మరి నువ్వేమో…

నువ్వేమో పల్చటి పసుపుపచ్చ ఎండవి.
నేనేమో నీ వెచ్చటి పరదాల చాటున
ఒదిగి ఒత్తిగిల్లే గడ్డిపూవుని…

అప్పుడప్పుడూనేమో నువ్వు ఆకాశానివి.
మరి నేనో, ఎప్పటికీ చెదరని నీ నీడలలో
నిస్సంశయంగా రెక్కలు చాచుకునే బుల్లి పిట్టని…

నువ్వు నవ్వుల సవ్వళ్ళను నాలో వదిలివెళ్ళే
వానాకాలపు సెలయేటివి.
నేను దిగులు గుబులు నీలి సాయంత్రాలలో
త్రోవ తెలియని నిశ్శబ్దాన్ని…

దారి అలవాటైనదే అయినా
తరచూ తూలిపోతుంటాను…
పిల్లతెమ్మెరై బుజ్జగించడమొక్కటేనా
అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టి
మలుపు వరకూ తోడొస్తావు కూడాను.

రేపు తోచని చీకటి ముసిరినప్పుడల్లా
భద్రతలూ భరోసాల బరువు మాటలేమో కానీ
నాకోసమే మౌనంగా వెలిగే స్థిమితానివి నువ్వు

ఆనందాలూ అసహనాల మధ్య
అడ్డదిడ్దంగా ఆడుకునే నన్ను
పదిలంగా కాపాడుకునే పచ్చిక మైదానమై
దూరం నించి దగ్గరగానో
రెండు మెలకువల మధ్య స్వప్నంలానో
ఏమైతేనేం, అన్నివేళలా
నువ్వేమో అనంత విశ్వాసానివి…
నేనేమో ఒక నిశ్చింత పరమాణువుని!