సెన్సిటివిటీ ట్రెయినింగ్

నా భార్య శాల్ వాల్-మార్ట్‌లో థాంక్స్‌గివింగ్/క్రిస్‌మస్ క్యాషియర్‌గా పనిచేస్తోంది. పోయిన వారం ఓ రోజు తనొచ్చే సరికి నేను టి.వి. లో యానిమల్ కింగ్‌డమ్ ఛానెల్ చూస్తున్నాను. లోపలికి రాగానే నా నుదుటిపై ముద్దు పెట్టుకుని అక్కడే నిలబడింది, సరిగ్గా అప్పుడే ఓ కంచరగాడిదని సింహం చంపే దృశ్యానికి అడ్డంగా. తను కూర్చోడానికి అనువుగా నా కాలు జరిపాను.

“జాబ్ ఎలా ఉంది? క్రెడిట్ కార్డు పిచ్చోళ్ళు ఈ ఏడాది చాలా మంది ఉన్నారా?”

శాల్ తల అడ్డంగా ఊపి, హుష్ అన్నట్లుగా నోటిమీద వేలేసుకుంది – నేనోదో చిన్న పిల్లాడినైనట్లు. “విను. నీకో విషయం చెప్పాలి. బహుశా నీకది నచ్చకపోవచ్చు. వచ్చే శనివారం నీ ఫ్రెండ్స్‌ని ఇంటికి పిలవకు. నాకు కుదరదు”

“ఎందుకట?”

” ఏంలేదు. మా ఆఫీసులో ‘సెన్సిటివిటీ ట్రైనింగ్’ అని మాకు ఒక ఉచిత సదస్సు నిర్వహిస్తున్నారని మా మానేజర్ కిమ్ ఎంప్లాయీస్ లౌంజ్‌లో నోటీసు పెట్టించాడు”

“కాని అక్కడ నువ్వేం చేస్తావు?”

“అదే నేనూ అడిగాను. ఆ సదస్సుకి హాజరవ్వాల్సిన వాళ్ళలో నేనూ ఒకదాన్నట! కాబట్టి వెళ్ళాలి”

శాల్‌కి వాల్‌మార్ట్‌లో ఉద్యోగం దొరకడం అదృష్టమే. నా ఉద్యోగం ఊడింది. నాకేమో ఏ పనీపాటు లేకుండా రోడ్డుమీద బలాదూరుగా తిరగడం లేదా మధ్యాహ్నం పూట టివిలో వచ్చే చెత్త కార్యక్రమాలు చూడడం ఇష్టం ఉండదు. కానీ ఏం చేయను? తప్పదు. నేను పని చేసే గ్రేడీస్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ దివాలా తీసింది. ఇది చాలదన్నట్లు నా బాస్ జో గ్రేడీ బాగా తాగేసి కారు నడుపుతూ అరెస్టయ్యాడు. వాళ్ళావిడేమో ఆయనని కష్టాల్లోంచీ రక్షించలేదు. కంపెనీ మూత పడింది. చలికాలంలో ఇళ్ళు కట్టే పనులు దొరకడం కష్టం. మేము దాచుకున్న డబ్బులతో నెట్టుకొస్తున్న ఈ రోజుల్లో శాల్‌కి వాల్-మార్ట్‌లో ఉద్యోగం దొరికింది. మార్చి ఒకటి నుంచి మళ్ళీ కొత్తగా కంపెనీ వ్యవహారాలు ప్రారంభిస్తానని జో గ్రేడీ నాకు జైలు నుంచి ఉత్తరం రాసాడు.

మామూలుగా ఐతే శాల్ ఇంటికి వచ్చిన ప్రతీ రాత్రీ తగ్గింపు ధరలు, కుర్ర దొంగలు, పోచుకోలు కబుర్లు చెప్పే తోటి క్యాషియర్లు లాంటి విషయాలే వినిపించేది. ఇప్పుడీ సదస్సు గురించి….

