నీలి తలపాగా

టీవీలో వార్తలు చూస్తుంటే, ఎందుకో హఠాత్తుగా చిన్ననాటి సంఘటనలు గుర్తొచ్చాయి. దినపత్రికల్లో కూడా కొద్ది రోజులుగా ఈ వార్తలే ప్రధానంగా వస్తున్నాయి. పొద్దున్నే ఆఫీసుకి హడావుడిగా పరిగెత్తడం, రాత్రిళ్ళు ఆలస్యంగా రావడం పరిపాటి అయిపోయింది. మా అకౌంటెంట్లకి మార్చి చాలా క్రూరమైన నెల. ఊపిరి పీల్చుకోడానికి కూడా తీరిక ఉండదు, చెవి గోక్కోడానికి కూడా సమయం ఉండదంటే అతిశయోక్తి కాదు. 31 మార్చి ఆర్థిక సంవత్సరం చివరి రోజు, పెండింగ్‌లో ఉంచిన ఎన్నో పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. మేనేజ్‌మెంటుకి ప్రాఫిట్ అండ్ లాస్ ఎకౌంట్, బాలన్స్‌షీట్ తయారు చేసి ఇవ్వాలి. ‘కంప్యూటర్ ఉందిగా, ఇంక ఆలస్యం దేనికి,’ అంటుంది మేనేజ్‌మెంట్. కాని పని చేయాల్సింది మనుషులని ఎవరికి అర్థం అవుతుంది? ఉద్యోగులు తక్కువ ఉండే సరికి ఎకౌంట్స్‌తో పాటు వేరే పనులు కూడా చేయాల్సి ఉంటుంది. మరి సమయానికి పనులు ఎలా పూర్తవుతాయి? పోనిద్దురూ, ప్రతీ ఆఫీసులోనూ ఇదే గోల.

ఏప్రిల్ ఒకటవ తేదీన పని పూర్తి చేసి మేనేజ్‌మెంటుకి బాలన్స్‌షీట్ అందించాను. మెచ్చుకోలు మాట దేవుడెరుగు, ఒక రోజు ఆలస్యం అయిందని మందలింపులు: ‘రాత్రి పూట కూడా పనిచేసుంటే 31 మార్చికే నువ్వు బాలన్స్‌షీట్ సిద్ధం చేసుండేవాడివి’ అంటూ. కాని నిద్రపోవాలిగా. ‘ఏం ఒక్క రాత్రి నిద్రపోకపోతే ఏమవుతుందట? ప్రాణం పోతుందా? మీ ఎకౌంటెంట్లందరికీ ఇదే జబ్బు. పని సమయానికి పూర్తి చేయరు. ప్రతీదీ పెండింగ్‌లో ఉంచడం మీకో అలవాటు…’ అంటూ వ్యాఖ్యలు. కానీ ఎకౌంటెంట్ల బాధలు పట్టించుకునేదెవరు? గత పదిరోజులుగా ఇంటికే వెళ్ళలేదు, ఆఫీసులోనే కుర్చీలోనే అరగంటా, గంటా విశ్రాంతి తీసుకుంటూ పని చేశాను. రోజుకి ఇరవై గంటల పని చేసినందుకు ఫలితం — తిట్లు! బాలన్స్‌షీట్ అప్పగించేయగానే, కనీసం మూడు రోజుల తెఱిపి కావాలని శరీరం నిక్కచ్చిగా చెబుతోంది. మేనేజ్‌మెంటు ఈ మూడు రోజులు సి.ఎల్.గా కట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ శరీరానికి కూడా విశ్రాంతి కావాలిగా. కంప్యూటర్లు, మిషన్లు 24 గంటలు పని చేస్తే హాంగ్ అయిపోతాయి. కాని మనుషులు ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. అవకాశముంటే 24 గంటలలో 48 గంటల పని చేయించుకుంటారు.

