త్యాగరాజు చిత్రపటం
(విలియం జాక్సన్ పుస్తకం నుండి)
తెలుగు భాషా, సంస్కృతీ దేదీప్యమానంగా విరాజిల్లిన విజయనగర సామ్రాజ్యం 17 వ శతాబ్దం మధ్య లో విచ్ఛిన్నమయ్యింది. అరవీడు వంశంలో ఆఖరి రాజు శ్రీరంగంతో విజయ నగర రాజుల పాలన అంతమయ్యింది. అంతవరకూ విజయనగర సామ్రాజ్య పాలకుల ఆధీనంలో ఉన్న మధురై, తంజావూరు, కలాడి, మైసూరు, చిత్రదుర్గ సంస్థానాలు స్వయం పరిపాలిత రాజ్యాలయ్యాయి. సరిగ్గా అప్పుడే దక్షిణాన బ్రిటిషు వారి ఆక్రమణ మెల్ల మెల్లగా మొదలయ్యింది. ఉత్తరాది నుండి ముస్లిం రాజుల దాడులతో రాజ్యాలాన్నీ ముక్కలయిపోయాయి. ప్రజల జీవితాలు కకావికలయ్యాయి. రాజకీయ అస్థిరత ప్రజల్లో భయం రేపింది. ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలియని పరిస్థితిల్లో, సుస్థిర ప్రాంతాల వైపు వలసలు మొదలయ్యాయి. దక్షిణాది నున్న రాజ్యాలలో తంజావూరు కాస్త నయంగా ఉండేది. అంతేకాకుండా తంజావూరు రాజులు సాహిత్యాన్నీ, కళల్నీ పోషించండంతో తెలుగునాట పండితులందరూ వలసలు మొదలుపెట్టారు.
తంజావూరు రాజ్యాన్ని 1675 నుండీ మరాఠా రాజులు పాలించారు. తంజావూరుని నాయక రాజులే సింహ భాగం పాలించినా, చివర్లో మరాఠా రాజుల ఆక్రమణతో వారి వశమయ్యింది. తెలుగు, తమిళం తంజావూరు రాజ భాషలు గా చెలామణీ అయ్యేవి. 1758 వ సంవత్సరంలో ఫ్రెంచి వాళ్ళు తంజావూరు పై దండెత్తి, ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. 1793 లో బ్రిటీషు వాళ్ళ ఆధీనంలోకి తంజావూరు వచ్చింది. పేరుకు తంజావూరు మరాఠా రాజుల పాలనలో ఉన్నా బ్రిటిషు వాళ్ళ చేతుల్లోనే పరిపాలన జరిగేది. ఒక రకంగా తంజావూరు రాజులు బ్రిటీషు వారి చేతిలో కీలుబొమ్మలు. బ్రిటిషు వారి కనుసన్నల్లో మరాఠా రాజుల వేలిముద్ర పాలన సాగింది. అ ప్పటి వరకూ తమిళ భాష రాజభాషల్లో ఒకటిగా ఉన్నా, మరాఠా రాజులు సంస్కృతానికీ, తెలుగుకే పెద్ద పీట వేసారు. ఈ మరాఠా రాజుల హయాంలో తెలుగు, సంస్కృత భాషలు విలసిల్లాయి. సాహిత్యమూ, లలిత కళలూ విరాజిల్లాయి. ఏ మూల చూసినా ఆ సమయంలో, భారతదేశంలో స్థిరత్వం లేదు. ఒక పక్క బ్రిటీషు వాళ్ళూ, ఫ్రెంచి వాళ్ళూ, మరో పక్క ముస్లిం నవాబులూ, ఇంకోపక్క సామరస్యం లేని హిందూ రాజులూ, ఇలా అనేక మంది ప్రజాజీవనాన్ని నిర్దేశించేవారు. సరిగ్గా అప్పుడే తంజావూరు రాజ్య సంగీత ప్రపంచంలో ఓ మహాద్భుతం జరిగింది. కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని ఓ మలుపు తిప్పింది ఓ మహా వ్యక్తి జననం. ఆ మహామనీషి శ్రీ త్యాగరాజు. ఆ మహానుభావుడి పుట్టుక కర్ణాటక శాస్త్రీయ సంగీతానికొక ఒరవడీ, ప్రత్యేకతా తీసుకొచ్చింది.
