“పో” సాహిత్య సర్వస్వం

“ఇప్పటికీ ఆ సంకలనం కొనాలని ఉత్సుకత ఉంది. ఇవాళ ప్రదర్శన బీరువాలో చూపాను. పో సమగ్ర సాహిత్య సర్వస్వం 15 డాలర్లు ఖరీదు అని వ్రాసి ఉంది” అన్నాడు వాటర్బీ తన భార్యతో.

“ఏమిటీ?” అంది అతని భార్య ఆశ్చర్యంగా. కనీసం, అతనికి అలా వినిపించింది.

“అదే- ఆది కొనాలనుకుంటున్నాను.”

“ఆల్ఫ్రెడ్, నేను నీ స్థానంలో ఉంటే కొనను,” అంది ఆమె. “ఇప్పటికే ఇంట్లో బోలెడు పుస్తకాలు పేరుకుపోయాయి.”

“భార్యామణీ, ఆ విషయం నాకు తెలుసు. కానీ నా దగ్గర పో సమగ్ర సంకలనం మాత్రం లేదు. ఎన్నాళ్ళబట్టో అది కొనాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నే చెబుతున్న పుస్తకం చాలా బాగా తీసుకువచ్చారు.”

“అయినప్పటికీ, ఆల్ఫ్రెడ్, నే నైతే కొనను,” అందామె మరోసారి. కొనవద్దని బ్రతిమాలుతున్న ధోరణి గొంతులో ధ్వనిస్తూంటే, “ఆ పుస్తకాల క్రింద ఖర్చు చెయ్యడానికి అది చాలా పెద్ద మొత్తం.”

“నిజమే. కానీ…” అని ఆగిపోయాడు, అకస్మాత్తుగా ఆ విషయం అవగాహన అవడం వలన కలిగిన తత్తరపాటువల్ల మాటలకోసం తడుముకుంటూ.

వాటర్బీ భార్యా విధేయుడుగా ఉండటానికి ఎప్పుడూ ప్రయత్నించే మనిషి. తనకు ఏమి తిరిగి ఇచ్చారన్న ఆలోచన లేకుండా, ఇతరులకి ఇవ్వడంలోనే ఆనందాన్నీ, సంతృప్తినీ పొందే వ్యక్తి. జీతం వచ్చిన రోజు, ఇంటి ఖర్చులకోసం కొంత మొత్తాన్ని ఇచ్చేవాడు. ఆమె వ్యక్తిగత ఖర్చులకి కొంత సొమ్ము అదనంగా ఇచ్చేవాడు. తనకోసం కొంత సొమ్ము మినహాయించుకుని మిగిలినది బాంకులో జమచేసేవాడు.

ఆదర్శవంతుడైన భర్తగా ప్రవర్తించ గలుగుతున్నందుకు తనని తాను అభినందించుకుంటాడు కూడా.

వాటర్బీకి ఖరీదైన అలవాట్లు గాని, ఖరీదైన వస్తువులపట్ల వ్యామోహం గాని లేవు. అందరి వ్యక్తుల్లానే అతనికి ఒకటి రెండు చిన్న చిన్న అలవాట్లు ఉన్నాయి. అందులో ఒకటి “ఎడ్గార్ ఏలన్ పో” ని చదవడం. అమెరికను రచయితలందరిలో నిస్సంకోచంగా మేధావి అనతగ్గవాడు “పో”నే అని అతని బలమైన నమ్మకం.

ఈ ‘మేధావి’ అన్న పదం వాడడం ఎంత పలచబడిపోయిందంటే, చివరికి ఏ పనీ పాటలేక పొడుగాటి జుత్తు విరగబోసుకుని తిరిగే మగాడికీ, లేదా ఏదో చిన్నపాటి పత్రికలకి కవితలు రాసుకునే లావుపాటి స్త్రీకి కూడా వాడటం మామూలు అయిపోయింది. కానీ, వాటర్బీ దృష్టిలో ‘పో’ అలాంటి వాడు కాదు. మేధావి అంటే అందరికీ ఉండే సగటు ఆలోచనలూ, వివేచనలూ ఉండేవాడు కాదు, “స్ఫూర్తినిచ్చేట్టు మాటాడగలిగేవాడూ, ఆలోచనావిహాయసాల్లోకి అకస్మాత్తుగా ప్రయాణించగలిగేవాడూ,” లాంటి సమర్ధతలేవో ఉన్నవాడు. ఏది ఏమైనా వాటర్బీకి ‘పో’ అంటే చాలా ఇష్టం. ఆ సాహిత్య సర్వస్వం కొనాలని అనుకున్నాడు. ఏడాదికి ఒక్కసారి ఏదైనా ఖరీదైన వస్తువు కొనుక్కోవడం పరిపాటి. ఈ ఏడు అది పో సాహిత్య సర్వస్వం.

