పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. యథార్థ చక్రం -6 గురించి తమ్మినేని యదుకుల భూషణ్. అభిప్రాయం:

    09/14/2009 2:13 pm

    వచించువాడు వక్త. ప్ర అన్న ఉపసర్గ చేరితే వచనం ప్రవచనమవుతుంది. అదే విధంగా వక్త ప్రవక్త అవుతాడు.బ్రహ్మానందం గారు సాధించిన క్రియారూపం (ప్రవక్తించడం)శుద్ధ తప్పు.ప్రవచించడం అని ఉండాలి.

    తప్పుల పరంపర ఇక్కడితే ఆగిపోతే బావుండేది.అంతం కాదిది ఆరంభం. క్షమించరాని తప్పు: థేరవాదాన్ని తెరవాదంగా ఉటంకించడం.ఈ రూపాన్ని వీరెలా సాధించారో నాకు అర్థం కాలేదు.థేర పాళీ పదం; అర్హతుల శ్రేణిలో పెద్ద అన్న అర్థంలో వాడతారు.(థేరి, థేరిక అన్న స్త్రీలింగ రూపాలు కూడా ఉన్నాయి.).నవ భిక్కు, థేర భిక్కు అని భిక్కులమధ్య స్థాయీభేదం సూచించడానికి కూడా వాడతారు.ఆంగ్లంలో Thera అనే రాస్తారు. తెరవాదానికి ఎలా తెర తీశారో నాకు అంతుబట్టలేదు.

    “నేను ఈ సౌందర నందం కథ గురించి చదివేక బౌద్ధం గురించి అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న బౌద్ధాన్ని మహాయాన బౌద్ధంగా పరిగణిస్తారు. ఈ మహాయాన బౌద్ధం బుద్ధుని తరువాత కాలక్రమేణా రూపాంతరం చెందిన బౌద్ధం. అసలు బుద్ధుడు ప్రవక్తించిన బౌద్ధాన్ని తెరవాదం అంటారు. ఆ తెరవాదమే కొంతగా కథలో రాయడం జరిగింది. మధ్యలో హీనయాన బుద్ధిజం అనేది ఒకటి పుట్టుకొచ్చింది. కానీ అది ఎంతో కాలం నిలువ లేదు. ఈ మహాయాన బౌద్ధమే ఇప్పుడు శ్రీలంక, బర్మా, థాయిలాండ్, ఇండోనేషియాల్లో ఉంది. జపనీయులు కొంతమంది తెరవాదాన్ని, కొంతమంది మహాయానాన్ని పాటిస్తారు. బౌద్ధం గురించి చదువుతుంటే అనేక వాస్తవాలు తెలిసాయి”

    ఈ పేరాలోని వాక్యాలన్నీ పరస్పర విరుద్ధాలే.యథార్థచక్రానికి నిరాఘాటంగా అడ్డుపడేవే.

    1.ప్రస్తుతం ఉన్న బౌద్ధాన్ని మహాయాన బౌద్ధంగా పరిగణిస్తారు.
    ఏ దేశంలో ఉన్న బౌద్ధాన్ని అలా పరిగణిస్తారు ?? శ్రీలంక,బర్మా,థాయిలాండ్,కాంబోడియా,లావోస్ లోని బౌద్ధం మహాయానం కాదే. చైనా,జపాన్,వియత్నాం,కొరియాల్లోని బౌద్ధం మాత్రం మహాయానం.

    2.ఈ మహాయాన బౌద్ధం బుద్ధుని తరువాత కాలక్రమేణా రూపాంతరం చెందిన బౌద్ధం.
    అన్ని యానాలు బుద్ధుని తర్వాతే కదా ??

    3. మధ్యలో హీనయాన బుద్ధిజం అనేది ఒకటి పుట్టుకొచ్చింది

    ముందునుంచి ఉన్న నానా వాదాల చేరికే హీనయానం. మహాయానం వచ్చే వరకు ఎక్కడా హీనయాన ప్రసక్తే లేదు.
    మహాయాన గ్రంథాల్లో ఇతః పూర్వం ఉన్న బౌద్ధాన్ని హీనయానం అన్నారు.చాలా మంది పండితులు థేరవాదాన్ని అందులోకి చేరుస్తారు;కారణం మహాయాన సూత్రాలను ఇతర
    పూర్వ బౌద్ధాల్లాగే థేరవాదం కూడా అంగీకరించదు కాబట్టి. ఒకప్పుడు ఐతే మహాయానం లేకపోతే హీనయానం.

    శ్రీలంక తదితర దేశాల్లోని పూర్వ బౌద్ధులు తమ్ము తాము థేరవాదులుగా పిలుచుకుంటారు.హీనయానమన్న పదాన్నే విసర్జించారు;కారణం దాన్ని సృష్టించింది మహాయానులు
    అంతే గాక అలా పిలవటం తమని కించపరచడంగా భావిస్తారు థేరవాదులు.

