ఏడు గంటల వార్తలు

తెరపైన ఆవిడ తన కూతురిని లాక్కుంటూ పరిగెడుతోంది. పాపం ఆ పిల్ల పాదాలు కార్టూన్ బొమ్మ కాళ్ళలా గాల్లో ఊగుతున్నాయి. అయితే ఇందులో నవ్వడానికి ఏమీ లేదు. వాళ్ళ కళ్ళలో స్పష్టంగా భయం కనపడుతోంది. ఎదురు కాల్పులు జరుపుకుంటున్న రెండు వర్గాల సైనికుల మధ్య వాళ్ళు చిక్కుకుపోయారు, అలానే చిక్కుకుపోయి న్యూస్ బులెటిన్‌లో మళ్ళీ మళ్ళీ చూపిస్తున్న అదే సన్నివేశంలో అలా నిర్విరామంగా పరిగెడుతునే ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఈ ఒక్క చిన్న సంఘటన మాత్రమే మనకు తెలుస్తుంది. తర్వాత మళ్ళీ ఇలానే పరిగెత్తడానికి వాళ్ళిద్దరూ తప్పించుకోగలిగారో లేదో ఎప్పటికీ తెలియదు. నాకు కెమేరామేన్ పై కోపం వచ్చింది – కెమెరా వెనకనుంచి కదిలి వాళ్ళకి సాయం చేయచ్చుగా- అంటూ గట్టిగా అరిచేశాను.


ఆ భయం నాకూ తెలుసు. ఆ పాదాలలాగే నావి కూడా గాల్లో తేలాయి నిలకడ కోసం వేసారుతూ. నాకా బాంబులు తెలుసు. బాంబులు మీద పడుతున్నప్పుడు బిగపట్టిన ఊపిరీ తెలుసు. శిథిలాలుగా మారిన ఇళ్ళు తెలుసు. ఆ సైరన్లు నాకు తెలుసు, వాటి ఊళ నా కడుపులో మరమేకులా తిప్పడమూ తెలుసు. అలా పరిగెత్తేది మా అమ్మ, ఆమె వెనక కార్టూన్ బొమ్మకాళ్ళతో నేను, నా చేయి ఆమె చేతిలో, అండర్ గ్రౌండ్‌లోకి రైల్వే స్టేషన్ వైపు దీపాలు వెలగని నగర వీధుల చీకటిలోంచి. అక్కడే పడుకోడానికి ప్రయత్నించేది తన రెండు చేతులతోను నన్ను పొదువుకొని, జోకులేసుకుంటూ ఉమ్ముతూ గురకపెడుతూ మూలుగుతూ ఉన్న ఈస్ట్ఎండ్ వాసుల శరీరాల మధ్యలో, దాడి ఆగిపోయిందని తెలిశాక శక్తి కూడదీసుకుని మెల్లిగా కదిలి తమ తమ ఇళ్ళకు వెళ్ళి జరిగిన నష్టాన్ని అంచనా వేసుకునేదాకా.

నేను విపరీతంగా అలసిపోయినప్పుడు ఈ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతాయి. నిద్రకీ మెలకువకీ మధ్య నా మదిలో అస్పష్టంగా కదలాడుతాయి.


చంకలో పసిబిడ్డలు, కాళ్ళ దగ్గర చిన్న పిల్లలతో రష్యా స్త్రీలు గంటల కొద్దీ ఓపికగా వరుసలో పాల కోసం, రొట్టె ముక్కల కోసం నిలబడి ఉన్నారు. డబ్బు లేని పేద స్త్రీలు తమ వద్దనున్న ఏదో ఒక వస్తువుని, తమ గిల్టు ఆభరణాలనో, మంచు కురిపించే గాజు గోళం బొమ్మలనో, అమ్మేసి ఆ లైనులో చోటు కోసం ప్రయాస పడుతున్నారు. ఒక గాజుబొమ్మ ఆ బోసినోటి బామ్మకు ఓ రొట్టెముక్కని కొనిస్తుందా?


బాంబులు పడినప్పుడు మా అమ్మ ఏడవడం నేను చూడలేదు. ఇళ్ళు కూలిపోయినప్పుడు, ఆకాశంలో మంటలు రేగినప్పుడు మా అమ్మ ఏడవడం నేను చూడలేదు. ఒక రోజు కాసిని అరటి పళ్ళ కోసం, ఆ పచ్చని పండ్ల కోసం కొన్ని గంటల సేపు లైన్లో నిలుచున్నాం. చివరికి అమ్మ వంతు రాకముందే అరటిపళ్ళు అయిపోతే, పళ్ళు ఇకలేవు అని చెపితే అప్పుడు ఏడ్చింది. తన అదుపులో లేని పరిస్థితులను చూసి, తనకి దొరకని న్యాయాన్ని చూసి, తన చిన్నపాటి ప్రపంచం కూడా తన చేతులలో లేకపోడం చూసి గుండెలవిసేలా ఏడ్చింది.


