హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు

ప్రతి కళాకారుడికీ ఒక శైలి ఉంటుంది. సాహిత్యంలోనూ సంగీతం, చిత్రలేఖనం మొదలైన లలిత కళల్లోనూ ఇది ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. ఇందులో వ్యక్తిగత వైఖరి కొంతవరకూ ఉన్నప్పటికీ గురువువద్ద, లేదా శిక్షణాలయంలో నేర్చుకున్న పద్ధతీ, ఆకళించుకున్న మెళుకువలూ కళాకారుల శైలిని ప్రభావితం చేస్తాయన్నది తెలిసినదే. భారతీయ శాస్త్రీయసంగీతంలో దీన్ని దక్షిణాదిన బాణీ అనీ, ఉత్తరాదిన ఘరానా సంప్రదాయమనీ అంటారు. ఘరానా అనే మాట ఇక్కడ “గొప్ప” అనే అర్థంలో కాక ఘర్, లేక గృహం అనే హిందీ అర్థంలో వాడబడుతుంది. అంటే సంగీతశైలి ఒక “ఇంటి”, లేదా కుటుంబపు సంప్రదాయంగా అనుకోవచ్చు. గురువు పాటించిన శైలిని అతని శిష్యులు అనుసరించడం చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు కర్ణాటక సంగీతంలో ద్వారం వెంకటస్వామినాయుడుగారి ప్రభావం ఆయన కుమార్తె మంగతాయారు, శిష్యుడు మారెళ్ళ కేశవరావు తదితరుల వయొలిన్ పద్ధతిలో కనిపిస్తుంది. అలాగే ఈమని శంకరశాస్త్రిగారి శైలి ఆయన శిష్యుడైన చిట్టిబాబు వీణలో కనబడేది. హిందూస్తానీ పద్ధతుల్లో ఒక్కొక్క గురువూ తన బంధువులకూ, శిష్యవర్గానికీ తన ఘరానా పద్ధతులన్నిటినీ నేర్పి, అవి కొనసాగేలా చూడడం పరిపాటి.

ఉత్తర భారతదేశంలో ముగల్ తదితర రాజాస్థానాల ప్రాభవం తగ్గుముఖం పట్టాక కళాకారులకు సంస్థానాలలో లభిస్తూ వచ్చిన ఆదరణ తగ్గసాగింది. పంతొమ్మిదో శతాబ్దం వచ్చేనాటికి సంగీతకారులు తమ శైలిని ఘరానాల పేరుతో సంరక్షించుకోవడం మొదలుపెట్టారు. ధనార్జన కోసమని వీరంతా పెద్ద పట్టణాలకు తరలి తమ సంప్రదాయాలకు ఆయా ఊళ్ళ పేర్లను ఉపయోగించుకోవడం ప్రారంభించారు. అందువల్లనే జైపూర్ ఘరానా అనీ, ఆగ్రా ఘరానా అనీ పేర్లు వినబడుతూ ఉంటాయి.

కొన్ని సంప్రదాయాలకు తరతరాలనుంచీ చారిత్రకంగా ప్రాధాన్యత ఉంటే కొన్ని ఘరానాలు గొప్ప ప్రవీణులైన ఒకరిద్దరు కళాకారులతో ప్రారంభమైన ఉదంతాలుకూడా ఉన్నాయి. ఎలా ఆరంభమైనప్పటికీ ఇరవయ్యో శతాబ్దం మొదలయేనాటికి హిందూస్తానీ సంగీతంలో అనేక సంప్రదాయాలు పేరు సంపాదించుకున్నాయి. వీటిలో శైలినిబట్టి ఒక్కొక్కదానికీ ఒక్కో రకం ప్రత్యేకత ఏర్పడింది. ఇది కచేరీ చేసే పద్ధతిలోనేకాక నేర్పే పద్ధతిలోనూ, సాధన చేసే పద్ధతుల్లోనూ కూడా కనబడేది. శాస్త్రీయ రాగాలనూ, కృతులనూ అవగాహన చేసుకునే శైలిలోనూ, ఆవాహన చేసే పద్ధతిలోనూ, గమకాలనూ, సంగతులనూ, స్వరాలనూ పలికించే విధానంలోనూ సంప్రదాయాల మధ్య తేడాలు కనబడతాయి. ఆ కారణంగా దక్షిణభారతదేశంకన్నా వైశాల్యంలో ఎక్కువ ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో వివిధ శైలులమధ్య భిన్నత్వమూ, వ్యత్యాసాలూ స్పష్టంగా కనబడతాయి. గుజరాత్ నుంచి అస్సాం దాకానూ, కశ్మీరునుంచి ఉత్తరకన్నడ ప్రాంతందాకానూ ప్రాచుర్యంలో ఉన్న హిందూస్తానీ సంగీతంలో స్థానిక లక్షణాలు ఎక్కువగా కనబడటంలో ఆశ్చర్యం లేదు. ఈ రోజుల్లో హిందూస్తానీ సంగీతం అంటే ప్రధానంగా ఖయాల్ గానం అనే అభిప్రాయం ఉంది. ఘరానాల పద్ధతి ఖయాల్ గాత్రానికే కాక ఉపశాస్త్రీయ సంగీతంలోని భాగాలైన ఠుమ్రీ, తరానా, టప్పా మొదలైన గానవిశేషాలకూ, వాయిద్యాల శైలులకీ కూడా వర్తిస్తుంది. ఇప్పుడు కొన్ని ప్రసిద్ధమైన ఘరానా గాత్ర శైలుల వివరాలనూ, ఉదాహరణలనూ చూద్దాం. ఈ వ్యాసంలో ప్రతి ఘరానాలోనూ గాయకుడి పేరుతో సహా వివరాలన్నిటినీ ఇవ్వడం అసాధ్యమైన పని. దీన్ని ఘరానాల సమగ్రమైన చరిత్రగా కాకుండా ఒక్కొక్క శైలినీ వివిధ కళాకారులు ఎలా అనుసరించారో ఉదాహరణలను ఇచ్చే రచనగా మాత్రమే పరిగణించాలి.

