శ్రీ “అంపశయ్య” నవీన్ 2006 లో ఒక నెల రోజులు పాటు జరిపిన అమెరికా పర్యటన అనుభవాలను వర్ణిస్తూ చేసిన రచన “అమెరికా అమెరికా”. ఇది ఒక యాత్రా నవల. ఇందులో అనుభవాలను పూసగుచ్చినట్టు చెప్పటానికి నవలా రూపాన్ని ఒక సాధనంగా వాడుకున్నారు. అంతేగాని, దీనినొక పూర్తి స్థాయి నవలగా రచయిత ఉద్దేశించి ఉండక పోవచ్చు. చెప్పేది వాస్తవానుభవాలు కాబట్టి, కల్పనకి, నాటకీయతకి అవకాశం తక్కువ. ఈ కారణం చేత, సాధారణ నవలలకుపయోగించే ప్రమాణాలతో దీనిని అంచనా వేయ్యలేం. ఐతే, నవలా రూపం తీసుకోవటం వల్ల కధనంలో వేగం, చదివించే గుణం ఏర్పడ్డాయి. యాత్రలో తారసపడే పేరులేని సమూహాల స్థానంలో తమకంటూ ఒక జీవితం, కలలు, కన్నీళ్ళు కలగలిసిన సజీవ వ్యక్తుల గురించి రాయటం వల్ల కూడా చదివించే గుణం మరింత పెంపొందింది. ఈ యాత్రా నవల ఒక వారపత్రికలో ధారావాహిక సీరియల్ గా విజయవంతం కావటం, అంతగా పుస్తకాలు చదివే అలవాటు లేని మిత్రులు కూడా ఈ పుస్తకాన్ని చదువుతూ రాత్రి ఒంటిగంట దాటినా పక్కన పెట్టలేకపోయామని చెప్పటం వంటివి దీనిలో ఉన్న చదివించే గుణానికి తార్కాణం. ఈ చదివించే గుణం శ్రీ నవీన్ రచనలన్నింటిలోనూ దాదాపుగా ఉండేదే. ఆయన చిన్న నవలల్ని నేను ఏకబిగిన చదివి పూర్తి చేసిన సందర్బాలనేకం ఉన్నాయి.
అమెరికా…అమెరికా
ఈ పుస్తకం మూడు విభిన్న ప్రయోజనాల్ని ఏక కాలంలో నెరవేరుస్తుంది. గత సమీక్షలో చెప్పినట్టు ఇక్కడున్న వారికి తమ జీవన శైలిపై తిరిగి ఆలోచించుకొనే అవకాశం ఇస్తుంది. అమెరికా రాబోయే వారికి ప్రయాణానికి, ఇక్కడి పరిస్థితులకి సంబంధించిన అనేక వివరాలతో ఒక గైడు లాగా ఉపయోగపడుతుంది. అమెరికన్ కన్సలేటులో వీసా పొందటం దగ్గర్నించి విమాన ప్రయాణం, ఇమ్మిగ్రేషన్ చెకింగ్ వంటి అంశాలన్నింటినీ ఇందులో వివరంగా చెప్పారు. ఇక, అసలెప్పుడూ అమెరికా వచ్చే ఉద్దేశ్యంలేని తెలుగు వారికి ఈ పుస్తకం ఇక్కడి వింతలూ, విశేషాలు, జీవన పరిస్థితుల గురించి ఆసక్తికరంగా వివరిస్తుంది. డిస్నీలాండ్, యూనివర్సల్ స్టూడియో, గోల్డెన్ బ్రిడ్జి, రెడ్‌వుడ్ ఫారెస్ట్, సియర్స్ టవర్స్, నయాగరా ఫాల్స్ -ఇలా అనేక ప్రముఖ స్థలాల్ని సందర్శించినప్పుడు కలిగిన అనుభవాల్ని, ఆయా ప్రదేశాల వివరాలతో సహా ఇందులో పొందుపరిచారు. నెల రోజుల తన పర్యటనలో ఇన్ని విషయాల్ని గమనించటం, వాటిపై నోట్సు రాసుకోవటం అభినందిచదగ్గ విషయం.
