[ఇలియాడ్ గ్రంథారంభం]
8. అకిల్లీస్ కోపోద్రేకాలు
గ్రీకుల నౌకావాహిని ట్రోయ్ మీద దండయాత్రకు బయలుదేరింది. మొదట్లో వాతావరణం సహకరించలేదు. చాలా ఇబ్బందులు పడ్డ తరువాత పడవలు ట్రోయ్ నగరపు దరిదాపులలో ఉన్న ఒక నిర్మానుష్యమైన తీరానికి చేరుకున్నాయి. చిందరవందరగా ఉన్న రాతిగట్లతో నిండిన ఆ తీరంలో, చిన్న తెరిపిలో, పడవలను ఆపి ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ ఇసుక దిబ్బల మీద, గొడ్డు చర్మాలతో డేరాలు వేసి విడిది చేసేరు.
ఇలా గ్రీకులు తమదైన ఒక నౌకాస్థావరం ఏర్పరచుకుని, విడిది చేసిన సేనావాహినిని సముద్రపుటొడ్డున చూసి ట్రోయ్ సైనికులు వారి పట్టణపు ద్వారాలన్నిటినీ మూసివేసి, బయటనుండి కనీసం చీమయినా చిలకయినా లోపలికి రాకుండా దిగ్బంధం చేసేసేరు. ఇటువంటి సందర్భంలో ఆ కోట గోడలను ఛేదించి, పట్టణాన్ని ఎలా ముట్టడించి, లోపలికి ఎలా ప్రవేశించాలో తోచక, గ్రీకులు మంచి అవకాశం కొరకు ఎదురు చూస్తూ, రకరకాల ప్రయత్నాలు చేస్తూ, కాలక్షేపం చేస్తున్నారు.
గ్రీకు సైనికులు, ట్రోయ్ సైనికులు చాలాసార్లు ఘర్షణలు పడ్డారు. కానీ గ్రీకులు ట్రోయ్ కోటగోడలను ఛేదించి లోపలికి జొరబడలేకపోయారు; హెలెన్ని విడిపించలేకపోయారు! మంచి అవకాశం కోసం ఎన్నాళ్ళని ఎదురుచూస్తారు? యుద్ధం మొదలై తొమ్మిదేళ్ళు దాటిపోయింది. తెచ్చుకున్న సరుకులు, సరంజామా ఒకటీ ఒకటీ ఖర్చు అయిపోతున్నాయి. స్వదేశంనుండి కొత్తవి తెచ్చుకుందామంటే మరింత కష్టం! అందుకని సైనికులు ఆ పరిసరాలలో ఉన్న గ్రామాలమీద పడి దోచుకు తినడం మొదలుపెట్టేరు.
ఇలా అడపాదడపా జరుగుతూన్న దాడులలో ఒకసారి, అకిల్లీస్ నాయకత్వంలో గ్రీకు సైన్యం ట్రోయ్ మిత్రరాజ్యం అయిన క్రిసిని ముట్టడించి లొంగదీసుకుంది. ఈ సందర్భంలో ఓడిపోయిన రాజ్యానికి చెందిన మేకలను, గొర్రెలను, బర్రెలను తినడానికి తెచ్చుకుంటూ, వాటితోపాటు క్రిసెస్ (Chryses) అనే పురోహితుని అందమైన కుమార్తెలు ఇద్దరిని – క్రిసేయిస్ (Chryseis), బ్రిసేయిస్ (Briseis) – బందీలుగా తెచ్చుకున్నారు. (జనకుడి కూతురు జానకి అయినట్లే క్రిసెస్ కూతురు క్రిసేయిస్ అవుతుంది). వీరిలో బ్రిసేయిస్ అందానికి ముగ్ధుడై, మనసుపడి, తనకి కావాలంటూ అకిల్లీస్ ఆమెను ఉంచుకుని, క్రిసేయిస్ని సర్వసేనాధిపతి అగమేమ్నాన్కి బహుమానంగా ఇచ్చేడు.
