శాక్యమౌనీంద్రుఁడే స్థలమందు ధర్మబో
ధామృతంబును బంచె నహరహంబు,
అల వర్ధమానమహావీరపాదాంక
పూతమై యేభూమి ఖ్యాతిగాంచె,
తరతరంబులనుండి ధర్మమార్గము దెల్పు
హైందవాచార్యు లే యవని మనిరి,
వివిధదేశాగతవిజ్ఞానశోధక
మండలి కే నేల యండయయ్యె,
మగధదేశమకుటమాణిక్యమో యనం
బరగు నాస్థల మొక పురవరమ్ము,
సర్వభారతంబు గర్వింపఁ దగినట్టి
జ్ఞానసంపద కది గనియె సుమ్ము.
అందున నిల్చి బుద్ధముని హద్దులెఱుంగని ధర్మబోధచే
విందొనరించుచుండుటను వీనుల కెప్డు, ప్రసిద్ధమయ్యె “నా
లంద”సమాఖ్య నా పురలలామము, తత్సమయంబునుండి కన్
విందొనరింతు రందునను వేనకు వేలుగ బౌద్ధభిక్షువుల్.
రణమునఁ బాఱినట్టి పెనురక్తపుటేరులచే విరక్తుఁడై
మనమున బుద్ధసంవిదితమార్గమె దేశముఁ గెల్వ నర్హమౌ
ననుచును శాంత్యహింస లను నాయుధము ల్గొని సర్వభారతా
వనిని జయించినట్టి జనవంద్యుఁ డశోకుఁడు తత్పురంబునన్.
నలంద విశ్వవిద్యాలయ శిథిలాలు 1
(ఇంటర్నెట్ ఆర్కైవుల నుండి.)
శ్రమణకులు సుఖంబుగ వి
శ్రమియించగఁ దగు విహారసంఘముఁ గట్టెన్
శ్రమణకుల ప్రార్థనార్థము
రమణీయం బయిన చైత్యరాజిని నిల్పెన్.
ఏ మహామహినాథు లింద్రవైభవముతో
భరతావనిం జక్రవర్తు లైరి,
ఏ చక్రవర్తులు హిందూమతసుమగం
ధిలముగా జేసిరి దేశమెల్ల,
ఏ హైందవాధీశు లితరమతస్థుల
నెల్లఁ జూచిరి సమదృష్టితోడ,
ఏ సమదృక్పతు లెల్ల శాస్త్రంబుల
ప్రగతికై తగినట్టి ప్రాపు నిడిరి,
కావ్యనాటకజ్యోతిషగణితములును
వ్యాకరణశిల్పసంగీతవైద్యవిద్య
లే మహీశుల ప్రాపుచే వృద్ధినందె
నట్టి గుప్తమహీశాన్వయంబునందు.
కలశవారాశిఁ జంద్రుండు మొలచినట్లు
కువలయామోదకరుఁడౌచు నవతరిల్లి
అవని నేలు కుమారగుప్తాఖ్యనృపతి
ఆ పురంబున కొకసారి యరుగుదెంచి.
అనతివిస్తారముగ నట నామ్రవనము
నందు నున్న విహారములందు నున్న
చదువులభ్యసించుచు నున్న ఛాత్రగణముఁ
గని మనసు కరఁగంగ యోజనము సేసి.
నేలను నెందులేని కరణిం బహువిస్తృతమైన విశ్వవి
ద్యాలయ మందుఁ గట్టఁగ రయంబుగఁ బంపెను శిల్పివర్యులన్,
మేలగు కర్మకారులను, మేదురవాస్తుకళావిదగ్ధులన్,
ఱాలను, నిష్టకాదిబహుళంబగు ద్రవ్యములం గ్రమంబుగన్.
వారలు గట్టి రచ్చట నవంబగు చైత్యవిహారశాలలన్,
చారుతరాలయంబులను, ఛాత్రగురూత్కరవాసశాలలన్,
స్ఫారసుమంజులాధ్యయనశాలలఁ, జక్కని పాకశాలలన్,
భారతికి న్నిరంతరము వాసములై తగు గ్రంథశాలలన్.
శాలల కుడ్యభాగములఁ జక్కని స్త్రీపురుషాకృతుల్, ప్రసూ
నాళుల వల్లరుల్ దొలచి రచ్చటి శిల్పు, లచేతనంబులౌ
ఱాలును మానవాకృతుల రంజిలు చా జగదేకవిశ్వవి
ద్యాలయమందు జ్ఞానసముపార్జనశీలము లయ్యెనో యనన్.
చెలువు మీరఁగఁ గోడలం జెక్కినట్టి
సుమరసంబులఁ గ్రోలెడి భ్రమరకులము
లచట విద్యామృతాస్వాదనార్థు లగుచుఁ
దివురు ఛాత్రసంతతికిఁ బ్రతీక లయ్యె.
వలసిన యన్ని శిష్యగురువాసగృహంబులు, వాని ప్రక్కలం
బొలువగు పూలతోఁటలును, ఫుల్లసరోరుహశోభితంబులౌ
కొలఁకులు, శిల్పరమ్యమగు కోవెలలుం గల యట్టి యష్టశా
ఖలు గల ప్రాంగణంబులను గట్టిరి శిల్పికులేంద్రు లచ్చటన్.
