సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 1.

పూర్వం ఆంధ్రభాషలో లోతైన పాండిత్యాన్ని సంపాదింపగోరి కావ్యనాటకసాహిత్యం లోతులను గ్రహించేందుకు వ్యాకరణ శాస్త్రం ఛందశ్శాస్త్రం అలంకార శాస్త్రం అధ్యయనం మొదలుపెట్టిన విద్యార్థులకు మూలఘటిక కేతన గారి ఆంధ్రభాషాభూషణం, అపర నన్నయభట్టు రచించిన ఆంధ్రశబ్దచింతామణి మొదలుగా శబ్దతత్త్వాన్ని నిశ్చయించే లక్షణగ్రంథాలు; మల్లియ రేచన కవిజనాశ్రయం, వెల్లటూరి లింగన సరసాంధ్రవృత్తరత్నాకరం వంటి ఛందస్తత్త్వాన్ని నిరూపించే ప్రకరణగ్రంథాలు; గుడిపాటి కోదండపతి రసమంజరి, వడ్డికవి శృంగార రసాలవాలం లాంటి సాహిత్యతత్త్వాన్ని నిర్దేశించే పాఠ్యగ్రంథాలు అనేకం ఉండేవి కాని, అవన్నీ ఆయా శాస్త్రాలలో ఏవో కొన్ని కొన్ని అంశాలకే పరిమితమైన వివృతికల్పాలు. లింగమగుంట తిమ్మకవి సులక్షణసారంలో ఛందస్సుకు ఆవశ్యకమైన వ్యాకరణాంశం చాలా కొద్ది, ఛందోవివరణమూ సంక్షిప్తమే. అనంతామాత్యుని ఛందోదర్పణంలో వ్యాకరణాంశం అతిస్వల్పం, ఛందోవిషయం కొంత విపులతరమే అయినా అందులో అలంకారాలు చర్చకు రావలసిన అవసరం లేకపోయింది. మూర్తికవి కావ్యాలంకారసంగ్రహంలో ఛందోవ్యాకరణాల ప్రసక్తి లేనే లేదు. ఉన్న సాహిత్యశాస్త్రవిశేషమైనా అటు రుయ్యకుని అలంకారసర్వస్వానికీ, విద్యాధరుని ఏకావళికీ, ఇటు విద్యానాథుని ప్రతాపరుద్రీయానికీ సమన్వయం కుదరక, అనువాదం సరిగా లేక ప్రామాణికతను సంతరించుకోలేకపోయింది. అప్పకవీయం వ్యాకరణప్రసంగమే కాని, ఆనుషంగికంగా వచ్చిచేరిన ఛందస్సుకే అందులో అగ్రియత్వం లభించింది. అనంతుని రసాభరణం, భైరవకవి కవిగజాంకుశం మొదలైనవి కొన్ని ఏదో ఒక లఘువిషయాన్ని గ్రహించి, దానినే ఎంతో కొంతగా విస్తరించిన వివృతిమాత్రాలు. ఉన్నంతలో వ్యాకృతికి చింతామణి, అహోబలపండితీయం; ఛందస్సుకు అప్పకవీయం లాగా అలంకారశాస్త్రంలో కావ్యకర్తలకు, కావ్యపాఠకులకు శబ్దార్థరచనారహస్యాన్ని ఎత్తిచూపే వస్తువిమర్శ కలిగిన కావ్యశిక్షాగ్రంథం ఒక్కటీ లేదు.

విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణి, పొత్తపి వెంకటరమణకవి లక్షణశిరోమణి మొదలైనవాటిలో లక్షణలక్ష్యాలు అసమగ్రంగా ఉండటమే గాక అవి పరోక్షసమన్వయసాపేక్షాలుగా ఉంటాయి. ప్రామాణికమైన ఒక లక్షణగ్రంథాన్ని తెచ్చుకొని రుయ్యకుని అలంకార సర్వస్వానికి జయరథుని విమర్శిని, మమ్మటుని కావ్యప్రకాశానికి మాణిక్యచంద్రుని సంకేతం వంటి మహావ్యాఖ్యానాలను ఎదుట ఉంచుకొని ఎక్కడికక్కడ సరిచూసుకొంటూ చదువుకొంటే కాని ఆ అధ్యయనం ముందుకు సాగదు. అటువంటి వ్యాఖ్యానగ్రంథాలైనా చింతామణికి బాలసరస్వతీయం, అధర్వణ కారికలకు అహోబల పండితీయం, అప్పకవీయంలో కొంత భాగానికి సుకవిమనోరంజనం వంటివి వ్యాకరణానికి వెలువడ్డాయి కాని, అన్ని ఛందోలంకారలక్షణగ్రంథాలకూ తెలుగు భాషలో సుపర్యాప్తంగా వ్యాఖ్యానాలు వెలువడలేదు. ఛందోలంకారాలకు సంస్కృతంలోని ఒక మూలాన్ని, దానిపై వెలసిన వ్యాఖ్యానాలను చదువుకొని, వాటికి సరిపడే తెలుగు ప్రయోగాలను సంపాదించి, ఆ రెండింటిని యథాయోగ్యంగా అన్వయించుకొనే అలవాటుండేది కాని, ఆ మాత్రపు కృషికైనా అలంకారశాస్త్రానికి తెలుగులో ఉన్న లక్షణగ్రంథాలు తక్కువ. వాటిపై పదవాక్యప్రమాణవిదుల విజ్ఞానవ్యాఖ్యలు వెలువడేంత ప్రామాణికత వాటికెన్నడూ కలుగలేదు. పైగా వాటి చర్చాపరిధి చాలా తక్కువ. కావ్యస్వరూపం, వృత్తిలక్షణం, గుణదోషనిరూపణం, శబ్దార్థాలంకారవివేచనం, రసభావవిశదిమ, నాయికానాయకుల గుణావస్థానిర్ణయం, దృశ్య శ్రవ్య కావ్యభేదాలు, రూపక పరిభాషాంగ ప్రశంస, కథాశరీరసంవిధానం, కవిసమయప్రదర్శనం, ప్రేక్షకులూ పాఠకులూ తప్పక తెలుసుకోవలసిన పారిభాషికపదాలు, నాట్యధర్ములు, ప్రకీర్ణకవిమర్శబోధ, ప్రకాశార్థాన్ని బట్టి కవి అంతరంగాన్ని ఆవిష్కరించటం మొదలైన ముఖ్యవిషయాలలో ఏ కొన్నింటికో అవి పరిమితాలు. విద్యార్థులు విద్యాధికులైన తర్వాత కూడా శృంగారప్రకాశ సరస్వతీకంఠాభరణాల వలె వారిని విద్యార్ణవం లోలోతులకు తీసికొనివెళ్ళి, విద్యాశిఖరి సమున్నతశిఖరాలపై విహరింపజేసే జీవితకాలప్రబోధగ్రంథం ఒక్కటీ లేదు.

అటువంటి లోపాన్ని పూరించటానికి బహుసంవత్సరాలు కృషిచేసి, వందలకొద్దీ గ్రంథాలనుంచి ప్రయోగాలను సేకరించి, అన్నింటి లక్షణాలను సూక్ష్మేక్షికతో పరీక్షించి, ఛందోవ్యాకరణాలంకార బృహద్విజ్ఞానకోశాన్ని సర్వలక్షణశిరోమణి అన్నపేరుతో కూర్చి; అందులో ఉపదేశింపబడినదానికే లక్ష్యానుబంధంగా ఒక ప్రబంధరాజాన్ని సంధానించిన ఒకే ఒక్క మహనీయుడు శ్రీ గణపవరపు వేంకటకవి. ఆ మహావిద్వాంసుడు కూర్చిన ఆ మహాప్రబంధం పేరు ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం.

ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం భారతీయ సాహిత్యచరిత్రాధ్యేతలు ఎన్నడూ కనీ వినీ యెరుగని ఒక అపూర్వమైన, నిరుపమానమైన మహాకావ్యం. నిజం చెప్పాలంటే, అటువంటి కావ్యం భారతీయభాషలలో మరొకటి లేదు. అంతే కాదు. క్రీస్తుశకం 12వ శతాబ్ది నాటి కవి జినపాల గణి రచించిన సనత్కుమార చక్రి చరిత మహాకావ్యాన్ని ప్రశంసిస్తూ ఆయన శిష్యుడు సుమతి గణి తన గణధరసార్ధశతక బృహద్వృత్తిలో చెప్పిన ఒక శ్లోకం గణపవరపు వేంకటకవి రచనకు అన్వయించినట్లు తెలుగులో మరే కవి రచనకూ అన్వయింపదంటే అతిశయోక్తి కాదు. ఆ శ్లోకం ఇది:

నానాలంకారసారం రచితకృతబుధాశ్చర్యచిత్రప్రకారం
నానాచ్ఛందోఽభిరామం నగరముఖమహావర్ణకావ్యప్రకామమ్
దృబ్ధం కావ్యం సటీకం సకలకవిగుణం తుర్య చక్రేశ్వరస్య
క్షిప్రం యై స్తేఽభిషేకాః ప్రథమజినపదాశ్లిష్టపాలా ముదే నః.

వేంకటకవి కావ్యం కూడా బహువిధాలంకారసారమే. రచితకృతబుధాశ్చర్యచిత్రప్రకారమే. చిత్రకవిత్వంలో సాటిలేని కావ్యం ఇది. గర్భకవిత్వంలో దీనిని సరిపోలిన ప్రయోగసరళి నాటికీ, నేటికీ ఎవరికీ సాధ్యం కాలేదు. బంధకవిత్వంలో త్రిదశతరంగిణీ చతుర్హారావళీ చతుర్వింశతిజినస్తుతి విజ్ఞప్తికా విద్యుల్లతాదుల లాగా ఇది కేవల బంధకావ్యం కాకపోయినా, అంతకు మీరిన బంధచిత్రప్రకారాలు దీనిలో ఉన్నాయి. హరిశ్చంద్రనళోపాఖ్యాన రామకృష్ణార్జునరూపనారాయణీయాదులను పోలిన అనేకార్థరచన కాకపోయినా ద్విసంధాన త్ర్యర్థిఘటనాదులున్నాయి. శేషశైలేశలీలా శ్రీశౌరిశైశవలీలాదుల వలె కేవలం స్థానచిత్రాలతో (య-ర-ఱ-ల-ళ-వ-శ-ష-స-హ అనే పది అక్షరాలతో) కూర్చిన రచన కాకున్నా, ఇందులో ఉన్నన్ని చమత్కారాలు వాటిలో లేవు. చిత్రకవితాప్రణయనంలో ‘యదిహాస్తి త దన్యత్ర, యన్నేహాస్తి న తత్క్వచిత్’ అని సగర్వంగా చెప్పదగిన కావ్యం ఇదొక్కటే. సంస్కృతంలో హరవిజయ చిత్రబంధ రామాయణాదులు, ప్రాకృతంలో అజియసంతిథయ సౌరిచరియాదులు దీనితో కొంత సాటికి, పోటీకి వస్తాయేమో. తెలుగులో మాత్రం వేరొకటి లేదు. సనత్కుమార చక్రి చరిత మహాకావ్యం వలె ఇదీ నానాచ్ఛందోఽభిరామమే. ఇందులో ప్రయోగింపబడినన్ని ఛందస్సులను ఇంత మనోహరంగా ఏ తెలుగు కవీ ప్రయోగించలేదు. సనత్కుమార చక్రి చరితకు తుల్యంగా ఇదీ అష్టాదశవర్ణనాపూర్ణమే. దాని వలె ఇదీ సటీకమే. దీనికీ బంధచిత్రాలున్న ప్రతి ఒకటీ, లఘుటీకతోడి ప్రతి ఒకటీ – ఇప్పుడైతే లేవు కాని, గతశతాబ్దం దాకా ప్రచారంలో ఉండేవి. ఆ విధంగా మహాపండితుడు జినపాల గణి రచనను గురించి గణధరసార్ధశతక బృహద్వృత్తిలో సుమతి గణి చెప్పిన శ్లోకం ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసానికి అన్వయించినట్లు మరే కవి రచనకూ అన్వయింపదని స్పష్టం.

