నా భార్య శాల్ వాల్-మార్ట్‌లో థాంక్స్‌గివింగ్/క్రిస్‌మస్ క్యాషియర్‌గా పనిచేస్తోంది. పోయిన వారం ఓ రోజు తనొచ్చే సరికి నేను టి.వి. లో యానిమల్ కింగ్‌డమ్ ఛానెల్ చూస్తున్నాను. లోపలికి రాగానే నా నుదుటిపై ముద్దు పెట్టుకుని అక్కడే నిలబడింది, సరిగ్గా అప్పుడే ఓ కంచరగాడిదని సింహం చంపే దృశ్యానికి అడ్డంగా. తను కూర్చోడానికి అనువుగా నా కాలు జరిపాను.
“జాబ్ ఎలా ఉంది? క్రెడిట్ కార్డు పిచ్చోళ్ళు ఈ ఏడాది చాలా మంది ఉన్నారా?”
శాల్ తల అడ్డంగా ఊపి, హుష్ అన్నట్లుగా నోటిమీద వేలేసుకుంది – నేనోదో చిన్న పిల్లాడినైనట్లు. “విను. నీకో విషయం చెప్పాలి. బహుశా నీకది నచ్చకపోవచ్చు. వచ్చే శనివారం నీ ఫ్రెండ్స్‌ని ఇంటికి పిలవకు. నాకు కుదరదు”
“ఎందుకట?”
” ఏంలేదు. మా ఆఫీసులో ‘సెన్సిటివిటీ ట్రైనింగ్’ అని మాకు ఒక ఉచిత సదస్సు నిర్వహిస్తున్నారని మా మానేజర్ కిమ్ ఎంప్లాయీస్ లౌంజ్‌లో నోటీసు పెట్టించాడు”
“కాని అక్కడ నువ్వేం చేస్తావు?”
“అదే నేనూ అడిగాను. ఆ సదస్సుకి హాజరవ్వాల్సిన వాళ్ళలో నేనూ ఒకదాన్నట! కాబట్టి వెళ్ళాలి”
శాల్‌కి వాల్‌మార్ట్‌లో ఉద్యోగం దొరకడం అదృష్టమే. నా ఉద్యోగం ఊడింది. నాకేమో ఏ పనీపాటు లేకుండా రోడ్డుమీద బలాదూరుగా తిరగడం లేదా మధ్యాహ్నం పూట టివిలో వచ్చే చెత్త కార్యక్రమాలు చూడడం ఇష్టం ఉండదు. కానీ ఏం చేయను? తప్పదు. నేను పని చేసే గ్రేడీస్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ దివాలా తీసింది. ఇది చాలదన్నట్లు నా బాస్ జో గ్రేడీ బాగా తాగేసి కారు నడుపుతూ అరెస్టయ్యాడు. వాళ్ళావిడేమో ఆయనని కష్టాల్లోంచీ రక్షించలేదు. కంపెనీ మూత పడింది. చలికాలంలో ఇళ్ళు కట్టే పనులు దొరకడం కష్టం. మేము దాచుకున్న డబ్బులతో నెట్టుకొస్తున్న ఈ రోజుల్లో శాల్‌కి వాల్-మార్ట్‌లో ఉద్యోగం దొరికింది. మార్చి ఒకటి నుంచి మళ్ళీ కొత్తగా కంపెనీ వ్యవహారాలు ప్రారంభిస్తానని జో గ్రేడీ నాకు జైలు నుంచి ఉత్తరం రాసాడు.
మామూలుగా ఐతే శాల్ ఇంటికి వచ్చిన ప్రతీ రాత్రీ తగ్గింపు ధరలు, కుర్ర దొంగలు, పోచుకోలు కబుర్లు చెప్పే తోటి క్యాషియర్లు లాంటి విషయాలే వినిపించేది. ఇప్పుడీ సదస్సు గురించి….
