ఏడు గంటల వార్తలు

తెరపైన ఆవిడ తన కూతురిని లాక్కుంటూ పరిగెడుతోంది. పాపం ఆ పిల్ల పాదాలు కార్టూన్ బొమ్మ కాళ్ళలా గాల్లో ఊగుతున్నాయి. అయితే ఇందులో నవ్వడానికి ఏమీ లేదు. వాళ్ళ కళ్ళలో స్పష్టంగా భయం కనపడుతోంది. ఎదురు కాల్పులు జరుపుకుంటున్న రెండు వర్గాల సైనికుల మధ్య వాళ్ళు చిక్కుకుపోయారు, అలానే చిక్కుకుపోయి న్యూస్ బులెటిన్‌లో మళ్ళీ మళ్ళీ చూపిస్తున్న అదే సన్నివేశంలో అలా నిర్విరామంగా పరిగెడుతునే ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఈ ఒక్క చిన్న సంఘటన మాత్రమే మనకు తెలుస్తుంది. తర్వాత మళ్ళీ ఇలానే పరిగెత్తడానికి వాళ్ళిద్దరూ తప్పించుకోగలిగారో లేదో ఎప్పటికీ తెలియదు. నాకు కెమేరామేన్ పై కోపం వచ్చింది – కెమెరా వెనకనుంచి కదిలి వాళ్ళకి సాయం చేయచ్చుగా- అంటూ గట్టిగా అరిచేశాను.


ఆ భయం నాకూ తెలుసు. ఆ పాదాలలాగే నావి కూడా గాల్లో తేలాయి నిలకడ కోసం వేసారుతూ. నాకా బాంబులు తెలుసు. బాంబులు మీద పడుతున్నప్పుడు బిగపట్టిన ఊపిరీ తెలుసు. శిథిలాలుగా మారిన ఇళ్ళు తెలుసు. ఆ సైరన్లు నాకు తెలుసు, వాటి ఊళ నా కడుపులో మరమేకులా తిప్పడమూ తెలుసు. అలా పరిగెత్తేది మా అమ్మ, ఆమె వెనక కార్టూన్ బొమ్మకాళ్ళతో నేను, నా చేయి ఆమె చేతిలో, అండర్ గ్రౌండ్‌లోకి రైల్వే స్టేషన్ వైపు దీపాలు వెలగని నగర వీధుల చీకటిలోంచి. అక్కడే పడుకోడానికి ప్రయత్నించేది తన రెండు చేతులతోను నన్ను పొదువుకొని, జోకులేసుకుంటూ ఉమ్ముతూ గురకపెడుతూ మూలుగుతూ ఉన్న ఈస్ట్ఎండ్ వాసుల శరీరాల మధ్యలో, దాడి ఆగిపోయిందని తెలిశాక శక్తి కూడదీసుకుని మెల్లిగా కదిలి తమ తమ ఇళ్ళకు వెళ్ళి జరిగిన నష్టాన్ని అంచనా వేసుకునేదాకా.

నేను విపరీతంగా అలసిపోయినప్పుడు ఈ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతాయి. నిద్రకీ మెలకువకీ మధ్య నా మదిలో అస్పష్టంగా కదలాడుతాయి.


చంకలో పసిబిడ్డలు, కాళ్ళ దగ్గర చిన్న పిల్లలతో రష్యా స్త్రీలు గంటల కొద్దీ ఓపికగా వరుసలో పాల కోసం, రొట్టె ముక్కల కోసం నిలబడి ఉన్నారు. డబ్బు లేని పేద స్త్రీలు తమ వద్దనున్న ఏదో ఒక వస్తువుని, తమ గిల్టు ఆభరణాలనో, మంచు కురిపించే గాజు గోళం బొమ్మలనో, అమ్మేసి ఆ లైనులో చోటు కోసం ప్రయాస పడుతున్నారు. ఒక గాజుబొమ్మ ఆ బోసినోటి బామ్మకు ఓ రొట్టెముక్కని కొనిస్తుందా?


