కళావసంతము

పరిచయము

ఫిబ్రవరి నెలలో మా ప్రాంతాలలో ఒక వారం రోజుల్లో 50 అంగుళాలకు పైగా మంచు కురిసింది. అమెరికాలో మధ్య అట్లాంటిక్ రాష్ట్రాలలో ఉండే మేమంతా మా ఇళ్లలోనే ఒక వారం రోజులు బందీలుగా గడిపాము! ఆ మంచు కరగడానికి సుమారు ఒక నెల పట్టింది. ఈ రోజు ఏవీ నిరుడు కురిసిన ఆ హిమరాశులు అని ప్రశ్నించుకోవచ్చు. కానీ అప్పుడు ఈ హేమంతం అంతమై ఎప్పుడు వసంతం వస్తుందో అని ఎదురు చూచే వాళ్లం. వసంత ఋతువును గురించిన పద్యాలను చదివే వాడిని, పాటలను వినేవాడిని. జయదేవకవి రాసిన లలితలవంగలతా పరిశీలన కోమల మలయ సమీరే అష్టపదిని ఎన్ని సార్లు విన్నానో? షెల్లీ కవి అన్నట్లు If winter comes, can spring be far behind? మళ్లీ వసంతం వచ్చింది. విరబూసిన విరిబాలలు నవ్వుతూ నవ్విస్తున్నాయి. పులుగులు ఎలుగులెత్తి కలకల నినాదాలను చేస్తున్నాయి. ఈ వసంత ఋతువులో ఎందుకు వసంతముపైన ఒక వ్యాసాన్ని రాయరాదు అనిపించింది. దాని ఫలితమే ఈ వ్యాసము.

భారతీయ కాలమానము

మొట్ట మొదట భారతీయ సంప్రదాయాల ప్రకారం వసంత ఋతువు కాల పరిమితిని గురించి: వేదకాలంనాటి నెలల పేర్లు ఇలా ఉంటాయి. ఇప్పుడు మనం వాడే నక్షత్ర మాసాలను కుండలీకరణములలో చూపినాను – మధు (చైత్ర), మాధవ (వైశాఖ), శుక్ర (జ్యేష్ట), శుచి (ఆషాఢ), నభ (శ్రావణ), నభస్య (భాద్రపద), ఈశ (ఆశ్వయుజ), ఊర్జ (కార్తీక), సహ (మార్గశిర), సహస్య (పుష్య), తప (మాఘ), తపస్య (ఫాల్గుణ). ప్రతి ఋతువులో సూర్యునికి తోడుగా అతని రథములో ఇద్దరు ఆదిత్యులు, ఇద్దరు ఋషులు, ఇద్దరు గంధర్వులు, ఇద్దరు అప్సరసలు, ఇద్దరు రాక్షసులు, ఇద్దరు నాగులు ప్రయాణం చేస్తారు. వరుసగా వారి పేరులను కింద తెలియబరచాను.

 • వసంతము: త్వస్త, విష్ణు – జమదగ్ని, విశ్వామిత్ర – ధృతరాష్ట్ర, సూర్యవర్చ – తిలోత్తమ, రంభ – బ్రహ్మోపేత, యక్షోపేత – కంబన, అశ్వతార.
 • గ్రీష్మము: ధాత, అర్యమ – పులస్త్య, పులశ – తుంబురు, నారద – కృతస్థల, పుంజికస్థల – రక్షోహేతి, ప్రహేతి – ఉరగ, వాసుకి.
 • వర్ష: మిత్ర, వరుణ – అత్రి, వశిష్ఠ – హాహా, హూహూ – మేనక, సహజన్య – పౌరుషేయ, వధ – తక్షక, ??
 • శరత్తు: ఇంద్ర, వివస్వన – ఆంగీర, భృగు – విశ్వావసు, ఉగ్రసేన – ప్రమలోచ, అనుమలోచ – సర్ప, వ్యాఘ్ర – ఏలపత్ర, శంఖపాల.
 • హేమంతము: పర్జన్య, పుష – భరద్వాజ, గౌతమ – సురుచి, పరవసు – ఘృతాచి, విశ్వాచి – ఆప, వాత – ధనంజయ, ఐరావణ.
 • శిశిరము: అంశు, భగ – కశ్యప, క్రతు – చిత్రసేన, ఊర్ణయు – ఊర్వశి, పూర్వచిత్తి – విద్యుత్, దివ – మహాపద్మ, కర్కటక.

నక్షత్ర గమనంపైన ఆధారపడిన సంవత్సరానికి 365.256363 రోజులుంటాయి. సూర్యుని గమనంపై ఆధారపడిన సంవత్సరానికి 365.24219 రోజులు. ఈ రెంటికి తేడా ఒక సంవత్సరములో సుమారు 20 నిమిషాలు. ఇప్పుడు మనం పిలిచే ధ్రువ నక్షత్రం (పోలారిస్) కొన్ని వేల ఏళ్ల తరువాత ధ్రువ నక్షత్రముగా ఉండదు. దీనికి కారణం precession of the equinoxes. భూ-భ్రమణాక్షము (earth’s axis of rotation) అంతరాళములో మరొక అక్షమును అనుసరిస్తూ చుట్టుతూ ఉంటుంది, అందువల్ల ఇప్పుడుండే ధ్రువ నక్షత్రము 2000 సంవత్సరాలకు ముందు లేదు. ఈ 20 నిమిషాల తేడాను మనం సరి చేసికోవాలి. కాని అలా చేయలేదు మన పంచాంగాలను గుణించిన వాళ్లు. అందుకే వసంతఋతువు మొదటి రోజు మార్చి 20వ తారీకు వస్తుంది. ఈ రోజు (vernal equinox వసంత విషువము), సెప్టెంబరు 23 (autumnal equinox శరద్విషువము) దివారాత్రాల కాల పరిమితి ఒకటిగా ఉంటుంది. కాని సౌరమానము ప్రకారం ఏప్రిలు 14 తేది మనం సంవత్సరాదిగా ఆచరిస్తున్నాము. అంటే సుమారు 24 రోజుల భేదం ఉంది. అందుకే మన పంచాంగాన్ని పరిష్కరిస్తే బాగుంటుంది. భారతదేశములో అధికారపూర్వకమైన పంచాంగము ప్రకారము చైత్ర మాసం మార్చి 23 ఆరంభమవుతుంది. ప్రముఖ ఖగోళ-భౌతిక శాస్త్రజ్ఞుడైన మేఘనాద్ సాహా దీనిని కూలంకషముగా తాను రాసిన ఒక వ్యాసంలో చర్చించారు. అందులో ఒక వాక్యం నాకు చాలా నవ్వు పుట్టించింది. సాహా అంటారు – భారతదేశానికి విదేశీయుల పరిపాలనకన్న జ్యోతిష్కులవల్ల ఎక్కువ కీడు కలిగిందని!

