పందొమ్మిదో శతాబ్దం గడచిపోయి ఇరవయ్యో శతాబ్దం ఆరంభమయ్యే సమయంలో, అప్పటికే ఆధునిక తెలుగు సాహిత్యంలో నవల నాటకంలాంటి ప్రక్రియలు రూపుదిద్దుకొంటోన్న సమయంలో, తెలుగు కథ రెక్కలు విప్పుకొంది. బాటలూ దిద్దుబాటులూ ఏర్పరచుకొంది. ఈ వందా నూటిరవై ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో పరిణామాలను చూసింది. వాటికి అక్షర రూపం ఇవ్వడానికి వాహిక అయింది. జనజీవన స్రవంతిని ప్రతిబింబించే సాహితీరూపంగా తనను తాను తీర్చిదిద్దుకొంది.
వందేళ్ళు గడిచాయి. ఇరవయ్యో శతాబ్దం ముగిసిపోయి ఇరవై ఒకటికి దారి ఇస్తోన్న సందర్భం. ఇంకా చెప్పాలంటే ఒక సహస్రాబ్దం ముగిసి మరో సహస్రాబ్దం మొదలవుతోన్న తరుణం…
సంధికాలం. కొత్త ఆర్థిక సమీకరణలు, ప్రపంచీకరణలు, సరళీకరణలు, ప్రైవేటీకరణలు- ఇవి సమాజంలో, సామాన్యుని జీవితంలో తీసుకువస్తోన్న కొత్త కొత్త సంబంధాలు… సంఘర్షణలు…
ఇరవయ్యో శతాబ్దపు రెండో భాగంలో విరివిగా రాసి వెళ్ళిపోయిన/విరమించిన కొకులు, రావిశాస్త్రులు, చాసోలు, కారాలు, రంగనాయకమ్మలు…
తొంభైలలో ప్రతిభావంతంగా రాయడం మొదలుపెట్టిన కొత్త తరం కథకులు… ఊహించని వేగంతో జరిగిపోతున్న మార్పులు… వాటిల్ని ఒడిసి పట్టుకొని కథల్లో చూపించడం, అలాంటి కథలను ఒకచోట చేర్చి కాలానికి దర్పణంగా నిలిపే కథాసాహితి వార్షిక సంకలనాలు… అయినా –
ఏం జరుగుతోందీ?
ఏం రాయాలీ?
ఎలా రాయాలీ?
ఎందుకు రాయాలీ?
ప్రశ్నలు. సందేహాలు. కలవరాలు. ఇవన్నీ కలిసి కూర్చుని మాట్లాడుకొంటే బావోదూ?
బావుంటుంది. హైదరాబాదు శివార్లలో ఉన్న కీసరలో ఇరవైమంది కథకులూ, కథాభిమానులూ, విమర్శకులూ 2000లో కలసి రెండురోజులపాటు ‘సాహిత్యమే సంభాషణగా’ గడిపినపుడు ‘బావుంటుంది, బావుంటుంది’ అని నిర్ద్వంద్వంగా తేలింది.
ఇలా కలవాలన్న ఆలోచన ఖదీర్, సురేశ్‌లది. అందుకు ఊతం ఇచ్చింది కుప్పిలి పద్మ, జి. ఉమామహేశ్వర్; ఆ తర్వాత ఆరెమ్ ఉమామహేశ్వరరావు, అక్కిరాజు భట్టిప్రోలు.
ఆ మొట్టమొదటి బృందంలో ఉన్నది పెద్దింటి అశోక్‌కుమార్, శాంతినారాయణ, గొరుసు, స్వామి లాంటి కథకులు; కె. శ్రీనివాస్, ఎన్. వేణుగోపాల్, చూపు కాత్యాయని లాంటి విశ్లేషకులు, విమర్శకులు అంతా కలిసి ఇరవైమంది.
వర్తమాన కథా ధోరణులు, ‘తప్పిపోతోన్న’ కథావస్తువులు, భాష, మాండలికం, ప్రాంతీయ సమస్యలు, సాహిత్యంలో విమర్శ పాత్ర – చర్చలు, కబుర్లు, చెణుకులు, నవ్వులు, సంతోషాలు, సంతృప్తులు, ఉల్లాసం, ఉత్సాహం, ఉత్సవం.
కథకునికి సాటి కథకునితో, కథకు ఆయా కథకులతో ఆత్మీయ కరచాలనం, ఆలింగనం, కొత్త ఉత్తేజం.
