పతంజలి తనువు చాలించడానికి సరిగ్గా 22 సంవత్సరాల క్రితం (10.3.1987) ఒక మాటన్నారు, “కవిత్వానికి ఆయుష్షు తీరిపోయిందని, కథలు రెక్కలు విరిగిపోయాయని అంటున్న వారిని లాగి లెంపకాయ కొట్టాలనిపిస్తున్నది” అని. “జీవితాన్ని ఆలంబన చేసుకున్న సాహిత్యానికి దిగులేమిటి? జీవన గంధాన్ని పరివ్యాప్తం చేసే కవిత్వానికి బెంగేమిటి? జీవితాన్ని అల్లుకుని పెరిగిన సాహిత్యాలకు బెదరేమిటి?” అంటూ చురకలంటించారు. నిజమైన సాహిత్య ప్రేమికుడి హృదయ స్పందన అది.
నాకు మనసు బాగోలేనప్పుడు తరచూ రామాయణ విషవృక్షం, మిట్టూరోడి కతలతో పాటు పతంజలి ‘రాజుగోరు’ కూడా తిరగేసి మనసుని తేలిక చేసుకునే ప్రయత్నం చేస్తుంటాను. అలా రాజుగోర్ని ఎన్నిసార్లు చదివానో గుర్తులేదు. ముఖ్యంగా అందులో దేవుడమ్మ చెప్పే 26 లైన్లు – తరచూ నెమరేసుకుంటూ తెరలు తెరలుగా నవ్వుకుంటాను.
కే.ఎన్.వై. పతంజలి
(3/29/1952 – 3/11/2009)
ఫకీర్రాజు, గోపాత్రుడు అదే కారులో ఉన్నారని తెలియని దేవుడమ్మ తన కూతురు చిన్నమ్మతో “రాసోడో, విండీసనిచ్చిన రాసోడో – అమ్మీ… రాసోడేటైనాడే? ఆడితోటొచ్చిన దొంగమొకవోడేడీ…” అంటూ, తన తదనంతరం కూతురు ఎలా మసలు కోవాలో చేసే బోధనలో “ఇల్లు గుల్ల జేసీవొద్దమ్మా. జాగర్తోలమ్మీ!” అంటూ చెప్పే ఈమె మాటలు బ్రహ్మాండం.
శంకరమఠం ఎదురు సందులోంచి నల్లకుంట బ్రిడ్జి వైపుకి నేను ఎప్పుడెళ్ళినా అక్కడ పిల్లనగ్రోవి ఊదుతూ అడుక్కునే గుడ్డివాడ్ని తదేకంగా చూస్తూ పతంజలి ‘చూపున్నపాట’ లోని గుడ్డివాడ్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉండేవాడ్ని.
పతంజలి రాసిన ‘అడల్ట్ స్టోరీ’ చదివి, అందులో “పువ్వుని ముద్దెట్టుకుంటే పుప్పొడీ, పెళ్ళాన్ని ముద్దెట్టుకుంటే కుంకుమా పెదాలకు అంటుకుంటాయి” అనే డైలాగ్ తలచుకున్నప్పుడల్లా ఆయన శృంగార వచనానికి ‘వాహ్వా’ అనుకుంటుంటాను.
‘ఖాకీవనం’ నవల మొదట్లోనే ఎస్.ఐ. భార్య అక్కడున్న కానిస్టేబుల్‌ని ఉద్దేశించి “ఒరే, పనిది సమయానికి లేదు. యిదిగో చంటిది దొడ్డికి కూర్చున్నట్టుంది. కాస్త కడిగీ…” అన్న డైలాగ్ చదివి కంగారుపడిపోయాను. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. పిచ్చిచూపులు చూశాను. తర్వాత పతంజలి గుండె ధైర్యానికి అంజలి ఘటిస్తూ చదివాను. ఆ నవల చదివిన కొత్తలో ఎందుకో విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. మరికొన్ని ఖాకీవనాల్ని కొని అందరిచేతా చదివించాలనిపించి, అక్కడ పాత పుస్తకాల మార్కెట్లో ‘ఖాకీవనం’ కాపీలకోసం ఆరాతీస్తే …. వాళ్ళు నావైపు అమాయకంగా చూస్తూ ‘ఖాకీవనం కాపీలు దొరకవు. ఎంచేతంటే పోలీసోళ్ళు మా దగ్గరున్న కాపీలన్నీ కొని, మాముందే పెట్రోలు పోసి తగలెట్టారని’ చెప్పారు.