ఆయష్టావరణంబులు
మాయాదేవీతనూజమానసమనితా
మేయాష్టాంగాధ్వంబుల
కీ యవనిఁ బ్రతీక లగుచు నింపెసలారెన్.
పదిల పరచంగ పుస్తకప్రతతు లెల్ల
రత్నసాగరమన, రత్నరంజకమన,
మఱియు రత్నోదధి యనంగఁ బరగు మూఁడు
గగనమంటెడి భవనాలు గట్టిరచట.
తొమ్మిది యంతస్తులతో
నిమ్మహిఁ గల వహుల కెల్ల నిండ్లయి తద్వే
శ్మమ్ములు దనరెం జదువుల
కొమ్మకుఁ గట్టిన మురువపుకోవెల లనఁగన్.
అంబరము నంటు నాపుస్తకాలయంబు
లందు నప్పుడప్పుడు సొచ్చి యమరవరులు
దీర్ఘవేదాంతవిషయసందేహములను
దీర్చికొందురు గ్రంథముల్ త్రిప్పి త్రిప్పి.
సాంగవేదములందు, షడ్దర్శనములందు
నిష్ణాతులైన పాండిత్యఖనులు,
సర్వాస్తివాదసూక్ష్మార్థకోవిదులైన
హీనయానమతవిజ్ఞాననిధులు,
మహితమహాయానమతమాధ్యమకచిత్త
మాత్రాధ్వవిదులైన మాన్యబుధులు,
సంస్కృతప్రాకృతసాహితీవ్యాకర
ణజ్ఞులై తనరారు ప్రాజ్ఞవరులు,
తర్కరాజకీయార్థశాస్త్రంబులందు,
జ్యోతిషగణితాయుర్వేదసుశ్రుతంబు
లందు, శిల్పచిత్రకళలయందుఁ బండి
తోత్తములయిన గురువర్యు లుండి రచట.
జ్ఞానచంద్రుండు, గుణమతి, శాన్తరక్షి
తుండు, స్థిరమతి, నాగార్జునుండు, ధర్మ
పాలుఁడు, కమలశీలుఁడు, శీలభద్రుఁ
డాదిగాఁగల గురువర్యు లచట గలరు.
చీనాటిబ్బెటుపారశీకకొరియాశ్రీలంకలందుండియున్
నానాభారతదేశరాష్ట్రనగరాంతస్సీమలందుండియున్,
జ్ఞానార్థుల్ చనుదెంతు రచ్చటికి సచ్ఛాత్రుల్ మిళిందౌఘముల్
సూనారామమరందపానముకై చొత్తెంచు చందంబునన్.
మొదట నశోకుఁడుం బిదప భూరివదాన్యులు గుప్తభూపతుల్
తదుపరి హర్షవర్ధనుఁ, డుదారులు పాలనృపాలు రచ్చటం
జదువు నిరంతరంబుగను సాగుటకై యతిసస్యవంతమై
యొదవిన నూటికెక్కుడగు నూరుల దానము సేసి రిమ్ముగన్.
ఫుల్లపద్మంబు తావులం జల్లినటుల
చల్లుచున్ జ్ఞానగంధంబు జగతినెల్ల
రెండువేల గురువులు, పండ్రెండువేల
శిష్యులును గల్గ నాలంద చెందె వృద్ధి.
కాలగర్భానఁ గలిసెను క్రమముగాను
ఎనమిదేసి శతాబ్దంబు లీ విధాన
తారసిల్లెను ఘోరాతిఘోరమైన
ఆపద తదీయవిద్యాలయంబు కపుడు.
ఒక మ్లేచ్ఛుండు భయప్రదాత అధికారోన్మత్తచిత్తుండు పా
వకసంకాశకషాయితాక్షుఁడు మహావ్యాళోపమాంసుండు, స
ర్వకళాద్వేషి జనప్రఘాతకుఁడు భాస్వన్మూర్ఖతామూర్తి వ్రా
త్యకులాధీశుఁడు భారతావనికి ప్రాప్తంబైన శాపంబు నాన్.
రయసత్త్వాన్వితఘోటకవ్రజముపై రాఁ దోడుగన్ రాణువల్
భయదోచ్చండహుతాశనప్రతిముఁడై భక్త్యారుఖిల్జీసమా
హ్వయుఁడాతండు తురుష్కనాయకుఁడు సంపన్నంబులౌ దైవతా
లయముల్ బ్రాహ్మణసంపదల్ సరణి నెల్లం గూల్చి కొల్లాడుచున్.
నాలందావరణంబునుం దరిసి తీక్ష్ణక్రోధసందష్టుఁడై
ఱాలం దల్పులు వ్రచ్చి, లోనఁ గల యారామంబులుం జైత్యముల్
గూలంద్రోసి, తదంతరస్థులగు భిక్షుచ్ఛాత్రశీర్షంబులం
గాలం దన్ని సజీవమై పరగు తద్గాత్రంబులం గాల్చియున్.