ఇంటికొచ్చి మంచం మీద వాలానా, 24 గంటల తర్వాత కూడా మెలకువ రాలేదు. కళ్ళు కొద్దిగా తెరుచుకున్నా, శరీరం సహకరించదు. పూర్తిగా 36 గంటల తర్వాత కూడా ఇంకా అలసట తీరని స్థితిలోనే లేచాను. పేస్టు, బ్రష్ తీసుకుని బాత్‌రూంలోకి వెళ్ళాను. దంతధావనం పూర్తయ్యాక స్నానం చేస్తే బావుండు, కాస్త ఫ్రెష్ అవ్వచ్చు అనుకున్నాను. లేకపోతే, మూడు రోజుల సెలవు నిద్రలోనే అయిపోతుంది. స్నానం చేశాక నిజంగానే ఉత్సాహం వచ్చింది. హాల్లోకి వచ్చాను. అప్పటికే మా ఆవిడ అక్కడ కూర్చుని ఉంది. ఓ చేతిలో టీ కప్పు, ఇంకో చేతిలో బిస్కట్టు. టీ కొద్ది కొద్దిగా తాగుతూ, చిన్నగా నవ్వుతూ, “లేచారా మహానుభావా! కుంభకర్ణుడి వారసులు తమరు…” అంది కాస్త వ్యంగ్యం జోడించి.

“భారతీయ సతీమణుల మానసిక ధోరణి ఎప్పుడూ మారదు!” అన్నాను కుర్చీ లాక్కుని కూర్చుంటూ.

“మొత్తం భారతీయ సతీమణుల ప్రస్తావన ఎందుకట? ఒళ్ళు విరుచుకుంటూ రెండు రోజులు పడుకున్నా నేనేమీ మిమ్మల్ని లేపలేదు, ఇబ్బంది పెట్టలేదు…”

“దెప్పుతూ, భారతీయ సతీమణుల మానసిక స్థితిని ప్రదర్శించావుగా. ఇరవై రోజుల అలసటని రెండు రోజుల నిద్రతో తీర్చుకుంటున్నానని ఆలోచించలేక పోయావు.”

“ఇంటి ముఖం కూడా చూడనీయని ఉద్యోగం వల్ల ఉపయోగం ఏంటి? రోటీ కపడా ఔర్ మకాన్ సినిమాలో జీనత్ అమన్ పాడిన పాట, ‘తెరి దో టకియాదీ నౌకరీ మే మెరి లాఖోఁకా సావన్ జాయే’ నాకు బాగా వర్తిస్తోంది. ఎందుకీ వెధవ ఉద్యోగం, ఇది మానేసి ఇంకోటి వెతుక్కోవచ్చుగా. డబ్బులు తక్కువొచ్చినా ప్రాణం సుఖంగా ఉండేది! మనిద్దరం కనీసం మనశ్శాంతిగా మాట్లాడుకోగలిగే ఉద్యోగం ఒకటి చూసుకోండి.”

“కారు లోన్ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చే ఏడాదితో పూర్తవుతుంది. అప్పుడు వెతుక్కుంటాలే. అప్పుడైతే తల మీద భారం ఉండదు.”

“ఇప్పటి నుంచే వెతుక్కుంటే సరి. వచ్చే ఏడాదికి దొరుకుతుంది. లేకపోతే ఒంటరితనంతో నా ప్రాణాలు పోయినా పోతాయి. భారతీయ సతీమణులను గౌరవించండి. జన్మజన్మలకి భర్తలకి తోడుగా ఉంటారు. అమెరికా లేదా యూరప్ లోని భార్యల్లా ఎప్పుడంటే అప్పుడు విడాకులకి సిద్ధం కారు,” అంది మా ఆవిడ నవ్వుతూ.

“మధ్యలో ఈ అమెరికా, యూరప్‌ల గొడవెందుకు?” నేను కాస్త చిన్నబుచ్చుకున్నాను.

“భార్యలు అన్ని రకాలుగా విసిగిపోయినప్పుడు, మరో మార్గం కనపడనప్పుడు ఏ దేశం ప్రస్తావన అయినా వస్తుంది. అప్పుడే ఆలోచిస్తాం అమెరికా, యూరప్‌లో భార్యల గురించి.”

టాపిక్ మార్చడం మంచిది అనుకున్నాను. మాట మారుస్తూ, “టీ ఇచ్చేదేమైనా ఉందా? లేదా దాని కోసం అమెరికా యూరప్ వెళ్ళాలా?” అని అడిగాను.

