కళావసంతము

పరిచయము

ఫిబ్రవరి నెలలో మా ప్రాంతాలలో ఒక వారం రోజుల్లో 50 అంగుళాలకు పైగా మంచు కురిసింది. అమెరికాలో మధ్య అట్లాంటిక్ రాష్ట్రాలలో ఉండే మేమంతా మా ఇళ్ళలోనే ఒక వారం రోజులు బందీలుగా గడిపాము! ఆ మంచు కరగడానికి సుమారు ఒక నెల పట్టింది. ఈ రోజు ఏవీ నిరుడు కురిసిన ఆ హిమరాశులు అని ప్రశ్నించుకోవచ్చు. కానీ అప్పుడు ఈ హేమంతం అంతమై ఎప్పుడు వసంతం వస్తుందో అని ఎదురు చూచే వాళ్ళం. వసంత ఋతువును గురించిన పద్యాలను చదివే వాడిని, పాటలను వినేవాడిని. జయదేవకవి రాసిన లలితలవంగలతా పరిశీలన కోమల మలయ సమీరే అష్టపదిని ఎన్ని సార్లు విన్నానో? షెల్లీ కవి అన్నట్లు If winter comes, can spring be far behind? మళ్ళీ వసంతం వచ్చింది. విరబూసిన విరిబాలలు నవ్వుతూ నవ్విస్తున్నాయి. పులుగులు ఎలుగులెత్తి కలకల నినాదాలను చేస్తున్నాయి. ఈ వసంత ఋతువులో ఎందుకు వసంతముపైన ఒక వ్యాసాన్ని రాయరాదు అనిపించింది. దాని ఫలితమే ఈ వ్యాసము.

భారతీయ కాలమానము

మొట్ట మొదట భారతీయ సంప్రదాయాల ప్రకారం వసంత ఋతువు కాల పరిమితిని గురించి: వేదకాలంనాటి నెలల పేర్లు ఇలా ఉంటాయి. ఇప్పుడు మనం వాడే నక్షత్ర మాసాలను కుండలీకరణములలో చూపినాను – మధు (చైత్ర), మాధవ (వైశాఖ), శుక్ర (జ్యేష్ట), శుచి (ఆషాఢ), నభ (శ్రావణ), నభస్య (భాద్రపద), ఈశ (ఆశ్వయుజ), ఊర్జ (కార్తీక), సహ (మార్గశిర), సహస్య (పుష్య), తప (మాఘ), తపస్య (ఫాల్గుణ). ప్రతి ఋతువులో సూర్యునికి తోడుగా అతని రథములో ఇద్దరు ఆదిత్యులు, ఇద్దరు ఋషులు, ఇద్దరు గంధర్వులు, ఇద్దరు అప్సరసలు, ఇద్దరు రాక్షసులు, ఇద్దరు నాగులు ప్రయాణం చేస్తారు. వరుసగా వారి పేరులను కింద తెలియబరచాను.

  • వసంతము: త్వస్త, విష్ణు – జమదగ్ని, విశ్వామిత్ర – ధృతరాష్ట్ర, సూర్యవర్చ – తిలోత్తమ, రంభ – బ్రహ్మోపేత, యక్షోపేత – కంబన, అశ్వతార.
  • గ్రీష్మము: ధాత, అర్యమ – పులస్త్య, పులశ – తుంబురు, నారద – కృతస్థల, పుంజికస్థల – రక్షోహేతి, ప్రహేతి – ఉరగ, వాసుకి.
  • వర్ష: మిత్ర, వరుణ – అత్రి, వశిష్ఠ – హాహా, హూహూ – మేనక, సహజన్య – పౌరుషేయ, వధ – తక్షక, ??
  • శరత్తు: ఇంద్ర, వివస్వన – ఆంగీర, భృగు – విశ్వావసు, ఉగ్రసేన – ప్రమలోచ, అనుమలోచ – సర్ప, వ్యాఘ్ర – ఏలపత్ర, శంఖపాల.
  • హేమంతము: పర్జన్య, పుష – భరద్వాజ, గౌతమ – సురుచి, పరవసు – ఘృతాచి, విశ్వాచి – ఆప, వాత – ధనంజయ, ఐరావణ.
  • శిశిరము: అంశు, భగ – కశ్యప, క్రతు – చిత్రసేన, ఊర్ణయు – ఊర్వశి, పూర్వచిత్తి – విద్యుత్, దివ – మహాపద్మ, కర్కటక.