ఇదేగాక, అందరూ గొప్పగా చెప్పుకొనే తానా, ఆటా వంటి మహాసభలు ఎలా జరుగుతాయో తెలుసుకోవాలన్న ఉత్సుకత అనేక మందిలో ఉంటుంది. తాను వెళ్ళిన లాస్ ఏంజిల్సు ఆటా సభల గురించి శ్రీ నవీన్ అనేక వివరాలు రాసారు. ఆ సభలు జరిగిన కన్వెన్షన్ సెంటర్ ఎంత పెద్దదో, స్టేజి,డైనింగ్ హాలు వంటి ఏర్పాట్లు ఎంత ఘనంగా చేసారో బాగా వర్ణించారు. ఇటువంటి సభల్లో సాహితీ సమావేశాలకి అంతగా జనం రాకపోవటం గురించి ఆయన వ్యక్తం చేసిన బాధను అర్థంచేసుకోవచ్చు. ఈ సందర్భంగా సినిమావాళ్ళ మీద మోజు, అభిరుచిలేని హాస్యానికి ఆనందించటం వంటి వాటిపై ఆయన కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసారు:
“తెలుగువాళ్ళు ఎక్కడున్నా తెలుగువాళ్ళే అనిపించింది. ఆరంభశూరత్వం, ఆవేశం, అల్పసంతోషత్వం, హాస్యప్రియత్వం,రాజకీయాల మీద మోజు వాళ్ళ స్వంతమనించింది. అమెరికాలో ఉంటున్న తెలుగువాళ్ళు చాలా లోతుగా, సాఫిస్టికేటెడ్ గా,సున్నితంగా, నాగరికంగా, సంస్కారవంతంగా, నిశ్శబ్దాన్ని ఇష్టపడేవాళ్ళుగా, డిగ్నిఫైడ్ గా ఉంటారనుకున్నాను …ఇంత భోళా శంకరులుగా, ఇంత శబ్దకాలుష్యాన్ని సృష్టించే ఘనులుగా ఉంటారని ఊహించలేదు.”
వీటిలో కొంత వాస్తవం ఉన్నా, ఇంత స్వీపింగ్ గా చెప్పటం వల్ల కొందరు నొచ్చుకొనే ప్రమాదముంది. ఇవి చదివినప్పుడు, 2000 సంవత్సరంలో అట్లాంటాలో జరిగిన ఆటా సభల్లో తనను చూసి ఈలలు, చప్పట్లతో హోరెత్తిస్తున్న జనాల్నిచూసి మెగాస్టార్ చిరంజీవి “అమెరికా అంటే క్లాసేమోనని భయపడ్డాను గాని, మాసేనన్న మాట” అని వ్యాఖ్యానించటం గుర్తుకు వచ్చింది. అన్ని రకాల అభిరుచులు కలిగినవాళ్ళు అన్ని చోట్లా ఉంటారు. అలాగే, స్థలం మారినంత మాత్రాన అభిరుచి స్థాయి పెరగవలసిన అవసరం కూడా లేదు. ఐతే, అసలెక్కడున్నా, సగటు అభిరుచి స్థాయి పడిపోకుండా కాపాడుకోవలసిన అవసరాన్ని ఇటువంటి వ్యాఖ్యలు గుర్తుచేస్తాయి.
ఈ పర్యటనలో భాగంగా ప్రముఖ పట్టణాల్నే కాకుండా, కొన్ని చిన్న ఊళ్ళను కూడా సందర్సించటంవల్ల ఆ అనుభవాల్ని చెప్పే అవకాశం కలిగింది. అలాగే, పర్యాటక విలువ లేక పోయినా ఆసక్తిని కలిగించే కొన్ని విషయాల్ని ప్రస్తావించటం కూడా బాగుంది. ఉదాహరణకు, కారు కొనేటప్పుడు జరిగే బేరసారాల గురించి ఒకచోట రాసారు. ఈ రకమైన ప్రస్తావన బహుశ ఏ ఇతర యాత్రా కధనాల్లోనూ వచ్చి ఉండకపోవచ్చు. అలాగే ఇక్కడ సాధారణంగా జరిగే సంభాషణల్ని రికార్డు చేసిన తీరు కూడా బాగుంది. ముఖ్యంగా, అమెరికాలో ఉండటమా, లేక భారతదేశానికి తిరిగి వెళ్ళటమా అనే విషయం మీద ఒక పార్టీలో యువకుల మధ్య జరిగినట్టు రాసిన సంభాషణలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. అలాగే, అమెరికాలో పదేళ్ళ పైగా గడిపిన ఆయన మిత్రుడు పురుషోత్తం “నా లాస్ట్డేస్ ని ఇండియలోనే గడుపుతాను .. నా శరీరం ఇండియా మట్టిలోనే కలిసిపోతుంది” అని చెప్పే మాట కూడా ఇక్కడ చిరకాలం ఉన్న అనేకమంది దగ్గర వింటాం.
