కవిత్వం అంటే భయవోఁ, భక్తో సరిగ్గా తెలీదు నాకు. అందులోనూ పద్య కవిత్వం.
వూదొత్తులు వెలిగించీ, హారతిచ్చీ, ప్రసాదం పెట్టీ ఆ తరవాత లెంపలు వేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించకపోతే కళ్ళు పోతాయనుకునేవాడిని. ‘వరహాచారి మేష్టారు’ చెబ్తున్నంతసేపు ఎంతో బావున్నా, ముఖాముఖీ పద్యంతో ఎప్పుడూ భయవేఁ. పంచేంద్రియాలూ పన్చెయ్యడం మానేసేవి. దీనికి సరిగ్గా వ్యతిరేకంగా వుండేది వచనం మీద అభిప్రాయం. ఎవరో పక్కన కూచుని కబుర్లు చెబుతున్నట్టు, అందులోనూ మామూలు విషయాలు. మానేపల్లి సత్యనారాయణ గారు ‘ప్రోజు’ చెప్పేవారు. ‘పేంటూ, షట్టూ, టక్కూ’ ఇదీ వేషం. మాట్లాడితే చాలు, ‘గురజాడ, గిడుగు, శ్రీశ్రీ’ వగైరాల గొప్పదనం గురించే అద్భుతంగా చెప్పేవారు. తెలుగు క్లాసు ఎంతో బావుండేది.
పదో తరగతి వరకూ ఇదే వరస.
ఇంటర్ లో ‘శివాజీ భారతం’ రాస్తున్న మేష్టారు గానీ, విఠల్ గారు గానీ మాకు రాకుండా, మా దురద్రుష్టం కొద్దీ ట్రాన్స్‌ఫరై పోయేరు. డిగ్రీలు తప్ప పాండిత్యం లేని వారొచ్చేరు. అయినా ఇంజినీరింగ్‌కి తెలుగూ ఇంగ్లీషూ అక్కర్లేదని నేను కూడా వదిలేసేను. నిజానికి ఇప్పటికీ కవిత్వమంటే, ఎలాటిదయినా, అసంకల్పిత ప్రతీకార చర్య లాగ, మనసు లోనే దణ్ణం పెట్టుకుని లెంపలేసుకుంటాను, ఎవరూ చూడకుండా.
అయితే కవిత్వాన్ని భయపడి చదవడం మానేయకుండా, భయపడుతూనే చదివేంత ధైర్యమిచ్చిన పుస్తకం తాపీ ధర్మారావు గారు రాసిన ‘సాహిత్య మొర్మొరాలు’. మా దొడ్డమ్మ కొడుక్కి వొక వింత అలవాటు, ఇప్పటికీ, వుంది. పుస్తకాలు కొని చదవక పోవడం. ఆ కొనడానికి కూడా పద్ధతీ పాడూ వుండవు. అలవాటు కొద్దీ వొకసారి, మహాప్రస్థానం, సాహిత్య మొర్మొరాలు తీసుకొచ్చి “చదవరా” అనిచ్చేడు.
‘మహాప్రస్థానా’న్ని కళ్ళకద్దుకుని గబగబా చదివేసేను. ‘సాహిత్య మొర్మొరాలు’ పుస్తకాన్ని చూస్తే చదవాలనిపించలేదు.
బస్టేండ్ లో కిళ్ళీ బడ్డీలకి తోరణాల్లా వేలాడే ‘అంబడిపూడి’ పుస్తకంలా అనిపించింది. పేపరూ, ప్రింటూ కూడా అలానే వున్నాయి. ఏ-ఫోర్ పేపరుని నాలుగు మడతలు పెడితే వున్న సైజు కన్నా కొంచెం పెద్ద సైజు. ఈయన కూడా, ‘వశీకరణం’, ‘శ్రీఘ్రస్ఖలనం’, ‘కోట్లు సంపాయించడవెఁలా’ వగైరాల లాటివి రాసుంటాడనుకున్నాను, తాపీ వారి గురించి తెలీక. అసలు రెండు పుస్తకాల్నీ పక్కపక్కనే చూసినపుడు చాలా చికాగ్గా అనిపించింది. మా చిన్నాన్న పక్కని ఆయన బాల్య మిత్రుడు, ప్రస్తుతం ఆయవారాలు చేసుకుంటున్నతన్ని చూసి మా నాన్నమ్మ చికాకు పడినట్టు.