తొలినాటి ప్రస్తావనలు

గణపవరపు వేంకటకవిని గురించి సాహిత్యచరిత్రలో తొలిసారి ప్రస్తావించినవాడు శాసన పరిశోధనలలో, వ్రాతప్రతుల సేకరణలో కల్నల్ కోలిన్ మెకంజీకి సహాయుడుగా ఉండిన కావలి వెంకట రామస్వామిగారు. 1829లో ప్రకటించిన తన Biographical Sketches of the Deccan Poetsలో ఆయన Lukshmana Kavi the Second అన్న శీర్షిక క్రింద వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసాన్ని ప్రశంసించి, ఆయనది కొండవీడు అని, Prubandha Rajum అనే వ్యాకరణగ్రంథాన్ని వ్రాశాడని అంటూ — “This was the chief work composed by this poet, and was reckoned a very useful treatise, and it attained for the author the appellation of Lukshmana Kavi, a Grammatical Poet, which cognomen after ages have adapted” — అని, వేంకటకవికి లక్షణకవిగా ఉన్న ప్రసిద్ధిని పేర్కొన్నాడు. ఆయన నిర్దేశంలో Lukshmana Kavi, a Grammatical Poet అన్నది లక్షణకవి అన్న వ్యవహరణకు ప్రామాదికరూపం కాబోలు. అయితే, ఆయన అన్నట్లు Prubandha Rajum (ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం) వ్యాకరణగ్రంథం కాదు. వేంకటకవికి Grammatical Poet అన్న ప్రశస్తి సర్వలక్షణశిరోమణి రచన వల్ల కలిగింది. రామస్వామిగారు సర్వలక్షణశిరోమణి, ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసాలకున్న పారస్పరికసమన్వయాన్ని గ్రహించినందువల్లనో, వేంకటకవి తండ్రి గణపవరపు అప్పనకు లక్షణకవిగా ఉన్న ప్రసిద్ధిని విని ఉన్నందువల్లనో, వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలో తన లాక్షణికతను గురించి స్వయంగా చెప్పికొని ఉండటంవల్లనో, తన కాలంనాటి పెద్దలు చెప్పుకొనే మాటలను బట్టో వేంకటకవిని Lukshmana Kavi (లక్షణకవి) అని పేర్కొన్నాడని ఊహించాలి. లేకుంటే, Lukshmana Kavi the Second అని శీర్షికలో అన్నాడు కాబట్టి – పైడిపాటి లక్ష్మణమంత్రి ఆంధ్రనామసంగ్రహ నిఘంటువుకు ప్రతిగా వేంకటేశాంధ్రము అన్న శుద్ధాంధ్రనామనిఘంటువును సర్వలక్షణశిరోమణిలోని ఒక ఉల్లాసంగా కూర్చాడు కాబట్టి ఆ రోజులలో గణపవరపు వేంకటకవికి Lukshmana Kavi the Second అన్న ప్రఖ్యాతి ఉండినదేమో అనుకోవాలి.

1885లో బహుజనపల్లి సీతారామాచార్యుల వారు శబ్దరత్నాకరము పీఠికలో వేంకటకవిని గూర్చి ప్రస్తావిస్తూ — “అప్పయ వేంకటపతి – ఇతఁడు ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసమను నొక పెద్ద లక్షణగ్రంథమును వ్రాసినవాఁడు.” — అని వ్రాశారు. ప్రబంధరాజంలో వివిధపద్యాలకు శీర్షికలుగా ఉన్న లక్షణవిషయాల అన్వయాన్ని బట్టి ‘లక్షణగ్రంథము’ అన్నారే గాని, ఆచార్యుల వారన్నట్లు ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం లక్షణగ్రంథం కాదు.