“ఆహా, అమెరికా యూరప్‌ల మెరుపు కలలు కంటున్నారా? పాపం. మీ కలలు కల్లలు చేసినట్లున్నాను. సర్లెండి, భారతీయ సతీమణుల ధర్మం నిర్వహిస్తాను,” అంటూ వంటింట్లోకి నడిచింది మా ఆవిడ.


మా ఆవిడ వంటింట్లోకి వెళ్ళగానే దినపత్రిక చేతిలోకి తీసుకున్నాను, టీవీలో న్యూస్ చానెల్ ఆన్ చేశాను. దినపత్రికలో మొదటి పేజీలో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన కొన్ని సిక్కు కుటుంబాల గురించి వార్తలున్నాయి. వీళ్ళంతా పాకిస్తాన్ లోని స్వాత్ లోయకి చెందినవారు. తాలిబన్లనుంచి తమను తాము రక్షించుకోడానికి అమృత్‌సర్ వచ్చారు. ఇక్కడే ఉండడానికి భారత ప్రభుత్వం అనుమతి కోరుతున్నారు. టీవీలో కూడా ఈ వార్తకి సంబంధించిన దృశ్యాలనే చూపిస్తున్నారు. తమ సొంత ఇల్లు, వాకిలి వదిలిపెట్టి పరాయి పంచన తల దాచుకోడం, మరో చోట బతుకు ఈడ్వడం ఎంత దౌర్భాగ్యమో నాకు బాగా తెలుసు. అటువంటి పరిస్థితులలో బలవంతంగా పూర్తిగా కొత్త ప్రదేశంలో జీవితం గడపాల్సి వస్తుంది. నిర్వాసిత కుటుంబాలకు గురుద్వారాలో ఆశ్రయం కల్పించారని టివీలో చెప్తున్నారు. ఈ వార్తలు చదివి, వినీ నాకు నా బాల్యం గుర్తొచ్చింది.

నా వయసు అప్పుడు ఐదు, ఆరు సంవత్సరాలు ఉంటుంది. కానీ ఆ సంఘటన ఇప్పటికీ నా మనసులో తాజాగా నిలిచి ఉంది. కారణం ఏంటంటే, చిన్నతనంలో మా అమ్మానాన్నల నుంచి లెక్కలేనన్ని సార్లు ఆ రోజు గురించి విని ఉన్నాను. మనసు పొరల్లోని ఏదో మూలల్లోంచి ఆ జ్ఞాపకాలు బయటపడుతుంటాయి. ఇటువంటి వార్తలు విన్నా, చూసినా, నా మనసులోని ఆ చేదు జ్ఞాపకాలు తాజాగా బయటపడ్తాయి.

మా నాన్న ఓ రైతు. మాది భారత పాకిస్తాన్ సరిహద్దులోని గ్రామం. 1971 యుద్ధం కన్నా ముందు రోజుల్లో సంగతి. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. అప్పుడే శీతాకాలం మొదలైంది. ఎటు చూసినా ఢాం! ఢాం! ఢాం! అనే శబ్దాలే వినిపిస్తున్నాయి. ఒకరోజు ఉన్నట్టుండి ఇరుగుపొరుగు వారి కేకలు,’బాంబులు వేస్తున్నారు! పరిగెట్టండి!!’ అంటూ. సమయం రాత్రి ఎనిమిది గంటలయి ఉండచ్చు. భోజనం అప్పటికే అయిపోయింది. ఇంటి వరండాలో మంచం మీద వాలి, ఆకాశంలో నక్షత్రాలను లెక్కబెడుతూ, అమ్మానాన్నల కోసం ఎదురు చూస్తున్నాను. ఇంట్లో చిన్నా చితకా పనులు ముగించుకుని వాళ్ళు కూడా వచ్చేస్తే, నేను నిద్రపోతాను. ఒంటరిగా పడుకోవాలంటే భయం. నిద్రైతే వస్తోంది, కాని పడుకోలేకపోతున్నాను. ఆ వయసులో భయం సహజమే, కాని నాకు మాటలు పెగల్లేదు. ఢాం! ఢాం! అనే శబ్దాలతో పాటు దట్టంగా పొగ కమ్మింది. బహుశా దగ్గర్లోనే బాంబులు పడుతున్నట్లున్నాయి. మరేమీ ఆలస్యం చెయ్యకుండా అమ్మా నాన్న ఇంట్లోంచి బయటకొచ్చారు. గబగబా నా చెయ్యి పట్టుకుని, దగ్గర్లోని కందకాల వైపు పరిగెత్తారు. ఓ కందకంలోకి దిగి దాక్కున్నాం. యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. అందుకే సరిహద్దు గ్రామాలలో చాలా చోట్ల కందకాలు ఏర్పాటు చేశారు. ప్రమాదకర పరిస్థితులలో ఆ కందకాలలో దాక్కుంటే, ప్రాణాలు కాపాడుకోవచ్చు.