క్రిసేయిస్ తండ్రి క్రిసెస్ – సాక్షాత్తు ఒలింపిక్ దేవుడైన అపోలోకి సన్నిహితుడు, పురోహితుడు. ఆయన తన కుమార్తెల బంధవిమోచనకై అగమేమ్నాన్కి ఎంతో విలువైన నగలు, ఆభరణాలు పరిహారంగా చెల్లించి “దైవకృపవల్ల ట్రోయ్ మీద మీకు విజయం సిద్ధించాలని ఆశీర్వదిస్తున్నాను. ఈ నగలు, ఆభరణాలు స్వీకరించి నా కుమార్తెలని విడుదల చెయ్యండి!” అని ప్రాధేయపడ్డాడు. అక్కడ ఉన్న గ్రీకు వీరుల హృదయం ద్రవించి, పురోహితుణ్ణి సమర్థిస్తూ మాట్లాడేరు. కానీ అగమేమ్నాన్ లొంగలేదు. “నేను ఎటువంటి సందర్భంలోనూ క్రిసేయిస్ని వదులుకోను. ఈ విషయంలో పర్యాలోచన అనవసరం!” అని తెగేసి చెప్పేడు.
గుండెలు అవిసిపోయే దుఃఖంతో క్రిసెస్ మార్గం తోచక, తన ఇష్టదైవమైన అపోలోకి ప్రార్థన రూపంలో విన్నపం సమర్పించుకున్నాడు. తన ఆప్తుడికి ఎదురయిన కష్టాన్ని చూడగానే అపోలోకి కోపం వచ్చి, అగమేమ్నాన్ సేనల మీద ప్లేగు మహమ్మారి విరుచుకు పడాలని శపించేడు.
సముద్రతీరం అంతటా, పడవల చుట్టూ, ఎక్కడ చూస్తే అక్కడ దివినుండి భువివరకు నల్లటి, చిక్కటి పొగలు కమ్ముకున్నాయి! వాళ్ళతో తెచ్చుకున్న కుక్కలు, పందులు, మేకలు, గొర్రెలు ప్లేగు ప్రభావం వల్ల టపటపా రాలిపోతున్నాయి. ఎటు చూసినా మరణించిన సైనికుల దేహాలను కబళిస్తున్న చితి జ్వాలలు. స్కంధావారంలో ఎటు చూసినా దుర్వాసన వెదజల్లుతూన్న శవాలు. యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గమైనా దక్కుతుంది కానీ రోగంవల్ల వచ్చిన ఈ దిక్కుమాలిన చావేమిటని సైనికులు హాహాకారాలు చేస్తున్నారు.
తమ సేనలు ఎండలలో పిట్టల్లా రాలిపోతూ ఉంటే చూసి కంగారుపడి, అగమేమ్నాన్ దైవజ్ఞులని సంప్రదించగా, కాల్కస్ (Calchas; KAL-kas) లేచి, “ఇదంతా అపోలో శాపంవల్ల జరుగుతోంది. అపోలో పురోహితుడిని మన రాజు నిర్దాక్షిణ్యంగా కఠినమైన మాటలతో తరిమివేసేడు. ఆ ముసలివాడి అభీష్టానికి అనుకూలంగా క్రిసేయిస్ని వెనక్కి పంపితేగాని ఈ పీడ వదలదు,” అని చెప్పాడు.
అప్పుడు అగమేమ్నాన్ ఉక్రోషంతో, పొగలు కక్కుతూన్న కళ్ళతో లేచి, నిలబడి, “ఓరీ! జ్యోతిష్కుడా! శకునపక్షీ! నేను క్రిసేయిస్ని కావాలని కోరి ఉంచుకున్నాను. ఆమెని వదులుకుంటే కానీ మనకి ఈ పీడ విరగడ అవదంటే అనిష్టంగానే వదులుకుంటాను. కానీ ఒక షరతు మీద మాత్రమే! ఏమిటా షరతు అంటారా? నేను క్రిసేయిస్ని వదులుకుంటే, అందుకు బదులుగా అంతకంటే మంచి బహుమానంతో ఆ వెలితిని తొలగించాలి.”
కోపోద్రేకంతో అకిల్లీస్ లేచి నిలబడ్డాడు. “మనం కొల్లగొట్టి తెచ్చుకున్న ధనరాశులన్నిటిని అందరం పంచేసుకున్నాం కదా? ఇప్పుడు మళ్ళా దానిలో వాటా కావాలనడం ఏమి న్యాయం?”
“ఆగవోయ్! అకిల్లీస్! ఏమీ తెలియని అమాయకుడిలా మాట్లాడకు. నా వాటాలో నాకు దక్కిన బహుమానాన్ని నేను వదులుకోవలసి వచ్చినప్పుడు నీ వాటాలో నీకు దక్కిన బహుమానాన్నంతటిని నువ్వు మాత్రం ఎందుకు అనుభవించాలి? నేను సర్వసేనాధిపతిని. నా ఆధిపత్యంలో నువ్వు ఉన్నావు. కనుక నువ్వు తీసుకున్న బహుమానాన్ని నేను హస్తగతం చేసుకుంటాను. నాకు బ్రిసేయిస్ని అప్పగించి, నువ్వు — అనగా, అకిల్లీస్ — క్రిసేయిస్ని నా పడవలో తీసుకువెళ్లి ఆమె తండ్రికి అప్పగించి అపోలోని శాంతపరచు!”