కానీ, పుస్తకాన్ని చదవకుండా ఆగలేకపోవడం, నా అద్రుష్టం. ఆ అలవాటు కొద్దీ మొదలెట్టేను.
మొదటి వ్యాసం “కృష్ణుడి శిరసును సత్యభామ తన్నిందా?” మొదలు పెట్టిన తరవాత చికాకు పటాపంచలై పోయింది; భయం గాలి కెగిరి పోయింది. ‘తాతాజీ’ చేయి పట్టుకుని, చదువుతూ — కాదు — ఆయన చెప్పేవి వింటూ, చేమకూర వెంకట కవి వరకూ అలా గాల్లో తేలుతూ వెళ్ళిపోయేను.
“ఆ సమయంలో కృష్ణుడు ఉపశమన వాక్యాలారంభించాడు. నగలు ధరించలేదేమి, నావైపు చూడవేమి – అని నంగిరి మాటలు. ‘చే విరిదమ్మి వ్రేయుటకునై/ యుంకించి జంకించినన్, చేతితో (విరిదమ్మివంటి చేతితో)’ కొట్టబోయింది – చెవి దగ్గర అసహ్యంగా గోలపెడుతున్న జోరీగను విదిల్చినట్టు. చేవిరిదమ్మిన్ – చేతిలోవున్న వికసించిన పద్మముతో అని అర్ధము చెప్పిన కాలేజీ పండితులున్నారు. ఆ సన్నివేశములో, ఆ కోప పరిణామ చిత్రణములో, ఈ అర్థము చెప్పడము చాలా ఘోరము. ముక్కు తిమ్మన్నకు మహాపరాధమని చెప్పనక్కరలేదు.”
ఇలా చమత్కారంగా చెబ్తూ సత్యభామ తన్నలేదు, “తాకింది. దాన్ని గోపాలుడు తాచిన యది నాకు మన్ననయ అని ఆ తాకుడుని తాపుగా పేర్కొన్నాడు. ఈ తప్పుడు అర్థం చెప్పినందుకే కవి ఈ పద్యంలో ‘కుహనా గోపాలుడూ’ అని అన్నాడు” లాటివి చదివేసరికి, పద్యాలు మడి కట్టుకు తిరుగుతున్న పెద్దవాళ్ళ లాగ కాకుండా, మన చుట్టుపక్కల తిరిగే, మనకన్నా తెలివైనవాళ్ళూ, మన స్నేహితులూ అనిపించేయి.
మానేపల్లి సత్యనారాయణ మేష్టారు పుస్తకం చదివే పద్ధతి చాలాసార్లు చెప్పినా, ఇప్పటికీ అలవాటవలేదు. ముందుమాట చివర్లో చదివినపుడు ఇంకా సరదా వేసింది. అందులో తాతాజీ ఈ పుస్తకం ఎందుకు రాసేరో, ఎందుకు ఇలా రాసేరో వివరించేరు.
“ఇదొక చిన్న సాహిత్య వ్యాసాల సంపుటి. ఈ వ్యాసాలు పండితుల కోసం వ్రాసినవి కావు: పూర్వకవుల పరిచయం బాగా వున్న పాఠకుల కోసం వ్రాసినవీ కావు. ప్రబంధాలకూ ప్రబంధ కవులకూ కొంచెం దూరమున్న వారి కోసమే వ్రాశాను […] ఆ రవంతలో కొంత విమర్శన పద్ధతీ, కొంత పద్య వ్యాఖ్యానమూ, కొంత కవుల తారతమ్యమూ, రుచి చూపించడానికి ప్రయత్నం చేశాను […]” అలానే 1972 పునర్ముద్రణ లో ‘మరో మాట’లో “ఈ రూపంగా నయినా ఈ యువతరం వారు సుప్రసిద్ధాలయిన పాత విషయాలూ, వాటి విమర్శనా విధానమూ తెలుసుకోడానికి వీలుగా వుంటుందని ఆశించాను.”
సత్సంకల్పం సిద్ధిస్తుంది, సిద్ధించింది.
మొత్తం పదహారు వ్యాసాలు. నా మట్టుకు నాకు అన్నీ ఆణిముత్యాలు. తాపీ ధర్మారావు గారి శైలి, ముఖ్యంగా విమర్శనా పద్ధతి, సులువుగా, హాయిగా వుండడం మరింత బలం. వొక్క వాక్యంలో కూడా, కవుల్ని, మహానుభావులుగా చూపించలేదు. వాళ్ళందరూ మమూలు మనుష్యులే అనిపిస్తారు. వాళ్ళ గొప్పదనం ఇంకా ఎక్కువవుతుంది.