సంగీతం అంటే కొంచెం తెలుసున్న వారెవరైనా, కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్నీ, త్యాగరాజునీ వేరు చేసి చూడ లేరు. ఎందుకంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఆయన చేసిన అసమానమైన కృషి అలాంటిది. కర్ణాటక సంగీతానికీ, త్యాగరాజుకీ విడదీయరాని బంధం ఉంది. లాగుడు పీకుడు రాగాలతో శాస్త్రీయ సంగీతం అంటే ఆమడ దూరం పరిగెత్తే జనాలకి, అందులో ఉండే మాధుర్యం, మత్తూ చూపించీ, సంగీతం అంటే మరింత ఆసక్తిని కలిగించిన వాడు త్యాగరాజు. ప్రస్తుతమున్న కచేరీ పద్ధతికి ప్రాణం పోసిన వాళ్ళల్లో ఆద్యుడు. సరళమైన భాషలో వినసొంపైన శాస్తీయ సంగీతాన్ని అజరామరం చేసాడు. రామ భక్తుడిగా తనదైన ప్రత్యేకమైన ముద్రతో సంగీతాన్ని భక్తి వాహకంగా వాడుకొన్న వ్యక్తి.
కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి తనవంతుగా అందించిన అనితర సాధ్యమైన సృజనాత్మక కృషిని చూసి, త్యాగరాజుని దేవుడి అవతారంగా మార్చేసారు ఆయన శిష్యులు. ఆయన జీవితంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలకి దైవత్వం ఆపాదిస్తూ, భక్తి పురాణ గాధగా త్యాగరాజు జీవిత కథని మార్చేసారు. రాముణ్ణీ ఆయన ఇంటికి పంపించేసారు. ఆయన్ని దేవుని అంశగా తీర్చి దిద్దారు. నేను దేముణ్ణి కాదంటూ, గొంతు చించుకొని ఎంత చెప్పినా వినని భక్తులు, వందేళ్ళ క్రితం నాటి సాయిబాబానీ దేముడి అవతారంగా మలిచి, వీధికో గుడి కట్టి, అభిషేకాలతో, పూజలతో ఊపిరి సలపనివ్వకపోవడం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. ఇంతలా కాకున్నా, త్యాగరాజుకీ సుమారుగా జరిగిందిదే. ఈ ఫక్కీలోనే అనేక రచనలూ, వ్యాసాలూ వచ్చాయి. హరికథలూ, నాటకాలూ, సినిమాలూ తయారయ్యాయి. మనందరికీ తెలుసున్న త్యాగరాజు ఈయనే!
సరిగ్గా చరిత్ర చూస్తే త్యాగరాజు రెండు వందల ఏళ్ళ క్రితం వాడు. అప్పటికే ముస్లిం రాజుల పాలన మొదలయ్యి వందల సంవత్సరాలయ్యింది. బ్రిటిషు వాళ్ళూ, ఫ్రెంచి వాళ్ళూ, డచ్చి వాళ్ళూ, ఇలా ఎందరో భారతదేశంలో పీఠం వేసారు. చరిత్రకారులు ఈ సంఘటనలన్నీ తేదీలతో సహా నిక్షిప్తం చేసారు. ప్రతీ దానికీ ఆధారాలున్నాయి. కాకపోతే ఇందులో త్యాగరాజు జీవితం గురించి ప్రస్తావన మాత్రం అతి తక్కువగా ఉంది. ఆయన కృతులు తప్ప ఆయన గురించి ఎక్కడా ప్రస్తావించ బడలేదు. అవి కూడా త్యాగరాజు శిష్యులు పొందుపరిచినవే! “శ్రీ త్యాగరాజ పరబ్రహ్మణేనమః” అని శ్రీకారంతో మొదలుపెట్టి రాసిన అనేక కృతుల వ్రాత ప్రతులు వీణ కుప్పయ్యర్ అనే శిష్యుడి దగ్గర లభించాయి. ఈ ప్రతులపై 1826 సంవత్సరం అని రాసుంది. అప్పట్లో ఈ వ్రాత ప్రతులు టి. ఎస్ పార్థసారధి అనే విద్వాంసుడి ఆధీనంలో ఉండేవి. ప్రస్తుతం ఇవి తంజావూరు సరస్వతీ మహల్లో ఉన్నాయి. ఈ ప్రతుల్లో కూడా త్యాగరాజు కృతులే ఉన్నాయి తప్ప ఆయన జీవిత విశేషాలు రాసి లేవు.
