నాకు నచ్చిన పద్యం: రెండు అందమైన పద్యశిల్పాలు

సీ. దుర్యోధనుని కంటె దుర్యోగవశుఁ డౌచు బ్రాహ్మ్యమ్ము వీడి క్షాత్త్రమ్ము నూనె
      రాధేయు కంటె దురాధేయుఁడై నిరాయుధుపైని నాయుధ ముద్ధరించె
      దుశ్శాసనుని కంటె దుశ్శాసనుం డయి నిశ్శాత్రవతఁ దక్కె నిష్క్రియముగ
      శకుని కంటెను నపశకునాక్షదక్షుఁడై ధర్మపక్ష ముడిగి దాయఁగాచెఁ

తే. జాపగురుఁ డయ్యు న్యాయ్యమ్ముఁ జాపఁజుట్టి
      వ్యూహములు వన్నె నీతినిర్వ్యూహకముగఁ
      గీడు మొత్తముఁ దా నయి; లేఁడు గాని
      ద్రోణుఁ డొక్కఁడు దుష్టచతుష్టయమున

మన తెలుగుభాషలో ‘పొంకము,’ ‘బింకము’ అని రెండు చక్కని పదాలున్నాయి. పొంకము అంటే పొందిక, బింకము అంటే బిగువు. శారీరక సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు ముఖ్యంగా యీ పదాలు వాడుతూ ఉంటాం. సంస్కృతంలో సౌష్ఠవం అనే పదానికి యిదే అర్థముంది. మనిషి శరీరంలోనే కాకుండా సృష్టిలో అనేక చోట్ల అనేక రూపాల్లో మనకీ సౌష్ఠవం దర్శనమిస్తుంది. పూలరేకుల అమరిక దగ్గరనుండీ, గ్రహగతుల సమీకరణాల వరకూ విస్తరించిన సౌందర్యం అది. అణువు నుండి అంతరిక్షం దాకా ఆ విస్తృతిని మనం గమనించవచ్చు. అనాదిగా మానవుని మనస్సు దీనిపై ఆకర్షితమయ్యింది. అలా అది కళారూపాలలోకి ప్రవేశించింది. పొంకంగా మలచిన ఒక శిల్పాన్ని గాని, పొందికగా కూర్చబడిన చిత్రాన్ని గాని చూసినప్పుడు మనసుకి ఒక ఆహ్లాదం కలుగుతుంది. అలాగే నాట్య, గాన కళలలో కూడా సౌష్ఠవానికి చాలా ప్రాధాన్యముంది. సాహిత్యంలో, అందులోనూ ముఖ్యంగా కవిత్వంలో కూడా దీనికి తగిన స్థానం ఉంది. కవిత్వంలో సౌష్ఠవాన్ని సాధించేందుకు ఒక ముఖ్య పరికరం ఛందోనిర్మాణం. అలాంటి ఛందోనిర్మాణాన్ని సమర్థంగా ఉపయోగించుకొని చెక్కిన ఒక చక్కని శిల్పం ఈ పద్యం!