గ్వాలియర్ ఘరానా

ఘరానాల్లో పాతదీ, ఎక్కువ పేరు పొందినదీ గ్వాలియర్ ఘరానా. మధ్యప్రదేశ్ ఉత్తరప్రాంతపు గ్వాలియర్ నగరం తాన్‌సేన్ జన్మస్థలంగా చారిత్రకమైనది. అక్బర్ ఆదరించిన మహాగాయకుడు తాన్‌సేన్ ధ్రుపద్ (ధ్రువపద) శైలికి ప్రాచుర్యం కల్పించాడని అంటారు. ఎంతో శ్రుతిశుద్ధతతో, అతి నింపాదిగా సాగే ఈ శైలిలో గాత్రం, రుద్రవీణా వాదనం ఎక్కువగా జరిగేవి. ఈ పద్ధతిలో కృతి మూల రచనకు విధేయత ఎక్కువగానూ, మనోధర్మశైలిలో చేసే కల్పన తక్కువగానూ అనిపించేది. పద్ధెనిమిదో శతాబ్దం మధ్యకాలంలో రాగాన్ని ఖయాల్ పద్ధతిలో పాడడం మొదలయింది. ఖయాల్ అంటే ఊహ, లేక భావన అనుకోవచ్చు. ఒక రాగంలో, ఒక తాళంలో స్వరరచన చేసిన కృతిని గాయకులు తమకు “తోచినట్టుగా” (అక్షరాలా) పాడే పద్ధతి ఇది. దీన్ని రమారమిగా మనవాళ్ళు పద్యాలు పాడే విధానంతో పోల్చవచ్చు. ట్యూన్ ఒకటే అయినప్పటికీ ఎవరి ధోరణినిబట్టి వారు ఒక్కొక్కచోట సాగదీస్తూ ఉంటారు.


[గ్వాలియర్ చెత్తకుప్పల మధ్య
హద్దూఖాన్, హస్సూఖాన్ ల సమాధి]

గ్వాలియర్ ఘరానావారు ఖయాల్ పాడే పద్ధతిని ప్రామాణికమైనదిగా గుర్తించి, తక్కిన గాత్ర శైలులను దానితో పోల్చడం పరిపాటి. అంతేకాక తక్కిన పద్ధతులన్నీ దాని నుంచే పుట్టాయని కూడా అంటారు. లక్నోకి చెందిన నత్థన్ పీర్‌బక్ష్ అనే గాయకుడు గ్వాలియర్‌కు వచ్చి స్థిరపడ్డాడనీ, అతని మనమలు హద్దూఖాన్, హస్సూఖాన్ అనే ఇద్దరూ గ్వాలియర్ గాత్రశైలిని ప్రారంభించారనీ తెలుస్తోంది. (వీరి సమాధి ప్రస్తుతం చెత్తకుప్పల మధ్య “అలరారుతోందని” గౌరీ రాంనారాయణ్ అనే విలేకరి ఫోటోతో సహా ప్రచురించింది!)

బడే మహమ్మద్ ఖాన్ అనే మరొక లక్నో గాయకుడు గ్వాలియర్ గాత్రంలో తాన్ (“అ”కారంతో వేగంగా స్వరాలను పలికించడం) పాడే పద్ధతిని ప్రవేశపెట్టాడట. ఈ శైలికి మరొక వ్యవస్థాపకుడు నత్థూఖాన్. గ్వాలియర్ ఘరానా ముఖ్యలక్షణాల్లో సరళత్వం, శ్రోతలను తికమకపెట్టకుండా రాగాన్ని వీలైనంత స్పష్టంగా పలికించడం, కృతి(రచన)ని ప్రధానమైనదిగా పరిగణించి, రాగలక్షణాలను దాని ద్వారా ప్రకటించడం మొదలైనవి ఉంటాయి. హద్దూఖాన్ రెండో కుమారుడు రహమత్ ఖాన్ (1852-1922) గాయకుడుగా పేరు పొండడమే కాక, అంతకుముందు గ్వాలియర్ గాత్రశైలిలో కనబడని భావోద్వేగాన్ని ప్రవేశపెట్టాడు. (కిరానా సంప్రదాయానికి ఆద్యుడైన అబ్దుల్ కరీంఖాన్ ఇతని పాట విని తన శైలిని మృదువుగా మార్చుకున్నాడట.) హద్దూఖాన్ పెద్దకొడుకు మహమద్ ఖాన్ అనే అతనివద్ద బాలకృష్ణబువా ఇచ్ఛల్‌ కరంజీకర్ (1849-1927) అనే గాయకుడు శిష్యరికం చేసి, గ్వాలియర్ శైలిని మహారాష్ట్ర ప్రాంతాలకు పరిచయం చేశాడు. అలాగే నత్థూఖాన్ కుమారుడు నిసార్ హుసేన్ ఖాన్ (ఇదే పేరుగల మరొక తరవాతి తరం గాయకుడు సహస్వాన్ ఘరానాకు చెందినవాడు) రామకృష్ణబువా వజే (1871-1945) అనే మహారాష్ట్ర గాయకుడికి గురువు. తొలితరం ఉస్తాద్ ల మరొక శిష్యుడయిన శంకర్ పండిత్ అనే ఆయన వద్ద ఆయన కొడుకు కృష్ణారావు (1893-1989) నేర్చుకున్నాడు. ఈ విధంగా శిష్యప్రశిష్యుల ద్వారా గ్వాలియర్ గాత్రం త్వరలోనే ప్రాచుర్యం పొందసాగింది.

బాలకృష్ణబువా శిష్యులలో విష్ణు దిగంబర్ పలూస్కర్ (1872-1931) ప్రసిద్ధుడు. నేటికీ వేల కొద్దీ విద్యార్థులకు హిందూస్తానీ సంగీతశిక్షణనిచ్చే గాంధర్వ మహావిద్యాలయానికి ఈయనే వ్యవస్థాపకుడు. ఈయన ఒక స్వరసంకేత రచనాపద్ధతిని కూడా ప్రవేశపెట్టాడు. పేదరికం, కష్టాల మధ్య కొనసాగిన ఈయన జీవితానికి తరవాతి దశలో అంధత్వంకూడా తోడయింది. అయితే ఉప్పు సత్యాగ్రహ సందర్భంలో “రఘుపతి రాఘవ” గీతాన్నీ, కాంగ్రెస్ మహాసభల్లో “వందేమాతరం” గీతాన్నీ స్వరపరిచి పాడినవాడుగా ఈయనకు పేరుండేది. ఈయన శిష్యుల్లో పేరు మోసినవారు వినాయక్‌రావు పట్వర్ధన్, ఓంకార్‌నాథ్ ఠాకూర్, బి.ఆర్.దేవ్‌ధర్, నారాయణరావువ్యాస్, తదితరులుండేవారు. వీరంతా ఎంతో మంది శిష్యులను తయారుచెయ్యడంతో గ్వాలియర్ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. రామకృష్ణ బువావజే శిష్యుడు దీనానాథ్ మంగేశ్కర్ (1900-1942) (లతా తండ్రి) మరాఠీ నాటకాల్లో నట గాయకుడుగా అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు.

