శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన

శ్రీశ్రీ పుట్టి వంద సంవత్సరాలు. అతని కవిత్వం పుట్టి సుమారు ఎనభై ఏళ్ళు. శ్రీశ్రీ గురించీ అతని కవిత్వం గురించీ చాలా ఏళ్ళుగా చాలామంది రాస్తూనే ఉన్నారు. ఇన్నాళ్ళకి ఇన్నేళ్ళకి మళ్ళీ కొత్తగా ఏముంటుంది రాయడానికి? అసలీ కాలానికి శ్రీశ్రీ కవిత్వం ఎంతవరకూ అవసరం? కారణాలు ఏమైనా ఆ కాలంలో యువతరాన్ని ఉర్రూతలూగించినంతగా అతని కవిత్వం ఈ కాలపు కుర్రకారును ప్రభావితం చేస్తుందని నేననుకోను. అలా చెయ్యాలని పట్టుపట్టడం హాస్యాస్పదమే అవుతుంది. సామాన్య ప్రజానీకానికి శ్రీశ్రీ కవిత్వంతో అవసరం ఉన్నా లేకపోయినా సాహిత్యంపై ఆసక్తి ఉన్నవాళ్ళకి, ముఖ్యంగా కవులకీ విమర్శకులకీ ఆ కవిత్వంతో ఇంకా అవసరం ఉంది. ఇప్పటివరకూ శ్రీశ్రీపై వచ్చిన విమర్శ స్పృశించని అంశాలూ దర్శించని దృక్కోణాలూ అతని సాహిత్యంలో ఇంకా ఉండడమే దానికి కారణం. అలాటివాటిలో శ్రీశ్రీ కవిత్వ అనువాదాలు ఒకటి. ఇక్కడ శ్రీశ్రీ కవిత్వ అనువాదాలంటే నా ఉద్దేశం శ్రీశ్రీ పరభాషల కవిత్వానికి చేసిన అనువాదాలు.

ఆధునిక పాశ్చాత్య కవిత్వ ధోరణులని తెలుగువాళ్ళకు పరిచయం చేసిన ముఖ్యులలో శ్రీశ్రీ ఒకడు. శ్రీశ్రీ మొత్తం చేసిన అనువాదాలు ఎన్నో నాకు తెలియదు కాని అందులో చాలా భాగం ‘ఖడ్గ సృష్టి’లో సంకలితమయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ‘మరో ప్రస్థానం’లో కూడా కొన్ని అనువాదాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి సుమారు అరవై కవితలు. ఈ అనువాదాలను పరిశీలించడం ద్వారా కవిగా శ్రీశ్రీ వ్యక్తిత్వాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకొనే అవకాశం ఉంది. కవిత్వానువాదంలోని మంచి చెడ్డలనూ మెళకువలనూ గ్రహించడానికి కూడా ఈ అనువాదాలు ఉపయోగపడతాయి. ఈ దృష్టితో శ్రీశ్రీ అనువాదాలపై నా కొద్దిపాటి పరిశీలనను ఇప్పుడీ వ్యాసంలో వివరించే ప్రయత్నం చేస్తాను.

శ్రీశ్రీ అనువాదాలు చదివితే ముందుగా కొట్టొచ్చినట్టు కనిపించేది వాటిలోని వైవిధ్యం. వస్తు రూపాలలో ఎంతో వైవిధ్యం ఉన్న కవితల అనువాదాలు శ్రీశ్రీ చేశాడు. ప్రతీకాత్మకత, అధివాస్తవికత, విప్లవం – ఇలా అనేక కవిత్వ ధోరణులు ఈ అనువాదాలలో కనిపిస్తాయి. భావకవిత్వం, దేశభక్తి కవితలు కూడా అక్కడక్కడా ఉన్నాయి. వచన కవిత్వం, గేయం, పద్యం వంటి అనేక కవితా రూపాలలో ఈ అనువాదాలున్నాయి. ఫ్రెంచి, ఇంగ్లీషు, రష్యను, గ్రీకు మొదలైన పాశ్చత్య భాషా కవులే కాక, ఒరియా బెంగాలీ వంటి భారతీయ భాషల కవులుకూడా ఈ అనువాదాల ద్వారా మనకు పరిచయమవుతారు.