ఈ పర్యటన సందర్భంగా తారసపడిన కొందరు వ్యక్తుల కధనాలు ఈ పుస్తకానికి నవలారూపాన్నివ్వటంలో ప్రధానపాత్ర వహిస్తాయి. మల్లిక్-రూప-అరుంధతి, సురేందర్-సంయుక్త, రామరెడ్డి, పురుషోత్తం, భాస్కర్ ఇలా అనేకమంది జీవితకధల్ని చాలా ఆసక్తికరంగా రాసారు. వీటన్నిటిలో ఆయన బాల్యమిత్రుడైన రామరెడ్డి కధ మనసుని హత్తుకొంటుంది. ఊపిరితిత్తుల కేన్సర్ కి గురై చికిత్సపొందుతున్న రామరెడ్డి, ఆ వ్యాధినెదుర్కోవటంలో ప్రదర్శించే ధైర్యం, “జీవన్ అగర్ జహర్ హై తో పీనాహి పడేగా” అనే పాటను గుర్తుకు చేసుకోవటం ఎంతో కదిలిస్తాయి. అలాగే, ఇండియాలో అప్పుల బాధ నుంచి తప్పించుకోవటానికి అమెరికా వచ్చి, అష్టకష్టాలూ పడి నిలదొక్కుకున్న పురుషోత్తం కధ, సునామీలో కూడా సి.ఐ.ఎ.కుట్రను చూసే భాస్కర్ కధ ఆసక్తికరంగా సాగుతాయి.
శ్రీ నవీన్ కి చాలా ఇష్టమైన అంశం వైవాహిక సంబంధాలు. “సంకెళ్ళు”, “చీకటి మూసిన ఏకాంతంలో”,”అంతస్స్రవంతి” -వంటి అనేక నవలల్లో ఈ ఇతివృత్తమే ప్రధానంగా ఉంటుంది. కేవలం ఒక కోణం నుంచే కాకుండా, వివాహ సంబంధాలలో ఉద్రిక్తత ఏర్పడటానికి స్త్రీ పురుషులిద్దరూ ఎలా కారణమౌతారో ఎంతో ప్రతిభావంతంగా చెప్పిన సంఘటనలు ఈ నవలల్లో అనేకం ఉంటాయి. మిమిక్రీ కళాకారుడు మల్లిక్ తనకు మొదట రూపతో ఆమెతో విడిపోయాక అరుంధతితో జరిగిన వివాహాలు ఎలా భగ్నమయ్యాయో వివరిస్తూ చెప్పే సందర్భంలోనూ, తన మిత్రుని కొడుకు సురేందర్, అతని భార్య సంయుక్తల మధ్య ఏర్పడిన మనస్పర్థలను వివరించే సందర్భంలోనూ ఈ నవలల నేపధ్యం స్పష్టంగా తెలుస్తుంది. సురేందర్, సంయుక్తల విషయంలో నాటకీయంగానైనా ఆమె కూడా తనకు తారసపడటం, ఆమె వైపునించి కూడా జరిగిన సంఘటనల్ని వినిపించటం సముచితంగా ఉంది. మొత్తం మీద వైవాహిక సంబంధాలలో ఒకరిపై మరొకరికి ఇష్టం, ఒకరి అభిప్రాయాలు, అభిరుచులపై మరొకరికి గౌరవం ఉండటం ముఖ్యమని, వారు తీసుకొనే నిర్ణయాలలో సాంప్రదాయం, సమాజాల ఒత్తిడి ఉండకూడదని ఆయన అనేకచోట్ల చెప్పిన అభిప్రాయాలకు అణుగుణం గానే వీరిద్దరి కధల పట్ల ఆయన ప్రతిస్పందన ఉంటుంది. ఇందులో చెప్పిన అనేక వ్యక్తుల జీవిత కధలు, పరస్పరం సంబంధం లేని కధలుగా అనిపించినా, ఒక అంతస్సూత్రాన్ని మనం గమనించవచ్చు. ఆరోగ్యపరమైన సమస్యలున్న రామరెడ్డికి, ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన పురుషోత్తంకి, వైవాహిక జీవితంలో సవాళ్ళనెదుర్కొన్న సంయుక్తకి వారి అమెరికన్ జీవితం సహాయపడిన విధం చెప్పటంతో ఇక్కడ మనిషి ప్రాణానికి, శ్రమకి, వ్యక్తి స్వేచ్చకీ ఎంత విలువనిచ్చేదీ ఈ కధల ద్వారా తెలియజేసినట్టయింది.
ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఈ వ్యక్తిగత కధనాలు నిజజీవితంలో ఏ ఒక వ్యక్తివీ కాకుండా అనేకమంది కధలు, కొంత కల్పన కలగలిసినవైతే ఫరవాలేదు. అలా కాని పక్షంలో ప్రైవసీ పరమైన ఇబ్బందులుంటాయి. ఇటీవల సాల్మన్ రిష్డీ ఇక్కడి యూనివర్సిటీలో midnight children గురించి మాట్లాడుతూ, అందులో తన దగ్గరి బంధువులనేకమంది పాత్రలుగా కనిపిస్తారు గానీ, ఒకరి తలను తీసి వేరొకరికి పెట్టటంతో ఏ ఒక్క పాత్ర ఏ ఒక వ్యక్తినీ పూర్తిగా పోలి ఉండకుండా జాగ్రత్త పడ్డానని చెప్పారు. శ్రీ నవీన్ అనేక ఇతర నవలల్లో కూడా, నిజజీవితంలో వ్యక్తులు, పేర్ల మార్పుతో పాత్రలుగా వచ్చిన సందర్భాలనేకం ఉంటాయి. ఉదాహరణకు “చెదిరిన స్వప్నాలు” నవలలో కాలేజీ రోజులనాటి వరవరరావు ఒక పాత్రగా కనిపించవచ్చు. ఐతే, అది సుదూర గతం కాబట్టి ఆయా వ్యక్తులు తమను పాత్రలుగా గుర్తుపట్టినా, నాస్టాల్జియాతో ఆ సంఘటనల్ని తలుచుకొని ఆనందించటమే తప్ప, పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు. కాని, సమీప గతంలోని వ్యక్తుల కధలు రాసేటప్పుడు కేవలం పేర్లు మార్చినంత మాత్రాన సరిపోదు – రష్డీ చెప్పినట్టు తలలు కూడా మార్చవలసి వస్తుంది. శ్రీ నవీన్ వంటి చెయ్యితిరిగిన రచయితకి ఈ సూక్ష్మం తెలియనిది కాదు.
ఇందులో వచ్చిన వ్యక్తులలో కొంతమంది పేర్లు మార్చటం, మరి కొంతమందివి యధాతధంగా ఉంచటంతో కొంత గందరగోళం ఏర్పడింది. తనకు నచ్చని వ్యక్తుల పేర్లు మార్చారేమోననే సందేహం కలుగుతుంది. బహుశ అందరి పేర్లూ మార్చి ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదేమో. ఈ భేదాలు ఆయా వ్యక్తుల నెరిగిన వారికి తెలుస్తాయి గాని, వారెవరూ తెలియని సామాన్య పాఠకులకి బహుశ ఏదైన ఒకటే కావచ్చు. ఐతే, అనువాద రచనలు మూల భాష తెలిసిన వారిని,అనువాద భాష మాత్రమే తెలిసిన వారిని సమానంగా రంజింపజెయ్యాలని ఎలా ఆశిస్తామో, అలాగే అనుభవాల గురించి రాసిన రచనలు కూడా ఆ అనుభవాల నెరిగిన వాళ్ళకి, ఎరగని వాళ్ళకి కూడా సంతృప్తి నియ్యాలని ఆశించటంలో తప్పులేదు.
శ్రీ నవీన్ ఈ పుస్తకంలో అమెరికా పర్యటన గురించి అనేక విషయాలు పొందు పరిచారు. ముప్ఫై రోజుల పర్యటనలో ఆయన ఇంత నోట్సు ఎప్పూడు రాసుకున్నరో అని నాకు ఆశ్చర్యం కలిగిన మాట నిజం. ఆయా పర్యాటక ప్రదేశాల గురించి ఇచ్చిన సమాచారం సమగ్రంగానే అనిపించింది. కానీ, విమానంలో అప్పుడే పరిచయమైన అమెరికన్ యువతీ, ముస్లిం యువకుడూ ప్రేమలో పడిపోవటం వంటి సంఘటనలు అసహజంగా తోస్తాయి. ఒకటి రెండు సాంకేతిక పొరపాట్లు దొర్లాయి – కాలిఫోర్నియాకు అట్లాంటాకు మధ్య కాలవ్యత్యాసం మూడుగంటలే అయినా, నాలుగు గంటలని పేర్కొనటం వంటివి. ఈ పుస్తకం కవర్ డిజైన్ పై మరికొంత శ్రద్ధ తీసుకోవలసింది. దీనిపై ముద్రించిన ఒక చిత్రం అమెరికాకు సంబంధించినది కాదనుకుంటాను.
శ్రీ నవీన్ ప్రయోగాత్మకంగా రాసిన ఈ యాత్రా నవల పాఠకులందరిచేతా తప్పక చదివిస్తుందనటంలో సందేహంలేదు. ఐతే, ఈ రచనను ప్రారంభించటానికి, పూర్తి చెయ్యటానికి ఆయన మరి కొంత సమయం తీసుకొని ఉంటే, మరింత మెరుగ్గా రూపొంది ఉండేదని నా అభిప్రాయం.