గాలిపటం

ఇందాకట్నుంచీ తదేకంగా ఆ పిల్లకేసే చూస్తున్నాను.

బాగా పాత బట్టలేసుకుంది. రాగి రంగులో మెరుస్తోంది ఆ పిల్ల జుట్టు. నూనె పెట్టకుండా చాలారోజులయినట్లుగా వుంది. పార్కులో పిల్లలు గాలిపటం ఎగరేస్తుంటే వారికేసే కన్నార్పకుండా చూస్తోంది. నల్లగా వున్నా ఆ కళ్ళల్లో వెలుగు నన్ను ఆ ఆమ్మాయికేసే చూసేలా చేసింది.

గాలిపటాలు పైకి ఎగురుతుంటే తప్పట్లు కొడుతోంది. గాలికి క్రిందకి పడిపోతూంటే తనే క్రిందకి పడిపోతున్నట్లుగా ఇదైపోతోంది. ఆ పిల్ల పక్కనే ఇంకో పిల్లాడూ ఉన్నాడు కానీ వాడికివేం పట్టినట్లు కనిపించలేదు. ఆ అమ్మాయి మాత్రం గాలిపటాల ఆటలో లీనమయిపోయింది. ఆ పిల్లనే గమనిస్తూ పచ్చికపై కూర్చుండిపోయాను. వేసవి కాలం అవ్వడం వల్ల సాయంత్రమయితే చాలు ఆ పార్కు పిల్ల్లలతో, పెద్దలతో నిండిపోతుంది. గోదావరి గాలితో ఆ ప్రదేశం చల్లగా మారిపోతోంది.

నేను ప్రతీ రోజు సాయంత్రం ఆ పార్కుకొస్తాను. మా ఇల్లు దూరమైనా వ్యాయామం పేరుతో అంత దూరమూ నడిచొస్తాను. ఉదయం నుండీ మనసు బాగోలేదు. పెద్దమ్మాయి పుట్టిన రోజుకిచ్చిన బంగారు గాజుల జత నచ్చలేదని తిరిగిచ్చేసింది. ఆ తరువాత ఇంట్లో గొడవ జరిగింది. మధ్యాన్నానికి తలనొప్పి ఎక్కువైంది. ఇంట్లో ఉండాలనిపించక పార్కుకొచ్చి కూర్చున్నాను.

ఆ నల్లపిల్లని నిన్ననే మొదటిసారి చూసాను. అప్పుడు అంతగా గమనించలేదు. ఇవాళ మళ్ళీ కనబడేసరికి మరోసారి ప్రత్యేకంగా చూసాను. ఇంతకుముందెన్నడూ ఆ పిల్లని చూసినట్లుగా గుర్తు లేదు. ఆ పిల్లని అలా పరిశీలనగా చూస్తూనే వున్నాను. చూడ్డానికి చాలా పేద పిల్లలాగ కనిపించింది. పరికించి చూస్తే ఆ అమ్మాయి పాత గౌను మీద చిన్న చిన్న చిరుగులు కుట్టి కనిపించాయి. కాలి చెప్పులు కూడా పాతవే. ముష్టివాళ్ళ పిల్లేమో అనిపించింది. కానీ చూడ్డానికలా లేదు. ముష్టెత్తుకునే పిల్లయితే ఈ పాటికి నా దగ్గరకొచ్చే వుండేది. రాలేదంటే బహుశా నిరుపేద కుటుంబం నుండొచ్చుండచ్చు.

ఎంతో ఆత్రంగా ఆ పిల్ల గాలిపటాల కేసి చూస్తోంది. నేనా పిల్లకేసి చూస్తున్నాను. ఎడతెరిపి లేని ఆలోచనలు. ఎవరి అమ్మాయయుంటుంది? పేరేమయ్యుంటుంది? ఏం చదువుతూ ఉంటుంది? చూడ్డానికి కాస్త పరిశుభ్రత లేదనిపించినా మంచి బట్టలేస్తే చక్కగా వుంటుందనిపించింది. ఆకారాన్ని బట్టి ఏ ఏడో తరగతో, ఎనిమిదో తరగతో చదువుతూ ఉండండచ్చు. వయసు పన్నెండూ, పదమూడు దాటదనే అనిపించింది. ఆ అమ్మాయి కళ్ళల్లో సంతోషం మాత్రం నన్నెంతో ఆకర్షించింది.

వేసవికాలం కాబట్టీ పార్కు కిటకిట లాడిపోతోంది ఈ సాయంకాలం – ముఖ్యంగా పిల్లలతో! ఆ పిల్ల దగ్గరికెళ్ళి పేరేమిటని అడుగుదామనుకున్నాను. మళ్ళీ ఎందుకులే అని ఊరుకుండిపోయాను. ఇంతలో ఓ పిల్లాడి గాలిపటం ఎంతో ఎత్తున ఎగురుతూంటే మరో గాలిపటం వచ్చి తగులుకుంది. దాంతో అంత ఎత్తునున్న గాలిపటం తెగిపోయింది. ఆ పిల్ల ఒక్కసారి గట్టిగా అరిచింది. ఆ పార్కులో ఎంతో మంది పిల్లలు అరుస్తున్నా ఆ పిల్ల కేక మాత్రం నా చెవులని తాకింది.

