పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. ఛందస్సులో గణితాంశములు గురించి మోహన అభిప్రాయం:

    09/19/2012 8:52 pm

    కామేశ్వర రావు గారు, మీరు తెలియజేసిన విషయాలకు కృతజ్ఞుడిని.

    భ ర త నగ నల సలంబులు
    వరుసనె యియ్యాఱు లెన్న వాసవ గణముల్
    మరి న హము లిన గణంబుల్
    సరవిం దక్కినవి యెల్లఁ జంద్ర గణంబుల్
    – రేచన కవిజనాశ్రయము, సంజ్ఙాధికారము

    మనకు దొరికిన తెలుగు ఛందోగ్రంథాలలో కవిజనాశ్రయము ప్రాచీనమైనది. పోతే ఎంత ప్రాచీనమైనదో తెలియదు. దీని కర్త 11వ శతాబ్దపు వాడంటాడు. ఇతడు తప్పక నన్నయ, నన్నెచోడుల పిదప వాడు (ఈ విషయాలను కొన్ని నా క్రౌంచపద వ్యాసములో వివరించి యున్నాను). కాని ఎఱ్ఱనకంటె ముందు వాడు (మధ్యాక్కఱ యతి). అంటే సుమారు 12వ శతాబ్దానికే సూర్యేంద్ర గణములు బ్రహ్మ విష్ణు గణములకన్న భిన్నమైనదని కవిజనాశ్రయము ద్వార మనకు విదితమైనది. సంగభట్ల నరసయ్యగారు చెప్పిన విధముగా సూర్యేంద్ర గణములు 14వ శతాబ్దము నాటిదంటే, కవిజనాశ్రయము ఎప్పుడు వ్రాయబడినది అనే ప్రశ్న ఉదయిస్తుంది. అదియును కాక భీమన ఛందము అని కూడ పిలువబడే కవిజనాశ్రయమునకు, తరువాత వచ్చిన అనంతుని ఛందము అని పిలువబడే ఛందోదర్పణమునకు మధ్య అంతరము అంత ఎక్కువగా ఉండదు. కాని యతుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతుని ఛందము ఒక రెండు శతాబ్దముల పిదప వ్రాయబడినదని భావించవచ్చును. నా ఉద్దేశములో నన్నయ నాటికి బ్రహ్మ, విష్ణు గణాలు, సూర్య ఇంద్ర గణాలు రెండు ఉండి ఉన్నా, తెలుగులో ఎక్కువగా సూర్యేంద్ర గణాలే వాడబడ్డాయి. అదియునుగాక పంపకవి వ్రాసినట్లు చెప్పబడే తెలుగు సీస పద్యాలలో సూర్యేంద్ర గణాలే ఉన్నాయి.

    ఈ బ్రహ్మ విష్ణు గణాలు కూడ చాల ప్రాచీనమైనవి. సుమారు క్రీస్తు శకము 700 నాటికే బాదామి శాసనములో ఉండే కన్నడ త్రిపదిలో ఈ గణాలు వాడబడ్డాయి. మనకు లభ్యమైన కన్నడ పద్య శాసనములలో ఇది ప్రాచీనమైనది. అంటే ఆఱు, ఏడవ శతాబ్దముల నాటికే దేశి ఛందస్సు కన్నడములో నుండినది. సుమారు ఏడవ ఎనిమిదవ శతాబ్దపు ద్విపదలను పోలిన తెలుగు పద్య శాసనాలలో కూడ సూర్యేంద్ర గణములే వాడబడినవి, బ్రహ్మ విష్ణు గణములు కావు. అంటే ఈ రెండు భాషల మధ్య దేశి గణాలలో ఈ చీలిక నన్నయకంటె కొన్ని శతాబ్దాలకు ముందే ఉండినవి అన్నది నా ఉద్దేశము.

    సాగించి పాడే గణాలకు ఒక పేరు కూడ ఉన్నది. చివర వచ్చే సూర్య గణములవంటి గణములను పద్మ గణములు అంటారు. అలా పొడిగించి పాడవలయు నన్నప్పుడు, దానిని ఒక S గుర్తుతో చూపిస్తారు. ఈ పద్మ గణములను గురించి నేను ఐదు సంవత్సరాలకు ముందు ఇక్కడ వివరించి యున్నాను.