ఇక్కడ అమెరికాలో నాలుగు ఋతువులు క్షుణ్ణంగా అమలులో నున్నాయి. అవి వసంతము, గ్రీష్మము, శరత్తు, హేమంతము. కాని భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పంచాంగం, ఒక్కో విధంగా ఋతువుల గణన. అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉగాది. ఆంధ్రులకు, కన్నడిగులకు, మరాఠీ వాళ్లకు చాంద్రమాన ఉగాది అయితే, మిగిలిన వాళ్లకు సౌరమాన ఉగాది. గుజరాతులో కొందరు చాంద్రమాన ఉగాదిని పౌర్ణమి తరువాతి రోజు పాటిస్తారు. కేరళలో కొన్ని చోట్లలో ఆగస్టు నెలలో సింహ మాసములో ఉగాది. కొందరికి దీపావళి సమయంలో ఉగాది.

భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు విభూతియోగములో ఋతూనాం కుసుమాకరః అని అన్నాడు. ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఆ వసంత ఋతువు సంవత్సరంలో ఎప్పుడు ఆరంభమవుతుందో ఎప్పుడు అంతమవుతుందో అనే విషయాన్ని తెలుపలేదు. మనం పుస్తకాలలో చదువుకొన్నాము, మంత్రాలలో చెబుతున్నాము చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు అని. అంతే కాక ఈ వసంత ఋతువు ప్రతి సంవత్సరములో మొదటి ఋతువు కూడా. కాని కాళిదాసు ఋతుసంహారాన్ని గ్రీష్మఋతువుతో ప్రారంభించి వసంతఋతువుతో అంతం చేస్తాడు. ఉత్తర భారతదేశంలోని ప్రజలు వసంత పంచమి అనే పండుగ చేసికొంటారు. ఆ రోజు మనము నవరాత్రులలో సరస్వతీ పూజ చేసేటట్లు వాళ్లు సరస్వతీదేవి పుట్టిన రోజును ఆచరిస్తారు. ఈ వసంత పంచమి మాఘ శుక్ల పంచమి నాడు వస్తుంది. 2010లో అది జనవరి 20వ తారీకు వచ్చింది. అంటే ఈ లెక్క ప్రకారం సుమారు ఫిబ్రవరి మార్చి నెలలు వసంత ఋతువన్న మాట. ఇది బహుశా కాళిదాసు ఋతుసంహారముతో సరిపోతుంది.

మనం పాటించే చైత్రపు నెలని ఉత్తరదేశంలో వైశాఖము అంటారు. వారి ఉగాదికి బైశాఖి అనే పేరు. మనం ఇప్పుడు ఆచరించే వసంత ఋతువు మార్చి నుండి మే వరకు. దక్షిణ భారత దేశంలో ఉండే వాళ్ల కందరికీ తెలుసు, ఈ నెలలలో విపరీతమైన ఎండలని. పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కంటె ఎక్కువ కొన్ని చోట్లలో! ఇవన్నీ చూస్తే శక సంవత్సర పంచాంగము సరియైనదే. అందులో వసంత విషువము ఎప్పుడూ మార్చి 23నే వస్తుంది. అది నైసర్గిక పరిస్థితితో కూడా సరిపోతుంది. భారతదేశములో హిమాలయాలలో తప్ప మిగిలిన ప్రాంతాలలో వసంత ఋతువు జనవరి ఆఖరునుండి మార్చి 22 వరకు ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ప్రభుత్వము ప్రజలు ఈ జాతీయ పంచాంగాన్ని ముఖ్యంగా వ్యవసాయ విషయాలలో ఉపయోగిస్తే మంచిది. పండుగలను సూర్య చంద్రుల గమనాన్ని బట్టి నియమించుకోవచ్చు.

వసంత ఋతువు ఎప్పుడు ఆరంభమవుతుందో అనే విషయం నిక్కచ్చిగా తెలియక పోయినా అది నిజంగా కుసుమాకరమే. కరుడు గట్టిన హిమరాశులు కరిగి జీవనదులుగా పారడానికి ప్రారంభించే సమయం ఇది. నిసర్గసుందరి తన మేనిని పూలతో సింగారించుకొని నిత్యసంతోషిణి అయిన సమయం ఇది. పుష్ప సౌరభాన్ని మోసి తెచ్చే గాలి గంధవాహు డవుతాడు. సౌరభముతో నిండిన ఋతువు కాబట్టి ఇది సురభిగా పిలువబడుతుంది. అంతే కాదు విరిదేనెలు జాలువారే నెలలు కాబట్టి ఈ ఋతువులోని నెలలు మధు మాధవము లయ్యాయి. అందుకే వసంత ఋతు ఆగమనాన్ని తెలిపే అష్టపది అధ్యాయాన్ని శ్రీజయదేవ కవి మాధవోత్సవ కమలాకరము అని పిలిచాడు. ఇందులోని మాధవ పదము మాధవునికి మాత్రమే కాదు, మాధవ మాసానికి కూడా వర్తిస్తుంది. భారతదేశంలో వసంత ఋతువులోని కొన్ని పుష్పాలను గురించి నాట్యశాస్త్ర కర్త అయిన భరతుడు స్రగ్ధరా వృత్తానికి లక్ష్యముగా ఇలా చెబుతాడు –

చూతాశోకారవిందైః కురువక తిలకైః కర్ణికారైః శిరీషైః
పున్నాగైః పారిజాతైర్ వకుల కువలయైః కింశుకైః సాతిముక్తైః
ఏతైర్ నానా ప్రకారైః కుసుమ సురభిభిర్ విప్రకీర్ణైస్చ తైస్ తైర్
వసంతైః పుష్పవృందైర్ నరవర వసుధా స్రగ్ధరేవాద్య భాతి

(నరవరా, ఎన్నో సుగంధమయమైన మామిడి, అశోకము, తామర, తోటకూర, తిలక, కర్ణికార (మచ్చగంద), దిరిసెన, పున్నాగ, పారిజాత, పొగడ, కలువ, మోదుగు, మాధవి మున్నగు వివిధ పుష్పాలతో నల్లిన మాలను ధరించికొన్నట్లుంది భూదేవి.)

ఇప్పుడు నేను వసంత ఋతువు ఎలా సాహిత్య సంగీత చిత్రలేఖనాలలో వర్ణించబడిందో అనే విషయంపైన కొద్దిగా ముచ్చటిస్తాను. ఉదహరించబడిన పద్యాలు నాకు నచ్చినవి మాత్రమే, అవి మిగిలిన వాళ్లకు కూడ నచ్చుతాయని ఆశిస్తాను.

