పుస్తక పరిచయం: సరమాగో నవల ది ఎలిఫెంట్’స్ జర్నీ

అనగా అనగా ఒక ఏనుగు. ఆ ఏనుగుని ఆపేక్షగా చూసుకొనే మావటీడు – వీరిద్దరూ కలిసి ఒక సంవత్సరం పాటు నేలమీద, నీటిపైనా, అడవుల్లో, కొండల్లో, మంచులో, మాంచి ఎండల్లో, పదహారవ శతాబ్దంలో చేసిన 1800 మైళ్ళ ప్రయాణం!


ది ఎలిఫంట్’స్ జర్నీ – జోౙె సరమాగో
అను: మార్గరెట్ జుల్ కోస్టా. 208పే.
హూటన్ మిఫ్లిన్ హార్ట్‌కోర్ట్ ప్రచురణ, 2010.

ఇది ముడిసరుకు. జోౙె సరమాగో (José Saramago) చేతిలో ఈ ముడిసరుకు ఒక అద్భుతమయిన నవల – ఒక చారిత్రక నవలగా రూపొందుతుంది.

అసలు ఈ (పరిచయం)కథ ఇలా మొదలు పెట్టకూడదు. రాజపక్షావలంబులకి నచ్చాలంటే, సామ్రాజ్యవాదులు మెచ్చాలంటే — (కథ) ఇలా మొదలవ్వాలి.

అనగా అనగా ఒక రాజు. వాడికి ఒక రాణి. దూరంగా మరో రాజ్యంలో రాణికి బంధువు, ఒక మరొక చిన్నసైజు రాజు. రాజు, రాణీ వాడి పెళ్ళికి పంపిన కట్నం: గోవా నుంచి రెండేళ్ళ క్రితం రాజుగారి సంస్థానానికి తెప్పించిన ఒక ఏనుగు, దానిని తోలుకొని తీసుకొచ్చిన తెలివైన మావటీడు. వీరిద్దరూ కలిసి ఒక సంవత్సరం పాటు నేలమీద, నీటిపైనా, అడవుల్లో, కొండల్లో, మంచులో, మాంచి ఎండల్లో, పదహారవ శతాబ్దంలో చేసిన 1800 మైళ్ళ ప్రయాణం!

ఇది ముడి సరుకు. సరమాగో చేతిలో ఈ ముడిసరుకు వాస్తవ్యాన్ని వక్రీకరిస్తూ సానుభూతితో రాసిన నవల – ఒక చారిత్రక నవలగా రూపొందుతుంది.

సారమాగో ఒక్కడే, ఈ రెండు ముడి సరుకులూ ఒకటిగా చేసి తన పద్ధతిలో, పొడుగాటి గొలుసుకట్టు వాక్యాల్లో – కామాలు, ఫుల్‌ స్టాపులూ, సాంప్రదాయక విరామచిహ్నాలకి స్వస్తి చెప్పి – అనుకోకండా ముఖ్యమైన విషయాలు కొన్ని బహిరంగపరుస్తూ, సారవంతమయిన రాజకీయ విశేషాలు, మత వైఖరులూ తళుక్కున మెరిపిస్తూ బ్రహ్మాండమయిన వ్యంగ్య నవల తయారు చేయగలడు. చేశాడు కూడా. అదే ఏనుగు ప్రయాణం (The Elephant’s Journey) నవల. ఈ నవల గురించి నాలుగు మాటలు చెప్పటం, ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం. ఆ పని చెయ్యబోయేముందు సరమాగో జీవిత విశేషాలు క్లుప్తంగా ముచ్చటిస్తాను.