విష్ణు దిగంబర్ పలూస్కర్ ఏకైకపుత్రుడు డి.వి.పలూస్కర్ (1921-1955) ఎక్కువకాలం జీవించనప్పటికీ ఎంతో మంచి సంగీతాన్ని అందించాడు. నౌషాద్ స్వరపరిచిన బైజూబావ్రా సినిమాలో బైజూ పాత్రకు పాడినది ఇతనే. గ్వాలియర్ సంప్రదాయంలోని సుగుణాలన్నీ ఈయన గాత్రంలో వినవచ్చు. శ్రావ్యమైన గొంతూ, స్పష్టమైన ఉచ్చారణా, భేషజంలేని వైఖరీ, సమగ్రమైన అవగాహనా డి.వి. పలూస్కర్ పాటలో వినబడతాయి. హిందూస్తానీ రాగాల పరిచయం చేసుకోవడానికి ఈయన పాడిన పాత రికార్డులు చాలా ఉపయోగకరం. నారాయణరావువ్యాస్ కుమారుడు విద్యాధర్ వ్యాస్ కూడా డి.వి. పలూస్కర్ శైలిలోనే పాడతాడు. ముంబాయి విశ్వవిద్యాలయం సంగీత విభాగానికి అధిపతిగా పదవీ విరమణ చేసిన విద్యాధర్ వివిధభారతి రేడియోలో “సంగీత్ సరితా” కార్యక్రమం ద్వారా శాస్త్రీయ సంగీతాన్ని శ్రోతలకు పరిచయం చేసేవాడు.


గ్వాలియర్ ఘరానా

1. రామకృష్ణ బువా వజే, 2. నారాయణరావు వ్యాస్, 3. రహమత్ ఖాన్, 4. కృష్ణారావు శంకర్ పండిత్, 5. విష్ణు ది. పలూస్కర్, 6. ఓంకార్‌నాథ్ ఠాకూర్, 7. వినాయక్‌రావు పట్వర్ధన్, 8. డి.వి. పలూస్కర్, 9. విద్యాధర్ వ్యాస్, 10. బి.ఆర్.దేవ్‌ధర్

ఒకే సంప్రదాయానికి చెందిన సంగీతాన్ని ఎంతమంది గాయకులు ఎన్ని విభిన్న రాగాల్లో వినిపించినా వారి ధోరణుల్లో పోలికలు కనిపిస్తాయి. ఎంతో అరుదైన రహమత్ ఖాన్ యమన్ రికార్డింగు లభించడం మన అదృష్టమే. గ్వాలియర్ ఘరానాకు పేరు తెచ్చిన డి.వి. పలూస్కర్ పాడిన గౌడసారంగ్ రాగం, నారాయణరావువ్యాస్ పాడిన ఖంబావతి రాగం, రామకృష్ణ బువా పాడిన ఖమాచ్ రాగం, వినాయక్‌రావు పట్వర్ధన్ పాడిన జోగ్ రాగం, ఓంకార్‌నాథ్ ఠాకూర్ ప్రధానంగా బృందావనీ సారంగ్ రాగంలో పాడిన మీరా భజన్, విద్యాధర్ వ్యాస్ కేదార్ రాగంలో పాడిన రచనా అన్నీ గ్వాలియర్ శైలికి చెందినవేనని వినగానే తెలుస్తూ ఉంటుంది. ఏనాడో ఒకరిద్దరు మొదలుపెట్టిన గాత్రశైలి ఎన్ని తరాలు గడిచినప్పటికీ ఎంత చక్కగా కొనసాగుతోందో తెలుసుకోవడానికి ఇటువంటి ఆడియో లింకులు ఉపయోగపడతాయి.

కిరానా సంప్రదాయం

మరొక ప్రసిద్ధమైన ఘరానా కిరానా సంప్రదాయం. దీన్ని నెలకొల్పినవారు అబ్దుల్ కరీమ్ ఖాన్, ఆయన దగ్గరి బంధువు అబ్దుల్ వహీద్ ఖాన్. (వహీద్ ఖాన్ మరొక గాయకుడు అమీర్ ఖాన్ కు ప్రేరణనిచ్చిన విద్వాంసుడు). కిరానా ఘరానా ఖయాల్‌, ఠుమ్రీలు పాడే పద్ధతులలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. తక్కిన శైలులకు భిన్నంగా సంగీతాన్ని ఆహ్లాదకరంగా, ఒక చల్లని ఉద్యానవనంలో శ్రోతలు విహరిస్తున్న భావనను కలిగించేదిగా, హృద్యంగా, తాదత్మ్యత కలిగిస్తూ ఉండేది ఈ గాయనపద్ధతి. సుఖంగా, భావస్ఫోరకంగా, కరుణరసం ఉట్టిపడేలా సాగే రాగ విస్తారానికి ఈ సంప్రదాయం పెట్టింది పేరు. కరీమ్‌ఖాన్‌ పాడుతూంటే ఆయన అంతరాత్మలోని ఉత్తమ గుణాలన్నీ శబ్దరూపంలో ద్యోతకమయేవి. శ్రోతలు ఆనందాశ్రువులు రాల్చే రాగభావమూ, సున్నితమైన గమకాలూ, ఆర్తీ, ఆవేదనా ఆయన పాడిన అనేక రికార్డులలో మనం వినవచ్చు. ఆయన శిష్యవర్గంలో ప్రసిద్ధులైన ఆయన కుమారుడు సురేశ్‌బాబూ మానే, కుమార్తె హీరాబాయి బడోదేకర్‌, ఆమె చెల్లెలు సరస్వతీ రాణే, వారివద్ద శిక్షణ పొందిన ప్రభా అత్రే తదితరులూ ఉన్నారు.