బాంబులు పడినప్పుడు మా అమ్మ ఏడవడం నేను చూడలేదు. ఇళ్ళు కూలిపోయినప్పుడు, ఆకాశంలో మంటలు రేగినప్పుడు మా అమ్మ ఏడవడం నేను చూడలేదు. ఒక రోజు కాసిని అరటి పళ్ళ కోసం, ఆ పచ్చని పండ్ల కోసం కొన్ని గంటల సేపు లైన్లో నిలుచున్నాం. చివరికి అమ్మ వంతు రాకముందే అరటిపళ్ళు అయిపోతే, పళ్ళు ఇకలేవు అని చెపితే అప్పుడు ఏడ్చింది. తన అదుపులో లేని పరిస్థితులను చూసి, తనకి దొరకని న్యాయాన్ని చూసి, తన చిన్నపాటి ప్రపంచం కూడా తన చేతులలో లేకపోడం చూసి గుండెలవిసేలా ఏడ్చింది.


తాత్కాలికంగా విధులు ముగించుకుని సైనికులు స్వదేశం చేరుతున్నారు. విమానాశ్రయంలో దేశ ప్రధాని వారికి స్వాగతం పలుకుతున్నాడు. భార్యలు, ప్రియురాళ్ళు, అమ్మలు సైనికులను హత్తుకుంటున్నారు, ముద్దులు పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఇంతకు ముందు చూడని తమ సంతానాన్ని వారి చేతులకందిస్తున్నారు. తండ్రిని ఇంతకు ముందు చూడని చంటిపిల్లలు ఆ కొత్త మొఖం వంక అనుమానంతో కోపంతో చూస్తున్నారు. కొంచెం పెద్ద పిల్లలు తమ తండ్రుల కాళ్ళని చుట్టుకుంటున్నారు.


ఓ రోజు నేను నిద్ర లేచేసరికి మా వంటిట్లో ఎవరో ఓ కొత్త వ్యక్తి కనపడ్డాడు. నాకు ఏడుపొచ్చింది. ఎందుకంటే ఆ గది అమ్మకి, నాకు మాత్రమే పరిమితం. అక్కడ ఓ మగాడు కనపడడం నాకు భయాన్ని కలిగించింది. అతనక్కడ ఉండకూడదనిపించింది. అమ్మ నవ్వేసింది. నా ఏడుపుని సరదాగా తీసుకుంది. నేనింకా గట్టిగా ఏడ్చాను.
‘‌భయం లేదమ్మా. ఈయన మీ నాన్న’ అంటూ పరిచయం చేసింది. ‘ఈ మధ్య కాలంలో నాన్న ఇంటికి రాలేదు కదా, అందుకని నీకు కొత్త! వచ్చి నాన్నకి ముద్దు పెట్టు’ అని అంది. నాన్న అంటే ఎవరో నాకు తెలుసు. నా కథల పుస్తకాల్లో ఉంది. కానీ ఈయన నాకు తెలియదు. నాకు అస్సలు నచ్చలేదు. ఆయనని నేను పట్టించుకోలేదు. పుస్తకాన్ని తెరిచి అందులో తల దూర్చాను. ఆయన పైప్ వెలిగించి పొగ వదిలాడు. ఆ వాసన నాకు నచ్చలేదు.

ఇదంతా అయిపోయాక, యుద్ధం ముగిసి నాన్న శాశ్వతంగా ఇంటికి వచ్చేసాక కూడా పైన ఎగిరే విమానాలు ఇకపై ఏ మాత్రం మాకు ప్రమాదం కలిగించవని నేను నమ్మలేకపోయాను. నాకు నాన్న కన్నా విమానాలంటేనే భయం. ఒక రోజు నాన్న నన్ను ఎయిర్‌ బేస్‌కి తీసుకువెళ్ళాడు. నన్ను ఎత్తుకుని యుద్ధ విమానం రెక్కలని ముట్టుకోమన్నాడు. చల్లగా మృదువుగా వున్నాయి. “చూసావా? అవి నీకేమీ హాని చేయవు. భయపడాల్సిన అవసరమే లేదు” అని చెప్పాడు. అయితే అదెలాగో నాకర్ధం కాలేదు.