ఈ పద్దెనిమిదేళ్ళలో కథా ఉత్సవాలు పన్నెండుసార్లు జరిగాయి. ఏ రెండు సమావేశాలూ ఒక్కచోట జరగలేదు. నగరం నడిబొడ్డున, అడవిలో, సాగర తీరాలలో, కొల్లేరు ప్రాంతంలో, పశ్చిమ కనుమల్లో, పన్నెండోది హిడెన్ కాజిల్ అన్న రహస్య దుర్గంలో!
ప్రదేశం ఏదయినా, పరిసరాలు మారినా సదస్సుల ఉద్దేశ్యం ఒక్కటే! రెండురోజులపాటు దైనందిన జీవితానికి దూరంగా, కథ ఊపిరిగా, మాటగా, మంత్రంగా, ప్రాణప్రదాతగా, కథలనే స్మరిస్తూ శ్వాశిస్తూ బతకడం!
నిర్వాహకులు సరే, ఈ పన్నెండు వుత్సవాలలో పాల్గొన్నవారెవరూ?
కథకులు కాళీపట్నం, సింగమనేని, అల్లం రాజయ్య, పెద్దిభొట్ల, పి. సత్యవతి, ముక్తవరం పార్థసారథి, వివిన మూర్తి– గతానికి కథా వారధులు.
తుమ్మేటి, మధురాంతకం నరేంద్ర, చినవీరభద్రుడు, కె. వరలక్ష్మి, నామిని, గోపిని కరుణాకర్, కాట్రగడ్డ దయానంద్, వి. చంద్రశేఖరరావు, వి. ప్రతిమ, భగవంతం, దాదాహయత్– గతానికీ వర్తమానానికీ వంతెనలు.
సామాన్య, సింధుమాధురి, పింగళి చైతన్య, తోట అపర్ణ, షరీఫ్, పసునూరి రవీందర్, విమల, ఉణుదుర్తి సుధాకర్, పసుపులేటి గీత– కొత్త, సరికొత్త కథకులు.
కథా ఉత్సవాలంటే కథకులకేనా?
కాదు.
ఇందాక చెప్పుకొన్నట్లు విమర్శకులు, కవులు (మెర్సీ, బి. పద్మావతి, శిఖామణి), ప్రచురణకర్తలు (గీతా రామస్వామి, ఛాయ మోహన్‌బాబు), పత్రికల ప్రతినిధులు (చినుకు రాజగోపాల్, పూడూరి రాజిరెడ్డి, మధు, జి.ఎస్.రామ్మోహన్, పప్పు అరుణ), సినిమారంగం మనుషులు (కె. మురారి, కత్తి మహేశ్, వీరశంకర్), చిత్రకారులు (అక్బర్, అన్వర్, చంద్ర), సామాజిక కార్యకర్తలు (బి. చంద్రశేఖర్), చదువరులు (దేవిరెడ్డి రాజేశ్వరి, ‘కథాక్రీస్తు’ రమణమూర్తి), సంపాదకులు (వాసిరెడ్డి నవీన్, వేమూరి సత్యం), లాయర్లు, బ్యూరోక్రాట్లు, జానపద గాయకులు, జేబుదొంగలు, కళానిర్వాహకులు…
వైవిధ్యభరిత సమావేశాలవి.
విభిన్న రంగాలవాళ్ళు, విభిన్న దృక్పథాలవాళ్ళు, అనేక రంగులవాళ్ళు; సాహిత్య ప్రయోజనం మీద అచంచల విశ్వాసం ఉన్నవాళ్ళు’ ‘సాహిత్యం ఒక మేధో విన్యాసం, ప్రయోజన శూన్యం’ అని నమ్మేవాళ్ళు, ‘ఏది చెప్పినా మృదువుగా హితంగా చెప్పాలి’ అనే సాత్వికులు, ‘కల్లోల ప్రపంచం గురించి చదువరుల గుండెల్లో కలవరం నింపకపోతే అదేం సాహిత్యం?’ అని ప్రశ్నించేవాళ్ళు; ఇంద్ర ధనస్సులు ఈ కథావుత్సవాలు.
