విరామస్థానాల వాడుక

భాష ప్రవాహంలాంటిది; నిరంతరం మార్పుకి లోనవుతూనే ఉంటుంది. వ్యాకరణంలో పెద్దగా మార్పులు కనబడకపోయినా, రాసే పద్ధతులలోనూ, వాడే మాటలలోనూ, విరామస్థానాల ఉపయోగంలోనూ గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇటీవల ‘వర్డ్ ప్రోసెసింగ్, టెక్స్టింగ్’ వంటి సదుపాయాలు వచ్చిన తరువాత, పాతుకుపోయిన మన పాతకాలపు అలవాట్లు జోరుగా ప్రభావితం అవుతున్నాయి. విరామస్థానాల వాడుకలోని పోకడలు తెలుగులోకి ఎలా దిగుమతి అవుతున్నాయో పరిశీలించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం. ఇక్కడ ఏది ప్రామాణికం అన్నది కాదు ప్రశ్న; ఏది వాడుకలో స్థిరపడుతున్నదన్నదే ముఖ్యం. Merriam-Webster నిఘంటువుని 2013లో తాజాపరచి, ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా సవరించినప్పుడు ఆ సంస్థ సంపాదకవర్గం ఇచ్చిన కారణం: అనేకులు ఒక కొత్త మాటని విస్తృతంగా వాడినా, లేక ఒక పాత మాటని క్రొంగ్రొత్త అర్థంతో వాడినా ఆ మార్పులు నిఘంటువులో చోటు చేసుకుంటాయి.

గత 50 ఏళ్లల్లో, ఇంగ్లీషులో, విరామస్థానాల వాడుకలో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అడ్డుగీటు (hyphen, – ) వాడకం చాలామట్టుకు హరించిపోయింది. టెక్స్టింగ్ చేసేటప్పుడు ఆశ్చర్యార్థకం (exclamation, ! ) వాడుక గౌరవసూచకం అయిపోయింది. పూర్ణవిరామం (full stop/period, . ) వాడుక తలతిక్కకీ, నిర్లక్ష్యపు పొగరుబోతుతనానికి (attitude) సూచిక అయిపోయింది.

పూర్వం తెలుగు రాసేటప్పుడు ‘గొలుసుకట్టు’ రాత వాడేవారు. అటువంటి రాతలో కామాలు, ఫుల్ స్టాప్‌లు, కొటేషన్ మార్కులు, ప్రశ్నార్ధకాలు, వగైరాలు ఏవీ ఉండేవి కావు. ఇవన్నీ మనం ఇంగ్లీషు సంప్రదాయంనుండి ఎరువు తెచ్చుకున్నవి. ఇప్పుడు తెలుగు రాతలలో ఈ విరామస్థానాలు ఒక వరసా, వావీ లేకుండా అస్తవ్యస్తంగా కనబడుతున్నాయి. “సరి అయిన పద్ధతి ఏది?” అని ఎవరిని అడగడమో తెలియడం లేదు. మనకి తెలుగులో ఒక లక్షణ గ్రంథం (style manual) లేదాయె.

పూర్వం ఎలాగుండేదో నాకు తెలియదు కానీ, టైపు యంత్రాలు, అచ్చు యంత్రాలు వాడుకలోకి వచ్చిన తరువాత ఈ విరామస్థానాల వాడుకలో పాటించవలసిన నియమాలు క్రమేణా క్రమబద్ధత చెంది ఇంగ్లీషు వాడుకలో స్థిరపడ్డాయి. ఇంగ్లీషు వ్యాకర్తలు కొన్ని నియమాలని సూత్రీకరించేరు. ప్రచురణ సంస్థలు మరికొన్ని నియమాలని మార్గదర్శకాలుగా పాటించడం మొదలుపెట్టేరు. రచయిత ఎలా రాసినా ప్రచురణ సంస్థలు వారివారి నిబంధనలకి అనుగుణంగా సవరింపులు చేసి ప్రచురించేవారు. కాలక్రమేణా వాడుకలో స్థిరపడ్డ ఈ సూత్రాలు, నియమాలు, నిబంధనలు లక్షణ గ్రంథాలలో చోటు చేసుకున్నాయి. కానీ ఈ నియమాలనీ నిష్ఠలనీ సర్వులూ ఏకగ్రీవంగా ఆమోదించి ప్రపంచవ్యాప్తంగా అమలుపరచలేదు. ఆచరణలో కొద్ది కొద్ది తేడాలు ఉంటూ వచ్చినా మౌలికంగా, స్థూలంగా అందరూ ఆమోదించిన నియమాలు కొన్ని ఉన్నాయి. ఇటీవలి కాలంలో కంప్యూటర్ ప్రభావంవల్ల వాడుకలోకి వచ్చిన ‘వర్డ్ ప్రోసెసింగ్, టెక్స్టింగ్’ వగైరా సౌకర్యాలవల్ల విరామస్థానాల వాడుకలో ప్రచురణ సంస్థల అజమాయిషీ, పర్యవేక్షణా తగ్గి ఎన్నో మార్పులు విశృంఖలంగా చోటు చేసుకుంటున్నాయి. ‘యథా ప్రజా తథా రాజా’ కనుక ఏదైతే అత్యధిక ప్రజల ఆదరాభిమానాలకు నోచుకుంటుందో అదే ప్రమాణం అవుతుంది.