నేను బడికి వెళ్ళడం మొదలుపెట్టాను. బడిలో రోజు పొద్దున్నే మిలిగాన్ మేడం బల్ల ముందు నిలబడాలి. ఆవిడ మా నోట్లో ఓ చెంచాడు చేప నూనె పోసేది, జావ ఇచ్చేది. నోరు తర్వాత నోరు ఆ చెంచా చుట్టూ మూసుకుంటూ, చేదుగా. దాంతో నాకు చేపలంటేనే విరక్తి కలిగింది. రోజూ చెంచాడు చేప నూనె తాగితే వంటికి మంచిదని ఎవరు చెప్పారో కాని నాకు మాత్రం అది మూఢ నమ్మకం అని తోచింది. అప్పుడప్పుడూ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన పెద్ద పెద్ద గుండ్రని ఎర్రని ఆపిల్ పళ్ళు ఇచ్చేవారు. అవెంతో తియ్యగా ఉండేవి. ఒక్క ఆపిల్ ఇచ్చేవారు. అప్పుడే అక్కడే తినచ్చు. అవి తింటుంటే నోటి దగ్గర చిన్నగా కారే రసం బాగుండేది. అప్పటి దాక నాకు తెలిసి జ్యూస్ అంటే నీళ్ళలో కలుపుకొని తాగేట్టు సీసాల్లో వుండే చిక్కని రసం, కోడిగుడ్లంటే ఓ టిన్‌లోంచి చెంచాతో తీసుకునే పసుపు పచ్చ పొడే. ఇక నారింజపళ్ళు ఎంత అరుదంటే క్రిస్మస్ పండగకి వాటిని బహుమతిలిచ్చుకునేంత.

ఆస్ట్రేలియా చాల దూరంలో ఉన్న పెద్ద దేశమని, అక్కడ ఆపిల్ పళ్ళు, అత్తి పళ్ళు ఎక్కువగా దొరుకుతాయని, గొర్రెలను పెంచుకోడానికి పెద్ద పెద్ద గడ్డి మైదానాలు ఉంటాయని మిలిగాన్ మేడం చెప్పారు. నాకెందుకో అక్కడికి వెళ్ళాలనిపించింది.


బురఖాలో ఉన్న స్త్రీలు శిథిలాలలో ఒకప్పటి తమ ఇళ్ళల్లో ఏదైనా పాడైపోకుండా దొరుకుతుందేమోనని ఆశగా వెతుకుతున్నారు. ఫామిలీ ఫోటో, అమ్మ పెట్టుకున్న ఉంగరం, తమకిష్టమైన పొడుగు ముక్కు పింగాణీ టీ గిన్నె… ఏదైనా. ఈ యుద్ధమనే పీడకల రాకముందు తామూ మామూలు మనుషులమేనని, తమవీ మాములు జీవితాలేనని గుర్తు చేసే ఒక నమ్మకమైన ఓదార్పు కోసం వెతుకుతున్నారు.


మా అమ్మమ్మ వాళ్ళింటికి వెడుతూ మేము దారిలో వరుసగా ఉన్న డాబా ఇళ్ళను చూస్తాం. కొన్ని పళ్ళు ఊడిపోయిన పలువరుసలాగా, కూలిపోయిన ఇళ్ళ ఖాళీ స్థలాలు బోసిగా కనిపిస్తాయి. ఒక ఇంటికి ముందు గోడ, కిటికి మాయమైపోయి, లోపలి జీవితాలు చెల్లా చెదురై బయట పడి కనిపిస్తున్నాయి. చిన్న చిన్న గులాబీపూలున్న ఆకుపచ్చ రంగు వాల్‌పేపర్ అలాగే ఉంది. నీళ్ళ బేసిన్ దగ్గర బుట్టలో పగిలిపోయిన పింగాణీ సామాన్లు, విరిగిన అలమారా నుంచి వేలాడుతున్న పీలికలైన బట్టలు.

ఆ పక్కింట్లో తలకి ఎర్ర గుడ్డ చుట్టుకున్న ఓ ఆవిడ వరండా తుడుస్తుంది. తెల్లటి డోవర్ కొండచరియలపై ఎగిరే అందమైన నీలిరంగు పక్షులను తలచుకుంటూ తన జీర గొంతుతో పాట పాడుతుంది.


శిథిలాలు తీసేసిన ఖాళీ చోట్లపై ఆకాశం విచ్చుకుని గుబురుగా మొక్కలు మొలిచాయి. నారింజ రంగు ముద్ద బంతులు, గుబురుగా దట్టంగా ఉన్న గులాబీ మొక్కలు, పొడవైన రెల్లుగడ్డి పొదలు ఇవన్నీ మసిబారిన మా బాల్యపు వీధులలోకి రంగులని తెచ్చాయి.


