నగలొల్లని నాతిగలదె పరికింపంగన్
సాహిత్యానికి సాంఘిక ప్రయోజనం ఉందని నిర్దిష్ట అభిప్రాయాలతో రచనలు చేసి, వాటివలన తెలుగువాళ్ళలో కొందరికైనా మానసిక వికాసం కలగాలని గాఢంగా కోరుకున్న రచయితలలో ప్రముఖుడు కొడవగంటి కుటుంబరావు. ఆయన శత జయంతి దినోత్సవాల సందర్భంగా తన ఐశ్వర్యం1 నవలని పరిచయం చెయ్యడం, ఒకేసారి నిరాశనీ ఉత్సాహాన్నీ కలిగిస్తుంది. ఎంత త్వరగా తన రచనల అవసరం తీరిపోతే తనకు అంత సంతోషమన్న కుటుంబరావుని తలచుకుంటే, అయ్యో, మన ఆలోచనలింకా వెనకబడిఉన్నాయే అన్న విచారమూ, ఆయన రచనలు ఇప్పటికీ వెలుగు చూపిస్తున్నాయన్న ఆనందమూ కలుగుతాయి.
ఐశ్వర్యం లో ప్రధాన పాత్రలు మూడు – ఆదర్శవంతుడైన డాక్టరు కనకసుందరం, ఆయన కూతురు నర్సు, డాక్టరుకి స్నేహితుడు, చివరకి అల్లుడైన కథకుడు సూర్యం. వీరిని కథాగమనంలో ముడివెయ్యడానికి సహకరించిన పాత్ర డాక్టరు తండ్రి లాయరు నరసింహం. ఈ నవల కథా కాలం 1940 ప్రాంతం, రచనా కాలం 1960 ప్రాంతం. కథకి కేంద్రం తెనాలి, గుంటూరు, విజయవాడ, వాటి పరిసరాలు. ఆ ప్రాంత వాతావరణం కళ్ళకి కట్టినట్లు నవలలో కనిపిస్తుంది. డాక్టరు పాత్రని ప్రవేశపెట్టి మలిచిన తీరు పాఠకులని బాగా ఆకట్టుకుంటుంది. స్టూడెంటుగా ఉన్న సూర్యానికి విరేచనాలవుతుంటే ఓ స్నేహితుడు డాక్టరు కనకసుందరం దగ్గరకెళ్ళు, ప్రాక్టీసు లేకపోయినా మంచి డాక్టరు, అని రికమెండ్ చేస్తాడు. మంచి డాక్టరుకి ప్రాక్టీసు లేకపోవడమేమిటి, అంటాడు సూర్యం. ప్రాక్టీసు బాగుండాలంటే, ప్రజలకి ఉండాల్సింది ముఖ్యంగా డాక్టరుపై గురి, రోగం నయం కావడం ప్రధానం కాదు, అని లోకజ్ఞానం పంచుతాడు స్నేహితుడు. మరి ఈ డాక్టరుపై జనానికి ఎందుకు గురి లేదు అంటే, ఆయనో వింత మనిషి, పోయి కలువు తెలుస్తుంది, అని చెప్తాడు.
