సప్తపది

 
 
 
 
 

నాటినుండి నేటివరకు

 ను
  స
   రి
    స్తూ
     నే
వున్నా
నిన్ను

నువ్వు చేయమన్నదల్లా
చేస్తూనే వున్నా
నువ్వు చూపిందల్లా
చూస్తూనే వున్నా
నువ్వు చెప్పిందల్లా
వింటూనే వున్నా

నీవెంట అడివికి వెళ్ళా
నువ్వు నిప్పులో దూకమంటే దూకా
అడివిలో అనాథగా
పిల్లలను ఒక్కదాన్నే పెంచా
నా జీవితం నిజంగా
అడవి గాచిన వెన్నెలే

చీకటిలో చేసిన తప్పును
చిటికలో మరచిపోయి
నిండు సభలో
అనుమానించి
అవమానించి
అడివికి పంపించావు

నన్నే పణముగా పెట్టి
వోడిపోయినప్పుడు
నిండుసభలో నిరంకుశుడు
ఏకవస్త్రను
నిర్వస్త్రను చేయగా
ఆడవాళ్ళలా కిమ్మనకుండా కూర్చున్నా
మిమ్ములను అనుసరించా
అడివికి వెళ్ళా

నిర్వీర్యుడవైనా
నిష్ప్రయోజకుడవైనా
నిరారోగ్యుడవైనా
నిన్ను బుట్టలో ఎత్తుకొని ఊరేగా
 
 

నువ్వు దేవుడన్నారు
కాని
నువ్వు హటాత్తుగా పోయాక
నీ దేహముతో చితినెక్కి
నేను కూడా బూడిదయ్యా

బొమ్మలపెళ్ళి ఆడే వయస్సులో
బోడితలతో జీవితాంతము
ఉపవాసాలు, వ్రతాలు చేయించినా
మాట్లాడకుండా భరించా
 

పుట్టింటినుండి తేలేదని
మీ అమ్మకు కోపం వచ్చి
వంటింటిలో
వంటికి నిప్పు పెట్టి
కిరసినాయిల్ స్టవ్వు పైన వంక పెడితే
రాయిలా ఊరుకున్నావు

ఆదర్శపత్నికుండవలసిన
ఆరు లక్షణాలలో
నీకు నచ్చినవి రెండే
దేవదాసిలా నిన్ను తృప్తిపరచడం
దాసిలా ఇంట్లో వెట్టిచాకిరి చెయ్యడం
వాటినే తుచ తప్పకుండా
ఇన్నాళ్ళూ పాటించా

నాటినుండి నేటివరకు

 ను
  స
   రి
    స్తూ
     నే
వున్నా

నిన్ను
నువ్వు చేయమన్నదల్లా
చేస్తూనే వున్నా
నువ్వు చూపిందల్లా
చూస్తూనే వున్నా
నువ్వు చెప్పిందల్లా
వింటూనే వున్నా

ప్రేమతో ప్రీతితో
ఆశతో ఆసక్తితో
శుభోదయాన్ని
సుఖోదయాన్ని
నిరీక్షిస్తున్నా

కాని
వెలుగు లేని
వెన్నెల లేని
సుదీర్ఘమైన
రాత్రి అయింది
ఈ నా జీవితం

నా మెడలో వేలాడేది
ఉరితాడో పసుపుతాడో
సర్పమో రజ్జువో
ఈ మూడు ముళ్ళు
నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి
శ్వాస పీల్చుకోవడం కూడా కష్టమే
ఈ బ్రహ్మముడిని విప్పుతాను
విప్పి తీరుతాను

అవునో కాదో
ఇదా అదా
చేద్దామా వద్దా
ఉండాలా వెళ్ళాలా
చివరకు
జీవించడానికే నిర్ణయించాను
ఉంటాను
ఉండి వెళ్తాను

ఏడడుగులు కాదు
మూడడుగులు కాదు
ఒక్కడుగు కూడా పెట్టను
నీతో
ఇకమీద