పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. రాంగ్ నంబర్! గురించి Venkat Suresh అభిప్రాయం:

    01/02/2016 4:17 am

    చాలా బాగుంది మీ అనువాధం. ముగింపు చదివాక బాధగా అయిపొయింది మనసు.

  2. ప్రాకృతకవనము: సేతు బంధ కావ్యము గురించి రవి అభిప్రాయం:

    01/01/2016 10:33 pm

    మాన్యులు మురళీధరరావు గారికి,

    ప్రణామాలు. ఎంతో దయతో చదివి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. ఉత్సాహమూ, తపన తప్ప పాండిత్యమూ, ఇతర సమగ్రసాధనాసంపత్తి లేని పరిస్థితి నాది. మీరు ఉటంకించిన రాధాగోవింద బసక్ గారి పుస్తకమూ, ఇతర సమాచారమూ ఇప్పుడే తెలిసింది.

    కావ్యమాలాసిరీస్ వారి సేతుబంధంలో అపపాఠాలు అలానే ఉన్నాయి. వాటిని సవరించే ధైర్యం లేకపోయింది. మీరు చూపించిన సవరణలు, స్ఖాలిత్యాలు ఇకపై దిద్దుకుంటాను.

    జిజ్ఞాసువు,
    రవి.

  3. సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి కటకటా! అభిప్రాయం:

    01/01/2016 5:49 pm

    సంపాదకులకు:

    రెండు విషయములపై నాగరికచర్చ అవసరము.

    1. ” ఇది వ్యాసము రాయు తీరు కాదు కదా,” అని మీరు ఆఖరిమాటగా తీర్పునిచ్చి యున్నారు. వ్యాసము రాయు తీరు, ” ఈ విధము,” అని నిర్థారించుట కష్టమని మీకు తెలిసే ఉండును. వ్యాసము ఎట్లు రాయవలెను అనెడి మకుటముతో ఒక వ్యాసము రాయవలసి ఉన్నది. ( పుస్తకములు ఎట్ట్లు అచ్చు వేయవలెను, అనే శీర్షికతో మీ పత్రికలో వచ్చిన తీరు వలె!)

    అటులనే కథ, నవల, విమర్శల తీరులపై పుస్తకములే రాసిన సాహితీవేత్తలున్నారు. అయిననూ, అవి Cast in Concrete అని చెప్పుట సమంజసమా?

    2. కాల్పనిక సాహిత్యమంతయు కథ అన్న శీర్షిక కింద గోగోరా రచనని జమ కట్టడం ఆరోగ్యము కాదుకదా! కల్పనలో కథ ఉండవచ్చు; కాదనను. కాని, కథలన్నీ కల్పనలు కావుకదా? ఉదాహరణకి: దినపత్రికలలో సంపాదకుడు, Print the story or Kill the story అంటారని మీకు తెలియదా? వారి భాషలో వార్తలు కథలు. పోతే పేరడీలు కథలా? కాదని నేను అంటాను. కాదంటే అవుననిలే, అవునంటే కాదనిలే అని మీరు పాడుకొన్నచో నాకభ్యంతరము లేదు.

    మీరు ఏర్పరచుకొన్న Template లోకి దీనిని బలవంతముగా తోసి మీ అభిరుచులు మా బోంట్లపై రుద్దుట అసమంజసము కదా!

    ఒక ఉచిత సలహా. “అవీ, ఇవీ” అనో “కలగాపులగం” అనో “పేరడీలు” అనో, Not in A Serious Vein, అనో వేరొక శీర్షిక ప్రవేశపెట్టుట సమంజసము అని నా అభిప్రాయము. అయిననూ,మీ పత్రికకు ఉచితముగానైనా సలహా ఇచ్చుటకు నేనెవరిని గనుక?

    విధేయుడు,

    కటకటా!

  4. సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి కటకటా! అభిప్రాయం:

    01/01/2016 4:03 pm

    ఈమాట సంపాదకులకి:

    సంపాదకుని తిరస్కరణలేఖ కథ కాదు. మీరు కథగా అచ్చొత్తించటం అసమంజసము. ఇది “వ్యాసము” అనబడు శీర్షిక పరిథిలో ఉండుట సమంజసము.

