నా జ్ఞాపకం

ఆ సాయంత్రం
యవ్వనమింకా
శీతాకాలపు ప్రొద్దుటి
పదిగంటల ఎండలా
మెరిసిపోతున్న వేళ

నడిచి వెళ్తున్న మట్టిరోడ్డు
ఎక్కడో అలసి ఆగి కాకి
అరిచిన వెర్రి అరుపు
పాత సామానులు కొనే
నల్ల తాత గావుకేక
పరిగెత్తే రైలు కూత
చీర ఆరవేస్తూ ఆగిపోయిన
రంగి చూపు

నీకు పూలతోటలా
పరుగులెత్తే జలపాతపు
నీటి అలజడిలా
తేనెటీగల రొదలా
మెత్తటి తివాచీపై
పడుకొని రూపాలు మార్చే
మేఘంలా
రంగులు మార్చే ఆకాశంలా ఉందంటే
నా ప్రేమ మత్తుగాక
మరేమిటి?

తెరవకుండానే
ఎగిరిపోయిన ఉత్తరాన్ని.
పెట్టుకోకుండానే రాలిపోయిన
వజ్రపుటుంగరాన్ని.
మరోసారి కొరికేలోపే
జారిపోయిన బందరు మిఠాయిని
తియ్యగుంటానో
కమ్మగుంటానో
మత్తుగొలిపేనో
అని ఒంటరితనం
రాలిపడ్డ పండుటాకులా
నిన్ను ఆవరిస్తూ ఉంటే
నా జ్ఞాపకం గూడు వదిలిన
సీతాకోకచిలుకలా
నిన్ను మళ్ళీ గతం వైపు
మొగ్గలేయిస్తుంది!