యుద్ధం ఆగిపోయాక నాకు ఒక కానుక వచ్చింది. అది ఓ బొమ్మ బండి. అందులో చక్కని చిన్న దుప్పటి కప్పిన ఓ బుల్లి బొమ్మ ఉంది. బండి నీలిరంగులో ఉండి, దానిపై తెల్లరంగులో ముగ్గులున్నాయి. పైకీ కిందికీ జరిగే గూడు కూడా వుంది. దాని చక్రాలు వెండి రంగువి. నా బొమ్మవి నీలికళ్ళు. అవెప్పుడు తెరిచే ఉండేవి. ఆ కళ్ళ చుట్టూ దట్టమైన నల్ల కనుబొమలు ఉండేవి. ఆ బొమ్మ జుట్టు ఉంగరాల జుట్టు, పసుపు రంగులో ఉండేది. బట్టలు తెలుపు.

నేనా బొమ్మని ఆ బండిలో మా అమ్మమ్మ వాళ్ళ పొడుగాటి వరండాలోంచి చివరగా వున్న వంట గది దాకా తోసుకెళ్ళాను. అమ్మా, పిన్నులు కలగలుపుగా కబుర్లు చెప్పకుంటూ నవ్వే నవ్వులు గిన్నెల చప్పుళ్ళలో కలిసి వినిపించాయి. నా బొమ్మని చూసి బావుందంటూ మెచ్చుకుని తిరిగి మాటలలో మునిగిపోయారు.

నేను నా బొమ్మని వంటింట్లోకి తీసుకువెళ్ళాను. వంటింటి దిమ్మ మీద ఉన్న చెక్క అలమారలో అమర్చి ఉన్న గరిటెలను నా బొమ్మకి చూపించాను. నాకిష్టమైన ఆ పన్నెండు గరిటలు తళతళా మెరుస్తూండేవి, మృదువైనవి. నేను వాటిని పైకి తీశాను, అవి క్రిందపడి గట్టిగా చప్పుడు చేశాయి. వాటినొదిలేయమని అమ్మమ్మ కోపంగా అరిచింది, నేనామెకి పిచ్చెకిస్తున్నానని.

నా బొమ్మకి కోడి పిల్లలని చూపించడానికి దుమ్ముతో నిండిన వరండాలోకి తీసుకెళ్ళాను. కాని అక్కడ ఎక్కువ సేపు ఉండలేదు. కోళ్ళ పదునైన ముక్కు, గోళ్ళంటే నాకు భయం. అవెప్పుడు గీరుతూ అరుస్తూ ఉంటాయి. సోఫీ పిన్ని దగ్గరలోని ఓ బల్ల మీద కూర్చుని ఓ కోడిని వండడానికి సిద్ధం చేస్తోంది. బతికున్నప్పటి కోడికీ, పిన్ని కోసే శరీరానికి మధ్య సంబంధం నేను వూహించలేకపోయాను. పిన్ని ఆ కోడి పొట్టలో ఉన్న గుడ్లని చూపించింది. అవి గుండ్రంగా, మెత్తగా ఉన్నాయి. అమ్మమ్మ వాళ్ళింట్లో కోళ్ళు నిజమైన గుడ్లు పెడతాయి. వాటి పైపెంకు లేత ఇటిక రంగులో నున్నగా, లోపల మెత్తగాను ఉంటాయి. నాకు పసుపుపచ్చని ఎగ్ పౌడరంటేనే ఇష్టమని నేను చెప్పాను. ‘ఎప్పుడైనా కోడి కాలు తిన్నావా?’ పిన్ని అడిగింది. వెన్నలా ఉంటుందట. కాని నాకది అంతగా నచ్చలేదు. ఈకలు పీకిన కోడి చర్మం కొంచెం ఎర్రగా బుడిపలతో, అక్కడక్కడ ఇంకా మిగిలిపోయిన సన్నని తెల్లటి ఈకలతో, ముసలివాళ్ళ మెడలా ఉంది. అది నేనెందుకు తింటాను?

