శరణాగతి

తిరుగుచు నుంటి నీ వనినిఁ దీరిక లేక మదీయసుందరీ
చరణయుగాంకితంబయిన సౌమనసాధ్వములందుఁ,దన్మనో
హరమృదుగండపాళిలసితారుణిమంబును దోఁచికొన్న భా
స్వరవరబంధుజీవసుమవాటికలందున నిష్ఫలంబుగన్.

అడిగితి మాలతీలతల నా లలితాంగిని గాంచియుండినం
దడయక చెప్పరే యనుచుఁ, “దన్మృదుగాత్రమునందుఁ జేర్చి మ
మ్మెడపక గారవించెఁ, బయి నెచ్చటికో చనె, నామె గమ్య మే
మడుగఁగ మైతి” మంచనె మదాళిరవంబుల నా లతాంగులున్.

కొలఁకులతీరభూములను కోమలమందపదక్రమంబుల
న్మెలఁగెడు రాజహంసముల మీనవిలోచన జాడ నెర్గినం
దెలుపుఁడటంచుఁ గోరితిని; “తీరుగ మాకు పదక్రమంపు టిం
పుల నలవర్చి యెచ్చటికొ పొల్తుక యేఁగె” ననె న్విహంగముల్.

అనుపమకోమలాంగి తెఱఁగారయు నన్ను శిరీషపుష్పముల్
గని పలుకం దొడంగెఁ, “గడు గర్వమునన్ మహిఁ దానె మార్దవ
మ్మునకుఁ బ్రతీకయంచును మముం గణుతింపని యామెతోడ మా
కొనరెడి దేమి? యా వనిత యున్కిని మమ్మడుగంగఁబోకుమీ!”

ఇట్లు పృచ్ఛించి పృచ్ఛించి యింతి జాడ
నరయ లేక చెంగట నున్న సరసియందు
విచ్చుకొనియున్న కెందమ్మివిరిని గాంచి
ప్రార్థనం జేసి తీరీతి ప్రణతుఁడనయి.

“నా చెలి వక్త్రమంజిమ మనాదరమూనిన నూనెఁ గాక, తా
నే చెలువంపురాశినని నీయెడ నో వికచాంబుజాతమా!
ఆచెలి కేమిగాని నిను నాదరమొప్ప భజింతు నేను, ని
ప్డాచెలి నిన్ను వీడి యెటకై చనెనో కరుణించి తెల్పుమా!”

అనినం బద్మం బిట్లనె
ననుఁ దక్కువగాఁ దలఁచుట న్యాయమె సుమ్మీ
వనితామణికిం దానిం
గణుతింపను నే నవజ్ఞగా నిక్కముగన్.

వనిత ముఖంబుచేత నొక పద్మము, నాఱగు వారిజంబులన్
కనుఁగవచేతఁ, గోమలయుగాంఘ్రులచేత, శయద్వయంబుచే
గొనకొని గెల్చియుండుటను గూడిన గర్వముచేత నిట్లు మ
మ్మును నిరసించుచుండె, జయభూషితు లోడినవారి మెత్తురే?

అంతియకాక నాదు హృదయంబది యొక్కటె స్వర్ణకాంతితో
నింతగఁ దేజరిల్లు, మఱి యింతి తనూలతయో వెలుంగు నిం
తింతనరాని స్వర్ణమయతేజముతోడ శిరఃపదాంతమున్,
ఱంతొనరింపనేల? జవరాలిదె పైచెయిపో తనుచ్ఛవిన్!

ఇట్లు నా మంజిమస్థాయి నెఱిఁగి నేను
గారవించితి నామెను గర్వముడిగి
దాన నాయెడసఖ్యంబుఁ బూని యామె
తనదు సంగతి కొంతగ వినిచె నాకు.

పంచమంబునఁ బాడెడి పరభృతాలఁ
గూడి యించుక సేపు నేఁ బాడఁదలఁతు,
పైని చెరువుగట్టుననున్న పద్మసూతి
రాణి నర్చింపఁ దన్మందిరంబుఁ జొత్తు”

అని వివరింపఁ బద్మము, మహాదరపూర్ణకృతజ్ఞతోక్తులన్
వనజము సంస్తుతించి, యట వర్తిలు భూరితరామ్రవాటిలో
ననయము పంచమంబున సమాలపనం బొనరించు కోయిలల్
మనియెడు దారులంబడి క్రమంబుగ నేఁ జనుచున్నయంతటన్.

“చూచితిమోయి పాంథ నిను, సుందరికై యిట వెఱ్ఱిపోలికన్
జూచుచునుంటివీవనుచుఁ జూచితిమేమును క్రుంగిపోవగం
బూచిన యీరసాలతరుపూగశిరంబులనుండి, తన్మృగా
క్షీచరితాధ్వముల్ దెలిపి క్షేమము గూర్తుము నీ కొకింతగన్.

పంచమము దక్క నితరమౌ స్వరము లేని
మాకు సప్తస్వరంబులమహిమఁ దెల్పు
గీతముల నేర్పి పూర్ణసంగీతఫణితిఁ
దెలుప యత్నించె నా యింతి కొలఁదిసేపు.

అనుపమపంచమస్వనమహామధురత్వవిశేషసంపదన్
జనములఁదన్పువారమని, సౌమనసాస్త్రుని బంట్లమంచు, మా
మనముల గర్వమెంతయొ సమాహితమయ్యెను గాని పాంథ! యా
వనితను విన్నయంతనె యపాస్తములయ్యె సమస్తగర్వముల్.