డాక్టరుగారు ఉండే ఇంట్లోనే ఓ చిన్న గదిని ఆసుపత్రిగా వాడుతుంటారు. సూర్యం వెళ్ళేటప్పటికి డాక్టరు పేపరు చదువుకుంటూ ఉంటాడు. మందు కావాలంటాడు సూర్యం. ఎందుకంటాడు డాక్టరు. డిసెంటరీ కంటాడు. డిసెంటరీ అని మీకెలా తెలుసు, అంటాడు డాక్టరు. ఇద్దరి మధ్యా చిన్న వాదన జరిగింతర్వాత తరువాత డాక్టరు, తమ రోగాన్ని తమరే నిర్ణయించుకునే రోగులంటే తనకి అసహనం అని చెప్తాడు. డాక్టరు గారిది మాటల ప్రవాహమే. వైద్యం గురించి ఆయన దృష్టి వేరు: చాలా రోగాలు వాటికంతటే నయమవుతాయి. నిజానికి, రోగి మంచాన పడిందాకా డాక్టరుతో పని ఉండదు, పడిన తర్వాత డాక్టరు చెయ్యగలిగింది చాలా తక్కువ. అందువలన ఎథికల్గా చూస్తే వైద్యుడికి మించిన సంఘసేవకుడు లేడు, దీంట్లో డబ్బు సంపాదించిన వాడంతటి నికృష్టుడు లేడు, అంటూ డాక్టరు తన వృత్తి మీద అభిప్రాయం వెలిబుచ్చుతాడు. ఆ విధంగా మొదటి పరిచయంతోనే డాక్టరు ప్రత్యేకత అర్థమవుతుంది.
డాక్టరు ఇచ్చిన మందుతో సూర్యానికి రోగం నయమవుతుంది. డాక్టరుపై గురి కలిగి, పరిచయం పెరుగుతుంది. డాక్టరుకి ప్రాక్టీసు పెద్దగా లేకపోవడాన తీరికకి లోటు లేదు. మాట్లాడేవాళ్ళ కోసం మొహం వాచిపోయి ఉన్నాడు. క్రమంగా డాక్టరుకి ఉన్న అసలు వ్యసనం సాహిత్యమని తెలుస్తుంది. ఆయన జీవితాన్ని మరచిపోవడానికి సాహిత్యాన్ని అడ్డం పెట్టుకుంటున్నాడో, లేక జీవిత సత్యాలని సాహిత్యంలో చూసి ఆనందిస్తున్నాడో అర్థం కాదు. డాక్టరు మీద ఓ రకమైన సానుభూతి మాత్రం సూర్యానికి కలుగుతుంది; ఈయన దగ్గరకి ఇంకొందరు పేషంట్లు వచ్చి ఆదాయం పెరిగితే బాగుండనిపిస్తుంది. రోగులకి నచ్చే తీరున కాస్త సర్దుకుపోయి వైద్యం చేస్తే పోయేదేముంది, అంటాడు సూర్యం. ఎందుకు, నాలుగు డబ్బులు సంపాదించడానికా, అలాగయితే మా నాన్ననే హ్యూమర్ చేసి బోలెడంత డబ్బు సంపాదించలేకపోయానా అంటాడు డాక్టరు. అప్పటిదాకా సూర్యానికి వారి కుటుంబ వ్యవహారం తెలియదు.
డాక్టరు తండ్రి నరసింహం పేరున్న క్రిమినల్ లాయరు. బందరులో ప్రాక్టీసు పెట్టి బాగా డబ్బు సంపాదించి ప్రస్తుతం విజయవాడలో స్థిరపడ్డాడు. కొడుకు కూడా తనలాగా లా చదువుతాడని ఆశ పడ్డాడు. అతడేమో మానవ సేవ చేద్దామని మెడిసిన్ చదివాడు. మానవులెవరూ నా సేవ కోసం ఎదురు చూడరని నాకేం తెలుసు, అని డాక్టరు తనమీద తానే జోక్ వేస్కుంటాడు. లాయరు గారి దృష్టిలో మెడిసిన్ చదవడం కన్నా క్షమించరాని నేరం డాక్టరు చేసుకున్న పెళ్ళి. ప్రాక్టీసు పెట్టింతర్వాత వచ్చిన మొదటి పేషంట్ చనిపోవడంతో, పేషంట్ భార్య ఒంటరిదవుతుంది. డాక్టరు జాలిపడి, తనదగ్గరే ఉండనిస్తాడు. ఊళ్ళో ప్రజలు ఆవిడకీ, డాక్టరుకీ అక్రమ సంబంధం అంటగడతారు. వాళ్ళిద్దరూ రిజిస్టర్ మ్యారేజి చేసుకుంటారు. ఊరూ పేరు లేని దానిని, అందునా వితంతువుని చేసుకొని పరువు తీశాడని కొడుకుతో లాయరు తెగతెంపులు చేసుకుంటాడు. ఆడది రెండో పెళ్ళివాణ్ణీ, మూడో పెళ్ళివాణ్ణీ చేసుకుంటే తప్పు లేనిది, మగాడు రెండో పెళ్ళిదాన్ని చేసుకుంటే తప్పేమిటని డాక్టరు రాజీ పడరు.