అకిల్లీస్ తన చెవులను తానే నమ్మలేకపోయేడు. “ఎంత పేరాశ! ట్రోయ్ ప్రజలుకానీ, ట్రోయ్ రాజ్యాధికారులుకానీ నాకు ఎప్పుడూ ఏ అపకారం చెయ్యలేదు! నీ తోటీ, నీ తమ్ముడు మెనలెయస్తోటీ ఉన్న స్నేహబంధాన్ని పురస్కరించుకుని నేను ఈ ఊబిలోకి దిగేను. న్యాయాన్యాయాలను పట్టించుకునే ధోరణిలో నువ్వు ఉన్నట్లు కనిపించడం లేదు. నా చెమటోడ్చి నేను సంపాదించుకున్న బహుమతిని నువ్వు కొట్టేద్దామని చూస్తున్నావు. ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధాలు చేయవలసి వచ్చినప్పుడు మమ్మల్ని ముందుకు తోస్తావు. ఆస్తుల పంపకానికి వచ్చే వేళకు వరసలో ముందుంటావు. నేను నా పడవలను, నా సైన్యాన్ని తీసుకుని వెనక్కి వెళ్లిపోవడమే ఉభయులకూ శ్రేయస్కరం అనిపిస్తోంది!”
“పోతానంటే పోవోయ్! పోయేవాడిని ఎవరు ఆపగలరు? నువ్వు గొప్ప వీరుడివే కావచ్చు. అది నీకు దైవదత్తమైన వరం. అందులో నీ ప్రయోజకత్వం ఏమీ లేదు. నువ్వు నీ పడవలను, సైన్యాన్ని తీసుకెళ్ళు. నాకు అభ్యంతరం లేదు. కానీ నేను మాత్రం బ్రిసేయిస్ని తీసుకుంటాను. మరే ఇతర కారణం లేకపోయినా నీ మీద నా అధికారం చూపించడానికి తీసుకుంటాను.”
ఈ వంకాయల బేరం విని విని విసిగెత్తిపోయిన అకిల్లీస్ కోపోద్రిక్తుడై, కత్తి దూసి, అగమేమ్నాన్తో ద్వంద్వయుద్ధానికి తయారయ్యాడు. కట్టలు తెంచుకు పరిగెడుతున్న తన కోపోద్రేకానికి కళ్ళెం వెయ్యడమా లేక అగమేమ్నాన్ని తన కత్తికి ఎరగా వెయ్యడమా అని ఆలోచించి, “పిరికిపందా! ఒక్కసారైనా కత్తి దూసి యుద్ధం చేసేవా? మేము కొల్లగొట్టి తెచ్చిన ధనరాశులను పంచుకోడానికి మాత్రం సిద్ధంగా ఉంటావు. నా అవసరం నీకు రాకపోదు. చూస్తూ ఉండు. ట్రోయ్ రాకుమారుడు కత్తి చేతబట్టి, గ్రీకు సైన్యాన్ని చిందరవందర చేసి, చిత్రవధ చేస్తూ ఉంటే అప్పుడు నా కాళ్ళు పట్టుకుందుకి నువ్వే వస్తావు.”
ఒక పక్క ట్రోయ్ సేనలతో గ్రీకులు భీకర పోరాటంలో ఉండగా ఈ గిల్లికజ్జాలు ఏమిటని కాబోలు, ఒలింపిక్ దేవత హీరా ఈ యోధుల మధ్య సంధి కుదర్చమని అథీనాని పంపించింది. వయస్సులో పెద్దవాడైన రాజా నెస్టర్ (Nestor) సహాయంతో అథీనా చేసిన హితోపదేశం అకిల్లీస్ కోపాన్ని కొంతవరకు చల్లార్చింది. కానీ, తనకి జరిగిన పరాభవానికి ప్రతీకారంగా తాను ఇటుపైన యుద్ధం చెయ్యనని ప్రతిన పూని తన గుడారానికి చేరుకున్నాడు.