కథానిర్మాణం, ప్రయోజనం, వస్తువు-శిల్పం, ఇలాంటి మౌలికమైన విషయాల గురించి మామండూరు రెండో సమావేశంలో చర్చ జరిగితే, కథనూ సాహిత్యాన్నీ కొత్తతరం పాఠకుల దగ్గరకు ఎలా చేర్చాలీ అన్న విషయం మీద పూణె సదస్సులో మాటలు నడిచాయి. తెలుగు కథకు పరభాషల్లో గుర్తింపు ఎలా తేవాలి, అనువాదాలు విరివిగా రావడానికి మనమేం చెయ్యాలి? అన్న విషయాలు రామాయపట్నంలో ముందుకు వచ్చాయి. కొత్త కథకులు నడచివచ్చిన దారుల గురించి తలకోన, రామాయపట్నాలలో విమల, అపర్ణ, అరిపిరాల, రమాసుందరి, సింధుమాధురి, సామాన్య వివరించి చెప్పారు. తాము రాద్దామనుకొని ఇప్పటివరకూ రాయని కథల గురించి అన్ని తరాల కథకులూ తలకోనలో తలపోసుకున్నారు.
‘కథా ఉత్సవం పన్నెండు’ ఈ ఏడాది మార్చి నెల 24, 25 తారీఖుల్లో ‘హిడెన్ కాజిల్’ అన్న రిసార్టులో జరిగింది. హైదరాబాదుకు 70 కిలోమీటర్ల దూరాన కరీంనగర్ రోడ్డుకు బోలెడంత పెడగా అచ్చమైన గ్రామీణ వాతావరణం మధ్య కొండలూ బండలూ ఇరుగూ పొరుగూగా ఈ మధ్యనే కట్టిన రహస్య దుర్గమది.
ఎలా దొరికిందో దాని ఆచూకీ ఖదీర్లకూ, ‘చున్నీ’ కరుణకూ దొరికింది.
ఆ శనివారం సాయంత్రం అయిదూ ఆరు మధ్య సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఆవరణలో ముప్పైనలుగురు పోగుపడినపుడే ఉత్సవం ఆరంభం…
రెండు గంటల బస్సు ప్రయాణం, చీకట్లు కమ్మేసిన సమయంలో దుర్గం చేరడం, ‘కందకం దాటి కోట తలుపులు దాటుకొని వెళ్ళడానికి పాస్వర్డ్ అవసరం’ అని కోటాధిపతులు అంటే ఖదీరు ‘శ్రీపాద’ అనడం, మరో ముప్పై మంది దాన్ని కథామంత్రంగా జపించడం…
కోటంటే కోటే అది! జైలు గదులను తలపించే సువిశాలమైన డార్మిటరీలు, అధునాతన వసతిగృహాల్లో లభించే అన్ని సదుపాయాలూ…
ఇప్పటిదాకా అనుకొంటున్నామే ఉత్సవ ప్రతినిధులలో వైవిధ్యం అని, అందుకు పరాకాష్ట ఈ మూడు పన్నెండ్ల ఉత్సవ బృందం.
ఇరవై దాటీదాటని ఎమ్.ఏ. స్టూడెంటు, ఎనభైల చేరువలో ముక్తవరాలు, భాషతో విన్యాసాలు చేసే ఖదీరులు, పలుకులో పదును ఉన్న డానీలు, మృదుత్వమే సౌందర్యం అనే రాజారామమోహనులూ, మృదుపదాలతోనే నిప్పు పుట్టించే పద్మలూ, కథానిర్మాణ సూత్రాలూ ప్రయోజనాలూ అవగాహన చేసుకొందామని వచ్చిన మిథునలూ రాజేశ్వరిలూ, అవి విప్పి చెప్పే రాజయ్యలూ పార్థసారథులూ, సాహిత్య సృజన వల్ల ఏమీ ఊడిపడదు అనేవాళ్ళూ, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సాహిత్యమే సమాజపు చోదకశక్తి అని సమర్థవంతంగా ప్రతిపాదించే యజ్దానీలూ, ‘కథలు స్త్రీలకూ పురుషులకూ మాత్రమే ఎందుకు పరిమితం అవాలీ? ఎల్‌జిబిటిల సంగతీమిటీ?’ అని నిలదీసే మానసలూ, అస్తిత్వవాదపు కథల లక్షణాలూ లక్ష్యాలూ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాసినంత నిర్దుష్టంగా వివరించే అక్కిరాజులూ, తెలుగు యాత్రా కథనాల చరిత్రా విశిష్టతలను వివరించే అమరేంద్రలూ, పల్లెలూ రైతుల నేపథ్యంలో కథలు రాయడం గురించి పెద్దింటి అశోక్‌కుమార్ కూనపరాజు కుమార్‌లూ, కథా సాహిత్యంలో తాత్విక ధోరణుల గురించి అజయ్ ప్రసాద్ రాజిరెడ్డిలూ, జీవితాన్నీ ప్రపంచపుపోకడనూ ఆకళించుకొని దాన్ని కథల్లో పొందుపరచిన సీనియర్లూ, జీవితాన్ని అర్థంచేసుకొనే ప్రయత్నంలో ఆరోగ్యకరమైన సందేహాలతో సరికొత్త కథకులు, సాహిత్యాన్ని సినిమాతో ప్రయోజనాత్మకంగా అనుసంధానం చెయ్యాలని ఆశించే వెంకట్సిధారెడ్డి, మహి, కరుణ, వీరశంకర్లూ.