ఆర్టిస్టు చంద్ర 1997లో ఆంధ్రప్రభ వారపత్రికలో ‘ఆట’ అనే ఒక కథ రాశారు. ఆ కథ – ఒక పదేళ్ళ కుర్రాడు ఊడుగ చెట్టు కొమ్మలు పట్టుకు ఊగుతున్నాడంటూ ప్రారంభమవుతుంది. అనుకోకుండా నేనప్పుడు ఉద్యోగం చేస్తున్న పటాన్‌చెరువులోని ‘ఆల్వీన్ వాచ్ డివిజన్’ ఆవరణలో ఉన్న చిన్నపాటి మర్రిమానులాంటి ఊడుగ చెట్ట్టు మనసులో మెదిలింది. అలా మానుల్లాంటి ఊడుగలు అరుదుగా కనిపిస్తాయి. ఇదే విషయాన్ని ఒకసారి చంద్రగారు కనిపించినప్పుడు చెప్పాను.
‘మీ ఆల్వీన్‌లో ఊడుగ ఉందా? దానికోసం పతంజలి వెతుకుతున్నారు. ఊడుగ పూత ఉంటే పతంజలిగారికి తీసుకెళ్ళి ఇవ్వు. ఆయన ఆయుర్వేద వైద్యంలో వాడతార’న్నారు చంద్ర. ఆ సందర్భంగానే పతంజలిగార్ని తొలిసారిగా చూశాను.
అది నాంది – ఊడుగపూతను, నల్లటి ద్రాక్షల్లా ఉండే ఊడుగ పండ్లను తీసుకొని శంకరమఠం సందులో ఉండే పతంజలిగారింటికి తరచూ వెళ్తుండేవాడ్ని. వాటిని చూసి ఆయన తెగ ముచ్చటపడేవారు. అప్పట్లోనే నేను విశాఖపట్నం కెజిహెచ్ పై రాసిన ‘జలగలవార్డు’ కథ ఆంధ్రజ్యోతి ఆదివారంలో చదివి, నాతో అదే ఆస్పత్రిలో జరిగిన అతి కిరాతకమైన మరో సంఘటనని చెప్పి దీన్ని కథగా రాయి అన్నారు (రాత్రి 11లోగా పలానా పేషెంటు చనిపోతాడని వార్డు బాయ్‌కి చెప్పి వెళ్తాడు డాక్టర్. 11 దాటినా ఆ పేషంట్ చనిపోకపోవడంతో – తన డ్యూటీ టైంలోగా చనిపోతేనే తనకు ఆ శవంపైన డబ్బులు వస్తాయి లేదా మరొక వార్డుబాయ్‌కి వెళ్ళిపోతాయని – వాడు బలవంతంగా పేషంట్ పీక మీద తలగడను నొక్కిపెట్టాడన్నది ఆ కిరాతకమైన సంఘటన యొక్క సారాంశం).
కానీ ఆ సంఘటనని కథగా రాసే ధైర్యం చేయలేకపోయాను.
2007 ఏప్రిల్‌లో పాత్రికేయలు కొమ్మినేని వాసుదేవరావుగారు చనిపోయినప్పుడు చూడ్డానికి వెళ్ళాం. మోతీనగర్‌లోని వాసుదేవరావుగారు ఉంటున్న అపార్ట్‌మెంటులోని కింద పోర్షన్‌లోనే పతంజలి ఉంటున్నారు. మర్రోజు ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో వాసుదేవరావుగారిపై నివాళి వేయాలనుకున్నప్పుడు, ఆయన భౌతిక కాయం ఎదురుగా ఉండగానే నేను పతంజలి గారింట్లో కూర్చుని వాసుగారిపై నివాళి రాయించుకొని తీసుకొచ్చాను.