[కిరానా ఘరానా]

1. కరీమ్‌ఖాన్‌, 2. సవాయీ గంధర్వ, 3. సురేశ్‌బాబూ మానే, 4. హీరాబాయి బడోదేకర్‌, 5. రోషనారా బేగం, 6. భీమ్ సేన్ జోషీ, 7. బసవరాజ్ రాజ్ గురు, 8. గంగూబాయి హంగళ్, 9. ప్రభా అత్రే, 10. ఫిరోజ్‌ దస్తూర్‌

బెహెరేబువా, బాలకృష్ణబువా కపిలేశ్వరి, దశరథ్‌బువా ముళే ఆయనకు శిష్యులు. రోషనారా బేగం (కరీం ఖాన్ తమ్ముడు అబ్దుల్‌హక్‌ కుమార్తె) కూడా ఒక శిష్యురాలు. కరీంఖాన్ శిష్యుడైన సవాయీ గంధర్వవద్ద గంగూబాయి హంగళ్, బసవరాజ్‌ రాజ్‌గురు, ఫిరోజ్‌ దస్తూర్‌, భీమ్‌సేన్‌ జోషీవంటి దిగ్గజాలు సంగీతం నేర్చుకున్నారు. వీరుకాక ఈ శిష్యవర్గంలో జితేంద్ర అభిషేకీ, రసిక్‌లాల్‌ అంధారియా, కృష్ణా హంగళ్, మాధవగుడి తదితరులున్నారు. గ్వాలియర్‌ శైలిలోనూ, తక్కిన సంప్రదాయాల్లోనూ సాహిత్యానికీ, లయకూ, స్వరాలకూ సమాన హోదా ఉంటుంది కాని కిరానా ఘరానాలో స్వరమే ముఖ్యం. “తాల్‌ గయాతో బాల్‌ గయా. సుర్‌ గయాతో సర్‌ గయా” (తాళం తప్పితే వెంట్రుక రాలిందనుకోవచ్చు. స్వరం తప్పితే తల తెగినట్టే) అనే ఛలోక్తి కరీమ్‌ఖాన్‌దే నంటారు.

కరీమ్‌ఖాన్‌ పాడిన లలిత్ రాగం, సురేశ్‌బాబూ మానే పాడిన ఖమాచ్ రాగం, సవాయీ గంధర్వ పాడిన కోమల్ రిషభ్ అసావరీ రాగం, హీరాబాయి పాడిన రామ్ కలీ రాగం, నిస్సందేహంగా ఒకే శైలికి ప్రతీకలు. సవాయీ గంధర్వకు శిష్యరికం చేసిన బసవరాజ్ రాజ్ గురు (బసంత్ ముఖారి ), భీమ్ సేన్ జోషీ (జోగియా ) తదితరు లందరూ కిరానా శైలికి వారసులే. తక్కిన ఘరానాల్లాగే ఈ శైలిలో శిక్షణ పొందినవారు కిరానా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. వారి పేర్లన్నీ ఇక్కడ ఉదహరించడం చాలా కష్టం.

ఆగ్రా ఘరానా

కిరానా ఘరానా మృదుత్వానికి పేరుపొందినది కాగా ఆగ్రా ఘరానా గానం బలవత్తరంగా, దూకుడుగా, రూక్షంగా ఉంటుంది. ఖంగుమని మోగే గొంతుతో ఎలుగెత్తి పాడుతున్న గాయకుడి బలమైన గమకాల విన్యాసాలతో సాగే పాటకు ఇది అనువైన శైలి. ఈ సంప్రదాయంలో గ్వాలియర్ పోకడలు కొన్ని మిగిలి ఉండడంతో కృతికి కొంత ప్రాధాన్యత ఉంటుంది. లయలోని గతులపై (లయకారీ) శ్రద్ధ పెట్టడం కూడా కనిపిస్తుంది. అందుచేత “అ”కారంలో కాకుండా, కృతిలోని సాహిత్యాన్నే లయబద్ధంగా మార్చి పాడడం ఈ శైలిలోని ప్రత్యేకత.

తమతమ ఘరానాల గురించి ఎంతో ప్రాచీన చరిత్ర ఉన్నట్టుగా చెప్పుకోవడం కొందరు సంగీతజ్ఞుల రివాజు. ఆగ్రా ఘరానా పధ్నాలుగో శతాబ్దంలోనే మొదలైందని కొందరంటారు. మొదట్లో వీరంతా ధ్రుపద్ ధమార్ పద్ధతిలో “నోం తోం” ఆలాపనలతో పాడేవారు. ఘగ్గే ఖుదాబక్ష్ అనే గాయకుడు (1790-1880) ఆగ్రా ఘరానాలో ఖయాల్ పద్ధతిని ప్రవేశపెట్టాడట. దీని ఫలితమేమిటంటే ఒక్క ఆగ్రా ఘరానా గాయకులు మాత్రమే ధ్రుపద్ ధమార్, ఖయాల్, ఠుమ్రీ, తరానా (తిల్లానా), టప్పా మొదలైన గాత్ర పద్ధతులన్నిటిలోనూ నేటికీ పాడుతూ ఉంటారు. ఇది ఎందుకు ప్రత్యేకమంటే హిందూస్తానీలో కొద్దిమంది మాత్రమే ధ్రుపద్ ధమార్ పాడతారు; అయితే వారు సామాన్యంగా ఖయాల్, తదితర శైలుల్లో పాడరు.


[ఆగ్రా ఘరానా]

1. ఫైయాజ్ ఖాన్, 2. విలాయత్ హుసేన్ ఖాన్, 3. ఖాదిం హుసేన్ ఖాన్, 4. లటాఫట్ హుసేన్ ఖాన్, 5. షరాఫత్ హుసేన్ ఖాన్, 6. దినకర్ కైకిణీ, 7. లలిత్ రావు, 8. జగన్నాథబువా పురోహిత్

ఎంతో పేరు పొంది, అభిమానులు విశేషంగా సన్మానించిన ఫైయాజ్ ఖాన్ (1880-1950) ఈ శైలిలోని అత్యుత్తమ గాయకుడు. ఆఫ్తాబే మూసీకీ (సంగీత మార్తాండుడు) అని బిరుదును పొందిన ఈ మహాగాయకుణ్ణి శ్రోతలు ఎంతో అభిమానించేవారు. ప్రఖ్యాత నటగాయకుడు కె. ఎల్. సైగల్, సాలూరు రాజేశ్వరరావువంటి గొప్ప కళాకారులు కొంతకాలంపాటు ఈయనకు శిష్యరికం చేశారు. ఈయన గానం మంద్రస్థాయిలో “మగరాయుడి” వైఖరితో సాగేది. అందుకు ఉదాహరణ ఫైయాజ్, విలాయత్ హుసేన్ కలిసి పాడిన దర్బారీ రికార్డు. ఇందులో సాహిత్యాన్ని లయబద్ధంగా విరిచే ‘బోల్ తాన్’ ప్రయోగాలున్నాయి.

మత విభేదాలకు అతీతంగా ఈ మహావిద్వాంసుడు ‘వందే నందకుమారం’ అని కాఫీ రాగంలో ఠుమ్రీ రచించి పాడిన సంగతి ఈనాడు ఎవరికీ తెలియకపోవచ్చు.