భాష-సాహిత్యం-సంస్కృతి వీటిని కాపాడుకోవాలనే తపనతో కథా ఉత్సవాన్ని కెమెరాలో పట్టుకోవాలని వచ్చిన న్యూస్హెరాల్డ్ టీవీ చానెల్ నిర్వాహకులూ, కొత్తతరం సినిమాల కోసం విభిన్నమైన నవలలూ కథలూ రావాలనే అభిలాషతో సినిమా నవలల పోటీని ప్రకటించే సహృదయ సినీవాలాలూ, ఇంతటి గొప్ప సాహితీ విన్యాసాన్ని అతి లాఘవంగా అర్థవంతంగా సమర్థవంతంగా నిర్వహిస్తోన్న ఖదీర్-సురేశ్ ద్వయం, వారికి భుజాలను కలిపి బరువు మోస్తున్న పద్మ, అక్కిరాజు, కరుణ, మహి, సిధారెడ్డి, కూనపరాజు బృందం…
సంతోషం. సంతృప్తి. విస్మయం. వినోదం. విభ్రమ. కంపాషన్. జాలి. ఆవేశం. సంభ్రమం. ప్రేమ. స్నేహభావం. మరో డజను స్పందనలూ సంవేదనలూ ఏకకాలంలో కలిగితే మనసు తట్టుకోలేకపోవడం…
చెహోవ్, మపాసా లాంటి గ్రేట్ మాస్టర్స్ ఎందుకు అంత గొప్ప సాహితీకారులయ్యారూ అని వివరించే పార్థసారథి…
‘కథ ఎలా పుడుతుందీ – కల్లోల ప్రపంచంలోంచా, కల్లోలమయిన మన్సులోంచా’లాంటి ప్రాథమిక విషయాల మీద స్పందించే అల్లం రాజయ్య…
కథారచనలో తమతమ అనుభవాలనూ అనుమానాలనూ ఆశలనూ నిరాశలనూ కష్టాలనూ కడగండ్లనూ అందరితోనూ పంచుకొన్న పాపుదేసి ఝాన్సీ, నాగేంద్ర కాశీ, మహి బెజవాడ, కడలి, రిషిత, మిథున, చందు తులసిలు…
కథావస్తువులో వస్తున్న మార్పులను గురించి అనుభవజ్ఞులు చెప్పుకొస్తే తాము రాయబోతున్న కథలూ కథావస్తువుల గురించి వివరించి సీనియర్లను విస్మయపరచిన మెర్సీ మార్గరెట్, మానస ఎండ్లూరి, నాగేంద్ర కాశీ, వెంకట్సిధారెడ్డి, కడలి, ఝాన్సీ…
ఝాన్సీ లేవనెత్తిన మాండలికం అన్న విషయం గురించి ఎంతో అర్థవంతమైన విభిన్న అభిప్రాయ ప్రకటనలతో కూడిన చర్చ…
ఇంతటి చర్చలూ, ఇలాంటి సమావేశాలూ, ఇన్నిన్ని అంశాలూ రెండేరెండు రోజుల్లో జరిగాయీ అంటే నమ్మడం కష్టం. అందుకు అనేక విషయాలు దోహదం చేసినమాట నిజమే గానీ, ఖదీర్ అన్నట్టు ‘నువ్వూ నేనూ సమానం. ఇద్దరం కలిస్తే కథకు బలం’ అని ముప్ఫయ్యారుమందీ అనుకోబట్టే ఇది సాధ్యమయింది. నిజమే. రెండ్రోజులు చాలలేదు. మాట్లాడుకోవలసినవీ, పంచుకోవలసినవీ, తెలుసుకోవలసినవీ, నేర్చుకోవలసినవీ ఎన్నో వున్నాయి. కానీ ఈ రెండ్రోజులు కలిసి గడపడమే రచయితలకు అపురూప వరం కదా!
పద్ధెనిమిదేళ్ళు. పన్నెండు ఉత్సవాలు.