    విధేయుడు – మోహన

  2. తథాస్తు గురించి ప్రసాద్ అభిప్రాయం:

    09/19/2012 11:45 am

    ఈ కధా రచయిత, భర్త పాత్ర చేత భార్య పాత్రని లెంప కాయ వేయించడం ద్వారా, తాను కూడా (అంటే, “నేను” అనే పాత్ర మాత్రమే కాకుండా, రచయిత కూడా) భార్య పాత్ర చెప్పిన మాటలకి వ్యతిరేకమని రుజువు చేశాడు. రచయితలు, తమ కధల్లో, తాముగా గానీ, తమ ముఖ్య పాత్రల ద్వారా గానీ తమ అభిప్రాయాలని వెల్లడిస్తారు. ఏ పాత్రన్నా తమ అభిప్రాయాలకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, దాన్ని తానే విమర్శించడం (పాత్రల మాటల మధ్యలో వచ్చే వివరణలన్నీ రచయిత సొంత మాటలే) గానీ, ఇంకో పాత్ర చేత వ్యతిరేకించడం గానీ చేస్తాడు. అలా చెయ్యక పోతే, ఆ రచయిత ఆ భావాలతో అంగీకరిస్తున్నట్టే. రచయిత అనే వ్యక్తి ఒక వార్తా రిపోర్టరు కాదు, ఉత్త వార్తలు మాత్రమే చదివి వదిలెయ్యడానికి.

    ఈ కధలో రచయిత, తనకు మాలిన దాన,ధర్మాలు చెయ్యొచ్చనే చెప్పారు. అది కూడా, వద్దన్న పాత్రని లెంప కాయ వేసి. కనీసం, “భార్య మాటలని పట్టించు కోలేదు నేను” అని రాసినా, చరిత్ర చర్విత చర్వణం అవుతోంది అన్న అర్థం వచ్చి, రచయిత తప్పు లేకుండా పోయేది. లెంప కాయ ద్వారా, ఆ మాటలకి తానెంత వ్యతిరేకో తెలియ జేశాడు రచయిత. ఇదొక తెలివి తక్కువ కధ అనడానికి సందేహించ నక్కర్లేదు.

    ప్రసాద్

  3. కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012) గురించి ప్రయాగ వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి అభిప్రాయం:

    09/19/2012 6:53 am

    రోహిణీ ప్రసాద్ గారి అకాల మరణం నాకు చాల విచారం కలిగించింది. ‘ఈమాట’ లో మన భారతీయ సాంప్రదాయ మరియు సినిమా సంగీతం మీద వారి వ్యాసాలు ఎంతో విలువైనవిగా నేను భావిస్తాను. భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలగజేయాలని కోరుకొంటున్నాను.

    శాస్త్రి

  4. తథాస్తు గురించి ఉష అభిప్రాయం:

    09/19/2012 1:42 am

    నమస్కారం. కథ చాలా బాగుంది. ధన్యవాదాలు.
    లలిత పలికిన చివరి వాక్యాల కన్నా ముందు ఇది చూడండి-
    ఆ రోజు రాత్రి వెంకటేశన్ తన కుటుంబంతో సహా మా ఇంటికి భోజనానికి వచ్చారు. నా భార్య లలిత దాదాపు ఒక విందు లాగా హడావిడి చేసింది.
    లలిత మొదటి ప్రతిక్రియ భిన్నంగ ఉంది. మనుషులను చూశాకే ఆమె ఈ మాట అంది-
    వీళ్ళంతా పరాన్నజీవులలాగా ఎవరైనా దొరక్కపోతారా అని కాచుకొని ఉంటారు. మీ లాగా ఒక్కరు దొరికితే చాలు. అలాగే అంటుకు పోతారు.
    కనక అనుభవజ్ఞురాలని చెప్పవచ్చు. అందుకు అంతకు ముందు వెంకటేశన్ అనుభవం అదే కావటం నిదర్శనం. అది అతని నోటే రచయిత చెప్పాడు.-
    ఒక కాలంలో మా తాతగారు బాగా ఉన్నవాళ్ళు. ఒక్కొక్క రోజూ కనీసం పదిమంది వేరే ఊళ్ళవాళ్ళు వచ్చి భోజనం చేసి వెళ్ళేవాళ్ళు. నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. మా నాన్నగారు నాకు చాలా ఆర్భాటంగా పెళ్లి చేశారు. నా భార్య వచ్చి ఇంకా ఒక సంవత్సరం కూడా కాలేదు. ఒక రోజు నన్ను అడిగింది. “ఇదేమన్నా సత్రమా? ఊళ్ళో ఉన్న బిచ్చగాళ్ళందరికీ అన్నం పెట్టడానికి?” అంతే! ఇప్పుడు మేమే అన్నార్తులం అయిపోయాము.
    కనక లలితను కొట్టం తప్పు. ఆవేశంలో కొట్టినా ఆలోచించాక అయినా క్షమార్పణ చెప్పకపోవటం మరింత తప్పు. ఎవరికైనా భోజనం పెట్టటం, అవసరం లో ఉన్నవారిని ఆదుకోవటం తృప్తిగనే ఉంటుంది. కానీ అది అలవాటుగా మారకూడదు. ఏదైనా అలవాటు కాకముందే ఆపటం సరైన పని. వేంకటేశన్ భార్య ఆ మాట సంవత్సరం దాటబోయే ముందు అడిగింది. లలిత మాత్రం వెంటనే అడగగలిగింది. ఎందుకంటే జరగబోయే విపత్తులేవైనా భార్యాభర్తా కలిసి ఎదురుకోవాలి కనక. ఆమెకు ముందు చూపు ఉంది కనక. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలన్నారు కదా.
    తాహతుకు మించి దానధర్మాలు చేయమని ఏ శాస్త్రమూ చెప్పలేదు. అతి దానం వల్ల నశించిపోయినవారి కథలు మనకు తెలుసు. దానం షోకు కోసం, గొప్పకోసం చేయరాదని గీత కూడ చెబుతుంది. ఉన్నదాంట్లో దానం చేసుకుంటే పుణ్యం. అప్పులు చేసి మరీ దానాలు చేయటం లోకంలో అర్థం లేని పని.
    ఏదైనా మంచి ఆలోచింపచేసే కథ చదివించారు.