వాల్మీకి రామాయణములో వసంత ఋతువు

ఆదికావ్యమైన రామాయణములో రాముడు అరణ్యవాసం చేసేటప్పుడు తాను పరికించిన నైసర్గిక స్వరూపాన్ని, ఋతువులలో కలిగే మార్పులను చక్కగా వర్ణిస్తాడు. చిన్న చిన్న పదాలతో అతి రమ్యముగా స్వాభావికముగా వాల్మీకి చేసిన ఈ వర్ణనలు ఎంతో బాగుంటాయి.. మానసిక భావాలు ఎలా ప్రకృతి ఆకృతితో ముడి వేసికొంటుందో అన్న విషయాన్ని కూడా ఇందులో గమనించవచ్చు. వసంత ఋతువును గూర్చిన వర్ణన కిష్కింధ కాండలో ఎక్కువగా ఉన్నాయి. సీతావియోగుడైన శ్రీరామచంద్రునికి సీత జ్ఞాపకానికి వస్తుంది దేనిని చూసినా. కింద కొన్ని ఉదాహరణలు –

సౌమిత్రే శోభతే పంపా
వైడూర్య విమలోదకా
ఫుల్ల పద్మోత్పలవతీ
శోభితా వివిధై ర్ద్రుమైః

– వాల్మీకి రామాయణము (4.1.3)

చూడు పంపాసరోవర సుందరతను
చూడు వైడూర్యములవంటి శుభ్ర జలము
చూడు కమలోత్పలమ్ముల సొబగు నిందు
చూడు లక్ష్మణా తరువుల సోయగాలు


అయం వసంత స్సౌమిత్రే
నానా విహగ నాదితః
సీతాయా విప్రహీణస్య
శోకసందీపనో మమః

– వాల్మీకి రామాయణము (4.1.22)

పలు విహంగముల నాదాల వనము మొఱసె
వచ్చె నవ వసంతఋతువు వనికి చూడు
సీత లేకుండ నేనుంటి చింతతోడ
హృదియు నేడాయె సౌమిత్రి వ్యధల మయము

అశోక స్తబకాంగారః
షట్పదస్వన నిస్వనః
మాం హి పల్లవతామ్రార్చః
వసంతాగ్నిః ప్రధక్ష్యతిః

– వాల్మీకి రామాయణము (4.1.29)

అరుణము లశోక పుష్పమ్ము లనల మాయె
నిప్పు చిటపటల్ భ్రమరాల నిస్వనములొ
చిగురుటాకుల యరుణిమ చితికి జ్వాల
లీ వసంతాగ్ని నను దహియించుచుండె

పశ్య లక్ష్మణ నృత్యంతం
మయూర ముపనృత్యతి
శిఖినీ మన్మథార్థైషా
భర్తారం గిరిసానుషు

– వాల్మీకి రామాయణము (4.1.38)

ఆడుచుండెను నృత్యమ్ము నచట నెమలి
యనుసరించెను నటనల నాడ నెమలి
కొండ లోయలో తిరుగాడుచుండె జూడు
ప్రేమతో జంటగ నెమళ్లు విడువకుండ

మయూరస్య వనే నూనం
రక్షసా న హృతా ప్రియా
తస్మా న్నృత్యతి రమ్యేషు
వనేషు సహ కాంతయాః

– వాల్మీకి రామాయణము (4.1.40)

అపహరించలేదె యా నెమలి సతిని
రక్కసుండు వచ్చి యొక్క త్రుటిని
చెలియతోడ నాట్య మలరుచు నాడెడు
నెమలి కేమి తెలుసు కమిలెడు హృది

ఋతుసంహారములో వసంత ఋతువు

కాళిదాసు ఋతుసంహారము అనే కావ్యాన్ని రాసినట్లు ప్రతీతి. సంహారము అనే పదాన్ని మనం చంపడం అనే అర్థంలో వాడినా, ఋతుసంహారము అంటే ఋతువుల సమూహము అని అర్థం. ఆరు ఋతువుల వర్ణనలను గ్రీష్మముతో ప్రారంభించి వసంతముతో అంతం చేస్తాడు. అందులో నుండి ఒక రెండు పద్యాలను ఇక్కడ మీకు పరిచయము చేస్తున్నాను –

సపత్రలేఖేషు విలాసినీనాం
వక్త్రేషు హేమాంబురుహోపమేషు
రత్నాంతరే మౌక్తికసంగరమ్యః
స్వేదాగమో విస్తరతా ముపైతి

– కాళిదాసు, ఋతుసంహారము (6.7)

పత్రముల నెన్నొ గస్తురిన్ వ్రాసినారు
స్వర్ణ పద్మాస్యములపైన వర యువతులు
చెమట చుక్కలు జారగ జెదరి యవియు
మణులతో ముత్యముల రీతి దనరుచుండె

ఆమ్రీ మంజుల మంజరీ వరశరః సత్కింశుకం యద్ధనుర్
జ్యా యస్యాలికులం కలంకరహితం ఛత్రం సితాంశుః సితమ్
మత్తేభో మలయానిలః పరభృతో యద్వందినో లోకజిత్
సోఽయం వో వితరీతరీతు వితను ర్భద్రం వసంతాన్వితః

– కాళిదాసు, ఋతుసంహారము (6.28)

అందమైన మామిడిపూలె యమ్ము లాయె
నరుణ కింశుక పుష్పము లతని విల్లు
వింటి నారియు భ్రమరాల బృంద మాయె
ధవళ ఛత్రము శుద్ధ సుధాంశు డాయె

మత్తగజ వాహన మ్మాయె మలయ పవన
మనుచరులు గానకోకిల లనగ వచ్చు
ప్రియ వసంతునితో విహరించుచున్న
యతను డొసగును శుభము లనంతముగను

బారామాస కవిత్వము

భారతదేశంలో దక్షిణ ప్రాంతాలలో తప్ప మిగిలిన ప్రదేశాలలో బారామాస కవిత్వము[1] అనే ఒక ప్రక్రియ ఉన్నది. ఇందులో షడృతు వర్ణనకు బదులు పన్నెండు నెలలను వర్ణిస్తారు. దీనిని జైన కవులు, గుజరాతీ, బెంగాలి, హిందీ కవులు ఎక్కువగా వాడారు. ఇందులోని ఇతివృత్తము విరహిణులు తమ ప్రియులు లేనప్పుడు ఎలా బాధ పడతారో అన్నదే. మీరాబాయి కూడా ఇలాటి ఒక పాటను రాసింది. అందులో చైత్రము గురించి “చైత చిత్త మే ఊపజీ దరసణ తుమ దీజై హో” (చైత్రములో నా ఆశయు మొలచెను దర్శన మీయగ రారా) అని పాడుతుంది. కింద చైత్ర మాసములో ఒక విరహిణి పడే బాధను వివరిస్తున్నాను. మూలములో లాగే అనువాదం కూడా చతుర్మాత్రాబద్ధమైనదే.