ఆయన అనుంగు శిష్యులిద్దరు రాసిన రచనల ఆధారంగానే ఆయన జీవిత విశేషాలు తెలిసాయి. త్యాగరాజు చూపించిన అపారమైన సంగీత జ్ఞానానికి ముగ్ధులైన ఆ శిష్యులిద్దరూ స్వతహాగా హరికథకులవడంతో ఆయన్ని దేవుని అంశగా భావిస్తూ రాసారు. అక్కడక్కడి సంగతులు తప్ప క్రమబద్దంగా రాసినవేవీ లేవు. పోనీ త్యాగరాజ వంశీకులెవరైనా ఉన్నారా అంటే అదీ లేదు. ఆయనకొక్కత్తే కూతురు. ఆ కూతురికీ ఒక కొడుకు పుట్టి, అర్థాంతరంగా మరణించాడు. అందువల్ల ఆయన ప్రత్యక్ష వంశీకులెవరూ ఉన్న ఆధారాలు లేవు. ఏవో చిన్నా చితకా ఆధారాలు తప్ప, వివరంగా ఎక్కడా పొందుపర్చిన దాఖలాలు లేవు. ఇది మాత్రం అంతుబట్టని విషయం.
త్యాగరాజు అడిగిన వాళ్ళకి కాదనకుండా సంగీతం నేర్పాడు. ఆయనకి దాదాపు పాతిక మంది పైగా ప్రధాన శిష్యులున్నారన్న ఆధారాలున్నాయి. ఇది మాత్రం విచిత్రమో, యాదృచ్ఛికమో తెలీదు. పైన చెప్పిన ఇద్దరు తప్ప ఎవ్వరూ ఆయన జీవిత చరిత్ర రాయడానికి పూనుకోలేదు. వీరు రాసిన జీవితచరిత్ర ఆధారం తోనే కొత్త కొత్త సంఘటనలూ, విశేషాలూ అతికించబడి అనేక కథలు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత చాలా మంది త్యాగరాజు జీవిత చరిత్ర రాసారు. కొన్ని సంఘటనలకీ, విశేషాలకీ ఆధారాలెక్కడవి అనే ప్రశ్న ఉదయించకుండా, అవన్నీ రాముని లీలలుగా అభివర్ణించేసి, ఆయన జీవిత చరిత్రని ప్రజల కందించారు.
1859 వ సంవత్సరంలో మద్రాసు (ప్రస్తుతం చెన్నై) లో సంగీతానికి సంబంధించీ, “సంగీత సర్వార్థ సార సంగ్రహము” అనే ఒక పుస్తకం ప్రచురించారు. అందులో 20 పైగా త్యాగరాజ కృతులు (స్వరాలు లేకుండా) ప్రచురించారు. ఇందులో కూడా త్యాగరాజు పేరు మాత్రం ఉంది కానీ, ఆయన గురించి ఒక్క వాక్యమూ లేదు.