“బానే ఉంది ఇదంతా. భోంచేద్దామా?” అడిగాను. శాల్ పైకి లేచి సుతారంగా నా బొటనవేలుని తొక్కి వంటింట్లోకి నడిచింది. తను తెచ్చిన ‘డయట్ ఫ్రోజెన్ ఫుడ్’ ని వెచ్చపెట్టుకుని ఒక అరగంట పాటు మౌనంగా తిన్నాం. ఉన్నట్లుండి, “ఫ్రాంక్, నిజం చెప్పు. నేను ‘సెన్సిటివ్’నా కాదా” అని శాల్ అడిగింది.
“నువ్వు సెన్సిటివ్వే. కాదని ఎవడన్నాడు? నా రోజెలా గడిచిందని అడుగుతావు, అది సెన్సిటివ్వేగా. పైగా నువ్వు కిటికీలోంచి బయటకి చెత్త పారేయడం నేనెప్పుడూ చూడలేదు”
“అబ్బా, సెన్సిటివ్ అంటే అది కాదు. మనం ఇతర మతస్తుల తోటీ, వేరే జాతీయుల తోటీ మర్యాదగా ప్రవర్తిస్తున్నామా లేదా అని”
నేను ఒక నిమిషం పాటు ఆలోచించాను. మేమిద్దరం షికాగోకి దక్షిణంగా, అందరూ ఐరిష్-కాథలిక్కులే ఉన్న ప్రాంతంలో పెరిగాం. అప్పట్లో అక్కడ వేరే జాతీయులు, పరాయి మతస్తులు ఎవరూ లేరు. ఇప్పుడు ఇక్కడ రేమాండ్ అనే నల్లవాడు నాకు నేస్తం. పోతే గ్రేడీస్‌లో పనిచేసేడప్పుడు యువాంచిటో! వాళ్ళతో నేను సెన్సిటివ్‌గా ఉన్నానో లేనో నాకు తెలియదు. రేమాండ్ చెప్పే కుళ్ళు జోకులంటే నాకు ఇష్టం. ఇక యువాంచిటో అయితే నేను విపరీతంగా తాగేసినప్పుడల్లా నన్ను ఇంటికి మోసుకొచ్చేవాడు.
“పోన్లే, నీకంత అనుమానంగా ఉంటే ఆ మీటింగ్ కి వెళ్ళు. ఏమవుతుందట? ఇంకొంచెం సెన్సిటివ్ గా తయారవుతావు. అంతే కదా” అన్నాను.
కానీ ఆ సలహానే నా కొంప ముంచింది. ఆ సదసుకి ఓ వారం ముందు నుంచి మాకిద్దరికీ టెన్షన్ పెరిగింది. ఎవరికి వారమే సెన్సిటివ్ అని నిరూపించుకోవడానికి పోటీపడ్డట్లు ఆ వారమంతా ప్రవర్తించాం. తనెంత సున్నితమో శాల్ చెప్పాలని ప్రయత్నించేది. నేనూ తగ్గేవాణ్ణి కాదు. మాడిపోయిన నూడుల్స్‌ని నేను గిన్నెలో వదిలేయడం, కాఫీ కప్పులో సిగరెట్ పీకలు పడేయడం లాంటివి శాల్‌కి కోపం తెప్పించేవి. నేను వాటిని శుభ్రం చేసేసాను. “ఫ్రాంక్, నా సీటు పెద్దగా ఉందా? క్రిందటి వారం కంటే పెద్దగా కనిపిస్తోందా? పెద్దంటే ఎంత పెద్ద?” లాంటి ప్రశ్నలు శాల్ అస్సలు వేయలేదు. బహుశా మేము ఎదుటివాళ్ళకి ఏది మంచిదైతే దాన్నే చేయాలని అనుకున్నాం. ఖాళీగా కూర్చోలేదు.
ఆ వారం రోజులు ఆమె మౌనంగానే ఉంది. సెన్సిటివ్‌గా ఉంటున్నామని ఇద్దరం అనుకున్నాం. బహుశా మేమిద్దరం పరస్పరం మా ఇష్టాయిష్టాలను గౌరవించుకుంటున్నామేమో. శనివారం రానే వచ్చింది. శాల్ తన జీన్స్ ప్యాంట్ పైన లేత నీలం రంగు స్వెటర్ వేసుకుంది. దానిపైన వాల్-మార్ట్ యూనిఫాం వేసుకుంది. తన జుట్టుని, ముఖాన్ని అలంకరించుకోడానికి చాలా సమయం తీసుకుంది. తను బయటకు వచ్చేసరికి నేను మంచం మీద పడుకుని పేపరు చదువుకుంటున్నాను.