జోౙె సరమాగో, నవంబర్‌ 16, 1922లో అజిన్‌హగ, పోర్చుగల్‌లో ఒక బీద వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. లిస్బన్‌లో చదువుకున్నాడు. 1944లో ఇల్దా రీస్‌తో వివాహం. ఒక కూతురు, బియొలాంతె. 1988లో పిలార్‌తో వివాహం. రకరకాల ఉద్యోగాలు; మోటార్‌ మెకానిక్‌గా, గవర్నమెంటు గుమాస్తాగా, పత్రికా సంపాదకుడిగా! మొట్టమొదటి నవల ఇరవై అయిదు సంవత్సరాల వయసులో. ఆ నవలని ఎవరూ పట్టించుకున్నట్టు లేదు; పేరూ రాలేదు. అతని సాహితీ వ్యాసంగం అతనికి నలభై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకూ మొదలవలేదనే చెప్పాలి. మూడు కవితాసంకలనాలు, కొన్ని అనువాదాలూ కూడా చేశాడు. అతని రెండవ నవలకి చాలా ఆశ్చర్యకరమయిన పేరు పెట్టాడు: Manual of Painting and Calligraphy అని. (లైబ్రరీ కేటలాగు తయారు చేసేవాళ్ళ గందరగోళం చెప్పక్కరలేదు.) తరువాత వరసగా చాలా నవలలు వచ్చాయి. ది స్టోన్ రాఫ్ట్ (The Stone Raft,) బ్లైండ్‌నెస్ (Blindness,) ది గాస్పెల్ ఎకార్డింగ్ టు జీసస్ క్రైస్ట్ (The Gospel According to Jesus Christ,) వగైరా. 1998లో సరమాగోకి నోబెల్‌ బహుమానం వచ్చింది. చాలామంది విమర్శకులు అతను రాసిన బ్లైండ్‌నెస్ (Blindness) అతని గొప్ప పుస్తకంగా చెపుతారు. జూన్‌ 18, 2010న చనిపోయాడు. ఆయన అంత్యక్రియలకి సుమారు 20,000 మంది వచ్చారు. పోర్చుగీసు ప్రభుత్వం రెండురోజులు పాటు అతని మరణానికి సంతాపం వెలిబుచ్చటానికి కేటాయించింది.

ఎన్నో కవితా సంకలనాలు, నాటకాలు, వ్యాసాలు, కథలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, డైరీలు, ఒక చిన్నపిల్లల పుస్తకం, పాతిక పైగా నవలలు, రాశాడు. చాలా పుస్తకాలు ఇంకా ఆంగ్లంలోకి అనువదించబడలేదు.

ఎలిఫెంట్’స్ జర్నీని తన మాతృభాష పోర్చుగీసులో (వియాజిమ్ దొ ఎలెఫాన్తె) రాస్తున్న రోజుల్లో, సరమాగో న్యుమోనియాతో మంచాన పడ్డాడు. చాలా కాలం హాస్పటల్లో ఉన్నాడు. 2008 ఆగస్ట్‌లో నవల పూర్తి చేశాడు. ఈ నవలని తన భార్య పిలార్‌కి అంకితం ఇలా చేశాడు: For Pilar, who wouldn’t let me die, అని. పిలార్‌ సరమగొ పుస్తకాలు స్పానిష్‌ లోకి అనువదించింది.

ఈ నవల రాయటానికి ప్రేరణ, ఆస్ట్రియా, సాల్జ్‌బర్గ్ నగరంలో ద ఎలిఫెంట్ అనే రెస్టారెంట్‌లో చెక్క మీద చెక్కిన వేరు వేరు బొమ్మలు. లిస్బన్‌ నుంచి వియన్నా వరకు వరుసగా రకరకాల భవంతుల బొమ్మలతో, యాత్రా కార్యక్రమం విశదీకరించిన చెక్కడాలు, అవి. ఇవి ఏమిటి? అని సరమాగో అడిగాడు. సాల్జ్‌బర్గ్‌ విశ్వవిద్యాలయంలో తనని ఉపన్యాసం ఇవ్వడానికి పిలిచిన గిల్డా లోపెస్‌ చెప్పింది: ఈ బొమ్మలన్నీ పదహారవ శతాబ్దంలో, ఒక ఏనుగు లిస్బన్‌ నుంచి వియన్నాకి చేసిన ప్రయాణం వివరించే బొమ్మలు, అని. అంతే! సరమాగో ఇతర చారిత్రక వివరాలు సేకరించి ఈ నవల రాశాడు. ఆ రకంగా ఇది చారిత్రక నవల. సరమాగో రాసిన పదిహేనవ నవల.