జరిగినదేమిటంటే గుజరాత్ హింసాకాండలో భాగంగా 2002 ఏప్రిల్ మూడో తేదీన “హిందుత్వ” పేరుతో వడోదరాలోని ఫైయాజ్ ఖాన్ సమాధిని దుండగులు పాడుచేసి, ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అన్ని రకాల విలువలూ పతనమౌతున్నాయనేందుకు ఇది సాక్ష్యం.

ఆగ్రా ఘరానా గాత్రానికి పేరు పొందినవారిలో విలాయత్ హుసేన్ ఖాన్ (1897-1962), ఖాదిం హుసేన్ ఖాన్, లటాఫట్ హుసేన్ ఖాన్, షరాఫత్ హుసేన్ ఖాన్ (1930-1985), జగన్నాథబువా పురోహిత్ (గుణిదాస్), దినకర్ కైకిణీ, లలిత్ రావు తదితరులున్నారు. ఖాదిం హుసేన్ (సింధు) భైరవి రాగంలో పాడిన బాబుల్ మోరా ఈ బాణీలో కొంత సాధన చేసిన సైగల్ పాటను తలపిస్తుంది.

దినకర్ కైకిణీ పాడిన భైరవి రాగంలోకూడా ఆగ్రా ఘరానా పోకడలు కనిపిస్తాయి. షరాఫత్ హుసేన్ పాడిన రామ్ కలీ రాగం (ఫైయాజ్ రచన) తాన్ ల వేగాన్ని చూపుతుంది. లలిత్ రావు కేదార్ వల్ల ఈ “మగ” శైలిలో స్త్రీలు పాడే పద్ధతి తెలుస్తుంది. మొత్తంమీద ఇవన్నీ వింటే ఆగ్రా ఘరానా ఎటువంటిదో అర్థమౌతుంది.

జైపూర్ ఘరానా

రాజస్థాన్ చరిత్రలో ప్రసిద్ధికెక్కిన జైపూర్ ఎన్నో కళలకు పుట్టినిల్లు. అందుచేత జైపూర్ ఘరానా పేరుతో సంగీతంలోనే కాక కథక్ నాట్యశైలిలో కూడా ఒకటి ఉందంటే ఆశ్చర్యం లెదు. అలాగే వైణికుల జైపూర్ బీన్‌కార్ ఘరానాకూడా ఒకటుంది. దానికి వారసులైన కొందరు సితార్ కళాకారులూ ఉన్నారు. ప్రస్తుతం గాత్ర పద్ధతి విశేషాలు చూద్దాం. దీన్ని జైపూర్ అత్రౌలీ ఘరానా అని కూడా అంటారు.

జైపూర్ అత్రౌలీ ఘరానాలో సంక్లిష్టమైన “తాన్”లు పాడే ఆనవాయితీ ఉంటుంది. అలాగే అపరిచితమైనవీ, మిశ్రమ రాగాలూ పాడుతూ ఉంటారు. ఈ గాత్రశైలికి ఆద్యుడు అల్లాదియా ఖాన్ (1855-1946). నిడుపైన విగ్రహంతో ఠీవిగా కనిపించే ఈ గాయకుణ్ణి ప్రతివారూ చూడగానే గౌరవించేవారట. అప్పట్లో మహారాష్ట్రలో బాలకృష్ణబువా గ్వాలియర్ పద్ధతిలోనూ, నత్థన్ ఖాన్ ఆగ్రా శైలిలోనూ ఖయాల్ గాయకులుగా పేరు సంపాదించారు. గ్వాలియర్ శైలిలోని సాదా ధోరణికీ, ఆగ్రావారి తాళవైచిత్రికీ భిన్నంగా అల్లాదియా తన శైలిని పెంపొందించుకుని సంగతుల్లోనూ, రాగప్రస్తారంలోనూ కొత్త పోకడలను మొదలుపెట్టాడు. అల్లాదియా ముస్లింపద్ధతిలో కాకుండా మహారాష్ట్రులలాగా తలపాగా, పంచెకట్టుతో తిరిగేవాడు. ఈయన కొడుకులుకూడా తలపాగాలు కట్టుకునేవారు. ఈయన వద్ద కొంత నేర్చుకున్న భాస్కరబువా బఖలే (1869-1922) గాయకుడుగా, సంగీతనాటక స్వర రచయితగా ఆ రోజుల్లో చాలా గొప్ప పేరు గడించాడు. భాస్కరబువా శిష్యుల్లో ఎంతో పేరుపొందిన ఇద్దరు మరాఠీ నటగాయకులు బాలగంధర్వ, మాస్టర్ కృష్ణారావు ఫులంబ్రీకర్. భాస్కరబువా అభిమానుల్లో లోకమాన్య తిలక్ కూడా ఒకరు.


[1918 నాటి భాస్కరబువా కచేరీ
1. బాలగంధర్వ, 2. భాస్కరబువా బఖలే, 3. తిలక్]

అల్లాదియా శిష్యురాళ్ళలో కేసర్‌బాయీ కేర్కర్ (1892-1977), మోగూబాయీ కుర్డీకర్ (1904-2001) (ఈమె కుమార్తె నేటి ప్రముఖ గాయని కిశోరీ ఆమోణ్‌కర్) ప్రసిద్ధికెక్కారు. అల్లాదియాలాగే ఆయన కుమారులు మంజీఖాన్ (1888-1937), బుర్జీఖాన్ (1890-1950) కూడా సంగీతం నేర్పారు. మంజీఖాన్ శిష్యుల్లో మల్లికార్జున్ మన్సూర్ (1910-1992) ప్రసిద్ధ గాయకుడు. వామనరావు సడోలీకర్, పద్మావతీ శాలిగ్రాంలదీ ఇదే శైలి.


[జైపూర్ అత్రౌలీ ఘరానా ]

1. అల్లాదియా ఖాన్, 2. భాస్కరబువా బఖలే, 3. పద్మావతీ శాలిగ్రాం, 4. కేసర్‌బాయీ కేర్కర్, 5. మోగూబాయీ కుర్డీకర్, 6. మల్లికార్జున్ మన్సూర్ , 7. కిశోరీ ఆమోణ్‌కర్, 8. బుర్జీఖాన్, 9. మంజీఖాన్

కేసర్ బాయీ, మల్లికార్జున్ పాడిన మారు బిహాగ్, మోగూబాయి యమన్ రాగంలో పాడిన తరానా, కిశోరీ సవివరంగా పాడిన జౌన్ పురీ రాగం, మొదలైనవన్నీ జైపూర్ శైలికి అద్దం పడతాయి.

