పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. నాచన సోమన అపురూప పద సంచయం గురించి గిరి అభిప్రాయం:

    12/27/2008 5:54 pm

    మీది విలక్షణమైన ప్రయత్నం. ధన్యవాదాలు

  2. మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి Rohiniprasad అభిప్రాయం:

    12/26/2008 5:59 pm

    లైలాగారూ,
    నా దగ్గర వీణ పుస్తకం లేదు. కుడిచేతికి దగ్గరి తీగను మొదటిది అన్నాను.

  3. మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి lyla yerneni అభిప్రాయం:

    12/26/2008 4:11 pm

    “కుడిచేతి చూపుడు, మధ్యవేళ్ళతో ఒకేసారిగా మొదటి, మూడో తీగలను మీటుతూ, మధ్యమ, మంద్రస్థాయిల్లో స్వరాలను శాస్త్రిగారు పలికించడం బ్రహ్మాండమైన నాదాన్నిచ్చేది.” -Rohiniprasad.

    వీణ తీగలను లెక్కించటం పద్ధతి – వీణ దండం మీద, వైణికుడికి అన్నిటికన్నా దూరంగా ఉన్న ( ఇత్తడి)తీగె మొదటిది, అన్నిటికన్నా దగ్గరగా ఉన్న (ఉక్కు) తీగె నాలుగవది కాదా రోహిణీ ప్రసాద్ ?

    ” అనుమంద్ర పంచమానికి మొదటి తీగె, మంద్ర షడ్జమానికి రెండవ తీగె, పంచమానికి మూడవ తీగె, మధ్య షడ్జమానికి నాల్గవ తీగెను ఈ కాలంలో శృతి చేసున్నాం.” – ముదిగొండ వీరభద్రయ్య రచించిన వీణ -వీణాపాణులు అన్న పుస్తకము నుండి.

    సరస్వతి, నారదుడు ఏమిటండీ, 🙂 ఈమని శంకరశాస్త్రి వీణ ఈశ్వరుడే ఇష్టంగా వింటాడు. మన అదృష్టం బాగుంది. మనమూ విన్నాం. 🙂

    లైలా.

  4. మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి Rohiniprasad అభిప్రాయం:

    12/26/2008 1:46 pm

    వీణకు ఎలెక్ట్రికల్ పికప్ ఉపయోగించడం అనేది ఈమనివారికన్నా చిట్టిబాబు ముందుగా మొదలుపెట్టారని ఎవరో అన్నారు. దాని సహాయంతో అతిసున్నితమైన గమకాలను శాస్త్రిగారు అద్భుతంగా వాయించేవారు. కుడిచేతి చూపుడు, మధ్యవేళ్ళతో ఒకేసారిగా మొదటి, మూడో తీగలను మీటుతూ, మధ్యమ, మంద్రస్థాయిల్లో స్వరాలను శాస్త్రిగారు పలికించడం బ్రహ్మాండమైన నాదాన్నిచ్చేది. ఆయన బొటనవేలితో మూడో తీగను మీటితే సుర్ బహార్, గోటువాద్యం తరహాలో పలికేది.

    తన సంగీతాన్ని గురించి ఆయన స్వోత్కర్ష ధోరణిలో ‘మనదంతా చిన్నప్పటినించీ రిసెర్చ్ ధోరణే’ అని ఒకసారి అన్నారు కాని అదేమీ అతిశయోక్తిగా, అతిశయంగా అనిపించలేదు. కచేరీకి ముందు ఆయన బాగా సాధన చేసేవారనీ, ఆయన కచేరీకై ప్రేక్షకులు ముందుగానే వచ్చి కూచునేవారనీ తెలుసుకోవడం సంతోషకరం.

    నాకు సరస్వతీదేవిలోనూ, నారదుళ్ళోనూ నమ్మకం ఏమీలేదుగాని ఉంటేగింటే వాళ్ళు శాస్త్రిగారి కన్నా బాగా వీణ వాయించారని మాత్రం నేను నమ్మను!

  5. మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి mOhana అభిప్రాయం:

    12/26/2008 8:09 am

    ఒకప్పుడు (1968 ప్రాంతం అనుకొంటా) ఈమనిగారు భారతీయ విజ్ఞాన సంస్థలో వీణ కచేరీ చేశారు. హైవోల్టేజ్ ఇంజనీరింగ్ హాలులో ఏర్పాటు చేశారు కచేరీని. కచేరి ఆరంభం కావడానికి రెండు గంటలకు ముందే హాలు నిండింది. పక్క ఇంకొక హాలులో వినడానికి అవకాశాలు కల్పించారు. నాకు ఈ కచేరీలో ఇంకా జ్ఞాపకం ఉండేది ఏమంటే వారు వీణపై స్వరాలను పల్కించే విధానాన్ని ప్రదర్శించారు వివరాలతో. ఒకే సమయంలో రెండు లేక మూడు తంత్రులను వాయించడం ఇత్యాదులు. తరువాత వారు దర్శకత్వం చేసిన మంగళా వంటి చిత్రాలనుండి కొన్ని పాటలను కూడా వినిపించారు. రెండు మూడు గంటల కార్యక్రమం ఇంకా నా స్మృతిపథంలో మెదులుతూనే ఉంది. విధేయుడు – మోహన

  6. హిమపాతము గురించి గిరి అభిప్రాయం:

    12/26/2008 5:57 am

    మరొక మాట, మంచుతో కప్పబడిన పూపొదలను గున్నేనుగులతో పోల్చడం బావుందండీ

  7. హిమపాతము గురించి గిరి అభిప్రాయం:

    12/26/2008 5:46 am

    అత్యద్భుతంగా వ్రాసారండీ. మొదటి ఉత్పలమాల మూడవపాదానికి చేరేదాకా పూర్వకాలపు హిమపాత వర్ణ ననుకున్నాను, అక్కడ కారు కనబడడం వల్ల మీ దారి వే రని గమనించాను. మళ్ళీ పదవ పద్యం వరకూ అమెరికా వర్ణనేమో అనుకున్నాను – కానీ మీ దేశం వే రని తెలుసుకున్నాను. ఆరు పాదాల సీసం చదివే సరికి మీరు ఎటు తీసుకుని వెళితే అటు వెళ్ళడానికి సిధ్ధమై కూర్చున్నాను. అంతలోనే మీ పద్యధార ముగియడంతో, ఇదిగో ఇక్కడకొచ్చి పడ్డాను.
    మీకు నా వందనాలివే.

  8. తానాలో వేటూరి సుందరరామమూర్తి ప్రసంగం కొన్ని విషయాలు గురించి Mahesh అభిప్రాయం:

    12/26/2008 3:32 am

    అలా చెత్త పాటలు వ్రాయడమెందుకు అని వేటూరిగారు కలం సన్యాసం తీసుకునుంటే ఇంత మంచి పాటలు వచ్చేవి కావు . పది మంచి పాటలు వ్రాయడానికి తొంభై చెత్త పాటలు వ్రాయాల్సి వస్తుంది . ఆ పది మంచి పాటలకోసమైనా మిగతా చెత్త భరించక తప్పదు.

  9. రచయితలకు సూచనలు గురించి V V Raju అభిప్రాయం:

    12/25/2008 2:08 am

    ఈమాట తెలుగు పత్రిక ఒక మంచి ఆలోచన. తెలుగు భాషకు మీరు ఈవిధంగా సేవ చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపొతున్నాను. మీకు తెలుగుతల్లి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి.
    —— వి వి రాజు

  10. మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    12/24/2008 2:11 pm

    నా చిన్న తనంలో ఈమని శంకరశాస్త్రి గారు మాయింటికి చాలా సార్లే వచ్చే వారు. మా అమ్మతరపు బంధువాయన. కచేరీ ఉంటే ముందు ద్రాక్షారామం వెళ్ళి, అక్కడనుండి కోటిపల్లి రేవు దాటి అమలాపురం వచ్చేవారు. ప్రతీ ఏటా అమలాపురం త్యాగరాజ గాన సభ ఉత్సవాలకి తప్పని సరిగా ఈమని వారిది కానీ చిట్టి బాబుది కానీ కచేరీ ఉండేది. మా నాన్న ఆ సభకి కార్యదర్శి. ఈ వ్యవహారాలన్నీ మా నాన్నే చూసేవారు. కచేరీకొచ్చినప్పుడల్లా శంకరశాస్త్రి గారు మా ఇంట్లోనే దిగేవారు. ప్రతీ రోజు తెల్లవారు ఝామున నాలుగు నుండి ఉదయం ఏడు వరకూ కచేరీకొచ్చినప్పుడల్లా వీణా సాధన చేసేవారు. మా ఇంట్లో అవుట్ హౌస్ గదిలో ఈ సాధన చేసేవారు. నన్ను ఆయనకి సాయంగా ( ఏమైనా కావల్సి వస్తే ) ఉండమనే వారు. నాకు అప్పట్లో వీణంటే ఇష్టమున్నా సంగీతం గురించి ఏమీ తెలీదు. ఆయన కాఫీ త్రాగి సాధన మొదలెట్టేవారు. సాధన సమయంలో ఎవర్నీ రానివ్వద్దనీ మరీ మరీ చెప్పేవారు. ఓ సారి కచేరీకి సాధనకని కూర్చున్నారు. పక్కింట్లో పెళ్ళి వారు చెవులు దద్దరిల్లేలా బ్యాండు వాయి స్తుంటే సాధన చెడిపోయిందనీ ఆయన చికాకు పడడం నా కింకా గుర్తుంది. సాధన చేయకుండా ఎప్పుడూ కచేరీ ఇవ్వలేదని ఆయన చాలా సార్లే చెప్పారు. అది నేను ప్రత్యక్షంగా చూసాను.

    అమలాపురం కోనసీమా బ్యాంక్ ఆవరణలో చిట్టి బాబూ, ఈమని వారు కలిసి ఓ గంట సేపు ఒకసారి చిన్న కచేరీ ఇచ్చారు. ఇద్దరికీ సన్మానం చేద్దామని పిలిచారన్న గుర్తు. ఇది జరిగి చాలా ఏళ్ళయ్యింది. 1978 లో అనుకుంటాను. ఇద్దరూ కలిసి ఎక్కడా వీణ వాయించడం నాకు తెలీదు.

    ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఎంత సంగీతంలో ప్రావీణ్యం ఉన్నా సాధన చాలా అవసరమని ఆయన నమ్మి, పాటించేవారు. అందుకే ఆ కచేరీల్లో అంత నాణ్యతా కనిపిస్తుంది. ఈమని, చిట్టి బాబుల తరువాత వీణా వాయిద్యంలో తెలుగు వారి పేరే అంతగా వినిపించలేదు. ఈ మధ్యనే డి. శ్రీనివాస్ అనే ఆయన పేరు వినిపిస్తోంది. ఆయన కచేరీలు బావుంటాయనీ విన్నాను.