1892లో ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసాన్ని అముద్రితగ్రంథచింతామణి పక్షాన ప్రకటించిన పూండ్ల రామకృష్ణయ్యగారు వేంకటకవి కవి చరిత్రను, జీవితాదికాన్ని కొంత విపులంగానే వివరించారు. 1933 భారతి పత్రిక మార్చి నెల సంచికలో వంగోలు వెంకటరంగయ్య పంతులుగారు ‘ఆనందరంగ పిళ్ళ – డూప్లే ద్విభాషి’ వ్యాసంలో పుదుచ్చేరిలో ఫ్రెంచి గవర్నరు ఫ్రాన్సిస్ జోసెఫ్ డూప్లే వద్ద దుబాసీగా ఉన్నతోద్యోగంలో ఉండిన ఆనందరంగ పిళ్ళై కాలంలో (1709-1761) వేంకటకవి సేనానాయకుడుగా ఉండినట్లు వ్రాశారు కాని, అందుకు ఆధారాలను చూపలేదు. ఆనందరంగ పిళ్ళై, గణపవరపు వేంకటకవి సమకాలికులే అయినా, వేంకటకవి కృతులలో ఆనందరంగ పిళ్ళై సంస్తవం లేదు. అచ్చయిన 12 సంపుటాల ఆనందరంగ పిళ్ళై డైరీలలోనూ, ఆయన జీవితచరిత్ర వ్యాసాలలోనూ ఎక్కడా గణపవరపు వేంకటకవి ప్రస్తావనలు లేవు. కాబట్టి ఈ విషయాన్ని ఇంకా నిర్ధారింపవలసి ఉన్నది.

వేంకటకవి రచనలని చెప్పదగినవి ప్రధానంగా మూడు: సర్వలక్షణశిరోమణి, విద్యావతీ దండకము, ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము. ఇవి గాక వేరేవీ దొరకలేదు. సర్వలక్షణశిరోమణి 1710-1715 (±) ప్రాంతాల, విద్యావతీ దండకం ఆ తర్వాత, ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం 1730-1755 ప్రాంతాల రచింపబడ్డాయి. ప్రకృతవ్యాసంలో ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము యొక్క సర్వాంగీణవిమర్శ గాక, తెలుగు సాహిత్యచరిత్రకు అపరిచితమైన ఒక్క అపూర్వమైన విశేషం మాత్రమే అధికరింపబడుతున్నది. అందులో సంప్రయుక్తమైన లక్షణజాతాన్ని గురించి, చిత్రకవిత్వాన్ని గురించి ప్రత్యేకంగా పరిశీలింపవలసి ఉంటుంది.

నామకరణౌచిత్యం

ఆంధ్రకవులెవరూ తమ కృతులకు ప్రబంధాదిగా పేరుపెట్టినట్లు కనబడదు. ఆ సంప్రదాయం ప్రబంధ చింతామణి, ప్రబంధ రత్నాకరం, ప్రబంధసార శిరోమణి వంటి సంకలన గ్రంథరచయితల సొంతం. సాహిత్యచరిత్రలో శ్రీ వేంకటేశ్వర స్వామి నామాంకితమైన ప్రథమాంధ్ర మహాప్రబంధం కూడా ఇదే. అంతకు మునుపెవరూ అటువంటి పేరుతో ఒక ప్రబంధాన్ని చెప్పలేదు. కొందరు కవులు శ్రీ వేంకటేశ్వర స్వామివారికే తమ కృతులను సమర్పించినప్పటికీ, ఒక్కరైనా శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణగాథను మహాప్రబంధంగా సంతరింపకపోవటం వింతగానే తోస్తుంది.

శ్రీ వేంకటేశ్వరస్వామివారి కల్యాణగాథను, దివ్యలీలలను ప్రతిపాదించే ఈ ప్రబంధరాజానికి శ్రీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము అన్న పేరు గర్భితార్థప్రకాశకమై, శ్రుతిసుందరంగా అమరింది. వేంకటకవికి పూర్వం బొడ్డుచెర్ల తిమ్మన కూడా తన ప్రసన్నరాఘవ నాట్యప్రబంధంలో –

నందేల తిమ్మరాజ పు
రందర చిహ్న ప్రసన్నరాఘవ నాట్యా
మంద ప్రబంధరాజము
నందున …”

