ఒక ఆషాఢపు రాత్రి

చినుకు చినుకుగా మొదలయినప్పుడు
చెప్పొద్దూ, బాగానే అనిపించింది.
చాన్నాళ్ళకి వచ్చిందేమో, తనివితీరా తడవాలని…

ఎప్పటిదో పొడి జ్ఞాపకం ఒకటి
చినుకు తడి తగిలి
గుప్పున అలుముకుంది
ఒక నిశ్శబ్దపు గాలికెరటం తాకి
ఒళ్ళంతా సన్నని వణుకు

ఉరుములూ మెరుపులూ లేని ఒలిపిరి
ఒకటే ధారగా…

పోనుపోనూ ఆ చినుకులే సూదులై గుచ్చుతూంటే
అప్పుడు మొదలయ్యింది లోలోపల
ఓ సలపరింత
జోరందుకుంది జడిజడిగా…
ముళ్ళవాన

మాటల గొడుగు కాస్త అడ్డుపెట్టుకుందామని తీస్తే
అది కాస్తా పాతదై చిల్లులు పడి చివికిపోయి ఉంది
ఇక తప్పదు ఇలా
యీ తుఫానులో ఒంటరిగా
నడుస్తున్న కాలమంతా బురద బురద.

రాత్రంతా అలా కురుస్తూనే ఉంది
మౌనం
మన యిద్దరి మధ్యా…