శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన

శ్రీశ్రీ పుట్టి వంద సంవత్సరాలు. అతని కవిత్వం పుట్టి సుమారు ఎనభై ఏళ్ళు. శ్రీశ్రీ గురించీ అతని కవిత్వం గురించీ చాలా ఏళ్ళుగా చాలామంది రాస్తూనే ఉన్నారు. ఇన్నాళ్ళకి ఇన్నేళ్ళకి మళ్ళీ కొత్తగా ఏముంటుంది రాయడానికి? అసలీ కాలానికి శ్రీశ్రీ కవిత్వం ఎంతవరకూ అవసరం? కారణాలు ఏమైనా ఆ కాలంలో యువతరాన్ని ఉర్రూతలూగించినంతగా అతని కవిత్వం ఈ కాలపు కుర్రకారును ప్రభావితం చేస్తుందని నేననుకోను. అలా చెయ్యాలని పట్టుపట్టడం హాస్యాస్పదమే అవుతుంది. సామాన్య ప్రజానీకానికి శ్రీశ్రీ కవిత్వంతో అవసరం ఉన్నా లేకపోయినా సాహిత్యంపై ఆసక్తి ఉన్నవాళ్ళకి, ముఖ్యంగా కవులకీ విమర్శకులకీ ఆ కవిత్వంతో ఇంకా అవసరం ఉంది. ఇప్పటివరకూ శ్రీశ్రీపై వచ్చిన విమర్శ స్పృశించని అంశాలూ దర్శించని దృక్కోణాలూ అతని సాహిత్యంలో ఇంకా ఉండడమే దానికి కారణం. అలాటివాటిలో శ్రీశ్రీ కవిత్వ అనువాదాలు ఒకటి. ఇక్కడ శ్రీశ్రీ కవిత్వ అనువాదాలంటే నా ఉద్దేశం శ్రీశ్రీ పరభాషల కవిత్వానికి చేసిన అనువాదాలు.

ఆధునిక పాశ్చాత్య కవిత్వ ధోరణులని తెలుగువాళ్ళకు పరిచయం చేసిన ముఖ్యులలో శ్రీశ్రీ ఒకడు. శ్రీశ్రీ మొత్తం చేసిన అనువాదాలు ఎన్నో నాకు తెలియదు కాని అందులో చాలా భాగం ‘ఖడ్గ సృష్టి’లో సంకలితమయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ‘మరో ప్రస్థానం’లో కూడా కొన్ని అనువాదాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి సుమారు అరవై కవితలు. ఈ అనువాదాలను పరిశీలించడం ద్వారా కవిగా శ్రీశ్రీ వ్యక్తిత్వాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకొనే అవకాశం ఉంది. కవిత్వానువాదంలోని మంచి చెడ్డలనూ మెళకువలనూ గ్రహించడానికి కూడా ఈ అనువాదాలు ఉపయోగపడతాయి. ఈ దృష్టితో శ్రీశ్రీ అనువాదాలపై నా కొద్దిపాటి పరిశీలనను ఇప్పుడీ వ్యాసంలో వివరించే ప్రయత్నం చేస్తాను.

శ్రీశ్రీ అనువాదాలు చదివితే ముందుగా కొట్టొచ్చినట్టు కనిపించేది వాటిలోని వైవిధ్యం. వస్తు రూపాలలో ఎంతో వైవిధ్యం ఉన్న కవితల అనువాదాలు శ్రీశ్రీ చేశాడు. ప్రతీకాత్మకత, అధివాస్తవికత, విప్లవం – ఇలా అనేక కవిత్వ ధోరణులు ఈ అనువాదాలలో కనిపిస్తాయి. భావకవిత్వం, దేశభక్తి కవితలు కూడా అక్కడక్కడా ఉన్నాయి. వచన కవిత్వం, గేయం, పద్యం వంటి అనేక కవితా రూపాలలో ఈ అనువాదాలున్నాయి. ఫ్రెంచి, ఇంగ్లీషు, రష్యను, గ్రీకు మొదలైన పాశ్చత్య భాషా కవులే కాక, ఒరియా బెంగాలీ వంటి భారతీయ భాషల కవులుకూడా ఈ అనువాదాల ద్వారా మనకు పరిచయమవుతారు.