నవలలో ముఖ్య పాత్ర సాలమన్‌ అన్న పేరుతో ఇండియా నుంచి రెండేళ్ళకు ముందుగా లిస్బన్‌ నగరానికి తీసుకొరాబడ్డ ఏనుగు. రెండవ ముఖ్య పాత్ర ఆ ఏనుగు వెంట వచ్చిన మావటీడు సుభ్రో. బహుశా మూడవ పాత్ర, ఆస్ట్రియా దేశంలో హాబ్స్‌బర్గ్ రాజ్యానికి రాజు, మాక్స్‌మిలియన్‌. ఇతను పోర్చుగీసు రాణికి దగ్గిర బంధువు.


సరమాగో ప్రారంభంలో రాస్తాడు: “భూతకాలం రాళ్ళు రప్పలతో కప్పబడ్డ విశాలమైన భూమి. చాలామంది జోరుగా కారుల్లో ఏమీ పట్టించుకోకండా పోతారు, ఆ రాళ్ళమీద! కొద్దిమంది మాత్రం ఓపిగ్గా ఒక్కొక్క రాయీ ఎత్తి ఆ రాయి క్రింద ఏమున్నదో అని జాగ్రత్తగా చూస్తారు. ఒక్కోసారి తేళ్ళు, మరొక్క సారి జెర్రులు, గొంగళీ పురుగులూ, కిమ్మనకండా కూచున్న గూటిపురుగులూ కనిపిస్తాయి. అసాధ్యం కాదు గాని, ఒకే ఒక్కసారైనా సరే, ఒక ఏనుగు కనిపించవచ్చు…”

1551వ సంవత్సరంలో పోర్చుగీసు కేథలిక్‌ రాజు మూడవ జోఆఒ (Joao), అతని భార్య కేటరీనా(Caterina) – వాళ్ళ మృగశాలలో రెండేళ్ళనుంచీ ఉంటున్న సాలమన్ అనే ఏనుగుని, లిస్బన్‌ నుంచి వియన్నా పంపించడానికి ఏర్పాటు చేస్తారు. సాలమన్‌తోతో పాటు దాని మావటీడు సుభ్రో, ఒక అశ్వదళ నాయకుడు, వాడితో పాటు ముప్ఫై మంది భటులు, బోలెడుమంది కూలీలూ, — ఎద్దుబండ్లు, మొదలయిన సరంజామాతో బయలుదేరతారు. ప్రారంభంలోనే సుభ్రో అశ్వదళ నాయకుడికి ఈ రక్షకపరివారం ఎవరి వెనుక ఎవరు ఉండాలో చెప్పుతాడు. (నిర్దేశిస్తాడు అనటం సబబు) ఏనుగుకి కావలసిన గడ్డి (రోజుకి 150 కిలోగ్రాములు ) మోసుకొచ్చే ఎద్దుబండ్లు మెల్లిగా నడుస్తూ అందరికన్నా ముందు ఉండాలి. వాటి వెనక పోర్టర్లు, భటులూ, అందరికన్నా వెనుక ఏనుగునెక్కి తను — అశ్వదళనాయకుడుకి వినక తప్పదు. ఎందుకంటే, సాలమన్‌ గురించి, తనకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. ఈ పరివారంపై అసలైన అధికారం తనది అని ముందుగానే నిరూపించుకున్నాడు.

వియన్నాకి వేళ్లే దారి చాలా దుష్కరమైనది. ప్రయాణంలో కొంతభాగం కాలినడక మీద సాగింది. మరికొంత భాగం సముద్రయానం. ఆ తరువాత ఆల్ప్ పర్వతాలలో మంచులో యాతన. ఇనిస్‌బ్రూక్‌కి చేరేటప్పటికి 1552 జనవరి 6వ తారీకు వచ్చింది. ఆ రోజు క్రైస్తవులు ఎపిఫనీ జరుపుకొనే పండగ రోజు, — ఆ తరువాత ఓ పెద్ద పడవ మీద వియన్నా వరకూ సాగింది వీళ్ళ ప్రయాణం.

మార్గమధ్యంలో సాలమన్‌, సుభ్రో అనుభవాలు పూస గుచ్చినట్టు, కళ్ళకు కట్టినట్టు చెప్పుకోపోతాడు సరమాగో. ఆ చెప్పే పద్ధతిలో వేళాకోళం, వెక్కిరింత చదివి ఆనందించ వలసినదే కాని తిరిగి చెప్పటం సాధ్యం కాదు.