నక్షత్ర గమనంపైన ఆధారపడిన సంవత్సరానికి 365.256363 రోజులుంటాయి. సూర్యుని గమనంపై ఆధారపడిన సంవత్సరానికి 365.24219 రోజులు. ఈ రెంటికి తేడా ఒక సంవత్సరములో సుమారు 20 నిమిషాలు. ఇప్పుడు మనం పిలిచే ధ్రువ నక్షత్రం (పోలారిస్) కొన్ని వేల ఏళ్ళ తరువాత ధ్రువ నక్షత్రముగా ఉండదు. దీనికి కారణం precession of the equinoxes. భూ-భ్రమణాక్షము (earth’s axis of rotation) అంతరాళములో మరొక అక్షమును అనుసరిస్తూ చుట్టుతూ ఉంటుంది, అందువల్ల ఇప్పుడుండే ధ్రువ నక్షత్రము 2000 సంవత్సరాలకు ముందు లేదు. ఈ 20 నిమిషాల తేడాను మనం సరి చేసికోవాలి. కాని అలా చేయలేదు మన పంచాంగాలను గుణించిన వాళ్ళు. అందుకే వసంతఋతువు మొదటి రోజు మార్చి 20వ తారీకు వస్తుంది. ఈ రోజు (vernal equinox వసంత విషువము), సెప్టెంబరు 23 (autumnal equinox శరద్విషువము) దివారాత్రాల కాల పరిమితి ఒకటిగా ఉంటుంది. కాని సౌరమానము ప్రకారం ఏప్రిలు 14 తేది మనం సంవత్సరాదిగా ఆచరిస్తున్నాము. అంటే సుమారు 24 రోజుల భేదం ఉంది. అందుకే మన పంచాంగాన్ని పరిష్కరిస్తే బాగుంటుంది. భారతదేశములో అధికారపూర్వకమైన పంచాంగము ప్రకారము చైత్ర మాసం మార్చి 23 ఆరంభమవుతుంది. ప్రముఖ ఖగోళ-భౌతిక శాస్త్రజ్ఞుడైన మేఘనాద్ సాహా దీనిని కూలంకషముగా తాను రాసిన ఒక వ్యాసంలో చర్చించారు. అందులో ఒక వాక్యం నాకు చాలా నవ్వు పుట్టించింది. సాహా అంటారు – భారతదేశానికి విదేశీయుల పరిపాలనకన్న జ్యోతిష్కులవల్ల ఎక్కువ కీడు కలిగిందని!

ఇక్కడ అమెరికాలో నాలుగు ఋతువులు క్షుణ్ణంగా అమలులో నున్నాయి. అవి వసంతము, గ్రీష్మము, శరత్తు, హేమంతము. కాని భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పంచాంగం, ఒక్కో విధంగా ఋతువుల గణన. అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉగాది. ఆంధ్రులకు, కన్నడిగులకు, మరాఠీ వాళ్ళకు చాంద్రమాన ఉగాది అయితే, మిగిలిన వాళ్ళకు సౌరమాన ఉగాది. గుజరాతులో కొందరు చాంద్రమాన ఉగాదిని పౌర్ణమి తరువాతి రోజు పాటిస్తారు. కేరళలో కొన్ని చోట్లలో ఆగస్టు నెలలో సింహ మాసములో ఉగాది. కొందరికి దీపావళి సమయంలో ఉగాది.

భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు విభూతియోగములో ఋతూనాం కుసుమాకరః అని అన్నాడు. ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఆ వసంత ఋతువు సంవత్సరంలో ఎప్పుడు ఆరంభమవుతుందో ఎప్పుడు అంతమవుతుందో అనే విషయాన్ని తెలుపలేదు. మనం పుస్తకాలలో చదువుకొన్నాము, మంత్రాలలో చెబుతున్నాము చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు అని. అంతే కాక ఈ వసంత ఋతువు ప్రతి సంవత్సరములో మొదటి ఋతువు కూడా. కాని కాళిదాసు ఋతుసంహారాన్ని గ్రీష్మఋతువుతో ప్రారంభించి వసంతఋతువుతో అంతం చేస్తాడు. ఉత్తర భారతదేశంలోని ప్రజలు వసంత పంచమి అనే పండుగ చేసికొంటారు. ఆ రోజు మనము నవరాత్రులలో సరస్వతీ పూజ చేసేటట్లు వాళ్ళు సరస్వతీదేవి పుట్టిన రోజును ఆచరిస్తారు. ఈ వసంత పంచమి మాఘ శుక్ల పంచమి నాడు వస్తుంది. 2010లో అది జనవరి 20వ తారీకు వచ్చింది. అంటే ఈ లెక్క ప్రకారం సుమారు ఫిబ్రవరి మార్చి నెలలు వసంత ఋతువన్న మాట. ఇది బహుశా కాళిదాసు ఋతుసంహారముతో సరిపోతుంది.

మనం పాటించే చైత్రపు నెలని ఉత్తరదేశంలో వైశాఖము అంటారు. వారి ఉగాదికి బైశాఖి అనే పేరు. మనం ఇప్పుడు ఆచరించే వసంత ఋతువు మార్చి నుండి మే వరకు. దక్షిణ భారత దేశంలో ఉండే వాళ్ళ కందరికీ తెలుసు, ఈ నెలలలో విపరీతమైన ఎండలని. పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కంటె ఎక్కువ కొన్ని చోట్లలో! ఇవన్నీ చూస్తే శక సంవత్సర పంచాంగము సరియైనదే. అందులో వసంత విషువము ఎప్పుడూ మార్చి 23నే వస్తుంది. అది నైసర్గిక పరిస్థితితో కూడా సరిపోతుంది. భారతదేశములో హిమాలయాలలో తప్ప మిగిలిన ప్రాంతాలలో వసంత ఋతువు జనవరి ఆఖరునుండి మార్చి 22 వరకు ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ప్రభుత్వము ప్రజలు ఈ జాతీయ పంచాంగాన్ని ముఖ్యంగా వ్యవసాయ విషయాలలో ఉపయోగిస్తే మంచిది. పండుగలను సూర్య చంద్రుల గమనాన్ని బట్టి నియమించుకోవచ్చు.