    4.ఈ మహాయాన బౌద్ధమే ఇప్పుడు శ్రీలంక, బర్మా, థాయిలాండ్, ఇండోనేషియాల్లో ఉంది
    ఏ మహాయాన బౌద్ధం శ్రీలంక, బర్మా, థాయిలాండ్, ఇండోనేషియాల్లో ఉన్నది?? అక్కడ శుద్ధంగా విరాజిల్లుతున్నది థేరవాదమైతేను.

    5 .జపనీయులు కొంతమంది తెరవాదాన్ని, కొంతమంది మహాయానాన్ని పాటిస్తారు.
    అధిక సంఖ్యాకులు పాటించేది మహాయాన లక్షణాభేదమైన జెన్ బౌద్ధం. థేరవాదుల సంఖ్య అత్యల్పం.కాబట్టి కొంతమంది అంటే కుదరదు.

    6.బౌద్ధం గురించి చదువుతుంటే అనేక వాస్తవాలు తెలిసాయి
    బుద్ధం శరణం గచ్చామి.

    తమ్మినేని యదుకుల భూషణ్.

  2. వ్యాసానుబంధం (గుర్రం జాషువా పాపాయి పద్యాలు) గురించి Rohiniprasad అభిప్రాయం:

    09/14/2009 9:46 am

    రాఘవగారూ,
    సంగీతరావుగారు కర్నాటక సంగీతవిద్వాంసుడు. నేను నేర్చుకున్నది హిందూస్తానీ. అంచేత నేనెప్పుడూ కోమల్‌, తీవ్ర అనే పద్ధతిలో వివరిస్తాను. కీబోర్డు అలవాటున్నవారికి కూడా ఇదే సులువైన పద్ధతి. గందరగోళం కలిగితే క్షమించండి.

  3. వ్యాసానుబంధం (గుర్రం జాషువా పాపాయి పద్యాలు) గురించి రాఘవ అభిప్రాయం:

    09/14/2009 6:27 am

    రోహిణీప్రసాద్‌ గారూ

    వ్యాసం చాలా విషయాలు తెలిపేదిగా, ఆసక్తికరంగా ఉందండీ.

    కాకపోతే, ఆయా రాగాలకి మూర్ఛనలు చెప్పేటప్పుడు మీ పద్ధతీ, శ్రీ సంగీతరావుగారి పద్ధతీ తేడాగా ఉండడం వల్ల అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడవలసివచ్చింది. ఉదాహరణకి “బాగేశ్రీ” రాగపు మూర్ఛనని

    ఆ. స-గ2-మ1-ద2-ని2-స
    అ. స-ని2-ద2-మ1-ప-ద2-మ1-గ2-రి2-స

    అని చెప్పి ఉంటే (శుద్ధగాంధారాన్ని గ1 గా, శుద్ధనిషాదాన్ని ని1 గా తీసుకోవడం చాలా చోట్ల చూసాను) తేలికగా అర్థమయ్యేది. సంగీతరావుగారు పాటించినది ఈ పద్ధతే.

    నమస్సులతో
    రాఘవ

  4. నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన గురించి రాఘవ అభిప్రాయం:

    09/14/2009 6:06 am

    చక్కటి పరిచయం. అడగవలసిన ప్రశ్నలు. మంచి సమాధానాలు. బాగుంది, బాగుంది 🙂

  5. జమ్మిబంగారం చెట్టు గురించి డా. దార్ల అభిప్రాయం:

    09/14/2009 1:09 am

    మీ కవిత బాగుంది. కానీ కవిత వచనంలో ఉన్నా విధిని నమ్మే ప్రయత్నం ప్రాచీన భావనగానే కొనసాగుతుంది.
    మనిషి అస్తిత్త్వ ఊగిసలాట మీ కవితలో కనిపిస్తుంది.

  6. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:

    09/13/2009 3:04 pm

    వ్యాసానికొచ్చిన లోటు లేదు.క్లుప్తంగా చెప్పవలసినది చెప్పి వేశారు. అది పండిత లక్షణం.ఎటొచ్చీ పారిభాషిక పదాల విషయంలో ఇబ్బంది. dimension ని తెలుగు పాఠ్యపుస్తకాల్లో మితి గా వ్యవహరిస్తారు. 3-diminsional అనగా త్రిమితీయ అని వాడవలసింది.ప్రాచుర్యంలో ఉన్న పారిభాషిక పదాలను వాడుకొని, లేని వాటికి కొత్త పదాలు సృష్టించుకోవాలి.కావున, ఏకమాత్రక,ద్విమాత్రక,త్రిమాత్రక అని వ్యవహరించే బదులు ఏకమితీయ,ద్విమితీయ త్రిమితీయ అని వాడుక చేయడం అభిలషణీయం.అలాగే మరీ ప్రాథమిక పదాల విషయంలో తబ్బిబ్బు కనిపిస్తోంది.axis ను అక్షంగా వ్యవహరించి, వెను వెంటనే coordinate ను సూచించడానికి అదే పదం వాడారు.coordinate కు సరైన పదం ‘ నిరూపకం ‘; coordinate geometry అంటే నిరూపక రేఖా గణితం. తెలుగు అకాడెమి పాఠ్య పుస్తకాలతో పాటు ప్రతి శాస్త్రానికి పారిభాషిక పదకోశాలు ప్రచురించింది.వ్యాస రచయితలు వాటిని సంప్రదించడం ఎంతైనా శ్రేయస్కరం.ఏది ఎమైనప్పటికీ, పత్రిక స్థాయిని పెంచేవి ఇటువంటి వ్యాసాలే.