‘ఊతపదాలూ – వ్యర్థపదాలూ’ వ్యాసం లో నన్నయ, తిక్కన, శ్రీనాథుడు, ప్రబంధ కవుల ఊతపదాలు వివరిస్తూ, “ఈ లసత్, విలసత్, వంటివే ప్రాంచత్, రాజత్, బ్రాజత్, యొసగు, అలరారు, ఇంపారు, చెన్ను, మీరు మొదలైన జాబితా మాటలు మన కవుల ప్రబంధాలలో లక్షోపలక్షలు – వారు మహా కవులు కాబట్టి వారిని చిన్నబుచ్చడం మంచిది కాదని మనవారు ఆ వ్యర్థపదాలకి ఏదో అర్థం చెప్పి సమర్థించడానికి ప్రయత్నిస్తారు. గౌరవం యిలా చూపడం మంచిదేగాని అలా సమర్థించడమే పనిగా పెట్టుకుంటే పెద్ద అనిపించుకోలేని కవి ఎవడుంటాడు” అని రాస్తే ఆశ్చర్యం వేసింది నాకు. తాపీ ధర్మారావు గారి తెలుగు మేస్టారు ఈ వ్యాసం చదివి ముక్క చీవాట్లు పెట్టేరేమో అని భయపడ్డాను.
ఈ వ్యాసంలోనే, ఇవన్నీ తెలుగు కవిత్వంలో వున్న నియమాల వల్లనే అంటారు. ఆ వూపులోనే ఈ వ్యర్థపదాలవల్ల మహాకవులకు “పద్యం కమ్మచ్చులో దీసినట్టు […]” నడిపించడం సులువైయ్యిందంటారు. “[…] ఓహో! ఏమి ధార అని సహృదయులందరూ ప్రశంసిస్తారు.” నిజాయితీతో ఈ వ్యర్థ పదాల గురించి బాధ పడుతూ, “ఇలాటి బైరాగి చిట్కాలన్నీ యతిస్థానాల దగ్గరనో, ప్రాస స్థానాల దగ్గర్నో ఉండడము యీ వెయ్యి సంవత్సరాలనుండి చూస్తున్నాము. కానీ ఈ విమోచన మార్గం అందరికీ ఇంకా దొరకలేదు. అది తెలుగుల దురదృష్టం” అంటారు.
‘రమా హేలా కలా వాసమై’ అని చేమకూర వెంకట కవి నగర వర్ణన చేశాడట. దీని గురించి వివరిస్తూ, “ఈ వ్యర్థ పదాలూ, పాద పూరణాలు తెలుగు కవిత్వంలో తరచు కనబడుతుండడం వలన అర్థగౌరవమున్న దానిని గూడ పాద పూరణమనే భావించే దురవస్థ కలుగుతూ వుంటుంది” ఎందుకంటే, వ్యాఖ్యాతలు, “[…] లక్ష్మీ విలాసం బాగా వున్నట్టిదై” అన్నట్టు వ్యాఖ్యానించారట. తాతాజీ లక్ష్మికీ, పార్వతికీ, సరస్వతికీ వాసమై అంటారు. ఈ వ్యాసంలోనే చివరిగా “వ్యాఖ్యాతల పొరపాటుకు విచారించడం కంటే, అటువంటి అభిప్రాయాలకు దారి కల్పించిన మన మహాకవులను గురించి దుఃఖించడం న్యాయం” అని వాపోతారు.
‘పోతన్న కవిత్వ పటుత్వం’ అనే వ్యాసంలో “రాజాజీ గారు కంబ రామాయణాన్ని ఇంగ్లీషులో ప్రచురిస్తున్నారు. అలాగే మనలో ఓపికున్న సమర్థులెవరయినా తెలుగు భాగవతం లోని ఒకటి రెండు ఘట్టాలను ఇంగ్లీషున ప్రచురించడం మంచిది. అట్లయితే, సంస్కృత భాగవతంతో పరిచయమున్న యితర రాష్ట్రాలవారు గూడా, మన ఆంధ్రకవి పోతన్నలోని కవిత్వ పటుత్వం గ్రహించి గౌరవిస్తారు” అన్నారు.
కుదిరే పనే? అందులోనూ పోతన కవిత్వం? అంటే ఇంగ్లీషులో పోతన్న గారిలా కవిత్వం రాయగలిగిన తెలుగు పండితుడన్న మాట. లేదా ఇప్పటికే ఎవరైనా రాసేరేమో?