శ్రీశ్రీ చేసిన అనువాదాలలో అత్యధిక శాతం అధివాస్తవిక కవిత్వం. ఆంద్రె బ్రెతాఁ (Andre Breton), పాల్ ఎల్యూయార్ (Paul Eluard), ఆన్రీ మిషౌ (Henry Michaux) మొదలైన చాలామంది అధివాస్తవిక కవుల కవిత్వాన్ని శ్రీశ్రీ అనువదించాడు. అధివాస్తవిక కవిత్వం శ్రీశ్రీని ఆకర్షించడం ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే, ఈ కవిత్వం ప్రజల కవిత్వం కాదు. అంటే, పీడిత ప్రజల అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ సామాన్య ప్రజలకి అర్థమయ్యేట్టుగా ఉండే కవిత్వం కాదది. అధివాస్తవిక కవిత్వానికి నిర్దిష్టమైన వస్తువంటూ ఏదీ లేదు. మనిషి నిర్మించుకున్న హేతుబద్ధతని బ్రద్దలుకొట్టి అతని మనసు లోపల కదలాడే నిసర్గ భావాలనూ ఆలోచనలనూ ఉన్నదున్నట్టుగా బహిర్గతం చేసి, వాటి మధ్య అస్పష్టంగా లీలగా గోచరించే సంబంధాలపై దృష్టి సారించేది అధివాస్తవిక కవిత్వం. అప్పటికే మహాప్రస్థానంతో అభ్యుదయ కవిత్వానికి నాంది పలికిన శ్రీశ్రీ ఇలాంటి అధివాస్తవిక కవిత్వంపై మోజు చూపడం వింతైన విషయమే కదా! శ్రీశ్రీకి నవ్యతపట్ల ఉన్న విపరీతమైన అభిమానమే దీనికి కారణమని నేననుకుంటాను.

గురజాడనుంచి దిగంబర కవుల దాకా కొత్తగా వచ్చిన ఏ కవిత్వాన్నైనా శ్రీశ్రీ అభిమానించాడు ఆహ్వానించాడు. ఇదే అతని అనువాదాలకి కూడా వర్తిస్తుంది. అధివాస్తవిక కవులలో శ్రీశ్రీని పాల్ ఎల్యూయార్ చాలా ఎక్కువగా ప్రభావితం చేశాడు. అతని అనేక కవితలని శ్రీశ్రీ అనువదించాడు. ఎల్యూయార్ లాగానే (బహుశా అతని స్ఫూర్తితోనే) శ్రీశ్రీ కూడా అధివాస్తవికత నుంచి చివరికి విప్లవకవిత్వం వైపు తన మార్గాన్ని మళ్ళించుకున్నాడు.

శ్రీశ్రీ నవ్యతనే కాదు ప్రయోగాన్ని కూడా ప్రేమించిన కవి. అతనొక నిరంతర ప్రయోగశీలి. తన అనంతంలో ‘కవిత్వంతో నా ప్రయోగాలు’ అని ఒక ప్రత్యేక అధ్యాయాన్ని కూడా కేటాయించాడు. వస్తు రూపాలలో రెండిటా శ్రీశ్రీ అనేక ప్రయోగాలు చేశాడు. అతను చేసిన అనువాదాలలో కూడా ఈ ప్రయోగశీలత కనిపిస్తుంది. కవితా రూపంలోనూ, శిల్పంలోనూ అనేక రకాల ప్రయోగాలు మనకి ఆ అనువాదాలలో కనిపిస్తాయి. వ్యాసంలాంటి కవిత అనిపించే ‘స్టేట్మెంట్’, కవితలాంటి కథ అనిపించే ‘ప్రొఫెసర్ గారి రిపోర్ట్’ మొదలైనవి కొన్ని ఉదాహరణలు. ప్రయోగాల పేరిట శ్రీశ్రీ అనువాదాలలో కొంత అకవిత్వం కూడా చోటుచేసుకుంది. దానికి ఉదాహరణలు 26, చేపల రాత్రిపాట అనే శీర్షికలతో ఉన్న రెండు ఖండికలు. ఈ రెండూ కవిత్వమూ కాదు, కథలూ కాదు. వీటిని ఏమనాలో నాకు తెలియదు.