    తమ్మినేని యదుకుల భూషణ్ (న్యూయార్క్)

  7. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    09/13/2009 8:29 am

    మేస్టారు,

    మీరు ఆంగ్ల పదాలని, ఆంగ్లపదాలుగానే వుంచుంటే బాగుండేదేవో. విశ్వం గురించిన మీ వ్యాసానికి, మేథమేటికల్ లాజీక్ మీద నిర్మించబడిన విజ్ఞానశాస్త్ర విషయాలకి మీరు ఏ లాజికల్ బేస్ లేని హిందూ వేదాంతాన్ని జోడించకుండా వుండుంటే బాగుండేది.

    ఈ క్రింది లింకులో పి.బి.ఎస్ ఇదే అంశంమీద చేసిన ప్రసారాన్ని చూడొచ్చు.

    http://www.pbs.org/wgbh/nova/elegant/program_t.html

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

  8. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    09/12/2009 12:05 pm

    వేమూరి గారికి:

    మీ వ్యాసం పుర్తిగా చదవకుండానే ఉండబట్టలేక నా అభిప్రాయం రాస్తున్నాను. అతి క్లిష్టమైన సూత్రాలను అతి తేలికగా అర్ధమయ్యేలాగా చేసిన మీ వివరణలకు ధన్యవాదాలు. తెలుగులో మీ వ్యాసాలవంటి వ్యాసాల అవసరం చాలా ఉంది. మన దురదృష్టం ఏమిటంటే తెలుగు భాష, చెప్పదల్చుకున్న విషయం – రెంటిపై సమగ్రమైన సాధికారత ఉన్నప్పుడే ఇటువంటి వ్యాసాలు పుడతాయి. తెలుగు వారిలో మీ వంటి పండితులు అరుదు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసర్చి (TIFR) లో భౌతిక శాస్రం లో పి. హెచ్ . డి. పట్టా పొందిన నేను మీ వ్యాసం నుండి కొత్త విషయాలు తెలుసుకున్నాను. అడగటం తేలికే! మా (నా) కోసం మీరు మరిన్ని వ్యాసాలు రాయాలి మాష్టారూ!

    అభినందనలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  9. జమ్మిబంగారం చెట్టు గురించి ఉష అభిప్రాయం:

    09/12/2009 2:19 am

    ఇన్నాళ్ళుగా చూసాను. మీ కలం నుండి క్రొత్త కవిత రావటం నిజంగా ముదావహం. సమ్మేళనం బాగుంది.
    “జయించామా! ఓడిపోయామా!
    బతికున్నపుడు అదే
    అసలు ప్రశ్న ఔతుంది”

    ఆ ప్రశ్ననుండి పూర్తి విశ్వాసంతో వెలికి రాని సమాధానం నుండే మరో ప్రశ్న వరకు నడక సాగుతుంది. జమ్మిచెట్టు ఎంత బాగా వాడారీ కవితలో.

  10. గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి రాఘవ అభిప్రాయం:

    09/11/2009 10:05 am

    మా స్నేహితుడు (గురజాడ వరుణ్ అని, గురజాడ అప్పారావుగారి మనుమడి మనుమడు) ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు ఈ పంక్తుల గుఱించి:

    “భాష రాదు, వట్టి పాలు మాత్రమె త్రాగు, నిద్రపోవు, లేచి నిలువలేడు”

    అని. మొన్నమొన్న నేను గుఱ్ఱం జాషువాగారి ఖండకావ్యాలు (విశాలాంధ్ర ప్రచురణ) కొని చదివేవఱకూ నాకు తెలియదు ఈ పంక్తులు ఆయన వ్రాసినవీ అని! ఈ పాపాయి పద్యాలే కాదు… ఆ ఖండకావ్యాల పుస్తకంలో నేను ఇప్పటి వఱకూ చదివినంతలో అన్నీ వేటికవే సాటి అనిపించింది.

    ఇదిగో, ఇప్పుడు, ఇక్కడ, ఇలా, వాటికి బాణీ కూడా విన్న తరువాత, వాటి అందం ఇంకా ఇనుమడించింది (నా మనోఫలకంపై). ఘంటసాలవారు జాషువాగారివి వేఱే ఇంకా ఏమైనా పద్యాలకి బాణీలు కట్టి పాడి ఉంటే ఆ వివరాలు కూడా దయచేసి తెలియజేస్తారా?

    ప్రస్తుత వ్యాసాన్ని ఇంత రమ్యంగా అందించినందుకు మీకు బోలెడన్ని నమస్కారాలు.