“అదరగొట్టేసావోయ్…” అన్నాను. ‘అందగత్తెని మరి’ అని అర్ధం వచ్చేలా ముఖం పెట్టింది శాల్. ఆ చేష్టని నేను ‘కులుకు’ అని అంటాను.
“నేను నా రూపురేఖల విషయంలోను సున్నితంగా ఉంటానని వాళ్ళకి తెలియజెప్పాలి. కనీసం దీంట్లోనైనా నేను ఎక్కువ మార్కులు సాధించాలి. మిగతా క్యాషియర్లని ఓడించాలి…” అంది శాల్.
“ఎంత అందంగా ఉన్నావో. ఆ కిమ్ గాడికి దగ్గరగా వెళ్ళకేం!” అంటూ హాస్యమాడి, “కాళ్ళు చేతులు వణుకుతున్నాయా? కంగారుగా ఉందా?” అని అడిగాను. శాల్ తలూపింది, “అయినా వెళ్ళాలి. కిమ్ చెప్పాడుగా – ఇది నేను తప్పనిసరిగా హాజరవ్వాల్సిన కార్యక్రమమని! అతడి మీద నాకు నమ్మకం ఉంది”
“అందరికంటే నువ్వే బెస్టు! బెంగపడకు!” అని తనకి ధైర్యం చెప్పి, “నువ్వు వచ్చేటప్పుడు తేనె పూసిన ప్రెట్సెల్స్ కొన్ని తెస్తావా? ఇంట్లో అయిపోయాయి” అన్నాను. సరేనంటూ కొంచెం వంగి నాకో చిన్న ముద్దిచ్చింది. నేను కూడా ఆమెని చిన్నగా ముద్దాడాను. తన జుట్టునుంచి మంచి వాసన వచ్చింది. శాల్ వెళ్ళిన తర్వాత రేమాండ్‌కి ఫోన్ చేసాను – ఆదివారం పొద్దున్న జుట్టు కత్తిరించుకోడానికి వస్తానని! ‘సుబ్బరంగా రా’ అని, ఓ ముతక జోకు చెప్పి ఫోన్ పెట్టేసాడు రేమాండ్. తర్వాత పిల్లలతో కలిసి బాస్కెట్‌బాల్ ఆట చూడ్డానికి వెళ్ళాను. మా బుల్స్ జట్టుకి, జాజ్ జట్టుకి మధ్య పోటీ అది. మేము వాళ్ళని చిత్తుగా ఓడించాం. నేను ఓ పెగ్గేసుకుని, మాంచి రొమాంటిక్ మూడ్‌లో ఇంటికి వెళ్ళాను. కాని ఇంటి తలుపు తట్టాక, నాకు ఆ పూట ‘పస్తు’ తప్పదని అర్ధమైంది. శాల్ వట్టి కాళ్ళతో వచ్చి తలుపు తీసింది. నేనామెని చిన్నగా ముద్దు పెట్టుకుని ‘డంక్ షాట్’ గురించి చెబుదామనుకునేలోపు, కాస్త నోరు మూస్తావా అన్నట్లు సైగ చేసి, సోఫాలో కూచోమని చేయి చూపించింది. నాకేదో మూడిందని తెలిసింది కానీ ఏం మూడిందో అర్ధం కాలేదు.
“ఈ రోజు సెమినార్‌కి వెళ్ళొచ్చాను ఫ్రాంక్! విను. మనం మారాలి. మనకి దురభిమానం ఎక్కువ. నిజం! ఫ్రాంక్ జేమ్స్ లీరీ, విను. మనది జాత్యహంకారం. నిస్సందేహంగా..” అంది శాల్.
