ప్రబలరాజాధిరాజ వీరప్రతాప
రాజపరమేశ్వరార్థ దుర్గానటేశ
సాహితీసమరాంగణ సార్వభౌమ
కృష్ణదేవమహారాయ కృతినిగొనుము
– నేలటూరి వెంకటరమణయ్య; Further sources of Vijaya nagara history, 1946.
కృష్ణదేవరాయలు సింహాసనమెక్కి అయిదు వందలేళ్ళయిన సందర్భంలో ఆయన పేరు, విజయనగర సామ్రాజ్యం పేరు వార్తల్లో తరచుగా కనపడుతున్నాయి. ఈ సందర్భంలోనైనా రాయలు గురించి, అలాగే విజయనగర సామ్రాజ్యం గురించి గత వందేళ్ళల్లో వివిధ భాషల్లో వెలువడ్డ సాహిత్యాన్ని, ముఖ్యంగా ఈ కాలంలో జరిగిన చారిత్రక పరిశోధనలని, క్రోడీకరిస్తూ కనీసం ఒక్క పుస్తకమైనా తెలుగులో వెలువడుతుందని ఆశించాను. కానీ అలాంటిది, నాకు తెలిసినంతలో, ఈనాటి వరకు జరిగినట్లు లేదు[1].
ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఒకప్పుడు విజయనగర చరిత్ర పరిశోధనలో తెలుగువారి పాత్ర పెద్దది, ప్రముఖమైనది కూడాను. ఇక్కడ తప్పకుండా చెప్పుకోవలిసిన వ్యక్తి, ప్రసిద్ధ చరిత్రకారుడు, నేలటూరి వెంకటరమణయ్య. ఆయన తన కృష్ణదేవరాయలు (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణ, 1972) పుస్తకం ప్రారంభంలో “లభ్యమైన చరిత్రాంశముల నెల్ల గ్రోడీకరించి శ్రీకృష్ణరాయల చరిత్రమును సాధ్యమైనంతవరకు సంపూర్ణముగ రచియింపవలయునని” తన ఉద్దేశంగా చెప్పుకున్నాడు. గత నలభయి యేళ్ళలో ఆయన వారసత్వాన్ని యెవ్వరూ అంది పుచ్చుకున్నట్లుగా లేదు. కానీ ఇదే కాలంలో భారతీయేతర భాషల్లో విస్తృతమైన (నా దృష్టిలో, విశిష్టమైన) పరిశోధనలు వెలువడ్డాయి. ఈ పరిశోధనా సాహిత్యాన్ని క్లుప్తంగానైనా పరిచయం చేయాలన్నదే ఈ వ్యాసం యొక్క ముఖ్యోద్దేశం.
మూల ఆధారాలు
పైన పేర్కొన్న కృష్ణదేవరాయలు పుస్తకంలోని తొలి అయిదు పుటల్లో వెంకటరమణయ్య ముఖ్యమైన చారిత్రక మూలాధారాలను పొందుపరిచాడు. వాటిలో ఆయన ప్రత్యక్షంగా ప్రస్తావించనిది, శాసన ఆధారాలలో ముఖ్యమైనది ‘తిరుమల తిరుపతి దేవస్థానం వారి శాసనాలు’ (6 సంపుటాలు, 1931-38). ఇంక వాఙ్మయ రచనలలో ప్రముఖంగా ప్రస్తావించవలసినవి, 15-16 శతాబ్దాలలో రాయబడిన రాజకాల నిర్ణయము, విద్యారణ్య కాలజ్ఞానము, విద్యారణ్య వృత్తాంతము. ఈనాడు తెలుగుదేశంలో విజయనగర సామ్రాజ్య స్థాపన గురించి స్థిరపడిపోయిన అభిప్రాయాలకు (లేక ప్రాచుర్యంలోవున్న కథలకు) ఈ మూడు రచనలే మూలాలు అనవచ్చు.