శ్రీశ్రీ చేసిన అనువాదాలలో అత్యధిక శాతం అధివాస్తవిక కవిత్వం. ఆంద్రె బ్రెతాఁ (Andre Breton), పాల్ ఎల్యూయార్ (Paul Eluard), ఆన్రీ మిషౌ (Henry Michaux) మొదలైన చాలామంది అధివాస్తవిక కవుల కవిత్వాన్ని శ్రీశ్రీ అనువదించాడు. అధివాస్తవిక కవిత్వం శ్రీశ్రీని ఆకర్షించడం ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే, ఈ కవిత్వం ప్రజల కవిత్వం కాదు. అంటే, పీడిత ప్రజల అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ సామాన్య ప్రజలకి అర్థమయ్యేట్టుగా ఉండే కవిత్వం కాదది. అధివాస్తవిక కవిత్వానికి నిర్దిష్టమైన వస్తువంటూ ఏదీ లేదు. మనిషి నిర్మించుకున్న హేతుబద్ధతని బ్రద్దలుకొట్టి అతని మనసు లోపల కదలాడే నిసర్గ భావాలనూ ఆలోచనలనూ ఉన్నదున్నట్టుగా బహిర్గతం చేసి, వాటి మధ్య అస్పష్టంగా లీలగా గోచరించే సంబంధాలపై దృష్టి సారించేది అధివాస్తవిక కవిత్వం. అప్పటికే మహాప్రస్థానంతో అభ్యుదయ కవిత్వానికి నాంది పలికిన శ్రీశ్రీ ఇలాంటి అధివాస్తవిక కవిత్వంపై మోజు చూపడం వింతైన విషయమే కదా! శ్రీశ్రీకి నవ్యతపట్ల ఉన్న విపరీతమైన అభిమానమే దీనికి కారణమని నేననుకుంటాను.

గురజాడనుంచి దిగంబర కవుల దాకా కొత్తగా వచ్చిన ఏ కవిత్వాన్నైనా శ్రీశ్రీ అభిమానించాడు ఆహ్వానించాడు. ఇదే అతని అనువాదాలకి కూడా వర్తిస్తుంది. అధివాస్తవిక కవులలో శ్రీశ్రీని పాల్ ఎల్యూయార్ చాలా ఎక్కువగా ప్రభావితం చేశాడు. అతని అనేక కవితలని శ్రీశ్రీ అనువదించాడు. ఎల్యూయార్ లాగానే (బహుశా అతని స్ఫూర్తితోనే) శ్రీశ్రీ కూడా అధివాస్తవికత నుంచి చివరికి విప్లవకవిత్వం వైపు తన మార్గాన్ని మళ్ళించుకున్నాడు.

శ్రీశ్రీ నవ్యతనే కాదు ప్రయోగాన్ని కూడా ప్రేమించిన కవి. అతనొక నిరంతర ప్రయోగశీలి. తన అనంతంలో ‘కవిత్వంతో నా ప్రయోగాలు’ అని ఒక ప్రత్యేక అధ్యాయాన్ని కూడా కేటాయించాడు. వస్తు రూపాలలో రెండిటా శ్రీశ్రీ అనేక ప్రయోగాలు చేశాడు. అతను చేసిన అనువాదాలలో కూడా ఈ ప్రయోగశీలత కనిపిస్తుంది. కవితా రూపంలోనూ, శిల్పంలోనూ అనేక రకాల ప్రయోగాలు మనకి ఆ అనువాదాలలో కనిపిస్తాయి. వ్యాసంలాంటి కవిత అనిపించే ‘స్టేట్మెంట్’, కవితలాంటి కథ అనిపించే ‘ప్రొఫెసర్ గారి రిపోర్ట్’ మొదలైనవి కొన్ని ఉదాహరణలు. ప్రయోగాల పేరిట శ్రీశ్రీ అనువాదాలలో కొంత అకవిత్వం కూడా చోటుచేసుకుంది. దానికి ఉదాహరణలు 26, చేపల రాత్రిపాట అనే శీర్షికలతో ఉన్న రెండు ఖండికలు. ఈ రెండూ కవిత్వమూ కాదు, కథలూ కాదు. వీటిని ఏమనాలో నాకు తెలియదు.