“ఆగు శాల్. ఏమైంది? ఎందుకా ఆవేశం? ప్రశాంతంగా ఉండు” అంటూ అనునయించాను. మా ఆవిడ సంగతి నాకు బాగా తెలుసు. తనకి కోపం ఎక్కువ. ఎవరి మీదైనా తొందరగా విరుచుకు పడుతుంది. ఎవరో ఒకరు దృష్టి మళ్ళించకపోతే శాల్‌ని ఆపడం కష్టం. శాల్ గట్టిగా ఊపిరి తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది. నేనూ ఆమె వెనకే నడిచాను. ఫ్రిజ్‌లోని బాటిల్ నించి మంచినీళ్ళు ఒక గ్లాసులో వొంపుకుంది.
“ఇందుకే. ఇందుకేనట, నన్ను ఆ సెమినార్‌కి హాజరవమని కిమ్ చెప్పింది. పోన్లే, ఏదో ఒక దాంట్లో నేను తగినదాన్ననిపించుకున్నాను. కనీసం కోపంలోనైనా! నేను సెన్సిటివ్‌ని…” అంటూ ఓ క్షణం పాటు ఆగింది శాల్. కొన్ని నీళ్ళు తాగింది. శాల్ తన ముక్కుని రుద్దుకోడం, కనురెప్పలు వాల్చేయడం చూసి, తను చాలా కృంగిపోయి వుందని అర్ధమైంది. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. ఆమెని దగ్గరలోని ఓ కుర్చీలో కూర్చోబెట్టి, నేనూ పక్కనే ఇంకో కుర్చీలో కూర్చున్నాను.
“నువ్వు సున్నితమైన దానివే, డియర్, నిజం” అన్నాను.
“కాదు. కానే కాదు. మనం ఎప్పుడూ సున్నితంగా లేము. ఎందుకో తెలుసా ఫ్రాంక్? ‘సెన్సిటివ్’ అంటే మనం మాట్లాడుకునే ఈ అర్ధం కాదు. సెన్సిటివ్ అంటే వేరే పదాలు ఉపయోగించి మాట్లాడడం. మనం ఇంతకు ముందు వాటిని వినలేదు. విన్నా, ఉపయోగించలేదు. మనం మూగవాళ్ళం. మూర్ఖులం…”
ఇలా ‘మనం మనం’ అంటూ నన్ను కలిపేసుకోడం నాకేం నచ్చలేదు. మొదట్లోనే ఖండించుండాల్సింది. కానీ ఈ సారికి ఊరుకున్నాను. బహుశా ‘మందు’ మహిమో లేదా శాల్ అంటే జాలి వల్లో…
“నా కౌంటర్ నుంచి మూడో కౌంటర్‌లో ఉంటుందే, ఆ అమ్మాయి… జేన్, జ్ఞాపకం ఉందా?” అడిగింది శాల్. తలూపాను. ఆమె వాగుడుకాయని, ఆమె కౌంటర్ క్యూలో నిలుచునే వాళ్ళు ఆమె వాగ్ధాటికి తట్టుకోలేకపోయారని నేను విన్నాను. తన పెంపుడు ఫెర్రెట్ ఎర్ల్ గురించి, దాని రోజువారీ జీవితం గురించి జేన్ తెగ మాట్లాడుతుంది. ఆమె చేతిలోని చిప్స్‌ని ఎర్ల్ తినేసాడట… ఎర్ల్‌కి ఓప్రా నచ్చదుట… ఎర్ల్ తన బోనులో కాక టాయిలెట్ సీట్ మీద నిద్రపోయాడట… ఇలా ఎన్నెన్నో. విసుగెత్తిన కస్టమర్లు జేన్ పై ఫిర్యాదు చేసి, శాల్ కౌంటర్‌కి మారిపోతున్నారు. దాంతో శాల్‌కి పనెక్కువై చిర్రెత్తుతోంది. ఎర్ల్‌కి టోపీ పెడితే మరింత అందంగా ఉంటాడని జేన్ మాట్లాడుతూనే ఉంది, ఆ ఉపన్యాసం అయ్యే లోపున శాల్ దాదాపు పదిహేను మంది కస్టమర్లని పంపేసింది.