పొందిక అనగానే అది శబ్దాలకు మాత్రమే పరిమితమైన బాహ్యసౌందర్యం అని అనుకోనక్కర లేదు. శబ్దార్థాలు పరస్పరం పొందికగా అమరడం, వ్యక్తీకరించే భావాలలో సమతౌల్యం సాధించడం మొదలైనవి కూడా పద్యశిల్ప సౌష్ఠవంలో భాగాలే. అలాంటి సౌష్ఠవాన్ని కవి యీ పద్యంలో పొందుపరిచారు. ఇంతకీ యింత అందమైన పద్యం, ఒక కావ్యంలోనిది కాదు. ఇదొక సమస్యకు చేసిన పూరణ. ‘ద్రోణుఁ డొక్కఁడు దుష్టచతుష్టయమున’ అనేది ఆ సమస్య. దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులను దుష్టచతుష్టయం అంటారన్నది అందరికీ తెలిసినదే. అందులో ద్రోణుడు లేడు. పైగా దుష్టచతుష్టయం అంటేనే నలుగురు దుష్టులని అర్థం. అంచేత, ‘దుష్టచతుష్టయంలో ద్రోణుడు ఒక్కడే’ అన్నది పూర్తిగా అర్థరహితం. అదే సమస్య! దీన్ని అర్థవంతంగా మార్చగలిగితే సమస్యాపూరణం అవుతుంది. దీన్ని చాలా రకాలుగా పూరించవచ్చు. ఇచ్చిన సమస్య తేటగీతి పాదం. అంచేత ‘లేడు ద్రోణుఁ డొక్కఁడు దుష్టచతుష్టయమున’ అని మారిస్తే సమస్య సగం తీరినట్టే! సగం సమస్యే తీరిందని ఎందుకన్నానంటే, ద్రోణుడొక్కడు దుష్టచతుష్టయంలో చేరలేదు – అంటే అర్థమేమని వస్తుంది? ద్రోణుడొక్కడూ ఆ గుంపులో చేరలేదు కాని అతను కూడా అంతటి దుష్టుడే అని. అంచేత సమస్యని సాంతం పూరించాలంటే ద్రోణుని దుష్టత్వాన్ని నిరూపించాలి. ఇక్కడే కవి ఊహశక్తి, పద్యనిర్మాణ ప్రజ్ఞ, పూరణలో ప్రతిఫలిస్తాయి. మామూలుగా ద్రోణుని దుష్టత్వాన్ని మిగతా మూడు పాదాలలోనూ ఎలాగో అలాగ వర్ణించవచ్చు. ద్రోణుడు ఎంత గొప్ప ధనుర్విద్యా గురువైనప్పటికీ, అతనిలోనూ అనేక లోపాలున్నాయి కదా. అంచేత అది పెద్ద కష్టమైన పని కాదు. అయితే అది మామూలు పూరణగా మిగిలిపోతుంది. మనం ఇంతకు ముందు చెప్పుకొన్న సౌష్ఠవం, అందులో పెద్దగా కనిపించేందుకు అవకాశం ఉండదు. ఈ కవిగారి ఊహ యిక్కడ ఒక అడుగు ముందుకు వేసింది. దుష్టచతుష్టయం ప్రసక్తి వచ్చింది కాబట్టి, ద్రోణుడి దుర్గుణాలను దుష్టచతుష్టయంలో ఒక్కొరితో ముడిపెట్టి వర్ణిస్తే, ఆ పూరణకు ఒక చక్కని పొందిక కుదురుతుంది. అది భావసౌష్ఠవం. మరి దుష్టచతుష్టయం అంటే నలుగురు. ఒక్కొక్కరికీ ఒకో పాదం కేటాయిస్తే, నాలుగు పాదాలు అవసరం అవుతాయి. తేటగీతిలో ఒక పాదం సమస్యకే సరిపోయింది. మిగిలింది మూడు పాదాలే! నాలుగుకన్నా ఎక్కువ పాదాలున్న పద్యాలు అక్కడక్కడా ఉన్నాయి కాని, మాలికగా సాగితే తప్ప అవి అంత ప్రామాణికం కాదు. పైగా తన ఊహకు చిన్న తేటగీతి పాదం బహుశా సరిపోదనుకున్నారేమో కవిగారు. పూరణకు సీసపద్యాన్ని ఎన్నుకొన్నారు. సీసపద్యానికి ఎత్తుగీతి ఎలాగూ తేటగీతి ఉండగలదు కాబట్టి, ఇచ్చిన సమస్య ఎత్తుగీతి పాదంగా కూర్చవచ్చు. ఇలా, చెప్పదలుచుకొన్న విషయానికి అనువైన ఛందస్సుని ఎన్నుకోవడం పద్యనిర్మాణంలో ఒక ప్రాథమిక అంశం. ఛందస్సు నిర్ణయమైపోయాక, కవి చేతిలో పద్యం పంచకల్యాణిలా కదం తొక్కింది! ఒక సీసపద్య పాదం మధ్యలో రెండుగా విరుగుతుంది. ఒకటి, నాలుగు ఇంద్రగణాలున్న పొడుగు భాగం. రెండవది, రెండు ఇంద్రగణాలూ రెండు సూర్యగణాలూ ఉన్న పొట్టి భాగం. ఇందులో మొదటి భాగాన్ని దుర్యోధనాదులతోటి పోలికకూ, రెండవ పాదాన్ని అతని దుర్మార్గాన్ని చూపేందుకూ వాడుకొన్నారు. ఇది పద్యనిర్మాణంలో ఒక సమతాగుణాన్ని తెచ్చింది.