1893 లో చిన్నస్వామి ముదలియార్ అనే క్రిష్టియన్ మతస్థుడు “దక్షిణ భారత సంగీత పరంపర” [South Indian Musical Tradition] అనే గ్రంధ ప్రచురణ నిమిత్తమై, అనేక కర్ణాటక సంగీత కృతులు సమీకరించాడు. త్యాగరాజుకి ముఖ్య శిష్యుల్లో ఒకరైన కృష్ణ స్వామి భాగవతార్ అనే ఆయన సహకారంతో “ఓరియంటల్ మ్యూజిక్ ఇన్ స్టాఫ్ నొటేషన్” [Oriental Music In Staff Notation] గ్రంధం ప్రచురించాడు. అందులో “శాస్త్రీయత మరియు శ్రావ్యత లోనూ, సృజనాత్మకతలోనూ, వెలువడిన పలు త్యాగరాజ కృతులకి సాటి కర్ణాటక సంగీతంలో ఎక్కడా లేదు” (by far the most scientific, charming, voluminous and variegated in all Dravidian Music…) అని ప్రస్తావించబడింది. త్యాగరాజ కృతుల గొప్పదనం వివరించబడింది తప్ప ఆయన జీవిత విశేషాలు మాత్రం ప్రచురించ లేదు.
1896 లో సురేంద్ర మోహన్ టాగూర్ అనే ఆయన “యూనివర్సల్ హిస్టరీ ఆఫ్ మ్యూజిక్” అనే పుస్తకం ప్రచురించాడు. అందులో భారత దేశంలోనున్న 10 మంది అత్యంత ప్రముఖ సంగీత విద్వాంసుల్లో త్యాగరాజు పేరూ ప్రస్తావించబడింది.
“Among the renowned musicians of the present century in Southern India might be named Tigya Raj, who was a native of TiruDi (Tiruvaayoor)…” [ Universal History of Music, 1896, Surendra Mohan Tagore]
వెంకటరమణ భాగవతార్ తెలుగులో రాసిన తాళ పత్ర గ్రంధమే త్యాగరాజ జీవిత చరిత్ర గురించి వచ్చిన మొట్ట మొదటి రచన. కానీ అదీ అసంపూర్తిగానే ఉంది. కొంతవరకూ సాఫీగా సాగిన ఆ రచన మధ్యలో ఆగిపోయింది. కారణాలు ఎవరికీ తెలియవు. ఇది టి.ఎస్.రామారావు గారి సహకారంతో కలసి చేసిన రచన. ఈ రామారావు త్యాగరాజు కి ప్రియ శిష్యుడు. త్యాగరాజు కుటుంబ వ్యవహారాలన్నీ ఈయనే చూసేవాడని చెబుతారు.
ఆ తరువాత కృష్ణ స్వామి భాగవతార్ రాసినది రెండవ రచన. దీనికీ మొదటి రచనే ఆధారంగా కనిపిస్తుంది. ఇందులోనూ కొన్ని సంఘటనలకి రాముని లీలలు అతికించబడినట్లుగా అనిపిస్తుంది. ఈ రెండూ 1900 ముందే వచ్చాయి. 1900 తరువాత వచ్చిన అనేక రచనల్లో పలు విశేషాలూ చొప్పించబడ్డాయి. వాటికి ఆధారాలేమిటన్నది ఎవరికీ తెలియదు.
సంగీతానికి ఇంతగా సేవలు అందించిన తెలుగువాడైన త్యాగరాజు గురించి రాసిన తెలుగు వాళ్ళూ చాలా తక్కువమందే! ఎన్ సి పార్థ సారధి రాసిన రచనలూ, బాలాంత్రపు రజనీకాంత రావు గారి “వాగ్గేయ కారుల జీవిత చరిత్ర” తప్ప, త్యాగరాజు జీవితానికి సంబంధించిన రచనలు అతి తక్కువగా వచ్చాయనే చెప్పచ్చు. ఆయన సంగీతమ్మీదా, కృతుల మీదా విశ్లేషణలు వచ్చాయి. జీవితం గురించి రాసిన పుస్తకాలు తక్కువే. టి.ఎస్.సుందరేశ్వర శర్మ గారి “త్యాగరాజ చరిత్ర” సంస్కృత రచనా, ఇదే పేరుతో తెలుగులో రాసిన వింజమూరి వరాహ నరసింహాచార్యుల రచనా చెప్పుకోదగ్గవి. వీటికీ హరికథా భాగవతార్ల కథే మూలం. కాకపోతే ఎవరికి తగ్గ భక్తి భావం చొప్పించి వారిదైన శైలిలో చూపించారు. మంచాళ జగన్నాధరావు గారి స్వర సంకలనంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు “త్యాగరాజ కీర్తనలు” పేరుతో ఏడు భాగాలుగా ప్రచురించారు. ఇందులో త్యాగరాజ జీవిత చరిత్ర కూడా ఉంది. ప్రత్యేకమైన విశేషాలు లేనప్పటికీ, ఇందులో రాసిందానికీ పైన చెప్పిన హరికథ భాగవ తారల కథే ప్రమాణంగా కనిపిస్తుంది.