ఆ గాలిపటం ఆ పిల్లది కాకపోయినా తన గాలిపటమే తెగినంతగా దిగాలు పడిపోయింది. తలదించుకుని అక్కడే కూర్చుండిపోయింది. కళ్ళు దిగాలుగా వాలిపోయాయి. దిగాలుగా వున్న ఆ పిల్లనెందుకో చూడలేకపోయాను. మనసు చివుక్కుమంది. వెంటనే లేచి పార్కు బయటకు నడిచాను. పార్కు లోంచి బయటకు వస్తూడగా ఓ పిల్లాడు గాలిపటాలమ్ముతూ కనిపించాడు. వెళ్ళి ఒకటి కొన్నాను. ఆ గాలిపటం ఇచ్చి ఆ పిల్ల కళ్ళల్లో మరోసారి ఆ వెలుగు చూడాలనిపించింది. వెంటనే పార్కులోకి వెళ్ళి ఆ పిల్ల కోసం చూసాను.

తెగిన గాలిపటం ఎగురుకుంటూ అక్కడే ఉన్న కొబ్బరి చెట్టుకి చిక్కుకుపోయింది. ఆ పిల్ల ఇంకా ఆ చెట్టుకేసే చూస్తూ కనిపించింది. వెళ్ళి ఆ పిల్ల దగ్గరనిలబడ్డాను. తలెత్తి చూసింది.ఇంద తీసుకోమంటూ నా చేతిలో గాలిపటం ఇవ్వబోయాను. నన్ను చూసి ఎందుకో తటపటాయించింది. ఒక్కడుగు వెనక్కి వేసింది. పరవాలేదు తీసుకో అన్నట్లుగా తలూపాను. ఆ పిల్ల తమ్ముడూ నాకేసి చూస్తున్నాడు. వాడికిదేమీ అర్థం కాలేదు. ఆ పిల్ల వద్దన్నట్లుగా తలాడించింది. పరవాలేదు తీసుకోమంటూ ఆ పిల్ల చేతిలో గాలిపటమూ, దారపు రీలూ పెట్టాను. ఆ పిల్ల కళ్ళల్లో కాంతి ఒక్కసారి తళుక్కుమంది.

ఆ పిల్ల చిన్నగా నవ్వుతూ తమ్ముడికి దారపు రీలిచ్చింది. నేను ఎప్పుడూ కూర్చునే చోటుకొచ్చేసాను. మళ్ళీ ఆ పిల్లకేసే చూస్తూ ఉండిపోయాను. ఇద్దరూ ఆ గాలిపటం ఎగరవేస్తూ ఆనందంగా కనిపించారు. ఎందుకో తెలీదు వాళ్ళని చూస్తే నా మనసూ తేలిక పడింది. చీకటి పడుతోందనిపించి బయల్దేరాను.

ఆ పిల్లలు ఇంకా ఆ గాలిపటం ఆటలోనే ఉన్నారు. పార్కు గేటు దగ్గరకొస్తూండగా ఎవరో పిలుస్తున్నట్లనిపించి వెనక్కి తిరిగి చూసాను. ఆ నల్ల పిల్ల రొప్పుతూ పరిగెత్తుకుంటూ వచ్చింది. చేతిలో గాలిపటమూ, దారపు రీలుతో నా దగ్గరకొచ్చింది. ఏమిటన్నట్లు కళ్ళెగరేసాను. “మీ..గాలి..ప..టం…” నసుగుతున్నట్లుగా అంటూ నా చేతిలో గాలిపటం పెట్టింది. ఆ పిల్ల అలా తిరిగిచ్చేసరికి ఎందుకో అనుకున్నాను. పరవాలేదు వుంచుకో అని చెప్పాను. ఆ పిల్ల తలదించుకుంది. నీకోసమే అని మరోసారి చెప్పాను.

“మా అమ్మ ఎవరిదగ్గరా ఏమీ తీసుకోకూడదని చెప్పింది… నాకొద్దండీ” అని మళ్ళీ చిన్నగా చెప్పింది.
“నీ పేరేంటి?”
“భారతి….”

ఈ గాలిపటం ఇంటికి పట్టికెళితే ఆ పిల్ల తల్లి ఎక్కడ వీళ్ళని అనవసరంగా దండిస్తుందో అనిపించింది. సరే అన్నట్లుగా వెనుదిరిగాను. ఆ పిల్ల వెళిపోబోతూ మరలా వెనక్కొచ్చింది. ఏం మాట్లాడకుండా నాకు దణ్ణం పెట్టింది. హఠాత్తుగా ఆ పిల్ల అలా చేసేసరికి ఆశ్చర్యపోయాను. “దేనికది…..?” అప్రయత్నంగా అన్నాను.

ఆ పిల్ల మాట్లాడలేదు. నా చేతిలో ఉన్న గాలిపటం వైపు చూపించి నవ్వుతూ, పరిగెత్తుకుంటూ వెళిపోయింది. చీకట్లో ఆ పిల్ల వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాను. ఆ పిల్ల కళ్ళల్లో సంతోషం నాక్కూడా పాకింది.

దూరంగా కొబ్బరి చెట్టున చిక్కుకున్న గాలిపటం వీధిదీపం వెలుతురులో రెప రెపలాడుతూ కనిపించింది.