  5. కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012) గురించి T.Raja gopal అభిప్రాయం:

    09/18/2012 11:46 pm

    Sri Rohiniprasad gari sudden demise is a great loss to all Music lovers.
    He is a great Human being with Multiple Talents.
    We used have musical meets at his residence at hyd and learn many interesting thing on Music.
    We all miss him a lot.
    Rarely such great persons take birth.
    May his soul rest in Peace.

  6. తథాస్తు గురించి జయరాం అభిప్రాయం:

    09/18/2012 6:20 pm

    నిజమే… నాక్కుడా భర్త పాత్ర భార్యని కొట్టడం నచ్చలేదు. అక్కడ ఆ భర్త పాత్రని చాలా దయ కల వాడిగాను, మంచి చెడు ఆలోచించే వాడిగాను చూపించారు.

    ముందు తన భర్త ఇంటి పరిస్థితి ఆలోచించకుండా తలకు మించిన ధర్మం చేసినా మారు మాట్లాడకుండా తన కర్తవ్యం పూర్తిచేసిన తరువాతే, సలహా ఇచ్చింది. అటువంటి భార్య దొరికినందుకు ఆనందపడక ఆ పాత్ర ఎందుకు అలా చేసిందో (రచయిత అలా ఎందుకు చేయించారో) నాకు పాలుపోవట్లేదు.

  7. ఛందస్సులో గణితాంశములు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    09/18/2012 11:58 am

    సాహితీ స్రవంతి అనే మాస పత్రికలో ఈ నెల శ్రీ సంగనభట్ల నరసయ్యగారు వ్రాసిన “దేశిగణాలు ఎలా పుట్టాయి” అనే ఆసక్తికరమైన వ్యాసం ప్రచురించారు. అందులో ముఖ్యాంశాలు, ఈ వ్యాసంలో చర్చించిన విషయాలకు సంబంధించినవే కాబట్టి, వాటినిక్కడ యిస్తున్నాను:

    1. దేశిగణాలు ప్రధానంగా గేయాలనుండి పుట్టినవి. కాలఖండాల (సమ మాత్రలు) ఆధారంగా ఏర్పడినవి. ఒకేరకమైన కాలఖండాలు మళ్ళీమళ్ళీ వస్తే ఒక లయ ఏర్పడుతుంది.