సుభ్రో చాలా తెలివైన వాడు. మాటకారి. ఒక్క మాటలో చెప్పాలంటే బతకనేర్చిన వాడు. ఒకసారి అశ్వదళ నాయకుడితో మతం గురించి ముచ్చటిస్తాడు. అది చక్కని సరసమైన అనుభవం. తను క్రిస్టియన్‌ మతం వాడేనని చెప్పుతాడు. భటులకి గణపతి కథ చెప్పుతాడు. నీకు హిందూ మతం గురించి బాగా తెలుసనుకుంటా, అని అశ్వదళ నాయకుడు అనగానే — ఏదో కాస్తో కూస్తో తెలుసునని మొహమాట పడుతూ చెప్పుతాడు. శివుడు, తన కొడుకు తల నరకటం, ఆ కొడుకుకి ఏనుగు తల అతకటం. ఒక భటుడు వెంటనే ఇవి కట్టు కథలు అని అంటాడు. అవును! చచ్చిన మనిషి మూడవ రోజున పునర్జన్మ యెత్తి వైకుంఠానికి పోవటం లాంటి కట్టుకథ – అంటాడు, సుభ్రో. పక్కన కూచొని వింటున్న రైతులు, ‘ఒక సారి ఏనుగుని చుట్టూ తిరిగి చూసింతరువాత, చూడటానికి ఏముంది?’ అని అంటారు. అయినా వాళ్ళు చర్చ్‌ పాస్టరు దగ్గిరకి పోయి, ‘ఏనుగు దేవుడు’ అని చెప్పుతారు. ఆ పూజారి ‘దేవుడు సమస్తజీవులలో ఉన్నాడు,’ అని అనంగానే, ఒక రైతు, ‘కాని ఆ జీవులేవీ దేవుడు కాదు,’ అని అంటాడు. అందరూ కలిసి వెళ్ళి, ఏనుగుని, దయ్యం నుంచి ‘విమోచన’ (exorcise) చెయ్యటానికి బయలుదేరతారు. పూజారి విమోచన పేరుతో మోసం చేస్తాడు. ఏనుగు పూజారిని మృదువుగా కాలితో తన్నుతుంది. ఈ అర్థరహిత ‘దైవసంఘటనలు’ సరమాగో అద్భుతంగా, చిత్రిస్తాడు. అతిసున్నితంగా ఈ ఘట్టం చెప్పుకొని పోతాడు.

మరొకసారి పడువాలో (ఇటలీలో ఒక ఊరు) సెయింట్ ఆంథొనీ చర్చ్‌ ముందు ఏనుగు మోకాళ్ళ మీద ప్రణామం చేస్తున్నదా అన్నట్లు కూచుంటుంది. (అసలు నిజం ఏమిటంటే, సుభ్రో అలా కూర్చోపెడతాడు.) ఇది దైవఘటన అని చాటించగానే, సుభ్రో ఈ వెర్రి నమ్మకాన్ని ఆసరుగా తీసుకొని, ఏనుగు తోకమీది వెండ్రుకలు అమ్మటం మొదలు పెడతాడు; బట్టతల మీద జుట్టు మొలిపించే మందు అని!

సుభ్రో అని పలకలేక వాడి పేరుని, మాక్స్‌మిలియన్‌, ఫ్రిట్జ్ అని మారుస్తాడు. సాలమన్‌ పేరు సులైమాన్‌ అని మారుస్తాడు. ఈ మార్పులు, వీటి వర్ణన చదివి నవ్వుకోవాలి.

పోర్చుగీసు భటులు ఆస్ట్రియన్ భటులకి తనని అప్పచెప్పుతున్న సందర్భంలో వారికి వీడ్కోలు చెపుతున్నట్టుగా, సాల్‌మన్ తన తొండంతో ఆప్యాయంగా అనునయించడం, ఆ తరువాత మరొక సందర్భంలో ఒక పాపని తన కాలిక్రింద తొక్కెయ్యకండా తొండంతో పైకెత్తి రక్షించడం – ఈ భాగాలు సాలమన్ వాత్సల్యానికి ఉదాహరణలు. సరమాగొ ఈ రెండు సందర్భాలూ చక్కగా చిత్రీకరిస్తాడు.