దానిని బట్టి, ఎంతో మోజుపడిన వస్తువును కొనడానికి భార్య అభ్యంతరం చెప్పినపుడు, అతని మనసులో కలిగిన బాధ మనం అర్థంచేసుకోవచ్చు.

ఆ రోజు ఉద్యోగానికి వెళ్ళేడన్నమాటే గాని, అతని ఆలోచనలన్నీ అతని భార్య ప్రవర్తన గురించే:
ఆమెకి తాను తన ఇష్టం ఉన్న వస్తువులు కొనుక్కుందికి తను డబ్బు ఇవ్వటం లేదూ? ఎన్నడైనా ఇంత ఖరీదైన వస్తువు ఎందుకు కొన్నావని తను నిలదీశాడా? ఇంటి యజమానిగా అంత చిన్న మొత్తాన్ని తనకు ఆనందం కలిగించే విషయం మీద ఖర్చు పెడితే అందులో బాధ్యతారాహిత్యం ఉందా? తన ఆనందం ఆమెది కాదూ?

ఆ మాటకి వస్తే, చాలా మంది భర్తలు భార్యలకి చెప్పా పెట్టకుండా కావలసిన పుస్తకాలు కొనుక్కుంటారు. కానీ తను అలాంటి వాడు కాదు. కుటుంబ ఆర్ధిక విషయాలకు సంబంధించిన అన్ని విషయాలలోనూ భార్యను సంప్రదించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాడు… అని తనకి తాను నచ్చజెప్పుకున్నాడు. అలా నచ్చజెప్పుకోవడంలో, ఆమె అభిప్రాయాల మీదే ఆధారపడిన భర్తగా మసలుతున్నందుకు కొంచెం అసంతృప్తికూడా ఉంది.

తనకోసం ఆ పుస్తకాలు కొనుక్కోవద్దని ఖరాఖండీగా చెప్పిందా? నిజానికి, ఆమె తనని కొనవద్దని శాసించలేదు. అయితే మాత్రం? ఆ మాటల అంతరార్థం అదే. ఆమె ‘పో’ పుస్తకాలు కొనడానికి తన వ్యతిరేకతని తెలియజేసింది.
వాటర్బీకి తన భార్య తనకి ఇన్నాళ్ళకి అవగాహన అవుతోందేమో నన్న ఆశ్చర్యం వేసింది. ఆమె నిజంగా స్వార్ధపరురాలా? ఆమెకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నపుడు మాత్రమే ప్రసన్నంగా, మంచిదానిలా ప్రవర్తిస్తుందా? చాలామంది భర్తల్లా, తను కూడా తన జీతాన్ని క్లబ్బులకీ, సిగరెట్లకీ, వ్యక్తిగత ఆనందాలకీ ఖర్చుచేసి, మిగిలిన చిల్లర మాత్రమే ఆమెకి ఇస్తే ఇప్పటి కంటే భిన్నంగా ఆమె ప్రవర్తించదూ?

‘పో’ సర్వస్వాన్ని కొనడానికి భార్య నిరాకరణ అతని మనసు గాయపరచి, ఆందోళనకు గురిచేసినంతగా, పెళ్ళయిన దగ్గర నుండి ఇప్పటివరకు మరొక విషయం ఏదీ అంతగా కలవరపరచలేదు. దాని వెనుక భావం ఒక్కటే: డబ్బంతా ఆమెకే కావాలి. లేదా, దానిని బాంకులో జమచేసి, తన అనంతరం— ఆ ఆలోచన మరీ దారుణం.

వాటర్బీ దారుణమైన అనుమానాలకి, అతని భార్య ప్రవర్తన మరింత బలాన్ని సమకూర్చింది.

పై సంభాషణ జరిగిన రెండు, మూడు, రోజుల తర్వాత అతని భార్య వాటర్బీని అడిగింది, “ఆల్ఫ్రెడ్, పో పుస్తకాలు నువ్వు కొనలేదు. కదూ?”

“కొనలేదు.”

ఎంత ముభావంగా, నిర్లక్ష్యంగా అనగలడో అంత ముభావంగానూ, నిర్లక్ష్యంగానూ అన్నాడు.

“సరే. అయితే వెళ్ళి తెచ్చుకో. ఎప్పటినుండో కొనాలనుకుంటున్నావు కదా. అప్పుడప్పుడు ఇలాంటి విలాసాలు నేను ఆమోదిస్తాను,” అని అంటూదేమోనని ఎదురుచూశాడు.