ఇప్పటి దాకా భావంలోనూ పద్య నిర్మాణంలోనూ ఉన్న సౌష్ఠవం గురించి ముచ్చటించుకొన్నాం. ఇప్పుడు పద్యంలోకి వెళ్ళి, ఒకో పాదాన్నీ గమనిస్తే, అందులో ఉన్న శబ్దసౌష్ఠవం కూడా మనకు కనిపిస్తుంది. ద్రోణుడు – దుర్యోధనుని కంటె దుర్యోగవశుడు, రాధేయుని కంటె దురాధేయుడు, దుశ్శాసనుని కంటె దుశ్శాసనుడు, శకుని కంటె అపశకునాక్ష దక్షుడు, అట! దుర్యోగం అంటే దురదృష్టం అని, చెడ్డపని అనీ అర్థాలు వస్తాయి. రెండిటినీ యిక్కడ అన్వయించుకోవచ్చు. దుర్యోధనుడు ఎంత దుష్టుడైనా, తన క్షాత్రవృత్తిని అనుసరించాడు. ద్రోణుడు తన స్వధర్మమైన బ్రాహ్మ్యాన్ని వదిలి, స్వార్థం కోసం క్షాత్రాన్ని చేపట్టాడు. దుః + ఆధేయ = దురాధేయ. దురాధేయుడు అంటే తప్పుడు స్థానంలో ఉంచబడినవాడు అనే అర్థం తీసుకోవచ్చుననుకొంటాను. నిరాయుధుడైన అభిమన్యునిపై ఆయుధాన్ని ప్రయోగించడం అతని సర్వసైన్యాధ్యక్ష స్థానానికే పెద్ద మచ్చ! దుశ్శాసనుని కంటే దుశ్శాసనుడు, అంటే దుర్మార్గమైన శాసనము గలవాడు. తనను సర్వసైన్యాధ్యక్షుని చేసినందుకు ప్రతిఫలంగా, ధర్మరాజుని పట్టిచ్చి దుర్యోధనునికి శత్రువన్నవాడు లేకుండా (నిశ్శాత్రవత) చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కాని చివరకా మాట వట్టి మాటగానే మిగిలిపోయింది! శకుని కంటే కూడా ద్రోణుడు అపశకున అక్షదక్షుడట! అక్షము అనే పదానికి వ్యవహారము, కన్ను, రథము – ఇలా అనేకార్థాలున్నాయి. అపశకునాక్షదక్షుడు అంటే అశుభమైన వ్యవహారాలలో దక్షుడని అనుకోవచ్చు. అక్షము అంటే పాచిక అనే అర్థం కూడా ఉంది. ఇది శకుని పక్షంలో అన్వయం. శకుని అక్షదక్షుడు, ద్రోణుడు అపశకునాక్షదక్షుడు! ధర్మపక్షాన్ని వీడి దాయను గాచినవాడు. ఇక్కడ ‘దాయ’ అంటే దాయాది, శత్రువు అనే రెండర్థాలు తీసుకోవచ్చు. ధర్మపక్షం అంటే ధర్మరాజు పక్షం, లేదా ధర్మమున్న పక్షము అని రెండర్థాలు. ద్రోణుడు ధర్మరాజు పక్షం చేరక అతని దాయాది రక్షణకి పూనుకొన్నాడు. ధర్మమార్గాన్ని వదలి అధర్మం వైపు పోరాడాడు.

ఇలా శబ్దాలంకార శోభితమై సాగిన నాలుగుపాదాల సీసం తర్వాత, ఎత్తుగీతి కూడా అంతే సొగసుతో సాగకపోతే పద్యం ఒక్కసారి కూలపడినట్టవుతుంది. సీసంలో నాలుగు పాదాలూ నాలుగు స్తంభాలనుకొంటే, వాటిపై నిలిచే గోపురం ఎత్తుగీతి! అది కూడా యీ పద్యంలో అంతే అందంగా నిర్మించబడింది. సంస్కృత తెలుగు ‘చాప’లు యతిస్థానంలో చక్కగా అమరిపోయాయి. ద్రోణుడు చాపగురుడై కూడా న్యాయాన్ని చాపజుట్టేశాడు. అలాగే నీతినియమాలను వదిలిపెట్టేసి వ్యూహములు పన్నాడు (వ్యూహములు + పన్నె = వ్యూహములు వన్నె). ఇలా, దుష్టచతుష్టయంలో లేడు కాని, తాను ఒక్కడే కీడు మొత్తానికి కీలకమయ్యాడు!