ముందు – అచ్చు యంత్రాల సాంకేతికాలతో నిమిత్తంలేకుండా – కొన్ని విరామస్థానాల పేర్లని ఒకసారి నెమరు వేసుకుందాం.

పూర్ణవిరామం లేదా బిందువు (full stop/period/ . )
అల్పవిరామం లేదా కామా (comma/ , )
ద్విబిందువు లేదా కోలన్ (colon/ : )
అర్ధవిరామం లేదా సెమికోలన్ (semicolon/ ; )
ప్రశ్నార్థకం (question mark/ ? )
ఆశ్చర్యార్థకం (exclamation/ ! )
కుండలీకరణాలు (brackets/ ( , ) )
అడ్డుగీటు (hyphen/ – )
పొట్టిగీటు (en dash/ – )
పొడుగుగీటు (em dash/ –)
ఉద్ధారం (quotation mark / “ )
అధ్యాహారాలు (ellipses/ … )

కాలం మారుతోంది. కాలంతోపాటు సాంకేతిక రంగంలో పెనుమార్పులు వస్తున్నాయి. ఈ రోజులలో కంప్యూటరు వాడకుండా రాయడం, అచ్చుకొట్టడం, ప్రచురించడం అరుదైపోతోంది. ఈ సందర్భంలో విరామ చిహ్నాల వాడుకలో నిబంధనలు పాటించకపోవడంవల్ల కొత్త కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి.

పూర్వం ఇంగ్లీషు టైపు యంత్రాలు వాడే రోజులలో పూర్ణవిరామం తరువాత రెండు ఖాళీ స్థలాలు వదలమని చెప్పేవారు. ఆ రోజులలో monospaced fonts వాడేవారు. అనగా, అన్ని అక్షరాల ‘వెడల్పు’ సమానంగా ఉండేది. “ఒక వాక్యం అయిపోయింది, కొత్త వాక్యం మొదలవుతోంది” అని చెప్పడానికి వాక్యం అయిపోయిన తరువాత రెండు ఖాళీ స్థలాలు వదిలేవారు. కంప్యూటర్లు వచ్చిన తరువాత variable-width fonts వాడుకలోకి వచ్చేయి. ఇప్పుడు అన్ని అక్షరాలూ, అన్ని విరామస్థానాల గుర్తులు, మాటల మధ్య ఖాళీలు, ఒకే ‘వెడల్పు’ ఉండక్కరలేదు. కనుక ఒక వాక్యం పూర్తి అయిన తరువాత ఒక ఖాళీ వదిలితే సరిపోతుంది. ఈ రోజులలో అన్ని లక్షణ గ్రంథాలూ (style guides) వాక్యం పూర్తి అయిన తరువాత ఒక్క ఖాళీ చాలు అనే సిఫార్సు చేస్తున్నాయి. ఈ ధోరణి ఎంతలా ముదిరిపోయిందంటే 2020 లో విడుదల అయిన Microsoft Word, వాక్యం పూర్తి అయిన తరువాత ఒకటికంటే ఎక్కువ ఖాళీలు కనిపిస్తే అది వ్యాకరణ దోషంగా ఎత్తి చూపిస్తోంది.

పూర్ణవిరామం ఎప్పుడు వాడాలో సందిగ్ధం లేకుండా అందరికీ తెలుసు కనుక దాని గురించి చర్చ అనవసరం. కానీ ఇంగ్లీషులో స్వల్పవిరామం వాడకం మీద Oxford comma పేరిట కాసింత చర్చ ఉంది. మన తెలుగు అవసరాలకి ఆ చర్చ పెద్దగా ఉపయోగపడదు కనుక అది ఇక్కడ ప్రస్తావించను.