చైత బసంతా హోయీ ధమారీ
మోహి లేఖే సంసార ఉజారీ
పంచమ విరహ పంచసర మారే
రకత రోయి సగరో బన ఢారే
బూడి ఉఠే సబ తరివర పాతా
భీజి మంజీఠ టేసూ బన రాతా
మోరే గాంవ ఫరే అబ లాగే
అవహుం సంవరి ఘర ఆఉ సభాగే
సహస భావ ఫూలీ వనఫతీ
మధుకర ఫిరే సంవరి మాలతీ
మో కహ ఫూల భయే జస కాంటే
దిస్టి పరత తన లాగహి చాంటే
భర జోవన ఏహు నారంగ సాఖా
సౌవా విరహ అబ జాయీ న రాఖా
ధిరిన పరేవా ఆవ జస ఆయి పరహు పియ టూటి
నారి పరాఏ హాథ హై తుంహ బిన పావ న ఛూటి

చైత్ర వసంతపు గానము వినబడె
నాకు ప్రపంచము వృథగా నగపడె

పంచశరుం డిట బాణము వేసెను
వనిలో నెత్తురు వరదగ బారెను

తరువుల దలిరులు అరుణారుణ మయె
సుమముల రాశులు రక్తసిక్త మయె

మామిడి పూవులు పిందె లయ్యెరా
మరువక నింటికి త్వరగా ప్రియ రా

వనిలో నెన్నో రంగులు నిండెర
భ్రమరము లెన్నో మల్లెల జేరెర

నా కీ పూవులు ముళ్లుగ గ్రుచ్చెర
ఆమని దృశ్యము చీమగ కుట్టెర

యౌవన ఫలములు కొమ్మకు భారము
విరహపు చిలకయు వెళ్లదు దూరము

పులుగులు గూటికి చేరెను దరి రా
హృదయము పగలక మునుపే రారా

నీ సఖి నేడిట పర వశ మయెరా
పరవశ మీయగ నీకే యౌనుర

గాథాసప్తశతిలో వసంత ఋతువు

మన భారతీయ భాషలలో పాత కాలపు కావ్యాలు, కవితలు ఎక్కువగా పురాణాల పైన, దేవుళ్ల పైన ఆధారపడినవి. ఎక్కువగా చాటువులు, ముక్తకాలు లేవు. ఉన్నవాటిలో నాకు హాలుని గాథాసప్తశతి, తమిళములోని సంఘ కాలపు కవితా సంకలనాలు అంటే ఇష్టము. వీటిలో దైనందిన జీవితములోని జనుల ప్రణయాలు, బాధలు, యుద్ధాలు, ప్రకృతి వర్ణనలు ఇలాటివి ఉంటాయి. హాలుని గాథాసప్తశతినుండి[2, 3] ఒక రెండు ఉదాహరణలు –

కీర ముహ సచ్ఛేహిం
రేహఇ వసుహా పలాస-కుసుమేహిం
బుద్ధస్స చలణ వందణ
పడివిహిం వ భిక్ఖు సంఘేహిం 408

భూమిపైన శోభిల్లే
శుకముల ముక్కులాటి
కింశుక పుష్పాలు
బుద్దుడి కాళ్ళను తాకి
ప్రణమిల్లే బిక్షువుల సంఘమా

ఒక చిన్న కథ[4]. ఇప్పటి ఒరిస్సాలోని కోరాపుట్ ప్రాంతానికి చైతూ భట్రా అనే వాడు నాయకుడుగా ఉండేవాడు. తన కుమార్తెను ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఒక పిల్లవాడి కిచ్చి పెళ్లి చేస్తాడు. ఆమె మురియా అనే ఒక నల్లబ్బాయితో భర్తకు తెలియకుండా సంపర్కం పెట్టుకొంటుంది. గ్రామంలో కొందరు ఈ విషయాన్ని ఆమె భర్తతో చెబుతారు. భర్త వాళ్లను పట్టుకోవాలని ఒక ఎత్తు వేస్తాడు. భార్యతో నేను తన అక్క ఇంటికి వెళ్తున్నానని, కొన్ని రోజుల పిదప వస్తానని చెప్తాడు. భర్త ఊరి బయటకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాడు. మురియాతో మురిసిపోతున్న తన భార్యను చూచి ఇద్దరిని బాది చంపుతాడు. ప్రేమికుల శవాలను తీసికొని వెళ్లి అడివిలో పడేస్తాడు. వారి దేహాలనుండి ప్రవహించిన నెత్తురు ఒకటయి దానినుండి ఒక మోదుగు చెట్టు పుట్టిందట. ఎరుపు నలుపు రంగులు కలిసిన ఆ చెట్టు పూలే మోదుగు పూలు అని ఆ ఆటవికులు నమ్ముతారు.

లంకాలఆణ పుత్తఆ వసంత మాసేక్క లద్ధ పసరాణం
ఆపీఆ లోహిఆణం బిహేణ జణో పలాసాణం – 411

పసుపు వన్నెతో ఎరుపు రంగుతో విరులతో విరాజిల్లే ఆ గుబురుగా పెరిగిన మోదుగు చెట్లు లంకలోని రాక్షసులను జ్ఞాపకానికి తెస్తున్నాయి భయాన్ని పుట్టిస్తున్నాయి.

ఖేమం కత్తో ఖేమం జో సో ఖుజ్జంబఓ ఘరద్దారే
తస్స కిల మత్థ ఆఓ కో వి అణత్థో సముప్పణ్ణో – 599

మనసుకు శాంతి ఎలా లభిస్తుంది ఇంటిముందున్న మామిడి చెట్టే మాకు శాంతి నిస్తుంది కాని ఇప్పుడు దాని శాఖాంతాలలో కూడా ఏవో కొత్తగా పుడుతున్నాయి.

రుందారవింద మందిర మఅరందాణందిఆఆ రింఛోలి
ఝణఝణఇ కసణ మణి మేహల వ్వ మహుమాస లచ్ఛీవి – 674

దట్టంగా పెరిగిన అరవిందవనంలో మకరందపానం చేసే తుమ్మెదల బారు వసంతలక్ష్మి ధరించిన నీలమణులు పొదిగిన ఒడ్డాణం కదిలినప్పుడు కలిగించే ఝణంఝణ స్వనాల వలె ఉన్నాయి.

కురుందొగైలో వసంత ఋతువు

సంఘ కాలము నాటి కురుందొగై అనే తమిళ సంకలనములో ఎన్నో దైనందిన జీవితంపైన ఆధారపడిన ముక్తకాలు ఉన్నాయి. ఇటువంటి వాటిని రామానుజన్ ఆంగ్లములో Poems of Love and War అనే పుస్తకంలో అనువదించారు. ఈ కురుందొగై నుండి రెండు ఆమని పద్యాలను ఇక్కడ పరిచయము చేస్తున్నాను.