    రిగార్డులతో,

    కటకటా!

    [ఒకానొక సంపాదకుడు శ్రీశ్రీ కవితను ఈ విధముగా తిరస్కరించుట రచయిత యొక్క కల్పన. అందవలన ఇది కథయే. ఇది వ్యాసము రాయు తీరు కాదు కదా. – సం.]

  5. ప్రాకృతకవనము: సేతు బంధ కావ్యము గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    01/01/2016 1:28 pm

    శ్రీ రవి గారికి
    నమస్కారములతో,

    అమోఘమైన మహారచనను అద్భుతావహంగా పరిచయం చేశారు. ఇందాక శబ్దతరంగాలలో శ్రీ వెంపరాల వారి కంఠస్వనాన్ని విన్న వెంటనే వచ్చి చదివిన ఈ మీ వ్యాసం నాకు ఎంతో హృద్యమై, అభినందించాలనిపించి సంక్షిప్తంగా వ్రాస్తున్నాను. మీ మాటలలో కొంత పుట్టపర్తి వారి ప్రసంగధోరణి, రాయలసీమ పలుకుబళ్ళు చక్కటి సమన్వయాన్ని పొందాయి. అది బహుధా ప్రశంసనీయం.

    అయితే, సేతుబంధ కావ్యాన్ని అధికరించిన సద్విమర్శలు, ప్రవరసేనుని చరిత్రను గురించిన పెక్కు వాదోపవాదాలు బహుళంగా అచ్చయి అందుబాటులోనే ఉన్నాయి. ఉపాధ్యే గారు, జయస్వాల్ గారు, రాఘవన్ గారు, మానవల్లి రామకృష్ణకవి మహోదయులు, ఇంకా విద్వాంసులనేకులు ఈ విషయమై సాకల్యములైన పరిశోధనలు చేశారు. మీరు కావ్యమాలలో సంకలితమైనదానిని గాక 1959లో అచ్చయిన రాధాగోవింద బసక్ గారి సేతుబంధ ముద్రణను చూచివుంటే ఎన్నో చారిత్రికాంశాలను, సుష్ఠుపాఠాలను గ్రహించే వీలుండేది. వీటి తోడ్పాటు లేకుండానే మీరు చూపిన ప్రాకరగ్రంథాల సమాచారంతోనూ, స్వీయాన్వయసంపత్తితోనూ మీరు ఇంత సహృద్విశదమైన చక్కని వ్యాసరచన చేయగలగటం నిజంగా ముదావహం.

    అంతంలో మీరు ఉదాహరించిన కృష్ణకవి భరత చరిత శ్లోకం ఈ విధంగా ఉండాలి. లేకుంటే అన్వయింపదు:

    జడా(లా)శయస్యాంత రగాధమార్గ మలబ్ధరన్ధ్రం గిరి చౌర్యవృత్త్యా
    లోకేష్వలఙ్కాన్త మపూర్వసేతుం బబంధ కీర్త్యా సహ కుంతలేశః.

    అని. వ్యాసంలో ప్రవరసేనుని పాఠగ్రహణం ఇంకా శ్రద్ధగా చేయవలసి ఉన్నది. ఒక్క చిన్న ఉదాహరణ:

    “దీసఇ విద్దుమఅమ్వం సిన్దూరాహఅగఇన్దకుమ్భచ్చాఅమ్
    మన్దరధాఉకలఙ్కిఅవాసుఇమన్డలనిఅక్కలం రఇవిమ్వమ్.”
    ఛాయ: దృశ్యతే విద్రుమాతామ్రం సిన్దూరాహతగజేన్ద్రకుంభచ్ఛాయామ్
    మన్దరధాతుకలఙ్కితవాసుకిమండలనిశ్చక్రలం రవిబిమ్బమ్.

    అన్నది చూడండి: ఇక్కడ అన్వయం సరిగా లేదని తెలుస్తూనే ఉన్నది. గాథ –
    “దీసఇ విద్దుమఅంబం సిందూరారుణగడందకుంభచ్ఛాఅం, మందరధాఉకలంకిఅ వాసుఇమండలణివకలం రవిబింబం.” అనీ; దాని ఛాయ “దృశ్యతే విద్రుమతామ్రం సిన్దూరారుణగజేన్ద్రకుమ్భచ్ఛాయం, మన్దరధాతుకలఙ్కితవాసుకిమణ్డలవర్తులం రవిబిమ్బం.” అనీ ఉండాలి. లేకుంటే అర్థాన్వయం తప్పవుతుంది. అది సిందూరాహతం కాదు; సిందూరారుణం.