ఈ కంప్యూటర్ యుగంలో మనకి ఎదురవుతూన్న మరికొన్ని సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు కొన్నింటిని ఈ దిగువ చూపెడుతున్నాను.

“ ఎన్నో నభోగోళాల సమస్య “ అని రాయడం సరి కాదు. “ఎన్నో నభోగోళాల సమస్య” అని రాయాలి. అనగా, తెరచిన కొటేషన్ గుర్తు పడ్డ వెనువెంటనే అక్షరం పడాలి; కొటేషన్ గుర్తు తరువాత ఖాళీ వదలకూడదు. అలాగే మాటలోని చివరి అక్షరం పూర్తి అవగానే, వెనువెంటనే కొటేషన్ మూసిన గుర్తు పడాలి; మధ్యలో ఖాళీ వదలకూడదు.
“ఎన్నో నభోగోళాల సమస్య”. సరి కాదు. ఆ పూర్ణవిరామం కొటేషన్ లోపల ఉండాలి. “ఎన్నో నభోగోళాల సమస్య.” అని ఉండాలి.

ఈ నిబంధన ఫుల్ స్టాప్ యెడలే కాదు; కామా, ప్రశ్నార్థకం, కుండలీకరణం యెడల కూడ వర్తిస్తుంది. ఉదాహరణకి, ( 1901-1930 ) సరి కాదు, (1901-1930) సరి అయిన ప్రయోగం. అనగా, 1901 ముందు, 1930 తరువాత ఖాళీలు ఉండకూడదు. అలాగే, 1901 కీ, 1930 కీ మధ్య ఉన్న అడ్డుగీత (hyphen) కి ఇటూ, అటూ ఖాళీలు ఉండకూడదు.
వాక్యం పూర్తి అవగానే ఫుల్ స్టాప్ పెట్టండి, ఒక ఖాళీ వదలిన తరువాత కాదు.

నియమం ఏమిటంటే కామా కానీ, ప్రశ్నార్థకం కానీ, కుండలీకరణం కానీ మాట తరువాత వెనువెంటనే పెట్టండి; ఒక ఖాళీ వదలి కాదు. ఖాళీ వదలితే వరస చివరన వాక్యం విరిగినప్పుడు కామా, ఫుల్ స్టాపు, ?, వగైరాలు అనాథలుగా (orphans) తరువాత వరసలో కనిపించడానికి అవకాశం ఉంది. అప్పుడు చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది.

పేరాగ్రాఫుని మొదలుపెట్టినప్పుడల్లా, గంటు పెట్టదలుచుకుంటే (అనగా, indent చెయ్యదలుచుకుంటే), ఒకటి లేక రెండు స్థానాలని (one or two blank spaces) ఖాళీగా వదలండి. కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ, కొన్ని చోట్ల అస్సలు గంటు లేకుండా, అడ్డదిడ్డంగా పేరాగ్రాఫు మొదలవకూడదు.

ద్విబిందువు లేదా జాబితా విరామం (కోలన్).

కోలన్ ఒక జాబితాని చెప్పేముందు వాడతారు.

ఉదాహరణ 1. దుస్తులకి మూడు రకాల వస్త్రాలు వాడతారు: నూలు, పట్టు, నైలాన్.

ఉదాహరణ 2. కాశీ వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి: భువనేశ్వర్, కొల్కత్తా మీదుగా ఒక దారి, సికిందరాబాద్, నాగపూర్ మీదుగా మరొక దారి.

అర్ధవిరామం (లేదా సెమికోలన్).

ఉదాహరణ 1. “కాజాలు బాగున్నాయి; కరకరలాడుతూ, పాకం కారుతూ బాగున్నాయి.” ఇక్కడ సెమికోలన్ ముందున్న వాక్యం, తరువాత ఉన్న వాక్యం పరిపూర్ణమైన వాక్యాలే. సెమికోలన్ స్థానంలో బిందువు పెట్టినా అర్థం మారదు. సెమికోలన్ తరువాత వచ్చే వాక్యం కాజాలు ఎందుకు బాగున్నాయో వివరిస్తున్నది.