కరుంగాల్ వేంబిన్ ఒణ్ పూ యాణర్
ఎన్నై ఇన్ఱియుం కళివదు కొల్లో
ఆట్ట్రు అయల్ ఎళుంద వెణ్ కోట్టు అదవత్తు
ఎళు కుళిఱు మిదిత్త ఒరు పళం పోల
క్కుళైయ కొడియోర్ నావే
కాదలర్ అగల కల్లెన్ఱవ్వే

– కురుందొగై 24

ఈ ఆమనిలో ఆ వేపచెట్టు చుట్టు ఎన్ని రంగురంగు పూవులు విరిసినాయో. ఆ విరులను నా కురులలో తురిమిన అందాన్ని చూడడానికి నా ప్రియుడు లేడే. ఇంతలో నీలాటిరేవులో అమ్మలక్కల గుసగుసలు రాలిన అత్తి పళ్లను తొలిచి వేస్తున్న ఎండ్రకాయల్లా నా గుండెను నుసునుసి చేస్తున్నాయి.

కోడల్ ఎదిర్ ముగైప్పశు వీ ముల్లై
నాఱు ఇదళ్ క్కువళైయొడు ఇడైయిడుపు విరై ఇ
ఐదు తొడై మాండ కోదై పోల
నఱియ నల్లోళ్ మేని
ముఱియినుం వాయ్వదు ముయంగఱ్కుం ఇనిదే

– కురుందొగై 62

తెల్లమడలు, విరిసీ విరియని మల్లెమొగ్గల మధ్య నీలి కలువలతో ఎంతో నైపుణ్యముతో ఒక గొప్ప మాలాకారుడు అల్లిన దండలాటిది. నా ప్రియురాలి సువాసనలు చిమ్మే మేను అది అప్పుడే పొడసూపిన మావిడి చివుళ్లకంటె లలితమైనది. మరి కౌగిలించుకొనడానికి అంతకంటె కమనీయమైనది.

కన్నడములో మామిడిపైన పద్యాలు

వసంతకాలంలో మామిడి చెట్లు చిగురిస్తాయి. అందుకే మామిడి పూలు, మామిడి చివుళ్లు, మామిడి పిందెలు వసంతర్తు వర్ణనలో ఒక భాగమయింది. కన్నడములో మామిడిపై కింది రెండు పద్యాలు[5] నాకు ఎంతో ఇష్టము.

మావిన కొనె మావిన ననె
మావిన పూ మావినెళెయ మిడి మావినకాయ్
మావిన పణ్ణెందె జనం
భావిసె సర్వాంగ సౌందరం మావెల్లం

– ఇమ్మడి నాగవర్మ, కావ్యావలోకనం, 487.

మామిడి కొన, మామిడి నన,
మామిడి పూల్, మామిడాకు, మామిడి కాయల్,
మామిడి పండ్లంచు బల్కిరి
మామిడి సొబగుల నిధి యని మహిలో మనుజుల్

(రెండవ నాగవర్మ, కావ్యావలోకనము, 487)

గిళియ హసుగూసు మావిన
పెళెగొంబిన తళిర తొట్ట లొళ గళుతిరె కం-
డళినివహమళ్కరుం జో-
గుళమం పాడిదువు తూగిదుదు గంధవహం

– నేమిచంద్ర, లీలావతి (9, 101)

చిలుక పసికూన మామిడి
తలిరుల యూయెల పరుండి తానేడ్వగ నా
యళికుల మది గని మెల జో-
లల పాడెను, గాలి యూచె లలి లలితమ్మై

నన్నయ భారతములో వసంత ఋతు వర్ణన

తెలుగు కావ్యాలలో, ప్రబంధాలలో నన్నయ నన్నెచోడుల కాలంనుండి వసంత ఋతువుతో సహా అన్ని ఋతువుల వర్ణనలు ఉన్నాయి. కింద ఒక రెండు ఉదాహరణలను చూపుతాను. శ్రీమదాంధ్రభారతములో[6] దుష్యంతమహారాజు కణ్వాశ్రమము సమీపించే సమయములో శకుంతల అనే మానినిని చూడడానికి ముందు మానినీవృత్తములో వసంత ఋతువులో ఎలా చెట్టులు విరబూసినాయో, కోకిలలు చిలుకలు గానము చేస్తున్నాయో అనే తీరును నన్నయభట్టు కమనీయముగా వర్ణిస్తాడు. అశోకము, పొన్న, సురపొన్న, మొగలి, మామిడి, అరటి పూలు ఇందులో వర్ణితాలు. ఆ పద్యము –

ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల నిమ్మగు ఠావుల జొంపములం
బూచిన మంచి యశోకములన్ సురపొన్నలఁ బొన్నలఁ గేదఁగులం
గాచి బెడంగుగఁ బండిన యా సహకారములం గదళీతతులం
జూచుచు వీనుల కింపెసఁగన్ వినుచున్ శుకకోకిల సుస్వరముల్

– ఆదిపర్వము 4.20

శాపగ్రస్తుడైన పాండురాజు సుందరమయిన వసంత ఋతువులో మాద్రితో సంగమించి పరమపదిస్తాడు. రెండు లయగ్రాహి వృత్తాలలో వసంత ఋతువును తాను చెప్పే కథలో ఒక భాగముగా చిత్రిస్తాడు నన్నయ. ఆ పద్యాలు –

కమ్మని లతాంతములకుమ్మొనసి వచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ము లెసఁగెం జూ-
తమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధి ముకుళమ్ములను నానుచు ముదమ్మొనర వాచా-
లమ్ములగు కోకిలకులమ్ముల రవమ్ము మధురమ్మగుచు వించె ననిశమ్ము సుమనోభా-
రమ్ముల నశోక నికరమ్ములును జంపక చయమ్ములును గింశుక వనమ్ములును నొప్పెన్

అశోకము, సంపంగి, మోదుగు పూలతో విరాజిల్లే ఆ వనిలో దరి చేరిన తుమ్మెదల గీతానాదములు, మామిడి చివుళ్లను, సువాసనల నిచ్చే మొగ్గలను తింటూ ఆనందంగా పాడే కోకిలగానము విడువకుండ ఎడతెగక వినబడుచుండెను.