డాక్టరు ఎంతో ఆత్మసంతృప్తితో మాట్లాడటం సూర్యానికి అంతుబట్టేది గాదు; పేషెంట్లు లేరు, ఎటుచూసినా దారిద్ర్య ఛాయలు. సాహిత్యం గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఆయన కన్నా సంపన్నుడు లేడనిపించేది. భావలోకంలో ఉన్న ఆసక్తి డాక్టరు గారికి భౌతికజీవితంలో కూడా ఉంటే బావుండనుకుంటాడు సూర్యం. అందుకు డాక్టరు, “పుస్తకాలు చదివి నిజంగా ఆనందించదలచిన వాడికి జీవితం బాగా తెలియాలి. జీవితానుభవానికి అతీతంగా ఉండే కావ్యానందాన్ని నేనూ ఆమోదించను. అయితే పుస్తకాలు చదివి ఆనందించడానికి మూడూ పూటలా పెరుగన్నమూ, సిల్కు బట్టలూ, పెద్ద రాబడీ, పరువూ, హోదా, నౌకర్లూ, చాకళ్ళూ కావాలంటావా? అదీ ఒప్పుకోను,” అంటాడు. భాసుడి నాటకం ప్రతిమ2 చదివి వినిపించి, దాంట్లో సైకిక్ రిప్రెషన్ చిత్రించిన తీరు సూర్యానికి మిరుమిట్లు కొలిపేలా వివరిస్తాడు.
గుంటూరులోనే డిగ్రీ చదువుకి చేరిన సూర్యం, డాక్టరు గారింట్లోనే పేయింగ్ గెస్టుగా చేరడంతో, వారి కుటుంబానికి దగ్గరవుతాడు. వాళ్ళింట్లో మతం, పూజా పునస్కారాలు లేవు. స్నానానికి సబ్బు వాడతారు కాని, అంతకు మించి పౌడర్లు, స్నోలు, క్రీముల్లాంటి సౌందర్య సామగ్రినేమీ వాడరు. పళ్ళు తోముకోడానికి మరీ పల్లెటూరు వాళ్ళలా కచ్చికా, వేపపుల్లా వాడతారు కాని టూత్ పేస్టు వాడరు. డాక్టరు భార్యకీ, కూతురుకీ సాదా బట్టలే. వీసమెత్తు బంగారమైనా లేదు. ఆహారం మాత్రం పౌష్టికమైనదీ రుచికరమైనదీ. కీ ఇచ్చినట్లు అందరూ ఎవరి పనులు వాళ్ళవి ఠంచన్గా చేసుకుంటారు. మనుషుల మధ్య మాటలు తక్కువ. మాట్లాడాలన్న కుతూహలం డాక్టరి గారికే ఎక్కువ. అదీ చాలా వరకు సూర్యంతోనే.