అంటూ తన కృతిని ప్రబంధరాజం అని చెప్పుకొన్నాడు కాని, ప్రబంధరాజము అన్న పేరును దాని శీర్షికలో నిలుపలేదు. అహోబలపతి కాళిందీకన్యాపరిణయంలో –

కాటుకకప్పు మోవి జిగి, గాదిలి నవ్వును బొత్తుఁ గూడుచుం
గైటభదైత్యవైరి ముఖకంజమునం దనరారెఁ జూడఁగా
మూటికి సాటియైన రసముఖ్యము లాదిగ శోణశుభ్రముల్
మేటి ‘ప్రబంధరాజము’న మేళనమంది మెలంగు కైవడిన్. (6-126)

అని ఈ శబ్దాన్ని వాడుకొన్నాడు కాని, దానిని తన గ్రంథానికి శీర్షికగా స్వీకరింపలేదు.

శ్రీ వేంకటేశ్వరుని కల్యాణగాథను వర్ణించే కావ్యాన్ని వేంకటేశ్వర విలాసము అనకుండా ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము అనటంలోని ఔచిత్యాన్ని మెచ్చుకోవాలి. శృంగార రసాధినాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆకాశరాజు కుమార్తెను పెండ్లాడి శేషాద్రికి తిరిగివచ్చేటపుడు స్వామిపుష్కరిణి దగ్గర నాగదత్తుడనే ధర్మహీనుడు వారిని అడ్డగించి హతప్రభుడవుతాడు. ఆ విధంగా వీరరసభావం అంగిరసమైన శృంగారానికి ఉద్దీపకమై అలరారింది. శ్రీ వేంకటేశ్వరవిలాస శ్రీ వేంకటేశ్వరవిజయాల అభివర్ణన వల్ల కావ్యరచనలో సాంతం శృంగార వీరాలను పోషించే సదవకాశం ఏర్పడింది. అవకాశమైతే ఏర్పడింది కాని, కవి ఉద్దేశం అది కాకపోవటం వల్ల ఆ రసాదివ్యక్తి సార్థకంగా జరగలేదు. ఆ విషయాన్ని మునుముందు వివరిస్తాను.

వేంకటకవి గ్రంథాన్ని అముద్రిత గ్రంథచింతామణి పక్షాన 1892లో ముమ్మొదట అచ్చువేసిన పూండ్ల రామకృష్ణయ్యగారు ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము అనే వ్యవహరించారు కాని, 1932 నాటి మద్రాసు ప్రాచ్య లిఖితపుస్తక భాండాగారం వారి An Alphabetical Index of Telugu Manuscriptsలో గ్రంథం పేరు, ప్రబంధరాజ శిరోభూషణ విజయ వేంకటవిలాసము అని పేర్కొనబడింది. గ్రంథాలయంలోని వ్రాతప్రతుల ముఖబంధాలలోనూ, గ్రంథంలోనూ ఆ విధంగా లేదు. వారిదే, Descriptive Catalogue of Telugu MSS (Vol.II-Prabandhas) లోనూ ‘ప్రబంధరాజ శిరోభూషణ వేంకటేశ్వర విజయవిలాసమని యిదివఱలో దీనికి ప్రసిద్ధమై యున్న సమగ్రనామము’ అని ఉన్నది. పుస్తకంలో ఎక్కడా లేని, మునుపెవ్వరూ ఉదాహరింపని – ఈ ప్రబంధరాజ శిరోభూషణము అన్న ఆ ‘సమగ్ర నామం’ వారికెక్కడ దొరికిందో తెలియటం లేదు. ఆంధ్రకవుల చరిత్రములో వీరేశలింగం గారు ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము అని ఒకచోట, ప్రబంధరాజ వేంకటేశ్వరవిలాసము అని మరొకచోట పేర్కొన్నారు. క్రొత్తపల్లి సూర్యారావు గారి వంటి మరికొంతమంది విమర్శకులు కూడా తమ వ్యాసాలలో ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము అని కొన్నిచోట్ల, ప్రబంధరాజ వేంకటేశ్వరవిలాసము అని మరికొన్ని చోట్ల ఈ విధమైన పర్యాయనామాంకనం చేశారు.