వాడు

తన కవితల చొక్కా
తొడుక్కొని వస్తాడు
కొన్ని దానిమ్మ పళ్ళూ
కోసుకొని తెస్తాడు
మా పాంట్ల కొసలు
ఎర్ర మట్టిలో కొట్టుకు పోయిందాకా
నడుస్తూనే ఉందామంటాడు

గుట్టల మీద కెక్కిస్తాడు
ఎక్కడ కూచుంటే ఏం
అని నిర్లక్ష్యంగా నవ్వుతాడు
రెల్లు గడ్డి కింది తాబేటి భాష
తనకు తెలుసునని డబాయిస్తాడు

సరుగుడు తోటల్లో నా వెంటపడి
పరుగులు పెట్టిస్తాడు
చెరువులోని చేప పిల్లలకు
గంటల కొద్దీ మాటలు విసురుతాడు
అప్పుడిక,
హఠాత్తుగా లేచి నిలబడి
చకచకా చీకటి దారుల్లోకి
జారిపోతాడు-
చెప్పకుండా వాడు.