంటంట్ గానూ పట్టా అందుకున్నారు. ఉద్యోగనిమిత్తం పలు దేశాలలో నివసించి, ఇరవై ఏళ్ళు ఐక్యరాజ్యసమితిలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన తరువాత తన అనుభవాల ఆధారంగా తమిళ భాషలో కథలు, నవలలూ రాస్తున్నారు. ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తమిళ భాషకి పర్మనెంట్ ఛెయిర్ కొరకు ఒక వలంటీర్ గ్రూప్ అధ్యక్షుడుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో పుస్తకాలు రాశారు. 1964లో ప్రచురించబడిన వీరి కథల సంపుటి ‘అక్క’ ఎన్నో బహుమతులు గెల్చుకుంది.