రాయవాచకము, కృష్ణరాయవిజయము, సాళువాభ్యుదయము, రఘునాథాభ్యుదయము, అచ్యుతరాయాభ్యుదయము (రాజనాథ డిండిమ విరచితం), కంపరాయ చరిత్ర, వరదాంబికా పరిణయము, అన్న రచనలు కూడా విజయనగర చరిత్ర రచనలో ముఖ్యమైన ఆధార గ్రంథాలు. ఇంకా ఈ కాలంలో వెలువడిన పలు రచనల్లోని ‘అంకిత’ పద్యాల్లో ఆయా రాజకుటుంబాల వంశచరిత్రల గురించిన సమాచారం కొంతవరకు లభ్యమవుతుంది. ఇది మనకు తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ (తెలుగు చోడ రాజుల ప్రసక్తి) కాలం నుండి తెలిసినదే. నాచన సోమన ద్వారా మొదటి హరిహరరాయలు, వల్లభరాయుని క్రీడాభిరామము ద్వారా రెండవ హరిహరరాయలు, జక్కన విక్రమార్కచరిత్రలో మొదటి దేవరాయలు గురించిన విషయ సంగ్రహణ చేయవచ్చు. ఇలా శ్రీనాథుడి రచనల్లో రెండవ దేవరాయలు, తిమ్మన, పెద్దన, కృష్ణదేవరాయలు రచనల్లో కళింగ దిగ్విజయం, రామరాజభూషణుడు, చింతలపూడి ఎల్లనార్య, దోనేరు కోనేరునాథుల రచనల్లో సాళువ, తుళువ, ఆరవీడు రాజుల గురించిన ప్రస్తావనలు మనం చూడవచ్చు. అలాగే సింగయ మల్లన, పినవీరభద్రుడి రచనల్లో కూడా!
అలాగే ‘సాహిత్య’ రచనలు కాకపోయినా, శాస్త్ర గ్రంథాలలో కూడా కొంత విలువైన సమాచారం లభిస్తుంది. ఉదాహరణకు రెండవ బుక్కరాయని ఆస్థాన వైద్యుడైన లక్ష్మణ పండితుడు రాసిన వైద్యరాజవల్లభం అనే ఆయుర్వేద గ్రంథంలొ సంగమ రాజుల గురించి, గజపతి రాజైన ప్రతాపరుద్రుని సరస్వతీవిలాసము అనే ధర్మశాస్త్ర గ్రంథంలో గజపతి రాజుల గురించి, సంగీతసూర్యోదయము అనే సంగీతశాస్త్ర గ్రంథంలో భండారు లక్ష్మీనారాయణ కృష్ణదేవరాయల కళింగ రాజ్య విజయ ప్రసక్తి, తుళువరాజుల చరిత్ర గురించి చెప్పటం చూడవచ్చు. ఇలా తెలుగు సాహిత్యం విజయనగర చరిత్ర రచనకు ప్రముఖంగా తోడ్పడింది.
ఒకప్పుడు రాజాస్థానాల్లో వంది మాగధులు (భట్రాజులు) పాడిన బిరుదు గద్యాల నుండి రాజ్య వృత్తాంతాలుగా (Chronicles) రూపాంతరం పొందిన వెలుగోటివారి వంశావళి, రామరాజీయము[2] కెళదినృపవిజయము, ఆరవీటివంశచరిత్రము (కోనేరినాథుడి ద్విపద బాలభాగవతంలో ఒక భాగం) కూడా విలువైన ఆధారాలే. ఇలా వివిధ భాషల లోని (తెలుగు, కన్నడ, పర్షియన్… ) మూల ఆధారాలని, ముఖ్యంగా వాఙ్మయ రచనలని ఒక క్రమపద్ధతిలో సంకలిస్తూ, కొన్నిచోట్ల సంక్షిప్తంగాను, కొన్నిచోట్ల పూర్తిగాను చేసిన ఆంగ్లానువాదాలతో మొదటిగా వెలువరించింది మద్రాసు విశ్వవిద్యాలయంలో చరిత్రాధ్యాపకులైన ఎస్. కృష్ణస్వామి అయ్యంగార్ (Sources of Vijayanagara history, 1919).