చందన తమాల తరులందు నగరుద్రుమము లందుఁ గదళీవనములందు లవలీ మా-
కంద తరుషండములయందు ననిమీల దరవింద సరసీవనములందు వనరాజీ-
కందళిత పుష్పమకరందరసముం దగులుచుం దనువు సౌరభము నొంది జన చిత్తా-
నందముగఁ బ్రోషితుల డెందములలందురఁగ మందమలయానిల మమందగతి వీచెన్

– ఆదిపర్వము 5-138,139

గంధపు చెట్లు, చీకటి మానులు, అగరు వృక్షాలు, అరటి తోటలు, లవంగము, మామిడి, వికసించిన తామర పూలు వీటి తేనె పుప్పొడులతో నిండిన గాలి ఆ సమయంలో మేనిని పులకరిస్తూ మెల్లగా తాకి వీచుచున్నది.

ఆముక్తమాల్యదలో వసంత ఋతువు

పంచకావ్యాలలో ఒకటైన ఆముక్తమాల్యద[7] కావ్యములో గోదాదేవి యుక్తవయస్సుకు వచ్చేసమయములో వసంత ఋతువును కొన్ని పద్యాలలో వర్ణిస్తాడు కవి. అందులో రెండు పద్యాలను కింద పరిచయము చేస్తున్నాను.

కినిసి వలఱేఁడు దండెత్తఁ గేతు వగుట
మీన మిలఁ దోచు టుచితంబ మేష మేమి
పని యనగ నేల? విరహాఖ్యఁ బాంథ యువతి
దాహమున కగ్గి రాఁగఁ దత్తడియు రాదె?

– శ్రీకృష్ణదేవరాయలు, ఆముక్తమాల్యద (5.98)

మన్మథుడు కోపముతో దండెత్తగా చేప కనిపించడం ఉచితమే, ఎందుకంటే చేప అతని ధ్వజము కాబట్టి. కాని మరి మేక రాకకు కారణ మేమిటో? విరహముతో బాధపడే యువతులు అగ్గివలె దహించి పోతుండగా, అగ్నిదేవుని వాహనమైన మేషము అక్కడ ఉండడము సమంజసమే కదా? సౌరమాన సంవత్సరములో మీన మేష మాసాలు వసంత ఋతువు అవుతుంది. అందువల్ల కవి ఈ ఋతువు రాకను గోప్యముగా చెబుతాడు.

సాంద్ర మకరంద వృష్టి రసాతలంబు
దొరఁగు పువ్వుల భువియుఁ బూధూళి నభము
నీ క్రమత్రయి మాధవుఁ డాక్రమించె
నురు విరోచన జనిత మహోష్మ మడఁగ

– శ్రీకృష్ణదేవరాయలు, ఆముక్తమాల్యద (5.136)

ఇది కూడా ఒక రసవత్తరమైన పద్యమే. పూదేనె కారి భూమి లోపలికి చేరుకొంటుంది. పువ్వులేమో భూమిపైన రాలుతాయి, ఇక పోతే పుప్పొడి గాలిలో నిండుకొంటుంది. సూర్యుని వేడి తాపము అణచడానికి వైశాఖ వేళలో ఇవి ఉపయోగ పడుతాయి. మాధవము అంటే వైశాఖము. కాని ఈ పద్యానికి పరోక్షముగా మరో అర్థం ఉంది. ఇది మాధవుని (విష్ణుమూర్తి) వామనావతారాన్ని సూచిస్తుంది. విరోచనునికి పుట్టినవాడు బలి చక్రవర్తి. వానిని అణచడానికి మూడు పాదాలతో పాతాళము (రసాతలము), భూమి, ఆకాశము ఆక్రమిస్తాడు మాధవుడు.

వసుచరిత్ర – వసంతము

వసంతాన్ని గురించి రాసేటప్పుడు వసుచరిత్రలోని కింది పద్యాన్ని మరువ రాదు.

అరిగా పంచమ మేవగించి నవలా లవ్వేళ హిందోళ వై-
ఖరిఁ బూనన్ బికజాత మాత్మరస భంగ వ్యాకులంబై, వనీ-
ధర నాలంబిత పల్లవ వ్రత విధుల్ దాల్పన్, తదీయ ధ్వనిన్
సరిగాఁ గైకొనియెన్ వసంతము మహా సంపూర్ణ భావోన్నతిన్

– భట్టుమూర్తి, వసుచరిత్ర (1.130)

పై పద్యానికి సంగీతపరంగా ఎందరో వ్యాఖ్యానించారు[8-10]. నాకు అట్టి పాండిత్యము లేకున్నా, ఇందులోని విశేషాలను కొన్ని మీ ముందుంచడం నా కర్తవ్యమని భావిస్తున్నాను. ఇక్కడ నవలా అంటే యువతి అని అర్థము. ఆ వేళ నవలాలు హిందోళం పాడుతున్నారు. హిందోళ రాగంలో స-మ-గ-ధ-ని అనే ఐదు స్వరాలు మాత్రమే ఉంటాయి, ఋషభము, (అరి అంటే రి లేనిది) పంచమ స్వరము ఉండదు ఈ రాగంలో. కోకిలలు పంచమ స్వరం పాడుతాయని ప్రతీతి. శత్రువులవలె యువతులు పంచమ స్వరాన్ని వర్జించి హిందోళం పాడడానికి ఆరంభించేటప్పుడు కోకిలలు వ్యాకులపడి చిగురుటాకులను భుజించి తపస్సు చేశాయట. అప్పుడు వాటి ధ్వనులను (పంచమ స్వరాన్ని) వసంతము సరిగా (రి స్వరముతో) సంపూర్ణ భావోన్నతితో గైకొన్నది. అంటే వసంత రాగములో అన్ని స్వరములు ఉంటాయి కనుక అది సంపూర్ణము. ఇందులో పల్లవము అనేది పత్ లవము అని విరిస్తే ప కొద్దిగానే ఉంది అని తీసికోవచ్చు. అంటే వసంత రాగములో ఆరోహణలో ప స్వరము ఉండదు, అవరోహణలో మాత్రమే ఉంటుంది, అందువల్ల పల్లవము అని కొందరు అంటారు. ఇక్కడ మరో విషయం గుర్తులో ఉంచుకోవాలి. ఇప్పటి కర్ణాటక సంగీతములోని వసంత రాగములో ప లేదు. అంటే అప్పటి వసంత రాగము హిందూస్తాని వసంతమును పోలినది. అంటే భూషణకవి సంధి కాలములో నివసించాడు. అప్పటికి బహుశా పూర్తిగా రెండు సంగీత పద్ధతులు రాలేదేమో? శిశిరములో హిందోళము పాడే స్త్రీలు వసంత ఋతువులో వసంత రాగాన్ని పాడారు అని కూడా అర్థము.