యుక్త వయసులో ఉన్న సూర్యం ఆడవాళ్ళు ఇంకాస్త అందంగా ఉంటే చూడాలనుకునేవాడు. ఓ రోజు క్రీమ్ కొని డాక్టరు కూతురు నర్సు కిస్తాడు. వద్దంటుందా అమ్మాయి. క్రీములు వాడకూడదని నియమమా, అని అడుగుతాడు సూర్యం. అనవసరమైన వస్తువుల క్రింద ఖర్చు చేసే అలవాటు లేదంటుంది. డాక్టరు గారు, ఫరవాలేదు తీసుకోమ్మా, అంటే తీసుకుంటుంది కాని వాడదని తెలిసిపోతుంది. సూర్యం మధన పడతాడు. సంఘ నియమాచారాలను తుస్కారంగా చూసే వీళ్ళకి, వేరే మడీ, మైలా ఉన్నాయి. కాస్త నాజూగ్గా ఉండాలనుకునే వాళ్ళని వీళ్ళు హీనంగా చూస్తారు అనుకొని, వీళ్ళ ప్రవర్తన మీద అసహ్యం కలిగి, క్షోభ పడతాడు సూర్యం. రెండు మూడు రోజులు ఇంట్లో స్తబ్ధత నెలకొంటుంది. అప్పుడు డాక్టరు గారు సూర్యాన్ని పాకలోకి పిలిచి భాసుడి నాటకం చారుదత్తం3ని విశ్లేషిస్తాడు.
కుటుంబరావు రాసిన విజ్ఞానపరమైన వ్యాసాలలోనే, పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వాడి, రచనల్ని ఉటంకించి, పాఠకులని అదరగొట్టడ. ఇక కల్పనా రచనలలో వాటికసలే చోటివ్వడు. కాని ఈ నవలలో బెర్నార్డ్ షా, షేక్స్పియర్, చలం, పదే పదే భాసుడు, సంభాషణలలో తటస్థపడతారు. డాక్టరు జీవితంలో సాహిత్యానికి పెద్ద పీట వెయ్యడాన అవి రచనకి శోభనిచ్చాయి. డాక్టరుకి భాసుడంటే ఎనలేని గౌరవం. ఇది కుటుంబరావుకీ వర్తిస్తుంది4.
మనిషిలో ఉన్న స్పిరిట్‌ని మైత్రేయుడు, వసంతసేన పాత్రలలో భాసుడు ఎంత అద్భుతంగా చిత్రించాడో డాక్టరు వివరిస్తాడు. అది విలువ లేని వజ్రం లాగా ధగధగ మెరుస్తుంది – ఒకరికి దిగ్భ్రమ కలిగించాలని కాదు, మెరవటం దాని స్వభావం; దాని ప్రభావం మనుషుల ప్రవర్తనలో, పాటించే నిగ్రహంలో ఉంటుందంటాడు. తన భార్యా కూతురూ, క్రీమూ పౌడర్లు వాడకపోవడంలో కూడా ఏదో వింత స్పిరిట్ ఉన్నది. ఆ స్పిరిట్ వారి స్వభావరీత్యా ఉన్నదే కాని, ఆయన ఆశయాలని వాళ్ళమీద రుద్దడం వలన వచ్చింది కాదు అని విశ్వసిస్తాడు. కూతురి విషయంలో మాత్రం డాక్టర్ గారి అంచనా తారుమారవుతుంది. లాయరు గారి ప్రవేశంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.