కవితా శిల్పంలో శ్రీశ్రీకి ఉన్న ఆసక్తికి ఫ్రెంచి కవి బోదిలేర్ (Baudelaire) రాసిన ఆర్మొనీ దు స్వా (hArmonie du Soir) అనే కవితకి ‘సంధ్యా సంగీతం’ అనే పేరుతో చేసిన అనువాదం ఒక మంచి ఉదాహరణ. ఈ కవితలో మొత్తం నాలుగు చరణాలు. ఒకొక్క చరణం నాలుగు వాక్యాలు కలిగి ఉంటుంది. ప్రతి చరణంలోని 2, 4 పాదాలూ తర్వాతి చరణంలో 1, 3 పాదాలు అవుతాయి. ఇది ఒక రకమైన గొలుసు కవిత్వం అనిపిస్తుంది. నిజానికి దీనికి గొలుసు కవిత్వం అన్నది సరైన పేరు కాదు. సంధ్యాకాశంలో కొద్దిపాటి ఛాయా భేదాలతో రకరకాల రంగులు కనిపిస్తాయి కదా. ఒక రంగు క్రమేపీ మరో రంగుగా మారడం కూడా గమనించవచ్చు. అలా క్రమానుగతంగా మారే రంగుల్లాగే తన కవితలో భావ ఛాయలను ఒక చరణంలోంచి మరో చరణంలోకి క్రమంగా మార్చడానికి ఈ శిల్పాన్ని ప్రయోగించాడు బోదిలేర్. శ్రీశ్రీని ఇది ఆకర్షించినట్టుంది. ఈ కవితకి అతను రెండు అనువాదాలు చేశాడు. రెండు అనువాదాలలోనూ మూలంలోని శిల్పాన్ని పాటించాడు. ఈ అనువాదాలలో ఒకటి చంపకమాల వృత్తంలోనూ మరొకటి మాత్రా ఛందస్సులోనూ ఉండటం మరొక విశేషం. ఈ రెండు అనువాదాలూ గ్రాంధిక భాషలోనే ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. ఈ అనువాదాలని అర్థం చేసుకోవాలంటే చాలమంది వాటి ఇంగ్లీషు మూలం చదవాల్సిన అవసరం ఉంటుందేమో! ఉదాహరణగా ఓ రెండు పద్యాలు:

తరుణమిదే! సమీరముల దారుల నొయ్యన నూగులాడుచున్
విరులొకొక్కటే వలపు వ్రేల్చును హారతి దీపరేఖలై!
హరిదనిలమ్ములన్ దొణుకు నద్భుత రాగములున్ సువాసనల్
తరలెడు శ్రాంతనృత్యము! నితాంత నటత్పదమూర్చలియ్యెడన్

విరులొకొక్కటే వలపు వ్రేల్చును హారతి దీపరేఖలై!
అరచు విశోషితాత్మ లటులై దురపిల్లును వాయులీనముల్,
తరలెడు శ్రాంతనృత్యము! నితాంత నటత్పదమూర్చలియ్యెడన్
సురుచిరశోభయున్ మృతియు సోలెడు వేది విహాయసంబనన్

శ్రీశ్రీ ఛందస్సుని వదిలినా, ఛందస్సు శ్రీశ్రీని వదలలేదననడానికి మరొక ఉదాహరణ ‘నవవర్ష సుందరి’. ఇది కుమారి తులసీదాస్ రచించిన ఒక ఒరియా కవితకి అనువాదం.

వర్షధారను నేను వడివడిగ వచ్చాను
పరువంపు పైరులకు పచ్చదన మలరించి
స్రోతస్వినీ బాల చేతమ్ము విరియించి
వడివడిగ జడిజడిగ వచ్చాను నేను

అంటూ మొదలయ్యే ఈ కవిత అచ్చమైన మాత్రాఛందస్సులో చివరివరకూ సాగుతుంది. మత్రాఛందస్సులో శ్రీశ్రీ చాలా కవితలనే రాశాడు. కాని మొదటినుంచి చివరివరకూ ఒకే ఛందస్సు పాటించిన కవితలు అరుదు. ఈ కవితలో ఇంకో విశేషమేమిటంటే ఇందులో ఆద్యంతం యతి పాటించబడింది. ఈ యతి జానపద గేయాలలో ఉండే యతి కాదు, కావ్య ఛందస్సులో ఉండే యతి. పైగా ఒక పాదం చివరినున్న పదం రెండవ పాదంలోకి చొచ్చుకువెళ్ళడం కూడా ఇందులో గమనించవచ్చు. ఇది కూడా కావ్య ఛందస్సు లక్షణమే. ఈ కవిత వర్షసుందరిని అందంగా వర్ణించే ఒక భావకవిత. ఇది 1966 లో ప్రచురితమయినట్టుగా తెలుస్తోంది. ఏ సందర్భంలో ఈ అనువాదం జరిగిందో తెలియదు కాని, ఈ కవితను చదివితే శ్రీశ్రీ తన పూర్వ అభిరుచులని పూర్తిగా వదులుకోలేదని తోస్తుంది.