వసంత రాగము చాలా ప్రాచీనమైన రాగం[11]. పూర్వులు దీనిని రాగాంగము అని పిలిచేవారు. వారి సిద్ధాంతము ప్రకారం ఇది హిందోళ జన్యము. ఆరోహణ స్వరాలు – స-గ-మ-ధ-ని-స, అవరోహణ స్వరాలు – స-ని-ధ-ప-మ-గ-రి-స. వాది స్వరము స అయితే, సంవాది స్వరము మ. ఈ వసంత రాగాన్ని కర్ణాటక సంగీతములో కొందరు హిందోళవసంతము అంటారు. కాని హిందోళ వసంతానికి ఆరోహణ అవరోహణలు ఇలాగుంటాయి – స-గ-మ-ప-ధ-ని-ధ-స, స-ని-ధ-ప-మ-ద-మ-గ-స. ఇప్పుడు కర్ణాటక సంగీతములో వాడుకలో ఉండే వసంత రాగంలో పంచమము లేదు (స-మ-గ-మ-ధ-ని-స, స-ని-ధ-మ-గ-రి-స). ఇది సూర్యకాంత మేళకర్త జన్యము. హిందూస్తాని బసంత్ రాగము పూర్వీ థాట్‌కు చెందినది. పారసీక భాషలో వసంతాన్ని బహార్ అంటారు. ఈ పేరితో కూడా ఒక రాగము ఉంది. బసంత్, బహార్ రాగాలను కలిపి బసంత్‌బహార్ వస్తుంది. ముందు వెనుక వసంతమనే పేరుతో ఎన్నో రాగాలు ఉన్నాయి (వసంత భైరవి, వసంత వరాళి, వసంత ముఖారి, మల్లికా వసంతం, గోపికా వసంతం, కళ్యాణ వసంతం, హిందోళ వసంతం, వీర వసంతం, విజయ వసంతం, ఇత్యాదులు).

సంగీతములో వసంతము

ఈ వ్యాసం మొదట్లో ప్రస్తావించిన లలిత లవంగలతా పరిశీలన కోమల మలయ సమీరే అనే అష్టపది గీతగోవిందములో మూడవది. దీనిని కర్ణాటక శైలిలో కృష్ణమూర్తి-వేదవల్లి సంపూర్ణముగా ఒక పదము విడువకుండా పాడినారు. ఒరిస్సా శైలిలో రఘునాథ పాణిగ్రాహి పాడిన పాట ప్రసిద్ధి చెందింది. అరుణా సాయిరాం కూడా దీనిని చక్కగా పాడారు. కర్ణాటక సంగీతములోని వసంత రాగములో చాల ప్రసిద్ధి కెక్కిన త్యాగరాజు పాట సీతమ్మ మా యమ్మ శ్రీరాముడు మా తండ్రి (రాధా సుబ్బులక్ష్మి గార్లు కోకిల కంఠాలలో పాడిన ఈ పాట ఎంత బాగుంటుందో). రామచంద్రం భావయామి అనే దీక్షితుల కృతిని ఉణ్ణీ కృష్ణన్ పాడారు.

http://eemaata.com/Audio/may2010/basantబసంత్ రాగ్ – బిస్మిల్లా ఖాన్ షహనాయీ http://eemaata.com/Audio/may2010/bahArబహార్ రాగ్ – రవిశంకర్ సితార్

తచ్చూరి సింగారాచారి రాసిన, “నిన్ను కోరి యున్నారా /నన్నేలుకోరా /పన్నగశయనుడౌ శ్రీపార్థసారథి దేవా /సూనశరునిబారి కోర్వగ లేరా” అనే వర్ణాన్ని కూడా వసంత రాగములోనే పాడుతారు. సినిమా పాటలలో ఇళయరాజా దర్శకత్వంలో రాజాపార్వై అనే చిత్రంలో వసంత రాగంలో అమర్చబడిన ఒక అందమైన పాట ఉంది. ఇక హిందూస్తానీ బసంత్, బహార్ రాగాలలో శంకర్-జైకిషెన్ దర్శకత్వంలోని బసంత్-బహార్ చిత్రములోని అన్ని పాటలూ కర్ణానందమే.

ఛందో వసంతము

పురాణకాలమునుండి వసంత అనే పేరు అందరికీ ఆకర్షణీయంగానే తోచింది. శూద్రకుడు మృచ్ఛకటిక నాటకములో తన నాయికకు వసంతసేన అని పేరుంచాడు. ఈ నవీన యుగంలో గాయనీమణులైన వసంత కుమారి, వసంతకోకిలం పేరులు అందరికీ చిర పరిచితములే. వసంతుడు మగవాడే గదా, అందువల్ల మగవాళ్లు కూడా వసంత అనే పేరును ఉంచుకొంటారు.

నాకు వసంతమునకు సంబంధించిన ఛందస్సు అంటే ఇష్టము. ఈ సందర్భంగా ఒకప్పుడు సరదాగా పూల పేరులతో ఉండే వృత్తాలను సంకలన[12] పరిచాను. మీకు వ్యాసారంభములో వసంతములో కుసుమించే పూలను గురించిన స్రగ్ధరా వృత్తాన్ని తెలిపాను. ఇప్పుడు మరికొన్ని వృత్తాలను మీకు పరిచయము చేస్తాను. మొదట పురాతన కాలమునుండి వాడుకలో ఉండేది ప్రసిద్ధమైన వసంతతిలక వృత్తము. శ్రీవేంకటేశ్వర సుప్రభాతములో మొదటి అధ్యాయములోని పద్యాలు ఎక్కువగా వసంతతిలకములే. శార్దూలవిక్రీడితము తరువాత సంస్కృత కవులు కావ్యాలలో, నాటకాలలో దీనిని ఎక్కువగా వాడారు. కింద వసంతతిలకములో ((UUI UIII) (UII UI UU)) ముద్రాలంకారములో ఒక పద్యము –

ఈ మంద మారుతము హృద్యముగాను వీచెన్
కామీ వసంతతిలకమ్ముగఁ బూలు పూచెన్
నా మానసమ్ము నవ నాదతరంగ మాయెన్
ప్రేమీ వసంతమున వింతగ విశ్వ మాయెన్

మాలతీ అనే వృత్తము కూడా వసంత కాలానికి సరిపోతుంది. ఇది స్రగ్విణిలో అర్ధ పాదము (UIU UIU). కింద ఒక ఉదాహరణ-

మాలతీ మాల నా
కేలతో వేతురా
నీలదేహా హరీ
లీలలన్ జూపరా

భ్రమరమాల అనే మరో వృత్తము కూడా చైత్ర మాసానికి సరియైనదే. కింద ఒక భ్రమరమాల (UU III UU) –

