ఇది విశ్వనాథ రాసిన మొదటి నాటకం (1924). చాలా చక్కటి రచన! కీచకవధ కథని నాటక వస్తువుగా తీసుకుని చాలా గొప్పగా నిర్వహించారు విశ్వనాథ. నాలుగుసార్లు (ఇంకా ఎక్కువ?) ముద్రణలు పొందింది. రెండవ, మూడవ ముద్రణలను ఆర్కయివ్.ఆర్గ్ సైట్లో చూడవచ్చు. ఈ నాటక రచనలో విశ్వనాథ చూపించిన ప్రతిభ గురించి చాలా వివరంగా విశ్లేషణలు వచ్చాయి కాబట్టి నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. ఈ నాటకాన్ని ఎవరయినా స్టేజీ మీద ప్రదర్శించారా? ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వచ్చింది? అన్న విషయాల గురించి ఎవరికయినా తెలిస్తే చెప్పగలరు.
ఈ నాటకాన్ని రేడియోలో ప్రసారం కోసమై ఉషశ్రీ (పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు) కొంత కుదించారు. శంకరమంచి సత్యం పర్యవేక్షణంలో ఇది 1971-72 ప్రాంతంలో మొదటిసారి విజయవాడ కేంద్రంనుండి ప్రసారమయ్యింది. కందుకూరి చిరంజీవిరావు, సి. రామమోహనరావు, నండూరి సుబ్బారావు, శ్రీరంగం గోపాలరత్నం మొదలయిన గొప్ప కళాకారులు పాల్గొన్న నాటకమిది. పూర్తి వివరాలు కార్యక్రమం ప్రారంభంలో వచ్చే అనౌన్స్మెంటులో వినవచ్చు.