“మరేం పర్లేదు నాన్నా, భయపడకు,” అంది అమ్మ నా చేయి పట్టుకుంటూ. సరిగ్గా అదే సమయంలో మా ఎదురింటివాళ్ళు కూడా కందకంలోకి వచ్చేశారు. వాళ్ళందరిని చూసే సరికి ధైర్యమొచ్చింది.

“అందరూ ఉన్నారు కదమ్మా, నాకేమీ భయంలేదు,” అన్నాను.

అప్పుడే మిషన్ గన్‌ల పేలుడు శబ్దాలు వినిపించసాగాయి. ఎదురింటాయనని ఉద్దేశించి, “కుల్జీత్, మన సైనికులు ఫైరింగ్ మొదలుపెట్టారు. ఇక ఈ బాంబుల దాడి తొందరలోనే ఆగిపోతుంది,” అని అన్నాడు నాన్న.

“వెధవలు. మనలాంటి అమాయకుల మీద బాంబులేస్తారు, మన సైనికులు కాల్పులు జరిపితే మాత్రం పారిపోతారు!” అన్నారు కుల్జీత్ మామ కోపంగా.

కాని ఆ రాత్రి ఫైరింగ్ ఆగనే లేదు. రాత్రంతా ఎదురుకాల్పులు కొనసాగుతునే ఉన్నాయి. మధ్య మధ్యలో రెండు వైపుల నుంచి బాంబుల వర్షం కురుస్తోంది. ఆ రాత్రి ఎవరికీ కంటి మీద కునుకు లేదు. చెవులు పగిలిపోతాయా అనిపించేంత చప్పుళ్ళు. మేము, మా ఎదురింటి కుల్జీత్ మామ కుటుంబం రాత్రంతా ఆ కందకంలోనే దాక్కుని ఉన్నాం. తెల్లారేసరికి కాల్పులు ఆగాయి. కానీ చాలా సేపయ్యాక కానీ మేము కందకంలోంచి బయటకు రాలేదు. కందకంలోంచి బయటకి రాగానే నాన్న నన్నూ అమ్మని ఇంట్లో దింపి, రచ్చబండ వద్దకి వెళ్ళాడు. అక్కడ గ్రామంలోని మగవాళ్ళందరూ చేరి, రాత్రి జరిగిన భయంకరమైన కాల్పుల గురించి మాట్లాడుకుంటున్నారు. అదృష్టం ఏంటంటే ఎవరికీ ఏమీ కాలేదు. ఇంతలో ఇద్దరు సైనికాధికారులు అక్కడికి వచ్చారు. రాత్రి జరిగిన భయంకరైమైన కాల్పుల అనంతరం, సైన్యం సరిహద్దు గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయించడం శ్రేయస్కరమని భావించిందట. ఆడవాళ్ళని, పిల్లల్ని వెంటనే గ్రామం ఖాళీ చేయమని సైనికాధికారులు సూచించారు. చీకటి పడే సమయానికల్లా ప్రజల్ని సురక్షిత స్థలాలకు చేర్చేందుకు సైన్యం రెండు ట్రక్కులని పంపింది. అవసరమైన సామాన్లని తీసుకుని వీలైనంత త్వరగా గ్రామం వదిలిపెట్టమని పురుషులకి నచ్చజెప్పారు.