ఎట్టకేలకు అగమేమ్నాన్ క్రిసేయిస్ని ఆమె తండ్రి దగ్గరకు పంపడానికి ఒప్పుకోగా, ఒడిస్సియస్ స్వయంగా క్రిసేయిస్ని తన పడవలో తీసుకువెళ్ళి ఆమె తండ్రికి అప్పగించాడు. అతను సంతృప్తి చెందినవాడై, గ్రీకు సైనికులను శాపంనుండి విముక్తి చెయ్యమని అపోలోని కోరుకున్నాడు.
గ్రీస్కీ, ట్రోయ్కీ మధ్య తాత్కాలికంగా యుద్ధవిరమణ ఒప్పందం జరుగుతుంది. కానీ అకిల్లీస్కీ అగమేమ్నాన్కి మధ్య విరోధజ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయి.
అకిల్లీస్ బాల్యస్నేహితుడు పెట్రాక్లస్ (Patroclus), బ్రిసేయిస్ని తనతో తీసుకెళ్ళి అగమేమ్నాన్కి అప్పగించాడు. ఆమె అనిష్టంతోనే పెట్రాక్లస్ వెంట వెళుతూ ఉంటే చూడలేక అకిల్లీస్ ముఖం పక్కకు తిప్పుకున్నాడు.
ఎంతసేపయినా అకిల్లీస్ కోపం చల్లారలేదు. దెబ్బ తిన్న అహాన్ని శాంతపరచడానికి సముద్రపుటొడ్డుకు వెళ్ళేడు. అక్కడ కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తూ కూర్చున్నాడు. తన కోపం చల్లారక ముందే తన తల్లి తేటిస్ని పిలచి తనకి జరిగిన పరాభవానికి ప్రతీకారం చెయ్యడానికి దేవతల రాజైన జూస్నుండి సహాయం అర్థించమని అడిగేడు. జూస్ని కలుసుకోడానికి తేటిస్కి పన్నెండు రోజులు పట్టింది. జూస్ ట్రోయ్ పక్షం కాస్తే భార్య హీరాకు కోపం రావడం ఖాయం; ఆమె గ్రీకుల పక్షం! కానీ తేటిస్ కోరికను కాదనలేకపోయాడు, జూస్. చాటుగా ఈ వ్యవహారం అంతా విన్న హీరాకు కోపం రానే వచ్చింది. పేరిస్ తనను కాదని, ఏఫ్రొడైటీ అందమైనదని తీర్మానించిన సంఘటన ఆమె ఇంకా మరచిపోలేదు! “దెబ్బ తిన్న అకిల్లీస్ అభిమానంపై కారం చల్లుతూ ట్రోయ్ సైన్యం గ్రీకులను ఊచకోత కోస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోవడం?” అని భర్తను నిలదీసింది.
అడకత్తెరలో పోకచెక్కలా తయారయింది జూస్ పరిస్థితి.
“నేను చూస్తానుగా! మీరిద్దరూ ఇహ నిశ్చింతగా ఉండండి!” అని వారిద్దరినీ పంపేసేడు జూస్.
మానవుల మధ్య జరుగుతూన్న ఈ పోరాటంలో దేవతలు తల దూర్చడం శ్రేయస్కరం కాదని ఆమె కొడుకు హెఫయెస్టస్ (Hephaestus) హీరాకు హితోపదేశం చేసాడు.
అథీనాకు, హీరాకు కోపం రాకుండా అకిల్లీస్ పక్షం ఎలా కాయడమా అని జూస్ దీర్ఘాలోచనలో పడ్డాడు. అతని మనసులో ఒక కపటమైన ఆలోచన మెరిసింది. ఆ ఆలోచనను నిద్రపోతూన్న అగమేమ్నాన్ కలలోకి పంపేడు.
ఈలోగా ట్రోయ్ పక్షం వారు యుద్ధవిరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. అప్పుడు జూస్, ట్రోయ్ పక్షం వహించి వారికి సహాయం చెయ్యడానికి వచ్చాడు. జూస్ ట్రోయ్ పక్షం కాయడం, అకిల్లీస్ అస్త్రసన్యాసం చేసి ఇహ పోరాడనని భీష్మించుకుని కూర్చోవడంవల్ల గ్రీకు సేనలు బాగా నష్టపోయారు. చాలా రోజులు జరిగిన ఆ భీకర పోరాటంలో పేరిస్-మెనలెయస్ల మధ్య, హెక్టర్-ఏజాక్స్ల మధ్య జరిగిన ద్వంద్వయుద్ధాలు చిరస్మరణీయమైనవి. అయినా సరే ట్రోయ్ సైన్యాలు గ్రీకు సేనావాహినిని తరిమి కొట్టాయి.
