- మారుతున్న కాలంతో పాటుగా మార్పులు తప్పవు. ఈమాట ఇకనుంచీ మాసపత్రికగా మారుతోంది! ఐతే ఏ మార్పయినా పత్రిక నాణ్యతాప్రమాణాలను మెరుగు పరచగలగాలి లేదా కనీసం నిలపగలగాలి. ఆ ఉద్దేశంతో, ఈమాటను మాసపత్రికగా ఏడాది పాటు ఒక ప్రయోగంగా ప్రచురించాలని, ఆపైన మంచిచెడ్డలు బేరీజు వేసుకుని ఈ మార్పు శాశ్వతం చేయడమా లేదా అని నిర్ణయించాలని మా ఆలోచన.
- రచయితలు, పాఠకులు, ఈమాట మాసపత్రికగా మనగలిగేందుకు పూర్తి సహాయ సహకారాలందిస్తారని ఆశిస్తున్నాం. పదేపదే చెప్తున్న మాటే మరొక్కసారి – ఈమాట ఉనికి మీమీదే ఆధారపడి ఉంది. మీ ప్రోత్సాహం, ఆదరాభిమానాలే ఈమాట సాహితీప్రయాణానికి వెన్నుదన్నులు.
- బహుముఖీనమైన సాహిత్యాన్ని ఈమాట పాఠకులకు అందిస్తూ పత్రికను మరింత సమర్థవంతంగా నడిపేందుకు గాను – అవినేని భాస్కర్, గాలి త్రివిక్రమ్, సత్తెనపల్లి సుధామయి – ఈమాట సంపాదకులుగా ఈ సంచిక నుండి బాధ్యతలు స్వీకరించారు. వారికి మా హార్దిక స్వాగతం, మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రయాణంలో మాకు తోడుగా నిలుస్తున్నందుకు సంతోషం.
- ఈ మార్పులలో భాగంగానే ఈమాటను సురేశ్ కొలిచాల అధ్యక్షతన ఒక సరికొత్త రూపంతో, పూర్తిస్థాయి సాంకేతిక హంగులతో మీ ముందుకు తెస్తున్నాం. ఈ కొత్త రూపం మీకు నచ్చుతుందని, ఈమాటను చదవడాన్ని మరింత అనువుగా ఆహ్లాదంగా చేస్తుందని మా నమ్మకం. అన్ని సౌకర్యాలూ చక్కగా పని చేసేలా చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు. కొద్దిగా ఓపిక పట్టమని మా మనవి. ఈ కొత్తరూపంపై మీ అభిప్రాయాలకూ, ఆక్షేపణలకూ సదా స్వాగతం.
(గత కొద్దికాలంగా మాకు తమ తమ అభిప్రాయాలు చెప్తూ సలహాలిస్తూ మాకోసం వారి విలువైన కాలాన్ని వెచ్చిస్తున్న స్నేహితులు పరుచూరి శ్రీనివాస్, చామర్తి మానస, భైరవభట్ల కామేశ్వరరావు, వేల్పూరి సుజాత, తమ్మిరెడ్డి పూర్ణిమలకు మా కృతజ్ఞతలు.)
ఈ సంచికలో:
- కథలు: శ్రీ వినాయక లాండ్రీ సర్వీస్ – ఆర్ శర్మ దంతుర్తి; ఏకాంతం కోసం – శారద; పాకశాలలో పాణినీయం – చంద్ర మోహన్; తానొకటి తలిచిన… – బులుసు సుబ్రహ్మణ్యం; కోటిగాని కతలు-బత్తాయిలు పోయినాయి – పాలపర్తి ఇంద్రాణి; ఒకనాటి యువ కథ: గోల – పురాణం సుబ్రహ్మణ్య శర్మ (పునర్ముద్రణ).
- కవితలు: అసలు సంగతి, చిరునవ్వు కోసం, అట్లా చేశానా, జాగరణ, శైవలిని – శివలెంక రాజేశ్వరీదేవి; దండోరా – సాంఘిక; గుప్పిట ప్రేమ – పాలపర్తి ఇంద్రాణి; ఏమో?! – విజయ్ కోగంటి.
- వ్యాసాలు: రాసక్రీడాష్టకం – జెజ్జాల కృష్ణమోహన రావు; చిత్రకవిత్వ రీతులు – తిరుమల కృష్ణదేశికాచార్యులు.
- సమీక్షలు: ఐదు కవితలు-శివలెంక రాజేశ్వరీదేవి – మానస చామర్తి; ఒక సందిగ్ధ స్వప్నం: వానొస్తద? – విన్నకోట రవిశంకర్.
- శీర్షికలు: నాకు నచ్చిన పద్యం: విద్వాన్ విశ్వం ఆధునిక స్వరం – భైరవభట్ల కామేశ్వరరావు; స్వగతం: మొక్కు పెట్టని ఫలితం – పూడూరి రాజిరెడ్డి; గడి నుడి 3 – కొల్లూరు కోటేశ్వరరావు; పదబంధప్రహేళిక1 – శ్రీశ్రీ (పునర్ముద్రణ).
- శబ్దతరంగాలు: జిక్కి పాడిన మూడు పాటలు – పరుచూరి శ్రీనివాస్; సంగీత కళా రహస్య నిధి భట్టుమూర్తి – అందుకూరి చిన పొన్నయ్య శాస్త్రి (సమర్పణ: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయ్).