    పైని ఉదాహరించిన రెండు పూర్వముద్రణలలోనూ అపపాఠాలున్నాయి. సేతుబంధానికి సరైన ముద్రణ ఇంకా వెలువడవలసే ఉన్నది.

    కాళిదాసే సేతుబంధ కర్త అన్నది రామదాస వ్యాఖ్యలోనే గాక ఆంధ్రదేశంలోనూ ప్రచారంలో ఉన్నది. ‘మహాకవి కాళిదాసు’ సినిమాలోనూ కాళిదాసు (అక్కినేని నాగేశ్వరరావు) “ఇది నేను వ్రాసిన సేతుబంధ కావ్యం” అంటాడు. ప్రవరసేనుని గురించి ఇతరానేకగాథలనూ ఆంధ్రదేశంలో చెప్పుకోవటం ఉన్నది.

    వ్యాసం చివర మీరు సర్వసేనుని హరివిజయం కాలగర్భంలో అంతరించిపోయిందని ఎందుకు వ్రాశారో, తెలియలేదు. ఉపలభ్యమైనంత మేర అది అచ్చయి ప్రచారంలో ఉన్నదే.

    ఇవి గాక, మీరు ఇక్కడ, ఇతరత్ర లేఖనంలోనూ ప్రత్యయాంతాన్ని “కవిత్త్వము”, “అసాధారణత్త్వము”, “విలక్షణత్త్వము”, “దుష్కరత్త్వము”, “భావుకత్త్వము” అని ఎందుకు వ్రాస్తున్నారు?

    వ్యాసంలో చర్చనీయాంశాలు అనేకం ఉన్నాయి. ఆ చర్చ ఇప్పుడు కాదు. ప్రకృతం మీ కృషి అభినందనీయమని చెప్పటం వరకే.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  6. గేయపినవీరభద్రీయము గురించి Dr Sastry B Cherla అభిప్రాయం:

    01/01/2016 11:44 am

    Kudos and congratulations to the writer Dr Desikachary and the singer Smt Ratna Sastry for an excellent job. This should be presented as a dance drama to a wider audience to promote Telugu literature and culture. I do hope more such writings will be forthcoming from the author.

  7. వెంపరాల వారి సాహిత్య యాత్ర గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    01/01/2016 10:19 am

    శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి
    నమస్కారములతో,

    ముప్ఫైఅయిదేళ్ళ క్రితం విజయవాడ ఆకాశవాణిలో ఉద్యోగిస్తుండిన తరుణంలో ఢిల్లీలోని ఆర్కైవ్సుకోసం 1979లో నేను రికార్డు చేసిన ఈ అపరపతంజలి కంఠస్వనాన్ని మళ్ళీ ఇన్నాళ్ళకు మీ పుణ్యాన వినటం సాధ్యమయింది. దీనిని వెలికితీసి సూర్యాలోకాన్ని కల్పించిన మీకు కృతజ్ఞతతో ఎన్ని మెప్పుల కుప్పలని చెప్పినా తక్కువే.

    శ్రీ శాస్త్రిగారు సర్వం ఆశుగతిని చెబుతుంటే రికార్డు చేయాలని అనుకొన్నాను కాని, వాగ్ధోరణిలో వ్యర్థపదాలు దొర్లవచ్చునని, ఒక్క క్షణంకూడా వృధ కారాదని వారు దానిని ఆనాడు ముందుగా వ్రాసికొని చదవటం జరిగింది. అందువల్లనే వ్యావహారికంలో కొంత గ్రాంథికత తప్పలేదు. శ్రీవారి గురుదేవులైన పూజ్యపాదులు శ్రీ దర్భా సర్వేశ్వరశాస్త్రివరేణ్యుల చిట్టచివరి తరం శిష్యులు మా గురుదేవులైన శ్రీ తమ్మన వేంకటేశ్వరరావు గారు కావటం వల్ల ఆరోజు నేను వారింట శిష్యరూపునిగా వారి ఆతిథ్యానికి నోచుకోగలిగాను. నాకు చిత్రకవిత్వాభిమానం ఉన్నదని ఆరోజు వారు, “నేనూ ఒక నాగబంధమును వ్రాసితినండీ” అంటూ, అనర్ఘమైన ఈ నాగబంధపద్యాన్ని ధారణవశాన అలవోకగా వినిపించారు:

    శివ పరమేశ పావన యజేయగతిక్రమ దాంతమోహనా
    భవ నగచాప దేవబలపాలన భవ్యశరీరకాంతివై
    భవజితపారదా వరకృపాకృతి ధర్మపరా రమాజశా
    త్రవ గిరిజామనోవనజరంజదహస్కర నాగబంధనా.

    అని. ఆ తర్వాత ఇది నాకు లభ్యపడిన వారి ముద్రితకృతులలో కానరాలేదు. ఎందులో ఉన్నదో ఇంకా అన్వేషింపవలసి ఉన్నది. వారి చాటుకృతులు సైతం అచ్చుకావాలి.
    ఆ ఉచ్చారణను, ఆ పలుకుబడిని వింటుంటేనే వశీకృతపాణినీయులై సూత్రకార వృత్తికార భాష్యకార మునిత్రయచరిత్రను వ్రాసిన ఆ మహానుభావుని శబ్దాధికారం ఎటువంటిదో సువ్యక్తమవుతూ ఉన్నది. ఆ మూర్తిని మళ్ళీ మీరు శబ్దతరంగాల రూపాన కన్నులకు కట్టారు.

    దీనిని అప్పుడే ఆకాశవాణి సరిక్రొత్తగా కొనుగోలుచేసిన స్విట్జర్లాండు నాగ్రా టూ ఛానెల్ స్పూలు రికార్డరుతో తొలి రికార్డింగును చేయటం జరిగింది. ఆరోజే శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి అనుభవాలను కూడా రికార్డుచేశాను. అప్పటి క్యూషీట్లు, వారి వారి వ్రాతప్రతులు ఇంకా ఉన్నాయో లేవో. ఇవి పూర్తయిన ఒక వారం రోజులకు అప్పికట్లకు వెళ్ళి శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారి ఇంట్లో రెండు రోజులుండి వారి అనుభవాలూ, జ్ఞాపకాలను రికార్డు చేశాను. మీ కృషిఫలంగా అవీ వెలుగులోకి రాగలవని ఎదురుచూస్తుంటాను.

    అమేయశ్రద్ధతో శుభ్రపరచి దీనిని పునఃశాశ్వతీకరించిన మీకు ధన్యవాద సాహస్రితో,

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  8. మనుచరిత్రము – మాఘములలో పురస్త్రీ విలాసముల పోలిక గురించి రవి అభిప్రాయం:

    01/01/2016 8:51 am

    చాలా అమూల్యమైన వ్యాఖ్య చేశారు.

    >>”పైఁడిగోళ్ళు”

    మీరు చెప్పిన అర్థమే సరిపోతుంది. వావిళ్ళ (శేషాద్రి రమణ కవుల వ్యాఖ్యానం) వారి ప్రతి చూస్తే మీరు చెప్పిన అర్థమే చెప్పారు. పసిడిపూత అన్న అర్థం మరెక్కడో చూశాను. ఇప్పుడు గుర్తు రావట్లేదు.

    సంస్కృతంలో సాధారణంగా ఒక శ్లోకంలో ఒక్క పదచిత్రమే కూర్చడం జరుగుతోంది. తెలుగులో (అచ్చర యొక్క) మూడు నాలుగు విలాసాలను ఒకే పద్యంలో కూర్చడం కనిపిస్తుంది. ఇది తెలుగు కవితలో ఉన్న సౌలభ్యమూ, సంస్కృతానికి భిన్నంగా తెలుగులో ఏర్పడిన కవిత్త్వ రీతి అని అనుకుంటున్నాను. అలాంటివి సంస్కృతంలో లేకపోలేదు కానీ బహుళం కాదు. బహుశా సంస్కృత కవిత్త్వ ఆరంభం/ప్రస్థానం అనుష్టుప్పు వంటి లఘు ఛందస్సులతో జరగటం మూలాన, సంస్కృతంలో ఉన్న కర్మణి ప్రయోగాల వలన ఆ రీతి అక్కడ విరివిగా లేదు. ఇంకా లోతుగా పరిశీలించదగిన విషయం ఇది.