నన్ను చాలా ఆశ్చర్యపరచిన మరో అనువాదం భారతదేశంపై చైనా యుద్ధాన్ని ఖండించే ఒక తమిళ కవితకి ‘చైనా దాడి’ పేరుతో చేసిన అనువాదం. ఇందులో చైనాని తూలనాడుతూ దేశభక్తిని ప్రబోధించడమే కాక, హైందవ ధర్మాన్నీ సంస్కృతినీ ఎంతగానో కీర్తించడం కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

కార్మెకము పోద్రోల కార్ముకము సంధించి
కదలరా సోదరా కదన రంగస్థలికి
బందిపోటుల తరుము దుందుభిని మ్రోగించి
వినిపించు సోదరా విజయ ఘంటారవము
హీన చీనాసేన హృదయాల పగిలించు
పర్జన్య పటహోగ్ర గర్జనము పలికించి

అంటూ ఈ కవిత మొదలవుతుంది.

చదలంటు గుడిగోపురములపై ఆన
తిరు వేంకటస్వామి గిరులపై ఆన

అంటూ గుళ్ళమీద దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడమేకాక,

జనని గర్భమునందు శయనించినప్పుడే
వినిపించు వేద ఘోషల మీద ఆన
మన దైవతములపై ఘన భక్తి కలదేని
మన దేవళములపై అనురక్తి కలదేని
మనము నిత్యము చదువు మహనీయ కథయైన
భారతము మీద మన గౌరవము నిజమేని
తరలిపోదము రండు ధర్మమార్గము బట్టి

అని హైందవ సంస్కృతిని ధర్మాన్ని గుర్తుచేస్తూ యుద్ధానికి పిలుపునివ్వడం ఈ కవితలో కనిపిస్తుంది. ఈ అనువాదం శ్రీశ్రీ ఏమైనా వత్తిడులకి తల ఒగ్గి చేసినదో, లేదా సినిమా పాటని రాసినట్టుగా దీనినీ భావించి రాశాడో తెలియదు. శ్రీశ్రీ అనువాదాలని మరింత లోతుగా పరిశీలిస్తే, అతని వ్యక్తిత్వంలో మనకి తెలియని మరిన్ని కోణాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది.

శ్రీశ్రీ అనువాదాలలో నాకు తోచిన మంచి చెడ్డలని రెండు మూడు ఉదాహరణలతో ఇప్పుడు వివరిస్తాను. ఏ అనువాదమైనా మూలమంత గొప్పగా ఉందని అనిపించడం చాలా అరుదైన విషయమే. శ్రీశ్రీ అనువాదాలు దీనికి అతీతం కాదు. అందులోనూ ఫ్రెంచి, ఇంగ్లీషు, స్పానిష్ మొదలైన పాశ్చాత్య భాషల కవిత్వాన్ని తెలుగులోకి అనువదించడం కత్తి మీద సాము. “Poems cannot be translated, they can only be re-written, which is always quite an ambiguous undertaking” – అని పాశ్చాత్య విమర్శకులు అన్న మాటలలో ఎంతో సత్యం ఉంది. సాధ్యమైనంతవరకూ నేను మూలం కన్నా ముందు అనువాదాన్నే చదవడానికి ఇష్టపడతాను. ఏ కవిత్వానువాదమైనా ముందు అది స్వతహాగా మంచి కవిత అయ్యుండాలి. అనువాదం చదవగానే ఒక మంచి కవిత చదివిన అనుభూతి కలగాలి. ఆ తర్వాతనే అది మంచి అనువాదమా కాదా అన్న ప్రశ్న.

శ్రీశ్రీ అనువాదాలలో ఇలా మంచి కవితలుగా నా కనిపించిన అనువాదాలు చాలానే ఉన్నాయి – బోదురు కప్ప, ఆవాహన, పిచ్చి దానిమ్మ చెట్టు, నేపథ్య సంగీతం, జోన్ (యుద్ధరంగం), పబ్లిక్ రోజా, నవవర్ష సుందరి మొదలైనవి. అయితే ఇవన్నీ మంచి అనువాదాలా అంటే, కాకపోవచ్చు. అసలు మంచి అనువాదమంటే ఏమిటి? దీని గురించి విమర్శకులు చాలానే మల్లగుల్లాలు పడ్డారు. చాలా రకాల ప్రమాణాలని సూత్రీకరించారు. ముక్కస్య ముక్కః అనువాదమే మంచి అనువాదమని ఏ విమర్శకుడూ అనడు. అయితే అనువాదంలో విపరీత స్వేచ్ఛ కూడా పనికిరాదన్నది అందరూ ఒప్పుకునే మాటే. ఎంతవరకూ స్వేచ్ఛ తీసుకోవచ్చు అన్న ప్రశ్నకి ఇదమిత్థమైన సమాధానం కష్టమే.