నా బండిని ముందు హాల్లోకి, తాతయ్య, నాన్న, బాబాయిలు కూర్చున్న చోటకి తీసుకువెళ్ళాను. వాళ్ళు లో గొంతుకతో మెల్లగా మాట్లాడుకుంటున్నారు. గాలంతా వాళ్ళు పీలుస్తున్న చుట్టల వాసనతో నిండిపోయుంది. నేను నా బండిలో బొమ్మ దుప్పటిని సరిజేస్తుంటే ఉన్నట్టుండి ఏదో పెద్దగా పగులుతున్న చప్పుడు వచ్చింది. తర్వాత ఇంటి కప్పు పొడిపొడిగా రాలిపోయింది. తెల్లని సున్నం పెళ్ళలు, పెచ్చులు, తెల్లని పొడి… నా మీద నా బండి మీద బొమ్మ మీద, మమ్మల్ని కప్పుతూ. నేలని, కుర్చీలని, బల్లలని, మనుషులని తెల్లని రంగు నింపేసింది. నా ముక్కులోకి, గొంతులోకి దుమ్ము పోవడంతో నాకు దగ్గొచ్చింది.

‘బాంబ్’ అని పెద్దగా అరిచి ఒక్క గెంతులో టేబుల్ కిందికి దూరాను. ‘భయపడకు. బాంబు కాదది. ఇప్పుడు బాంబులు పడడం లేదు. యుద్ధం జరిగినప్పుడు పడిన బాంబుల వలన ఇంటికప్పు దెబ్బతిన్నది. అందుకే కూలిపోయింది. భయంలేదు. యుద్ధం ముగిసిపోయింది’, నాన్న మెల్లిగా చెప్పాడు. ఇప్పుడు నాకు నాన్నంటే ఇష్టం పెరిగింది. కానీ ఆయన చెప్పింది నేను పూర్తిగా నమ్మలేకపోయాను.


మా అమ్మమ్మ వాళ్ళింటి వీధిలోనే ఆసుపత్రి ఉంది. అంబులెన్సు నుంచి రోగులను స్ట్రెచర్‌పై ఆసుపత్రిలోకి తీసుకెళ్ళడాన్ని కిటికిలోంచి అబ్బురంగా చూసేదాన్ని. రోగులని ఎప్పుడు ఎర్ర దుప్పటితో కప్పి ఉంచేవారు. రోగుల శరీరంపైన ఉండే రక్తం కనపడకుండా ఉండడానికే ఆ ఎర్ర దుప్పటి కప్పుతారని నాకు తర్వాత మిలిగాన్ మేడం చెప్పారు. నేను ఓ మూల గదిలో కూర్చుని – చారల పిల్లి ఓర్లాండో ప్రపంచంలోకి వెళ్ళిపోయాను. ఓర్లాండో సెలవలకి ఊరెళ్ళడం, ఓర్లాండో తోటలు కొనడం భలే కథలు. సెలవలు, ఊళ్ళూ తోటలు – రోగులు, రక్తం కన్నా, గోడలు లేని మొండి ఇళ్ళు, కూలే కప్పుల గదులకన్నా హాయిగాను వాటికెంతో దూరంగాను ఉంటాయి.


ట్రాలీ బస్సులో మాకెదురుగా ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతడికి ముక్కు లేదు. మామూలుగా కనపడకుండా ఉండే ముక్కుగొట్టాలు అతని ముఖంలో నాకు కనిపించాయి.

‘అలా కళ్ళప్పగించి చూడకు. అతను యుద్ధంలో గాయపడ్డాడు’ చెప్పిందమ్మ. అతడు పెద్ద కోటు వేసుకుని ఉన్నాడు. అతడి ఎడమ చేతి వైపు ఖాళీగా ఉంది. కోటు భుజం దగ్గర పిన్ను పెట్టి ఉంది.

కొంతమంది ఊతకర్రలతో నిలబడి ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒక కాలు లేదు. లేదా మోకాలి వరకే ఉన్నాయి. పాదాల వరకు దుప్పటి కప్పేసుకుని కొంతమంది చక్రాల కుర్చీలో ఉన్నారు. మరికొంతమందికి చూపులేని కళ్ళని కప్పుతూ పట్టీలు ఉన్నాయి.

నేనిప్పుడు చారల పిల్ల్లి సెలవలకి ఊరెళ్ళే కథ, బావురు కప్ప కారు నడిపే కథ కాకుండా ప్లాస్టిక్ సర్జరీలపై రాసిన పుస్తకాలు చదువుతున్నాను.