విందై సురభి మాస
మ్మందెందు విరి మాలల్
చిందేను మకరందం
బెందున్ భ్రమరమాలల్

మత్తకోకిల, ధ్రువకోకిల వృత్తాలు లయలో కోకిల గాన సమానమే. మధుకరి (IIIIII UUU) అనే వృత్తము కూడా వసంత ఋతు వర్ణనకు సరిపోతుంది. వనమయూరము (UIII UIII UIII UU) పంచమాత్రలతోడి ఒక అందమైన తాళ వృత్తము. కింద వాటికి ఉదాహరణలు –

వనమున బలు పూతీవల్
గని మధుకరి బృందమ్ముల్
జనె గొన మకరందమ్ముల్
మనమున గడు మోదమ్ముల్

ఈ వనములోన గడు యింపు నిడు దృశ్యం
బా వనమయూరములు నాడె గనువిందై
జీవనము ధన్యమగు చెన్నుగ ముదమ్మై
సావి యిది యిచ్చెను వసంత చిర శోభల్

నేను కల్పించిన రెండు వృత్తాలను మీకు ఇక్కడ పరిచయము చేస్తున్నాను. అవి – వసంత, రసాల వృత్తాలు. వీటిలో గమ్మత్తేమిటంటే ఇవి సార్థకనామ వృత్తాలు. వృత్తాల గణాలు వృత్తాల పేరులోనే ఉన్నాయి.

వసంత (IUIIUIIIUUI)

వసంతము వచ్చె వనిలో జూడు
యసీమము మోద మ్మగుగా నేడు
రసమ్ములు నిండె రమియించంగ
త్రిసంధ్యల రాగ ఋతు వెంచంగ

రసాల (UIUIIUIIUI)

ఈ వసంతము హృద్య సుమాళి
జీవగానము చిత్ర రవాళి
భావకోకిల పాడె రసాల
నీ వనమ్మున నెల్లెడ హేల

వసంత చిత్రాలు


పంచబాణ వాసంతి

వసంత ఋతు శోభ ఎందరో చిత్రకారులను కూడా ఉత్సాహవంతులుగా చేసి వారిచే అందమైన చిత్ర రచనకు ఆస్కారం కలిగించింది. అలాటివి కొన్ని – కాంగ్రా శైలి రాగమాలలో వసంత రాగము. ఇందులో కృష్ణుని, రాధను, సఖిని చూడగలము; వసంత రాగిణి; నేను ఇంతకు ముందు మీకు పరిచయము చేసిన బారామాస ప్రక్రియలో వైశాఖ మాసపు బసంత్ చిత్రం; హిందోళ వసంత రాగాలకు గల సంబంధాన్ని ఎత్తి చూపే బికనీరు శైలి చిత్రం; లలిత లవంగలతా పరిశీలన అష్టపది చిత్రం.

మన్మథునికి పుష్పబాణుడని పేరు. ఆతని పంచ బాణాలు కింది శ్లోకములో ఉన్నవి. అవి అశోకము, అరవిందము, మామిడి, మల్లి, నీలి కలువ.

అరవిందమశోకం చ చూతం చ నవమల్లికా
నీలోత్పలం చ పంచైతే పంచబాణస్య సాయకాః

ముగింపు

లలిత లవంగ లతా పరిశీలన అనే అష్టపదితో ఈ వ్యాసాన్ని ప్రారంభము చేశాను. వసంత ఋతువుపైన అదే శైలిలో నేను తెలుగులో వ్రాసిన ఒక అష్టపదితో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.

మనసున నిన్నే మఱి మఱి దలతును మాధవ నను గన రారా
వినగను పాటల ప్రేమల మాటల ప్రియముగ దరి హృచ్చోరా … (1)

ఆమని వచ్చేనందపు సిరిగా
శ్యామల వర్ణపు సమ్ముదముల నీ
భూమికి తెచ్చెను విరిగా – ధ్రువము

ప్రతి లత చిన చిన ప్రసూనములతో ప్రమోదముల బలు రాల్చె
అతులితముగ బృందావని సుందర హరిత వసనమును దాల్చె … (2)

బంగరు పక్షులు కొంగల బారులు నింగిని రంగుల ముంచె
భృంగపు బృందము శృంగారముగా సంగీతము వినిపించె … (3)

కొమ్మల కొమ్మల కుహూకుహూ యని కోకిల లెన్నో పాడె
రెమ్మల రెమ్మల రింగని చిలుకలు రెక్కల విప్పుచు నాడె … (4)

కుంకుమ వర్ణపు కుసుమము లెన్నో కోమలముగ వని విరిసె
పంకజలోచన జంకును జూపక జింకలు సొబగుల మురిసె … (5)

కరగిన హిమములు సరసర పారెడు సరితయె గగనపు నీడ
బిరబిర శశములు పరుగిడె పిచ్చిగ వెఱపుల దృక్కులతోడ … (6)

చల్లని గాలియు చందన గంధము జల్లుచు నలుదెస వీచె
తెల్లని మబ్బులు తేలికగా మెల తేలుచు నభమున దోచె … (7)

మోహన ఋతువున మోహన మురళిని ముద్దుగ నూదగ రార
దేహము వేచెను దాహము తీరును మోహము దీర్చగ రార … (8)


గ్రంథసూచి

 1. Charlotte Vaudeville, Barahmasa in Indian Literatures, Motilal Banarsidass, Delhi, 1986.
 2. శాలివాహన, గాథాసప్తశతీ, కావ్యమాల – 21, నిర్ణయసాగర ముద్రణాలయ, ముంబై, 1911.
 3. బడిగేర, పి బి, మహాకవి హాలన గాహాసత్తసఈ, అభినందన ప్రకాశన, మైసూరు, 1991.
 4. Maneka Gandhi and Yasmin Singh, Brahma’s Hair – On the Mythology of Indian Plants, Rupa and Co., Delhi, 2007. (p 14 on pdf)
 5. సూక్తిసుధార్ణవం, సంకలనకర్త మల్లికార్జునకవి, సం. ఎన్. అనంతరంగాచార్, గవర్నమెంట్ బ్రాంచి ప్రెస్, మైసూరు, 1947.
 6. నన్నయభట్టు, ఆంధ్రమహాభారతము, ఆది-సభా పర్వములు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు, 1968.
 7. శ్రీకృష్ణదేవరాయలు, ఆముక్తమాల్యద, వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1915.
 8. వసుచరిత్రము, వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మదరాసు, 1926.
 9. భూషణ కిరణావళి, సంకలనం, శ్రీరామరాజభూషణ సాహిత్య పరిషత్తు, భీమవరము, 1969.
 10. వసుచరిత్ర – సంగీత సాహిత్యములు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాదు, 1974.
 11. Nijenhuis, E Te, Ragas of Somanatha, p 85.
 12. జెజ్జాల కృష్ణ మోహన రావు, పూవుల ప్రోవులు, యాహూ గ్రూపు ఛందస్సు లో, యాహూ గ్రూపు రచ్చబండ లో.
జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...