నా దృష్టిలో ఒక కవితని అనువదించేటప్పుడు సదరు అనువాదకుడు మూడు అంశాలపై ముఖ్యంగా దృష్టిపెట్టాలి. ఒకటి మూల కవితలోని Theme, అంటే సారం అనుకోవచ్చు. మొత్తం కవితలో కవి చెప్పదలచుకున్నది ఏమిటి అన్నది ఆ కవిత సారం అవుతుంది. చాలావరకూ అధివాస్తవిక కవితలలో ఈ సారం అన్నది అస్పష్టంగానే ఉంటుంది. అయితే ఒక కవిత అధివాస్తవిక కవితా లేదా భావకవితా, లేదా మరొకటా అన్నదైనా కనీసం అనువాదకుడు గ్రహించాలి. లేకపోతే అనువాదం మూలానికి పూర్తి విరుద్ధంగా తయారై రసాభాస అవుతుంది. అనువాదం మూల కవితకి న్యాయం చెయ్యాలంటే, దాని సారాన్ని పరిపూర్ణంగా ప్రతిఫలించడం చాలా అవసరం.

అనువాదంలో దృష్టి పెట్టాల్సిన రెండవ అంశం, మూల కవితలోని Tone, అంటే గొంతు. ఒక మంచి కవితలో గొంతు, అందులో కవి చెప్పదలచుకున్న సారాన్ని సమర్థవంతంగా ధ్వనింపజేస్తుంది. కొన్ని కవితలు కవి తనలో తాను మాట్లాడుకున్నట్టుగా ఉంటాయి. కొన్ని కవితలు మరొకళ్ళతో గుసగుసలాడుతున్నట్టు ఉండవచ్చు. మరికొన్ని పదిమందికి చెపుతున్నట్టుగా ఉండవచ్చు. ఉత్సాహమో, విషాదమో, ఆగ్రహమో ఇలా అనేక రకాలైన మనస్థితులను ధ్వనించవచ్చు. ఇదంతా కవితలోని గొంతు. ఆ గొంతుని సరిగ్గా గ్రహించి అనువాదంలో దానిని ప్రవేశపెడితే ఆ అనువాదం మంచి అనువాదమవుతుంది. అయితే, మూలంలో గొంతు అస్పష్టంగా ఉన్నా, లేదా గొంతుకి ప్రాధాన్యం లేకపోయినా, అనువాదంలో అదే గొంతు ఉండవలసిన అవసరం లేదు.

మూడవ అంశం Style, అంటే శైలి. వాక్య నిర్మాణం, పద ప్రయోగం, నడక మొదలైన భాషా ఛందో సంబంధి అంశాలతో కూడుకున్నది శైలి. భాషలో, ఛందస్సులో చూపే విలక్షణత ద్వారా కవితకి ఒక ప్రత్యేక గొంతును ఇవ్వడానికి శైలి ఉపయోగపడుతుంది. మూల కవితలోని శైలిని నూరుశాతం అనువాదంలో అనుసరించడం అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. శైలి మిగిలిన రెండు అంశాలకీ (సారము, గొంతు) ఎంతవరకూ ప్రోద్బలంగా ఉంది అన్న దానిని బట్టి, ఆ శైలిని అనుసరించడం మానడం నిర్ణయించుకోవచ్చు. ఒకోసారి అదే సారాన్ని, గొంతుని ధ్వనించే మరో శైలిని ఎంచుకోవలసిన అవసరం కూడా రావచ్చు.