అలా అని ఉంటే ఆమె స్వార్థపరురాలు కాదనీ, భర్త పట్ల ప్రేమ ఉన్న భార్య అనీ అతనికి ఋజువయి ఉండేది.
కాని ఆమె, “మంచిపని చేసావు. అవి కొనకు,” అని మాత్రమే అంది. దానితో, తన పట్ల ఏమాత్రం ప్రేమ లేని, తనని కేవలం కుటుంబ బరువు బాధ్యతలు మోసే గుర్రంలా చూసే వ్యక్తిని పెళ్ళిచేసుకున్నందుకు అతనికి ఎక్కడలేని దుఃఖం తన్నుకు వచ్చింది.

తన భార్య మనస్తత్వం గురించి వాస్తవం అవగాహన అవుతున్న కొద్దీ, పాత విషయాలన్నీ అతనికి గుర్తుకు వచ్చాయి. అవన్నీ జోడించుకుంటూ పోయి, తనకి తీవ్రమైన అన్యాయం జరిగిందన్న నిశ్చయానికి వచ్చాడు.

అప్పట్లో, ఆ విషయాలు అంత ప్రధానమైనవిగా కనిపించకపోయినా, ఇప్పుడు వాటిని పరిగణిస్తే, వాటర్బీని సంతోష పెట్టడంలో అతని భార్యకి ఏమాత్రం ఉత్సుకత లేదన్న విషయం బోధపడింది. అంతేకాదు, అతను భార్యని మరింత దగ్గరగా పరిశీలిస్తున్న కొద్దీ, ఆమె ఎంత అయోగ్యురాలో కొత్త కొత్త ఋజువులు కనిపించి, మరింత నమ్మకం కలిగిస్తున్నాయి. ఒకటి మాత్రం నిజం, వాటర్బీకి తన భార్య ప్రవర్తనని తలుచుకుంటూ, పాత విషయాలు తోడుకుని సందేహాలతో బాధపడుతూ, భవిష్యత్తు గురించి బాధపడుతుంటే, ఆమె మాత్రం ఎప్పటిలాగా ప్రశాంతంగా, నిదానంగా ప్రవర్తిస్తోంది.

ఇంతలో క్రిస్మస్ సెలవులు వచ్చాయి. వాటర్బీ ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆమె తనకి ఇష్టమైన చిన్న వస్తువుని కొనడానికి నిరాకరించింది గనుక, ఈసారి ఆమెకి క్రిస్మస్ కానుక కొనకూడదు అని.

‘స్వార్ధం ఇద్దరు వ్యక్తులు ఆడే ఆట,” అనుకున్నాడు.

అంతేకాదు. ఆమె ఒకవేళ పండగ ఖర్చులకి డబ్బులు కావాలని అడిగితే, “అయాం సారీ, డియర్. నా దగ్గర డబ్బులు లేవు. చూస్తున్నావు కదా. పో పుస్తకాలు కొనుక్కుందామని ఎప్పటినుంచో అనుకుంటున్నా, కొనుక్కోడానికి డబ్బులు లేవు,” అని చెప్పాలనుకున్నాడు.

ఎత్తిపొడుపును మించిన పదునైనదీ, హేతువును మించిన నోరెత్తనియనిదీ మరొకటి ఉంటుందా?

తను మాటాడవలసిన విషయాన్ని పదే పదే మనసులో మనం చేసుకుంటూ వాటర్బీ సిద్ధంగా ఉన్నాడు. తనకీ పౌరుషం ఉందనీ, ఆర్ధిక సంబంధమైన లావాదేవీల్లో స్వంతంగా నిర్ణయం తీసుకోగలడనీ తెలుసుకుని ఆమె బిత్తరపోయి చిన్నబోవడాన్ని మనసులో ఊహించుకున్నాడు.

దురదృష్టవశాత్తూ అతను ఊహించినట్టు ఆమె పండగ ఖర్చులకి డబ్బులు కావాలని అడగలేదు. కాబట్టి ఆమెను శిక్షించడానికి ఇతర మార్గాలు వెదుక్కోవలసి వచ్చింది: అదే ఆమెకు ఇవ్వ వలసిన క్రిస్మస్ కానుక నిరాకరించడం. తను చేసిన అవమానం పూర్తిగా అవగాహన అవడానికి తన పిల్లలిద్దరికీ క్రిస్మస్ కానుకలు ఇస్తాడు.

అది చాలా కఠినమైన చర్య అనడంలో సందేహం లేదు. దానివల్ల ఇతరుల మనోభావాలకు కూడా గౌరవం ఇవ్వడం ఆమె నేర్చుకుంటుంది అని భావించాడు.

ఒక విషయం ఒప్పుకోవాలి. వాటర్బీకి క్రిస్మస్ రోజు ఉదయం నిద్ర లేచినపుడు తను చేసిన ప్రతీకారానికి గర్వం లేదు. తన ఉద్దేశాలు మంచివనీ, నిష్కల్మషమైనవనీ, తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నానని అనుకున్నాడు గానీ, తను చేసిన పనికి ఎంతమాత్రం సంతృప్తిపడలేదు.