త్యాగయ్య సినిమా గురించి అందరికీ తెలుసున్నదే! దానికీ పైన పేర్కొన్న వారి హరికధ పురాణమే ఆధారం. రామ భక్తునిగా త్యాగరాజుని ఆవిష్కరించారే తప్ప, సంగీత పరంగా వాగ్గేయకారునిగా ఆయన జీవితాన్ని చూపలేదు. రామదాసూ, మీరాబాయి, పోతన లాంటి భక్తుల పక్కనే ఈయన్నీ కూర్చో బెట్టారు. తమిళంలోనూ, ఇంగ్లీషులోనే చాలానే పుస్తకాలు వచ్చాయి. రెండో మూడో రచనలు తప్ప మిగతావన్నీ కూడా భక్తి వాహకంగా రాసినవే!
భమిడిపాటి కామేశ్వర రావు గారు “త్యాగరాజ ఆత్మ విచారము” అనే పుస్తకం రాసారు. ఇది మాత్రం పైన చెప్పిన రచనలకి భిన్నంగా ఉంటుంది. త్యాగరాజుని వాగ్గేయ కారుడిగా చూపడానికే ప్రయత్నించారు. పుక్కిట పురాణ కథలు కనిపించవు. తత్వ, అధ్యాత్మిక విశ్లేషణ లతో త్యాగరాజ సంగీతమ్మీదొచ్చిన పుస్తకం ఇదొక్కటే. కాస్త చరిత్రకి దగ్గరగా తెలుగులో వచ్చిన రచన.
“వివాదాత్మక అంశాలపై శ్రద్ధతో కూడిన సమతుల్యత పాటిస్తూ – విజయాలకీ, ఉపద్రవాలకీ ఒక ఉనికిని చూపిస్తూ -విశ్వ చరిత్ర లో సమ సమాజ సారూప్యాన్నీ, భిన్నత్వంలో సంక్లిష్టతనీ చూపించడానికి ప్రయత్నించే వాడే చరిత్రకారుడు” [ William H McNiell – “Mythistory, or Truth, Myth, History and Historians ] అని విలియం మెక్ నీల్ అనే చరిత్రకారుడు చెప్పినట్లుగా, వీలైనన్ని చారిత్రిక ఆధారాలు చూపిస్తూ, ఒక వాగ్గేయకారునిగా త్యాగరాజునీ, ఆయన జీవితాన్నీ అందించాలన్నదే ఈ చిన్న ప్రయత్నం.
గురు దక్షిణ
దక్షిణాదిన ఆధునిక చరిత్ర ప్రారంభమైన తొలి రోజుల్లో, 1767 లో త్యాగరాజు జన్మించాడు. బ్రిటిషు వాళ్ళు మెల్ల మెల్లగా దక్షిణాదిన చొచ్చుకుపోతున్న కాలం అది. యుద్ధాలూ, ఆక్రమణలూ, దోపిడీలూ, భయాలూ, సామాజిక మార్పులూ, సాంస్కృతిక పరిణామాలూ, అన్నీ తలోదారినా ప్రజల మీదొచ్చి పడ్డాయి. 1847 లో త్యాగరాజు పరమపదించే సమయానికే టిప్పు సుల్తాన్ బ్రిటిషు వారి చేతుల్లో పరాజయం పొందాడు. అనిశ్చిత జీవితానికి ప్రజలు అలవాటు పడిపోయారు. తమ కళ్ళముందే ఈ చరిత్ర సాగిపోడం త్యాగరాజూ, ఆయన అనుంగు శిష్యులూ చూసారు.