సైన్యం ట్రక్కులలో ఆడవాళ్ళని, పిల్లల్ని ఎక్కించారు. అమ్మతో పాటు నన్నూ ఎక్కించబోతుండగా ఏడుపు మొదలుపెట్టాను, నాన్నతో వస్తానని.

“బాబూ, అమ్మతో వెళ్ళు. నేను మీ వెనకే మన ఎడ్లబండిలో ఇంటి సామాన్లు వేసుకుని వచ్చేస్తాగా,” అంటూ నాన్న సముదాయించాడు.

“లేదు. లేదు. నేను నీతోనే ఉంటా,” అంటూ నాన్నకి కరుచుకుపోయాను.

“బాబూ, మంకు పట్టు వద్దు. నేను మీ వెనకే వస్తాగా, కావాలంటే నువ్వు ట్రక్కు లోంచి నన్ను చూస్తూండు,” అన్నాడు నాన్న.

ఆ తర్వాత గబగబా ఇంట్లోని సామాన్లలో ముఖ్యమైన వాటిని బండిలో సర్దసాగాడు. సైన్యం ట్రక్కులు బయల్దేడం కాస్త ఆలస్యం అయింది. ఈలోపల నాన్న సామాన్లన్నీ సర్దేశాడు. ట్రక్కుల వెనకాలే నాన్న ఎడ్లబండి బయల్దేరింది. నాన్న ఆ రోజు నీలంరంగు తలపాగా కట్టుకున్నాడు. గ్రామంలోని గతుకుల దారుల్లో ట్రక్కులు నెమ్మదిగా సాగుతున్నాయి. వెనుకే నాన్న ఎడ్లబండి వస్తోంది. నేను నాన్నని చూస్తూ, చేయి ఊపుతూ ఉన్నాను, కొద్ది సేపటికి ట్రక్కులకి, ఎడ్లబండికీ మధ్య దూరం పెరిగింది. నాన్న రూపం మసకగా కనబడుతున్నా, నీలి తలపాగాని చూస్తూ చేయి ఊపుతునే ఉన్నాను. నాన్న నీలి తలపాగా కనపడుతున్నంతసేపూ నాన్న దగ్గరగానే ఉన్నారనే భరోసా. ట్రక్కులకీ, ఎడ్లబండికి దూరం మరింత పెరిగింది. ఇక నీలి తలపాగా కనబడలేదు. మట్టిదారుల మీదనుంచి ట్రక్కులు చదును రోడ్లమీదకొచ్చాయి. సాయంకాలమయ్యింది. చీకట్లు ముసురుతున్నాయి. నేను నాన్న కోసం చూడటం ఆపలేదు. ఎక్కడైనా నీలి తలపాగా కనిపిస్తే బాగుండని చూస్తూనే వున్నాను. కానీ మా మధ్య దూరం మరీ ఎక్కువై పోయింది. అలిసిపోయి ఉన్నా కూడా నిన్న రాత్రి కాల్పుల వల్ల, ఈ రోజు నాన్న ఎడబాటు వల్ల సరిగ్గా నిద్ర పోలేకపోయాను. మధ్యమధ్యలో ఉలిక్కి పడి లేచి, రోడ్డు మీదకి చూస్తూనే ఉన్నాను – దూరం నుంచైనా, నీలి తలపాగా ఒక్కసారైనా కనబడుతుందేమోనని.

తెల్లవారే సమయానికి ట్రక్కు మమ్మల్ని ఒక బడి వద్ద దింపింది. సరిహద్దు గ్రామాల ప్రజలకు ఈ బడిలో బస ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కాసేపటికే ఒకదాని తర్వాత మరొకటిగా ఎన్నో ట్రక్కులు వచ్చి ఆగాయి. వాటిల్లో మా చుట్టు పక్కల గ్రామాల్లోని ఆడవాళ్ళు, పిల్లలు ఉన్నారు. అక్కడంతా ఓ మేళాలా తయారైంది.
మేము రావడం వల్ల బడికి సెలవలిచ్చేశారు. బడిలో రెండు వరుసలలో గదులున్నాయి. మిగతాదంతా ఖాళీ మైదానం. బడి ప్రాంగణం బయట కూడా బోలెడు ఖాళీ స్థలం. అక్కడ గుడారాలు వేసి మేముండేందుకు తాత్కాలికంగా వసతి కల్పించారు. నా దృష్టంతా బడి గేటు మీదే ఉంది, నాన్న కోసం ఎదురుచూస్తూ. మెల్లిగా మా గ్రామం మగవాళ్ళు కూడా రావడం మొదలెట్టారు.