భోజనాల గదివైపు నడిచాడు. మేజామీద తన పళ్ళానికి ముందర పెద్ద కాగితపు పెట్టెలో ‘ఫో’ సాహితీ సర్వస్వము అని వ్రాసి ఉన్న పది పుస్తకాలు ఉన్నాయి. తను ఇన్నాళ్ళబట్టీ కోరుకుంటున్న పుస్తకాలు అవి.

“ఇవేమిటి?” రెప్పవాల్చకుండా ఆశ్చర్యంగా వాటిని చూస్తూ అడిగాడు. ఒక క్షణం పాటు అతని మనసు, అతను చేసిన సిగ్గుమాలిన పని గుర్తుకువచ్చి దిగ్భ్రాంతికి గురైంది.

బుగ్గలు ఎర్రగా కంది, స్కూలు పిల్లలా సిగ్గుపడుతూ, “ఈ పాటికి నీకు అర్థం అయే ఉండాలి, ఆల్ఫ్రెడ్,” అంది అతని భార్య.

“ఓ! ఇది నీ కానుకా!”

“బాబోయ్! హడలగొట్టేసేవు నన్ను! గుర్తుందా? మొదటిసారి నువ్వు ఈ పుస్తకాలు కొంటానన్నరోజు నిన్ను కొనవద్దన్నాను. ఆ రోజే నువ్వు పసిగట్టేవేమోనని అనుమానించాను. వాటిని అంతకు ముందు వారమే కొన్నాను.”

“అవును- అవును,” అన్నాడు కళ్లలో ఉబికిన ఉప్పు నీరు దిగమింగుకుంటూ. ఆ క్షణంలో అతన్ని రాటకి కొట్టి చావజంపుతున్న నిర్భాగ్యుడు గుర్తుకువచ్చాడు.

“నీ కోసం కొనే కానుకకి నిన్ను డబ్బులు అడగకూడదని నిర్ణయించుకున్నాను,” అందామె. “నీ కోసం, నీ పిల్లలకోసం, నా ఖర్చులు తగ్గించుకుని ఆదా చెయ్య వలసి వచ్చింది. ఆ మాటకొస్తే, క్రిందటి వారం అంతా మిమ్మల్ని అందరినీ అర్ధాకలితో ఉంచవలసి వచ్చింది. మీ రెవ్వరూ ఆ విషయాన్ని గుర్తించనే లేదు. నువ్వు మాత్రం గుర్తిస్తున్నావన్న భయం మాత్రం లో లోపల ఉండేది.”

“లేదు- నేను గుర్తించలేదు.” వాటర్బీ, అక్షరాలను విడి విడిగా, పొడి పొడిగా పలికాడు. మనసు మనసులో లేదు. అప్పటికే అతని తల బరువెక్కి, దిమ్మతిరిగిపోయింది.

తన స్వార్ధాన్ని సైతం త్యాగం చేసిన ఈ దేవతకా తను క్రిస్మస్ కానుక కొనకూడదని నిశ్చయించినది!!!

అది చాలా భయంకరమైన పరిస్థితి. దానినుండి బయటపడడానికి ఒక అబద్ధం ఆడేడు.

“నీ కిచ్చిన కానుక ఎలా ఉంది?” అని అడిగాడు.

“ఏదీ? నేను చూడనే లేదే?” అతని వంక ఆశ్చర్యంగా చూస్తూ అడిగిందామె.

“ఇంకా చూడలేదా? నిన్నటికే ఇవ్వమని చెప్పానే?”

ప్రక్క గదిలో పిల్లలు వాళ్ళకి ఇచ్చిన కానుకలతో నవ్వుకుంటూ, ఆడుకుంటున్నారు. వాళ్ళ కోసం అయినా తను అబద్ధం ఆడడం తన కర్తవ్యం అనుకున్నాడు.

“అయితే అదేమిటో నాకు చెప్పొద్దు. అది వచ్చేదాకా ఆగుదాం,” అందామె.

“దానిని తేవడానికి నేనే వెళ్తాను,” అన్నాడు.

నిజంగా వెళ్ళాడు. దాని కోసం ఒక నగల వర్తకుడిని క్రిస్మస్ రోజున కూడా బలవంతంగా షాపు తెరిపించ వలసి వచ్చింది. అతను ఎంపిక చేసిన ఉంగరం ఖరీదు అతని తాహతుకి మించినది అన్నది నిజం.

అయితేనేమి?

మగవాడు తన ఆత్మగౌరవాన్ని తిరిగి సంపాదించడానికి ఎంత ఖరీదైనా ఎక్కువ కాదు.
(1903)