వెంకటరమణయ్య, కే. ఏ. నీలకంఠశాస్త్రి సహసంపాదకత్వంలో పొందుపరచిన Further sources of Vijayanagara history (మూడు సంపుటాలు, మద్రాసు, 1946; మూడవ సంపుటమిక్కడ) అన్న గ్రంథం ఈనాటికి కూడా చాలా ప్రామాణికమైనది. ముఖ్యంగా మొదటి సంపుటంలో రాసిన సుదీర్ఘ పీఠికలో చెదురు మొదురుగా వున్న ఎన్నో ఆధారాలను కలుపుకుంటూ మొదటిసారిగా ఒక సమగ్ర చరిత్రను, ఒక కాలక్రమంలో ఆయన ప్రతిపాదిస్తాడు.
కాలిన్ మెకెంజీ (Collin Mackenzie) పోగుచేసిన అసంఖ్యాక రాతప్రతులు – కవిలెలు (లేక దండకవిలెలు), కథలు (మెకెంజీ సహాయకులుగా పని చేసిన కావలి బొర్రయ్య, కావలి వెంకయ్య, కావలి రామస్వామి, నారాయణరావులు మౌఖికంగా సంగ్రహించిన సమాచారం), కైఫీయతులు[3] కూడా చరిత్ర రచనలో చాలా ముఖ్యమైనవి. ఈ మెకెంజీ భాండాగారంలోని సమాచారాన్ని క్రోడీకరిస్తూ, సంక్షిప్త ఆంగ్లానువాదాలతో అందించే గొప్ప ప్రయత్నం టీ. వీ. మహాలింగం సంపాదకత్వంలో వెలువడిన: Mackenzie manuscripts; Summaries of the historical manuscripts in the Mackenzie collection (2 volumes), Madras, 1972-76. ఇలా కైఫీయతుల ద్వారా వెలుగు చూసి, ఆధునిక పరిశోధకులచే విశ్లేషింపడుతున్న ‘కుమారరాముని కథ‘ (1952) వాటిలో ఒకటి[4].
చరిత్ర రచన: 1900-1960
విజయనగరం, కృష్ణదేవరాయలు, అన్న పేర్లు వినగానే, ముఖ్యంగా తెలుగు వాళ్ళు మొదటిగా ఉటంకించే రచన రాబర్ట్ సూవల్ (Robert Sewell) రాసిన A forgotten empire (London, 1900). ముఖ్యంగా ఈ పుస్తకంలో ఆయన అనువదించిన 16వ శతాబ్దం నాటి పోర్చుగీసు యాత్రికుల రాతలు బాగా ప్రాచుర్యం[5] పొందాయి. ఈ పుస్తకం ద్వారానే మన దేశంలో విజయనగర చరిత్ర పరిశోధన ప్రారంభమయ్యింది అంటే అతిశయోక్తి కాదేమో. నిజానికి పై పుస్తకంలో కంటే సూవల్ పరిశోధనా వివరాలు ఆయనే రాసిన List of the inscriptions and sketches of the dynasties of southern India, List of the antiquarian remains in the presidency of Madras (1882), The historical inscriptions of southern India (collected till 1923) and outlines of political history[6] (1932) లలో చూడవచ్చు. విజయనగరం పైన పనిచేసిన మొదటి తరం భారతీయ చరిత్రకారులు సూవల్ ద్వారానే ఆధునిక చరిత్రా రచనా పద్ధతుల గురించి తెలుసుకున్నారని స్టైన్ (Burton Stein) అంటాడు[7].