“బానే ఉంది ఇదంతా. భోంచేద్దామా?” అడిగాను. శాల్ పైకి లేచి సుతారంగా నా బొటనవేలుని తొక్కి వంటింట్లోకి నడిచింది. తను తెచ్చిన ‘డయట్ ఫ్రోజెన్‌ ఫుడ్’ ని వెచ్చపెట్టుకుని ఒక అరగంట పాటు మౌనంగా తిన్నాం. ఉన్నట్లుండి, “ఫ్రాంక్, నిజం చెప్పు. నేను ‘సెన్సిటివ్’నా కాదా” అని శాల్ అడిగింది.

“నువ్వు సెన్సిటివ్వే. కాదని ఎవడన్నాడు? నా రోజెలా గడిచిందని అడుగుతావు, అది సెన్సిటివ్వేగా. పైగా నువ్వు కిటికీలోంచి బయటకి చెత్త పారేయడం నేనెప్పుడూ చూడలేదు”

“అబ్బా, సెన్సిటివ్ అంటే అది కాదు. మనం ఇతర మతస్తుల తోటీ, వేరే జాతీయుల తోటీ మర్యాదగా ప్రవర్తిస్తున్నామా లేదా అని”

నేను ఒక నిమిషం పాటు ఆలోచించాను. మేమిద్దరం షికాగోకి దక్షిణంగా, అందరూ ఐరిష్-కాథలిక్కులే ఉన్న ప్రాంతంలో పెరిగాం. అప్పట్లో అక్కడ వేరే జాతీయులు, పరాయి మతస్తులు ఎవరూ లేరు. ఇప్పుడు ఇక్కడ రేమాండ్ అనే నల్లవాడు నాకు నేస్తం. పోతే గ్రేడీస్‌లో పనిచేసేడప్పుడు యువాంచిటో! వాళ్ళతో నేను సెన్సిటివ్‌గా ఉన్నానో లేనో నాకు తెలియదు. రేమాండ్ చెప్పే కుళ్ళు జోకులంటే నాకు ఇష్టం. ఇక యువాంచిటో అయితే నేను విపరీతంగా తాగేసినప్పుడల్లా నన్ను ఇంటికి మోసుకొచ్చేవాడు.

“పోన్లే, నీకంత అనుమానంగా ఉంటే ఆ మీటింగ్ కి వెళ్ళు. ఏమవుతుందట? ఇంకొంచెం సెన్సిటివ్ గా తయారవుతావు. అంతే కదా” అన్నాను.

కానీ ఆ సలహానే నా కొంప ముంచింది. ఆ సదసుకి ఓ వారం ముందు నుంచి మాకిద్దరికీ టెన్షన్ పెరిగింది. ఎవరికి వారమే సెన్సిటివ్ అని నిరూపించుకోవడానికి పోటీపడ్డట్లు ఆ వారమంతా ప్రవర్తించాం. తనెంత సున్నితమో శాల్ చెప్పాలని ప్రయత్నించేది. నేనూ తగ్గేవాణ్ణి కాదు. మాడిపోయిన నూడుల్స్‌ని నేను గిన్నెలో వదిలేయడం, కాఫీ కప్పులో సిగరెట్ పీకలు పడేయడం లాంటివి శాల్‌కి కోపం తెప్పించేవి. నేను వాటిని శుభ్రం చేసేసాను. “ఫ్రాంక్, నా సీటు పెద్దగా ఉందా? క్రిందటి వారం కంటే పెద్దగా కనిపిస్తోందా? పెద్దంటే ఎంత పెద్ద?” లాంటి ప్రశ్నలు శాల్ అస్సలు వేయలేదు. బహుశా మేము ఎదుటివాళ్ళకి ఏది మంచిదైతే దాన్నే చేయాలని అనుకున్నాం. ఖాళీగా కూర్చోలేదు.