“అమ్మా, నాన్నింకా రాలేదేం?” అడిగాను అమ్మని.

“కంగారు పడకు. వస్తూ ఉంటారు. చూడు, ఇంకా కుల్జీత్ మామ కూడా రాలేదు. కలిసి వస్తున్నారేమో! చూడు, పిల్లలంతా ఆడుకుంటున్నారు. నువ్వు కూడా వెళ్ళి ఆడుకో. నాన్న వచ్చేస్తారులే,” అంది అమ్మ.

కాని నాకు ఆడుకోవాలని లేదు. రెండు రోజులు గడిచిపోయాయి. నాన్న రాలేదు. నేను ఏడవడం మొదలుపెట్టాను. అమ్మ ఎంత సముదాయించినా నా ఏడుపు ఆగడం లేదు. నేనింతగా దిగులు పడడం చూసి అక్కడున్న ఆడవాళ్ళందరూ నాకు ధైర్యం చెప్తుండేవారు. ఒకావిడ నన్ను ఒళ్ళోకి తీసుకుని సముదాయిస్తూ, “ఒరే బాబు, నువ్వెంతో ధైర్యస్తుడివి. ఎందుకు ఏడుస్తున్నావు? మా అబ్బాయి చూడు, నీ కన్నా చిన్నవాడు. ఎలా ఆడుకుంటున్నాడో? వాళ్ళ నాన్న కూడా ఇంకా రాలేదు,” అని అంది. అయినా నా ఏడుపు ఆగలేదు. “నాన్న, నాన్న” అంటూ గట్టిగట్టిగా ఏడిచాను. నేను ఏడుస్తునే ఉన్నా నా దృష్టి బడి గేటు మీదే ఉంది – నాన్న ఎప్పుడైనా రావచ్చుగా అని. ఇంతలో గేటు దగ్గరనుంచి పొగమంచులో నీలి రంగు చూచాయగా కనబడింది. నాలో ఉత్సాహం పెరిగిపోయింది. “నాన్న నీలి తలపాగా!” అంటూ కేకలు వేశాను. నిజమే. వస్తున్నది మా నాన్నే. నీలి తలపాగా తర్వాత క్రమంగా నాన్న రూపం మొత్తం కనపడింది. నాన్న దగ్గరికి రాగానే, అమ్మ కూడా అరిచేసింది ఆనందంతో, “బాబూ మీ నాన్న వచ్చేశారు,” అంటూ.

నాన్న వస్తూనే నన్ను ఒడిలోకి తీసుకుంటూ, “ఏడుపు ఎందుకు కన్నా!” అంటూ ఓదార్చాడు.

“ఇంత ఆలస్యం అయ్యిందేం?”

“ట్రక్కులతో ఎడ్లబండి పోటీ పడలేదు కదా. అందుకే ఆలస్యం మరి.”

నాన్న సాంత్వన చేకూర్చాడు. నేను నాన్నకి అతుక్కుపోయాను.

“వెర్రోడా. అనవసరంగా అమ్మని ఇబ్బంది పెట్టావు కదా. చూడు చిన్న చిన్న పిల్లలు కూడా ఆనందంగా ఆడుకుంటున్నారు. నువ్వేమో తెగ హడావుడి చేశావు. ఆడుకోడానికి వెళ్ళవా?” అన్నాడు నాన్న.

నాన్న వచ్చేయగానే, బెంగ తీరిపోయింది. సంతోషం కలిగింది. వెళ్ళి తోటి పిల్లలతో ఆడుకోవాలనిపించింది. వెంటనే నాన్న ఒళ్ళోంది దూకాను. “నేను కూడా ఆడుకోడానికి వస్తున్నా!” అని గట్టిగా అరుస్తూ పిల్లల దగ్గరికి పరిగెత్తాను. ఆ వయసులో ఆటలతోనే సరిపోతుంది. ఆటలాడి ఇంటికొస్తే అమ్మానాన్నలతో కాలక్షేపం. ప్రపంచంలోని దారుణాల గురించి పట్టింపులేని వయసు.