వసంత ఋతువు ఎప్పుడు ఆరంభమవుతుందో అనే విషయం నిక్కచ్చిగా తెలియక పోయినా అది నిజంగా కుసుమాకరమే. కరుడు గట్టిన హిమరాశులు కరిగి జీవనదులుగా పారడానికి ప్రారంభించే సమయం ఇది. నిసర్గసుందరి తన మేనిని పూలతో సింగారించుకొని నిత్యసంతోషిణి అయిన సమయం ఇది. పుష్ప సౌరభాన్ని మోసి తెచ్చే గాలి గంధవాహు డవుతాడు. సౌరభముతో నిండిన ఋతువు కాబట్టి ఇది సురభిగా పిలువబడుతుంది. అంతే కాదు విరిదేనెలు జాలువారే నెలలు కాబట్టి ఈ ఋతువులోని నెలలు మధు మాధవము లయ్యాయి. అందుకే వసంత ఋతు ఆగమనాన్ని తెలిపే అష్టపది అధ్యాయాన్ని శ్రీజయదేవ కవి మాధవోత్సవ కమలాకరము అని పిలిచాడు. ఇందులోని మాధవ పదము మాధవునికి మాత్రమే కాదు, మాధవ మాసానికి కూడా వర్తిస్తుంది. భారతదేశంలో వసంత ఋతువులోని కొన్ని పుష్పాలను గురించి నాట్యశాస్త్ర కర్త అయిన భరతుడు స్రగ్ధరా వృత్తానికి లక్ష్యముగా ఇలా చెబుతాడు –

చూతాశోకారవిందైః కురువక తిలకైః కర్ణికారైః శిరీషైః
పున్నాగైః పారిజాతైర్ వకుల కువలయైః కింశుకైః సాతిముక్తైః
ఏతైర్ నానా ప్రకారైః కుసుమ సురభిభిర్ విప్రకీర్ణైస్చ తైస్ తైర్
వసంతైః పుష్పవృందైర్ నరవర వసుధా స్రగ్ధరేవాద్య భాతి

(నరవరా, ఎన్నో సుగంధమయమైన మామిడి, అశోకము, తామర, తోటకూర, తిలక, కర్ణికార (మచ్చగంద), దిరిసెన, పున్నాగ, పారిజాత, పొగడ, కలువ, మోదుగు, మాధవి మున్నగు వివిధ పుష్పాలతో నల్లిన మాలను ధరించికొన్నట్లుంది భూదేవి.)

ఇప్పుడు నేను వసంత ఋతువు ఎలా సాహిత్య సంగీత చిత్రలేఖనాలలో వర్ణించబడిందో అనే విషయంపైన కొద్దిగా ముచ్చటిస్తాను. ఉదహరించబడిన పద్యాలు నాకు నచ్చినవి మాత్రమే, అవి మిగిలిన వాళ్ళకు కూడ నచ్చుతాయని ఆశిస్తాను.

వాల్మీకి రామాయణములో వసంత ఋతువు

ఆదికావ్యమైన రామాయణములో రాముడు అరణ్యవాసం చేసేటప్పుడు తాను పరికించిన నైసర్గిక స్వరూపాన్ని, ఋతువులలో కలిగే మార్పులను చక్కగా వర్ణిస్తాడు. చిన్న చిన్న పదాలతో అతి రమ్యముగా స్వాభావికముగా వాల్మీకి చేసిన ఈ వర్ణనలు ఎంతో బాగుంటాయి.. మానసిక భావాలు ఎలా ప్రకృతి ఆకృతితో ముడి వేసికొంటుందో అన్న విషయాన్ని కూడా ఇందులో గమనించవచ్చు. వసంత ఋతువును గూర్చిన వర్ణన కిష్కింధ కాండలో ఎక్కువగా ఉన్నాయి. సీతావియోగుడైన శ్రీరామచంద్రునికి సీత జ్ఞాపకానికి వస్తుంది దేనిని చూసినా. కింద కొన్ని ఉదాహరణలు –

సౌమిత్రే శోభతే పంపా
వైడూర్య విమలోదకా
ఫుల్ల పద్మోత్పలవతీ
శోభితా వివిధై ర్ద్రుమైః

– వాల్మీకి రామాయణము (4.1.3)

చూడు పంపాసరోవర సుందరతను
చూడు వైడూర్యములవంటి శుభ్ర జలము
చూడు కమలోత్పలమ్ముల సొబగు నిందు
చూడు లక్ష్మణా తరువుల సోయగాలు