తాత్కాలికంగా విధులు ముగించుకుని సైనికులు స్వదేశం చేరుతున్నారు. విమానాశ్రయంలో దేశ ప్రధాని వారికి స్వాగతం పలుకుతున్నాడు. భార్యలు, ప్రియురాళ్ళు, అమ్మలు సైనికులను హత్తుకుంటున్నారు, ముద్దులు పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఇంతకు ముందు చూడని తమ సంతానాన్ని వారి చేతులకందిస్తున్నారు. తండ్రిని ఇంతకు ముందు చూడని చంటిపిల్లలు ఆ కొత్త మొఖం వంక అనుమానంతో కోపంతో చూస్తున్నారు. కొంచెం పెద్ద పిల్లలు తమ తండ్రుల కాళ్ళని చుట్టుకుంటున్నారు.


ఓ రోజు నేను నిద్ర లేచేసరికి మా వంటిట్లో ఎవరో ఓ కొత్త వ్యక్తి కనపడ్డాడు. నాకు ఏడుపొచ్చింది. ఎందుకంటే ఆ గది అమ్మకి, నాకు మాత్రమే పరిమితం. అక్కడ ఓ మగాడు కనపడడం నాకు భయాన్ని కలిగించింది. అతనక్కడ ఉండకూడదనిపించింది. అమ్మ నవ్వేసింది. నా ఏడుపుని సరదాగా తీసుకుంది. నేనింకా గట్టిగా ఏడ్చాను.
‘‌భయం లేదమ్మా. ఈయన మీ నాన్న’ అంటూ పరిచయం చేసింది. ‘ఈ మధ్య కాలంలో నాన్న ఇంటికి రాలేదు కదా, అందుకని నీకు కొత్త! వచ్చి నాన్నకి ముద్దు పెట్టు’ అని అంది. నాన్న అంటే ఎవరో నాకు తెలుసు. నా కథల పుస్తకాల్లో ఉంది. కానీ ఈయన నాకు తెలియదు. నాకు అస్సలు నచ్చలేదు. ఆయనని నేను పట్టించుకోలేదు. పుస్తకాన్ని తెరిచి అందులో తల దూర్చాను. ఆయన పైప్ వెలిగించి పొగ వదిలాడు. ఆ వాసన నాకు నచ్చలేదు.

ఇదంతా అయిపోయాక, యుద్ధం ముగిసి నాన్న శాశ్వతంగా ఇంటికి వచ్చేసాక కూడా పైన ఎగిరే విమానాలు ఇకపై ఏ మాత్రం మాకు ప్రమాదం కలిగించవని నేను నమ్మలేకపోయాను. నాకు నాన్న కన్నా విమానాలంటేనే భయం. ఒక రోజు నాన్న నన్ను ఎయిర్‌ బేస్‌కి తీసుకువెళ్ళాడు. నన్ను ఎత్తుకుని యుద్ధ విమానం రెక్కలని ముట్టుకోమన్నాడు. చల్లగా మృదువుగా వున్నాయి. “చూసావా? అవి నీకేమీ హాని చేయవు. భయపడాల్సిన అవసరమే లేదు” అని చెప్పాడు. అయితే అదెలాగో నాకర్ధం కాలేదు.


నేను బడికి వెళ్ళడం మొదలుపెట్టాను. బడిలో రోజు పొద్దున్నే మిలిగాన్ మేడం బల్ల ముందు నిలబడాలి. ఆవిడ మా నోట్లో ఓ చెంచాడు చేప నూనె పోసేది, జావ ఇచ్చేది. నోరు తర్వాత నోరు ఆ చెంచా చుట్టూ మూసుకుంటూ, చేదుగా. దాంతో నాకు చేపలంటేనే విరక్తి కలిగింది. రోజూ చెంచాడు చేప నూనె తాగితే వంటికి మంచిదని ఎవరు చెప్పారో కాని నాకు మాత్రం అది మూఢ నమ్మకం అని తోచింది. అప్పుడప్పుడూ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన పెద్ద పెద్ద గుండ్రని ఎర్రని ఆపిల్ పళ్ళు ఇచ్చేవారు. అవెంతో తియ్యగా ఉండేవి. ఒక్క ఆపిల్ ఇచ్చేవారు. అప్పుడే అక్కడే తినచ్చు. అవి తింటుంటే నోటి దగ్గర చిన్నగా కారే రసం బాగుండేది. అప్పటి దాక నాకు తెలిసి జ్యూస్ అంటే నీళ్ళలో కలుపుకొని తాగేట్టు సీసాల్లో వుండే చిక్కని రసం, కోడిగుడ్లంటే ఓ టిన్‌లోంచి చెంచాతో తీసుకునే పసుపు పచ్చ పొడే. ఇక నారింజపళ్ళు ఎంత అరుదంటే క్రిస్మస్ పండగకి వాటిని బహుమతిలిచ్చుకునేంత.