పటియాలా ఘరానా

హిందుస్తానీ సంగీతానికి ఎల్లలు మనదేశపు ప్రస్తుత సరిహద్దులను మించినవి. ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న పశ్చిమ పంజాబ్ ప్రాంతమే కాక అఫ్ఘానిస్తాన్‌లోకూడా నిన్న మొన్నటిదాకా మహమ్మద్ ఖాన్ సహారంగ్ వంటి గాయకులుండేవారు. పశ్చిమ పంజాబ్ లోని లాహోర్ పట్టణం ఒక పెద్ద సాంస్కృతిక కేంద్రం. శాస్త్రీయ సంగీతంలో పంజాబుకు చెందిన ఒక ప్రసిద్ధమైన గాయకశైలి పటియాలా ఘరానా. ఇతర గురువులే కాక హద్దూ, హస్సూ ఖాన్ ద్వయంవద్ద శిక్షణ పొందిన అలీబక్ష్ జర్నయిల్, ఫతేఅలీ అనే ఇద్దరు గాయకులు తమ బాణీని పటియాలా శైలిగా రూపొందించుకున్నారు. వీరి శిష్యులలో కాలేఖాన్ , అలీబక్ష్ అనే సోదరులుండేవారు. పంతొమ్మిదో శతాబ్దంలో పటియాలా సంస్థానంలో మొదలైన ఈ సంప్రదాయం బడేగులాం పెత్తండ్రి కాలేఖాన్, తండ్రి అలీబక్ష్‌ల కాలానికి పేరు సంపాదించుకుంది. అయితే పటియాలా ఘరానాకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిన ముఖ్య ప్రతినిధి అలీబక్ష్ కుమారుడైన బడేగులాంఅలీఖాన్. “అనర్గళం, అనితరసాధ్యం” అనిపించే శక్తులు కలిగిన ఈ గాయకుడు తాను పాడినన్నాళ్ళూ మకుటంలేని మహారాజులా జీవించాడు (1901-1968).


పటియాలా ఘరానా

1. బడేగులాంఅలీఖాన్, 2. బర్కత్ అలీఖాన్, 3. బర్కత్ అలీతో కరామత్ అలీ, మునవ్వర్ అలీ, 4. అజయ్ చక్రవర్తి, 5. గులాంఅలీ

అద్భుతమైన శ్రావ్యగానం, పంజాబీ పోకడలూ, విద్యుత్తు వేగంతో తిరిగే గమకాలతో ఖయాల్, ఠుమ్రీల విన్యాసాలకు ఈ శైలి ప్రసిద్ధికెక్కింది. బడేగులాం గొంతు మంద్రస్థాయిలో అతి గంభీరంగానూ, తారస్థాయికి వెళ్ళినకొద్దీ అతి మధురంగానూ వినబడేది. సంగీతస్వరాలతో ఆయనలాగా గాఢమైన పరిచయం ఉన్న గాయకులు ఎవరూ కనబడరు. ఖయాల్ పాడినా, ఠుమ్రీ పాడినా ఆయనకు సాటి రాగలిగినవారెవరూ ఉండేవారుకారు. ఆయన తమ్ముడు బర్కత్ అలీఖాన్ (1905-1963), రెండో కుమారుడు మునవ్వర్ అలీ, అతని కొడుకు రజా అలీ, ఈ శైలిలో శిక్షణ పొందిన అజయ్ చక్రవర్తి తదితరులు ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు.

1921లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారతదేశం వచ్చినప్పుడు, బడేగులాం ఢిల్లీలో కచేరీ చేశాడు. ఆ తరవాత ఆయన చాలా కాలం లాహోర్ ప్రాంతంలోనే ఉండిపోయి, 1939లో కలకత్తాలో కచేరీ చేసిన తరవాతనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకోసాగాడు. ఆయన తమ్ముడు బర్కత్ అలీ తన తండ్రివద్దా, బడేగులాంవద్దా సంగీతం నేర్చుకుని, బడేగులాంలాగా భారతదేశంలో స్థిరపడకుండా పాకిస్తాన్‌కు వెళిపోయాడు. అక్కడ ఆయన ప్రధానంగా ఠుమ్రీ, గజల్ గానానికి పేరుపొందాడు. నేటి ప్రఖ్యాత గజల్ గాయకుడు గులాంఅలీ ఆయన వద్దనే నేర్చుకున్నాడు. బడేగులాం పెద్ద కుమారుడు కరామత్ అలీఖాన్ కొడుకులు ఉపశాస్త్రీయ సంగీతకారులుగా కెనడాలో స్థిరపడ్డారు. బడేగులాం సబ్‌రంగ్ అనే కలం పేరుతో ఎన్నో రచనలు చేశాడు. అవన్నీ ప్రధానంగా హిందూ దేవతల గురించినవే కావడంతోనో ఏమో ఆయనకు పాకిస్తాన్‌లో స్థిరపడడం నచ్చక బొంబాయిలోనూ, కలకత్తాలోనూ, చివరికి హైదరాబాద్‌లోనూ నివసించాడు.

బడేగులాం పాడిన గుజరీతోడీ, భైరవి రాగాల కచేరీ అరుదైన వీడియో, ఆడియో ఇంటర్వ్యూ, అదే సైట్ లో ఇతర వీడియోలూ ఈ తరంవారికి ఆయనను పరిచయం చేస్తాయి.

బడేగులాం (వంతపాట మునవ్వరలీ), బర్కత్ అలీలిద్దరూ పాడిన ఖమాజ్ ఠుమ్రీలు వింటే పోలికలూ, వ్యత్యాసాలూ కూడా తెలుస్తాయి. మునవ్వరలీ పాడిన బిహాగ్, అజయ్ చక్రవర్తి పాడిన గుజరీతోడీ, పటియాలా శైలికి నమూనాలు.