యుద్ధం ముగిసింది. మేము మా గ్రామానికి తిరిగి వెళ్ళిపోయాం. బాంబుల దాడుల వల్ల పొలం వ్యవసాయానికి పనికిరాకుండా పోయింది. బ్రతుకు తెరువు కోసం పట్నం వచ్చేశాం. గ్రామంలో పెద్ద పెద్ద పొలాలు, పెద్ద ఇల్లు, పరుగులు పెడుతూ, గెంతుతూ ఆడుకునేవాళ్ళం. పట్నంలో ఒకే గది ఇంట్లో నివాసం. జీవితానికి బహుశా మరో పేరు సంఘర్షణ కావచ్చు. ఆడుతూ పాడుతూండే సమయాలు క్షణాలలో మాయమై, కష్టాలు ఎలా చుట్టుముడతాయో ఎవరూ ఊహించలేరు. జీవితంలోని ప్రతీ మలుపులోనూ అనిశ్చితే. చిరునవ్వు మాయమైపోయింది. రైతులైన అమ్మానాన్నలు కూలీలయ్యారు. రెండు మూడేళ్ళు కష్టపడ్డాక, గ్రామంలోని పొలం అమ్మేసి చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు నాన్న. అమ్మ కష్టాలు తీరాయి. నా చదువు మొదలైంది. గ్రామంలోని స్వేచ్ఛాజీవనం స్థానంలో పట్నపు కఠోరజీవనం మొదలైంది. కొత్త ప్రదేశంలో జీవితాన్ని తిరిగి మొదలుపెట్టడం అంత తేలిక కాదు. రాజు పేదవుతాడు. ఇటువంటి వార్తలు విన్నప్పుడల్లా నన్ను ఆనాటి జ్ఞాపకాలు — నా బాల్యం, మా కుటుంబం, మా కష్టాలు — చుట్టుముడతాయి. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి నిర్వాసితులుగా వచ్చిన సిక్కు కుటుంబాల వార్తలు వింటుంటే, వారి వ్యథని చూస్తూంటే నా కళ్ళు చెమ్మగిల్లాయి.


ఇంతలో మా ఆవిడ కప్పులో టీ, ఇంకా బిస్కట్లు పట్టుకుని వచ్చింది. టీ కాచేంత సమయంలోనే నా గతం ఓ సినిమా రీలుగా నా కళ్ళ ముందు తిరిగింది. నాకు టీ కప్పు అందిస్తూ, “కుంభకర్ణుడి వారసుడి ఇంటి దీపం, టీ బిస్కట్లతో సిద్ధంగా ఉంది,” అంది. నేను టీ కప్పు తీసుకున్నాను. తను నా కళ్ళల్లో తడి చూసింది. ఇంతకు ముందు కూడా తను ఎన్నో సార్లు నాకంట్లో తడి చూసింది. టీవీలో కనపడుతున్న దృశ్యాలు చూసి మొత్తం అర్థం చేసుకుంది. నేనేమీ మాట్లాడలేకపోయాను. తనకి మొత్తం అర్థమైంది.

[హిందీ మూలం: బ్లూ టర్బన్ రచన: మన్‌మోహన్ భాటియా]

కొల్లూరి సోమ శంకర్

రచయిత కొల్లూరి సోమ శంకర్ గురించి: పుట్టింది కృష్ణా జిల్లా గుడివాడలో. పెరిగింది హైదరాబాదులో. హైదరాబాదు, గుంటూరు, నిమ్మకూరు, నాగార్జున సాగర్‌లలో విద్యాభ్యాసం. అనేక కథలు, వ్యాసాలు, అనువాదాలు ప్రచురించబడ్డాయి. "మనీప్లాంట్" అనే భారతీయ కథల అనువాద సంకలనం వెలువరించారు.  ...