త్యాగరాజు జీవితం గురించి పూర్తిగా తెలీకపోయినా ఆయన శిష్యుల ద్వారా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఇద్దరు తండ్రీ కొడుకులు ఆయన శిష్యులుగా ఉండేవారు. వాళ్ళిద్దరూ వెంకట రమణ భాగవతార్ (తండ్రి) మరియు కృష్ణ స్వామి భాగవతార్ (కొడుకు). వెంకట రమణ భాగవతార్ 1781 లో జన్మించాడు. త్యాగరాజు తో ఎక్కువ కాలం గడిపిన వాళ్ళల్లో ఆయనొకరు. చివర్లో ఆయన మద్రాసు వాలాజ పేటకి వెళిపోయాడు. ఆయన కొడుకు, కృష్ణ స్వామి, త్యాగరాజు అంత్య దశలో ఆయనతో రెండేళ్ళు పైనే గడిపాడు. వీళ్ళిద్దరూ త్యాగరాజ చరిత్రను రాసారు.
వెంకట రమణ భాగవతార్ రాసిన తాళపత్ర రచనా, కృష్ణ స్వామి భాగవతార్ రాసిన కాగిత ప్రతులూ ఇప్పటికీ మదురై “సౌరాష్ట్ర సభ” లో భద్రంగా ఉన్నాయి. వీళ్ళద్దరూ రాసిన జీవిత విశేషాలూ, మిగతా శిష్యగణం ద్వారా ఆనోటా, ఈనోటా విన్న సంఘటనలూ తప్ప, ప్రత్యేకమైన వివరాలు లభించలేదు. ఏమైతేనేం, ఆ శిష్యులిద్దరూ త్యాగరాజుకి వెలలేని గురుదక్షిణ ఇచ్చారు. ఉన్నంతలో, ఆయన జీవిత చరిత్రని సంగీత ప్రియులకి కానుకగా ఇచ్చారు.
స్వతహాగా వీళ్ళిద్దరూ హరికథ బాగవతార్లవ్వడం వల్ల, త్యాగరాజు జీవితాన్ని ఓ పురాణ గాథగా మలిచి రాసారు. ఆయనకి దైవత్వం ఆపాదించేసారు. ఆయన సంగీత సృజనకీ, రామ భక్తికీ మహత్యాలు అతికించారు. ఓ రామ భక్తుడిగా త్యాగరాజు జీవితాన్ని హరికధలుగా మలిచి చాలా ఊళ్ళల్లో ప్రచారం చేసారు. వాటికి త్యాగరాజందించిన సంగీతం తోడై, ఆ హరికథలు జనరంజకమయ్యాయి. ప్రజల మనసులకత్తుకోడం కోసం ఆయన జీవితంలోకి రాముడి లీలలూ, రక్షణలూ చొప్పించి ఆసక్తి కరంగా మలిచారు. రామ భక్తుడిగా పట్టాభిషేకం చేసేసి, చివరకి ఆయన్ని రాముడిలో లీనం చేసేసారు. ఆయన జీవితాన్ని పౌరాణిక గాధగా తీర్చి దిద్దారు.
త్యాగరాజు జీవితంలో జరిగిన అతి ముఖ్యమైన సంఘటనలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, వ్యక్తిగా త్యాగరాజు ఎలా జీవించాడూ? అప్పట్లో ఉన్న యుద్ధాలూ, కల్లోలాలపై ఎలా స్పందించాడూ? ఆయన భార్యా, పిల్లలతో ఎలా గడిపాడూ?, శిష్యులకి ఎలా సంగీత బోధన చేసేవాడూ? ఇలా ఎన్నో వివరాలు ముందు తరాలకి అందకుండా పోయాయి. ఇది మాత్రం మన అందరి దురదృష్టం. యాదృచ్చికమో, కాకతాళీయమో తెలీదు. వీళ్ళందించిన కథలే అందరికీ అందాయి. ఇవీ, త్యాగరాజు అందించిన కృతులే – మనకి లభించిన ఆస్తి.