“ఆమె వాగుడిని భరించాలంటే ఆ ఫెర్రెట్ కే సాధ్యమని నేను జేన్‌తో అన్నాను. ఇలా మాట్లాడడం జేన్‌ని అవమానించడమే అని కిమ్ అంటాడు. కానీ నా ఉద్దేశ్యమది కాదు” అని చెబుతూ, “ఇదిగో, ఈ ప్రశ్నావళి చూడు” అంటూ ఓ కాగితాన్ని బయటకి తీసింది. మళ్ళీ తనే మాట్లాడుతూ, “జేన్ వాగుడుకాయని నేను అన్నాను. కాని అది తప్పుట. అలా అనడం మర్యాద కాదట. తను ‘ఆడిబ్లీ ఛాలెంజడ్’ అట!”
“అంటే ఆమె పనికిరాని దద్దమ్మ అనా అర్ధం?”
“ఓహ్, దేవుడా! నేను అలా అన్నానా? విను ఫ్రాంక్, ఎక్కువగా మాట్లాడేవాళ్ళని ‘ఆడిబ్లీ ఛాలెంజడ్’ అనాలి” పాపం శాల్! ఓ చిన్న ఉద్యోగంలో ఎన్ని కొత్త పదాలను నేర్చుకోవాల్సి వస్తోంది. ఆమెకి కాస్త ధైర్యం చెబుదామనుకున్నాను.
“పోన్లే, నువ్వు ఆడిబ్లీ ఛాలెంజడ్ కాదు కదా” అని అన్నాను. పైగా అటువంటి పదాలను నేర్చేసుకోడం ఓ గంట పని అని చెప్పాను. ‘నిజమా’ అన్నట్లు చూసి శాల్ నవ్వేసి వంటింట్లోంచి బెడ్ రూంలోకి నడిచింది. నేనక్కడే కూర్చుని ఆ ప్రశ్నావళిని చదివాను. కొన్ని బాగానే ఉన్నాయి. వాటిల్లో కొన్నింటిని రేమాండ్ మీద ప్రయోగించాలనుకున్నాను. ఇంకొన్ని పదాలైతే నాకు నవ్వు తెప్పించాయి. దాని ప్రకారం నేనేమో ‘విజువల్లీ ఛాలెంజడ్’ అట, ఉండాల్సిన దానికన్నా నలభై పౌండ్లు బరువెక్కువున్న శాల్ ఏమో ‘ఫిజికల్లీ ఛాలెంజడ్’ అట (నేనేమో తనని ‘ఆఫ్’ స్విచ్ లేని మానవ వాక్యూమ్ క్లీనరని అంటాను). అయినా సరే, కాస్త ఎక్కువ సేపు మేల్కొని ‘మీరు అవగాహనాపరులేనా’ అనే ఆ ప్రశ్నావళిని పూర్తి చేసాను. నాకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి. తర్వాత లేచి బెడ్‌రూం లోకి వెళ్ళాను. నాకు శాల్ వీపు కనిపిస్తోంది. ఆమె కదలికలని బట్టి ఆమె ఏడుస్తోందని గ్రహించాను. ఆమె భుజంపై చెయ్యి వేసాను. తను ప్రతిస్పందించలేదు.
“ఫ్రాంక్, ఇక పడుకో!రేపు పొద్దున్నే మళ్ళీ నా దేబ్యం మొహాన్నే చూడాలి” అని అంది. నేనామెకి చిన్న ముద్దిచ్చి, ‘లవ్ యు’ అని చెప్పి పడుకున్నాను. మర్నాడు నేను లేచేసరికి, శాల్ పక్కమీద లేదు. లేచి వంటింట్లోకి వెళ్ళాను. శాల్ కాఫీ తాగుతూ, ప్రశ్నావళిలో తనకొచ్చిన మార్కులను సరిజూసుకుంటోంది.