నేను మొదటి సారిగా జర్మనీకి వెళ్ళినప్పుడు భయాన్ని గెలిచాననుకున్నాను. నేను, నా నేస్తం కే లాంబ్రెట్టా పై, ఈస్టర్ రోజులలో వెళ్ళాం. మంచులో చలికి చేతివేళ్ళు కొంకర్లు పోయాయి. ఒక సత్రంలో ఆగాం. ఒక లావాటి ఆవిడ అక్కడక్కడా పళ్ళు లేని నోరుతో నవ్వుతూ మమ్మల్ని ఆహ్వానించింది. ఆమె నోట్లోంచి దాల్చినచెక్కా, లవంగపు వాసనొచ్చింది. ఓ పెద్ద కర్ర పొయ్యి పెంకులకి చేతులు ఆన్చి చలికాచుకున్నాం. ఇరుకైన చెక్క మెట్లెక్కి ఓ విశాలమైన గదిగుండా వెళ్ళాం. ఆ గదిలో చాలామంది మగవాళ్ళు, ఒకే రకమైన యూనిఫాం వేసుకొని వరుసగా కుర్చీలలో కూర్చుని ఉన్నారు. ఆ యూనిఫాం నలుపో, ఊదానో. ఆ గదిలో తడిసిన ఉన్ని, చెమట కలిసిన వాసన ఘాటుగా కొట్టింది. నల్లబల్ల మీద గీసిన ఓ బొమ్మని ఓ కర్రతో చూపిస్తూ ఓ వ్యక్తి తన ఎదురుకుండా కూర్చున్న వాళ్ళకి ఏదో చెబుతున్నాడు. అది ఓ సైనిక వాహనం తాలుకు నమూనా. పెద్ద పెద్ద చతురస్రాలు, చిన్న చిన్న వృత్తాలు.

మేం పడుకునే గదిలోకి రాగానే మా మంచం అంచు మీదే కూర్చున్నాం, కళ్ళు విప్పార్చుకొని. ‘‌వాళ్ళెవరై ఉంటారో? నాజీలా?’ ఈ మధ్యే విడుదలైన యుద్ధపు సినిమాల్లోని సన్నివేశాలు నా కళ్ళ ముందు మెదిలాయి. జైళ్ళ దృశ్యాలు, వేధింపుల దృశ్యాలు, చెప్పలేని అమానుష చర్యల దృశ్యాలు… మా అమ్మ మాట వింటే బాగుండేది. నేనిక్కడకి రాకుండా ఉండాల్సింది. నా ఆత్మవిశ్వాసం తృటిలో సడలిపోయింది. కే భయంతో తన చేతిరుమాలుని ముళ్ళేస్తూ, విప్పుతూ ‘ఆ బొమ్మ టాంకే కదా?’ అంది. ‘ఆరు చక్రాలా, ఎనిమిదా? పక్కనుంచి పొడుచుకొస్తూ తుపాకులే గదా? అది టాంకే’.

మేము తలుపు గడియ పెట్టుకున్నాం. కుర్చీని గడియ కిందికి నెట్టాం. నేను రాత్రంతా మేలుకునే ఉన్నాను, ఎవరైనా గదిలోకి చొరపడతారేమోనని చెవులు రిక్కించి, బాంబులు, బుల్లెట్ల రొద కోసం, సైనికుల సెయ్‌గ్ హెయ్‌ల్ శాల్యూట్ల అరుపుల కోసం. తెల్లారాక మాకు గది చూపించినావిడని అడిగాం, రాత్రి జరిగిన ఆ సమావేశం దేని గురించని. అప్పుడు తెలిసింది వారంతా అగ్నిమాపక దళం సిబ్బందని. నల్లబల్ల మీది ఆ బొమ్మ ఫైరింజను. పక్కన ఉన్నవి తుపాకులు కావు, నీళ్ళ గొట్టాలు. మా మూర్ఖత్వానికి మేము నవ్వుకున్నాం. యుద్ధం జీవితం పట్ల మన దృక్పధానికి రంగులు పులుముతుంది.