కవిత్వానువాదంలో అన్నిటికన్నా ముఖ్యమైనది థీమ్ అన్నాను కదా. మూల కవితలోని సారాన్ని సరిగ్గా అనువదించడం తప్పనిసరి. కాబట్టి అనువాదకుడు మూలకవితని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ విషయంలో శ్రీశ్రీ తన ‘పిచ్చిదానిమ్మ చెట్టు‘ అనే అనువాదంలో పప్పులో కాలేసినట్టు నాకనిపించింది. ఈ కవిత చదివినప్పుడు నాకొక అధివాస్తవిక కవిత చదివినట్టు అనిపించింది తప్పిస్తే, అంతకు మించి ఒక ప్రత్యేక అనుభూతి ఏమీ కలగలేదు. కొంత విప్లవ ధ్వని మాత్రం వినిపించింది. దీని ఇంగ్లీషు మూలం (The Mad Pomegranate Tree) చదివినప్పుడు మిరిమిట్లు గొలిపే ఓ కాంతివంతమైన కవితని చదివిన అనుభూతి కలిగింది. దానిమ్మ చెట్టు ఒక ఉజ్జ్వల చైతన్యానికి ప్రతీక అన్న విషయం స్ఫురించింది. ఇది అనువాదంలో లోపించింది. శ్రీశ్రీ అనంతం చదివినప్పుడు దీని వెనకనున్న కారణం కొంత అవగతమయ్యింది.

ఈ కవిత అంటే శ్రీశ్రీకి చాలా ఇష్టమట. ఒక కమ్యూనిస్టు కవి మాత్రమే ఇటువంటిది రాయగలడని శ్రీశ్రీ అభిప్రాయం. నిజానికి ఈ కవిత రాసిన గ్రీకు కవి ఒడిసియస్ ఎలీటీస్ (Odysseas Elytis) కమ్యూనిస్టు కాదు. అతను గ్రీకు జాతీయతని పరిపూర్ణంగా ప్రేమించిన కవి. గ్రీకు భాషని, సంస్కృతిని అభిమానించిన కవి. తన జాతి చైతన్యవంతమవ్వాలని కవిత్వం రాసిన కవి. ఈ కవితలో అధివాస్తవిక ఛాయలున్నా ఇది ప్రధానంగా ప్రతీకాత్మక కవిత. ఇందులోని పిచ్చి దానిమ్మచెట్టు కాంతికీ చైతన్యానికీ ప్రతీక.

Whistling through vaulted arcades, tell me, is it the mad pomegranate tree
That leaps in the light, scattering its fruitful laughter
With windy willfulness and whispering, tell me, is it the mad pomegranate tree
That quivers with foliage newly born at dawn
Raising high its colours in a shiver of triumph?

నరనరాన నూతనోత్తేజం నిండిన అనుభూతి ఇది. ఇందులో విప్లవోద్రేకం కానీ కమ్యూనిజం కాని నాకు కనిపించలేదు.

ఇట్టే వెలుతురులోకి ఉరికేది
ఈ పిచ్చి దానిమ్మ చెట్టేనా, చెప్పవూ?
ఉయ్యాలలూగే గాలుల గుసగుసలలో
సారవంతమైన తన సంతోషాన్ని వెదజల్లేది
ఎవరు చెప్పవూ, ఈ పిచ్చి దానిమ్మ చెట్టేనా?
ఉదయవేళ అపుడే తొడిగిన మొగ్గలతో
ఊగుతూ ఉవ్వెత్తుగా తన రంగుల పింఛం విప్పి
విజయగర్వ రోమాంచంతో కులికేది
చెప్పవూ ఈ పిచ్చి దానిమ్మ చెట్టేనా?

అన్న శ్రీశ్రీ అనువాదంలో ఆ ఉత్తేజం నాకు కనిపించ లేదు. ‘సారవంతమైన తన సంతోషం’ అన్న పదబంధంలో ‘fruitful laughter’లోని ఆనందానుభూతి లేదు. పైగా మూలంలో ఉన్న వేగం (అంతా ఒకే వాక్యం అవడం వల్ల వచ్చిందది) ద్వారా కలిగే ఉత్సాహం అనువాదంలో కనిపించదు. అలాగే ఈ కవితలోని మరికొన్ని వాక్యాలు అనువదించడంలో శ్రీశ్రీ మూల కవిత తత్త్వాన్ని, సారాన్ని సరిగా గ్రహించలేదని అనిపిస్తుంది:

Is it the mad pomegranate tree that combats the cloudy skies of the world?

చెప్పవూ ఈ పిచ్చి దానిమ్మ చెట్టేనా ప్రపంచపు నీడలతో పోరాడేది

Fluttering a handkerchief of leaves of cool flame

ఆకుల పోకెట్ రుమాలు ఊపుతుంది? సరికొత్త నిప్పులు చెరుగుతుంది?