చెప్పుకోదగ్గ ఫలితాలు ఉన్నాయా?
ఉంటే చెప్పుకొందామా?
అసలిప్పటికే చెప్పేసుకోలేదూ?!
(పెద్దదిగా చూడడం కోసం ఫోటోపై క్లిక్ చేయండి)
స్థూలంగా చెప్పాలంటే ఈ కథా ఉత్సవాలు సుమారు నూటఏభైమంది కథకుల్నీ, సాహితీప్రియుల్నీ, అభ్యుదయ కాముకుల్నీ ప్రత్యక్షంగా ఉత్సాహపరిచాయి. నాలుగు గోడల మధ్యనేగాకుండా ప్రకృతి ఒడిలో, సాగర తీరంలో, జలపాతాల పొరుగున, పర్వతాల నడుమన కథకులను చేర్చి ఒకే కుటుంబంగా గడిపే అవకాశం కథా ఉత్సవం కలిగించింది. ‘శిబిరాలు, శిబిరాలు’ అని పదేపదేపదే వాపోయే సాహితీ ప్రియులకు చెప్పని సమాధానాలు ఈ కథా ఉత్సవాలు.
మామండూరులో నలభైమంది కలసి రెండ్రోజులు కథతో గడపడం అప్పట్లో చాలామంది దృష్టిని ఆకర్షించింది. ఆకర్షించి ఊరుకోకుండా అలాంటి సాహితీ సదస్సులను వాళ్ళూ నిర్వహించేలా ప్రేరణ కలిగించింది…
ఉత్సవాలలో పాల్గొన్న వాళ్ళు కథలు రాసేలా ప్రేరేపణ కలిగిస్తోంది. కరుణకుమార్, మహి బెజవాడ, జర్నలిస్టు మధు, పాపుదేసి ఝాన్సీలు కథలు రాయటం వెనక కథా ఉత్సవాల స్ఫూర్తి ఉంది. ‘వచ్చే సమావేశానికల్లా నేనూ కథలు రాసి తెస్తాను’ అని సప్తతి దాటిన వేమూరి సత్యంగారితో హిడెన్ కాజిల్ అనిపించింది.
అలాగే 2016నాటి సూర్యలంక సదస్సు ప్రతినిధుల కథలతో కొత్తకథ 2017 వచ్చింది. అదే ఒరవడిలో కొత్తకథ 2018 రాబోతోంది.
ఈ ఉత్సవాలలో కలుసుకొని పరస్పరం తెలుసుకొన్న ఫలితంగా పూడూరి రాజిరెడ్డి రియాలిటీ చెక్‌ను అపురూప సాహితీ బహుమానంగా ప్రచురించారు సత్తెనపల్లి సుధామయి.
ఇప్పటికీ గుర్తు! తలకోనలో హఠాత్తుగా ఆరెమ్ ఉమామహేశ్వరరావు పెంచలదాస్ అన్న కుర్రాడిని తీసుకువచ్చి ‘ఇతను బాతిక్ చిత్ర కళాకారుడు, జానపద వాగ్గేయకారుడు. గొప్ప ప్రతిభావంతుడు,’ అని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ నాలుగేళ్ళలో ఆ పెంచలదాస్ తన దారిని అద్భుతంగా నిర్మించుకొని చూపించాడు.
చిలుమూరులో రావిశాస్త్రి కథల్లోని ఒక పాత్రలా కనిపించే అధోజగత్తు ‘పోలీసు రికార్డుల’ జేబుదొంగ ఒకాయన వచ్చి తన జీవితానుభవాలను కథకులతో పంచుకొన్నాడు. ‘తన గురించి చెప్పుకోవటంలో అతను చూపించిన నిజాయితీ, జెండర్ విషయంలో స్త్రీపురుష సంబంధాల విషయాలలో అతను చూపించిన ఉదారత నన్ను ఇప్పటికీ విస్మయపరుస్తూ ఉంటాయి,’ అంటారు నిర్వాహకులు టైటానిక్ సురేశ్. అలాగే సూర్యలంక సదస్సులో ‘అంతే దుర్భర నేపథ్యంలోంచి ఎదిగిన ఓ జాతీయస్థాయి ఉన్నతాధికారి జీవితానుభవాలు వినడమూ జరిగింది’ అని గుర్తుచేసుకొంటారు సురేశ్.
పన్నెండు ఉత్సవాల్లో ఆరింటిలో నేను పాల్గొన్నాను. పూణె సమావేశాలకు హోతగా వ్యవహరించాను.