కొన్నేళ్ళ తర్వాత మా కుటుంబమంతా ఓ చిన్న కారులో ఐర్లాండ్‌కి వెళ్ళాం. ఎందుకైనా మంచిదని కారు వెనక అద్దానికి పెద్ద ఆస్ట్రేలియా జెండా అంటించాం. ఈల వేసే పోస్టాఫీసు ఆవిడ, ఫిడేల్ వాయించే హెల్త్ ఇన్స్‌పెక్టర్, బోథ్‌రాన్ వాయించే మెకానిక్ అందరూ వాళ్ళ సంగీతాన్ని మేము పాడడానికి చేసిన ప్రయత్నాలను మెచ్చుకున్నారు. ముసలివాళ్ళు చేసే జానపదుల నాట్యాలు చూడటం కోసం చిన్న చిన్న పూరిళ్ళ హోటళ్ళకి తీసికెళ్ళారు, ‘ఐరిష్ చుక్క ఒకటి వేసుకుంటారా?’ అని అడిగేవారు.

పండగలప్పుడు మైదానాలలో షామియానాల కింద కెనెడియన్లు, జర్మనులు, డచ్‌, అమెరికన్లు, ఇంగ్లీషువారు, ఐరిష్ కలసిపోయి తెలిసిన పాతపాటల్ని గుంపుగా పాడారు. కల్సిపోయి ఆడారు. ఒకే గొంతుతో, ఒకే రాగంలో, ఒక్కటిగా శాంతితో, దీపాలు పోయినప్పటి చీకట్లో కొవ్వొత్తులు, కాగడాలు పైకెత్తిన చేతులతో అటూ ఇటూ ఊపుతూ.

సరిహద్దును దాటాం, తగలబడిన కార్లూ, బస్సులను దాటుకుంటూ. దారంతా కావాలని పెట్టిన గోతుల్లో, ఆ కుదుపుల్లో మేమేమన్నా బాంబులు తెస్తుంటే అక్కడే పేలిపోడానికి. ఓ ఇంగ్లీషు సైనికుడు మమ్మల్ని ఆపాడు. కిటికిలోంచి మా అబ్బాయి వైపు గురి చూస్తూ తుపాకీ గొట్టాం. స్నేహం, సోదర భావన మాలో ఒక్కసారిగా నీరుగారిపోయాయి.

‘నీ చేతిలో ఆ పెట్టె ఏమిటి బాబూ?’

‘‌మాండలిన్’ మా అబ్బాయి గొంతు పీలగా మాటలు పెగలకుండా.

‘‌తెరిచి చూపించు’, తుపాకీ గొట్టం ఇంకొంచెం ముందుకొచ్చింది. తెరిస్తే మెత్తటి మృదువైన నీలి రంగు గుడ్డ పై పసిడి రంగులో మెరుస్తున్న గిబ్సన్ మాండలిన్.

‘‌మాండలిన్‌ని పైకి తీసి దాని కింద ఏదైనా ఉందేమో చూపించు’

మా అబ్బాయి కళ్ళలో భయం నేను చూడలేకపోయాను. వాడి బాధల్లా ఆ మాండలిన్ ఏమైపోతుందనే. మాండలిన్‌ని సున్నితంగా పైకి తీసాడు. ఆ సైనికుడు లోపలంతా జాగ్రత్తగా తడిమి చూసాడు.

‘‌సరే. లోపల పెట్టేసుకో’ అంటూ పెద్దవాళ్ళ కేసి చూశాడు సైనికుడు.

‘ఎక్కడినుంచి వస్తున్నారు?’

‘స్లైగో’

‘‌స్లైగో? అక్కడేం చేసారు?’

‘పాటలు పాడొస్తున్నాం’

‘‌మీ కారు డిక్కీ వెదకాలి’

ఎందుకని మేమడగలేదు. అతడికి కావల్సినదేది మా దగ్గర దొరకలేదు. వెళ్ళిపోవచ్చన్నట్లుగా చేయి ఊపాడు. మేము ఫెర్రీ ఎక్కాక కాని మళ్ళీ కుదుట పడలేదు. ఆ తర్వాత దిన పత్రికలో లార్డ్ మౌంట్‌బాటన్‌ని స్లైగో తీరంలో పడవ మీద పేల్చేసారని వార్త.