ఉదాహరణ 2. “తిమింగిలం జంతువులన్నిటిలోకి బహు పెద్దది. అది ఒక జలచరం” అని రెండు విడివిడి వాక్యాలు రాసేకంటే, రెండింటిని కలిపి, “తిమింగిలం జంతువులన్నిటిలోకి బహు పెద్దది; అది ఒక జలచరం” అని రాస్తే వాక్యం కాసింత బిగుతుగా ఉంటుంది. ఈ వాక్యాన్ని మరికొంచెం మరమ్మత్తు చేసి, “తిమింగిలం జంతువులన్నిటిలోకి బహు పెద్దది; ఆసక్తికరం ఏమిటంటే, అది ఒక జలచరం” అని రాస్తే వాక్యం మరికొంత బాగుంటుంది. తెలుగులో సెమికోలన్‌కి బదులు ఫుల్ స్టాప్ వాడినా నా దృష్టిలో తేడా కనబడలేదు.

కుండలీకరణాలు. రెండు కుండలీకరణాల మధ్యనున్న విషయం చదవకుండా దాటేసినా ప్రవాహం అర్థవంతంగా సాగిపోవాలి. ఉదాహరణ. జవహర్లాల్ నెహ్రూ (14 నవంబరు 1889 – 27 మే 1964) భారతదేశపు మొదటి ప్రధాని.

గీట్లు మూడు రకాలు: పొడుగు గీటు (em dash), పొట్టి గీటు (en dash), అడ్డు గీటు (hyphen). ఈ మూడూ మాటల మధ్యలో కానీ, వాక్యం మధ్యలో కానీ వస్తాయి. మాటల కింద గీసే గీటు (underline) విరామస్థానాన్ని చూపదు; దాని ఉపయోగం వేరు. పొట్టి గీటుని en dash అనడానికి కారణం దాని పొడుగు ఇంగ్లీషు అక్షరం n పట్టేటంత మేర ఉంటుంది కనుక. పొడుగు గీటుని em dash అనడానికి కారణం దాని పొడుగు ఇంగ్లీషు అక్షరం m పట్టేటంత మేర ఉంటుంది కనుక.

పొడుగు గీటు (—). ఎడమ, కుడి కుండలీకరణాలకి బదులు ఇటొక పొడుగు గీటు, అటొక పొడుగు గీటు వాడవచ్చు. లేదా రెండు కామాలకి బదులు ఇటొక పొడుగు గీటు, అటొక పొడుగు గీటు వాడతారు. వాక్యం యొక్క ప్రవాహాన్ని మధ్యలో ఆపి, వివరణ ఇవ్వాలనిపిస్తే రెండు కామాల స్థానంలో కానీ, రెండు కుండలీకరణాల స్థానంలో కానీ పొడుగు గీట్లు వాడితే ఆ వాక్యం వ్యావహారిక సంభాషణలా స్ఫురిస్తుంది. రెండు పొడుగు గీట్లలకి బదులు రెండు కామాలు వాడితే కాసింత గ్రాంథిక వాసన వస్తుంది. ఇదే సందర్భంలో కుండలీకరణాలు వాడినట్లయితే ఆ కుండలీకరణాల మధ్యనున్న సమాచారం చదవకపోయినా గ్రాహ్యానికి నష్టం రాదు.

పొట్టి గీటు (- ). కొన్ని సందర్భాలలో (ఉదాహరణ: 1947-2026) పొట్టి గీటు ఉపయోగపడుతుంది. సాధారణంగా మనం వాడే కీబోర్డులలో పొడుగు గీటు, పొట్టి గీటు, అడ్డు గీటు అని మూడు గీట్లు వచ్చేలా టైపు చేసే సౌలభ్యం ఉండదు; ఒక్కటే గీటు ఉన్న మీట ఉంటుంది. కనుక మనం టైపు చేసినప్పుడు అడ్డు గీటుకి ఒక గీత, పొట్టి గీటుకి రెండు గీతలు, పొడుగు గీటుకి మూడు గీతలు వాడవలసి ఉంటుంది. TeX, LaTex వంటి ఉపకరణాలు వచ్చిన తరువాత ఇటువంటి ఇబ్బందులనుండి గట్టెక్కడానికి వీలు పడింది. కృత్రిమ మేధ సహాయంతో ఒకే మీట వాడి, ఏ గీటు ఏ సందర్భంలో నప్పుతుందో నిశ్చయించే పనిని కంప్యూటర్‌కి అప్పగించవచ్చు.