డాక్టరు గారి తండ్రిని సూర్యం గుంటూరులోనే ఓ బంధువుల పెళ్ళిలో కలుస్తాడు. ముసలాయనకి కొడుకు మీద పట్టరాని కోపం – వితంతువుని పెళ్ళిచేసుకున్నాడనీ, పనికిమాలిన ఆదర్శాలతో జీవితాన్ని భ్రష్టుచేసుకున్నాడనీ. డాక్టరు గారి భార్య పట్ల కించిత్ గౌరవం కూడా లేకపోగా, పూచికపుల్లతో సమానంగా తేల్చి ఏహ్యంగా మాట్లాడతాడు. కాని ఒక్కగానొక్క మనమరాలిని చూడాలని మాత్రం తహతహ లాడతాడు. డాక్టరు గారింట్లోనే సూర్యం అద్దెకుంటున్నాడని తెలుసుకొని, నర్సు ఎలా ఉంటుందో అడుగుతాడు. బాగానే ఉంటుంది, స్నోలూ అవీ పూసుకోదు, నగా నట్రా ఏమీ లేదు, అంటాడు సూర్యం. అరతులం బంగారంతో కూతురుకి గాజులు చేయించలేని అప్రయోజకుడు, అని లాయరు కోప్పడతాడు. మీరు చేయించి ఇచ్చినా, నర్సు పెట్టుకోదు, అని సూర్యం అంటే, నగలొద్దన్న ఆడదెక్కడైనా ఉంటుందా, అని ముసలాయన ఎదురు ప్రశ్న వేసి, ఒకసారి నర్సుని తెచ్చి తనకు చూపమని వత్తిడి చేస్తాడు. సూర్యం డాక్టరు గారింటికి వచ్చి, జరిగింది చెప్పి, ముసలాయనకున్న ఆ చిన్న కోరిక తీర్చడం భావ్యమని నచ్చజెప్పి నర్సుని పెళ్ళింటికి తీసుకెళతాడు.
ముసలాయన నర్సుని అలంకరించమని ఓ ఆడమనిషిని పురమాయించి తన పెట్టెలో నుంచి ఖరీదయిన నగలూ, చీరలూ ఇస్తాడు. వాటినలంకరించుకున్న నర్సుని చూసి సూర్యం స్టన్నయిపోతాడు. మొహానికింత క్రీము పూసుకోటానికి కంపరమెత్తే అమ్మాయి, వళ్ళంతా నగలూ, తలనిండా పూలూ పెట్టి, కాళ్ళకి పసుపు పూసి పారాణి వేస్తే ఎలా సహించిందా అని. నర్సు మొహంలో విచారంగానీ సంతోషంగానీ చూపించదు. ఇది జరిగింతర్వాత నర్సులో కొన్ని మార్పులని సూర్యం గమనిస్తాడు. స్వేచ్ఛగా మాట్లాడటం, కాస్త పెద్దరికం చూపడం చేస్తోంది. సూర్యానికి కూడా, తాత సొమ్ములతో అలంకరించుకున్న నర్సు గుర్తుకొచ్చి, తాత దగ్గరకెళ్ళి సుఖంగా ఉండొచ్చు గదా అనుకుంటాడు.
తరువాత ఓసారి నర్సు అమ్మానాన్నలకి తెలియకుండా తాతని కలిసి, సూర్యంతో చెప్తుంది: ఆయన తన దగ్గరకొచ్చి ఉండమని ప్రాధేయపడ్డాడనీ, ముసలాయనపై జాలేస్తుందనీ. ఇంతలో డాక్టరు గారి ప్రాక్టీసు ఇంకా తగ్గిపోవడంతో, ఆయన గుంటూరు నుంచి మకాం ఎత్తివేసి ఓ పల్లెటూరు లోని రూరల్ డిస్పెన్సరీలో చేరతాడు. సూర్యం డాక్టరు గారి ప్రభావాన్నించి కాస్త బయటపడి, తెనాలిలో రచయితల స్పూర్తితో కొన్ని కథలు కూడా రాస్తాడు. చదువు కోసం మద్రాసు చేరతాడు. ఒకరోజు డాక్టరు గారు సూర్యం దగ్గరకొచ్చి చెప్తాడు: నర్సుని తన దగ్గరకి తక్షణమే పంపమని నర్సు తాత రాశాడట. నర్సు నడిగితే ఆ అమ్మాయి వెళ్ళడానికి అయిష్టత వెలిబుచ్చదు. తన మీద కత్తిగట్టిన మనిషి దగ్గరకి తన కూతురు వెళ్ళి ఉండటానికి ఏ మాత్రమూ సంకోచపడక పోవడం డాక్టరుకి బాధ కలిగిస్తుంది.