పొడుగైన భవంతులలోకి దూసుకొస్తూ ప్రయాణీకుల విమానాలు. పొగ, దుమ్ము, పరిచయమైన అవే ఆకారాల్లో, మబ్బుల్లా దట్టంగా. కిటికీల గుండా మంటలు బైటికి నాలికలు చాస్తూ. నేల కూలుతున్న భవంతులకు దూరంగా ఆడా మగా, పిల్లలు పెద్దలు అంతా రోడ్ల మీద కెమేరాలు దాటి పరిగెత్తుతున్నారు. వాళ్ళ బట్టలు, శరీరాలు తెల్లని పొడితో కప్పబడిపోయి. కళ్ళలో భయం, అదే. చూసేవారు నమ్మలేకపోతూ అరుస్తూ ఏడుస్తున్నారు.


నాన్నా, నువ్వు చెప్పింది తప్పు. నాకు అప్పుడే తెలుసు నాన్నా. బాంబులు పడుతునే ఉంటాయి. రెక్కలు చల్లగా మృదువుగా ఉన్నప్పటికీ విమానాలు ఎప్పటికీ మనుషులని చంపుతునే ఉంటాయి.


నా పీడకలల్లో నేనింకా లండన్ నగరపు అండర్‌గ్రౌండు కోసం పరిగెడుతునే ఉంటాను పరిచిన ఆ నాపరాళ్ళ బండలపై. బయటకు వెళ్ళే దారి నాకు తెలియదు. సాయం కోసం అడుగుదామన్నా ఎవరూ ఉండరు. నా బాల్యమంతా ఇక్కడే దాక్కొన్నాను. అయినా ఈ అండర్‌గ్రౌండ్ నాకు పరిచయం కాదు, నాకు ఊరటనివ్వదు.


లండన్ ప్రజలు కెమెరాలను దాటుకుంటూ తూలుతూ నడుస్తున్నారు. అవే ముఖాలు, తెల్లటి దుమ్ముతోటో, కట్లతోటో, రక్తంతో, గాయాలపై పట్టీలతో, అండర్ గ్రౌండ్ నుంచి మళ్ళీ మళ్ళీ బైటకి వస్తున్నాయి. అంబులెన్సులు సైరన్లతో స్ట్రెచర్లపై మనుషులని ఆసుపత్రికి తీసికెళుతున్నాయి. రోగులను తగరపు దుప్పట్లతో కప్పుతున్నారు, కాని అవి రక్తాన్ని కనబడకుండా ఆపగలవా? రోడ్డు మీద ఓ డబుల్ డెక్కర్ బస్సు నిలువుగా చీలిపోయి ఉంది – తినడానికి కోసిన మామిడిపండులా, పొట్ట పగిలిన బయటకి కనిపిస్తున్న పేగుల్లా బస్సు సీట్లు ప్రపంచానికి కనిపిస్తూ. ఈ రోజును చూడవలసి వచ్చిన తన దౌర్భాగ్యాన్ని పెద్దగా ఏడుస్తూ ప్రపంచంతో ఒక మనిషి పంచుకుంటున్నాడు.


మార్కెట్ ప్రాంతాలలో పసిబిడ్డలు ముక్కలైపోతున్నారు. హోటళ్ళలోను, బార్లలోను టూరిస్టులు బలవుతున్నారు. తమ ఇళ్ళూ, వూళ్ళను వదిలి పోతున్న వారిపై ఆకాశం నుంచి బాంబుల వర్షం, పోలీసు స్టేషన్ల ఎదుట ఆత్మాహుతి దళాల ఘాతుకాలు – ఇవన్నీ ఇప్పుడు కెమెరాలో. మొబైల్ ఫోన్ కెమెరాలలో, వీడియో కెమెరాలలో, టివి కెమెరాలలో. ఇవన్నీ మన కోసం, మన వినోదం కోసం… నా గతాన్ని రోజూ గుర్తు చేయడం కోసం…

నాన్నా, బాంబులు ఇంకా పేలుతూనే వున్నాయి. ప్రతీ రోజు ఏడుగంటల వార్తలలో వినిపిస్తూనే వున్నాయి. నాన్నా, పాదాలు గాల్లో తేలుతూ పరిగెత్తిన ఆ పాప జీవితాంతం ఆ యుద్ధంతో కలిసే బతకక తప్పదు.


[మూలం: Jackie Tritt రచించిన Seven O’clock News అన్న కథ.]

కొల్లూరి సోమ శంకర్

రచయిత కొల్లూరి సోమ శంకర్ గురించి: కొల్లూరి సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు. ...