అడ్డు గీటు (hyphen). ఇంగ్లీషులో దీని వాడుక దరిదాపు అంతరించిపోతూంది. (అమెరికా ప్రభుత్వం ఇండియాకి, పాకిస్థాన్‌కి మధ్య పెడుతూన్న అడ్డుగీటు ఒక్కటే ఏదుపంది కొయ్యలా మిగిలి ఉంది.) పూర్వం ఇంగ్లీషులో teen-ager, ice-cream, Asian-American వంటి ప్రయోగాలు ఇప్పుడు teenager, icecream, Asian American గా మారిపోయాయి. అందుకనే కాబోలు నేను e-mail, on-line computing అని ఎప్పుడు రాసినా నా కంప్యూటరు, స్వయంచాలకంగా, వాటిని email, online computing అని సరిచేస్తోంది. ఈ రకం ప్రయోగాలు తెలుగులో లేవు కనుక మనకి అడ్డుగీటు ఉపయోగం కనబడటం లేదు.

ఉద్ధారాలు (quotation marks): ఇవి రెండు రకాలు. ఒంటరి ఉద్ధారాలు (single quotes), జంట ఉద్ధారాలు (double quotes). వీటి వాడుకలో నిర్దిష్టమైన నియమాలు ఉన్నట్లు కనిపించదు. అమెరికాలో ఒకలా ఉంటే బ్రిటిష్ సంప్రదాయంలో మరొకలా ఉన్నాయి. అమెరికాలో సంభాషణలు సూచించడానికి జంట ఉద్ధారాలు రివాజుగా వాడతారు. ఒకరి సంభాషణలో మరొకరు ఉటంకించిన మాటలు ఉదహరించడానికి వాటిని ఒంటరి ఉద్ధారాల మధ్య ఉంచుతారు. ఒక మాట మీద కానీ, సమాసం మీద కానీ, ప్రత్యేకించి దృష్టి నిలపవలసి వచ్చినప్పుడు కూడా ఒంటరి ఉద్ధారాలు వాడవచ్చు. ఉదాహరణ: ఒక అణువులోని అంతర్భాగాలని ‘పరమాణువులు` అంటారు.

ఆశ్చర్యార్థకం (!). ఈ గుర్తు ఎంత తక్కువ వాడితే అంత బలంగా పని చేస్తుంది. ఆశ్చర్యం కలిగినా, ఉత్తేజం పొందినా, నమ్మశక్యం కాని నిజం చెప్పవలసి వచ్చినా, హెచ్చరిక చేయవలసి వచ్చినా ఈ గుర్తు వాడొచ్చు. ఉదాహరణ: “నాకు కోటి రూపాయల లాటరీ వచ్చింది!”, “పక్కకి తప్పుకో. నిచ్చెన పడిపోతూంది!” కథలలో సంభాషణలు రాసేటప్పుడు వచ్చే సంబోధనలతో ఆశ్చర్యార్థకం వాడొచ్చు. ఉదాహరణ: “రాధా! నువ్వు లేకపోతే నేను బ్రతకలేను.” అంతేకాని, చీటికీ, మాటికీ ఆశ్చర్యార్థకం వాడకూడదు. ఎప్పుడు వాడినా ఒకటికంటే ఎక్కువ ఆశ్చర్యార్థకాలు పక్కపక్కన వాడడం క్షమించరాని నేరం. అలాగే సాంప్రదాయిక, లాంఛనప్రాయమైన రాతలలోనూ, విద్యావిషయిక, పాండిత్య ప్రదర్శక వ్యాసాలలోనూ ఆశ్చర్యార్థకానికి చోటు లేదు.

అధ్యాహారాలు (ellipses/ … ) తెలుగువారి రాతలలో ఎక్కువ దుర్వినియోగం పొందినది మూడు చుక్కలు పెట్టడం. ఇంగ్లీషు సంప్రదాయంలో అధ్యాహారాలని మూడు సందర్భాలలో వాడతారు: (క) అనిశ్చితస్థితిని సూచించడానికి కానీ, తడబాటుని సూచించడానికి కానీ, (చ) మరొక మూలంనుండి ఉల్లేఖించినప్పుడు మూలంలోని అసంబంధమైన సమాచారాన్ని కత్తిరించినప్పుడు, (ట) ఒక పాత్ర ఆలోచన అసంపూర్ణంగా వేళ్ళాడుతోందని చెప్పవలసి వచ్చినప్పుడు. ఇక్కడ అసంపూర్ణంగా వేళ్ళాడేది రచయిత ఆలోచన కాదు, కథలోని పాత్ర ఆలోచన అని గమనించవలెను. ఈ మూడు సందర్భాలకీ నేను మరొక సందర్భాన్ని సిఫార్సు చేస్తున్నాను. (ఈ దిగువ అంశం చూడండి.)