ఆస్ట్రేలియా చాల దూరంలో ఉన్న పెద్ద దేశమని, అక్కడ ఆపిల్ పళ్ళు, అత్తి పళ్ళు ఎక్కువగా దొరుకుతాయని, గొర్రెలను పెంచుకోడానికి పెద్ద పెద్ద గడ్డి మైదానాలు ఉంటాయని మిలిగాన్ మేడం చెప్పారు. నాకెందుకో అక్కడికి వెళ్ళాలనిపించింది.


బురఖాలో ఉన్న స్త్రీలు శిథిలాలలో ఒకప్పటి తమ ఇళ్ళల్లో ఏదైనా పాడైపోకుండా దొరుకుతుందేమోనని ఆశగా వెతుకుతున్నారు. ఫామిలీ ఫోటో, అమ్మ పెట్టుకున్న ఉంగరం, తమకిష్టమైన పొడుగు ముక్కు పింగాణీ టీ గిన్నె… ఏదైనా. ఈ యుద్ధమనే పీడకల రాకముందు తామూ మామూలు మనుషులమేనని, తమవీ మాములు జీవితాలేనని గుర్తు చేసే ఒక నమ్మకమైన ఓదార్పు కోసం వెతుకుతున్నారు.


మా అమ్మమ్మ వాళ్ళింటికి వెడుతూ మేము దారిలో వరుసగా ఉన్న డాబా ఇళ్ళను చూస్తాం. కొన్ని పళ్ళు ఊడిపోయిన పలువరుసలాగా, కూలిపోయిన ఇళ్ళ ఖాళీ స్థలాలు బోసిగా కనిపిస్తాయి. ఒక ఇంటికి ముందు గోడ, కిటికి మాయమైపోయి, లోపలి జీవితాలు చెల్లా చెదురై బయట పడి కనిపిస్తున్నాయి. చిన్న చిన్న గులాబీపూలున్న ఆకుపచ్చ రంగు వాల్‌పేపర్ అలాగే ఉంది. నీళ్ళ బేసిన్ దగ్గర బుట్టలో పగిలిపోయిన పింగాణీ సామాన్లు, విరిగిన అలమారా నుంచి వేలాడుతున్న పీలికలైన బట్టలు.

ఆ పక్కింట్లో తలకి ఎర్ర గుడ్డ చుట్టుకున్న ఓ ఆవిడ వరండా తుడుస్తుంది. తెల్లటి డోవర్ కొండచరియలపై ఎగిరే అందమైన నీలిరంగు పక్షులను తలచుకుంటూ తన జీర గొంతుతో పాట పాడుతుంది.


శిథిలాలు తీసేసిన ఖాళీ చోట్లపై ఆకాశం విచ్చుకుని గుబురుగా మొక్కలు మొలిచాయి. నారింజ రంగు ముద్ద బంతులు, గుబురుగా దట్టంగా ఉన్న గులాబీ మొక్కలు, పొడవైన రెల్లుగడ్డి పొదలు ఇవన్నీ మసిబారిన మా బాల్యపు వీధులలోకి రంగులని తెచ్చాయి.


యుద్ధం ఆగిపోయాక నాకు ఒక కానుక వచ్చింది. అది ఓ బొమ్మ బండి. అందులో చక్కని చిన్న దుప్పటి కప్పిన ఓ బుల్లి బొమ్మ ఉంది. బండి నీలిరంగులో ఉండి, దానిపై తెల్లరంగులో ముగ్గులున్నాయి. పైకీ కిందికీ జరిగే గూడు కూడా వుంది. దాని చక్రాలు వెండి రంగువి. నా బొమ్మవి నీలికళ్ళు. అవెప్పుడు తెరిచే ఉండేవి. ఆ కళ్ళ చుట్టూ దట్టమైన నల్ల కనుబొమలు ఉండేవి. ఆ బొమ్మ జుట్టు ఉంగరాల జుట్టు, పసుపు రంగులో ఉండేది. బట్టలు తెలుపు.