High as can be, with the blue bunch of grapes that flares and celebrates
Arrogant, full of danger-tell me, is it the mad pomegranate tree

నిర్లక్ష్యంగా ప్రమాదకరంగా
ద్రాక్షలతల వినీల శిఖరాల మధ్య
విందులతో వీరావేశంతో

అన్నిటికన్నా నన్ను ఆశ్చర్యపరచింది ఈ వాక్యాల అనువాదం:

Never sad and never grumbling-tell me, is it the mad pomegranate tree
That cries out the new hope now dawning?

ఒకసారి విషాదంతో, ఒకమారు విభ్రమిస్తూ
ఈ పిచ్చిదానిమ్మ చెట్టేనా, చెప్పవూ
ఏదో నవీన ప్రభాతాన్ని ఎలుగెత్తి చాటుతుంది?

మూలంలో దానిమ్మ చెట్టుకి విషాదమూ, విచారమూ ఏప్పుడూ ఏమాత్రమూ లేవు. మరి అనువాదంలో ఎందుకు వచ్చింది?! పైగా అది ‘ఏదో’ నవీన ప్రభాతం కానే కాదు. అది the new hope. మూల కవితలోని తత్త్వాన్ని గ్రహించకపోవడం వలన సరిగ్గా రాని అనువాదానికి ఈ ‘పిచ్చి దానిమ్మ చెట్టు’ ఒక ఉదాహరణ అని నా అభిప్రాయం.

మూల కవితలోని Themeని సరిగ్గా అనువదించగలిస్తే శైలిని అనుసరించక పోయినా అది మంచి అనువాదం అయ్యే అవకాశం ఉందనడానికి ఒక ఉదాహరణ బోదురు కప్ప అనే అనువాద కవిత. ఇది ట్రిస్టాఁ కోర్బియేర్ (Tristan Corbiere) రాసిన లె క్రపో (Le Crapaud) అనే ఒక ఫ్రెంచి కవితకి అనువాదం. ఫ్రెంచి కవితలోనూ, దాని ఇంగ్లీషు అనువాదంలోనూ ఒక రకమైన ఛందస్సు అంత్యప్రాస పాటించబడ్డాయి. కానీ తెలుగులో శ్రీశ్రీ వాటిని పాటించలేదు. అయినా అది నాకు పెద్ద లోపంగా కనిపించలేదు. మూలం లోని గొంతుల మార్పూ, వైరుధ్యాల మేళవింపు కొంత కనిపించకపోయినా మొత్తమ్మీద అనువాదం మూలకవిత ఇచ్చే అనుభూతినే కలిగిస్తోందని నాకు అనిపించింది. ఇది అధివాస్తవిక కవిత కావడం బహుశా దీనికి ముఖ్య కారణం అయ్యుండవచ్చు. ఆ కవిత ఇది:

బోదురు కప్ప

గాలిలేని రాత్రిపూట ఏదో పాట…
-దట్టపుటాకుల కత్తిరింపు బొమ్మలకి జిలుగు మలమలాలు చంద్రుడు సింగారిస్తున్నాడు.
ఓ పాట, ప్రతిధ్వనిలా అకస్మాత్తుగా, వడిగా, పూడ్చబడి, అల్లక్కడ, ఆ బోలెడు బురద కింద
-ఆగింది. దా! అక్కడే ఉంది. అదృశ్యంగా…

బోదురు కప్ప! అదిగో నీడలో! నా దగ్గరా జడుపు? నీ నమ్మకమైన కసాయిని కానూ నేను!
చూడండతణ్ణి. క్షౌరమైన కవిని, రెక్కైనా లేదు. బురదకి పుట్టిన కోకిల… దారుణం!
… పాడుతున్నాడే అరే! దారుణం!! ఏం? ఎందుకని దారుణం?

బాగా చూశారా అతని ప్రకాశించే నేత్రాలని?…
ఊహుఁ నిష్క్రమించాడు. చల్లబడి, తన రాతి కిందికి గుడ్ నైట్ – మీరు విన్న బోదురు కప్పని నేనే.

కొన్ని కొన్ని కవితలకి మాత్రం శైలి చాలా ముఖ్యమవుతుంది. దాన్ని సరిగా అనువదించకపోతే అనువాదం బాగుండదు. దీనికి ఒక ఉదాహరణ ‘చలికాలపు ఉదయం. ఇది అలెక్జాండర్ పుష్కిన్ (Alexander Pushkin) రాసిన వింటర్ మార్నింగ్ (Winter Morning) అనే రష్యన్ కవితకి అనువాదం. ఇది ఒక భావ కవిత. ఇందులో కూర్చిన ఛందస్సూ అంత్యప్రాసలూ ఆ కవితలోని భావుకతకి ఎంతో దోహదం చేస్తాయి.