అలా శిల్పశోభితంగా పూరణ సంపూర్ణమయ్యింది. ఇచ్చిన సమస్య తాంబూలమనుకొంటే, దానికి కోసం వడ్డించిన మృష్టాన్నభోజనం ఇలాంటి పూరణ! దంతపుష్టి, జీర్ణశక్తి ఉన్నవాళ్ళకు మంచి రుచికరమైన విందు. సమస్యాపూరణాలలో రసవంతమైన కవిత్వం ఉండకపోవచ్చు కానీ, పద్యం ఎంత సొగసుగా నడిస్తే, అన్వయం ఎంత చక్కగా కుదిరితే, అంతగా అది మనసులని మురిపిస్తుంది. సమస్యాపూరణం ఆశుకవిత్వ విభాగానికి చెందినది. అంటే అప్పటికప్పుడు అందంగా చెప్పే పద్యాలు. ఈ కాలంలో ఇంటర్నెట్టు ద్వారా జరిగే సమస్యాపూరణలను మరి ఆశువులుగా సంభావించవచ్చునో లేదో! ఇంతకీ యీ కవి కాలం ఏమిటి? ఇతనిదే మరొక చాటువు చూస్తే ఆ విషయం తేలుతుంది!

తనివోవం గృపదొల్కు శ్రీ గురువయోధారాధరాద్వైతద
ర్శనభాగ్యార్తిని గూగులింపఁగఁ దదారాధ్యాద్భుతాకారమున్;
తనుమధ్యాత్రిదశేశ్వరీ గురుపయోధారాధరద్వైతద
ర్శనభాగ్యార్హత చెంగలింపఁగఁ దమిం బ్రార్థింతమన్నాతుకన్!

చాలామంది ‘ఆశువు’నీ ‘చాటువు’నీ పర్యాయపదాలుగా వాడుతూ ఉంటారు. కాని నా దృష్టిలో, స్పష్టత కోసం వాటి మధ్య భేదాన్ని చూపించవచ్చు. ఆశువు అంటే అప్పటికప్పుడు చెప్పే పద్యం. అది ఒకళ్ళు అడుగగా చెప్పినదైనా కావచ్చు, లేదా కవి తనంత తాను చెప్పినదయినా కావచ్చు. సమస్యాపూరణలవంటివి ఒకరు అడిగిన అంశంపై చెప్పిన ఆశు పద్యాలు. తమంత తాముగా చెప్పిన పద్యాలను చాటువులు అనవచ్చు. అవి కేవలం కవి స్పందన నుండి పుడతాయి. వీటి వెనక ఏదో దృశ్యమో, సన్నివేశమో, సంఘటనో ఉంటుంది. పై పద్యం అలాంటి ఒక చాటువు. ఇందులో పద్యకాలాన్ని సూచించే ఒకే ఒక్క పదం – ‘గూగులింపగ!’ అవును, ఇది అచ్చంగా ఈ కాలానికి చెందిన చాటువే!

చాలా చాటువుల్లాగానే దీని వెనక కూడా ఒక తమాషా కథ ఉంది. ఈ కవిగారి గురువుగారి పేరు తమ్మన వేంకటేశ్వరరావు. అతని చిత్రం ఎక్కడైనా ఇంటర్నెట్టులో దొరుకుతుందేమో అని కవిగారు దానికోసం ఆయన యింటిపేరుతో ‘గూగులించారు.’ ఆ వెతుకులాట తెలుగులో కాకుండా ఇంగ్లీషులో Tammana అని చేశారు. మన గూగులమ్మకి కాస్త తెలివెక్కువ కదా. ఆ పేరుతో ఎలాంటి చిత్రం తన డేటాబేసులో చూపించలేదు కాని, పాపం యితనిది బహుశా టైపాటు (అనగా టైపో) అయ్యుంటుందనీ, అది ఇంటి పేరు కాదు Tamanna అనే ఇంతి పేరనీ నిశ్చయానికి వచ్చి సినీ నటి తమన్నా బొమ్మలని కుప్పలుతెప్పలుగా కవిగారి ముందు పెట్టింది. అది చూసిన వెంటనే కవిగారికి యీ పద్యం పొంగుకొచ్చింది! ‘గురు వయో ధారాధర అద్వైత దర్శన భాగ్యార్తి’తో గూగులిస్తే, ‘గురు పయోధారాధర ద్వైత దర్శన భాగ్యార్హత’ లభించిందట! పైగా యీమె ‘తనుమధ్యా,’ ‘త్రిదశేశ్వరి’ కూడాను! త్రిదశేశ్వరి అనే పదంలో మంచి చమత్కారం ఉంది. త్రిదశులు అంటే దేవతలు, త్రిదశేశ్వరి అంటే దేవకాంత, అప్సర అనే అర్థాలు వస్తాయి. దేవతలకు ముప్ఫై (త్రిదశ) ఏళ్ళకంటే మించి వయసు పైబడదట. అందుకే వాళ్ళను త్రిదశులు అంటారు. మన తారలకి కూడా అంతేనని కవిగారి అంతరార్థమేమో! ఈమాట పాఠకుల రసజ్ఞతపై నాకు పూర్తి నమ్మకముంది కాబట్టి, ఆ దీర్ఘసమాసాలకు అర్థతాత్పర్యాలను ఇవ్వబోవడం లేదు.