పతంజలిగారు మనల్ని వదిలి వెళ్ళడానికి సరిగ్గా 3 రోజల ముందు నా స్వంత పనిమీద విశాఖపట్నం వెళ్ళాను. మార్చి 7 (శనివారం) సాయంత్రం మిత్రుడు వర్మకు ఫోన్ చేస్తే ‘మేమంతా సిమ్మాద్రి ఆస్పత్రిలో పతంజలిగారి దగ్గర ఉన్నాం. రూమ్ నెం. 510, అక్కడికి వచ్చేయ్’ అన్నాడు. ఆ ఆస్పత్రి సరిగ్గా రావిశాస్త్రిగారి ఇంటి వెనకున్న సందులో ఉంది. నేను వెళ్ళే సరికి కారిడార్‌లో రేడియో మధు, చోడవరం వేణు, ఐ.వి. సురేష్‌లు బయటున్నారు. వర్మ నన్ను పతంజలిగారి దగ్గరకు తీసుకెళ్ళారు (వాసుదేవరావుగారు చనిపోయినప్పుడు చూడ్డమే ఆయన్ని. ఆయనకు ఆరోగ్యం బాగోలేదని తెలిశాక వారింటికి రెండు సార్లు వెళ్ళాను. సరిగ్గా ఆ సమయాల్లోనే ఆయన ఇంట్లో లేరు).
రెండేళ్ళనాడు చూసిన పతంజలికీ, ఇప్పటి పతంజలికీ పోలీకే లేదు. చూడగానే నోట మాట రాలేదు. అపుడపుడు మా ఇంటి వసారా గూట్లోంచి గుమ్మం ముందు పడిపోయే రెక్కలు రాని పిచుకపిల్ల కళ్ళముందు కదలాడి, కడుపులో దేవినట్టు అయ్యింది. దుఃఖంతో గుండె బరువెక్కింది.
నన్ను చూడగానే ఆయన గుర్తుపట్టారు. పనిమీద వైజాగ్ వచ్చానని చెప్పాను. మర్రోజు ఆదివారం సాయంత్రం మల్లీశ్వరి, చందు, అట్టాడ, గంటేడ, చలంగార్లతో మరోసారి పతంజలిగార్ని చూడ్డానికి వెళ్ళాను. కాని ఎందుకో నాకు మరోసారి ఆయన్ని చూడ్డానికి మనసు అంగీకరించలేదు. నేను, చందూ కిందే కారులో ఉండిపోయాం. నేను తిరిగి మంగళవారం గోదావరిలో బయలుదేరి బుధవారం తెల్లవారి సికింద్రాబాద్‌లో రైలు దిగుతుండగా నా సెల్‌లో ఒక మెసేజ్ కన్పించింది. ‘పతంజలి పోయారట’. అది వసంతలక్ష్మిగారు పంపిన మెసేజ్.
అదేరోజు సాయంత్రం అదే ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీకోసం ద్వారకాలో ఉన్న శివారెడ్డిగారి ముందు కూర్చుని పతంజలిగారిపై నివాళి రాయించుకుని తీసుకొచ్చి ఎడిటర్‌గార్కి అందించాను.
కాకతాళీయంగా వాసుదేవరావుగారు పోయినప్పుడు పతంజలితో (వారింట్లో కూర్చుని) నివాళి రాయించుకున్నప్పుడు మరో రెండేళ్ళలో పతంజలిపోతారని, వారి నివాళిని నేనే కె.శివారెడ్డిగారితో రాయించుకుని వస్తానని ఊహించలేదు. అది అదృష్టమో, దురదృష్టమో తెలియదు. ఏదేమైనా … నన్ను ఇప్పటికీ, ఎప్పటికీ ఆ ఊడుగపూత పరిమళం వెంబడిస్తూనే ఉంటుంది.