కథలో ఒక పాత్ర మనస్సులో అనుకున్న మాటలని రాతలో ఎలా వ్యక్తపరచడం? నేను ఇక్కడ చెప్పేది నాటకాలలో వచ్చే స్వగతం (soliloquy) గురించి కానీ, ఏకపాత్ర భాషణ (monologue) గురించి కానీ కాదు. రాతలో సంభాషణలు జరుగుతూన్నప్పుడు పాత్రల మాటలని ఉద్ధారపు గుర్తుల (కొటేషన్లు) మధ్య ఉంచుతాం. అప్పుడప్పుడు ఆయా పాత్రలు బయటకి అనకుండా మనస్సులోనే అనుకుంటారు. ఇటువంటి అనుచ్ఛరితమైన ఆలోచనలని చదువరులతో పంచుకోవడం ఎలా? ఇంగ్లీషు సంప్రదాయంలో ఇటువంటి ఆలోచనలని ఏటవాలు అక్షరాలతో సూచించి ఒక తోక (tag) తగిలిస్తాం. ఉదాహరణ: I should have studied for this test, she thought. లేదా తోక లేకుండా I should have studied for this test అన్నా సరిపోతుంది. కానీ తెలుగులో ఏటవాలు అక్షరాలు స్ఫుటంగా కనబడవు. బొద్దు అక్షరాలు ఎబ్బెట్టుగా ఉంటాయి. ఇటువంటి సందర్భాలలో నాకు తోచిన సలహా ఒక ఉదాహరణ ద్వారా చూపెడతాను. ఉదాహరణ: ఆ జాతకాలని పరిశీలిస్తూ మౌనంగా మనస్సులోనే అంచనా వేసుకుంటున్నారు రామేశం.

“… జాతకులలో ఒకరు మెడ్రాసులో జన్మించేరు. మరొకరు పిఠాపురంలో జన్మించేరు. ఇద్దరూ దరిదాపు ఒకే తరుణ వయస్సులో ఉన్న అమ్మాయిలే. ఎవరీ అమ్మాయిలు? ఎవరని అడిగితే బాగుండదు. వీరిరువురి మధ్య సంబంధం ఏమిటి? సంబంధం లేకపోతే రెండింటిని ఒకేసారి పరిశీలనకి ఎందుకు పట్టుకొచ్చేరు?…” ఇక్కడ నేను చేసిన ప్రయోగం ఏమిటంటే మనస్సులో ఉన్న ఆలోచనలని అధ్యాహారాల మధ్య పెట్టి, (అనగా, ఇటూ, అటూ మూడు చుక్కలు పెట్టి) అప్పుడు దానంతటికీ ఇటూ అటూ ఉద్ధారపు గుర్తులు పెట్టేను. ‘మనస్సులో ఉన్న మాటలు’ అని చెప్పడానికి చుక్కలు పెట్టే ఆచారం కార్టూన్ బొమ్మలలో బుడగల రూపంలో కనిపిస్తుంది.

ఈ నియమాలన్నీ తెలుగులో అవసరమా? “వేమూరి చెప్పిందే వేదం” అని నేను ప్రబోధించడం లేదు. ఇంగ్లీషునుండి విరామస్థానాలని మనం ధారాళంగా ఎరువు తెచ్చుకుని వాడుకుంటున్నాం. మనవంటూ కొత్త నియమాలని పెట్టుకోలేదు; వారి నియమాలని అనాలోచితంగా వాడేసుకుంటున్నాం. అటువంటప్పుడు వారు ఏ నియమాలతో ఈ విరామస్థానాలని వాడుతున్నారో అర్థం చేసుకోవడం మన కనీసధర్మం అనే నమ్మకంతో ఈ వ్యాసం రాసేను. మీకీ ఈ నియమాలు నచ్చి పాటించాలని ఉంటే పాటించండి. లేదంటారూ? మీ ఇష్టానుసారం మీరు రాసుకొండి.

స్వస్తి


వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి:

వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.

 ...