    తెనుగు కున్న ఈ సౌలభ్యాన్ని పెద్దన చాలా ప్రతిభావంతంగా పూర్తిగా పిండుకున్నాడు. 🙂 రసధ్వని కి ఇది ఒక ముఖ్యకారణం కావచ్చు.

  9. మనుచరిత్రము – మాఘములలో పురస్త్రీ విలాసముల పోలిక గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    12/31/2015 10:26 am

    వ్యాసం అద్భుతః! మనుచరిత్ర, మాఘమూ రెండూ రెండే అయినప్పటికీ, పెద్దనగారి రచన కొంచెం ఎక్కువ మనోహరం! మాఘుని వర్ణనలలో అలంకారశైలి ఎక్కువగా కనిపిస్తే పెద్దనగారిది ధ్వనిమార్గం అనిపించింది. మాఘునిలో ఉన్న ధ్వని కూడా వస్తు అలంకార ధ్వనులకి ఎక్కువగా పరిమితమయితే, పెద్దనగారిది చాలావరకూ రసధ్వని! పైగ తేనెలూరే తీయని తెలుగాయె. మధురమూ మనోహరమూ కాక ఏమవుతుంది!

    అందరూ అప్సరలే అయినా ఒకొక్కరూ ఒకో రకం. వేర్వేరు అవస్థలు, వేర్వేరు స్థితులు. ప్రయోగించిన పదాలూ, కట్టిన చిత్రాలూ ఆయావాటికి సరిగ్గా తగినవిధంగా కూర్చడం ఆ కవిత్వంలో సహృదయ పాఠకులు గమనించి మురిసిపోయే అంశం.

    “ఒక నేత్రాంబుజ మొక్క గల్లము” అన్న పద్యంలో ఉన్నది పురంధ్రీరత్నం కాబట్టి, ఆమెకి మిగిలిన అచ్చరల మాదిరి గబుక్కున పరుగులుపెట్టే స్వైరవిహారం లేదు కాబోలు! అయినా రాకుమారుని చూడాలనే మనసు ఉవ్విళ్ళూరుతోంది. అంచేత తలుపు ఓరగా నిలుచుని చూడడం. అలా చూడడంలో కూడా ఒక ఒయ్యారపు లీల ఉంది! అంచేత యిది కూడా నిస్సంశయంగా శృంగారభావమే తప్ప అన్యం కాదు.

    ఇక, నాకు స్ఫురించిన ఒకటి రెండు అర్థాంతరాలు:

    >>”పైఁడిగోళ్ళు” – “వీణ తీవెల తాలూకు పసిడిపూత ఆమె వ్రేలికి అంటుకున్నది.”
    ఇవి వీణ తీగలు మీటేందుకు గోళ్ళకు పెట్టుకొనే తొడుగులని నా భావన.

    >>రాకుమారుని రాక కోసం పడిగాపులు గాచి, అలసినదన్న భావం వ్యంగ్యముగా అవులింతచేత సూచితము.
    పద్యంలో ఉన్నవి ప్రమదాశ్రువులు కదా. పైగా చెదరిన ముంగురులు కూడా వర్ణితం. ఇవి విరహాన్ని కాక, సంభోగ రతి భావాన్నే ధ్వనిస్తున్నాయి. కాబట్టి ఆవులింత కూడా రతిచేత కలిగిన అలసటనే భావించడం ఉచితం అనిపిస్తోంది.

  10. హైకూలు గురించి వెంకటేశ్వరరావు అభిప్రాయం:

    12/30/2015 3:09 pm

    ఆమె స్పర్శ–
    మత్తు నిద్రలో
    అతడి సమ్మతం.

    ***
    హైకూలు
    అరి సీతారమయ్య గారి
    కలం నుంచి జారాయి