కవితా శిల్పంలో శ్రీశ్రీకి ఉన్న ఆసక్తికి ఫ్రెంచి కవి బోదిలేర్ (Baudelaire) రాసిన ఆర్మొనీ దు స్వా (hArmonie du Soir) అనే కవితకి ‘సంధ్యా సంగీతం’ అనే పేరుతో చేసిన అనువాదం ఒక మంచి ఉదాహరణ. ఈ కవితలో మొత్తం నాలుగు చరణాలు. ఒకొక్క చరణం నాలుగు వాక్యాలు కలిగి ఉంటుంది. ప్రతి చరణంలోని 2, 4 పాదాలూ తర్వాతి చరణంలో 1, 3 పాదాలు అవుతాయి. ఇది ఒక రకమైన గొలుసు కవిత్వం అనిపిస్తుంది. నిజానికి దీనికి గొలుసు కవిత్వం అన్నది సరైన పేరు కాదు. సంధ్యాకాశంలో కొద్దిపాటి ఛాయా భేదాలతో రకరకాల రంగులు కనిపిస్తాయి కదా. ఒక రంగు క్రమేపీ మరో రంగుగా మారడం కూడా గమనించవచ్చు. అలా క్రమానుగతంగా మారే రంగుల్లాగే తన కవితలో భావ ఛాయలను ఒక చరణంలోంచి మరో చరణంలోకి క్రమంగా మార్చడానికి ఈ శిల్పాన్ని ప్రయోగించాడు బోదిలేర్. శ్రీశ్రీని ఇది ఆకర్షించినట్టుంది. ఈ కవితకి అతను రెండు అనువాదాలు చేశాడు. రెండు అనువాదాలలోనూ మూలంలోని శిల్పాన్ని పాటించాడు. ఈ అనువాదాలలో ఒకటి చంపకమాల వృత్తంలోనూ మరొకటి మాత్రా ఛందస్సులోనూ ఉండటం మరొక విశేషం. ఈ రెండు అనువాదాలూ గ్రాంధిక భాషలోనే ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. ఈ అనువాదాలని అర్థం చేసుకోవాలంటే చాలమంది వాటి ఇంగ్లీషు మూలం చదవాల్సిన అవసరం ఉంటుందేమో! ఉదాహరణగా ఓ రెండు పద్యాలు:

తరుణమిదే! సమీరముల దారుల నొయ్యన నూగులాడుచున్
విరులొకొక్కటే వలపు వ్రేల్చును హారతి దీపరేఖలై!
హరిదనిలమ్ములన్ దొణుకు నద్భుత రాగములున్ సువాసనల్
తరలెడు శ్రాంతనృత్యము! నితాంత నటత్పదమూర్చలియ్యెడన్

విరులొకొక్కటే వలపు వ్రేల్చును హారతి దీపరేఖలై!
అరచు విశోషితాత్మ లటులై దురపిల్లును వాయులీనముల్,
తరలెడు శ్రాంతనృత్యము! నితాంత నటత్పదమూర్చలియ్యెడన్
సురుచిరశోభయున్ మృతియు సోలెడు వేది విహాయసంబనన్

శ్రీశ్రీ ఛందస్సుని వదిలినా, ఛందస్సు శ్రీశ్రీని వదలలేదననడానికి మరొక ఉదాహరణ ‘నవవర్ష సుందరి’. ఇది కుమారి తులసీదాస్ రచించిన ఒక ఒరియా కవితకి అనువాదం.

వర్షధారను నేను వడివడిగ వచ్చాను
పరువంపు పైరులకు పచ్చదన మలరించి
స్రోతస్వినీ బాల చేతమ్ము విరియించి
వడివడిగ జడిజడిగ వచ్చాను నేను

అంటూ మొదలయ్యే ఈ కవిత అచ్చమైన మాత్రాఛందస్సులో చివరివరకూ సాగుతుంది. మత్రాఛందస్సులో శ్రీశ్రీ చాలా కవితలనే రాశాడు. కాని మొదటినుంచి చివరివరకూ ఒకే ఛందస్సు పాటించిన కవితలు అరుదు. ఈ కవితలో ఇంకో విశేషమేమిటంటే ఇందులో ఆద్యంతం యతి పాటించబడింది. ఈ యతి జానపద గేయాలలో ఉండే యతి కాదు, కావ్య ఛందస్సులో ఉండే యతి. పైగా ఒక పాదం చివరినున్న పదం రెండవ పాదంలోకి చొచ్చుకువెళ్ళడం కూడా ఇందులో గమనించవచ్చు. ఇది కూడా కావ్య ఛందస్సు లక్షణమే. ఈ కవిత వర్షసుందరిని అందంగా వర్ణించే ఒక భావకవిత. ఇది 1966 లో ప్రచురితమయినట్టుగా తెలుస్తోంది. ఏ సందర్భంలో ఈ అనువాదం జరిగిందో తెలియదు కాని, ఈ కవితను చదివితే శ్రీశ్రీ తన పూర్వ అభిరుచులని పూర్తిగా వదులుకోలేదని తోస్తుంది.