రాంపుర్ సహస్వాన్ ఘరానా

గ్వాలియర్ ఘరానా దాదాపుగా తక్కిన అన్ని శైలులకూ జన్మనిచ్చిందని చెప్పవచ్చు. వీటిలో రాంపుర్ సహస్వాన్ ఘరానా కూడా ఒకటి. ఉత్తర్ ప్రదేశ్ ఉత్తర ప్రాంతానికి చెందిన ఈ శైలికి ఆద్యుడు ఇనాయత్ హుసేన్ ఖాన్ (1849-1919). ఇతను గ్వాలియర్ మూలస్తంభం హద్దూఖాన్‌కు స్వయానా అల్లుడు. రాంపుర్, సహస్వాన్‌లు ధ్రుపద్ సంప్రదాయానికి పేరుపొందిన ప్రదేశాలు కావడంతో ఈయన గాత్రంమీద హద్దూఖాన్ నేర్పిన గ్వాలియర్ పద్ధతితోబాటు ధ్రుపద్ ప్రభావంకూడా ఉండేది. ఆలాపనలో రాగస్వరూపాన్ని స్పష్టంగా చూపడం, కృతిలోని సాహిత్యాన్ని పూర్తిగా ఒత్తి పలుకుతూ అర్థాన్ని తెలియజెయ్యడం మొదలైనవన్నీ ఈ ఘరానా లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ శైలిలో రకరకాలైన తాన్ ప్రస్తారాలు బలంగా, తరుచుగా పాడడం పరిపాటి. ఇనాయత్ హుసేన్ శిష్యుల్లో ఆయన అల్లుళ్ళు నిసార్ హుసేన్ ఖాన్ (1912-1993), ముష్తాక్ హుసేన్ ఖాన్ (1874-1964) ప్రసిద్ధులు. వీరిద్దరి వద్దా నేర్చుకున్న హఫీజ్ అహ్మద్ ఖాన్, ఇనాయత్ హుసేన్ మనమడు గులాంముస్తఫాఖాన్ (ఇతను గజల్ గాయకుడైన హరిహరన్‌కు గురువు), రషీద్‌ఖాన్, ముష్తాక్ హుసేన్ శిష్యురాలు సులోచనా బృహస్పతి తదితరులు ఈ శైలికి వారసులు. నిసార్ హుసేన్‌కు మనమడి వరస అయిన రషీద్‌ఖాన్ ఆయన శిష్యుడు కూడా. ఈ శైలిలో నిసార్ హుసేన్ తరానాలు పాడడాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేశాడు. ఇది పాడడానికి అతి వేగంగా నోరు తిరగాలి. మొత్తంమీద వీరందరూ ఒకే బంధువర్గానికి చెందినవారు. కనీసం నాలుగు తరాలుగా బలపడుతూ వస్తున్న ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.


రాంపుర్ సహస్వాన్ ఘరానా

1. ముష్తాక్ హుసేన్ ఖాన్, 2. నిసార్ హుసేన్ ఖాన్, 3. రషీద్‌ఖాన్, 4. సులోచనా బృహస్పతి, 5. గులాంముస్తఫాఖాన్, 6. హఫీజ్ అహ్మద్ ఖాన్

బిహాగ్ రాగంలో ముష్తాక్ హుసేన్ పాడిన ఖయాల్, నిసార్ హుసేన్ యువవయసులో పాడిన తరానా ఈ ఘరానా లక్షణాలను విశదం చేస్తాయి. హఫీజ్ అహ్మద్ నింపాదిగా పాడిన జైత్ రాగం, గులాంముస్తఫా పాడిన నాయకీ కానడా రాంపూర్ సహస్వాన్ ఘరానాకు మచ్చుతునకలు. ఈనాటి యువగాయకుడు రషీద్ పాడిన పూరియా రాగంలో ఈ శైలిని కొనసాగించడం చూడవచ్చు.

ఇతర ఘరానాలు

నిపుణుడైన గాయకుడు తన బాణీకి పేరు తెచ్చిపెట్టగలడు. ప్రముఖ గాయకుడు జస్‌రాజ్ ద్వారానే మేవతీ ఘరానా పేరుపొందింది. జస్‌రాజ్ పాడిన అడాణా రాగం, అతని శిష్యుడు సంజీవ్ అభయంకర్ పాడిన లలిత్ రాగం ఒకే శైలికి అద్దం పడతాయి.

పాకిస్తాన్‌లో గొప్ప గాయకులుగా సంచలనం కలిగించిన సోదరద్వయం నజాకత్, సలామత్ అలీ ఖాన్ ల కారణంగా షం చౌరాసీ ఘరానా ప్రసిద్ధమైంది. ఇలా చిన్నా పెద్ద ఘరానాలు అనేకం ఉన్నాయి. పెద్ద ఘరానాకి చెందిన తక్కువరకం గాయకులూ, పెద్దగా పేరు పొందని ఘరానాలో గొప్ప గాయకులూ కూడా అక్కడక్కడా కనిపిస్తారు.


షం చౌరాసీ ఘరానా

1. జస్‌రాజ్, 2. నజాకత్, సలామత్ అలీ ఖాన్, 3. సంజీవ్ అభయంకర్, 4. కుమార్ గంధర్వ

కొందరి లెక్కన ఘరానా పద్ధతి అంత సబబైనది కాదు. ఎవరో ఒక గాయకుడు తన శక్తి యుక్తులకు అనువుగా తాను పాడే శైలిని మలుచుకోవచ్చు. అంతమాత్రం చేత అది అతని వారసులకూ, శిష్యులకూ అందరికీ అదే స్థాయిలో పనికొస్తుందన్న నమ్మకం లేదు. ఇది ఒక్కొక్కప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకున్నట్టుగా ఉంటుంది. అయితే తనది “ఘరానేదార్ గాయకీ” అనే మెప్పు పొందాలని ప్రతి గాయకుడూ ఆశిస్తాడు. పేరున్న గురువువద్ద నేర్చుకోనివారూ, వీరిదీ, వారిదీ విని నేర్చుకున్నామని చెప్పుకోవడం నచ్చనివారూ తమ తండ్రి దగ్గర నేర్చుకున్నామని చెప్పుకోవడం మామూలు. శాస్త్రీయ సంగీతరంగంలో ఇటువంటి భేషజాలు ఎక్కువ. ఏది ఏమైనా గత నూరేళ్ళుగా వివిధ రాగాల పార్శ్వాలన్నిటినీ సమర్థవంతంగా అభివృద్ధి చేసి, గాయకపద్ధతుల్లో చక్కని వైవిధ్యం ఏర్పడటానికి ఘరానా పద్ధతి బాగా తోడ్పడింది. గురువుల బాణీపట్ల విధేయత కనబరుస్తూనే నిపుణులైన గాయకులందరూ తమ ప్రత్యేకతను నిలుపుకుంటూ వచ్చారు. కిరానా సంప్రదాయానికి చెందినప్పటికీ భీంసేన్ జోషీ ఆ బాణీ పోకడలకి తన వ్యక్తిగత ప్రతిభను జోడించి పేరు తెచ్చుకున్నాడు. కొందరు మాత్రం ఘరానా పద్ధతికి దూరంగా ఉండికూడా పేరు పొందారు.

తాను ప్రత్యక్షంగా నేర్చుకోకపోయినా అమీర్ ఖాన్ కిరానా మూలపురుషుల్లో ఒకడైన అబ్దుల్ వహీద్ ఖాన్ పాటను చాటుగా విని తన శైలికి రూపుదిద్దుకున్నాడట. అయితే ఘరానా పేరు చెప్పుకోకపోవడం ‘అవమానకరం’గా అనిపించడంతో అమీర్ ఖాన్ పాడే పద్ధతి ఇందోర్ ఘరానాగా చెప్పబడుతోంది. గ్వాలియర్ బాణీలో దేవ్‌ధర్ వద్ద నేర్చుకున్నప్పటికీ కుమార్ గంధర్వ (1924-1992) (ఈయన అసలు పేరు శివపుత్ర సిద్ధరామయ్య కోమ్ కలీ) ఒక రెబెల్ గాయకుడుగా పేరు పొందాడు. ఉత్తర కర్ణాటకకు చెందిన ఈయన పసివయసులోనే అద్భుతంగా పాడేవాడు. తరవాత మధ్యప్రదేశ్‌లో స్థిరపడి, అక్కడి జానపద సంగీతాన్ని కూడా అధ్యయనం చేసి తన స్వంతబాణీ ఒకటి ఏర్పరుచుకున్నాడు. తనకు ఘరానా పద్ధతిలో విశ్వాసం లేదని చెప్పాడు కూడా. కుమార్ గంధర్వ శంకరా రాగంలో చేసిన స్వీయరచనలోనూ, జానపద ధోరణిలో పాడిన తత్వగీతాల్లోనూ ఆయన అసమాన ప్రతిభ కనబడుతుంది. ఒకే ఊపిరితిత్తి కలిగినప్పటికీ ఈయన గానం అద్భుతమే.

ఘరానాలది మూస పద్ధతి అనీ, ప్రతి బాణీలోనూ గొప్ప సంగీతజ్ఞులున్నారు కనక అందరిదీ విని మంచి అంశాలను స్వీకరించే ధోరణి ఉండాలనీ కొందరు ఆధునికుల ఉద్దేశం. ఘరానాలను విమర్శించకపోయినప్పటికీ మంచి గాయకులందరూ చేస్తూ వస్తున్నది ఈ పనే అనిపిస్తుంది. కొందరు సందర్భాన్ని బట్టీ, వ్యక్తిగత కారణాల వల్లనూ వివిధ ఘరానాల గురువుల వద్ద నేర్చుకుని మిశ్రమ శైలిని అవలంబించిన ఉదాహరణలూ కనిపిస్తాయి. మొత్తం మీద పాట బావుండాలే కాని ఘరానా ఏదైతేనేం అని శ్రోతలెవరైనా భావిస్తే దాన్ని కాదనడమూ కష్టమే.


[1948 నాటి రాష్ట్రపతితో హిందూస్తానీ సంగీత విద్వాంసుల తారామండలం]

మొదటి వరస: (ఎడమ నుంచి కుడికి) 1. తెలియదు, 2. నిసార్ హుసేన్ ఖాన్ (గాత్రం), 3. అహ్మద్ జాన్ థిరక్వా (తబలా), 4. హాఫిజ్ అలీఖాన్ (సరోద్), 5. ముష్తాక్ హుసేన్ ఖాన్ (గాత్రం), 6. ఓంకార్‌నాథ్ ఠాకూర్ (గాత్రం), 7. రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్, 8. కేసర్‌బాయి కేర్కర్ (గాత్రం), 9. అల్లాఉద్దీన్ ఖాన్ (సరోద్), 10. కంఠే మహారాజ్ (తబలా), 11. గోవిందరావు భరణ్‌పూర్‌కర్ (పఖవాజ్), 12. కృష్ణారావు శంకర్ పండిత్ (గాత్రం), 13. మనోహర్ జోషీ (గాత్రం)
రెండో వరస: 1. గులాం ముస్తఫా ఖాన్ (గాత్రం), 2. అల్తాఫ్ హుసేన్ ఖాన్ (తంబురా), 3. తెలియదు,
4. కరామత్ ఖాన్ (తబలా), 5. రాధికామోహన్ మైత్రా (సరోద్), 6. ఇల్యాస్ ఖాన్ (సితార్), 7. బిస్మిల్లా ఖాన్ (షెహనాయి), 8. కిషన్ మహారాజ్ (తబలా), 9. అతాఫ్ హుసేన్ ఖాన్ (గాత్రం), 10. రవిశంకర్ (సితార్), 11. అలీఅక్బర్ ఖాన్ (సరోద్), 12. విలాయత్ ఖాన్ (సితార్), 13. నారాయణరావు వ్యాస్ (గాత్రం), 14. వినాయకరావు పట్వర్ధన్ (గాత్రం), 15. డి.వి.పలూస్కర్ (గాత్రం)
మూడో వరస: 1 నుంచి 5 బిస్మిల్లాఖాన్ బృందంవారు, 6. బి.ఆర్. దేవ్‌ధర్, 7. జ్ఞాన్ ప్రకాశ్ ఘోష్ (తబలా), 9. రాజాధ్యక్ష (గాత్రం), 9,10. తెలియదు, 11. నీంకర్ బువా
నాలుగో వరస: ఎడమ నుంచి రెండో వ్యక్తి వినయ్ చంద్ర (తక్కిన పేర్లు తెలియవు)

(హిందుస్తానీ గాత్రంలో ప్రాచుర్యంలో ఉన్న వివిధ పద్ధతులను వివరించడమే ఈ వ్యాసం ఉద్దేశం. ఇందులో వినిపించే గాత్రసంగీతం అంతా అందరికీ నచ్చకపోవచ్చు. ఇది కేవలం పోలికలూ, వ్యత్యాసాలూ తెలిపేందుకు ఉద్దేశించినదే. అందువల్ల ఒకే బాణీకి చెందిన వేరువేరు గాయనీ గాయకులు దాన్ని అనుసరించే విధానాలను ఆడియో ఉదాహరణల్లో గమనించవచ్చు. ఈ ఒక్క వ్యాసం ద్వారా వందలూ, వేల సంఖ్యలో ఉన్న సంగీతజ్ఞులందరి శైలులనూ పరిచయం చెయ్యడం అసంభవమే. ఇది చదివి ఆసక్తి పెంచుకున్నవారికి ఈ విషయాల గురించి మరింతగా తెలుసుకునేందుకు ప్రేరణ కలగవచ్చు. ఇంటర్నెట్‌లో లెక్కలేనన్ని ఆడియో ఫైల్స్ కనిపిస్తాయి. విని ఆనందించదలుచుకున్నవారికి బోలెడంత కాలక్షేపం)

కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...