ఆ వారం రోజులు ఆమె మౌనంగానే ఉంది. సెన్సిటివ్‌గా ఉంటున్నామని ఇద్దరం అనుకున్నాం. బహుశా మేమిద్దరం పరస్పరం మా ఇష్టాయిష్టాలను గౌరవించుకుంటున్నామేమో. శనివారం రానే వచ్చింది. శాల్ తన జీన్స్ ప్యాంట్ పైన లేత నీలం రంగు స్వెటర్ వేసుకుంది. దానిపైన వాల్-మార్ట్ యూనిఫాం వేసుకుంది. తన జుట్టుని, ముఖాన్ని అలంకరించుకోడానికి చాలా సమయం తీసుకుంది. తను బయటకు వచ్చేసరికి నేను మంచం మీద పడుకుని పేపరు చదువుకుంటున్నాను.

“అదరగొట్టేసావోయ్…” అన్నాను. ‘అందగత్తెని మరి’ అని అర్ధం వచ్చేలా ముఖం పెట్టింది శాల్. ఆ చేష్టని నేను ‘కులుకు’ అని అంటాను.

“నేను నా రూపురేఖల విషయంలోను సున్నితంగా ఉంటానని వాళ్ళకి తెలియజెప్పాలి. కనీసం దీంట్లోనైనా నేను ఎక్కువ మార్కులు సాధించాలి. మిగతా క్యాషియర్లని ఓడించాలి…” అంది శాల్.

“ఎంత అందంగా ఉన్నావో. ఆ కిమ్ గాడికి దగ్గరగా వెళ్ళకేం!” అంటూ హాస్యమాడి, “కాళ్ళు చేతులు వణుకుతున్నాయా? కంగారుగా ఉందా?” అని అడిగాను. శాల్ తలూపింది, “అయినా వెళ్ళాలి. కిమ్ చెప్పాడుగా – ఇది నేను తప్పనిసరిగా హాజరవ్వాల్సిన కార్యక్రమమని! అతడి మీద నాకు నమ్మకం ఉంది”

“అందరికంటే నువ్వే బెస్టు! బెంగపడకు!” అని తనకి ధైర్యం చెప్పి, “నువ్వు వచ్చేటప్పుడు తేనె పూసిన ప్రెట్సెల్స్ కొన్ని తెస్తావా? ఇంట్లో అయిపోయాయి” అన్నాను. సరేనంటూ కొంచెం వంగి నాకో చిన్న ముద్దిచ్చింది. నేను కూడా ఆమెని చిన్నగా ముద్దాడాను. తన జుట్టునుంచి మంచి వాసన వచ్చింది. శాల్ వెళ్ళిన తర్వాత రేమాండ్‌కి ఫోన్ చేసాను – ఆదివారం పొద్దున్న జుట్టు కత్తిరించుకోడానికి వస్తానని! ‘సుబ్బరంగా రా’ అని, ఓ ముతక జోకు చెప్పి ఫోన్ పెట్టేసాడు రేమాండ్. తర్వాత పిల్లలతో కలిసి బాస్కెట్‌బాల్ ఆట చూడ్డానికి వెళ్ళాను. మా బుల్స్ జట్టుకి, జాజ్ జట్టుకి మధ్య పోటీ అది. మేము వాళ్ళని చిత్తుగా ఓడించాం. నేను ఓ పెగ్గేసుకుని, మాంచి రొమాంటిక్ మూడ్‌లో ఇంటికి వెళ్ళాను. కాని ఇంటి తలుపు తట్టాక, నాకు ఆ పూట ‘పస్తు’ తప్పదని అర్ధమైంది. శాల్ వట్టి కాళ్ళతో వచ్చి తలుపు తీసింది. నేనామెని చిన్నగా ముద్దు పెట్టుకుని ‘డంక్ షాట్’ గురించి చెబుదామనుకునేలోపు, కాస్త నోరు మూస్తావా అన్నట్లు సైగ చేసి, సోఫాలో కూచోమని చేయి చూపించింది. నాకేదో మూడిందని తెలిసింది కానీ ఏం మూడిందో అర్ధం కాలేదు.