నన్ను చూడగానే, “ఏం లేదు. వాళ్ళు అన్ని ప్రశ్నలకి మార్కులు వేసారో లేదో అని చూసుకుంటున్నాను. కిమ్ నా జవాబులని చాలా తొందరగా చదివేసాడు. ఏ జవాబుకైనా మార్కులు వేయడం మర్చిపోయాడేమో? నీకు తెలుసా, నేను హైస్కూల్లో ఉన్నప్పుడు ‘మిస్ పొలైట్’ పోటీలో గెలిచాను. అది ఇక్కడ కూడ పనికొస్తుంది కదా…” అంది.
“వదిలేద్దూ. ఆ సంగతి ఎప్పుడో చాలా కాలం క్రితంది కదా, ఇదేమో ఓ పిచ్చి ప్రశ్నావళి. అయినా నువ్వేమిటో, ఎవ్వరో ఓ కాగితం చెప్పడమేమిటి”
“ఓరి దేవుడా! నీకర్ధం కాదా? ఇది 2000 సంవత్సరం! నువ్వు ఈ భాష, ఈ కొత్త పదాలు వాడాలి. ఇదిప్పుడు అత్యవసరం. మా ఉద్యోగంలో భాగం” అని నాకేసి చూసింది. మళ్ళీ తనే మాట్లాడుతూ, “నువ్వు నా అభిప్రాయాల్ని గౌరవించడం లేదు. వంకరగా మాట్లాడేటట్టైతే, నా చుట్టుపక్కల ఉండద్దు” అని అంది.
“సరే. నేను చేస్తున్నవన్నీ ఆపేస్తాను. కానీ నువ్వేమంటున్నావో నాకర్ధం కావడం లేదు”
“అబ్బా విసిగించకు. వెళ్ళి క్షవరం చేయించుకో”
“సున్నితమైన మనసుగల శాల్, సరే వెడతాను” అని తనకి వినబడేలా అరిచాను. నేను బయటకి వస్తుంటే, ఓ ప్లాస్టిక్ సాసర్‌ని నాపై విసిరింది.
నేను వెళ్ళేసరికి రేమాండ్ ఖాళీగానే ఉన్నాడు. సెలూన్‌లో రేమాండ్, అతని మనవడు తప్ప వేరే ఎవరూ లేరు.
“కాఫీ ఉందటోయ్?” అంటూ నేను హాస్యమాడాను. అది నా పలకరింపు. దాదాపు పదిహేనుళ్ళుగా రేమాండ్‌ని కలిసినప్పుడల్లా నేననే మాటలే అవి.
“ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఖర్చవుతుంది” అంటూ రేమాండ్ కూడా హాస్యమాడాడు. “ఏదో దిగులుగా కనిపిస్తున్నావు?” అని అడిగాడు.
“ఏంలేదు. కటింగ్‌తో పాటు గడ్డం కూడ చేయించుకోనా?”
“నీకెలా కావాలంటే అలాగే ఫ్రాంకీ”
నన్ను ఫ్రాంకీ అని పిలిచే స్నేహితుడు రేమాండ్ ఒక్కడే. ఎప్పుడో ఓ జోక్ చెబుతున్నప్పుడు పిలిచాడలా. అంతే అదే పేరు స్థిరపడిపోయింది. నా కోటుని విప్పి పక్కన బెట్టాడు. శూన్యంలోకి చూస్తూ తన ప్రశ్నలకి జవాబులు వెదుక్కుంటున్న మనవడిని చిన్నగా కసిరి గది ఊడవమని చెప్పాడు. ఆ అబ్బాయి ఇబ్బందిగా లేచి, తన కోపాన్ని ప్రదర్శిస్తూ, నేలని గట్టిగా తాటించి లోపలికి వెళ్ళాడు.
“ఈ రోజుల్లో నల్ల పిల్లలకి వాళ్ళ తాతల్ని ఎలా గౌరవించాలో తెలియడం లేదు” అన్నాడు రేమాండ్.
“రే, అంటే నీ ఉద్దేశ్యం ఆఫ్రికన్-అమెరికన్‌లకా?” అడిగాను.