Frost and sun – what a glorious day!
Yet still, sweet friend, you sleep away –
It’s time, gorgeous, for you to stir:
Open wide your dreamy eyes
To catch the dawn glow in northern skies –
Rise up like a northern star!

అని మొదలయ్యే ఈ కవితలో శీతకాలపు ఉదయం కవి హృదయంలో కలిగించిన ఉత్సాహానుభూతిని చాలా సమర్థవంతంగా ఆవిష్కరిస్తుంది.

హేమంత సూర్యకాంతి ఎంతమంచి దివసం
ఇంకా నిద్రపోతావేం? ఇది చక్కని ఉదయం!
సఖీ, సుభగ ముఖీ, చాలు సిగ్గులేని మగత
ఆవలింత మాను, నిదుర కనులు తెరువు సుంత!

అని మొదలయ్యే శ్రీశ్రీ అనువాదంలో మొదట అలాంటి తూగు కనిపించినా, పోనుపోనూ దానిని కోల్పోయి అనువాదం పేలవంగా మారుతుంది. పైగా అక్కడక్కడ పదాలలో గ్రాంధికపు వాసన ఇబ్బంది పెడుతుంది.

అనువాదంలో ఎదురయ్యే ఒక ముఖ్య సమస్య – మూల కవితలో ఆ సంస్కృతికి స్వంతమైన విషయాలను అనువాదంలోకి తీసుకురావడం. ఆ విషయాలను ఉన్నవున్నట్టుగా అనువాదంలో పెడితే, అనువాద భాషా పాఠకులకి అవి అర్థం కాకపోవచ్చు. ఆందువల్ల వాటికి ప్రత్యామ్నాయంగా అనువాద భాషా సంస్కృతిలోని విషయాలను ఔచితీమంతంగా వాడవలసి ఉంటుంది. దీనిని గియోమ్ అపోలినెయర్ (Guillaume Apollinaire) రాసిన జోన్ (Zone) అనే కవిత అనువాదంలో శ్రీశ్రీ అద్భుతంగా నిర్వహించాడు. మూలం లోని Eiffel Tower కుతుబ్ మీనార్ గానూ, Pope Pius X శ్రీ శంకరాచార్యులుగానూ, Christ’s flaming halo మహాశివుని మండే మూడవ నేత్రంగానూ – ఇలా మూలంలోని ఫ్రెంచి సాంస్కృతిక చిహ్నాలన్నీ అనువాదంలో తెలుగుదనాన్ని సంతరించుకున్నాయి. పదాలలోనూ వాక్యాలలోనూ ఎంతో స్వేచ్ఛ తీసుకున్నా మూలంలోని Theme, Tone, Style మూడింటినీ అచ్చంగా అనువదించిన అద్భుతమైన అనువాదం ఈ కవిత.

ఇలా వ్యాఖ్యానిస్తూ పోతే పెద్ద విమర్శ గ్రంథమే తయారవుతుంది. ఈ వ్యాసం శ్రీశ్రీ అనువాదాల గురించి ఒక విహంగ వీక్షణమే కాబట్టి ఇక్కడితో ఆపుతాను. ఎన్ని మంచి చెడ్డలున్నా శ్రీశ్రీ అనువాదాలకి తెలుగు సాహిత్యంలో ఎంతో విలువైన స్థానం ఉంది. వీటి గురించి మరింత విస్తృత విమర్శ అవసరం. శ్రీశ్రీ అనువాదాలనుంచి నేర్చుకోవలసిన అంశం మరొకటి ఉంది. ఆ అనువాదాలలో చాలా సమకాలీన పాశ్చాత్య కవుల కవిత్వం కనిపిస్తుంది. తన కాలంలోని ప్రపంచ కవిత్వంపై శ్రీశ్రీకున్న పట్టుని ఇవి నిరూపిస్తాయి. ఇది కవులకీ విమర్శకులకీ ఎంతో అవసరం. ప్రస్తుతం మన కవి విమర్శకులకు సమకాలీన ప్రపంచ సాహిత్యం ఎంతవరకూ పరిచయమో పెద్ద అనుమానమే. ఈ విషయంలో ఈమాట దృష్టి సారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రతి సంచికలోనూ ఒక పరభాషా కవిని పరిచయం చేస్తూ ఆ కవి కవితలకి కొన్ని అనువాదాలు ప్రచురిస్తే నావంటి కూపస్థ మండూకాలకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది.