ఆముక్తమాల్యద – కృష్ణదేవరాయల నవ్య రాజనీతి

సాహిత్యంలో రాజనీతిని గురించిన చర్చ ఆముక్తమాల్యదతో ప్రారంభం కాలేదు. సంస్కృతంలో కౌటిల్యుని అర్థశాస్త్రం నుండి తమిళంలోని తిరుక్కుఱళ్ వరకు రాజ్యధర్మాన్ని, రాజనీతిని విశ్లేషించడం అనాది కాలం నుండీ వస్తున్న సంప్రదాయమే. అయితే, దక్షిణ భారతీయ సాహిత్య చరిత్రలో మొదటిసారిగా వ్యక్తిగా రాజు యొక్క వ్యక్తిగత ధర్మాలకు, వ్యవస్థగా రాజ్యపాలనా ధర్మాలకు మధ్య భేదాన్ని విస్పష్టం చేసి కొత్త రాజనీతిని పరిచయం చేసింది ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యద లోని ఈ రాజనీతి పార్శాన్ని విశ్లేషించడం ఈ వ్యాసం ముఖ్యోద్దేశ్యం.

నేపథ్యం

1510 ప్రాంతం – క్షాత్ర వీరుడిగా శ్రీకృష్ణదేవరాయలు యుద్ధరంగంలో ముమ్మరంగా పాల్గొంటున్న రోజులవి. నరసనాయకుని పుత్రునిగా 1509లో పట్టాభిషిక్తుడైన కృష్ణదేవరాయలు, తన పరిపాలనాకాలపు తొలిరోజుల్లో మొదట ఉత్తర దిశగా దండయాత్రలు జరిపి, ఆపై ఆగ్నేయదిశగా శంభువరాయలపై యుద్ధభేరి మ్రోగించాడు. 1514వ సంవత్సరంనుండి వాయవ్య దిశలో సుదూరంగా జరిపిన జైత్రయాత్రల ద్వారా తన సామ్రాజ్యాన్ని గోదావరి తీర ప్రాంతాల వరకు విస్తరించగలిగాడు. తిరుమల రెండవ ప్రాకారపు శాసనాల ఆధారంగా రాయలు 1514 నుండి జరిపిన తూర్పు దిగ్విజయ దండయాత్రలలో ఉదయగిరిని మాత్రమే కాక, అద్దంకి, వినుకొండ, నాగార్జున కొండ, కొండవీడు మొదలైన ప్రాంతాల్ని వశం చేసుకున్నాడు. కొండవీడు నగరాన్ని తన సైన్యంతో చుట్టుముట్టి కోట గోడల్ని విధ్వంసం చేసి, ప్రతాపరుద్ర గజపతిదేవుని కుమారుడైన వీరభద్రరాయన్ని సజీవంగా బందీ చేసినట్టు మనకు తెలుస్తోంది. ఆపై ఒరిస్సా గజపతి సామ్రాజ్యంలోని ఎన్నో ప్రాంతాలను ఆక్రమిస్తూ, గజపతి బంధుమిత్రులని, సామంతులని బందీలుగా చేసినా, పిదప వారి భద్రతకు ఏ ముప్పు వాటిల్లదని అభయమిస్తూ వారందరినీ ప్రాణాలతో వదిలేసినట్టు కూడా తెలుస్తోంది (ఈ శాసనాలలో కనిపించే అనేకానేక బిరుదులలో రాయలని ఒకచోట ‘యవనరాజ్య స్థాపనాచార్య’ అని కీర్తించడం ఆసక్తికరమైన విషయం).

గజపతిరాజులపై జరిపిన రెండవ విడత దండయాత్రలలో ఆనాటి కళింగ దేశపు ముఖ్య ప్రాంతాలైన బెజవాడ (విజయవాడ) నుండి కొండపల్లి వరకూ, ఆ పై సింహాద్రి-పొట్నూరు నుండి రాజమహేంద్రవరం వరకూ ఆక్రమించుకొని 1516 నాటికి తన రాజధాని విజయనగరానికి తిరిగి చేరుకున్నాడు. 1517 జనవరిలో తన విజయయాత్రలకు సంకేతంగా తిరుపతిని దర్శించి స్వర్ణ మణిమయాభరణాలను, మాన్యాలను ఆ దేవునికి కానుకగా సమర్పించుకున్నాడు. ఆ తరువాత కూడా కృష్ణదేవరాయలు తిరుమల దేవస్థానాన్ని 1521 వరకూ తరచూ సందర్శిస్తుండే వాడని శాసనాల ద్వారా తెలిసిన విషయం. ఇలా తూర్పు దిగ్విజయయాత్రలు జరుపుతున్న కాలంలోనే, బహుశా రెండవ విడత దండయాత్రలు జరిపే రోజుల్లో, కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద కావ్య రచనను ప్రారంభించాడని చెప్పవచ్చు. తన కావ్యంలోనే ఈ కృతి రచనకు పురికొల్పిన స్వప్న వృత్తాంతాన్ని వివరిస్తూ ఇలా అన్నాడు:

మున్నేఁ గళింగదేశ విజిగీషామనీషం దండెత్తిపోయి విజయవాటినిం గొన్ని వాసరంబు లుండి శ్రీకాకుళ నికేతనుండగు నాంధ్రమధుమథను సేవింపం బోయి హరివాసరోపవాసం బచ్చటఁ గావింప నప్పుణ్యరాత్ర చతుర్థ యామంబున …

ఈ స్వప్న వృత్తాంత కాలనిర్ణయానికి మనకు రెండు శాసనాలు ఉపయోగపడుతున్నవి. మొదటిది అహోబిల శాసనం. రెండవది సింహాచల శాసనం. రాయలు కొండవీటి విజయానంతరం “ధరణికోటకు విచ్చేసి అమరేశ్వర మహాదేవునకు తులాపురుష మహాదానమున్ను చేయ నవధరించి – తిరిగి విజయనగరానకు విచ్చేసి మఱి కళింగదేశ విజయార్థమై విచ్చేయుచు – అహోబలానకు వేంచేసి దేవుని దర్శించి శ్రీ విజయాభ్యుదయ శా. సం. 1438 యగు నేటి యువ సం॥ర పుష్య శుద్ధ 15 శుక్రవాసర మందు శ్రీఅహోబల దేవునకు” నగలు అర్పించాడట. అహోబిల శాసన కాలం డిశంబర్ 1515. సింహాచల శాసనం 30 మార్చ్ 1516. ఈ రెండింటి నడుమ రాయలు శ్రీకాకుళం వెళ్ళాడు. ఇది బహుశా జనవరి 1516 కావచ్చు. ఇంతకంటే ఆధారాలు మృగ్యం.

శ్రీకాకుళ మహావిష్ణువు కలలో కనిపించి సంస్కృత భాషలో మదాలస చరిత్ర, సత్యవధూ పరిణయం, జ్ఞాన చింతామణి, రసమంజరి మొదలైన మధుర కావ్యాలు (ఈ కావ్యాలేవి మనకు ఇప్పుడు లభ్యం కావటం లేదు) రచించిన రాయలకు ఆంధ్ర భాష అసాధ్యం కాదని, అందుకని తెలుగులో ఒక కృతిని నిర్మించమని ఆదేశించినట్లు మనకు తెలుస్తోంది.

మఱియు రసమంజరీ ముఖ్య మధుర కావ్య
రచన మెప్పించుకొంటి గీర్వాణ భాష
ఆంధ్రభాష యసాధ్యంబె యందు నొక్క
కృతి వినిర్మింపు మిక మాకుఁ బ్రియము గాగ.

స్వప్నం నుండి మేల్కొనగానే, మరునాడు ఉదయం రాయలు తన దండనాథ సామంతులతో కొలువు తీర్చి, ఆపై వివిధ వేదాగమ నిధులగు విద్వజ్జనంబులను పిలిపించాడట. వారికి తన స్వప్నవృత్తాంతం చెప్పగానే, వారంతా హర్షం వ్యక్తం చేసి, విష్ణువు ఆజ్ఞానుసారం కృతి నిర్మిస్తే ఉత్తరోత్తరాభివృద్ధి కలుగుతుంది కాబట్టి కావ్యాన్ని రాయాల్సిందేనని, కృష్ణదేవరాయలకు ‘సాహితీ సమరాంగణ చక్రవర్తి’ గా యశస్సు దక్కుతుందని ప్రోత్సహించారట.

కథాసంగ్రహం

ఆముక్తమాల్యద కథ పాండ్యదేశంలోని విల్లిపుత్తూరు పట్టణంలో జరుగుతుంది. ఈ కావ్యం ప్రథమాశ్వాసం విల్లిపుత్తూరు పట్టణ వర్ణనంతో, అందులో నివసించే విష్ణుచిత్తుడనే బ్రాహ్మణుని పరిచయంతో మొదలౌతుంది. ప్రబంధ సాహిత్య సంప్రదాయమైన ఋతువర్ణన ఆముక్తమాల్యదలో కూడా ఈ ఆశ్వాసంలో కనిపిస్తుంది. అయితే, మిగిలిన కవులకు భిన్నంగా రాయల వర్ణనలో సామాన్యమైన విషయాలు, సామాన్య జనుల జీవితాలలో కనబడే చిన్న చిన్న సంగతులు చోటుచేసుకుంటాయి. రెక్కలలో తల దూర్చుకొని పక్కకాలువల్లో పడుకొన్న బాతులను బ్రాహ్మణులు విడిచిపెట్టిన అంగవస్త్రాలుగా కాపలాదారులు భ్రమపడ్డారని చెప్పే విచిత్రమైన ఊహ రాయలది. బహుశా, సేనానాయకుని కొడుకుగా రాయలు తన చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ, వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి ఉండి ఉంటాడని మనం చెప్పుకోవచ్చు. విష్ణుచిత్తుడు తన ఇంటికి వచ్చే అతిథులకు వివిధ కాలాల్లో చేసిపెట్టే వంటకాల వర్ణనతో ప్రథమాశ్వాసం ముగుస్తుంది.

ఆముక్తమాల్యద కావ్యమంతా ఈ రకమైన జనసామాన్యపు వాస్తవిక జీవిత వర్ణనలతో నిండి ఉంటుందని భావించకూడదు. రెండవ ఆశ్వాసం పాండ్యదేశానికి రాజధాని అయిన మధుర గురించిన అద్భుతమైన వర్ణనలతో మొదలౌతుంది. ఈ దేశాన్ని పాలించే మత్స్యధ్వజుడనే రాజు సర్వ సద్గుణ సంపన్నుడు. గొప్ప దాత. ఏ ఈతి బాధల్లేకుండా ప్రజాపాలన చేస్తుంటాడు. వేసవికాలాన ఒకనాడు అరుగుమీద పడుకున్న బ్రాహ్మణులు పరలోకం గురించి చేస్తున్న సంభాషణ విని తాను తన రాజ్యాన్ని త్యజించాలని నిర్ణయించుకొన్నట్లు ప్రకటిస్తాడు. సర్వమత సిద్ధాంతులను రావించి మోక్షసాధనకు ఉత్తమమైన మార్గమేమిటో నిర్ణయించమని వాదాన్ని ఏర్పాటు చేస్తాడు. వైకుంఠంలోని విష్ణువు, తనను విల్లిపుత్తూరులో సేవించే విష్ణుచిత్తుణ్ణి మధురలో జరుగుతున్న వాదాలలో పాల్గొని తన మహత్వాన్ని స్థాపించి రాజును వైష్ణవుని చెయ్యమని కోరుతాడు. విష్ణుచిత్తుడు మధురకు జరిపే ప్రయాణ వర్ణనతో రెండవ ఆశ్వాసం ముగుస్తుంది.

మూడో ఆశ్వాసం మనకు కృష్ణదేవరాయలకు పురాణ శాస్త్ర గ్రంథాలతో ఉన్న గాఢమైన పరిచయాన్ని చూపెడుతుంది. మధురలో పండితుల వాదప్రతివాదాల మధ్య, మనం ఊహించినట్టుగా, విష్ణుచిత్తుడు అందరినీ ఓడిస్తాడు. శ్రీమన్నారాయణుడే పూజ్యుడని చెప్పే ఖాండిక్య కేశిధ్వజుల కథ చెబుతాడు. ఖాండిక్య, కేశిధ్వజులు అన్నదమ్ముల బిడ్డలు. ఖాండిక్యుడు కర్మయోగి. వైదిక కర్మకాండల గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు. కేశిధ్వజుడు జ్ఞానయోగి. పెద్దవారయాక ఇరువురికి రాజ్యకాంక్ష పెరిగింది. కేశిధ్వజుడు యుద్ధంలో సోదరున్ని జయించాడు. ఖాండిక్యుడు భటులతో, హితులతో అడవులకు పోయాడు. కేశిధ్వజుడు తన విజయానికి సూచనగా మహాయజ్ఞం చేస్తాడు. అయితే, ఆ యజ్ఞానికి బలిపశువుగా నియోగింపబడ్డ ఆవును ఒక పులి తినేస్తుంది. యజ్ఞం నిర్విఘ్నంగా జరగడానికి చేయవలసిన ప్రాయశ్చిత్తం ఏమిటని మునులను అడుగుతాడు. వారు తమకు తెలియదని, అరణ్యవాసం చేస్తున్న ఖాండిక్యుడే చెప్పగలడని అంటారు. అరణ్యానికి వచ్చిన కేశిధ్వజునికి ధర్మసూక్ష్మం చెప్పవద్దని ఖాండిక్యుని మంత్రులంటారు. ఖాండిక్యుడు వారి మాటలు వినక ప్రాయశ్చిత్తాన్ని తెలియజేస్తాడు. కేశిధ్వజుడు యజ్ఞం పూర్తి చేసి ఖాండిక్యునికి గురుదక్షిణగా రాజ్యాన్ని ఇవ్వబోతాడు. ఖాండిక్యుడు వద్దంటాడు. కేశిధ్వజుడు కూడా అప్పుడు తన రాజ్యాన్ని త్యజించి మోక్ష సాధనకు విష్ణువే పర దైవమని తన కొడుక్కి పట్టభిషేకం చేస్తాడు.

విష్ణుచిత్తుడు ఈ కథ చెప్పి రాజును వైష్ణవునిగా మారుస్తాడు. రాజు విష్ణుచిత్తుణ్ణి గజాధిరోహణం చేయించి వైభవంగా ఊరేగించడంతో మూడవ ఆశ్వాసం అయిపోతుంది.

ఇక నాల్గవ ఆశ్వాసంలో, విష్ణుచిత్తుడు విల్లిపుత్తూరు చేరి పూర్వంకంటే ఎక్కువ భక్తిశ్రద్ధలతో భగవదర్చన కొనసాగిస్తాడు. విష్ణుచిత్తుని భక్తికి మెచ్చిన విష్ణువు లక్ష్మితో “పూర్వం యామునాచార్యునివంటివాడే ఈ విష్ణుచిత్తుడు” అనడంతో ఆమె యామునాచార్యుని చరిత్ర చెప్పమని కోరుతుంది. యామునాచార్యుడు విష్ణుభక్తుడైన నాథముని మనమడు. అదే సమయంలో మధురను పాలించే రాజు వీరశైవుడు. వైష్ణవద్వేషి. కాని అతని భార్య విష్ణు భక్తురాలు. విష్ణువు ఆజ్ఞ మేరకు యామునాచార్యుడు, రాణి ద్వారా ఆ రాజాస్థానానికి వెళ్ళి వాదించి, ఇతరులను ఓడించి విష్ణువే పరతత్త్వమని నిరూపిస్తాడు. రాజు యామునాచార్యునికి తన సోదరినిచ్చి వివాహం చేసి అర్ధరాజ్యాన్ని సమర్పించి గౌరవిస్తాడు. యామునాచార్యుడు దిగ్విజయయాత్రలు చేసి భోగభాగ్యాలనుభవిస్తూ రాజ్యం చేస్తుంటాడు.

యామునాచార్యుడిని ఈ బంధాలనుండి ఎలా తప్పించాలా అని ఆలోచించిన ఇతర వైష్ణవ భక్తులలో ఒకరైన శ్రీరామ మిశ్రుడు అతనికి సాత్వికాహారంగా అలర్కశాకం పెట్టిస్తాడు. దానితో యామునాచార్యునికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. “మీ పెద్దలు మీకోసం జాగ్రత్త పరచిన నిక్షేపాన్ని చూపించడానికి వచ్చాను” అని శ్రీరామ మిశ్రుడు శ్రీరంగం తీసుకువెళ్ళి రంగనాథుని పాదపద్మాలే ఆ నిక్షేపం అని చూపగానే యామునాచార్యుని భ్రమలు తొలగిపోతాయి. కుమారునికి పట్టాభిషేకం చేసి, అతనికి రాజనీతిని ఉపదేశించి సన్యసిస్తాడు. యామునాచార్యుడు తన కుమారునకు బోధించిన రాజనీతిని ఈ వ్యాసంలోని చర్చకు ప్రధానాంశంగా వివరంగా మళ్ళీ పరిశీలిద్దాం.

పంచమాశ్వాసం నుండి సప్తమాశ్వాసం వరకు సుప్రసిద్ధమైన గోదాదేవి (ఆండాళ్) కథ ఉంటుంది. తులసివనంలో దొరికిన ఆడశిశువును గోదాదేవిగా విష్ణుచిత్తుడు పెంచుకొంటాడు. వయసు వచ్చిన గోదాదేవి విష్ణువునే వివాహమాడాలనుకుంటుంది. విష్ణుచిత్తుడు భగవంతునికోసం కట్టిన తులసిమాలను తండ్రికి తెలియకుండా అలంకరించుకొని తిరిగి ఆ మాలికను సెజ్జలో వదిలేసేది. ఒకరోజు నిజం తెలుసుకున్న విష్ణుచిత్తుడు కూతురిని కోపగిస్తాడు. గోదాదేవి శ్రీరంగనాథుని వరించిన విరహంతో ప్రాణత్యాగం చెయ్యడానికి నిశ్చయించుకుంటుంది. దాంతో విష్ణుచిత్తుడు దేవునితో మొర పెట్టుకుంటాడు. విష్ణువు అతని అమాయకత్వానికి చిరునవ్వు నవ్వి మాలదాసరి కథ చెబుతాడు. గోదాదేవిని శ్రీరంగం తీసుకువెళ్ళమని చెబుతాడు. గోదాదేవి శ్రీరంగనాథుల వివాహంతో ఈ కావ్యం ముగుస్తుంది.