‘అణాల గొడవ’ వ్యవహారం – ‘కవితా తాంబూలాలు’ అనే వ్యాసంలో మొదలై, నాలుగయిదు వ్యాసాల తర్వాత తేలి అక్కడా ముగింపబడక (‘బడు’ల గొడవ) ఇంకా ముందుకెళుతుంది. ‘కవితా తాంబులాలు’ వ్యాసం మిగిలిన వ్యాసాలన్నిట్లోనూ నాకు చాలా ఇష్టమైనది. అందులోనూ “కూపోదకం, వటచ్ఛాయా, తాంబూలం, తరుణీకుచం, శీతకాలే భవేదుష్ణం, ఉష్ణకాలేతు శీతలం” శ్లోకం ఇంకా ఇష్టం. ఇందులోనే “నిరుపహతిస్థలంబు” పద్యంలో వున్న కప్పురవిడెము కీ, “మృగమద సౌరభ” పద్యంలోని “మగువ పొలుపు తెలుపు” మృగమద తాంబూలానికీ వున్న బాదరాయణ సంబంధం కూడా వివరించేరు.
ఇక అణాల గొడవ. దండి “తూర్ణం మానీయతాం చూర్ణం, పూర్ణచంద్రనిభాననే” అన్నాడు. కాళిదాసు, “పర్ణాని, స్వర్ణ వర్ణాని, కర్ణాంతాయతలోచనే” అన్నాట్ట. ఇద్దరూ చూసింది, ఒకే కాంతని. ఆ కాంత దండిని “పండితుడని”, కాళిదాసుని “కవి” అనీ సంబోధిస్తుంది.
‘తాతాజీ’ వ్యాఖ్య: సాయం సమయములో, వొక అందమైన కాంతను చూసి, తగిన సంబోధనే అయినప్పటికీ, పూర్ణచంద్రనిభాననే అనడం రసాభాసము. దానికి తోడు, సున్నప్పిడత అడిగేడు, అందులోనూ చిటికల మీద రావాలి ‘తూర్ణం’. కాళిదాసు ‘కర్ణాంతాయతలోచనే’ అన్నాడు. అంటే, ఆ కాంతని సరిగ్గా చూసి ఆవిడలో వున్న అందాన్ని పొగిడేడు. దానికితోడు స్వర్ణ వర్ణంలో వున్న ఆకులు మాత్రమే కావాలన్నాడు. అక్కడ తిష్ఠ వేసి ఇంకా హస్కు కొట్టడానికి. కవులు సరసులుట కదా?
అణాలు లేని ఆ రోజుల్లో, అణాల గొడవెక్కడిది?
“సాహిత్య మొర్మొరాలు” అనే పేరు పెట్టడం గురించి ఇలా – “[…] కొంచెం రుచిగా వుంటాయి; ఒక పిడికెడు ఎక్కువ తిన్నా బాధ లేదు; ఎప్పుడు తిన్నా ప్రమాదం లేదు; అజీర్ణ బాధ కలగదు. ఎప్పుడు చాలు ననిపిస్తే అప్పుడే మాని వేయవచ్చు […] ఈ పేరు పెట్టడంలో ఇదే నా అభిప్రాయం.”
గురజాడనీ, శ్రీశ్రీ ని ‘కోట్’ చెయ్యకుండా ఏ వ్యాసం పూర్తవదని ఎక్కడో చదివేను. మొర్మొరాలు నవుల్తున్నప్పుడు “[…] కన్యాశుల్కంలో ‘పిల్లా, అగ్గిపుల్ల’ అన్నట్టు అడిగాడు” తగలడం ఆశ్చర్యం.
కవిత్వం మీద ఎంతసేపూ, భజన వ్యాసాలే తప్ప, వున్నదున్నట్టూ, మంచీ చెడూ వున్న వ్యాసాలు చాలా తక్కువేనేమో. 1961 లో మొదటి ముద్రణ. 3000 ప్రతులు. 72, 76, 82, 86 లలో మలి ముద్రణలు. విశాలాంధ్ర వారి ప్రచురణ. విశాలాంధ్ర వారు ఇంతకన్నా మంచి ప్రచురణే చెయ్యగలిగీ ఇలా చెయ్యడం బాధాకరవఁయిన విషయం.
పుస్తకం హస్తభూషణం అంటారు. ఈ పుస్తకం శిరోభూషణం.