తనకు పెండ్లి కానుకగా వచ్చిన ఏనుగుని తన పరివారంతో ఎదురువచ్చి, ఆస్ట్రియన్‌ సరిహద్దులో (అంటే మొత్తం ప్రయాణంలో సగం దూరం!) కలుసుకుంటాడు, మాక్స్‌మిలియన్‌. మాక్స్‌మిలియన్‌, సాల్‌మన్‌, సుభ్రో లని కలవటానికి ఇంత దూరం ఎదురు రావలసిన అవసరం లేదు. పోర్చుగీసు పరివారం సరాసరి సాలమన్‌ని వియన్నాలో తన గుమ్మం దగ్గిరకి తోసుకొని రాగలదు. లేదా, తన ఆస్ట్రియన్‌ సేన తేలికగా ఆ పని చెయ్యగలదు.

సరమాగో రాస్తాడు: “మాక్స్‌మిలియన్‌ ఎందుకు ఇంత దూరం వచ్చాడో తెలుసుకోవటం తేలిక పని కాదు. కాని చరిత్రలో రాసి ఉన్నదానికి తిరుగు లేదు. నవలా రచయిత కొన్ని చోట్ల కొన్ని పేర్లు చెప్పటంలో స్వాతంత్ర్యం చూపించిన మాట నిజమే. అయితే, రచయితకి అటువంటి కల్పన, అటువంటి సృష్టి చేసే అధికారం ఉన్నది. ఎందుకంటే, కొన్ని చారిత్రక విషయాలలో ఉన్న ఖాళీలు పూరించి — పవిత్రమైన ధార్మిక సమన్వయతకి లోటు రాకండా — కథ పూర్తి చెయ్యాలి. ఇక్కడ ఒక విషయం చెప్పి తీరాలి. ఎందుకంటే, చరిత్రకి సర్వదా ఎంపిక చేసే గుణం ఉన్నది. చరిత్రకి పాక్షికత కూడా ఉన్నది. జీవితంలో ఏది చారిత్రకమో, ఏది కాదో సమాజం ఊహించుకొని వాటినే ఎంపిక చేసుకుంటుంది. మిగిలిన విశేషాలన్నీ తిరస్కరిస్తుంది. దిక్కుమాలిన వాస్తవ్యం చరిత్రకి ముఖ్యం. అందుకని నేను మీకు చెపుతున్నాను వినండి. నవలారచయిత గానో, కాల్పనిక కథలు రాసేవాడి గానో, అబద్ధాలకోరు గానో, లేకపోతే మావటీడు గానో బ్రతకడం మంచిది.”

చరిత్ర మీద సరమాగో విసురులు, చరిత్ర రాసేవాళ్ళ మీదనని వేరే చెప్పనక్కరలేదనుకుంటాను.

సరే, చివరికి ఏనుగు వియెన్నా చేరింది. సుభ్రో గురించి ఇక్కడ చక్కటి మాటలు రెండు చెప్పుతాడు సరమాగో.

“వీధులంతా జనం నిండిపోతారు. పెద్దగా చప్పట్లు చరుస్తారు. ఆ తరువాత కొంతసేపటికే అతన్ని గురించి పూర్తిగా మరిచిపోతారు. జీవితన్యాయం అదే మరి: సాఫల్యమూ, విస్మృతి.”


ఈ పరిచయం ముగించబోయే ముందు కొన్ని విషయాలు చెప్పి తీరాలి. పరిశోధన చేసిన తరువాత కూడా, ఏనుగు గురించిన అన్ని వివరాలూ సరమాగో ఎందుకు రాయలేదో తెలియదు. ఈ ఏనుగుని ఒక సాధారణ జంతువుగా చెప్పుతాడు. నిజానికి, ఈ ఏనుగు 1540లో భువనేకు బాహూ-7 అనే రాజు గారి సంస్థానంలో పుట్టింది. ఈ సంస్థానం ఇప్పుడు కొట్టె అని ఒక శ్రీలంకలో ఒక చిన్న వూరు. అప్పట్లో, పోర్చుగీసు రాజ్యానికి అది ట్రేడింగ్‌ పోస్ట్. భువనేక బాహూ సంస్థానంలో స్ఫటిక శిలలతో కట్టిన మేడల్లో పుట్టిన ఈ ఏనుగు, ఒక బుద్ధ దేవాలయం వద్ద దీవించబడ్డదని చరిత్ర. కథకి ఈ భాగం అనవసరమని సరమగొ భావించి ఉండవచ్చు.