పైన వ్యాసంలో చెప్పుకొన్న పద్యసౌష్ఠవం, శబ్దసౌందర్యం ఈ పద్యంలో కూడా పుష్కలంగా దర్శనమిస్తాయి. కథంతటికీ మూలమైన పదం ఏమిటో నేరుగా చెప్పక ‘ప్రార్థిం’తమన్నా’తుకన్’ (ప్రార్థింతము + అన్నాతుతకన్) అన్న పదబంధంలో పొందుపరచడం పద్యాన్ని మరింత చమత్కారభరితం చేసింది. ఆ నాతిని ఆతనేమని ప్రార్థించారో మరి! ఈ పద్యంలో నన్ను బాగా ఆకట్టుకొన్న మరొక విషయం గూగులింపఁగ అనే పదం. తెలుగులో, ఇంచుక్’ అనే ప్రత్యయం రెండు సందర్భాలలో వస్తుంది. ఒకటి తెలుగు క్రియలకు ప్రేరణార్థకంలో. ఉదాహరణకు, చెప్పు – చెప్పించు, పాడు – పాడించు, ఆడు – ఆడించు మొదలైనవి. మరొకటి, సంస్కృత ధాతువులను తెలుగు క్రియలుగా మార్చేటప్పుడు. ఉదాహరణకు, కృశ్ – కృశించు, దృశ్ – దర్శించు, నశ్ – నశించు మొదలైనవి. సంస్కృత నామాలకు కూడా కొన్నిసార్లు ఈ ప్రత్యయం చేరి తెలుగు క్రియలు పుడతాయి. ఉదాహరణకు కీర్తి – కీర్తించు, ఆరంభ – ఆరంభించు మొదలైనవి. ఇక్కడ అదే ప్రత్యయాన్ని గూగులు అనే ఇంగ్లీషు పదానికి చేర్చి గూగులించు అనే క్రియని సాధించారు. గూగులించు అనే పదం నుండి గూగులింపఁగ అన్న పదం వస్తుంది. ఇది తెలుగులో ఎంత సహజంగా యిమిడిపోయిందో, ఆ పదానికి దీటుగా చివరి పాదంలో వేసిన చెంగలింపఁగ అనే పదాన్ని చూస్తే తెలుస్తుంది!

ఇంతకీ యీ కవిగారెవరో పోల్చుకొన్నారా? ఆయన ఈమాట పాఠకులకి సుపరిచితులే, శ్రీ ఏల్చూరి మురళీధరరావుగారు. ఈ కాలంలో ఇలాంటి పద్యాలు చెప్పగల అతి కొద్ది మంది రసికులూ, పండితులలో నాకు తెలిసీ మురళీధరరావుగారు అగ్రేసరులు! తెలుగులో చాటు సంప్రదాయం కొనసాగుతూ ఉండి ఉంటే కొన్ని శతాబ్దాలు నిలిచిపోయి ఉండేదీ పద్యం! అన్ని తరాల తర్వాత వారికి యీ కాలంలో తమన్నా అనే సినీనాయిక ఉండేదన్న విలువైన సమాచారాన్ని అందించేది కూడా. స్థలకాలాలు అనే రెండు దిశలను తీసుకొంటే, పూర్వ చాటుసంప్రదాయంలో పద్యాల వ్యాప్తి ఎక్కువగా కాలదిశలో సాగే విధానం ఉండేది. ఇప్పటి అంతర్జాల ప్రపంచంలో స్థలదిశలో వ్యాప్తికే ఎక్కువ ప్రాధాన్యమూ, అవకాశమూను. కాలాన్ని గురించి ఎవరికీ పెద్ద పట్టింపు ఉన్నట్టు లేదు! ఇది చాటువులకే కాకుండా సాంస్కృతిక సమాచారం దేనికైనా అన్వయిస్తుందనుకొంటాను. ఇది ఒక ముఖ్యమైన మార్పే. మానవనాగరికతపై దీని ప్రభావం ఏమిటన్నది కాలమే చెప్పాలి!