    2. మోహనగారీ వ్యాసంలో సూర్య (న-హ) గణాల విషయంలో ప్రస్తావించిన విషయం వంటిదే ఇంద్రగణాలకు కూడా ఆ వ్యాసంలో నరసయ్యగారు చెప్పారు. అతని అంచనా మేరకు అసలు ఇంద్రగణాలు పంచమాత్రా గణాలే, నగ, సల, ర, త గణాలు. పాడేటప్పుడు చతుర్మాత్రా పదాలలో చివరి అక్షరమో, దాని ముందరి అక్షరమో గురువై అవికూడా పంచమాత్రా గణాలే అవుతాయి (ఉదాహరణకు, జలజల – జలజలా, రెక్కలు – రెక్కలూ/రెక్కల్లు). అయితే అవి వ్రాసినప్పుడు పంచమాత్రా రూపాలలో వ్రాయడానికి వ్యాకరణం అడ్డువస్తుంది. అంచేత వ్రాసేటప్పుడు చతుర్మాత్రా స్వరూపంలోనే వ్రాయడం వలన, వాటిని కూడా (భ, నల) ఇంద్రగణాలలో చేర్చేసారు. సూర్యగణాలు కూడా ఒక రకంగా పంచమాత్రా గణాలే! నరసయ్యగారి ఉద్దేశంలో పాటలో గణాలను కొలిచేటప్పుడు లఘువు, గురువు, నిశ్శబ్దం అనే మూడు రకాల కొలతలను వాడాలి. ఉదాహరణకు:
    “తొలికోడి కనువిచ్చి నిలిచి మై వంచి”
    అన్న పాదంలో చివరి “వంచి” పదం పాడేటప్పుడు “వంచీ” అవుతుంది. ఆ తర్వాత ఒక మాత్రా కాలం నిశ్శబ్దం. ఆ తర్వాత రెండవ పాదం మొదలవుతుంది. అంచేత అది కూడా నిజానికి పంచ మాత్రా గణమే! అందుకే సాధారణంగా సూర్యగణాలు పాదం చివరనే ఉంటాయి. నాకు నరసయ్యగారి అభిప్రాయం సమంజసంగానే అనిపించింది. మాత్రక లెక్కింపులో నిశ్శబ్దం అనేది ఇంగ్లీషు ఛందస్సులో కూడా ఉంది! అయితే, ఆటవెలది వంటి ఛందస్సులకు యిది వర్తిస్తుందా అని సందేహం.

    3. దేశిగణాలు పైన పేర్కొన్న విధంగా ఏర్పడి ఉండాలి. గురు లఘువుల ప్రస్తారం ద్వారా ఏర్పడ్డాయని అనుకోడానికి లేదు. అది అక్షర ఛందస్సునుండి వచ్చినది, దేశిగణాలకు కృతకమైనది.

    4. చంద్రగణాలు తెలుగులో ఎక్కవగా లేకపోడానికి కారణం, ఒకటి అంత పెద్ద పదాలు తెలుగులో అరుదుగా ఉండడం, రెండు ఆ గణాలు సూర్య ఇంద్ర గణాలుగా విడిపోయే అవకాశం ఉండడం.

    5. 14వ శతాబ్దం వరకూ కన్నడంలోని బ్రహ్మ, రుద్ర, విష్ణుగణాలూ తెలుగులో సూర్య, ఇంద్ర, చంద్రగణాలూ ఒకటే. ప్రస్తారంలో వచ్చే మొదటి రెండు గణాలూ తొలగించడం ఆ తర్వాత జరిగింది.

  8. విలువలు: కథ నచ్చిన కారణం గురించి తః తః అభిప్రాయం:

    09/18/2012 11:35 am

    ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు బసవ రాజు గారు. ఆయన సమవయస్కులైన సహాధ్యాయులైన ఇతర ఉపాధ్యాయులతో వాళ్ళ విద్యార్థి రొజుల్ని “మనం చదువుకోని రోజుల్లొ” అని గుర్తు చేసేవారు.

    తఃతః

  9. విలువలు: కథ నచ్చిన కారణం గురించి swaroopa అభిప్రాయం:

    09/18/2012 6:37 am

    తెలుగుతల్లిని బ్రతికించినందుకు వందనాలు. చాలా బాగున్నాయి.

  10. కిటికీ గురించి rama bharadwaj అభిప్రాయం:

    09/17/2012 2:50 am

    నేను గుర్తించాను ప్రసాద్ గారూ! నేను మీ అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను. నేను చెప్పింది మామూలుగా అనువాదం చెసేటప్పుడు ఎదురయ్యే వివిధరకాల సమస్యలని గురించి మాత్రమే!! అనువాదాల్లో అయినా సరే అనువాదపు భాష తెలుగు కాబట్టి, వాక్యం తప్పకుండా తెలుగు వాక్య నిర్మాణం లోకి వొదగాల్సిందే!!

    అందులో విభేదించవలసిన విషయం ఎవరికైనా ఏముంటుందీ?? మీరు దిద్దిన వాక్యం బాగుంది. శారద గారు సైతం ఒప్పుకున్నారు కదా మీ దిద్దుబాటుని. ఇంక అనువాదాల్ని గురించి మీకున్న అభిప్రాయాలని తప్పక చెప్పండి. కొత్త సూచనలు ఎప్పుడైనా ఎవరికైనా ఉపయుక్తమైనవే అవుతాయి కదా!

    రమ.