నలంద విశ్వవిద్యాలయ శిథిలాలు 2
(ఇంటర్నెట్ ఆర్కైవుల నుండి.)
తొమ్మిదియంతస్తులతో
నిమ్మహిఁ గలిగిన తెలివికి నెల్లను నిల్లై
ప్రమ్మిన గ్రంథాలయభవ
నమ్ముల బూది యొనరించె నతఁడతిఖలుఁడై.
తరతరంబులు పట్టెను తరిచితరిచి
జ్ఞాననవనీతసంచయనంబు సేయ;
పట్టె నొక్క క్షణంబేను బాలిశునకు
బూది పాల్సేయ దానినిం బుద్ధిమాలి.
వేనకువేల గ్రంథములు వెల్మిడి పాలొనరింప నీగతిన్
పూనెను భూనభంబులను భూరితరాసితధూమమేఘముల్
భానుని రశ్మి వానిఁ జొరఁబాఱి స్పృశింపకయుండ ధాత్రినిం
బూనె ఘనాంధకార మిల పూర్ణముగా నొక కొన్ని మాసముల్.
శాంతియు దాంతియున్ సకలజంతువులం దనుకంప నూని య
శ్రాంతము జీవికల్ గడపు శ్రావకులం బరిమార్చి, పండిత
స్వాంతసుసంచితంబయిన జ్ఞానము నెల్లను బుగ్గిసేసి లో
నెంతయొ సంతసించె నతఁడింతకు మించిన క్రూరుఁడుండునే?
ఈ లీలన్ ధ్వస్తమయిన
నాలందాశిథిలములు కనంబడు నేఁడున్
కాలము ఖిల్జీఘాతుక
లీలల కెత్తిన పతాక లివ్వి యనంగన్.
ఎనిమిదివందలేండ్లు గతియించిన వీగతి భూతలంబునం
దనుపమమైన పల్కుచెలి హర్మ్య మొకానొక బూదిదిబ్బగా
నొనరుపఁబడ్డ నా దినమునుండి, ప్రపంచపు దృష్టిలోనఁ ద
ద్ఘనవిపదాస్మృతుల్ క్రమముగా మఱుఁగయ్యె నటంచు నెంచితిన్.
కానీ వింటిని బంగరు
కానిం బోలిన ప్రమోదకరమగు వార్తన్,
పూనిరి కట్టఁగ నాలం
దానవవిద్యాలయ మను దానిన్ నేఁడే!
చీనావారును సింగపూరుప్రభువుల్ శ్రీలంకజాపానుధా
త్రీనాథుల్ భరతోర్వినాయకులు సంప్రీతిన్ సమావేశమై
ఆ నష్టంబయి నట్టి చోట నవవిద్యాధానినిర్మింపఁగన్
ప్లానుల్ సేసిరి పూర్వవైభవము సంప్రాపింప నాలందకున్.
పునరుజ్జీవనముం గని
పొనరుతఁ బూర్వవిభవపరిపూర్ణంబై నూ
తననాలందయు; జగమె
ల్లను దనరుత జ్ఞానగంధిలంబయి మఱలన్.
రమ్మో భారతి! పూర్వవైభవముతో రత్నోదధి న్నిల్చి వి
శ్వమ్మెల్లన్ నినుఁ గొల్వఁ బంచుమిఁక శశ్వద్ జ్ఞాన సౌభాగ్యమున్,
సమ్మోదంబున వచ్చు ఛాత్రతతులన్ సచ్ఛీలురం జేయుచున్
కొమ్మా శాశ్వతగౌరవంబు నిఁక సంకోచంబు లేకిమ్మహిన్.
(ఇటీవల సింగపూరు, చైనా, జపాను ప్రభృతి దేశములయొక్క సహకారప్రేరణలతో భారతప్రభుత్వము నాలందలో పూర్వపు నాలందావిశ్వవిద్యాలయ స్థానముననే నవనాలందా అంతర్జాతీయ విశ్వవిద్యాలయమును స్థాపింప బూనెనన్న వార్త వినగానే కలిగిన స్పందన యిది. పూర్వనాలందావిషయములో నేను వ్రాసినవన్నీ అందులో విద్య నభ్యసించి, ఆ విద్యాలయవైభవమును గూర్చి వ్రాసిన చైనా, టిబెటుదేశపు విద్యార్థుల (ముఖ్యముగా హ్యుయెన్ త్సాన్గ్, యీ జింగ్) వ్రాతల మూలముగా వ్యక్తమైన యథార్థ విషయములే. భక్తియార్ ఖిల్జీ చేసిన వినాశమును సమకాలీన భారతదేశస్థ పారశీక చరిత్రకారుడు మిన్హాజ్-ఇ-సిరాజ్ తబాఖత్-ఇ-నాసిరీ అను గ్రంథములో వివరించి యున్నాడు. ఈ చారిత్రక విషయముల నన్నిటిని పరిశీలించియే నేనీ ఖండికను వ్రాసితిని. – రచయిత.)