నేనా బొమ్మని ఆ బండిలో మా అమ్మమ్మ వాళ్ళ పొడుగాటి వరండాలోంచి చివరగా వున్న వంట గది దాకా తోసుకెళ్ళాను. అమ్మా, పిన్నులు కలగలుపుగా కబుర్లు చెప్పకుంటూ నవ్వే నవ్వులు గిన్నెల చప్పుళ్ళలో కలిసి వినిపించాయి. నా బొమ్మని చూసి బావుందంటూ మెచ్చుకుని తిరిగి మాటలలో మునిగిపోయారు.

నేను నా బొమ్మని వంటింట్లోకి తీసుకువెళ్ళాను. వంటింటి దిమ్మ మీద ఉన్న చెక్క అలమారలో అమర్చి ఉన్న గరిటెలను నా బొమ్మకి చూపించాను. నాకిష్టమైన ఆ పన్నెండు గరిటలు తళతళా మెరుస్తూండేవి, మృదువైనవి. నేను వాటిని పైకి తీశాను, అవి క్రిందపడి గట్టిగా చప్పుడు చేశాయి. వాటినొదిలేయమని అమ్మమ్మ కోపంగా అరిచింది, నేనామెకి పిచ్చెకిస్తున్నానని.

నా బొమ్మకి కోడి పిల్లలని చూపించడానికి దుమ్ముతో నిండిన వరండాలోకి తీసుకెళ్ళాను. కాని అక్కడ ఎక్కువ సేపు ఉండలేదు. కోళ్ళ పదునైన ముక్కు, గోళ్ళంటే నాకు భయం. అవెప్పుడు గీరుతూ అరుస్తూ ఉంటాయి. సోఫీ పిన్ని దగ్గరలోని ఓ బల్ల మీద కూర్చుని ఓ కోడిని వండడానికి సిద్ధం చేస్తోంది. బతికున్నప్పటి కోడికీ, పిన్ని కోసే శరీరానికి మధ్య సంబంధం నేను వూహించలేకపోయాను. పిన్ని ఆ కోడి పొట్టలో ఉన్న గుడ్లని చూపించింది. అవి గుండ్రంగా, మెత్తగా ఉన్నాయి. అమ్మమ్మ వాళ్ళింట్లో కోళ్ళు నిజమైన గుడ్లు పెడతాయి. వాటి పైపెంకు లేత ఇటిక రంగులో నున్నగా, లోపల మెత్తగాను ఉంటాయి. నాకు పసుపుపచ్చని ఎగ్ పౌడరంటేనే ఇష్టమని నేను చెప్పాను. ‘ఎప్పుడైనా కోడి కాలు తిన్నావా?’ పిన్ని అడిగింది. వెన్నలా ఉంటుందట. కాని నాకది అంతగా నచ్చలేదు. ఈకలు పీకిన కోడి చర్మం కొంచెం ఎర్రగా బుడిపలతో, అక్కడక్కడ ఇంకా మిగిలిపోయిన సన్నని తెల్లటి ఈకలతో, ముసలివాళ్ళ మెడలా ఉంది. అది నేనెందుకు తింటాను?

నా బండిని ముందు హాల్లోకి, తాతయ్య, నాన్న, బాబాయిలు కూర్చున్న చోటకి తీసుకువెళ్ళాను. వాళ్ళు లో గొంతుకతో మెల్లగా మాట్లాడుకుంటున్నారు. గాలంతా వాళ్ళు పీలుస్తున్న చుట్టల వాసనతో నిండిపోయుంది. నేను నా బండిలో బొమ్మ దుప్పటిని సరిజేస్తుంటే ఉన్నట్టుండి ఏదో పెద్దగా పగులుతున్న చప్పుడు వచ్చింది. తర్వాత ఇంటి కప్పు పొడిపొడిగా రాలిపోయింది. తెల్లని సున్నం పెళ్ళలు, పెచ్చులు, తెల్లని పొడి… నా మీద నా బండి మీద బొమ్మ మీద, మమ్మల్ని కప్పుతూ. నేలని, కుర్చీలని, బల్లలని, మనుషులని తెల్లని రంగు నింపేసింది. నా ముక్కులోకి, గొంతులోకి దుమ్ము పోవడంతో నాకు దగ్గొచ్చింది.