సులేమాన్‌, ఫ్రిట్జ్, ఇద్దరూ వియన్నాలో మరొక రెండు సంవత్సరాలు ఉన్నారు. 1553 క్రిస్మస్‌ సమయంలో ఏనుగు మరణించింది. మావటీడు కంచరిగాడిదనెక్కి లిస్బన్‌కి బయలుదేరాడు. దోవలో ఎక్కడో మాయం అయి ఉండాలి.
ఏనుగు (సులేమాన్‌) ఎముకలతో కుర్చీ చేశారు. చర్మంలో గడ్డి దట్టించిపెట్టి కుట్టి బవేరియన్‌ నేషనల్ మ్యూజియంలో ఉంచారు. రెండవ ప్రపంచయుద్ధంలో సులేమాన్‌ ‘దేహాన్ని’ బాంబులు భస్మం చేశాయి.

ఇదీ కథ.

ది ఎలిఫెంట్’స్ జర్నీ సరమాగో పుస్తకాలలో నాకు నచ్చిన వాటిలో ఒకటి. మీకూ నచ్చుతుందని నా ఆశ. సరమాగో పుస్తకాలలో ఏదన్నా మొట్టమొదటి సారి చదవటానికి ప్రయత్నిస్తే, ప్రారంభంలో కొంచెం ఆశాభంగం కలగవచ్చు. సరమాగో మనం అవసరం అనుకున్న చోట్ల కేపిటల్‌ అక్షరాలు వాడడు. విరామ చిహ్నాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. తెలుగులో గొలుసుకట్టు రాతలాగా – మా తాత రాసిన ఉత్తరాల లాగా –కూడగట్టుకొని అదే వరసన పోతాయి వాక్యాలు. అయితే, అలవాటు పడటానికి ఆట్టే కాలం పట్టదు. మచ్చుకి నవల మొట్టమొదటి వాక్యం చూడండి:

“Strange though it may seem to anyone unaware of the importance of the marital bed in the efficient workings of public administration, regardless of whether that bed has been blessed by the church or state or no one at all, the first step of an elephant’s extraordinary journey to austria which we propose to describe hereafter, took place in the royal apartments of portuguese court, more or less at bedtime.”

ఆఖరిగా:

చిన్నప్పుడు చదువురాని తన తాతయ్య, అత్తిచెట్టు క్రింద కూచోపెట్టుకొని చెప్పిన కథలు ఎలా తన జీవితాన్ని మలిచాయో, తన సాహితీవ్యాసంగానికి నాందీవాక్యాలు పలికాయో, నోబెల్‌ బహుమానం తీసుకున్నప్పుడు చేసిన ఉపన్యాసంలో చెప్పుతాడు. ఆ వ్యాసం నా ఉద్దేశంలో ఒక గొప్ప వ్యాసం. పేద రైతుకుటుంబీకులు, నిరక్షరకుక్షులు, తన అమ్మమ్మ, తాతయ్యలకి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు.

సరమాగో కరుడుగట్టిన కమ్యూనిస్టు. పోర్చుగీసు కమ్యూనిస్టు పార్టీ మెంబరు. రకరకాల అంతర్జాతీయ సదస్సులలో యూరోపియన్‌ యూనియన్‌నీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌నీ తీవ్రంగా విమర్శించాడు. ప్రపంచీకరణం సరికొత్త నిరంకుశత్వానికి ప్రతినిధి అని, మల్టినేషనల్‌ సంస్థలు ప్రజాస్వామ్యాన్ని రూపు మాపుతున్నాయనీ విపరీతంగా బాధపడ్డాడు. అయితే తన రచనల్లో ఎక్కడా కమ్యూనిస్టు మొండివాదం కనిపించదు. తనని గురించి చెపుతూ ఇలా అంటాడు: I logically continue to be what I am… I do not regard my party as competent to decide on literary matters or artistic issues.

ది ఎలిఫంట్’స్ జర్నీ సరమాగో రాసిన ఉపాంత్య నవల. చనిపోయే ముందు అతను రాసిన ఆఖరి నవల కెయిన్ (Cain.)