ఈ పన్నెండు ఉత్సవాలనూ సింహావలోకనం చెయ్యడం అన్న ప్రక్రియలో గత వారంపదిరోజులుగా తలమునకలై ఉన్న నేను గొప్ప ‘సమ్మోహనంలో’ పడి ఉన్నానని వేరే చెప్పనక్కర్లేదు. కానీ, ఒకటిరెండు విషయాల్లో నాకు కొంత వ్యాకులపాటు ఉంది.
కథ ఎలా రాయాలి, ఏం రాయాలి, ఎందుకు రాయాలి, రాస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి? ఎవరు చదువుతున్నారు? ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఎవరు స్పందిస్తున్నారు? ఎవరికోసం రాయాలి?–ఇలాంటి ప్రశ్నలు తరచూ ఈ కథా ఉత్సవాల్లో తల ఎత్తుతున్నాయి. ఇలాంటి ఇతర సమావేశాల్లోనూ తరచూ వినిపిస్తున్నాయి. వీలయినంత చర్చ జరుగుతోంది. కలవరపాటులు అదుపులోకి వస్తున్నాయి. నిర్వేదం తొలగి కొత్త ఉత్సాహం కలుగుతోంది, నిజమే.
కానీ మొట్టమొదటి మౌలిక ప్రశ్న ‘ఎందుకు రాస్తున్నాం?’ గురించి జరగవలసిన ఆలోచన జరుగుతోందా? సాహితీ సృజనను సీరియస్‌గా తీసుకొనే రచయితలు ఈ విషయాన్ని బయట ప్రపంచపు కొలతలే (గుర్తింపు, ప్రోత్సాహం, ప్రయోజనం, స్పందనలు…) ప్రామాణికంగా కాకుండా–ఆ విషయం ‘తామంతా తమ తమ అంతఃచేతనలోకి వెళ్ళి పదే పదే పదే ఆలోచించుకొని, నిర్వచించుకొని, నిర్ధారించుకోవలసినది!’ అన్న స్పృహా ఎరుకా సంతరించుకోవాలిగదా! ఆ ఆత్మయికశోధనాప్రక్రియకు ఈ ఉత్సవాలు కేటలిస్టులు కావాలికదా.
అలాగే ఉత్సవాల పరంపరలో కార్పొరేట్ ధోరణులు కనిపించడం, అందుకు కొందరైనా సంబరపడటం కనబడుతోంది. సీరియస్ సాహిత్యమూ కార్పొరేట్ ధోరణులూ చుక్కెదురు కావూ? వామపక్షీయులే కాదు, పతంజలి పంథీయులు కూడా కార్పొరేట్ చొరబాటు అంటే కనీసం ఉలిక్కిపడాలి కదా.
1991 నాటి కథాసాహితి కానీ, 2000 నాటి కథా ఉత్సవం కానీ యాదృచ్ఛిక పరిణామాలు కావు. కాలం నిర్దేశించిన సామాజిక బాధ్యతలకు నిర్మాణాత్మక రూపాలు. నిలబడే ప్రయోగాలు. నిర్వాహకులు ఖదీర్, సురేశ్ అన్నట్టు ఈ కథా ఉత్సవం ప్రక్రియ తనదైన ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకొంటోంది. నిర్వాహకులను దాటిపోయి తన కాళ్ళమీద తాను నిలబడే శక్తిసామర్థ్యాలనూ, పరిణతినీ సంతరించుకొంటోంది.
(ఈ వ్యాస రూపకల్పనకు, కొత్తకథ 2017-కు ఖదీర్, సురేశ్‌లు రాసిన ముందుమాట, సారంగ పత్రికలో వచ్చిన ఛాయ మోహన్‌బాబు వీడియో వ్యాసం, ఖదీర్ పెట్టిన ఫేస్బుక్ పోస్టు, సురేశ్‌తో జరిపిన సంభాషణ చాలా ఉపయోగపడ్డాయి. వారికి కృతజ్ఞతలు.
పన్నెండు వేదికలు: కీసర, మామండూరు(తిరుపతి దగ్గర), చినుకు (విజయవాడ), నాగార్జున సాగర్, పూణె, తలకోన, చిలుమూరు(తెనాలి దగ్గర), రామాయపట్నం, కొల్లేరు (భీమవరం), సూర్యలంక(బాపట్ల), అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (హైదరాబాద్), హిడెన్ కాజిల్ (హైదరాబాద్ శివార్లలో).)