సూవల్ తరువాత, మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎస్. కృష్ణస్వామి అయ్యంగార్, టీ. వీ మహాలింగం, కె. ఏ. నీలకంఠశాస్త్రి, నేలటూరి వెంకటరమణయ్యలు పరిశోధనలని కొనసాగించారు. వీటిలో కొన్ని ముఖ్యమైనవి: కృష్ణస్వామి అయ్యంగార్ రాసిన Ancient India (1911), South India and her Muhammadan invaders (1921), Evolution of Hindu administrative institutions of southern India (1931); టీ. వీ మహాలింగం రాసిన Administration and social life under Vijayanagar (Madras, 1940), Economic life in the Vijayanagara empire (1951). ఇదే కాలంలో బొంబాయిలో చరిత్రాధ్యాపకుడిగా పని చేస్తున్న స్పెయిన్ దేశస్థుడు హెన్రీ హేరాస్ (Henry Heras) పోర్చుగీస్, ఇటాలియన్, లాటిన్ రాతప్రతులను వాడుకుంటూ చాలా పరిశోధనలను ప్రచురించాడు. అలాగే 1931లో లండన్ విశ్వవిద్యాలయానికి బి. ఎ. సాలెతొరె (Bhaskar Anand Salatore) సమర్పించిన పిహెచ్. డి థీసిస్ – Social and political life in the Vijayanagara empire A.D 1346-A.D. 1646, 2 భాగాలు, మద్రాసు, 1934) – ముఖ్యమైనది. సాలెతొరె రాసిన మరొక ముఖ్యమైన పుస్తకం: Medieval Jainism with special reference to the Vijayanagara empire (Bombay, 1938).
ఈ పరిశోధనలన్నీ ఒక ఎత్తయితే, వెంకటరమణయ్య చేసిన రచనలు మరొక ఎత్తు. 1929లో Kampili and Vijayanagara అన్న దానితో ప్రారంభించి 1940వ దశకం చివరి భాగం వరకు ఆయన విస్తృతంగా ప్రచురించాడు. Studies in the history of the third dynasty of Vijayanagara (Madras, 1935) అన్న రచన పునరోక్తి దోషాలతో, ఒక జిల్లా గజెట్ లాగా సాగినప్పటికీ అందులోని సమాచారం ఈనాటికి కూడా పరిశోధకుల మన్నన లందుకుంటున్నది! Vijayanagara – Origin of the city and empire (1933), The early Muslim expansion in south India (1942), పైన పేర్కొన్న Further sources of Vijayanagara history లోని మొదటి సంపుటంలో మూడు వందల పేజీలకు పైబడిన పరిచయ వ్యాసం, ఈ పరిశోధనా క్రమంలోని ఇతర ముఖ్య గ్రంథాలు.
ఈ కాలంలోనే విజయనగర సామ్రాజ్యం మహమ్మదీయుల ఆక్రమణలని నిరోధించడానికి యేర్పడిన బలమైన ‘హిందూ సామ్రాజ్యం’ అన్న ప్రతిపాదన బలంగా వచ్చింది. ఈ భావానికి ప్రారంభకుడు సువాల్ (”a Hindu bulwark against Muhammadan conquests”). దానిని వెంకటరమణయ్య, నీలకంఠశాస్త్రి బలపరిచారు. గత పాతిక, ముప్పయేళ్ళలో విజయనగర చరిత్ర పరిశోధనారంగంలో పనిచేసినవారందరు ఈ ప్రతిపాదనలోని లోపాలను స్పష్టంగా చూపించారు (Phillip Wagoner, Hermann Kulke, Sanjay Subrahmanyam, Burton Stein, Richard Eaton, మొదలగు వారు). అప్పటి వలస కాలపు ఆలోచనలు, హిందూ ముస్లిం మతాల మధ్య దీర్ఘకాల, నిర్మాణాత్మక వైరుధ్యం నిర్మించాలనే వలస రాజనీతి, దానితో విడదీయడానికి వీలులేకుండా కలిసిపోయి యేర్పడిన జాతీయవాద ప్రభావం – వీటి వుమ్మడి ఫలితంగా యేర్పడిన ఈ ప్రతిపాదనలని ఈ మధ్యకాలపు చరిత్రకారులెవరూ ఆమోదించలేదు.
విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహరరాయలు, బుక్కరాయలు తెలుగువారు అని వెంకటరమణయ్య చేసిన ప్రతిపాదనని ‘కర్నాటక’ చరిత్రకారులు వ్యతిరేకించారు. ఈ వాదనలు ఎంత దూరం వెళ్ళాయంటే విజయనగర స్థాపకులైన సంగమ వంశీకులే కాదు, కృష్ణదేవరాయలు కూడా తెలుగువాడనే వరకు. అవి ఈనాటికీ కొనసాగుతూనే వున్నాయి! ఈ పరస్పర వాదోపవాదాల్లో ఉదహరించ వలసినది: విజయనగర షష్ట్యతీతమ స్మారక సంపుటం (Vijayanagara sexcentenary commemorative volume, Dharwar, 1936).
పురాతత్త్వ శాఖ పరిశోధనలు
ఆర్కియాలజిస్టులు దశాబ్దాలుగా ఆంధ్ర కర్నాటక సరిహద్దుల్లో, ముఖ్యంగా హంపీ ప్రాంతంలో చేస్తున్న పని ఎక్కువమందికి తెలిసినదే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి విషయాలు చాలా వివరంగా వారి వెబ్సైట్లో పొందుపరచపడుతున్నాయి కాబట్టి మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రచురింపబడిన పరిశోధనా పుస్తకాల, వ్యాసాల వివరాలు కూడా అందులో చూడవచ్చు.
ఆధునిక పరిశోధనలు: 1960-2010
సూవల్ అనువాదానికి (1900) మూలం పోర్చుగీసు దేశస్థుడు, అరబ్ చరిత్రకారుడైన డేవిడ్ లోపెజ్ (David Lopes) 1897లో ప్రచురించిన Cronica dos Reis de Bisnaga: Manuscripto Inédito do Século XVI అన్న పుస్తకం. ఇది వాస్కో ద గామా (Vasco da Gama) తన భారతదేశ నౌకా యాత్ర పూర్తి చేసి 400 ఏళ్ళు పూర్తయిన సందర్భంలో ప్రచురింపబడింది. ఈ రెండు రాతప్రతులు అతనికి ఫ్రెంచ్ జాతీయ గ్రంథాలయం బిబ్లియోథెక్ నేషనాల్ లో (Bibliothèque Nationale de France) దొరికాయి. ఈ రెండు పోర్చుగీసు రాతప్రతులకు రచయితలుగా న్యూనెజ్, పేస్ (Fernao Nunes, Domingo Paes) పేర్లని జతపరచినప్పటికీ వాటి కర్తృత్వంపైన అంగీకారం లేదు[8].
పేస్ రాసినదిగా చెప్పబడే 44 పేజీల నిడివైన ప్రతిలో విజయనగరాన్ని గురించిన జాత్యధ్యయన, భౌగోళిక సమాచారం వుంటుంది. ఇది సుమారు 1518 ప్రాంతంలో రాయబడింది. న్యూనెజ్ 1535 కాలంలో రాసినదిగా భావించబడే 80 పేజీల ప్రతిలో ఎక్కువ వివరాలున్నాయి. ఇతను గుర్రాల వ్యాపారిగా మూడు సంవత్సరాలు విజయనగరంలో గడిపినట్లు, తన రాతప్రతిని గోవాకు పంపినట్లు తెలుస్తుంది. సూవల్ ఈ రెండు అనువాదాలకు అదనంగా మాన్యుయేల్ బఱ్ఱాదాస్ (Manuel Barradas) అన్న జేజుయెట్ (Jesuit) మతప్రచారకుడు పదిహేడవ శతాబ్దం మొదట్లో రాసిన మరొక పోర్చుగీస్ రాతప్రతిని కొంతవరకు జతపరచి 1900లో ప్రచురించాడు. ఇలాంటి రచనలు ఎలాంటి కాలమాన పరిస్థితులలో రాయబడ్డాయో చర్చించే వ్యాసం మారియా క్రుజ్ (Maria Cruz) రాసిన Notes on Portuguese relations with Vijayanagara, 1500-1565 (Santa Barbara Portuguese studies, Vol2, pp. 13-39,1995).