రేమాండ్ నవ్వాడు. కాని అంతలోనే అతడి ముఖం వివర్ణమైంది. కోపం ఛాయలు కనిపించాయి. మా ఇన్నాళ్ళ స్నేహంలో అతడిని ఇంత కోపంగా మునుపెన్నడు చూడలేదు. కొన్ని క్షణాల తర్వాత, “అవును. నేను ఆఫ్రికన్-అమెరికన్‌ని కదూ. కాని నా గురించి చెప్పాలంటే నల్లవాడినని, నీ గురించి చెప్పాలంటే తెల్లవాడివని, వీధి చివర్లో ఉండే గోమెజ్ కుటుంబాన్ని గోధుమ రంగు వాళ్ళని అంటాను. అందరూ మామూలు అమెరికన్లే. అయితే నేను మాత్రం ఆఫ్రికన్-అమెరికన్‌ని….!” అన్నాడు రేమాండ్.
“నాకు కూడా ఈ మధ్యే తెలిసింది. శాల్ వాళ్ళ ఆఫీసులో ఏదో ‘సెన్సిటివిటీ ట్రైనింగ్’ కని వెళ్ళొచ్చిన తర్వాత నాకు తెలిసింది. నీకు తెలుసా? నాకు బట్టతల! కానీ అలా అనకూడదట. హెయిర్ ఛాలెంజడ్ అనాలట” అంటూ నవ్వాను. కాసేపు ఈ విషయంపైనే మాట్లాడుకున్నాం.
రేమాండ్ నా జుట్టు కత్తిరించడం మొదలు పెట్టాడు.కానీ ముభావంగా మారిపోయాడు. అక్కడంతా నిశ్శబ్దం రాజ్యమేలింది. ఇది చాలా అసాధారణం! రేమాండ్‌తో ఉన్నప్పుడు ఇంత మౌనం మునుపెప్పుడు నాకు అనుభవమవలేదు. చాలా వింతగా ఉంది. ఇకపై మా మధ్య ఈ ప్రస్తావన తేను. అతడు నన్ను ఇష్టపడింది తెల్లవాడిననో, లేదా బట్టతల వాడిననో కాదు. పాత ఖాతాదారునని, టిప్ బాగా ఇస్తానని. అతడితో సమయం గడపడం నాకిష్టంగా ఉండేది. నేనన్న మాటలని రేమాండ్ అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడని వెనుక అద్దం లోంచి కనబడుతున్న అతడి నొసలు చెబుతున్నాయి. తర్వాత ఓ బ్రష్‌తో నా మెడ పై ఉన్న కొన్ని వెంట్రుకలను శుభ్రం చేసాడు. మా కళ్ళు కలుసుకున్నా, వెంటనే చూపులు తిప్పుకున్నాం. సున్నితమైన అంశాలలో తల దూర్చడం ఎంత వేగంగా నష్టం కలగజేస్తుందో నాకర్ధమైంది. స్నేహితుడొక్కసారిగా అపరిచితుడైనట్లనిపించింది.
నాకు గడ్డం చేయడం పూర్తయ్యింది. నేను కుర్చీ లోంచి లేచాను. రేమాండ్‌కి డబ్బు అందించాను. దాన్ని జేబులో వేసుకుని తన మనవడిని పిలిచాడు. నేను బైటికి వస్తూ ఆ కొట్టుని, వాళ్ళిద్దరిని కొనచూపుతో చూసాను. ఓ మంచి ‘ఆఫ్రికన్-అమెరికన్’ మనవడిలా ప్రవర్తించమని తన మనవడికి చెబుతూ, తను తినడానికి కొన్ని డోనట్లు తెమ్మంటున్నాడు రేమాండ్. నాకు కొంచెం బాధేసింది.
కిమ్ చేసిన ప్రయోగం తోటి మనుషులమైన నన్ను, రేమాండ్‌ని, శాల్‌ని, జేన్‌ని గిరిగీసిన వేరువేరు పరిధుల్లోని అసంబంధమైన వస్తువుల్లా మార్చేసింది.
(ఆంగ్లంలో Jen Cullerton Jhonson “Sensitivity Training Down at the Walmart” అనే పేరుతో రాసిన మూల కథని ఇక్కడ చదవచ్చు)